నా చివరి క్షణాలు

ఓర్నాయనోయ్, విషాదంగా ఆ ఫోజేమిటి మీరు. కర్చీఫు ఎందుకు తీశారు. కళ్ళు ఎందుకు తుడుచుకుంటున్నారు. జేబురుమాలు ఎందుకు తడుపుతున్నారు. దుఃఖంగా , దీనంగా, ఏడుస్తున్నట్టు  నటిస్తూ  శ్రద్ధాంజలి ఘటించెయ్యడానికి  లైను  లో  వచ్చేస్తున్నారు. 

వద్దు అంత శ్రమ పడకండి. చివరి క్షణాలు  అంటే ఆ చివరి క్షణాలు  కాదు,  మామూలు చివర క్షణాలు అన్నమాట.  అయోమయంగా చూడకండి.  Let me explain.  

నేను మా బామ్మర్ది పెళ్ళికి వెళ్ళాలి. రైలు రిజెర్వేషను అది చేయించేశాను ముందు గానే. 

కానీ మా బాసాసురుడు శలవా అని ఏడ్చేడు. నన్ను టెంషను పెట్టేడు. సరిగ్గా ఓ నాలుగు రోజులు ముందు కళ్ళు తుడుచు కొని సరే ఓ పది రోజులకి వెళ్ళిరా అని దయతలచాడు. 

దూరభారం వల్ల మా ఆవిడని ముందు పంపడం కుదరలేదు. బయల్దేరడానికి ఇంకోరోజు మాత్రమే ఉంది.  హడావడిగా కొనాల్సిన వన్నీ కొనేశాను,  క్షమించాలి అచ్చు తప్పు, కొనిపించేసింది . 

బయల్దేరే రోజున మా ఆవిడవి ఓ ఏభై చీరలు, పిల్లలవి ఓ పాతిక జతలు సర్దేసిన తర్వాత పెట్టెల్లో మిగలని  ఖాళీ లో  నావి కూడా రెండు జతలు కుక్కి వాటి మీద డాన్స్  చేసి మూత  పెట్టి ఊపిరి పీల్చుకున్నాను. 

నేను సర్దుతున్నంత  సేపు  ఆవిడ విలాసంగా కుర్చీలో కూర్చుని కాళ్ళు ఊపుతూ, జంతికలో చేగోడీ లో కరకర నములుతూ 
“గులాబీ అంచు చీర స్నాతకానికి కట్టుకోవాలి అదిపైన పెట్టండి. ఆ బ్లూ కలరు  చీర భోజనాలప్పుడు కట్టుకోవాలి. అది స్నాతకం కింద పెట్టండి.” 
అంటూ సలహాలు పడేస్తూ నా సహనాన్ని పరీక్షించింది. 

మొత్తం మీద రెండు సూటుకేసులు, రెండు బేగులు , మంచి నీళ్ళ బాటిలు అన్నీ సర్దే టప్పటికి ముహూర్తం ముంచుకొచ్చింది.

పరిగెత్తికెళ్లి  ఆటోని పిలుచు కొచ్చాను. ఆటో రాగానే పిల్లలు ఎక్కేశారు. ఆ తరవాత మా గజగమన కూడా అల్లనల్లన మెల్లమెల్లగా ఆటో ఎక్కేసింది. 

నేను వీధి తలుపు తాళం వేసి రెండు మాట్లు  లాగి చూసి, అటూ ఇటూ  చూసి, ఎవరూ చూడటం లేదని, తాళం పట్టుకొని వేళ్ళాడి, పడిందని నిర్ధారించుకొని, ఆటో ఎక్కి బయల్దేరు, బయల్దేరు అన్నాను. 

నాకున్న తొందర వాడికెందుకు ఉంటుంది. తాపీగా వారు ఆ ఇనపరాడు పైకి లాగాడు. ఆటో  డుర్ మని ఊరుకుంది.  వారు మళ్ళీ లాగారు. మళ్ళీ డుర్ మంది. వారు దిగి వెనక్కి వెళ్ళి ఓ తాపు తన్ని వచ్చారు. తీరుబడిగా సిగరెట్టు వెలిగించుకొని మళ్ళీ ఇనుపరాడు లాగాడు. ఈ మాటు డుర్  డుర్ డుర్ మని ఆగిపోయింది. 

మా ఆవిడ నాకేసి క్రోధం గా, ఒక మంచి ఆటో కూడా తీసుకురాలేని చవట దద్దమ్మ అన్నట్టు చూసింది. నాకు చెమటలు పట్టేస్తున్నాయి. లావొక్కింతయు  లేదు, ఎవనిచే  జనించు, కానరార  కైలాస  నివాస, అంటూ పద్యాలు, పాటలు పాడుకుంటున్నాను  లోలోపల. 

ఇంతలో ఆటో స్టార్ట్ అయింది. నేను రైట్ రైట్ అన్నాను. వారు  గేరు మార్చి  స్పీడ్ అందుకొనేటప్పుడు,  చివరి  క్షణం లో గుర్తుకు వచ్చింది. 

రైల్ టికెట్లు  బీరువాలో  దొంగ  అర లో భద్రము గా ఉన్నాయని.


ఇంకామీ బల్బ్ వెలగలేదా. మీకర్ధం అయే సినిమా భాషలో చెప్తాను. ఇనుకోండి కాదు కాదు సదూకోండి.


సినిమా లో క్లైమాక్స్ సీను వచ్చేసింది. వీరోయిన్ పరిగెడుతూ ఉంటుంది. ఆవిడెనకాల ఇలన్ పరిగెడుతుంటాడు. ఆళ్ళని తరుముతూ ఈరో పరిగెడు తుంటాడు. ఇంతలో ఇలన్ గారి గూండాలు ఈరో ని అడ్డుకుంటారు. ఈరో ఆళ్ళని కుమ్మేస్తుంటాడు. 

వీరోయిన్ ఊరొదిలి పొలాల వెంబడి పరుగెడుతుంది. ఎందుకంటే, చూసేటోళ్లందరు ఎర్రిబాగులోళ్ళు కాబట్టి. ఈరో  గూండాలని ఉతికి ఆరేసి ఇలన్ గాడి ఎనకాల పడతాడు. ఇప్పుడు వీరోయిన్ పొలాలు వదిలి రైలు కట్ట మీద పరిగెడుతుంది. ఎందుకంటే అది బుఱ్ఱ తక్కువది కాబట్టి. బుఱ్ఱ ఉన్నదయితే హాయిగా ఇలన్ గాడిని పెళ్లి చేసుకుంటే, దానికి ఆ పరుగు తప్పేది, మనకి తలనొప్పి తగ్గేది. 

ఎక్కడో రైలు బోయ్ మంటుంది. అయినా సరే వీరోయిన్ రైలు పట్టాల మధ్యనించే పరిగెడుతుంటుంది. 

మూజిక్ డైరట్రు దడదడ లాడించేస్తుంటాడు.   

ఈరో ఇలన్ కుమ్ముకుంటుంటారు. ధడేల్ మని సిగ్నల్ పడిపోతుంది. 

వీరోయిన్ కాలు రెండు పట్టాల మధ్య ఇరుక్కుపోతుంది.  

మూజిక్ డైరట్రు దడదడ లాడించేస్తుంటాడు.

ఈరో సాచి ఇలన్ ని తన్నుతాడు. 
రైల్ బోయి బోయ్ మంటూ ఉంటుంది. 
వీరోయిన్ ఏడుస్తూ రెండో  కాలు ఎత్తి డాన్సు చేస్తుంటుంది.  

మూజిక్ డైరట్రు దడదడ లాడించేస్తుంటాడు. 

ఈరో ఇలన్ ని ఎగిరి తన్నుతాడు. రైల్ బోయి బోయ్ మంటుంది.  వీరోయిన్ ఏడుస్తూ కాలు డాన్సు చేస్తుంటుంది.   

మూజిక్ డైరట్రు దడదడ లాడించేస్తుంటాడు. 

ఈరో ఇలన్ తలని తన తలతో కుమ్ముతాడు.  రైల్ బోయి బోయ్ మంటుంది. ఈ మాటు వీరోయిన్ చేతి డాన్సు మొదలు పెట్టుతుంది.  

మూజిక్ డైరట్రు దడదడ లాడించేస్తుంటాడు. 

ఈరో ఈరోచితంగా ఇలన్ ని చితక కొట్టి  పక్కన పడేసి వీరోయిన్ దిశగా పరిగెడుతాడు. రైలు ఇప్పుడు దగ్గరగా బోయ్ బోయ్ మంటుంది. వీరోయిన్ చేతి డాన్సు వదలదు.  

మూజిక్ డైరట్రు సౌండ్ పెంచి  దడదడ లాడించేస్తుంటాడు.  

అప్పుడండి, ఇలన్ గార్కి కత్తి దొరుకుతుంది. 

కత్తి ఎక్కడనించి వచ్చిందా, ఇల్లా మీరు కొచ్చెను మీద కొచ్చెను వేసేస్తే నేను కధ చెప్పనంతే. అల్లా సినిమాల్లో వచ్చేస్తాయి. 

అల్లెప్పుడో జానపద సినిమాలో కాంతారావు చేతిలో కత్తి,  రాజనాల  మాంత్రికుడు మాయం చేసేస్తాడు  గదా అది అప్పడినించి గాలిలో తిరుగుతూ, ఇప్పుడు ఇలన్ గారి పక్కన పడిందన్నమాట. 

ఈడు ఆ కత్తి ఇసురుతాడు. అదెల్లి ఈరో నడుం మీద గుచ్చుకుంటుంది. ఈరో కింద పడిపోతాడు. అయినా ఈరో గారు ధైరియంగా పాకడం మొదలు పెట్టుతాడు. 
రైలు ఇప్పుడు మనకి కనిపిస్తుంది బోయ్ బ్బోయ్ అంటూ వచ్చేస్తుంటుంది. 
వీరోయిన్ ఈ మాటు వంగొని కాలు విడిపించుకోటానికి ప్రయత్నిస్తుంది. 

మూ . డై. దడదడ లాడించేస్తుంటాడు. 

ఈరో గారు ఇంకా పాకుతూనే ఉంటాడు. రైలు గారు ఇంకా దగ్గరగా బోయ్  బ్బోయ్ అంటుంటుంది. వీరోయిన్  ఇంకా వంగొనే  ఉంటుంది.  

మూ. డై. దడదడదడ లాడించేస్తుంటాడు.  

ఇప్పుడండి,  ఇజిల్సే ఇజిల్సు,  చివరి క్షణం లో ఈరో గారు నుంచోని, సిగ్నలు రాడ్  ముందుకు లాగి, రైలు ముందరి నించి జంప్ చేసి, వీరోయిన్ మీద పడి, ఇద్దరూ కలసి దొర్లుకుంటూ పొలాల్లో పడిపోతారు. 

ఝుక్ఝుక్ ఝుక్ఝుక్ ఝుక్ అంటూ రైలు వెళ్లి పోతుందన్న మాట. చూసారా మరి చివరి క్షణం మహత్యం.

అమ్మయ్య ఇప్పటికి అర్ధం అయిందా చివరి క్షణం  అంటే ఏమిటో. 


ఆ చివరి క్షణా లే లేకపోతే ఈ దేశం లో ఏమి జరగదు. జరిగేదంతా చివరి  క్షణం లోనే జరుగుతుంది. 

మొన్న మొన్న ఢిల్లీ లో “అందరి సంపద ఆటలు” గురించి ఎంత గొడవ జరిగింది. విదేశీయులందరు ఎన్నెన్ని మాటలు అన్నారు. 
పెధాన మంతిరి గారు, డిల్లీ ముక్కే మంతిరి గారు కంగారు పడి, కోప్పడిపోయారా. చివరి క్షణానికి మనల్లోందరు అన్నీ రెడీ చేసేశారా లేదా. 
ఆటలు  అయింతరువాత,  అంతా బెమ్మాండంగా చేసేశారు అని అందరూ మెచ్చేసుకున్నారా. మరి చివరి క్షణాని కే గదా ఆళ్ళందరూ ఆ పని చేయగలిగారు. 

కాబట్టి జై చివరి క్షణం  జై జై అన్నమాట.


మరి చివరగా ఇంకో చివరి కధ కూడా చెప్పేస్తాను. 

సత్తెపెమానికంగా నిజంగా చివరి ఇషయం. 

మరేంటంటే ఈ చివరి క్షణాలే లేకపోతే ఈ దేశం ఓ గొప్ప విజ్ఞాన వేత్తని కోల్పోయేది. 

నేను ఎం.ఎస్‌సి ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్న రోజులు. మేము చివర మహాత్యం తెలిసిన వాళ్ళం కాబట్టి ఎప్పుడూ చివరి రోజుల్లో చివరి క్షణాల దాకా మాత్రమే చదివే వాళ్ళం. 

ఓ పరీక్ష రోజు నేను కొంచెం బద్ధకంగా,  చివరి క్షణాలలో చదవకుండా, పరీక్షకి  బయల్దేరాను. అప్పుడు  ఆ యొక్క  శ్రీమన్నారాయణుడు  నాముందు కనిపించి 
"నాయనా  Morphine  గురించి చదివావా" అని అడిగాడు. 

అప్పుడు  బుద్ధి తెచ్చుకొని నేను పుస్తకం తెరచి, నడుస్తూ చదువుతూ, చదువుతూ నడుస్తూ, పరీక్ష హాలు కి చేరి, పేపర్ తీసుకొని చూస్తే మొదటి ప్రశ్న అదే ఉంది. చక చక అది వ్రాసేశాను కాబట్టి బొటా బొటీ గా పాసు మార్కులు   వచ్చి పాసు అయ్యాను.  

ఆ తరువాత నేను ఆ డిగ్రీ పట్టుకొని అంచెలంచెలు గా ఈ దేశం గర్వించ దగ్గ సైంటిస్టు గా ఎదిగి పోయానన్నమాట. మీరు కూడా గర్విస్తున్నారా?


దీని  నీతి  ఏమిటంటే  చివరి  క్షణంలో  పనులు చేసేవారికి  ఆ  శ్రీమన్నారాయణుడు  కూడా చివరి క్షణం  లో సహాయం చేస్తాడని. 


కాబట్టి ఓ నా దేశ ప్రజలారా/ తోటి బ్లాగర్లారా/అంతర్జాల చదువర్లారా,  మీరందరూ కూడా ప్రతిదీ  చివరి క్షణం  లోనే చేసి, ఆ యొక్క  శ్రీమన్నారాయణుడి కృప కి పాత్రులు కండి చివరాఖరికి.     


ముఖ్య గమనిక :  ఇది  చదివిన  వారికి,  విన్నవారికి  కూడా  ఆ యొక్క శ్రీమన్నారాయణుడు సకల సంపదలు, ఆయురారోగ్యాలు, మీరు  ఏం చదివినా, చదవకపోయినా,  ఓ సాఫ్ట్ వేరు ఉద్యోగం, అన్నిటికన్నా ముఖ్యంగా మీ ఆజ్ఞాను సారంగా మీ మాట వినే సద్బుద్ధి  మీ ఆవిడ/ఆయన  కి, ప్రసాదిస్తాడు. 

మీరు ఇది చదవడమే కాదు, మీ తోటి వారితో కూడా చదివించి కృతార్ధులు కండి. 


ఇంకో  గమనిక: ఇది మొదటి మాటు ఈ బ్లాగులో 16/12/2010 న పబ్లిష్ చేశాను. ఇప్పుడు ఇంకో మారు.