నాకే ఎందుకు ఇల్లా జరిగింది

గత 15 రోజుల నుంచి శరీరం లో ఏదో అయినట్టు అనిపిస్తోంది. ఏదో తేడా, ఇతమిద్ధమని చెప్పలేక పోతున్నాను. అన్నీ అవయవాలు సక్రమం గా పని చేస్తున్నాయని పించినా, చికాకు గా ఉండడం, నిరాసక్తత, విసుగు, శరీరానికి ఏమౌతోందో అన్న బెంగ,భయం పట్టుకుంది. ఈ బెంగతోనే ఇంకో నెల పైన గడిచిపోయింది.  పోనీ ఒక మాటు డాక్టర్ దగ్గరకు వెళ్ళి రండి అని మా ఆవిడ సలహా ఇచ్చింది. ఇటువంటి చెప్పుకోలేని రోగానికి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచించాను. ఫిజిషియన్ దగ్గరికే వెళదామని నిర్ణయించుకున్నాను.

మా వీధిలోనే ఉన్న ఫిజియషన్ దగ్గరికెళ్లాను. నేను వెళ్ళేటప్పటికి అక్కడ ఒక పదిమంది దాకా పేషంట్లు కూర్చున్నారు. ఆలస్యము అవుతుందేమో మరొకడి దగ్గరికి వెళదామను కుంటుంటే రిసెప్షనిస్టు  వచ్చింది. సరే ఇక్కడే కూచుని వైట్ చేద్దాం అనుకొని కూర్చున్నాను. ఒక 10 నిముషాల తరువాత రిసెప్షనిస్టు కొంచెం ఫ్రీ అయింతరువాత, ఆమె దగ్గరికి వెళ్ళి నా రోగ హిస్టరీ , జాగ్రఫీ చెప్పి, ఆవిడ అడగక పోయినా నా చరిత్ర, గొప్పదనం, అడ్రెస్ అన్నీ వివరం గా  ఒక 15 నిముషాలలో చెప్పి, రెండు నవ్వులు నవ్వి అక్కడే నుంచున్నాను ఆవిడను చూస్తూ. ఏమనుకుందో కానీ ఆవిడ వెంటనే లోపలికి వెళ్ళి డాక్టర్ తో మాట్లాడి వచ్చి నన్ను లోపలికి వెళ్లమంది.  వెళ్ళాను. డాక్టర్ బాబు నా కేసి  చూసి,  చెప్పండి  మీ సమస్య ఏమిటి అన్నాడు. నేను విపులం గా చెప్పాను. ఆయన   ఆశ్చర్యపడ్డాడ నిపించింది. కొంచెం సేపు ఆలోచించాడు. 15 ఏళ్లగా ప్రాక్టీసు చేస్తున్నాను. ఇటువంటి  మెడికల్  సమస్య ఎప్పుడూ వినలేదండీ అన్నాడు.  సరే బల్ల మీద పడుకోండి పరీక్ష చేస్తానన్నాడు. 

నేను బల్లమీద పడుకున్నాను. ఆయన స్టెత్ తో నా ఛాతీ మీద నాల్గు వైపులా నొక్కాడు. శ్రద్ధగా విన్నాడు. ఊపిరి పీల్చమన్నాడు. గాలి వదలమన్నాడు. ఎక్కడినించి అని అడిగాను.  పీల్చిన చోటునుండే మరోచోటనుండి కాదు అని కోప్పడ్డాడు.  వదిలాను. బోర్లా పడుకోమన్నాడు. కున్నాను. మళ్ళీ అదే అన్నాడు . నేను అదే చేశాను.  నా చేయి పట్టుకొని నాడి  చూశాడు. ఈ మాటు కాళ్ళు వేళాడదీసి బల్లమీద కూర్చోమన్నాడు. కూర్చున్నాను. నా కళ్ళ రెప్పలు విడతీసి కళ్లలోకి కళ్ళు పెట్టి చూశాడు. ఈ పని మీ రిసెప్షనిస్టు  చేస్తే బాగుంటుంది అన్నాను. నాకేసి కోపంగా  చూశాడు. నోరు తెరవండి అన్నాడు. కొండ గుహ లాగా నోరు తెరిచాను. నా నోట్లోకి లైట్ వేశాడు.  డాక్టర్ గారండోయ్ ఇందాక నా కళ్ల లోకి లైట్ వేయలేదండీ.   బాటరీ లైట్ లేదేమో అనుకున్నాను,  అన్నాను. నోరు మూసుకోండి అన్నాడు.  వెంటనే మూసుకున్నాను. ఈ నోరు కాదు, ఇది తెరవండి  అన్నాడు. మళ్ళీ నోరు తెరిచాను. నాలిక బైట పెట్టండి అన్నాడు.  పెట్టాను. మరీ  అమ్మ వారిలా అంతా బైటికి పెట్టఖ్ఖర్లేదు అన్నాడు. కొంచెం లోపలికి లాగుకున్నాను.  నోరు మూసేయ్యండి అన్నాడు.  సార్ నాలుక లోపలికి లాగి మూయమంటారా అని అడిగాను.   కోపంగా చూశాడు ఆయన. నేను నోరు మూసుకున్నాను.  ఓ చిన్న సుత్తి తీసుకొని , నా మోకాలి మీద, మోచేతి మీద, అరికాళ్లమీద కొట్టాడు. సార్  ముక్కు పిండి వసూలు చేసింది 150 మీ రిసెప్షనిస్టు ఇలా దెబ్బలు తినడానికా అన్నాను. 300 ఇవ్వండి కొంచెం మెత్తగా కొడతాను అన్నాడు. నేను మళ్ళీ నోరు మూసుకున్నాను. 

ఇలా వచ్చి కుర్చీలో కూచోండి  అన్నాడు తన సీటు లో కూలబడుతూ. కూర్చున్నాను. ఏంటి డాక్టర్ గారూ ఏమైంది నాకు అన్నాను. ఆయన  బహు దీర్ఘంగా నిట్టూర్చి ఏమో తెలియటం లేదు. కొన్ని పరీక్షలు చేయించుకోండి. మందులు కూడా వ్రాసిస్తా,  వాడండి అన్నాడు. మందులు వ్రాసేశారు కదా ఇంకా టెస్ట్ లు ఎందుకండి అన్నాను. రిపోర్టులు వచ్చిన తరువాత అవసరమైతే మందులు మారుస్తాం. పక్క వీధిలోనే ఉంది డయోగ్నాస్టిక్ క్లినిక్, అక్కడే చేయించుకోండి. మనవాడే కొంచెం చవకగా చేస్తాడు అన్నాడు.  మీరు ముందు కళ్ల డాక్టర్ దగ్గరికి కూడా  వెళ్ళి చూపించుకోండి.  పైనే ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళితే 125 కే చూస్తారు అని చెప్పాడు.  సరే అని బయటకు వచ్చాను. రిసెప్షనిస్టు దగ్గరికి వెళ్ళి,   డాక్టర్ గారు BP చూడడం మరిచిపోయారు. మీరు చూసి పెట్టండి అన్నాను. ఆవిడ నర్సు ని పిలిచింది. అబ్బే ఈవిడ చూస్తే చాలా high వచ్చేస్తుంది. మీరు చూడకూడదా అన్నాను. నర్సు నన్ను లాక్కెళ్లి చూసేసింది. BP యే లెండి.

కళ్ళోడి దగ్గరకు వెళ్లమన్నారు కదా అని మెట్లు ఎక్కి పైకి వెళ్ళాను. అక్కడ  రిసెప్షనిస్టు కూర్చున్నాడు. ముక్తసరిగా మూడు ముక్కల్లో  చెప్పాల్సింది  చెప్పేశాను.  వెళ్ళి డాక్టరు గారిని చూడండి అన్నాడు. అక్కడ ఓ నలుగురు కూర్చుని ఉన్నారు. కళ్ళు నలుపుకుంటూ. నేను రిసెప్షనిస్టు కేసి ప్రశ్నార్ధకం గా చూశాను. వాళ్ళ కంట్లో మందు వేశాం. ఇంకో గంట టైమ్ ఉంది వాళ్ళకి అన్నాడు. నేను లోపలికి వెళ్ళాను. డాక్టరమ్మ కుర్చీలో కూచునుంది. రండి కూర్చోండి అంది. నేను కడుంగడు ముదావహుడనైతిని. ఏమిటి మీ ప్రాబ్లం అని అడిగింది. నేను ఒక చిన్న ఉపన్యాసం ఇచ్చాను ఆవిడ కేసి చూస్తూనే. కింద డాక్టర్ చేసిన టెస్ట్స్, చేయించుకోమన్న టెస్ట్స్, మందులు అన్నీ వివరంగా చెప్పాను ఆవిడ కేసి చూస్తూనే.  ఆయన మా వారే అంది ముసి ముసి గా నవ్వుతూ. అదృష్టవంతుడు అన్నాను. ఆవిడ మళ్ళీ నవ్వింది. నా కన్నులు మెరిసాయి. కళ్ళలో మందు వేయించుకోండి ఆ తరువాత చూస్తాను అంది. లేదండీ,  మీరు ఇక్కడ ఉంటారని తెలియక రెండు నెలలక్రితం,  కళ్ళు  సైట్ కి టెస్ట్ చేయించుకున్నానండి, Dr. భూషణరావు ఐ క్లినిక్, ఇక్కడ కంప్యూటర్ తో కళ్ళు పరీక్ష చేయబడును అని కూడా వ్రాసి ఉందండి అని చెప్పాను. వాడు మా అన్నయ్యే నండి అంటూ మళ్ళీ నవ్వింది. మళ్ళీ నేను చిత్తయ్యాను.

అయితే రండి కంప్యూటర్ ముందు కూర్చోండి అంది. నేను అక్కడ ఒక కుర్చీలో కూర్చున్నాను. ఆవిడ ఆ మిషను వెనక్కాల కూర్చుంది. ఈ రింగ్ లోకి చూడండి లైట్ కేసి అంది. నా దృష్టి అక్కడ నిలవటం లేదు. ఆవిడ మీదకే పోతోంది. అల్లా కాదు ఇక్కడ తదేక దృష్టి తో చూడండి. మీ కళ్ళలో ఏముందో నేను చూడాలి కదా అంది. నా కళ్ళల్లో ఏముంటుంది లెండి ఎదురుగా మీరే ఉన్నారు కదా అన్నాను.  నాకళ్లలో బాటరీ వేసి చూడండి అని సలహా కూడా ఇచ్చాను.  శంకరం అని పిలిచింది ఆవిడ. రిసెప్షనిస్టు వచ్చాడు. ఈయన తల కదలకుండా పట్టుకో అంది. వాడు ఉడుం పట్టు పట్టేశాడు.  ఆవిడ పని ఆవిడ చేసేసింది. నేను మళ్ళీ ఆవిడ టేబల్ దగ్గర ఆవిడ ఎదురుగా కూర్చున్నాను. డాక్టరమ్మ గారూ రిటైర్ అయి పని పాడు లేకుండా ఉన్నాను మీ క్లినిక్  లో ఏదైనా పని ఇప్పించండి అన్నాను. ఇక్కడ ఏమి ఖాళీలు  లేవు అంది.  జీతం ఇవ్వఖ్ఖర్లేదు నా కాలక్షేపం కోసమే అన్నాను. కుదరదు అనేసింది. 

నాతో మాట్లాడుతూనే మందులు,  వ్రాసేసింది. ఈ మందులు నోట్లోకి, ఈ డ్రాప్స్ కంట్లోకి అని కూడా చెప్పింది.  మా వారు వ్రాసిన టెస్ట్స్ చేయించుకొని మళ్ళీ రండి అంది.  అసలు మీ సమస్య కంటిది కాకపోవచ్చు.  మీ కళ్ళు  చూడకూడనివి కూడా  చూసేస్తున్నాయి .  ఈ NT వోడిని చూడండి అని సలహా ఇచ్చింది.  NT వోడా ఆయనేందుకండి  అన్నాను.  NT వోడు  కాదు  ENT డాక్టరు. పక్క వీధిలో నే ఉంటాడు. మన డయాగ్నోస్టిక్ క్లినిక్  కి రెండు బిల్డింగ్స్ అవతల.  మనవాడే  వెళ్ళి చూపించుకోండి. అంది.  మా రెండు స్లిప్స్ చూపిస్తే 100 కే చూస్తాడు అని కూడా చెప్పింది. అవసరమా ఆయన దగ్గరికి వెళ్ళడం అని అడిగాను. కంటికి దగ్గరగా ఉన్న అవయవాలు ఏమిటి చెప్పండి అని అడిగింది. నేను తడుము కోకుండా ముక్కు, నోరు, చెవి అన్నాను. చూసారా దగ్గరగా ఉన్నవాటి కేమైనా అయితే అప్పుడు కంటి కేమైనా కావచ్చు  కాబట్టి చూపించుకోండి. అవి సరిగ్గా ఉంటే అదృష్టవంతులే  అని కూడా అంది. అంటే లేవా అని అడిగాను. అల్లాగే అనిపిస్తోంది మరి అంది.  సరే అయిన ఖర్చు ఎలాగా అయింది  ఈ NT వోడి దగ్గరకు కూడా వెళదాం అని అనుకున్నాను.

డయాగ్నాస్టిక్  క్లినిక్ లో రక్తం ధారపోసి, మలమూత్రాదులు దానం చేసి  ఈ NT వోడి దగ్గరకు వెళ్ళాను.  నేను వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరూ లేరు. ఒక పెద్దావిడ కౌంటర్ వెనక్కాల   కూర్చుని బఠాణీలు నములుతోంది. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి సంగ్రహం గా నా కధ చెప్పాను. ఆవిడ సెల్ ఫోను లో మాట్లాడింది. అల్లుడూ వెంటనే వచ్చేయ్యి పేషంటు వచ్చారు అని చెప్పింది. కాసిని బఠాణీలు నా చేతిలో వేసి ఇవి నములుతూ ఉండండి డాక్టర్ గారు వచ్చేస్తారు అని చెప్పింది. ఐదు నిముషాలలో డాక్టరు గారు వచ్చారు తెల్ల కోటు బొత్తాలు పెట్టుకుంటూ.  రండి అంటూ నన్ను తన రూమ్ లోకి తీసుకెళ్ళాడు.  

ఆయన వెనకే ఆయన రూమ్ లోకి వెళ్ళి నా కధ అంతా ఆయనకి చెప్పాను. ఆయన  ఇద్దరు డాక్టర్ల రిపోర్ట్ లు చూశారు.  I see అన్నారు. చాలా కాంప్లెక్స్ ప్రాబ్లం గానే ఉంది అన్నారు.  అవునాండి అన్నాను. ఔను అన్నాడు ఆయన. నా దగ్గరకు వచ్చి నోరు తెరవండి అని చూశాడు. నా చెవి లోకి,  ముక్కు లోకి బాటరీ  లైట్ వేశాడు. నా గొంతు సవరించాడు తన చేతితో. మళ్ళీ ఐ సీ అన్నాడు. ఇప్పుడు కొన్ని టెస్ట్స్ చేస్తాను మీ ENT లు ఎలా పని చేస్తున్నాయో తెలుసు కోవడానికి. చెయ్యమంటారా అన్నాడు. అల్లాగే చెయ్యండి, 100 కట్టాను కదా అన్నాను. ఇంకొంచెం ఖర్చు అవుతుంది సుమారు 120-150 అన్నాడు. సరే కానివ్వండి. తప్పుతుందా అన్నాను. ఆయన నర్సు ని కేకేసి టెస్ట్ కి రెడీ చేయమన్నాడు. ఆవిడ గెంతుకుంటూ వెళ్లింది. ఈ టెస్ట్స్ మేము మన శాస్త్రాలు చదివి ఈ కాలానికి అనుగుణం గా డిజైన్ చేశాము అని చెప్పాడు. మేము ఆర్డర్ చేసిన ఎక్విప్మెంట్ ఇంకా రాలేదు. అవి వచ్చేదాకా ఈ టెస్ట్స్ ఉపయోగించి కనిపెడతాము అని కూడా వివరించారు.  ఇంతలో నర్సు వచ్చి రెడీ అని చెప్పింది. పదండి టెస్ట్ రూమ్ లోకి అన్నాడు.

టెస్ట్ రూమ్ లోకి వెళ్ళేముందు నర్సు నా కళ్ళకి గంతలు కట్టింది. ఇదేమిటి అన్నాను. ఈ టెస్ట్స్ కి ఇది అవసరం అన్నాడు. నన్ను నర్సు నడిపించుకొని తీసుకెళ్లింది. స్పర్శ భాగ్యం  బాగానే ఉంది అనుకున్నాను. టెస్ట్ రూమ్ లోకి వెళ్ళిన తరువాత  డాక్టరు గారు చెప్పారు. ఇప్పుడు కొన్ని శబ్దాలు వినిపిస్తాము అవి ఏమిటో చెప్పాలి అన్నాడు. అల్లాగే అన్నాను నేను. రెడీ,  ప్లే అన్నాడు. చప్పుడు వినిపించింది. తబలా అన్నాను. వెరీ గుడ్, నెక్స్ట్ అన్నాడు. మళ్ళీ శబ్దం వినిపించింది. వీణ అన్నాను. గూడ్ అన్నాడు. మళ్ళీ వినిపించింది. గిటార్ అన్నాను. ఇంకోటి వినిపించింది. నాదస్వరం అన్నాను. మీ చెవి బ్రహ్మాండంగా పని చేస్తోంది అన్నాడు.

ఇప్పుడు మీకు కొన్ని వాసనలు చూపిస్తాం. అవి ఏమిటో చెప్పాలి అన్నాడు. అల్లాగే అన్నాను. నాకూ హుషారు వచ్చేసింది. ఇప్పుడు ఒక ఆడ గొంతుక మధురంగా వినిపించింది. మీరు గిన్నె మూత తీసి గిన్నెలో ముక్కు పెట్టకుండా పైనుంచి ఆఘ్రాణించి వాసన చెప్పాలి అంది. మీరెవరండి అని అడిగాను. ఆవిడ డాక్టరు గారి భార్య అని నర్సు చెప్పింది. ఇందాకా వాయించింది ఆవిడే. పిల్లలకి మ్యూజిక్, వంటలు నేర్పుతుంది అని కూడా చెప్పింది.    నన్ను మళ్ళీ నడిపించుకొని గిన్నె దగ్గరికి తీసుకెళ్ళింది. నేను మూత తీసి వాసన చూశాను. పప్పు పులుసు వాసన వేస్తోంది అన్నాను.  వెరీ గుడ్ అని డాక్టర్ గారి భార్య అంది. చాలామంది సాంబార్ అంటారండి అని అంది. ఆయ్ మనది పగోజీ అండి. అయినా ఏ గాడిద అన్నాడండి అల్లాగ, వేయించి ఉడకపెట్టిన కందిపప్పు, ధనియాల పొడి వాసనా మేళవించిన ఈ వాసన తెలియని వాడు అని నేను ఆశ్చర్య పడ్డాను. ఆవిడ కిసుక్కున నవ్వింది. డాక్టరు గారు కోపంగా పని చూడండి అన్నాడు. రెండో గిన్నె తీసి చూశాను.  పచ్చిమిర్చి అల్లం దట్టించి కొత్తిమీర వాసనలు వెదజల్లుతున్న వంకాయ కూర అన్నాను. సెభాష్ అంది ఆవిడ. ముక్కు బాగానే పని చేస్తున్నట్టుంది అని గొణిగాడు డాక్టరు. ఉండండి అని ఆవిడ నాదగ్గరగా వచ్చి నా జడలో ఏమి పూలు పెట్టు కున్నానో చెప్పండి అంది.  ఇంకొంచెం దగ్గరగా రండి అని ఆవిడ జడ వాసన చూశాను. సన్నజాజులు, మొగలిరేకులు, దవనం వాసనలు వేస్తున్నాయి అని చెప్పాను. ఓహ్ యు ఆర్ గ్రేట్ అంది  ఆవిడ అబ్బురంగా.  మీ ముక్కు కత్తిలాగా పని చేస్తోంది అని ఆవిడ సర్టిఫికేట్ ఇచ్చారు.

ఇప్పుడు కొన్ని రుచులు చూపిస్తాము. నాలుగు చుక్కలు మీ నాలిక మీద వేస్తాం. ఏమి రుచో మీరు చెప్పాలి అంది ఆవిడ. నర్సమ్మ నా తల వెనక్కి వంచి పట్టుకోగా శ్రీమతి డాక్టర్ నా నోట్లో నాలుగు చుక్కలు వేశారు. తేనె పాకం అన్నాను. గూడ్ అంది  ఆవిడ. ఇంకో గ్లాసుడు పోయ్యండి అని అడిగాను. తరువాత అంది. నర్సమ్మ నన్ను వాష్ బేసిన్ దగ్గరికి తీసుకెళ్ళితే నేను నీళ్ళు పుక్కిలించి వేశాను. రెండో మాటు మళ్ళీ నాలుగు చుక్కలు. ఇది ఉప్పు వేసిన చింతపండు రసం అన్నాను. గుడ్ అంది  ఆవిడ. మూడో మాటు నిమ్మరసం లో ఉల్లికారం అన్నాను. సుమారు  20 మందికి ఈ టెస్ట్స్ చేశాం. ఎవరూ ఇంత కరెక్టు గా చెప్పలేదండీ అని ఆవిడ చాలా ఆనంద పడిపోయింది. 

నర్సు నా కళ్ల గంతలు విప్పింది. ఆవిడను చూశాను. మీకూ  కళ్ల డాక్టర్ కి పోలికలు ఉన్నాయండి అన్నాను.  మా పిన్ని గారమ్మాయే నండి అంది.   మీ ENT అంతా బాగానే ఉంది అన్నాడు డాక్టర్. T కి టెస్ట్ ఏమి చేయలేదు కదా డాక్టర్ గారూ అన్నాను.  నాలుకకి గొంతు కు దగ్గర సంబంధమే,  నాలిక బాగుంటే గొంతు బాగున్నట్టే అని తేల్చి చెప్పాడు డాక్టర్. నేను కొంచెం అనుమానం గా చూశాను.  ఆయన ఘట్టిగా నా గొంతు పట్టుకొని  నొక్కాడు. నేను కళ్ళు తేలేసి , నాలుక బైట పడేశాను. చూసారా గొంతు నొక్కితే కళ్ళు, నాలిక లలో రియాక్షన్ వచ్చింది కదా అన్నాడు.  నాకు ఒప్పుకోక తప్పలేదు.

 మరి అన్నీ బాగుంటే నా సమస్య ఏమిటి అన్నాను. మీరు  నారాయణ, గుండారావు లను చూడండి అన్నాడు డాక్టర్. వీళ్ళేవరండి  అన్నాను. నారాయణ నరాల డాక్టర్, గుండారావు గుండె డాక్టర్  వాళ్ళు పై వీధిలో ఉంటారు. మనవాళ్లే  వెళ్లిరండి. మేం అందరం కలిసి చర్చించి   రోగ నిర్ధారణ చేస్తాం  అని చెప్పాడు.  నాకేం చెయ్యాలో తోచలేదు. రేపు చూస్తాను లెండి అని వచ్చేశాను. ఇంకా ఎంతమంది చుట్టూ తిరగాలో అని విచారించాను.

సాయం కాలం మా బాల్య మిత్రుడు  శంకరం వచ్చాడు మా ఇంటికి,   ఏంటిరా డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నావుట అంటూ.  చూసిన డాక్టర్లు ఎవరు చెప్పలేకపోయారు.  ఇంకో ఇద్దరు ని చూడమని సలహా ఇచ్చారు. ఈ ఇద్దరితో ఆగుతుందా ఇంకా ఎంతమంది డాక్టర్ లను చూడాలో, అంతా అయోమయం గా ఉంది అని విచారించాను. అసలు నీ సమస్య ఏమిటి? అని అడిగాడు వాడు. నలుగురికి చెప్పుకోలేని సమస్య రా అని బాధపడ్డాను. చెప్పు ఫరవాలేదు నేనెవరికి చెప్పను అని హామీ ఇచ్చాడు. సమస్య ఏమిటంటే మా పక్కింటి  లావుపాటి ఆవిడ ఉంది కదా.ఎవరూ రంగమ్మ గారా?  లిఫ్ట్ లోకి అడ్డంగా కానీ వెళ్లలేని ఆవిడా అన్నాడు. అవును ఆవిడే,  గత రెండు నెలలు గా ఇలియానా లాగా కనపడుతోందిరా ఆవిడ  అని చెప్పాను.                                

శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు

నా కధ    శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు    అంతర్జాల పత్రిక  ఈ మాట  ఎల్లలు లేని ప్రపంచానికి ఎలెక్ట్రానిక్ తెలుగు పత్రిక,  సెప్టెంబర్ 2011, సంచిక    లో  ప్రచురించారు.  మీరందరూ  ఆ కధ


చదివి మీ అభిప్రాయాలు  చెప్పవలసిందిగా మనవి చేసుకుంటున్నాను . 

నా కధ వారి పత్రిక లో ప్రచురించినందుకు  ఈ మాట  యాజమాన్యానికి,  కధను  సవరించిన సంపాదకులకు ముఖ్యంగా శ్రీ మాధవ్ మాచవరం  గారికి  ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను.