బ్లాగోకంలో ఆమధ్యన కొందరు “నేను మహా మేధావిని, కాదంటే కోస్తా బిడ్డా, భ్యుహహ్హ” అని సవాల్ చేసారు. ఇంకొందరు “నేను లెజండు నే , కాదనే ధైర్యం ఉన్నవాళ్ళు
నా ముందుకు రండి. మీ సంగతి తేలుస్తా” అని తొడ గొట్టేరు. లెజండులు, మహా మేధావులు మధ్య తేడా
నాకు తెలియదు. వారి స్థాయికి ఎదగ లేక
పోయినా కనీసం మేధావి అనే నా అనిపించు కోవాలని కోరిక మొదలయింది. దురద ప్రారంభమయింది. జాలిం లోషన్లు పని
చెయ్యలేదు. నెత్తి మీద జుట్టు, మూతి మీద మీసం లేవు కానీ
నాకేం తక్కువ అని ధైర్యం చెప్పుకున్నాను. కోరికయితే ప్రజ్వలిస్తోంది
కానీ మేధావి ననిపించు కోవడం ఎలా అనే
అనుమానం పొడచూపింది.
మేధావి అనగా ఎవరూ అని గూగులయ్యని అడిగాను. 43,000 results in 0.25
sec. అన్నాడు. అవి చదివే ఓపిక, సమయం లేకపోయాయి. నిఘంటువుని అడిగాను.
చిలుక, మేధ కలవాడు, A wit, సూక్ష్మ బుద్ధి కలవాడు, ధీమంతుడు అని చెప్పింది. చిలుక అన్న అర్ధం నాకు నచ్చింది.
నాలాగే చాలా మంది చిలుకలు బ్లాగోకం లో వీర విహారం చేస్తున్నాయి ముఖ్యం గా
కామెంట్ల విభాగం లో. టపా కెవ్వు, కేక . సూపర్, అద్భుతం, brilliant, చాలా బాగుంది ఇత్యాదులు చిలుక పలుకుల కామెంట్లు పెట్టేస్తుంటాము. ఎవరు ఏమి వ్రాసినా అంతే. నిఘంటువు ప్రకారం మేధావులయినా,
చిలుకల్ని మేధావులుగా ఎవరూ గుర్తించరు. Wit అనగా హాస్యం, చమత్కారం అని నిఘంటువు అర్ధం చెబుతుంది కానీ
బ్లాగుల్లో హాస్యం వ్రాసే వాళ్ళని జోకర్స్ గానే చూస్తారు కానీ మేధావులు గా
పరిగణించరు. ఇంకేమి చేయవలె అని
ఆలోచించాను.
అసలు ఎన్ని రకాల మేధావులు ఉన్నారు, వారి గుణ గణములు ఏమి
అని తెలుసుకొన గోరి బ్లాగోకాన్ని క్షుణ్ణంగా, నిశితంగా పరిశీలించాను. చాలా మంది మేధావులు అనుచర
గణాలతో బ్లాగోకం లో తమ ఉనికి ని చాటుకుంటూ విహరిస్తున్నారు. ఆశ్చర్యమాశ్చర్యము, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. అందరిని కాకపోయినా కొందరు
మేధావులను హృదయారవిందమున చూచి బ్రహ్మానంద
మనుభవించాను. ఏదో ఒక రకం మేధావిని
అని అనిపించుకునే అవకాశాలు కనిపించాయి.
బ్లాగోకం లో నాకు బాగా నచ్చిన వారు సినీ మేధావులు. మొదటి ఆట చూసేసి వెంటనే, నేనా
సినిమా చూసేసానోచ్ అంటూ సమీక్షలు వ్రాసేవారు ఒక రకం మేధావులు. సినిమా కధతో పాటు దర్శకుడి
ప్రతిభను వర్ణిస్తూ, కెమేరా మేన్ కన్నుల్లోంచి కుంగిపోతున్న
ఆకాశాన్ని, ఎగిసి పడుతున్న అలల్ని చూసి వహ్వ అంటూ ఆనంద పారవశ్యం
చెందుతారు. ఫోటోగ్రఫి ని శ్లాఘిస్తూ, సహజత్వాన్ని కన్నులకు
కట్టినట్టు భారీ సెట్టింగ్లకి రూపకల్పన చేసిన కళా దర్శకుడిని నుతిస్తూ, పాత రాగాలనే కొత్త బాణీ లతో కాపీ కొట్టినట్టు
కూడా తెలియకుండా దరువుల ధ్వని లో సాహిత్యానికి మంగళం పాడేసిన సంగీత దర్శకుడి ని
ఆకాశానికి ఎత్తేస్తూ, సాహిత్య మధనం చేసి హాలాహలాన్ని
సృష్టించిన పాటల, మాటల రచయితలకు జేజే లు పలుకుతూ ఇట్టే వ్రాసి పాడేస్తారు
సమీక్ష. నిర్మాత ఖర్చుపెట్టిన ప్రతీ పైసా వసూలు అవుతుందని ఢంకా
మోగించి మరీ చెప్పేస్తారు. కొంతమంది సినీ మేధావులకి
అంతగా ఏది నచ్చదు. “ఇటువంటి సినిమాలు ఎందుకు తీస్తారో అర్ధం కాదు. కధ లేదు, దర్శకుడికి ఎలా చెప్పాలో
తెలియదు, ఈ సంగీత దర్శకుడికి అసలు స్వరజ్ఞానమే లేదు” అంటూ
ఏకేస్తారు. మరి కొందరు మొహమాటానికి పోయి, “ఒక మాటు చూడవచ్చు ఫరవాలేదు రెండు మూడు మాట్లు చూడఖ్ఖర్లేదు”
అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. సమీక్షకుడి అభిప్రాయాలు
అతని స్వంత ఇష్టా ఇష్టాల మీద ఎక్కువుగా ఆధారపడి ఉంటాయి. అంటే అతని అభిమాన నటుడు, దర్శకుడు, మొదలైన వారి సినిమాలైతే ఆహా
అంటారు లేకపోతె పెదవి విరిచేయ వచ్చు. ఈ సమీక్షల్లో ఒక ప్రామాణికత
వెతకడం దండుగ. ఈ అభిప్రాయం నేను చెప్పిన
తరువాత నేను సినీ మేధావిని కాలేను అని తేలిపోయింది.
దొరికిన కూరగాయ నైనా, ఆకు కూరనైనా అనేక రకములైన
చిత్ర హింసలకు గురిచేస్తూ దేశి పద్ధతుల్లో విదేశీ మసాలాలు కూరి కొంగొత్త పేర్లతో
ఆవిష్కరించి, అందంగా అలంకరించి కూర ఏదో, అలంకారం ఏదో కూడా తెలియకుండా వండి
పాడేసే మేధావులు ఇంకో రకం. సాధారణం గా ఈ వంటల్లో విదేశీ వాసనలు ఎక్కువుగా గుప్పిస్తారు.
కొత్తి మీరా, పసుపు, చింతపండు, అల్లం మొదలైనవి వాడరు. టామరిన్, టర్మెరిక్, కొరైండర్ ఇత్యాదులు ఎక్కువుగా వాడుతారు.
బ్రింజాలు, లేడీఫింగరు, మేంగో కాయ,
మూంగ్ దాలు, చెనా దాలు లు ఉపయోగిస్తారు. ఇవన్నీ ఉపయోగించి కూడా ఆంధ్రా వంటకం అంటారు. పక్కవాడికి తినిపించిన తరువాతే
తిను బిడ్డా అనే హెచ్చెరిక తో పాటు (కడుపు మంట) జఠరాగ్నిని రగిల్చేవారు కొందరు.
అరటి కాయ తో అరవై రకాలు అంటూ అరటి హల్వా, అరటి పులావ్, అరటి చట్నీ, అరటి పువ్వు కూర , అరటి దూట చట్ని అంటూ
అరటి పురాణం వ్రాసేస్తారు. మొన్న మిగిలిన చట్నీని,
నిన్న మిగిలిన కూరని, ఈ వేళ సాంబారు గా మార్చి మీ ఆయన నోట్లో పోయడం ఎలా అంటూ క్లాసులు తీసుకుంటారు. భీమ
బలులు,
దమయంతి నాధులు కూడా వంటల టపాలు వేసేస్తారు. తినడమే కానీ వండడం అసలు రాని నేను ఈ రంగం లో పనికి రాను.
ఆ తోట ఆ తోపు ఆకు పచ్చని గూడు
ఆవంక గోరువంక ఎన్నో ఉన్నాయిలే
మా ఊరి గుడి పైన మసలి వచ్చే ఓ మేఘమాలా
మా పెరటి దవనాల వాసన వెదజల్లి పోవా
అంటూ పాడుకుంటూ, మా ఊరు, మా నేల, మా గాలి, మా నింగి అని నిట్టూరుస్తూ,
నోస్టాల్జియా లో కూరుకు పోయే మేధావులు
మరి కొందరు. స్వ ప్రదేశ భ్రాంతి అనండి, ఇంటిపై చింత అనండి, వీరు ఒక కంట విషాదం మరో కంట ఆనందం ఒలికిస్తూ గత స్మృతుల్లోకి జారిపోతారు. చిన్నతనం లో
వారింటికి వచ్చి ఉత్తరాలు ఇచ్చే తపాలా మనిషి, వాళ్ళ ఇంటి చాకలి, పనిమనిషి కూడా వాళ్ళ భ్రాంతి కారకులే. గుళ్ళో ప్రసాదం దగ్గరనుంచి
వాళ్ళ అమ్మమ్మ గారు చేసిన చింతకాయ పచ్చడి దాకా, బళ్ళో మాష్టారు చెప్పిన పాఠాల దగ్గర నుంచి పక్కింటి దుర్గా భవాని పెళ్ళి
ముచ్చట్ల దాకా, పక్కింటి జామకాయల దగ్గర
నుంచి కరణం గారి తోటలో దొంగతనం గా కోసుకున్న మామిడికాయల దాకా ఎన్నెన్నో ముచ్చట్లు, కావేవీ నోస్టాల్జియా కనర్హం. ఈ రకం మేధావులు బహుశా
గుంపులు గుంపులు గా తిరుగుతారేమో. ఒకరు ఒక టపా పెట్టగానే, మాతాత గారి పిలక అంటూ నో, మా మామ మీసం అంటూ నో, మా ఊరి చెరువులో తామర పూలు అంటూ నో మిగతా మేధావులు వాలిపోతారు. నా కిలాంటి జ్ఞాపకాలు లేవు. అందుకని ఈ మార్గం కూడా మూసుకొని పోయింది.
సంగీత మేధావులు, రాజకీయ మేధావులు, పుస్తకాలు కొనుక్కొనే
మేధావులు, చదివిన పుస్తకాల మీద సమీక్ష
లు వ్రాసే మేధావులు ఇల్లా ఇంకా చాలా రకాల మేధావులు చిరు నవ్వులు చిందిస్తూ కలయ
తిరుగుతున్నారు. ఈ రంగాలలో నేను జ్ఞానశూన్యుడను కాబట్టి వారితో చేరే సాహసం చేయలేను. ఇక్కడ కొంచెం వివరణ అవసరం అనుకుంటాను. పుస్తక ప్రదర్సన లలో కొన్న పుస్తకాలు ఓ పాతికో ముఫ్ఫైయ్యో ఫోటో తీసి
మరీ బ్లాగులో పెట్టేస్తారు. నాకు గుండె ఆగిపోతుంది అది చదివి, చూసి . వారసత్వంగా భోషాణంతో సహా సంక్రమించిన గ్రంధాలు తప్ప నేను నా జీవితకాలంలో కొన్న పుస్తకాలేవీ లేవు. అంటే “కొన్నవి” లేవూ అని. మా ఇన్స్టిట్యూట్ లో లైబ్రరి కమిటీ చైర్ మన్ గా ఉన్న కాలం
లో చాలా స్పష్టం గా చెప్పాను మా వాళ్లకి, పాతిక ముప్ఫై వేల కి ఎప్పుడూ అప్రూవల్
కి పెట్టకండి, నా గుండె ఆగి పోతుంది. రోజుకి ఒక ఏడెనిమిది వేల కి పెట్టండి, కావాల్సి వస్తే రోజూ
పెట్టుకోండి అని చెప్పాను. ఇంతకీ, ఇందులో కూడా నేను రికమెండేడ్ ఫర్ అప్రూవల్ అని సంతకం పెట్టడమే. నా పై వాడే సాంక్షన్ చేసేవాడు. దానికే నా గుండె డ్ఢాం అనేది.
పండిత ప్రకాండులు, కవి పుంగవుల గ్రూపు లో చేరి
పండిత మేధావి అనిపించుకుందాం అని ప్రయత్నించాను. సమస్యా పూరణం ఒకటి రెండు మాట్లు
ప్రయత్నించాను. అబ్బే కుదరలేదు ఎంత
ప్రయత్నించినా. ఓ శాలువా కూడా
కొనుక్కున్నాను గుంపులో జేరిపోదామని, కానీ ఎవరైనా గుర్తుపట్టి, కుపండితా
“కోడిన్ దినె భూసురుండు సురలోకాంగనాలింగనా
మైమరపునన్”, పూరించు అంటే నా
గతేం కావాలి అని ఊరుకున్నాను. కానీ ఎప్పటికైనా ఓ సమస్య పూరించ లేక పోతానా, కామెంటు పెట్టక పోతానా? చూద్దాం. కానీ ప్రస్థుతానికి ఇది
అయ్యేపని కాదు.
అప్పుడప్పుడు బుర్ర లోని గుజ్జు ని
తుంగలో తొక్కి నార తీసి నెలకి ఒక టపా వేసుకొనే నాలాంటి జోకర్ కి ఎప్పటికీ మేధావిని అనిపించు కునే భాగ్యం లేదా
అని విచారించాను. కోరిక వదిలేద్దామను
కున్నప్పుడల్లా దురద ఎక్కువయి పోయేది. “అరువు తెచ్చుకొని,
తిరిగి ఇవ్వకుండా, అప్పుడప్పుడు పుస్తకాలు చదువుతావు కదా,
ఓ సమీక్ష వ్రాసి పడేయి” అని సలహా
ఇచ్చింది అర్ధాంగి.
సరే నని కొన్ని పుస్తక సమీక్షలు
జాగ్రత్తగా చదివాను. అబ్బే అర్ధం కాలేదు. వీళ్ళు నిజం గా మేధావులే
అనుకున్నాను. లైను కి లైను కి మధ్య నిగూఢార్ధాలు వెతకడం మన
చేత కాని పని. పుస్తకాలు చదివినా, వాటిలోని పాత్రల మనస్థత్వాన్ని
అంచనా వేయడం మన వల్ల కాదు. కధ, కధనం, శైలి లాంటివి మనకి కొరుకుడు
పడవు.
చదివిన తరువాత బుర్ర పెట్టి ఆలోచించడం అలవాటు లేదు.
ఏం చెయ్యాలి అని మళ్ళీ ఆలోచించాను. వెను వెంటనే
బుర్రలో కిరసనాయిలు దీపం వెలిగింది. చిన్నప్పుడు స్కూల్లో వ్రాసిన వ్యాసం
గుర్తుకు వచ్చింది. ధర్మ రాజు వ్యక్తిత్వము ను
వర్ణింపుము? సుయోధనుని స్వభావము
విశదీకరింపుము? 15 మార్కుల ప్రశ్న లు. కనీసం ఒక పేజీ వ్రాయకపోతే మేష్టారు ఒప్పుకొనే వారు కాదు. ఒక పేజీ వ్రాస్తే 5,6 మార్కులు , రెండు పేజీలు వ్రాస్తే 10,11 మార్కులు ఇచ్చేవారు. అంతకన్నా మా క్లాసు లో ఎప్పుడు ఎక్కువ
రాలేదు. ఇవి వ్రాసేటప్పుడు నా
బుద్ధి వికసించేది, తెలివి అత్యున్నత స్థాయి కి
వెళ్లి పోయేది.
ధర్మరాజు శాంతమూర్తి. మృదు స్వభావి. ధర్మాధర్మ విచక్షణ కలవాడు
అందుకనే అతనిని ధర్మరాజు అనేవారు. అసలు పేరు యుధిష్టరుడు. అతను భీమార్జున నకుల
సహదేవులకు అన్నగారు. వారు ఇతని సోదరులు. భీమార్జునులు మహా
బలవంతులైనను ఇతని చెప్పుచేతలలో ఉండెడివారు. అన్నగారనిన వారికి అనురాగము, ప్రేమ, వాత్సల్యము మెండుగా యుండెడివి. ఇంత ప్రేమ బడయుట అతని వ్యక్తిత్వము వల్లనే కదా. ఇంత గొప్ప వ్యక్తిత్వము గల ధర్మరాజునకు జూదమాడుట యందు కడు
నాశక్తి. జూదమాడినను ధర్మమును వదిలెడు
వాడు కాదు. ధర్మ జూదమే ఆడెడివాడు. జూదమనగా ఆ కాలమున పాచికలతో
నాడెడి వారు. నేటి పేకాటలు నాడు బహుశా
ఉండిఉండవు. ధర్మరాజు పేకాట ఆడినట్టు
ఎక్కడా వ్రాయబడలేదు. పాచికలతోనే ఆడెడి వాడు
అని భారతములో లిఖింప బడినది. ధర్మరాజు
జూద గృహములలో జూదమాడెడి వాడు కాదు. రాజ్య సభల్లోనే నాడెడి వాడు. ఇది అతని వ్యక్తిత్వము లోని
ఔన్నత్యమును సూచించు చున్నది కదా.
ఈ విధంగా ఒక పేజిన్నర వ్రాసేసేవాడిని. కానీ మా తెలుగు మాష్టారు వ్రాయుటలో నా వ్యక్తిత్వమును సహింప జాలక 3,4
మార్కులు మాత్రమే వేసెడి వారు. దానికే నేను సంతోషించెడి వాడను. ఏవిషయం మీదనైనా రెండు
పేజీలు వ్రాయ గలను అనే ధైర్యం వచ్చింది. బుర్ర పెట్టకుండా చదివినా, అర్ధం అయిపోయే పుస్తకాలు ఏమీ అని
సూక్ష్మ బుద్ధితో శోధించాను. మూడు పుస్తకాలు నా దృష్టికి
వచ్చాయి.
1. భారతీయ రైల్వే టైం టేబుల్
2. టెలిఫోన్ డైరక్టరి
3. గంటల పంచాంగం.
మొదటి రెండు పుస్తకాలు ఇప్పుడు ఎక్కువగా
ఉపయోగం లో లేవు. ఏ రైలు ఎక్కడుందో కూడా అంతర్జాలం లో తెలిసి పోతోంది. మొబైల్ ఫోన్ల లో కావాల్సిన నంబర్లు అన్నీ నిక్షిప్తం
చేసుకుంటున్నారు. కాబట్టి వాటి మీద సమీక్ష వ్రాసినా ఎవరూ చదవరు. గంటల పంచాంగం ఉపయోగం చాలా
ఉంది. ఇప్పుడు ఇది చాలా విస్తృతం
గా ఉపయోగిస్తున్నారు. కాబట్టి గంటల పంచాంగం మీదే సమీక్ష వ్రాయాలని
నిర్ణయించుకున్నాను. దీని కోసం నలుగురు
దైవజ్ఞులు చే విరచించ బడిన నాలుగు
పంచాంగాలు చదివాను. నా సమీక్ష మీరు చదవండి.
గంటల పంచాగం వల్ల అనేకానేక ఉపయోగములు కలవు. దశమి వెళ్లి ఏకాదశి ఎప్పుడు వస్తుందో
ఇట్టే తెలుసు కోవచ్చు. ఇంగ్లిష్ కేలండర్లలో లేని ఎన్నో తెలుగు పండగలు ఇందులో ఉంటాయి.
“ఈ వేళ గంగావతరణం శుభదిన
సందర్భంగా వ్రతం చేసుకుంటున్నాను కాబట్టి
ఈ రోజు నాకు శలవు ప్రసాదించండి”
అని పై అధికారిని శలవు అడుగ వచ్చు. ప్రయాణానికి మనమే ముహుర్తములు పెట్టుకోవచ్చు. తారా బలం మొదలైనవి మనమే గుణించేసు కోవచ్చు. అన్నిటి కన్నా ముఖ్యమైనది
మీ రాశి ఫలాలు తెలుసు కోవచ్చు. ఏ నెలలో ఏ (అ)శుభములు గలుగునో ముందుగానే తెలుసుకొని
ఆ ప్రకారము మన కార్యములు జయప్రదం గా నెరవేర్చుకొన వచ్చును.
వివాహాది శుభ కార్యక్రమములకు ముహూర్తములు కూడా పంచాగము
లో ఇవ్వబడును. పెద్దగా పట్టింపు లేనిచో
పెట్టుడు ముహూర్తములు మనమే పెట్టుకొన వచ్చు.
పంచాంగం ఇంటిలో ఉంటే ఇంకా చాలా చాలా మంచి విషయాలు తెలుస్తాయి.
రాత్రి పరుండు నపుడు రుద్రాక్ష మాల కంఠమందుండ
రాదు.
పెరుగును రాత్రి యందు భుజింప రాదు.
సాయంత్రం వేళ వీధి తలుపులు మూసి యుంచరాదు.
ఇత్యాదులు తెలుసుకొన వచ్చును. పంటలు, వర్షాలు, గ్రహణాలు మొదలైన వాటి గురించి
అవగాహన కలిగించు కోవచ్చు. అబ్బే మాకు వీటి మీద
అభిరుచి లేదంటారా , ఫరవాలేదు. గంటల పంచాంగం లో ప్రార్ధనా
శ్లోకాలు ఉంటాయి. ఉదయం లేవగానే పఠించ వలసినవి, మద్యాహ్నం చదువు కోవలసినవి, రాత్రి పరుండు సమయమున
ప్రార్ధించ వలసినవి మొదలగు నవి కూడా ఉంటాయి .
ఇన్ని పంచాగాలు చదివాను కదా? తేడా ఏమైనా ఉందా? ఉంది. పేజీ నంబర్లు మారుతాయి. ఒక దాంట్లో కందాయ ఫలాలు 10 పేజిలో ఉంటే మరోదాంట్లో 22 పేజిలో ఉండవచ్చు. ఒక్కొక్కప్పుడు ముహూర్తములు కూడా మారవచ్చును. ఉదా. // ఒక దాంట్లో, చవితి . ఉ. 4-45 అని ఉంటే, ఇంకోదాంట్లో 4-53 అని, మరొక దాంట్లో 5-08 అని కూడా ఉండవచ్చు. అనగా ఒకో ముహూర్తం ఒకో
పంచాంగం ప్రకారం ఒక 15-20 నిమిషాలు తేడాగా
ఉండే అవకాశాలు ఉన్నాయేమో నని పించింది నాకు. పెళ్ళైన తరువాత మొగుడు దుర్ముహుర్తంలో తాళి కట్టానేమో నని విచారించ వలసిన పని లేదు. ఏదో ఒక పంచాంగం ప్రకారం అది సుముహుర్తమే. అయినను, విజ్ఞుల మాట ప్రకారం, వివాహమునకు సాధారణం గా స్త్రీ రత్నమునకు ఏ
ముహుర్తమైనా సుముహుర్తమే, పురుషరాయికి ఏ ముహుర్తమైనను
దుర్ముహుర్తమే.
ఇచట నుండి స్త్రీ రత్నములు చదువ రాదని
మనవి. పురుష పుంగవులే చదవ వలెను. పెళ్ళైన మగవారికి స్త్రీ రత్న జాతక ప్రభావము అధికముగా నుండవచ్చు. ఇది నా స్వానుభవము. ఒకరోజున నేను ఇంటికి వచ్చే టప్పటికి ప్రభావతి కూని రాగములు తీయుచు, బహు సంతోషముగా నుంది .
దేవి కేలా ఈ ఆనందము అని విచారించాను. గంటల పంచాంగములో బల్లి
శాస్త్రము గురించి కూడా వ్రాస్తారు. ఆ పేజీ తీసి ఒక లైన్ ఆవిడ
ఘట్టిగా చదివింది . బాహువుల యందు భూషణ ప్రాప్తి
అని. నేను తేలికగా తీసి పాడేసాను. కానీ ప్రభావతి ధైర్య
సాహసాలు ప్రదర్శించి ఆ మాటను నిజం చేసింది. ఆ రోజునుంచి మా ఇంట్లో పాములు, తేళ్ళని
యధేచ్చగా సంచరించ నిచ్చేవాడిని కానీ బల్లి కనిపిస్తే సంహరించేవాడిని. మా యావిడ నాకన్ననూ అనేక
రెట్లు తెలివైనదని గ్రహించ వలసి వచ్చింది. రోజు రోజూ నా జాతకము భాగించి తన
జాతకము ను గుణించి ఈ రోజు పంచాంగం ప్రకారము, వినోదం అని ఉంది కాబట్టి సినిమాకి వెళ్ళాలి అనేది. ఈ రోజు విందు భోజనం అని
హోటల్ కి తీసుకెళ్ళేది. నేను గంటల పంచాగం కొనడం
మానేసాను. ఆవిడ కొనడం మొదలు పెట్టింది. ఇటువంటి దుర్ముహూర్తపు
ఘడియలు మీకున్నూ దాపురించే అవకాశం కలదని హెచ్చరించు చున్నాను.
గమనిక : మీరు కోరినచో ఈ
సమీక్ష ను ఇంకో నాలుగు పేజీ లకు పొడిగించ గలను. మీ అభిప్రాయమును తెలియ
పర్చుడు. కామెంటు పెట్టి నేను మేధావినే అని దయ చేసి ఒప్పుకోండి. కామెంటు బాక్స్ కు
వెళ్ళడానికి ముహూర్తం చూడ నఖ్ఖర్లేదు. అక్కడి దాకా వెళ్ళక పొతే రాహు కాలాలు, దుర్ముహుర్తాలు, వర్జ్యం అన్నీ మిమ్మల్ని చుట్టుముట్టేస్తాయి. బహు పరాక్.
ఇది సరదాగా వ్రాసినదే. ఎవరినీ ఉద్దేశించి కాదు అని మనవి
చేసుకుంటున్నాను. ఈ రచన ఎవరికైనా కష్టం కలిగిస్తే పెద్దమనసు తో క్షమించెయ్యండి అని కోరుతున్నాను.
అన్నట్టు మరో విషయం.
నన్నొక పుస్తక సమీక్ష వ్రాయమని అడిగి, పుస్తక సమీక్ష తో కూడిన ఈ రచన ని
చదివి తగు సవరణలు చేసిన కొత్తావకాయ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
గమనిక:- ఈ టపా మొదటి మాటు ఈ బ్లాగులో 02/05/2012 న ప్రచురించ బడినది.
గమనిక:- ఈ టపా మొదటి మాటు ఈ బ్లాగులో 02/05/2012 న ప్రచురించ బడినది.