కవిత్వం ఎలా వ్రాయాలి

కవిత్వం ఎందుకు వ్రాయాలి అని  సాధారణంగా ఎవరూ అడగరు.  ఎందుకంటే కవిత్వం దురద  ఎప్పుడో ఒకప్పుడు అందరికి పుట్టుతుంది కనుక. పుట్టిన వెంటనే అదేనండీ దురద, మన  చేతిలో బ్లాగు ఉంది కనుక  వెంటనే గోకేసుకుంటాము. మన గీకుడు భరించలేక కొంతమంది పాఠకులు కెవ్వు మంటారు. నిశ్శబ్దంగా కుయ్యో మొర్రో అని కూడా దుఃఖిస్తారు. కానీ సహృదయులు కాబట్టి, జాలిగుండె కలవారు కాబట్టి, ఎంతైనా తోటి బ్లాగరు,  పాపం, దురద భరించలేకే గోక్కున్నాడు అని సమాధాన పర్చుకుంటారు. మరి కొంత మంది జాలితో ద్రవించిన హృదయం కలవారై,  తోటి బ్లాగరును ప్రోత్సహిద్దామనే భావనతో కామెంటుతారు. కేక అంటారు, కత్తి, గునపం, గడ్డపారా అని కూడా అంటారు. బాగుంది,  సూపరూ, ఇహ నీకు ఎదురులేదు, కుమ్మెయ్యి,  గోకెయ్యి, బుఱ్ఱలు  తినెయ్యి,  అని ఉత్సాహ పరుస్తారు. ఇవన్నీ చూసిన తరువాత అప్పటిదాకా దురద లేనివాళ్లు  కూడా కావాలని సరదాగా దురద పుట్టించుకుంటారు. అదండి సంగతి నాకూ దురద పుట్టింది. కవిత్వం వ్రాయాలని.


కప్పుకి లిప్పు కి బోలెడు దూరం అని అంటుంటారు. నాకూ అనుభవం లోకి వచ్చింది. దురద పుట్టిన వెంటనే  ఏదో నాలుగు లైనులు బరికేసి పబ్లిష్ నొక్కెస్తే నా దురద తీరిపోయేది. ఏ    బాధా లేకపోయేది. పబ్లిష్ నొక్కిన వెంటనే నా బాధ మీకు ట్రాన్స్ఫర్ అయిపోయేది. మీ బాధలు మీరు ఆరున్నొక్క రాగం లో  పాడేవారు.  నేను మనసారా ఆలకించి ఆనందించే వాడిని. కానీ నిన్న,  కొత్తావకాయ లో అంత వెన్న కలపి, పంచదార కలశ ల రసం జుర్రుకుంటూ  అలౌకికానందం  లోకి జారిపోయి  “మనసు పరవశించెనే  పొట్ట బరువు ఎక్కెనే” అని పాడుకుంటూ, 


“దేవి, ఆర్యపుత్రీ,  ప్రభావతీ, నేను కూడా కవిత్వం వ్రాయాలని నిశ్చయించుకున్నాను”

అని  అంటిని. అంతే  శ్రీమతి ప్రభావతి దిగ్గున లేచి తన చెయ్యి నా కంచం లో కడుక్కొని,  


“హెమంటి వేమంటివి, నువ్వు కవిత్వం వ్రాయుదువా, హే తెలుగు తల్లీ నీకెంత కష్టము దాపురించ నున్నది. దీని నరికట్టు వారెవరూ లేరా? ఏదో నాలుగు కధలు,  కాకరకాయలు రచించినంత మాత్రాన కవి యైతినని గర్వించుచున్నావా.   ఓరోరి బ్లాగుడా, నీ   ధూర్త ప్రవర్తన మానుకొమ్ము. లేనిచో నీ బ్లాగునూ, ఆ దుష్ట లాప్ టాపు నూ. ఆ BSNL మోడెమ్ నూ  మదీయ తీవ్ర వీక్షణాగ్ని కిరణముల దగ్దము చేసెద”  

నని క్రోధ సముద్రముప్పొంగ నుటంకించెను. నేను భయ విహ్వలుడనై, మనంబున శాంతం భోషాణం అని స్మరించుచు ఆపె క్రోధ సముద్రము, క్రోధ నది యై, క్రోధ యేరై, క్రోధ చెరువై, క్రోధ గుంట అగునంతవరకు శాంతము వహించితిని.  ఆమె శాంతమతి యై, దయార్ద్ర చిత్తయై,

 “ఆర్య పుత్రా, పతిదేవా ప్రద్యుమ్నా, ఛందోబద్ధమై అలరుచు,  చదివినంతనే, వినినంతనె అలరించుచూ,  ఆనందింప చేయుచూ, తెలుగు వారికే స్వంతమైన పద్యమును కలుషితము చేయనేల సాహసించ దలచితివి.”    అని వివరణ కోరెను.  

“దేవీ ప్రభావతీ నేను పద్యము లిఖించ దలచలేదు. ఏదో సామాన్యమైన గేయరచనకు పూనుకొంటిని.”

అని విన్నవించుకొంటిని. భావ కవిత్వమా అని ఆమె పృచ్చించెను. అవును అన్నట్టుగా నేను తల నూచితిని. అసలు కవిత్వం వ్రాయడం ఎలాగో తెలుసునా శ్రీనాధా అని మళ్ళీ  మదీయ పత్ని నన్నడిగెను.  నీకు తెలుసునా అని నేను ఎదురు ప్రశ్న వేసితిని.  


దోసెడు పారిజాతములతో హృదయేశ్వరి
మెల్ల మెల్లగా డాసిన భంగి
మేలిమి కడాని వరాల కరాలు వచ్చి
కన్మూసిన భంగి
కన్నె నగుమోము పయిన్  నును సిగ్గు మొగ్గ
కైసేసిన భంగి
అందముల్ చిందెడి నందన వాటి వెన్నెలల్
కాసిన భంగి
జానపద కాంతలు రాట్నము మీద దారముల్
తీసిన భంగి
క్రొవ్వలపులేఖ  తలోదరి తామరాకు పై
వ్రాసిన భంగి
పెండ్లి తలంబ్రాల్ జవరాలు రవంత నిక్కి
పై బోసిన భంగి
పొంగు వలపుల్, తలపుల్, సొలపుల్
ప్రసన్నతల్, భాసురతల్, మనోఙ్ఙతల్
ప్రౌఢిమముల్, రసభావముల్, కడు భాసిలు నట్టు


చెప్పాలిట కవిత్వం. ముఖ్యం గా తెల్గు కైత. ఎంత అద్భుతంగా చెప్పారో  కరుణశ్రీ  జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. అంతకన్నా అందంగా చెప్పిన వారు నాకు కనిపించలేదు అంది ప్రభావతి. నేను కూడా వెంటనే ఒప్పేసుకున్నాను. యెస్ ఐ ఆల్సో నో సీ అని కూడా అన్నాను.  ఆగ్లం లో శ్రీ హెన్రీ వర్డ్స్ వర్త్  ఆర్తి తో తన ప్రేయసి తో ఏమన్నాడో విన్నావా పతీ పరమేశ్వరా  అని అడిగి సమాధానం కోసం చూడకుండా చెప్పేసింది.  


ఏదీ వినిపించు
ఏదో ఒక కవితను
నిసర్గ సుందర మధుర గీతికను
అహమంతా ముసిరిన
ఆలోచనల నవతలకి నెట్టి
మనసున శాంతి సమీరాలు వీచే పాటను


అల్లా వ్రాయగలవా నువ్వు. అంత బాగా వ్రాయలేను కానీ ఒక మాదిరిగా వ్రాద్దామని ప్రయత్నం చేస్తాను. నా కవిత విను నా శ్రీరంజనీ అని విసిరాను నా కవిత.


పడుతోంది వేడి వేడి వర్షం
చల చల్లటి   మేఘాల్లోంచి
నల్లటి కారు బొగ్గు లాంటి
వర్షం   వర్షం పడుతోంది
వాతావరణం లోకి మెల్లిగా


సతీ సావిత్రి  నా కేసి చూసి ఇదేమిటి నా రేలంగీ. దీనిభావ మేమి అని అడిగింది. హూహూ  దీన్ని అతివాస్తవిక రచన అందురు. దీంట్లో మనం సరైన అర్ధం వెతుక్కోవాలి. అని ఐ సెడ్డు.   How is that my dear అని అంది. పైగా ఒక ? కూడా పెట్టింది.  నేను హహ అన్నాను, సందు దొరికింది గదా అని హహ్హాహాఃహ  యని కూడా అన్నాను.  నవ్వడం  కాదు నా  చిత్తూరు నాగయ్యా  అర్ధం  చెప్పు  పై రాతకి   అని శ్రీమతి కన్నాంబ  అడిగింది. ఈ మాటు నేను హిహి అని చిరునవ్వు నవ్వాను.

ఇది ఒక పజిల్ కవిత్వం. పదాలు వెతికి సరైన చోట పెట్టాలి. నువ్వు ఎప్పుడైనా మాడ్రన్ ఆర్ట్ చూశావా మై డియర్ సూర్యాకాంతం. మాడ్రన్ ఆర్ట్ లో ముక్కు ఎక్కడుందో  ఎలా తెలుసుకుంటాం? పెయింటింగ్ మీద మన ఎడం చేతి వేలితో తడుముతాం. మన చేతికి ఎక్కడ జిగురు అంటుకుంటుందో అక్కడ ముక్కు ఉన్నట్టు లెఖ్ఖ. అదే విధం గా నా రచన అర్ధం చేసుకోవాలి. మెదడు ఉపయోగించి పదాలు సరిచూడాలి. చదివేసి  ఆలోచించకుండా వెంటనే సూపరూ అనేయడం కాదు. అర్ధం చేసుకో , 


పడుతోంది పడుతోంది   
నల్లటి కారు బొగ్గులాంటి మేఘాల్లోంచి
వర్షం  వర్షం  చల చల్లటి వర్షం  మెల్లిగా
వేడి వేడి  వాతావరణంలోకి  వేడిగా  


దీన్ని రుబ్బురోలు కవిత్వం అని కూడా అందురు అని  విశదీకరించాను. అనగనేమీ యని మరల వివరణ కోరెను నా కనక దుర్గ.

ఇది కవిత్వములో కొత్త ప్రయోగము. రెండు వాక్యములు వ్రాసి రుబ్బురోలు లో  వేసి రుబ్బవలెను. ఖండ ఖండము లైన వాటిని నీకు తోచినట్టు అరడజను లైన్లలో సర్దవలెను. అదియే నేటి ప్రజాదరణ పొందిన కవిత్వము.  అని గంభీర గంభీర ముగా నుద్ఘాటించితిని.

ఓరోరి రాజనాలా  నిన్ను తిట్టుటకు నాలుక తొందర పడుచున్ననూ, పాతివ్రత్య కారణముల వల్ల మనసు ఇచ్చగించుట లేదు. కవిత్వానికి పరమార్ధం తెలుసునా నీకు.    ఇది విను అంది ప్రభావతి మళ్ళీ.


గ్రీష్మ మేఘం వాన జల్లులు కురిపించి నట్లు
కనుకొలకుల నుండి భాష్పాలు జాలు వారినట్లు
గుండె లోతుల నుండి గీతాలు పెల్లుబకాలి  ఎందుకు
సేద తీర్చటం కోసం, హాయి కలిగించడం కోసం 


అని ఒక భావ కవి ప్రశ్న వేసుకొని, తానే సమాధానం చెప్పుకున్నాడు. అర్ధం అయిందా. కవిత్వం వ్రాయాలంటే  ఊహ ఉండాలి,   కల్పన  చేయగలగాలి,  భావం తెలియాలి ఇవి మధురంగా ప్రకటించటానికి భాష కావాలి. ఇవన్నీ నీకు తెలుసునా అని ఘట్టిగా అడిగెను. నువ్వు అల్లా వ్రాయగలవా అని కూడా ప్రశ్నించెను. నహి నహీ నేను వాళ్ళకి మల్లె నహీ లిఖ్ సక్తా హూ  హూ అని అంటిని. లేకిన్  ప్రియే ధర్మపత్నీ వాళ్ళు పెద్ద మరియూ మహా కవులు వారి వలే నేనెట్లు వ్రాయగలను. నేను ఏదో థోడా థోడా కవిత్వం లిఖూంగా ఛోటా ఛోటా లోగోం కేలియే, అని వ్రాక్కుచ్చితిని. క్యారే తూ క్యా సంఝారే? ముఝె భీ హిందీ మాలూం.  సునో,


సఫేదీ హై  సియాహీ హై  షఫక్ హై  అబ్రెబారా హై
మజా బర్సాత్ కా చాహేతో ఇన్ ఆంఖోమ్మే ఆ బైఠో


అంటే అర్ధం తెలుసా ప్రాణనాయకా అంది.  మాలూం నహీ అన్నాను. ఒక నవ యువ జంట చాటుగా కలుసుకున్నారు. వర్షం పడుతోంది. వర్షం లో తడిసి ఆనందిద్దామా అని అడిగాడు యువకుడు. మగాడు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆడది ఆలోచిస్తుంది. తన భద్రత చూసుకుంటుంది. బయటికి వెళ్ళి ఎవరి కంట్లో నైనా పడితే ఎల్లా. అందుకే చెప్పింది ఇలా.  ఓ నా ప్రాణమా,  నా కళ్ళల్లోకి చూడు, అక్కడ తెలుపు ఉంది, నలుపు ఉంది, అరుణిమ ఉంది, శ్రావణ మేఘం ఉంది, నిన్ను కలుసుకున్న ఆనందంలో కురిసే భాష్పాలు ఉన్నాయి. వర్షంలో తడిసే ఆనందం కావాలంటే , రా , నా కళ్ళల్లో కాపురం పెట్టు. మహా కవి దాశరధి రంగాచార్య తన రచనలలో ఒక చోట చిత్రీకరించిన మధుర కమనీయ రమణీయ భావం ఇది. వీటిలో పదోవంతైనా నువ్వు పలికించగలవా నాధ్ అని అడిగింది నా ప్రియసఖి. నేనున్నూ కృద్ధుడనైతిని.

“కవిత్వమంటే  ప్రేమా, మేఘాలు, పెళ్లికూతురు,  తలంబ్రాలు, నిసర్గ సుందర గీతికలే కాదు. ఆకలి, దరిద్రం, బాధ, సమాజం ఇవికూడా ఉన్నాయి అని గ్రహించు.  

అని వచించితిని. అయితే ఇది విను  కాబోయే కవి సత్తమా అంటూ మళ్ళీ సంధించింది  ఇంకో బాణం,


కదిలేదీ, కదిలించేదీ
మారేదీ  మార్పించేదీ
పాడేదీ  పాడించేదీ
పెను నిద్దర వదిలించేదీ,
మునుముందుకు సాగించేదీ
పరిపూర్ణపు బ్రతుకిచ్చేదీ... ..... కవిత్వం


అన్నారు మహాకవి శ్రీ శ్రీ . అంతటి ఉత్సాహం,  ఆవేశం నింపగలవా కనీసం ఇరవైయో వంతైనా నీ కవిత్వం లో అని నొక్కి నొక్కి మరీ ప్రశ్నించెను.  ఆహా విధి వక్రించుట యనగా నిదియే కదా. కవిత్వము వ్రాయవలెనని నాకేల దుర్భుద్ధి పుట్టవలె, నేనేల ఉ. భా. ప్ర.  ప్రభావతీ దేవీ కేల తెలుపవలె , పతి నని కూడా ఇసుమంత కనికారము లేక ఆమె నన్నిట్లు ఏల ఝాడించ వలె అని విచారించు చుండగా ఆమె మరల ఏదో చెప్పబోయెను.     ఆషాఢస్య    ప్రధమ    దివసే  అని  సంస్కృతమున  ఆమె   మొదలుపెట్టే లోపుల నేను తెల్ల జెండా ఎగర వేసితిని.

“దేవీ నేనోటమి నంగీకరించితిని . నా బ్లాగు మీద ఆన. మెత్తటి, ఒత్తయిన నీ జుట్టు మీద ఆన. నేను కవిత్వము వ్రాయను, వ్రాయను కాక వ్రాయ.”
అని ప్రతిజ్ఙ చేసితిని. మంగళం మహత్. మీకు శుభమగు గాక.                                


చివర మాట:   స్నేహ సమాఖ్య, South end park, L. B. Nagar, Hyderabad, వారి Souvenir, 2007,   లిఖిత   లో మిత్రులు శ్రీ యస్. వి. యస్. యమ్. శాస్త్రి గారి  రచన  కవితా రమణీయం    నుంచి యధేచ్చగా గ్రంధ చౌర్యం చేయడమైనది అని ఇందుమూలంగా తెలియపరచడమైనదహో.  

రైలు ప్రయాణం లో ఒక కధ

ఒకచేతిలో సూటు కేసు, భుజానికి ఒక బాగు  తగిలించుకొని,  ఇంకో  చేతిలో తెలుగు పత్రికల తోటి హౌరా లో మద్రాస్ మెయిల్ ఎక్కాను.  బెర్తు వెతుక్కొని  సీటులో కూర్చున్నాను. ఎదురుగుండా ఒక తెలుగు కుటుంబం,  పక్కన తమిళ తంబులు ఇద్దరు. తెలుగాయన, భార్య , ఒక అమ్మాయి 10-11 ఏళ్ళు ఉంటాయి. ఆయనకి సుమారు 45 ఏళ్ళు  ఉంటాయి. పక్క బెర్తు లో కూడా ఇద్దరు తెలుగు వాళ్ళు,  భార్యా,   భర్త అనుకుంటాను. చాలా సీరియస్సు గా ఇంటి విషయాలు మాట్లాడుకుంటున్నారు.   ఒక పదినిముషాలు  గడిచాయి. రైలు బయల్దేరింది. ఎదురబెర్తు ఆయన మొదలుపెట్టాడు

నాయనా నీ పేరు ఏమిటి

జంబులింగం అంటారండి

ఆయన ఒకింత ఆశ్చర్య పడ్డాడు.

అదేమిటి చార్ట్ లో ప్రద్యుమ్నుడు   అని ఉంది.  

ఆయన దగ్గర టికెట్ కొనుక్కున్నానండి.  200 ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది.

200 అని మళ్ళీ ఆశ్చర్య పడ్డాడు ఆయన. నేనో చిరునవ్వు నవ్వాను.

తప్పదు కదండీ ఆర్జంటు గా వచ్చి  వెళ్లాల్సిన అవసరం పడింది.

మళ్ళీ ఇంకో 5 నిముషాలు నిశ్శబ్దం మా మధ్య. తమిళ తంబిలు లొడ లొడ మని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మన కధ కి అప్రస్తుతం కాబట్టి వదిలేద్దాం వాళ్ళని.

200 ట భార్యకి చెప్పి మళ్ళీ ఆశ్చర్య పడ్డాడు ఆయన. ఆవిడ  ఏమి మాట్లాడలేదు.

పెళ్లయిందా బాబూ ఈ మాటు ఆవిడ అడిగింది.

అయిందండి. ఇద్దరు పిల్లలు కూడా.

చిన్న పిల్లలు అనుకుంటాను. అంది ఆవిడ

చిన్న అంటే అమ్మాయికి 15 ఏళ్ళు అబ్బాయికి 12 ఏళ్ళు

15 ఏళ్ళా ఈ మాటు ఇద్దరు కలిసి ఆశ్చర్య పడ్డారు.

నీ వయసు ఎంత బాబూ ఆయన అడిగాడు.

32 అండి జుట్టుకు రంగు వేస్తాను కాబట్టి చిన్నగా కనిపిస్తానండి

జుట్టుకు రంగు వేస్తావా?    డబుల్   ఆశ్చర్యపడ్డాడు  ఆయన

16 వ  ఏట పెళ్లి అయితే  25 ఏళ్ళకి జుట్టు తెల్లబడిపోతుంది కదండీ  అని నవ్వాను.

16 వ ఏట పెళ్ళా ? మీ ఆవిడ వయసు ఎంత బాబు,   ఈ మాటు  ఆవిడ ఆశ్చర్య పడి అడిగింది  

34 అండి నా  కన్నా రెండేళ్ళు పెద్ద.

ఈ మాటు ఇద్దరూ  తేరుకోవటానికి  ఒక పదినిముషాలు పట్టింది.

అబ్బాయి జోక్ చేస్తున్నాడు అంది ఆవిడ నీరసం గా నవ్వటానికి ప్రయత్నిస్తూ. 

జోక్ చెయ్యాల్సిన అవసరం నాకేమిటి, మీరెవరో  నేనెవరో,  మీ తోటి జోక్ ఎందుకు చేస్తాను,  చాలా సీరియస్ గా అన్నాను.

అంటే రెండేళ్ళు పెద్ద అంటున్నావు, 15 ఏళ్ల కూతురు అంటున్నావు,   కొద్దిగా ఆశ్చర్యం గా ఉంది బాబూ అంతే,  నమ్మక పోవడం కాదు,    అని నొచ్చుకున్నట్టుగా అంది ఆవిడ.

మాది ప్రేమ వివాహం అండి.

16 ఏళ్ళకి ప్రేమ వివాహమా ? ఏం చదువుకున్నావు బాబూ నువ్వు,  ఆయన అడిగాడు.    

నేను పెద్దగా చదువుకోలేదండి.  4th. ఫామ్ తప్పగానే మా నాన్న నన్ను వాళ్ళ కొట్లో పనికి కుదిర్చాడండి. వాళ్ళ ఇంట్లో కింద కొట్టు,  పైన వాళ్ళు ఉండేవారండి. ఆ విధం గా ఒక రెండేళ్ళు గడిచేటప్పటికి మా ప్రేమ సంగతి తెలిసి పోయిందండి వాళ్ళ ఇంట్లో. నన్ను పనిలోంచి తీసేశారండి. కొట్టించారండి. ఆ అమ్మాయి ఇంట్లోంచి వచ్చేసిందండి.   

 నీకు 14 ఏళ్లకే ఫ్రేమించడం తెలిసిపోయిందన్నమాట.

14 ఏళ్ల కి కాదండి. నేను వాళ్ళ కొట్లో చేరిన ఒక 7,8 నెలలకి మొదలయ్యింది ఇష్టం,  ఆ తరువాత ప్రేమ,  అలా జరిగిపోయిందండి. 1965 లో పెళ్లి చేసుకున్నామండి.  

ఆ అమ్మాయి ఇంట్లోంచి వచ్చేస్తే వాళ్ళు ఊరుకున్నారా,  ఆవిడ అనుమానం గా అడిగింది.   

ఎందుకు ఊరుకుంటారండి.  నానా గొడవ చేశారండి.  మమ్మలని చంపైనా వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లిపోదామని ప్లాను చేశారండి. కానీ అమ్మాయి కడుపుతో ఉందని తెలిసి ఆగిపోయారండి. పరువు పోతుందని భయపడ్డారనుకుంటానండి,  కడుపుతో  ఉందని నలుగురికి తెలిస్తే .     

కడుపు తోటా  అంటూ ఈ మాటు మళ్ళీ ఇద్దరూ ఆశ్చర్యపడి కింద పడి పోయారు. ఇంతలో  వింటున్న పక్క బెర్తుల తెలుగువాళ్లు కూడా  ఇటు వైపు చర్చకు వచ్చేశారు .

ఏమిటో అల్లా జరిగిపోయిందండి  మాకు తెలియకుండానే,   అమాయకత్వం ధ్వనించింది నా గొంతులో.

ఇంతకీ అమ్మాయి ఏం చదివిందో,  కొంచెం వెటకారం గా పక్క బెర్తు తెలుగావిడ.

SSLC   తప్పిందండి. తప్పడం,  ఆ కాలం లో ఆవిడకు అలవాటు అనుకుంటానండి . రెండు మాట్లు SSLC తప్పిందండి. ఒక మాటు హింది ప్రాధమిక కూడా తప్పిందండి. పెళ్లి కాకుండానే నెల కూడా  తప్పిందండి.

మళ్ళీ కొన్ని నిముషాలు నిశ్శబ్దం. ఏం మాట్లాడాలో ఎవరికి తెలియ లేదు అనుకుంటాను. నేను కొంచెం ఎక్కువ మాట్లాడేనేమోనని నాకే అనుమానం వచ్చింది.  

ఇంతకీ ఏం చేస్తుంటావు నాయనా,  నువ్వు,  పక్క బెర్తు ఆయన.

మా కొక,   ప్లాస్టిక్ సామాను,  రబ్బర్ వస్తువులు, ఆటవస్తువులు, ఫాన్సీ వస్తువులు   మొదలైన  హోలు సేలు అండ్ రిటైలు  షాపు ఉందండి. బాగానే నడుస్తోందండి. ఇక్కడ అంటే కలకత్తా లోనూ,  బొంబాయిలోనూ  కొని అమ్ముతామండి మా ఊళ్ళో. ప్రతి నెలా ఇక్కడికి,  బొంబాయికి వెళ్ళి   వస్తూ ఉంటానండి.  నెలకి ఒక 30 40   వేలు మిగులుతాయండి ఖర్చులు పోను. ఏదో సాగిపోతోందండి సంసారం .

ఇంతకీ మీ అత్తగారింట్లో  ఒప్పుకున్నారా ఇప్పుడైనా,   పక్క బెర్తు ఆవిడ. నువ్వు కాస్తా మీరు కి వచ్చింది ఆవిడ. 30-40 వేల ఆదాయం మహిమ అనుకుంటాను.

నాల్గు  ఏళ్ల తరువాత మా మామగారు వచ్చారండి మా ఇంటికి మా అబ్బాయి పుట్టినప్పుడు. మా అత్తగారు మా అమ్మాయి పుట్టినప్పుడే వచ్చారు.

తల్లి ప్రాణం కదా అంది ఎదురు బెర్తు ఆవిడ.

అవునండి ఆవిడ పేరే పెట్టామండి మా అమ్మాయికి కామేశ్వరి అని.

అబ్బాయికి అని అడిగింది  గడుసుగా పక్క బెర్తు ఆవిడ.

అబ్బాయికి మా మామగారి పేరు పెట్టామండి నారాయణ మూర్తి అని.

మీ అమ్మగారి పేరు  కానీ నాన్న గారి పేరు కానీ  పెట్టలేదన్నమాట మీ పిల్లలకి, అడిగాడు   పక్క  బెర్తు ఆయన. ఆయనకి నామీద కోపమెందుకో అర్ధం కాలేదు నాకు.

మా అత్తగారు చెబితే వాళ్ళ నాన్న గారు  అంటే  మా ఆవిడ తాతగారు,   సహాయం చేశారండి మాకు మొదటినించి. కాపురం పెట్టడానికి,  ఆ పైన వ్యాపారం పెట్టడానికి. రెండు మూడేళ్ళ తరువాత  మా మామగారు కూడా వాళ్ళ మామ గారి ద్వారా సహాయం చేశారండి  వ్యాపారం పెరగడానికి .   అందుకని వాళ్ళ పేర్లు పెట్టడం నా ధర్మం అనుకున్నానండి.  మా షాపు పేరు కూడా జంబులింగం అండ్ ఫాదర్ ఇన్ లా అనే పెట్టానండి.

ఈ మాటు పక్క బెర్తుల తెలుగువాళ్లు కూడా కింద పడిపోయారు. వాళ్ళు లేవడానికి కొంచెం టైమ్ పట్టింది.

ఫలానా అండ్ సన్స్ విన్నాం , ఫలానా అండ్ బ్రదర్స్  విన్నాం కానీ ఫాదర్ ఇన్ లా అని  షాపు పేరు  ఎప్పుడూ వినలేదు నాయనా అని ఆక్రోశించాడు పక్కబెర్తు ఆయన.

కొత్త వరవడి సృష్టించాడు మంచిదే కదా. విశ్వాసం చూపించాడు  మామ గార్కి  అని సమాధాన పరచింది పక్క బెర్తు ఆవిడ మొగుడిని.  తల్లి తండ్రుల మీద కూడా ఇంత విశ్వాసం ఉందో లేదో తెలుసుకోవాలనుకున్నాడు ఆయన.    

మరి మీ అమ్మా నాన్న మీతోటే ఉంటారా,  అడిగేశాడు తెగించి  పక్క బెర్తు ఆయన.  

లేదండీ వాళ్ళు మా అన్నయ్య వాళ్ల తోటి ఉంటారు. అప్పుడప్పుడు నేనూ కొంత సహాయం చేస్తానండి . అంతే అంతకు మించి ఏమీలేదండీ. ఇప్పుడు నేను వీళ్లమీదే ఆధార పడ్డాను కదండీ.  వీళ్ళు చెప్పినట్టే వినాలి కదండీ. 

పోనీ నాయనా నిజం ఒప్పుకున్నావు. అయినా అమ్మా నాన్నలని ఎవరు చూస్తున్నారు ఈ రోజులలో,  పక్క బెర్తుకి నామీద కోపం పెరుగుతోంది ఎందుకో.    

ఇంక పడుకుందామా తెల్లారి మాట్లాడుకోవచ్చు అంటూ ఎదురు బెర్తు ఆయన,  కుటుంబం నిద్రకు ఉపక్రమించారు .   నేనూ కొంచెం సేపు పత్రికలు చూసి నిద్ర పోయాను.

తెల్లారి నేను లేచేటప్పటికి వేడి వేడి గా రాజకీయాల మీద చర్చ జరుగుతోంది.  నా సంగతి అందరూ మర్చిపోయినట్టు కనిపించారు. కానీ వారి చూపుల్లో నేనంటే అయిష్టత కనిపించింది. నా తోటి మళ్ళీ ఎవరూ కల్పించుకొని మాట్లాడలేదు. నేను పలకరిస్తే అవసరమైనంత వరకే సమాధానం చెప్పారు. పక్క బెర్తు వాళ్ళు రాజమండ్రి లో దిగిపోయారు,   నేను విజయవాడ లో దిగిపోయాను . వీళ్లలో మళ్ళీ ఎవరిని కలుసు కుంటానని నేను అనుకోలేదు. వాళ్ళు ఎప్పుడూ మళ్ళీ తారస పడలేదు.   నేను ఆ  సంగతి మర్చిపోయాను.

నా మాట :  కొద్ది రోజుల క్రితం   కావ్య గారి బ్లాగు  'నా పరిధి దాటి' లో   ఆవిడ వ్రాసిన టపా 
వయసు - జీతం    అక్కడ  కామెంట్లు   చదివాను .  రైల్లో పక్కవాళ్ళ ప్రశ్నలు కొన్ని మనకి చిరాకు,  కొండోకచో ఇబ్బంది కలిగిస్తుంటాయి. మనమే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగే  కధ అల్లితే  ఎల్లా ఉంటుందా అనిపించింది .   సో కావ్య గార్కి  థాంక్స్. కావ్య గారి కధకి ఇది నా కామెంటు అన్నమాట. 
  
అప్పుడప్పుడు రైలు ప్రయాణాలలో కధలల్లడం కూడా  సరదా గానే ఉంటుందేమో .  కొంచెం అసహజంగాను, నమ్మలేనిది  గాను ఉంటే  పక్క వాళ్ళ రియాక్షన్స్ కొట్ట వచ్చినట్టు కనబడవచ్చు.  ఈ  కధ లో  వాళ్ళ స్పందన  ఆశ్చర్యం కలిగించిందా?  ఎదురు బెర్తు వాళ్ళు ముందర నమ్మినట్టు లేదు కానీ ఆతరువాత నమ్మారో,  నమ్మినట్టు నటించారో  కానీ జంబులింగం వ్యవహారం వారికి నచ్చలేదు అని అర్ధం అయింది. కానీ ముక్కు మొహం తెలియని అతని మీద  కోపం వచ్చిందని  అనుకోలేము .   సగటు మనిషి బహుశా అంతే నేమో.  పక్క బెర్తు ఆయనికి  జంబులింగం  మీద కోపం,  కోపమే కాదు కొంచెం అసహ్యం అని కూడా అనిపించవచ్చు .  బహుశా తప్పు చేసినా బాగు పడ్డాడేమో అన్న అసహనం వల్ల కావచ్చు. 

ఇంతకీ ఎల్లా ఉంది నమ్మ శక్యం గా ఉందా?  లేకపోతే నీ జిమ్మడా , దొంగకోళ్ళ మొహం గాడా అంటారా ?   

        

ఈ రోజు బ్లాగులో నా 239 వ దినం, వచ్చి నాల్గు అక్షంతలు వేసి వెళ్ళండి.

గమనిక : - మొదట ఈ టపా ఫిబ్రవరి 7, 2011 న పబ్లిష్ చేశాను. కానీ ఆ మధ్యన నా పొరపాటు వల్ల ఈ టపా డిలీట్ అయింది. టపాతో పాటు కామెంట్లు కూడా పోయాయి....