తెలుగదేల అనే అంటాం

“తెలుగదేల యన్న” అంటూ మొదలు పెట్టి “దేశ భాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయల వారు ఓ పద్యం రాశారని విన్నాం. అంటే ఆకాలంలో కూడా తెలుగు అదేలా అనే వారున్నారని మనం అర్ధంచేసుకోవాలని మా బండోడు వక్కాణించాడు. తెలుగుమీద ఇప్పుడు బోలెడు అభిమానం ఉన్నా, చిన్నప్పుడు తెలుగంటే నాకు చాలా భయం ఉండేది. మా మాష్టార్లు, ఒకరిద్దరు తప్పితే, మాకు టిఫిన్లు బాగా పెట్టేవారు. పెసరట్టు, మినపరోస్ట్ వీపుమీద, కొంచెం లైట్ గాపడితే పెసరట్టు, అరచేతి ముద్రలు కూడా ముద్రిస్తే మినపరోస్ట్ అని అర్ధం. తొడమీద గిల్లితే పకోడి అనీ, మెలిపెట్టి గిల్లితే పునుకులు అనీ, బుగ్గమీద పొంగిస్తే బూరెలు అనీ, అరచేయి వెనక్కి తిప్పి ముణుకులు వాయగొడ్తే కజ్జికాయలు, మైసూర్ పాక్ అనీ అనేవాళ్ళం. ఈభయం కాస్తా 4&5 తరగతుల్లో కోపంగా మారింది. అప్పటిదాకా, అల, వల లాంటి చిన్నపదాలు Dictation లోచెప్పేవారు. 4&5 తరగతుల్లో రెండు, మూడు అంతస్తుల అక్షరాలు చెప్పేవారు, విష్వక్సేనుడు, అదృష్టము లాంటివి. తరగతి పెరుగుతున్న కొద్దీ అంతస్తులు పెరిగేవి. రె౦డవఫారంకి వచ్చేటప్పటికి, అశ్వత్థవృక్షము, శాస్త్రనిర్దిష్టము, మత్సాకృతి ఇత్యాదులు. చెప్పటమేకాదు, పలకమనేవారు. మూతి అష్టవంకరలు తిప్పి,కాళ్ళు చేతులు కొట్టుకుంటూ పలకడానికి ప్రయత్నించే వాళ్ళం. కాని ఎక్కడో దొరికి పోయేవాళ్ళం. మాతెలుగు మాష్టారికి ఓ విజ్ఞాపన పత్రం ఇచ్చుకున్నాము. ఇలా రెండు మూడు అంతస్తుల అక్షరాలు ఒకటి రెండు కన్నా ఎక్కువ ఉన్న పదాలు డిక్టేషనులో ఇవ్వకూడదు అని, తప్పుచేస్తే పకోడీలు తప్ప మినపరోస్ట్లు, కజ్జికాయలు పెట్టరాదు అనిన్నూ విన్నవించుకున్నాము. ఏకళనున్నాడోకానీ మొదటిదానికి ఒప్పుకున్నారు కానీ రెండవదానికి ఘట్టిగా నో అనేసారు. గుడ్డిలో మెల్ల అని సంతోషించాము. కానీ మాతెలుగు మాష్టారు అంత రాజకీయం చేస్తారనుకో లేదు. రెండు మూడు అక్షరాలవే ఇచ్చారు., అర్ఘ్యము, స్మృతి, దంష్ట్రము, ఇత్యాదులు. పెనం మీదనించి పొయ్యలో పడ్డట్టయింది మాపని. రెండు మూడు అక్షరాలవే వ్రాయలేక పొతున్నారా వెధవ ల్లారా అంటూ అందరికీ మినపరోస్ట్ తినిపించేసారు. నామట్టుకునాకు ఒక ఘోరమైన పదము సుమారు అరడజను రోస్ట్ లు ఇప్పించింది. చ్ఛేద్యము అన్న పదం పాఠంలో రెండు మాట్లు వచ్చింది. రెండుమాట్లు దాని ముందర అక్షరాలు వేరు. ఒకటి సరళమైనది, రెండోది రెండంతస్తుల అక్షరం. ఆయన పలకమంటాడు. మనకి కుదిరి చావదు. సరళ అక్షరయుక్త చ్ఛేద్యమునకే రెండు మినపరోస్ట్లు దొరికాయి. చ కి ఎ కారం, ఆపైన దీర్ఘం, కి౦ద చ తోటి వత్తడం, పైగా కింద చ గుండెలో గునపం ది౦చడం, ఇవన్నీ ఏకకాలంలో ఉచ్చరించడం మాటలా. రెండో ఫారం చదువుతున్న చిన్న బుర్రకి, అందులో మట్టి తప్ప సరుకు లేని అమాయకపు బుర్రకి, కుదురుతుందా అని నేను ప్రశ్నిస్తున్నాను. కష్టపడి బిగపెట్టి చ్ఛే అన్న వెంటనే ద్యము అనేటప్పటికి అప్రయత్నంగానే ద కి కూడా గునపం దిగిపోయేది. ద్య కి గునపం దిగడం, మాష్టారు మినపరోస్ట్ తినిపించెయ్యడం ఏక కాలంలో జరిగి పోయేవి. .అంతవేగంగా ఆయన ఎల్లా రియాక్టు అయ్యేవాడో నాకు అర్ధం అయ్యేది కాదు.

ఈ మాష్టారే్ పిల్లల్లో ఒరిజినాలిటీ పెంచాలని అత్యుత్సాహ పడిపోయేవాడు. ఒక చిన్నకధ చెప్పి దాన్ని వ్రాయమనేవాడు. మేమంతా సరళపదాల తోటే వ్రాసేవాళ్ళం. కాని తెలుగు సారు కి దొరకకుండా తెలుగులో వ్రాయడం మావల్లకాదని తేలిపోయింది. 'ఒకడు మరొకడిని నీకు ఏమి జబ్బు?’ అని అడిగాడు అని వ్రాస్తే కూడా టిఫిను దొరికేది. `నీకేమి జబ్బు’ అని వ్రాయాలిట. విడి పదాలను కలపడానికి సవాలక్ష మార్గాలు అన్వేషించారు మన కవులు, వ్యాకరణవేత్తలు. వీటన్నిటికి సంధులు, సమాసం అని చాలా పేర్లే పెట్టారు. ముందు తరాలలో చిన్న చిన్న బుర్రలతో, చిన్న చిన్న కుర్రాళ్ళు నేర్చుకోవాలి కదా అని ఆలోచించకు౦డా వాళ్ళు అన్నేసి సూత్రాలు కనిపెట్టేసారు. ఒకదాని కంటే మరొకటి కఠినమైనది. సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి అంటూ ప్రతీదానికి అరపేజి కంఠతా పట్టాల్సి వచ్చేది. కంఠతా పట్టింది, వ్రాసేయడం, అప్ప చెప్పడం కొంచం కష్టం అయినా సాధించేవాళ్ళం. అది అన్వయించడానికి తాతలు దిగివచ్చేవారు. ఒక పదం ఇచ్చి విడగొట్టండనే వారు. రెండు పదాలు ఇచ్చి కలిపేయండనే వారు. ఈ విడగొట్టడ మేమిటో ఆ కలిపేయడ మేమిటో ఒక పట్టాన బో్ధపడేది కాదు. ఎల్లా విడగొడితే్ ఏంతంటా వస్తుందో. ఎన్ని కష్టాలు. అక్కడికి మా మాష్టారు తో మొఱ పెట్టుకున్నాం. సార్, ఇది మంచి పద్దతి కాదు. అలా కలిసిపోయిన వాటిని విడగొట్టడం పాపం అని. ఆయన ఓచిరునవ్వు నవ్వి, పోనీ లెండిరా ఆపాపం మనకెందుకు, ఈ రెంటినీ కలిపి పుణ్యం కూడబెట్టుకోండి అని అన్నారు. రెంటినీ కలపి పలకడం కన్నా, ఒకదాన్ని విడగొట్టడమే మాశరీరాలకు మంచిదనిపి౦చేలా చేసారు. ఈ సంధుల తొటే కొట్టుకు ఛస్తుంటే సమాసాలు వచ్చి పడ్డాయి. కర్మదారయ అన్నారు, తత్పురుష అన్నారు, ఒక దానికీ లింకు దొరికేది కాదు. చేతన్, చేన్, తోడన్, తోన్, అంటూ అవస్థ పడేవాళ్ళం. తోడన్ నే తోడలేక ఛస్తుంటే తోకలాగ తోన్ ఏమిటిరా అని ఏడ్చేవాడు మాబండోడు. ఈసమాసాల్లో కూడా చాలా గ్రేడు లున్నాయి. విశేషణ కర్మదారయ, ప్రధమా, ద్వితీయ అ౦టూ తత్పురష కి బోలెడు ఉ౦డేవి. ఒకటే కష్టంగా ఉ౦టే, మళ్ళీ అ౦దులో ఇన్ని రకాలా అని దుఃఖించేవాళ్ళం. `విగతభర్తృక` అన్న పదం నాకు బాగా తినిపించింది. దీని అర్దం ఇప్పటికీ నాకు సరిగ్గా తెలియదు. పోయిన భర్త కలది అనే అర్ధం వస్తు౦దను కుంటాను. ఆయన ఎవరో పోవడం ఏమిటో, పోయినాయన ఈవిడకు కలగడం ఏమిటో?. అసలు ఇలాంటి పదాలు కనిపెట్ట వచ్చా అని కోప్పడ్డాను. అప్పుడు మానవ హక్కుల కమిషన్ లేదు కాని, ఉంటే తప్పకు౦డా ఫిర్యాదు చేసేవాడిని. ఇలాంటి పదాలతో పిల్లలను హింస పెట్టడం నేరం అని కమిషన్ ను ఒప్పించడం పెద్ద కష్టం కాదు అనుకుంటాను. ఇంతకీ ‘విగతభర్తృక’ అన్నది ఏసమాసమో మీకు తెలుసా? ‘విగత’ ఉంది కదా అని విశేషణ కర్మదారయ అన్నాను. ఒక పెసరట్టు దొరికింది. ఏమైతే అవుతుంది అని ఏదో తత్పురుష అన్నాను . మినపరోస్ట్ తినిపించేసారు. పట్టు వదలని విక్రమార్కుడి లాగ మరేదో అన్నాను కజ్జికాయలు తినిపించేసారు. ‘స,శ,ష, ర,ఱ,ట,ఠ లు ప్రాణాలు తీసేసాయి. ఏది, ఎక్కడ, ఎల్లా, ఎప్పుడు, ఎ౦దుకు వాడాలో ఇప్పటికి నాకు సరిగ్గా తెలియదు.

సంధులు, సమాసాలు, విభక్తులు, భక్తులతోటి కుస్తీ పడుతుంటే, తీరుబడిగా, చిద్విలాసంగా నవ్వుతూ గురువులు, లఘువులు మా మీదకు దూకేసాయి. తోడుగా గణాలను తెచ్చుకున్నాయి. యగణం, మగణం, భగణం అ౦టూ హోరెత్తించేశాయి. మేము బిత్తరపోయి చూస్తుంటే ఉత్పలమాలలు, చంపకమాలలు, వాటికి కాపలాగా శార్దూలాలు, మత్తేభాలు పైనపడ్డాయి వికటాట్టహాసాలతో. ఇంకా మేమేమైనా మిగిలి ఉంటే మీద పొయ్యడానికి సీసంలను తోడుతెచ్చుకున్నాయి. ఒకళ్ళా, ఇద్దరా కవులు కొల్లేటి చాంతాడంత లిస్టు. ఒక్కొక్కడు కనీసం ఓఅరడజను వ్రాసిపడేసాడు. ఎవరు, ఎందుకు, ఏంవ్రాసాడో ఎలా గుర్తుపెట్టుకోవడం? నానా అవస్తలు పడేవాళ్ళం. గురువులను, లఘువులను గుర్తి౦చడం ఓ యజ్నం లాగ ఉండేది. లఘువులు కొంచెం తేలిక అనిపించినా, గురువులు కష్టం అయ్యేది. అన్నిచోట్లా గురువులు అంతేరా, ఓపట్టాన అర్ధంకారు అని విశదీకరించాడు మాబండోడు. ముందు అక్షరాన్ని బట్టి లఘువు కాస్తా గురువు అయిపోయేవాడు. ఈనాటి విద్యార్ధి రేపటి ఉపాద్యాయుడు అని బోదించేవారు మామాష్టారు. కొంతమంది లఘువులు ఎప్పటికి మారరు మన బండోడి లాగ అని చమత్కరించే వారు కూడాను.

పద్యాలు, ప్రతిపదార్ధాలతో దుంపతెగిపోయేది. కొన్నిపద్యాలు ఫరవాలేదు, కొన్ని తెలిసిన పదాలు దొరికేవి. కొన్నిపద్యాలలో ఒట్టు, ఒక్కటంటే ఒక్కటి కూడా తెలిసిన పదం ఉండేది కాదు. ఏదైనా ఒక పదం విడగొట్టితే అందులోంచి తెలిసినదేదైనా ఊడిపడేది. ’అట జని గాంచె భూమిసురుడు’ అంతదాకా ఈజీ అనిపించినా, ఆపైన  `అంబర చుంబి శిరఝరీ’ దుడుంగ్, ఫుడుంగ్, అంటూ పద్యం అయి పోయేదాకా ఒక్కమాట అర్ధం అయిచావదు. ‘ధాటీ ఘోట ఘరట్ట ఘట్టన మిళద్గ్రాషిష్ఠ’ నాబొంద, నాపిండాకూడు ఏమైనా అర్ధం అవుతుందా. అవి పలికేటప్పటికే ఆయాసం వచ్చేసేది. వీటి తోటే గుంజీలు తీస్తుంటే నానార్ధాలు అనేవారు. ఒకే పదానికి రెండు చోట్ల రెండర్ధాలు, కొండకచో ఇంకాఎక్కువ. మామాష్టార్లు మట్టుకు పద్యపాఠాలు చెప్పేటప్పుడు పరవశించి పోయేవారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిమాన కవి. ఆకవి పాఠం వచ్చిందంటే కొండొకచో కృష్ణుడి పాత్రలో లీనమైపోయిన యన్. టి. వోడు లాగ అయిపోయేవారు ఒక్కోపదానికి అర్ధం, వాటిలోని భావ చమత్కృతి విడమర్చి మరీ చేప్పేవారు.. 5,6 ఫారంలకు వచ్చేటప్పటికి వ్యాకరణం అంటే వ్యతిరేకత పూర్తిగా పోకున్నా తెలుగు లోని తేనెతీయందనాలు, మందార మకరంద మాధుర్యాలు అర్ధం అవటం మొదలు పెట్టేయి.

యస్.యస్.ఎల్.సి తోటి తెలుగు పాఠాలు అయిపోయాయి. కాలేజి కెళ్ళి ఊపిరి పీల్చుకున్నాం. లాటిన్, గ్రీకు భాషలు చాలా కష్టమైన భాషలు అంటారు. చిన్నప్పుడు తెలుగు అన్నిటికన్నా కష్టం అనిపించేది. అందుకే అనేవాళ్ళం తెలుగదేలా అని.

29 comments:

Praveen said...

Thanks for a wonderful post sir!

Anonymous said...

It is a pity that you have got little taste for the language and literature in spite of being born a Telugu. and studied the language for at least a decade in your life. It indicates not that Telugu is bad but that you perhaps got very bad Telugu teachers who failed to inspire love for your mother tongue.

భైరవభట్ల కామేశ్వర రావు said...

హహహ :-) ఇలా రాసి నవ్వితే నవ్వండి ఏంటండి బాబు! నవ్వి నవ్వి పొట్టచెక్కలయ్యేలా ఉంటే!
"విగతభర్తృక" హైలైట్! అబ్బా ఆశ, దోశ అదే సమాసమో నాకు తెలుసుకాని నేను చెప్పనుగా :-) మొత్తానికి మీ మాస్టార్లు పెట్టిన టిఫినీలు బాగానే పని చేసి మీరిప్పుడు బ్రహ్మాండమైన తెలుగు రాయగలుగుతున్నారు! నాకు కనిపించిన ఒకే ఒక తప్పు, "అవస్తలు". దీనికొక పకోడీ నా తరఫునుంచి :-)
అన్నట్టు అలంకారాల గురించి ప్రస్తావించనే లేదు! మీకవి లేవా ఏంటి?

భైరవభట్ల కామేశ్వర రావు said...

పై కామెంటు పెట్టే సమయానికి మీ ప్రొఫైల్ చూడలేదు. మీరంత పెద్దవారని అనుకోలేదు. నా పకోడీ నేను వాపసు తీసుకుంటున్నాను.

శరత్ 'కాలమ్' said...

చాలా బాగా మాకు వ్యాకరణం అంతా బోధిస్తూ నవ్వించేసారు. మీరు పదాలని విడగొట్టే బదులు తొడగొట్టివుంటే బావుండేది. మా ఎనిమిదవ తరగతిలో సవర్ణ దీర్ఘ సంధి అనమంటే సువర్ణ దీర్ఘ సంధి అనేవాడిని. మా క్లాసులో సువర్ణ అనే చక్కని చుక్క వుండేది మరి. ఏం చేస్తాం! అన్నట్లు క్లాసులో ఎప్పుదయినా పాట పాదేరా? నేనో సారి ట్యూషన్ మాస్టారు దగ్గర పాడినట్టు గుర్తు. పాట అంటే హేం పాటో అనుకునేరు - ఒంటేలు!

వేణు said...

సుబ్రహ్మణ్యం గారూ! టపా చాలా బాగా రాశారు. కామెడీ కోసం మీరు అతిశయోక్త్యలంకారాన్ని ఉపయోగించారని నాకనిపిస్తోంది. కదూ?

>> రెండో ఫారం చదువుతున్న చిన్న బుర్రకి, అందులో మట్టి తప్ప సరుకు లేని అమాయకపు బుర్రకి, కుదురుతుందా అని నేను ప్రశ్నిస్తున్నాను.
>> ఇంకా మేమేమైనా మిగిలి ఉంటే మీద పొయ్యడానికి సీసంలను తోడుతెచ్చుకున్నాయి.

భలే నవ్వొచ్చేసింది!

భైరవభట్ల కామేశ్వరరావు గారు ఒకే పదం తప్పు కనపడిందన్నారు కదాని, రంధ్రాన్వేషణ చేశాను.:)
టపా చదువుతూనే ‘మత్సాకృతి’ని గమనించాన్లెండి. అది ‘మత్య్యాకృతి’ కదూ! ‘కర్మధారయ’ బదులు ‘కర్మదారయ’ అని రాశారు.
ఇక- ‘చ్ఛేద్యము’అనేది సంధి చేసిన పదంలోని రెండోభాగం. దాన్ని యథాతథంగా డిక్టేషన్ ఎలా ఇచ్చారో. పైగా దాన్ని పలకమని అడగటం కూడానా!

ఆ.సౌమ్య said...

హ హ హ భలే చెప్పారండీ...నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చింది.
నాకు తెలుగు నేర్చుకోవడం కష్టమనిపించేది కాదు. పైగా నేను సంధులు, సమాసాలూ అన్ని కరక్టుగా చెప్పేసేదాని. మా క్లాసులో తెలుగులో నేనే ఫస్ట్. డిక్టేషన్ కూడా తప్పుల్లేకుండా రాసి పది కి పది తెచ్చుకునేదాన్ని, తెలుసా. సమాసాలంటే గుర్తొచ్చింది. న్ఞై తత్పురుష సమాసమని ఒకటుండేది, గుర్తుందా? అది పలకదానికి, ఆ స మాసాన్ని గుర్తించదానికి నా స్నేహితులు చాలామంది మీ లాగే అన్ని రకాల స్వీట్లు తినేవారు. నాకు ఈజీగానే వచ్చేసేదనుకోండి. కానీ ఎప్పుడైతే చంధస్సు మొదలయిందో...నాకు అచ్చంగా మీరు రాసిన లాగే అనిపించేది. ఆ యతులు, గణాలు, లఘువులు, గురువులు...బాబోయ్ పిచ్చెక్కించేసారనుకోండి.

madhuri said...

I enjoyed reading the post. I thoroughly enjoyed reading the comments immediately after reading the post.

శ్రీలలిత said...

చాలా శుద్ధంగా తెలుగు నవ్వు నవ్వుకున్నానండి!! కాని చిన్నప్పటి తెలుగు మాష్టారులను గుర్తుకు తెచ్చారు. ఇప్పుడు పిల్లల స్కూళ్ళు చూస్తూంటే, అది వేరే ప్రపంచం అనిపించింది!

RAJANIKANTH THOTA said...

పదవ తరగతి వరకు చదువు కొని వదిలెసిన సందులు, సమాసాలు, సీస పద్యాలు గుర్తుకు వచ్చాయి. దన్యవాదములు. నవ్విస్తు అన్ని గుర్తు చెసినందుకు...

జ్యోతి said...

అమ్మో, తెలుగు పదాలు ఛందస్శుతో సేమ్ తో సేమ్ అనుభవాలు.కాని మీలా టిఫినీలు తినలేదు లెండి. అప్పడాలు (అరుపులు) తప్ప.. కాల్చి వాత పెట్టి అరిస్తే చంపుతా అన్నట్టు ఇంత నవ్వించే టపా పెట్టి నవ్వితే నవ్వండి అంటారా?? ఆయ్..

Pranav Ainavolu said...

"’అట జని గాంచె భూమిసురుడు’ అంతదాకా ఈజీ అనిపించినా, ఆపైన `అంబర చుంబి శిరఝరీ’ దుడుంగ్, ఫుడుంగ్, అంటూ పద్యం అయి పోయేదాకా ఒక్కమాట అర్ధం అయిచావదు"

"‘ధాటీ ఘోట ఘరట్ట ఘట్టన మిళద్గ్రాషిష్ఠ’ నాబొంద, నాపిండాకూడు ఏమైనా అర్ధం అవుతుందా"...

అమ్మో... ఇంకా నా వల్ల కాదండీ. నవ్వలేక ఛస్తున్నా.
ఇన్ని దశాబ్దాలవుతున్నా పదాలతో సహా గుర్తుంచుకున్నారంటే ఆశ్చర్యమేస్తోంది.

Bulusu Subrahmanyam said...

కామెంట్స్ చేసిన అందరికి ధన్యవాదాలు. ఇవి చూసిన తర్వాత నేనూ తెలుగులో వ్రాయగలను, అనే నమ్మకం కలుగుతోంది.

Anonymous గారు
చెప్పిన మొదటి పాయింటు ఒప్పుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు. క్లాసులో అందరూ ఐన్ స్టీన్ లే ఉండరు. నాలాంటి మిడతంభొట్లుగాళ్ళు కూడా ఉంటారు. రెండో పాయింటు తో నేను విభేదిస్తాను. మాగురువులు అంటే మాకు అభిమానం, గౌరవం. మాగురువులు మాకు పాఠాలు. నేర్పారు, I repeat, నేర్పారు , అవసరమైతే ఓ దెబ్బవేసి. చదువు దాని ప్రాముఖ్యత గురించి, మా తల్లి తండ్రుల కన్నా మాగురువుగార్లే ఎక్కువగా చెప్పారు. బహుశా వాళ్ళు మామీద అంత శ్రద్ధ తీసుకోక పోతే, ఈనాడు ఈమాత్రమైనా మేము ఎది్గేవారం కాదు..

ఆ.సౌమ్యగారూ,

మీరు చెప్పిన ఆ సమాసం నాకు గుర్తులేదు. ఎంత ఆలోచించినా ఏసందర్భంలో వాడేవారమో గుర్తు రావడంలేదు. చెప్పానుగా నేనో మిడతంభొట్టు నని. ధన్యవాదాలు.

కామేశ్వర రావు గారు, వేణుగారు,

నిజమే సారూ కొన్నితప్పులు దొర్లిపోయాయి. ఇవి దిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను. తెలుగు స్పెల్లింగు ల్లాగే తెలుగు టైపింగు కూడా అంత కష్టంగానూ ఉంది నాకు. నేర్చుకుంటున్నాను. అప్పుడప్పుడు ఎవరోఒకరు ఒక మొట్టికాయ వేయకపోతే నేర్చుకోవడం ఆగిపోతుందేమో నాలాంటి వాళ్ళకి. థాంక్స్ ఫర్ ది మొట్టికాయ.

శ్రీలలిత గారూ,

నిజమేనండీ, ఆనాటి గురువుల కమిట్ మెంట్ ఈనాడు అంతగా కనిపించడం లేదు. విద్యావిధానంలో మార్పులు వచ్చాయి. హర్షణీయమే. పిల్లల, వారి తల్లి తండ్రుల మనస్థత్వాలలో కూడా చాలా తేడాలు కనిపిస్తున్నాయి. బహుశా వాటి కనుగుణంగా ఇంకా మార్పులు రావాలేమో. వీటి గురించి మాట్లాడే అర్హత నాకు లేదనుకుంటాను. Thanks for the comments.

కామెంట్స్ చేసిన అందరికి మరోమారు ధన్యవాదాలు.

హనుమంత్ రావు said...

Subrahmanyamgaru, namasthe. As per Prescription given by Jyothi garu,(having seen she suggested)Icould see your Navvithe Navvandi We got no option than to enjoy the laughter. It will be more funny if we hear you on stage. Meeru chaala gadusugaa telugu nerchukovadam kashtamantune mee telugu knowledge baaga erkuka parichaaru. Great

Bulusu Subrahmanyam said...

Hanumantha Rao gaaru,

Thanks for your comments.I am a joker and also look like a joker. If you put me on the stage, that will be the biggest joke.

Anonymous said...

Wonderful account!
One should get the humor out of this.
Thanks for putting this together.
Regards
--pAlana

Bulusu Subrahmanyam said...

Anonymous గార్కి,
థాంక్స్. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

శ్రీనివాస్ పప్పు said...

అమ్మదీనమ్మాని(క్షమించాలి ఈ భాషా ప్రయోగానికి ఆనందం ఆపుకోలేక అలా అలా అనేయాల్సొచ్చింది ప్చ్ గోదారి అలవాటు మరి)ఇన్నాళ్ళు ఎలా మిస్సయ్యానబ్బా ఈ బ్లాగు ని.
బులుసు సుబ్రహ్మణ్యం అంటే నా క్లాస్‌మేటేమో అనుకున్నా, సారూ...వందనాలు వందనాలు వందన హరిచందనాలూ.
పోస్ట్ మాత్రం సుప్పర్ కేకో కేకశ్య కేకహహ్హహ్హహ్హహ్హహ్హ

Bulusu Subrahmanyam said...

శ్రీనివాస్ గార్కి,

మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.నా బ్లాగు మీకు నచ్చినందుకు చాలా చాలా థాంక్యూ.

కొత్త పాళీ said...

మాస్టారూ చీంచేశారు. తెలుగు పాఠాల్నించి ఇంత కామెడీ సృష్టించవచ్చని ఇప్పుడే తెలిసింది.
మన పప్పు భాయ్ వ్యాఖ్య పుణ్యమాని ఇది నా కంట పడింది. ఆయనకీ ఓ నమస్తే!
కామేశ్వర్రావు గారు, నేరేటివ్‌లో "సెకండ్ ఫారం" అనడం మీకు క్లూ ఇచ్చి ఉండాలి!!

Bulusu Subrahmanyam said...

కొత్తపాళీ గార్కి,

నా బ్లాగులోకి స్వాగతం, వచ్చినందుకు ధన్యవాదాలు. ఏదో సరదాగా వ్రాసాను.మీకు నచ్చినందుకు థాంక్యూ.
శ్రీనివాస్ గార్కి నేను కూడా థాంక్స్ చెప్పుకుంటున్నాను.

Anonymous said...

మీ స్కూలు అనుభవాలు చాలా బాగున్నాయి.

మనోజ్ఞ said...

బులుసు గారికి ముందుగా నా తురుపున చిన్న పకోడీ. హన్నన్నా... తెలుగునే వెటకారం చేస్తారా. అంత మంచి పద్యాన్ని పట్టుకుని దుడుంగ్ పుడుంగ్ అంటూ ఎగతాళి చేస్తారా. మనలో మన మాట మీకో రహస్యం చెప్పనా. ఈ పద్యం అంటే నాకూ చిరాకే. మేము ఎం.ఏ లో ఉన్నప్పుడు మా ప్రొఫేసర్ ఒకరు అస్తమానం ఈ పద్యం చెప్పి వాయగొట్టేవాడు. ఈ పద్యం ఇప్పటికీ నన్ను అప్పుడప్పుడూ కలవరపెడుతూ ఉంటుంది. ఇకపోతే చాలా బాగా రాస్తున్నారండీ. అసలు ఇలాంటి మంచి తెలుగు చూసి ఎన్నాళ్ళయిందో. అందుకే అందుకోండి వీరతాళ్ళు.

Bulusu Subrahmanyam said...

హరెఫాలా గార్కి,
ధన్యవాదాలు. థాంక్యూ

మనోజ్ఞ గార్కి,
ధన్యవాదాలు. మా తెలుగు మాష్టారుకి {(SSLC లో)మా నాన్న గారే} పెద్దన్న గారన్నా,తిక్కన్న
గారన్నాచాలా ఇష్టం. ఇంటి దగ్గర కూడా క్లాసు తీసుకున్నారన్న మాట ఈ పద్యంతో. అందుకని బాగా గుర్తుండి పోయింది. ఆ తర్వాత నేను పండిత పుత్రుడిని అయిపోయేనన్న మాట. థాంక్యూ.
తపాల బంట్రోతు తరవాత మీరు మళ్ళీ ఏమీ రాయలేదా? నేను చూడలేదా?

మనోజ్ఞ said...

ఓహో అదా సంగతి. అబ్బ మీ నాన్నగారు తెలుగు మాస్టారా.... భలే. తపాలా బంట్రోతు తర్వాత నా బ్లాగులో ఏమీ రాయలేదు కానీ కౌముదిలో రాస్తున్నాను. శ్రీపాద వారి మీద నేను చేసిన ఎంఫిల్ అందులో సీరియల్ గా వస్తోంది. సెప్టెంబర్ సంచిక నుంచీ మొదలైంది. వీలయితే చూడండి.

Ramu said...

Mee post lo cheppina sagam vishayalu naaku thelevu. Convent chaduvulu ani cheppi atu english itu telugu rakunda ipyindi. Ee tapa chadivaka naaku telugu nerchukovalanipistondi. Mare mee guruvugari laa naaku motikayalu vesi nerpinchedi evaru ?

Anonymous said...

I've been browsing online more than 4 hours today, yet I never found
any interesting article like yours. It's pretty worth enough
for me. In my opinion, if all webmasters and bloggers made good content as you did, the net will be much more
useful than ever before.

Anonymous said...

చాలా సరదాగా ఉంది

Anonymous said...

టెస్ట్

ఈ రోజు బ్లాగులో నా 239 వ దినం, వచ్చి నాల్గు అక్షంతలు వేసి వెళ్ళండి.

గమనిక : - మొదట ఈ టపా ఫిబ్రవరి 7, 2011 న పబ్లిష్ చేశాను. కానీ ఆ మధ్యన నా పొరపాటు వల్ల ఈ టపా డిలీట్ అయింది. టపాతో పాటు కామెంట్లు కూడా పోయాయి....