ఇలా కూడా చేస్తారా?

కాలింగ్ బెల్ మోగి మెలుకవ వచ్చింది. అయినా ప్రద్యుమ్నుడు  లేవలేదు. పక్కనే పడుకున్న ప్రభావతి  లేస్తుందేమో నని చూసాడు. మళ్ళీ మోగింది బెల్. తప్పదనుకొని, ‘ఇంతేరా ఈ జీవితం తిరగని రంగుల రాట్నము’ అని  ఏడుస్తూ   పాడుకుంటూ లేచాడు. కిసుక్కుమన్న శబ్దం వినిపించింది. 

“ఏం చేస్తాం మనకి తప్పదుగా. ఎందుకు తప్పదు అంటే పాలవాడు ఇంకో నిముషం చూసి పాల పాకెట్లు అక్కడే గుమ్మం ముందు పెట్టేసి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిన వెంటనే వీధిలోని కుక్కలు వచ్చేస్తాయి. పాకెట్లని చీల్చి చెండాడుతాయి. అప్పుడు చచ్చినట్లు, అర కిమి నడిచి వెళ్ళి పాల పాకెట్లు తేవాలి. అప్పుడు చావడం కన్నా ఇప్పుడు ఏడవడం మనకి, మన బడ్జెట్కి మంచిది గదా”  అని అనుకొని, వైరాగ్యం తో కూడిన  ఒక నవ్వు నవ్వుకొని  తలుపు తీసి పాల పాకెట్లు అందుకున్నాడు.

“మాయూసి  యోంకా నగుమా హై జీనా,  క్యా రహ గయా హై  ఇస్ జిందగీ మే” అని పాడుకున్నాడు. పాడుకొని,  “ఎలాంటి వాడిని ఎలా అయిపోయాను”  అని నిట్టూర్పుతో కూడిన  ఒక విచార నవ్వు నవ్వు కొన్నాడు ప్రద్యుమ్నుడు మళ్ళీ.  పాల పాకెట్ల లోని పాలు గిన్నెలో పోసి, ఇంకో గిన్నెలో నాలుగు గ్లాసుల నీళ్ళు         పోసిరెండూ   స్టవ్ మీద కెక్కించాడు. వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి,  నోట్లో నీళ్ళు పుక్కిలించి, వేలితో పళ్ళు పరపరా తోమేడు.

ఆగండి, మీరు ఆశ్చర్య పోకండి. ఒకప్పుడు అంటే  ఏడాది  క్రితం దాకా కాల్గేట్ టూత్ బ్రష్, క్లోజప్ టూత్ పేస్ట్ వాడేవాడు ప్రద్యుమ్నుడు  కూడా. దురదృష్టం వెక్కిరించింది. కాలం ప్రద్యుమ్నుడిని  చూసి పకపకా నవ్వింది. మూడేళ్ళ క్రితం,    ఓ దుర్ముహుర్తాన్న,  ఒక పన్ను మళ్ళీ చెపుతున్నా ఒకే పన్ను నొప్పి పెడుతోందని,   ప్రద్యుమ్నుడు తన నోరు తీసుకెళ్ళి ఓ డెంటిస్ట్ చేతిలో పెట్టాడు. వారు ప్రద్యుమ్నుడి  నోరు తెరిచి లోపలికి తొంగి చూసి,

“అబ్బే లాభం లేదు, పళ్ళు పుచ్చిపోయాయి, కొన్ని విరిగిపోయాయి, తీసేయ్యాలి తీసేయ్యాలి” అని సమరోత్సాహుడై పోయాడు.

విధి ఫెడేల్మని తన్నుతుందని తెలియక,  ప్రభావతిని కూడా తీసుకెళ్ళేడు ఆ రోజున. పళ్ళోడి మాట విని  ఆవిడ

“పీకెయ్యండి డాక్టరు గారూ పీకెయ్యండి” అని పెర్మిషన్ ఇచ్చేసింది.

“అబ్బే అలా కుదరదమ్మా, యాంటి బయాటిక్స్ వాడాలి, నొప్పి తగ్గాలి, అప్పుడు కాని పీకలేం, రూల్స్ ఒప్పుకోవు” అని చింతించాడు.

“ప్రస్థుతం ఆయన యాంటి బయాటిక్స్ వాడుతున్నారు, ఏదో ఇన్ఫెక్షన్ వచ్చి, రోజుకి మూడు చొప్పున” అని చెప్పేసింది ఈవిడ . 

ఆయన సంభ్రమానందోత్సాహంతో నర్స్ అని కేకేశాడు. ఓ నర్సుడు బారెడు సూది పట్టుకొని గెంతుకుంటూ వచ్చేసాడు. 

ఖర్మవశాత్తు,  కాదు, వద్దు అని చెప్పడానికి  ప్రద్యుమ్నుడు నోరు తెరిచేడు.  ఆ దుష్టక్షణంలోనే ఆయన సూది ప్రద్యుమ్నుడి నోట్లోకి దూర్చి,  ఐదారు  చోట్ల గుచ్చేసాడు. గుచ్చేసిన వెంటనే ఒక పటకారు పుచ్చుకుని, ప్రద్యుమ్నుడి  తల కదలకుండా నర్సుడు పట్టుకోగా, దిగ్విజయంగా  కొన్ని పళ్ళు పీకేసాడు.  పీకేసి విజయ గర్వంతో ప్రభావతి కేసి చూసి, 

“ఇంకో నాల్గైదు ఉన్నాయమ్మా కదులుతున్నవి, పీకేస్తేనే మంచిది”  అని ప్రకటించాడు. 

“ఆలస్యం దేనికి పీకెయ్యండి డాక్టరు గారూ”  అని ఇంకో మాటు పర్మిషన్ ఇచ్చేసింది ప్రభావతి. 

సమరోత్సాహుడు, విజయ మదాంధుడు, పరుల పళ్ళ శత్రువు అయిన ఆ పళ్ళ డాక్టరు ఉచితానుచితములను విస్మరించి  ఆవిడ మాట నెరవేర్చాడు. పీకిన అన్ని చోట్లా ఇంత దూది కుక్కి ప్రద్యుమ్నుడి  నోరు మూసేసాడు. 

“నోరు తెరవకండి తెరుస్తే రంగు పడుద్ది”  అని హెచ్చరించాడు. 

నోరు తెరవలేని దుస్థితిలో, పరాజయావమాన దుర్భర పరిస్థితిలో చేసేదేమీ లేక పళ్ళెంలో పళ్ళు లెఖ్ఖ పెట్టేడు ప్రద్యుమ్నుడు. పది కనిపించాయి. ప్రద్యుమ్నుడి కళ్ళలో నొప్పాశ్రువులకి దుఖ్ఖాశ్రువులు తోడయ్యాయి.

నెల తక్కువ వెధవా అని చిన్నప్పుడు ప్రద్యుమ్నుడిని  తిట్టేవారు కాని పళ్ళు తక్కువ వెధవా అని ఎవరూ అనలేదు. అందుకని,  ముఫైరెండు పళ్ళు నోట్లో పుట్టి ఉంటాయని  ప్రద్యుమ్నుడి  నమ్మకం. 67 ఏళ్ల సుదీర్ఘ జీవితంలో పళ్ళు  కొన్ని తమంతట తామే ఊడాయి,  కొన్ని ఇలాంటి క్రూర సింహులు ఊడపీకేరు. అయినా ఇక్కడకు రాక ముందు దాకా సుమారు ఓ ఇరవై ఐదు దంత వజ్రములు  ప్రద్యుమ్నుడి ముఖబింబమునకు వన్నె తెచ్చిపెట్టేవి. ఇప్పుడు పదిహేను మాత్రమే మిగిలాయా యని బాధపడ్డాడు. డాక్టరు గారు  ప్రభావతికి తగు సూచనలు ఇచ్చిన తరువాత ఇంటికి చేరారు.

మళ్ళీ ఒక వారం తరువాత ప్రద్యుమ్నుడు ఒంటరిగానే పళ్ళ డాక్టరు దగ్గరికి వెళ్లాడు.

“ఏంటి డాక్టరు గారూ ఇలా చేసారు. పళ్ళు పీకడంలో ఒక పద్ధతి పాడు ఏమీ ఉండదా?” అని కోప్పడ్డాడు.

డాక్టరు గారు శాంతంగా “ఏమైందండీ” అని ప్రశ్నించారు.

“ఏమైంది అంటే ఎలా చెప్పాలి? పైన పళ్ళు ఉంటే కింద లేవు, కింద ఉన్న చోట పైదవడకి  లేవు. కజ్జికాయ కొరకాలన్నా, మైసూర్ పాక్ నమలాలన్నా కుదరటం లేదు నాల్గు రోజులనుంచి” అని వాపోయాడు ప్రద్యుమ్నుడు.

ప్రద్యుమ్నుడి నోరు తెరిపించి చూసాడు డాక్టరు.

“అబ్బే,  ప్రాబ్లం ఏమీ లేదు. కింది దవడకి ఎడమ వైపు ఐదు పళ్ళు స్ట్రాంగ్ గానే ఉన్నాయి. పైన సుమారుగా  ఏడో  పన్ను స్ట్రాంగుగానే  ఉంది. మధ్యలో ఉన్న పన్ను ఒకటి పీకేస్తే,  పైన ఆరు పళ్ళు కట్టేయవచ్చు. పూర్వం కన్నా ఘట్టిగా నమలగలరు” అని చెప్పేడు డాక్టరు. ఒక్క క్షణం ఆలోచించి,   

“కుడి వైపు కింద రెండు పీకేసి, ఐదు కట్టేద్దాం, పైన నాలుగు తోటి సమానంగా వస్తాయి. మీరు నిరభ్యంతరంగా రాళ్ళు కూడా నమిలేయచ్చు రెండు వైపులా” అని హామీ కూడా ఇచ్చాడు. 

“ఎంతవుతుందేమిటి?” అడిగాడు ప్రద్యుమ్నుడు 

“ఎంతోనా,  అంతా కలిపి పదిహేను వేలు మాత్రమే” అన్నాడు డాక్టరు. 

“పదిహేనా”  అని ఆశ్చర్యపడ్డాడు ప్రద్యుమ్నుడు.

డాక్టరు తోటి బేరం పెట్టేడు. అరగంట ఘోరంగా వాదించి, బేరమాడి ఎనిమిది వేలకి ఎడం వేపు కట్టడానికి ఒప్పించాడు. 

ఇరవై రోజుల తరువాత డాక్టరు గారితో నాలుగు సిట్టింగ్ ల  తరువాత ఆరు పళ్ళ సెట్టు తెచ్చుకున్నాడు. 

ఆ పళ్ళ సెట్టుకి ఒక కొక్కెం కూడా ఉంది. అది ఆ ఏడో  పన్నుకి తగిలించాలని మరీ మరీ చెప్పాడు పళ్ళ డాక్టరు. 

ప్రద్యుమ్నుడు పళ్ళ సెట్టు తగిలించుకొని, జీడి పప్పు పాకం త్వరత్వరగా నమల లేకపోయినా, ఒక అరనిముషం నోట్లో నానేసి జంతికలు నమలడం దిగ్విజయంగా నేర్చుకున్నాడు. ఒక ఆరునెలలు గడిచాయి.

విధి చాలా క్రూరమైనది. ఒకమాటు తన్నడం మొదలు పెడితే,  అనేక మారులు తన్నుతుంది. అదో సరదా విధికి. 

ఒక రోజు, ప్రద్యుమ్నుడు జంతికలు కరకరా నములుతుంటే, పిండి ఐన జంతికలు నోట్లోకి, పళ్ళసెట్టు చేతిలోనూ పడ్డాయి. ఆశ్చర్యంగా పళ్ళసెట్టు కొక్కేనికి తగిలించిన ఏడవపన్ను కూడా ప్రద్యుమ్నుడికి చేతిలో కనిపించింది.

వెంటనే ప.డా. దగ్గరికి పరిగేసాడు ప్రద్యుమ్నుడు. పడా గారు చిరునవ్వుతో విన్నారు.

సారీ  అన్నారు.   ఏమీ చెయ్యలేము  అని విచారించారు.  పళ్ళసెట్టుని బాగుచెయ్యడం కుదరదు  అని బాధపడ్డారు.


 కొక్కాన్ని సాగదీసి,  తొమ్మిదో పన్నుకి తగిలించడం  అసాధ్యం  అనిన్నీ,   తమ అశక్తతకు క్షమించమని  కూడా విన్నవించుకున్నారు.

కొంచెం చవకగా ఎనిమిది పళ్ళ సెట్టు చేసిస్తానని వాగ్దానం చేసారు.

మాములుగానే ఎంతవుతుందని ప్రద్యుమ్నుడు అడిగాడు.

ఎంతోనా పన్నెండు వేలు మాత్రమే నని తెలియజేసుకున్నాడు పడా.

అయ్యబాబోయ్ అని ప్రద్యుమ్నుడు ఆక్రోశించాడు.

ధరలు పెరిగిపోయాయండి, ఆర్నెల్ల క్రితం ఇరవై రెండు ఉన్న బియ్యం ఇప్పుడు ముఫైఐదు అయింది కదా అన్నాడు పడా.

పాత సెట్టుకి ఎంత ఇస్తారు అని బేరం పెట్టాడు ప్రద్యుమ్నుడు.

పాత సెట్టా అదేం చేసుకుంటాం అని ఎదురు ప్రశ్న వేసాడు పడా. మేము పాత సామాన్లు కొనం. ఎక్స్చేంజి ప్రోగ్రాం పళ్ళకి ఉండదు అని బల్లగుద్ది మరీ ఉద్ఘాటించాడు పడా.

తొమ్మిదో పన్ను కూడా ఊడిపోతే  అనే సందేహం వెలిబుచ్చాడు ప్రద్యుమ్నుడు.

అప్పుడు మొత్తం పళ్ళు పీకేసి ముఫై రెండు పళ్ళ సెట్టు కట్టి  ఇస్తాను. మీకు కాబట్టి నలభై రెండు వేలకే చేసిస్తాను అని మాట ఇచ్చాడు పడా. 

వయసు వచ్చేస్తోంది మీకు,  అప్పుడే అరవై ఎనిమిది వచ్చేసాయి. రేప్పొద్దున్న మీకు  ఏమైనా అయితే ఆ పళ్ళ సెట్టు వాపసు తీసుకోము అని కూడా ఘంటాపధంగా గంట మోగించి మరీ చెప్పాడు పడా.

సగం ధరకు కూడా తీసుకోరా అని ఆశగా అడిగాడు ప్రద్యుమ్నుడు.

చెల్లని కోయంబత్తూరు నోటు కూడా ఇవ్వము అని ఖచ్చితంగా చెప్పేసాడు పడా.

వాడితే ఊడే తొమ్మిదో పన్నును నమ్ముకొని,  పన్నెండు వేలు ఖర్చు పెట్టడానికి ప్రద్యుమ్నుడికి మనస్కరించ లేదు. 

జంతికలు, మైసూర్ పాకాలు చెయ్యాల్సిన పని తప్పుతుంది కదా అని ప్రభావతి కూడా పళ్ళు కట్టించుకోమని బలవంతం చేయలేదు.    

ఇది జరిగి రెండేళ్లు అయింది. 

అప్పటినుంచి ప్రద్యుమ్నుడు పళ్ళ యోగా ప్రాక్టీసు చేసాడు. మూతిని, దవడలని అష్టవంకరలు తిప్పుతూ ఒక పంటి కిందకు మరో పన్ను చేరుస్తూ నమలడం సాధించాడు.  

 కానీ విధి క్రూరమైనది కాబట్టి,  తన్నుతూనే ఉంటుంది కాబట్టి,  పళ్ళు ఒక్కొక్కటి ఊడడం జరిగింది. 

ప్రస్థుత కధా కాలానికి,  నోట్లో ఐదారు పళ్ళు మాత్రమే మిగిలాయి. ఈ మాత్రం భోగానికి టూత్ బ్రష్, పేస్టు కూడానా యని వేలికే పని చెప్పడం మొదలుపెట్టాడు ప్రద్యుమ్నుడు.  అదన్నమాట సంగతి.

దంతధావన కార్యక్రమం ముగించుకొని,  ఫిల్టర్లో కాఫీ పొడి వేసి, మరిగిన నీళ్ళు పోసి, పాలు మూడు మాట్లు పొంగించి, మరుగుతున్న పాలలో వేడి డికాషన్ కలిపి, తగుమాత్రం పంచదార వేసి,   ఒక కప్పుడు గ్లాసులో పోసుకొని, మిగిలిన రెండు  కప్పులు ఫ్లాస్కులో పోసి,  పెద్దగ్లాసుడు కాఫీ తాగడానికి ఉపక్రమించాడు ప్రద్యుమ్నుడు.  



రెండు గుక్కలు నోట్లోకి వెళ్ళగానే నూతనోత్సాహం కలిగింది. ఇంకో నాలుగు గుక్కలు లోపలికి వెళ్ళగానే పరమోత్సాహం కలిగి “దినకరా శుభకరా” అంటూ పాట లంకించుకున్నాడు.

“సూర్యుడు ఇందాకానే వచ్చేసాడు. ఇప్పుడు ఆ పాట అవసరమా” అని పక్కింట్లోంచి వినబడింది.

పొరుగు వారితో సహాకారం అనే సూత్రం పాటించి నోరు మూసుకున్నాడు ప్రద్యుమ్నుడు. 

సాధారణంగా ప్రద్యుమ్నుడికి భావుకత అంటే చిరాకు. ఆకులమీద నుంచి రాలే మంచు బిందువులను చూసినప్పుడు ఏమీ అనిపించదు. వర్షం కురుస్తుంటే చిరాకు పడతాడు.  మట్టి వాసన అని ఎవడో అన్నాడని వీళ్ళందరూ  మట్టిలో ముక్కు పెట్టేస్తారు అని జాలి పడతాడు. ఇంద్రధనుస్సులో రంగులు చూసి పరవశించడు. వెన్నెలని చూసి తన్మయత్వం చెందే వాళ్ళని చూసినా  జాలిపడుతాడు. వెన్నెలలోనే వేడి ఏమిటో అని ఒకడు పాడితే చల్లని వెన్నెలలో అని ఇంకోడు వ్రాస్తాడు, అసలు వీళ్ళకి  వెన్నెల ఎలా ఉంటుందో తెలుసా అని చీదరించుకుంటాడు. పిండిలా ఉందా. పుచ్చపువ్వులా ఉందా లేక పెరుగులా ఉందా అని అడుగుతాడు. పండు వెన్నెల కాయడమేమిటి అని ఆశ్చర్యపోతాడు. సూర్యుడు ఉదయించినా అస్తమించినా వీళ్ళకి ఎందుకు గంగవెర్రు లెత్తుందో అర్ధం కాదు.  నేనో అభావుకుడను అనుకుంటాడు.

కానీ అప్పుడప్పుడు ఆవేశం వస్తే అభావుకత పొంగుకొస్తుంది. ఇప్పుడు పొంగి ప్రవహించింది.

చిరుగాలి కెరటాలు సెలయేటి తేటలు కృష్ణ శాస్త్రివేనా
తెలుగు పౌరుషము  విశ్వనాధ గళస్థ గాద్గదికమేనా
పూసల పేరు పూవులు సేరు నండూరి వారి ఎంకికేనా
బాధా సర్ప దష్టులు హతాశులు  శ్రీ శ్రీ కలం సొంతమేనా 

అంటూ ఆవేశపడ్డాడు.

శంకరాభరణం శంకర శాస్త్రే  సంగీతం ఆలాపించాలా
దినకరా శుభకరా  అని  కూడా నేను గొంతెత్త కూడదా

అని ఆక్రోశించాడు. 

ఏమైతేనేం,   ఇద్దినం బాగా ఉండేటట్టులేదు అని అనుకున్నాడు. ఏమి చెయ్యాలా అని ఆలోచించాడు. మనశ్శాంతి కోసం బస్టాండ్ దగ్గరికి వచ్చాడు పావుతక్కువ  తొమ్మిందింటికి. ఆఫీసు కెళ్ళేవాళ్ళని, చూస్తూ, కొంతమందిని   పలకరిస్తూ, రెండు బస్సుల్ని పంపించాడు. అక్కడనుంచి ‘ఇక్కడ పికో చేయబడును, ఫాల్స్ కుట్టబడును’  అని వ్రాసి ఉన్న షాప్ దగ్గర,  కుట్టించుకోడానికి వచ్చిన వాళ్ళతో వంకాయ కూర చేయు విధానాలని   కూలంకషంగా చర్చించి పదకొండు గంటలకి ఇంటికి చేరాడు.

“ఎవరో మీ బ్లాగ్మిత్రులట, స్వీట్  పాకెట్ పంపారు. నిన్న ఉగాది సందర్భంగానట. ఆ కుర్రాడికి మన ఇల్లు కనుక్కోవడం కుదరలేదుట నిన్న. ఈ వేళ వచ్చి ఇచ్చాడు.”  అని చెప్పింది ప్రభావతి.

“ఆహా” అన్నాడు ప్రద్యుమ్నుడు.
“చూసావా మా బ్లాగ్మిత్రులకి మనమంటే ఎంత అభిమానమో, ప్రేమో, ఆపేక్షయో, గౌరవమో,ఆదరమో”  అని మహదానంద భరితుడయ్యాడు ప్రద్యుమ్నుడు ప్రభావతితో చెప్పి.

ప్రభావతి ఒక చిరునవ్వు విసిరింది. ప్రద్యుమ్నుడు స్వీట్ల పేకెట్ విప్పాడు.
అందులో రకరకాల జీళ్ళు ఉన్నాయి. తెల్లవి, కాఫీ రంగువి, నువ్వులు అద్దినవి ఇత్యాదులు.
“ఆహా జీళ్ళు ఓహో జీళ్ళు”  అనుకున్నాడు.
“ఎంతకాలమైంది వీటిని తిని”  అని కూడా అనుకున్నాడు.

ఒకటి నోట్లో వేసుకున్నాడు.  కింద పన్నుమీద జీడిని పెట్టి పళ్ళ యోగా చేసి పై  పన్నును అనుసంధానం చేసి కొరికాడు. కొరకబడలేదు.
ప్రభావతి నవ్వింది.
ఈ మాటు పళ్ళ మహా యోగా చేసి కింద పన్నుకి పైన రెండు పళ్ళతో అనుసంధానించి ఘట్టిగా శక్తి కేంద్రీకరించి కొరికాడు.
జీడికేమి కాలేదు కానీ ఆ యోగాకి తట్టుకోలేక పై రెండిటిలో ఒక పన్ను ఊడి ప్రద్యుమ్నుడి చేతిలో పడింది.

ప్రభావతి నవ్వింది.
“ఈ వేళ ఏప్రియల్ ఒకటి”  అని మళ్ళీ  నవ్వింది.

ఇలా కూడా ఏప్రిల్ ఫూల్ ని చేస్తారా అని ప్రద్యుమ్నుడు అవాక్కయాడు. 



గమనిక :- ఈ టపా 1st. ఏప్రియల్  2014 న ఈ బ్లాగులో ప్రచురించబడింది.

ఇది కూడా ఒక ప్రేమ కధే - 2

మొదటి భాగం  ఇక్కడ చదవండి   ఇది కూడా ఒక  ప్రేమ కధే   

రెండు నెలలు గడిచిపోయాయి. ఈ రెండు నెలల్లోనూ మూడు మాట్లు గుళ్ళోనే కలిసారు. ఐదారు మాట్లు కా.....  ఫోన్ చేసాడు కా..కి. నెలకి వంద రూపాయలు టాక్ టైం వేయించినా, చెల్లి, తల్లి కూడా అప్పుడప్పుడు ఉపయోగిస్తున్నందున అంతకంటే ఎక్కువ మాట్లు చేయలేకపోయాడు కా..... కా..కి సెల్ లేదు. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే సెల్ అందుబాటులో ఉంటుంది. ఆయన రోజుకి 12 గంటలు ఆటో తిప్పుతుంటాడు. 11గంటలు నుంచి మద్యాహ్నం  3గంటలు దాకా ఇంట్లోనే ఉంటాడు ఆయన. కా..... సందేశాలు ఆ టైంలోనే ఇస్తుంటాడు.

రెండు నెలల తరువాత ఇంకో శుభవార్త చెప్పాడు కా..... ఇంకో ఐదుగురు పిల్లలు చేరారండి. ఐదారు క్లాసులు వాళ్ళు. ఇంకో వెయ్యి రూపాయలు వస్తాయి అని సంతోషపడ్డాడు కా.....
ఐదారు క్లాసుల వాళ్లకి ఇంకో వంద ఎక్కువ తీసుకోవచ్చు కదండీ అంది కా..
అబ్బే, రెండు వందలు ఇవ్వడమే ఎక్కువ అండి వాళ్లకి. ఇల్లు గడవడానికి  సేల్స్ వుమెన్గా  చేసే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. పిల్లల్ని బాగా చదివించాలని ఆశ. మంచి స్కూల్స్ లో చదివించే స్తోమత లేదు. పిల్లలు ఇద్దరికీ కలిపి నాల్గు వందలు ఇవ్వడమే వాళ్లకి కష్టం అని నిట్టూర్చాడు కా..... మొదట్లో ఎంతో కొంత సంపాదించాలనే మొదలు పెట్టానండి కానీ ఇప్పుడు తల్లి తండ్రుల తపన చూస్తుంటే పిల్లలకి బాగా నేర్పాలనే పట్టుదల వస్తోంది. ఈ మధ్యన వాళ్లకి చెప్పడానికి నేనో రెండు గంటలు కష్టపడుతున్నానండి ప్రిపరేషన్ కి.
మంచి పని చేస్తున్నారండీ అని అభినందించింది కా..

ఇంకో నాల్గైదు నెలలు గడిచాయి. ఇద్దరూ అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నారు. ఒక చెరుకు రసం బదులు రెండు తాగుతున్నారు. అప్పుడప్పుడు తెగించి కా..... పది రూపాయల ఐస్ క్రీం కూడా కొంటున్నాడు ఇద్దరికీ. వాళ్ళు చెప్పుకునే కబుర్లు  మాత్రం  మారలేదు. ఇంటి కష్టాలు. నిట్టూర్పులు.  కా..కి  ఏ ఉద్యోగమూ దొరకక నిరుత్సాహం ఎక్కువవుతోంది.  చుట్టు  పక్కల ఏ షాపులోనయినా చేరడానికి తల్లి ఒప్పుకోదు. దూరం వెళ్ళడానికి తండ్రి ఒప్పుకోడు. కా..... ధైర్యం చెపుతాడు. కా..కి దిగులు ఎక్కువవుతోంది ఏ విధంగానూ తండ్రికి సాయం చేయలేకపోతున్నందుకు.

ఐదు నెలల తరువాత కా..... ఒక మాటు కలిసినప్పుడు నిరుత్సాహపడ్డాడు. ఒక ఐదుగురు ఏడెనిమిది క్లాసు పిల్లలు ట్యూషన్ చెప్పమన్నారండి. నాలుగు  వందలు ఇస్తామన్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదో విధంగా అవస్థ పడి చెప్పేయగలనేమో కానీ లెఖ్ఖలు చెప్పలేనేమో నని అనుమానం. వాళ్లకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో. అసలు ఒప్పుకోవాలో లేదో తెలియటం లేదండీ, అని వాపోయాడు.
నాది బి.ఎస్.సి. MPC అండి అంది  కా..
మీ నాన్నగారు ఒప్పుకుంటారా ఐదు కిమీ పంపడానికి. అందులోనూ ఓ వెయ్యి రూపాయలకి అన్నాడు కా.....
అడుగుతానండి. మీ ఇంటికయితే పంపుతారేమో అని ఆశాభావం వ్యక్తం చేసింది కా..  ప్రస్తుతం వెయ్యి, ఆపైన ఇంకా పెరగ వచ్చునేమో కదండీ, అని కూడా అంది.
నా సంగతి మీ నాన్నగారికి తెలుసా,  అడిగాడు కా.....
టెలిఫోన్ చేస్తారు కదండీ మీరు. మా నాన్న గారికి మీ గురించి చెప్పాను. అందరిలాగా కాకుండా ఏదో విధంగా తండ్రికి సాయపడుతారు మీరు అని మా నాన్న మెచ్చుకున్నాడు కూడా.
కా..... నవ్వాడు. కా.. డిటో చేసింది.

రెండు రోజుల తరువాత పరంధామయ్యగారు (కా.. తండ్రి) కా..... ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు.
మా అమ్మాయి చెప్పిందండి. ట్యూషన్ సంగతి. పట్టుబడుతోంది. నాకూ ఒప్పుకోక తప్పలేదు. అందుకనే మేము ఇక్కడే ఓ ఇల్లు అద్దెకు తీసుకుంటాము. ఎక్కడైనా అద్దె ఇల్లే కదా.   అప్పటిదాకా సాయంకాలం ట్యూషన్ అయిన తరువాత నేను వచ్చి తీసుకెళ్ళతాను.  ఆలస్యం అయినా మీ ఇల్లే కనుక భయం లేదు అని చెప్పాడు.
కా..... తల్లి కూడా  సంతోషంగా ఒప్పుకుంది. ఖాళీ టైం లో మా అమ్మాయికి  ఇంటర్ పాఠాలు చెప్పవచ్చు. ఫ్రీ గా నేనండోయ్ అని కూడా అంది. 

ఒక పది రోజుల తరువాత  కా.. కుటుంబం పక్క వీధిలో అద్దెకు దిగింది. రెండు ఇళ్లలో ఐదుగురు ఏడెనిమిది క్లాసు  పిల్లలకి పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు ఇద్దరూ కలిసి. ఒకరి ఇంట్లో కా.. MPC  చెపుతుంటే ఇంకో ఇంట్లో కా..... మిగతా సబ్జెక్ట్స్ చెప్పేవాడు.
తల్లి సలహా మీద మొదటి నెల పదిహేను వందలు ఇచ్చాడు కా..... కా..కి. ఇల్లు మారారు కదండీ ఖర్చు అయి ఉంటుంది కదా అందుకని అని సంజాయిషి ఇచ్చాడు కా.....
మీకు పార్టీ ఇస్తానండి, నాలుగు  బజ్జీలు, రెండు చెరుకు రసాలు అని  కా.. నవ్వింది. ఇంత కాలానికి ఒక పదిహేను వందలు సంపాదించానని చాలా సంతోషంగా ఉంది అని కూడా చెప్పింది.
మళ్ళీ నెల వెయ్యేనండి అని చెప్పాడు కా..... నవ్వుతూనే.  

ఇంకో ఐదారు నెలలు గడిచాయి. ఇంకో ఏడెనిమిది మంది  పదోక్లాసు దాకా పిల్లలు చేరారు.  కింద తరగతి పిల్లలు కూడా ఇంకో ఐదుగురు చేరారు.  చిన్న క్లాసుల పిల్లలకి కూడా కా.. చెప్పడం మొదలు పెట్టింది. ఎవరికి వీలైతే వాళ్ళు చెపుతున్నారు.  9,10 క్లాసులకి ఐదు వందలు, ఆరు – ఎనిమిదికీ మూడు  వందలు, ఇంకా చిన్న క్లాసులకి రెండు వందలు తీసుకోవడం మొదలు పెట్టారు. వచ్చే దాంట్లో ఖర్చులు పోను  సగం  కా..... తీసుకుని, మిగిలిన సగం సుమారు   మూడువేల ఎనిమిది వందలు కా.. కి ఇస్తున్నాడు.

ఇద్దరూ కష్టపడుతున్నారు. రోజూ కనీసం రెండు గంటలు ప్రిపరేషన్ కి కేటాయించుకున్నారు. అప్పుడప్పుడు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి పాఠాలు ప్రింట్ అవుట్లు తెచ్చుకుంటున్నారు. ముఖ్యమైన పాఠాలు పిల్లలకి ప్రింట్ అవుట్ కాపీలు ఇస్తున్నారు.  పిల్లలకి నేర్పాలనే తమ ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరూ కలిసి అప్పుడప్పుడు ఆ గుడికి వెళుతున్నారు. అరటి పళ్ళో, కొబ్బరికాయో సమర్పించుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళ మాటల్లో పాఠాలు ఎక్కువుగా వస్తున్నాయి. పిల్లల ప్రోగ్రెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలో చర్చించుకుంటున్నారు. ఆశ్చర్యంగా పిల్లల బాగోగులు వీళ్ళ దృష్టిలో ఎక్కువయ్యాయి. ఈ విషయం పిల్లల తల్లి తండ్రులు గుర్తించారు. సంతోషించారు. పక్క ఐదారు వీధుల్లో వీరి గురించి తెలిసింది. ఇంకో రెండేళ్ళకి వీళ్ళ పిల్లలు ఏభైకి చేరారు.  ఆరు  కన్నా చిన్నలకి రెండు వందల ఏభై తీసుకుంటున్నారు, ఏడు  ఎనిమిది లకి  మూడు  వందల ఏభై, తొమ్మిది పదిలకి ఐదు వందలు పుచ్చుకుంటున్నారు.   సుమారు పదహారు వేలు సమానంగా పంచుకుంటున్నారు.  

రెండు ఇళ్లలోనూ శాంతి సామరస్యాలు విరయడం మొదలైంది. సంపాదన చాలనప్పుడు ఇంట్లో కీచులాటలు కూడా ఎక్కువగానే ఉంటాయి కదా. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి,  అన్న విషయాలలో కా..కి, కా.....కి వాళ్ళ ఇళ్లలో చర్చల్లో ప్రాధాన్యత వచ్చింది. దాంతో బాధ్యతలు పెరిగాయని ఇద్దరూ అనుకోవడం జరిగింది. ఇంకా  సంపాదించడానికి మార్గాలు వెతకటం ఎక్కువయింది.    

కా....., కా.. ల స్నేహం మూడున్నర ఏళ్ళకి పైగా వర్ధిల్లుతోంది. కా..... కెమిస్ట్రీ చెప్పడంలో కూడా నైపుణ్యం పెంచుకున్నాడు. లెఖ్ఖలు, ఫిజిక్స్ కా.. చెపుతోంది. కా.. చిన్న క్లాసులకి ఇంగ్లిష్ కూడా చెప్పేస్తోంది. బాధ్యతలు సమానంగానే పంచుకుంటున్నారు. కానీ ఆశ్చర్యంగా వీరి మధ్య మరేమి రాలేదు. ఇద్దరూ కలిసి ఒక్కమాటు కూడా సినిమాకి వెళ్ళలేదు. గుడికి తప్ప మరొక చోటికి వెళ్ళలేదు. ఇప్పుడు సాయినాధ కాలనీలోని శివాలయం మీద గురి కుదిరింది రెండిళ్ళ లోనూ. అందరూ కలిసి వెళ్లడం మొదలయింది. అక్కడ పూజారి గారితో కూడా పరిచయం పెరిగింది.

కా..తల్లి మనసులో కోరిక కలిగింది. భర్తతో ఆలోచించింది. కానీ ఆయన సందేహ పడ్డాడు. స్నేహం అవసరం కొద్ది పెరిగింది  కానీ ఆటో వాడి కూతురుని కోడలుగా ఒప్పుకుంటారా? అనే భయంతో ముందుకు వెళ్ళడానికి సాహసించలేదు. కా..... తల్లి మనసు  కూడా, చనువుగా ఇంట్లో తిరిగే  కా.. ని చూసి ముచ్చట పడడం మొదలు పెట్టింది. కానీ ఆడపిల్ల తల్లి తండ్రులు చొరవ తీసుకోకుండా ఉంటే, తన మనస్సు చెప్పడం సబబు కాదేమో నని ఊరుకుంది.

శివాలయం పూజారి గారు పెళ్ళిళ్ళ పేరయ్య కూడా. ఒక రోజు ఏదో సందర్భంలో కా.. తల్లిని అడిగారు,
 “అమ్మాయికి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా?” అని.
“ఇంకా లేదండి. మొదలు పెట్టాలి” అని జవాబు ఇచ్చింది.
అప్రయత్నంగా, అనాలోచితంగా అక్కడే ఉన్నా కా..... తల్లి అనేసింది,
“సంబంధాలు చూడాలా? మా వాడు పనికి రాడా” అని.
కా.. తల్లి ఆనందంతో తబ్బిబ్బైంది. మరుక్షణం కా..... తల్లి చేతులు పట్టుకొని కళ్ళ కద్దుకుంది.
పూజారి గారు “శుభం” అన్నారు.

విషయం తెలిసి కా..... కా.. దీర్ఘంగా చర్చించుకున్నారు. తమ చర్చల సారాశం తల్లి తండ్రుల ముందు ఉంచారు.
కా.. సంపాదనలో సగం తండ్రికి ఇస్తుంది. కా.. తండ్రి రాత్రి ఎనిమిది తరువాత ఆటో తోలరాదు. మిగాతా సగంలో మూడు వంతులు కా..... చెల్లెలు, చదువుకి,  పెళ్ళికొరకు బేంకులో వేయాలి.
కా..... సంపాదనలో సగం ఎప్పటిలాగానే తండ్రికి ఇవ్వాలి. మిగతా సగంలో మూడు వంతులు ఇదివరకు  లాగానే కాంట్రాక్టరు అప్పు వాయిదాలు కట్టాలి. ఇంకో ఏడాది తరువాత,  అప్పు తీరిన తరువాత కామాక్షితో చర్చించి తమ భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవాలి. కొంత  కా..... చెల్లెలి పెళ్ళికి ఉపయోగించాలి.
చెల్లెలి పెళ్లి అయేవరకు ఇంట్లో పసిపాపలు రాకుండా చూసుకోవాలి.
కా..... తల్లి తండ్రులు అంగీకరించారు. కా.. తల్లి తండ్రులను ఒప్పించారు.

ఒక శుభదినాన ఉదయం, దేవుని సాక్షిగా,  పూజారి గారి ఆధ్వర్యంలో గుళ్ళో కా..... కా..  దండలు మార్చుకున్నారు. రిజిష్టారు ఆఫీసు కెళ్ళి సంతకాలు పెట్టారు. సాయంకాలం,  దగ్గర బందుమిత్రులకి ఒక ఇరవైఐదు మందికి విందు ఇచ్చారు. మొత్తం ఖర్చు రూ. 6400 రెండు కుటుంబాలు సమానంగా పంచుకున్నాయి.

(ఆ తరువాత ఏమైంది అంటారా? శుభం కార్డు పడ్డ తరువాత సంగతి మనకు ఎందుకు? అయినా బాధ్యతల నుంచి తప్పుకోని  పిల్లలకి కష్టాలు కొన సాగుతాయేమో కదా.)  

గమనిక :- ఇది మొదటి మాటు ఈ బ్లాగులో 11/11/2014 న ప్రచురించబడింది.