లక్ష వత్తుల నోము


లక్ష వత్తుల నోము చేయాలని సంకల్పం చెప్పుకున్నాను. లక్షవత్తుల నోము అంటే వీడికి తెలుసునా అనుకునే వాళ్ళే ఎక్కువుగా ఉంటారనే అనుకుంటాను. అయినా సరే,  అనుకున్నాను కాబట్టి నేను అనుకున్న లక్షవత్తుల నోము ఆచరించి తీరుతాను అని బ్లాగ్ముఖంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.

ఇంతకీ ఇంత ఘోర ప్రతిజ్ఞ చేయాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది అని మీలో కొంతమందికి అనుమానం వచ్చేఉంటుంది. మీ అనుమాన నివృత్తి చేయడం నా ధర్మం. సంగతేమిటంటే,

కిందటి ఆదివారం మద్యాహ్నం భోజనానంతరం,  చేయడానికి ఏమి లేక వారఫలాల మీద దృష్టి పోనిచ్చాను. సాధారణంగా నేను వార ఫలాలు చూడను. కానీ ఆవేళ పొద్దున్న  మా ఇంటి నుంచి వెళ్ళిన కరంటు తిరిగి ఇంకా రాలేదు. కరంటు రాకడ ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరు గదా! అందువల్ల టివి కానీ నెట్ కానీ అందుబాటులో లేకపోవడంతో పొద్దున్నే చదివిన పేపరే మళ్ళీ  చదవాల్సి వచ్చింది. అప్పుడు చదవని వారఫలాలు ఇప్పుడు చదవాల్సి వచ్చింది. వారఫలాల్లో ప్రముఖులతో పరిచయం పెంచుకుంటారు అని వ్రాశారు.

నేను పరిచయం పెంచుకోవాల్సిన ప్రముఖులు ఎవరా అని ఆలోచించడం మొదలు పెట్టాను. అయినా ఇప్పుడు పరిచయం పెంచుకోవాల్సిన అగత్యం ఏమిటి?  అన్న ప్రశ్న ఉత్పన్నం అయింది. బహుశా నాతోటే ప్రముఖులు పరిచయం పెంచుకుంటారా? అన్న అనుమానం పొడ చూపింది. ఎలెక్షన్స్ అయిపోయాయి కాబట్టి రాజకీయ ప్రముఖులు నా మొఖం చూడ్డానికి రారు. నేను పని చేసిన శాస్త్ర రంగంలో నాకు తెలిసిన ప్రముఖులు  కొంతమంది ఇంకా చురుకుగా ఉన్నా,  చాలామంది పదవీ విరమణ చేసి విశ్రాంత జీవనం గడుపుతున్నారు. కొంతమంది పరలోకాలకు వెళ్ళిపోయారు  కూడానూ. చురుకుగా ఉన్న వాళ్లకీ,  మనకి శాస్త్ర సాంకేతిక విషయాల్లో  పది ఏళ్ల గాప్ వచ్చింది. కాబట్టి వారికి మన సలహాల  అవసరం ఉండదు. ఇదివరకు అప్పుడప్పుడు ఏ సెలక్షన్ కమిటీ లోనో  మెంబర్ గా పిలిచేవారు. గత ఐదారేళ్ళగా   ఎవరూ పిలవటం లేదు కూడాను.

ఇతర రంగాలలో మనకి ఓనమాలు తెలియవు కాబట్టి ప్రముఖులు ఎవరు?  హూ?  కౌన్? అని తీవ్రంగా ఆలోచించడం కొన సాగించాను. మిత్రులు  కొంతమందికి  టెలిఫోన్ చేసి వారికి తెలిసిన ప్రముఖులకి గానీ, అప్రముఖులకు గానీ నా గురించి ఏమైనా చెప్పారా అని అమాయకంగానే అడిగాను. వాళ్ళు ఫెళ్లుమని నవ్వారు. "నీలో ఏముందని నీ గురించి చెప్పాలి"  అని మళ్ళీ  ఘొల్లుమని నవ్వారు. విని  నేను బోరు బోరుమని ఏడ్చాను. మనస్సులో ఒత్తిడి పెరగడం మొదలు పెట్టింది. కానీ సమస్య తీరలేదు. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఆలోచన తెగలేదు. మర్నాడు ఆరు గంటలకి పక్క మీద నుంచి లేచేటప్పటికి మనస్సు ఒత్తిడికి గురవుతోందని గ్రహించాను,  కానీ ఆలోచనలు మళ్ళీ   ముసురుకున్నాయి.  ఒత్తిడి తగ్గించుకోవటానికి, రామా క్రిష్ణా అని ఘట్టిగానే అనుకోవడం మొదలు పెట్టాను. విని విని మా ఆవిడ ఎదురిళ్ళకీ,   పక్కిళ్ళకీ  వెళ్ళి రమా అని కానీ క్రిష్ణా అనికాని రమ్యకృష్ణ అని కానీ ఎవరైనా ఉన్నారా అని కనుక్కొని ఎవరు లేరని నిర్ధారణ చేసుకొని వచ్చింది. మా ఆవిడే నా శీలాన్ని శంకించిందని తెలిసి నా మనసు  ఇంకా ఒత్తిడికి గురి అయ్యింది.  

కాలం గడిచేకొద్దీ ఒత్తిడి హృదయానికి పాకింది. సుమారు సాయంకాలం నాల్గు గంటలకి ఒత్తిడి తీవ్రతరమై గుండె  నొప్పిగా మారింది.  ఒక రెండు మూడు గంటలు భరించి లాభం లేదని మా అమ్మాయికి ఫోన్ చేశాను.  పది నిముషాల్లో మా అమ్మాయి,  అల్లుడు వారి కారులో నన్ను హాస్పిటల్కి చేర్చారు. హాస్పిటల్లో వాళ్ళు “మీ రాక మాకెంతో సంతోషం సుమండి” అంటూ పాడుతూ నా కాలికీ,   చేతికీ,  గుండెకీ  ECG బిగించేసి,  వచ్చిన గ్రాఫ్ షీటు చూసి ఖంగారు పడిపోయి నన్ను  ICCU లోకి పట్టుకు పోయి బెడ్ మీద పడుకోబెట్టి ట్రీట్మెంట్ మొదలు పెట్టేశారు. రాత్రి సుమారు పదకొండు గంటలకి  ఓ నిద్రమాత్ర ఇచ్చి “జో అచ్చ్యుతానంద జోజో ముకుందా” అని పాడేరేమో నని అనుమానం. 

మర్నాడు ఉదయం అంతా ప్రశాంతంగానే ఉంది. “మనసున శాంతి  నిండి పోయెనే, కడుపులో ఆకలి పెరుగుచుండెనే, గుండెలో నొప్పి మాయమాయెనే,  ఇంక ఇంటికి వెళ్ళిపోదునే” అని పాడాను. డాక్టరుగారు కోప్పడ్డారు. “ఇక్కడి నుంచి నిన్ను పంపే హక్కు మాకు మాత్రమే ఉంది. ఇప్పుడు యాంజియో తీస్తాము” అని నన్ను తీసుకుపోయి అదేదో తీసేశారు. “మూడు చోట్ల బ్లాకులు ఉన్నాయి. అంతకు మించి మరేమి లేదు. రేపు మూడు స్టెంట్లు పెట్టేస్తాం” అని సరదా పడ్డారు. వాళ్ళు అంత ముచ్చట పడుతుంటే కాదనడం ఎందుకు అని ఒప్పేసుకున్నాను. మర్నాడు మూడు స్టెంట్లు పెట్టేశారు. ఇంకో రోజు ICCUలోనే ఉంచి మర్నాడు రూంకి షిఫ్ట్ చేశారు. మర్నాడు “అంతా బాగానే ఉంది,  నౌ యు గో హోం” అన్నారు.   వెళ్లేముందు పాటించాల్సిన నియమాలు, మింగాల్సిన మందులు ఇత్యాదుల గురించి నాకు,  మా ఆవిడకి కూడా వివరించారు.  తినుము, తినకుము అని వ్రాసి ఉన్న ఒక పెద్దకాగితం కూడా చేతిలో పెట్టారు. సలహాలు సూచనలు కూడా పెద్దలిస్ట్ చెప్పారు. “వేయి శుభములు కలుగు నీకు పోయి రారా పేషెంటూ”  అని పాడి సాగనంపారు.

ఇంటికి వచ్చిన తరువాత రెండు గంటల పాటు  డాక్టర్ల సూచన ఒకటి పాటించాను. “ఇప్పుడు మూడు ఇదివరలో ఒకటి మొత్తం నాలుగు స్టెంట్లు నా శరీరంలో రక్త ప్రసరణ నిరాటంకంగా కొనసాగిస్తుండగా నాకేల భయం” అనుకున్నాను.  “ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము” అని పాడుకొని ఐదు రోజుల వియోగం తరువాత ఒక సిగరెట్టును ముద్దు పెట్టుకున్నాను.  “ఏమైనా చెప్పండి కానీ ఆ  ఒక్కటి చెప్పకండి” అని మా బంధు మిత్రులందరికీ విన్నవించుకున్నాను.  

మూడు రోజులయింది ఇంటికి వచ్చి. అంతా బాగానే ఉంది.   

అదీ సంగతి.  ఇతి వార్తాః సమాప్తః.

ఇంతకీ ఈ విషయానికి లక్షవత్తుల నోముకి లింకేమిటి? అని మీకు సందేహం వచ్చి ఉండాలి. అంత తొందరెందుకు? వచ్చినవాడిని చెప్పకుండా ఉంటానా? వేచి చూడుడు. ఈ లోపు మీ ఉహాగానాలు మీరు సాగించండి.

సశేషం.       

10 కామెంట్‌లు:

sarma చెప్పారు...

కథ బావుంది. ప్రముఖుల పరిచయమయిందనమాట.

సార్! సరదా సరదాగా బాంబ్ పేల్చేరు, కతేనా? అనుమానంగా, భయంగా ఉంది సుమా!

నాగరాజ్ చెప్పారు...

సంక్లిష్ట సమయాల్లో సైతం సంతోషంగా ఉండగలిగిన వారే స్థితప్రజ్ఞులని గీతాకారుడి ఉవాచ. ఇంత సీరియస్ విషయంలోనూ హాస్య రసావిష్కరణ చేసి నవ్వుల పువ్వులు పూయించారు చూడండీ.... మీకు హ్యాట్సాఫ్ అండి గురూ గారూ! మీకు తెలిసినవే ఐనా, ఓ రెండు ముక్కలు... ఆ అగరుబత్తీలకు విడాకులివ్వగలరు (లక్ష వత్తుల నోము దీనికోసమేనేమో?), రోజూ ఓ అరగంట పాటు ఉదయాన్నే నడవగలరు (మీకోసం, మీ ఆత్మీయులందరి కోసం). థాంక్యూ :)

అజ్ఞాత చెప్పారు...

త్వరగా బాగా కోలుకుని మరో టపా తో మమ్మల్ని ..

karthik చెప్పారు...

మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష గురువు గారూ.. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా..

వేణూశ్రీకాంత్ చెప్పారు...

గ్లాడ్ దట్ యూ ఆర్ సేఫ్ గురూజీ... టేక్ కేర్..

sphurita mylavarapu చెప్పారు...

నాగరాజ్ గారి మాటే నాదీనూ. రాయటం సరదాగా రాసినా హాస్పిటల్ అనుభవాలు అనుభవించేవాళ్ళూ, చుట్టూ వుండేవాళ్ళు పడే టెన్షన్ మాత్రం అంత సరదాగా వుండదు. కొంతమందికి రోజూ చెవినిల్లు కట్టుకుని పోరినా మాన్పించలేకపోతున్నా అయినా చెప్పడం అనే అలవాటు పోవట్లేదు మాస్టారూ :)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శర్మగారికి,

ధన్యవాదాలు. అవునండి, ప్రముఖులకు నా పరిచయ భాగ్యం కలిగించాను. హాస్పిటల్, స్టెంట్లు నిజమేనండి. మిగతాది షరా మామూలే. నా పద్ధతిలో సరదాగానే .....దహా.

నాగరాజ్ గారికి,

ధన్యవాదాలు. పూతరేకులు, సున్నుండ, నెయ్యి, సిగరెట్లు వీటికి విడాకులు ఇవ్వలేను సార్. రోజూ ఒక గంట నడుస్తూనే ఉన్నాను. అయినా...? దహా.

అనానిమస్ గారికి,

ధన్యవాదాలు. టపాలు వేద్దామనుకున్నా చదివేవాళ్ళు కనిపించటం లేదు....దహా.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కార్తిక్ గారికి,

ధన్యవాదాలు. వీనుల విందుగా ఉంది మీ వ్యాఖ్య. నన్ను మంచి వాడు అన్న మొదటి వ్యక్తి మీరే....దహా.

వేణు శ్రీకాంత్ గారికి,

ధన్యవాదాలు. ఇంకొంత కాలం నా నస తప్పదు బ్లాగు జనులకి........దహా.

స్ఫురిత మైలవరపు గారికి,

ధన్యవాదాలు. నిజమేనండి, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నవారికన్నా ఆప్తులకే టెన్షన్ ఎక్కువేమో. కానీ, కొన్ని కొన్ని అలవాట్లు వదలడం కష్టమే.......దహా.

Unknown చెప్పారు...

సుబ్రహ్మణంగారూ...నమస్కారం. మీరు త్వరగా కోలుకుని మీ బ్లాగ్ప్రసహనాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. హాయిగా ఇదివరకటిలా వతనుగా మీరు రాస్తూ ఉండండి గురువుగారూ, ఇంకో పద్దెనిమిదివేలే కదా...ఆ వత్తులు మేం వెలిగించేస్తాం ;)

భవదీయుడు,
వర్మ

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

అల్లూరి రవివర్మ గారికి,

ధన్యవాదాలు. మీరు జ్ఞానులు. కనిపెట్టేశారు. అభినందనలు.....దహా.