తిరుగు ప్రయాణం



ఏలూరు నుంచి ఇంకో వారం  రోజుల తరువాత, మూటా ముల్లె సర్దుకొని  తిరిగి హైదరాబాద్  బయల్దేరుతున్నాం. సుమారు రెండున్నర ఏళ్లు ఏలూరులో ఉన్నాం.  పుట్టిన ఊరు పొడగట్లపల్లి, తూ.గో.జి. అయినా,  పెరిగిన ఊరు భీమవరం,  ప.గో.జి. అప్పుడు ఏలూరుతో పరిచయము కొద్దిగా ఉన్నా విశేష బంధం ఏమీ లేదు.  హైదరాబాద్ నుంచి కొంతకాలం దూరంగా వెళ్లాలని నిశ్చయించుకున్నప్పుడు,   పెరిగిన ఊరు  భీమవరంలో తెలిసిన వాళ్ళు ఎవరూ కనిపించలేదు. ఏలూరుకి దగ్గర గ్రామంలో శ్రీమతి గారి తమ్ముడు, కుటుంబం ముఖ్యంగా తల్లి గారు ఉన్నారని ఇక్కడ చేరాము. హైదరాబాద్ నుంచి దూరంగా వెళ్లాలని అనుకోడానికి, పుట్టి పెరిగిన పరిసరాలలో కొంత కాలం ఉందామనుకున్నది ప్రధాన కారణం.  గత ఏడాదిగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఏ డాక్టర్ అయినా ఓ రెండు లైన్ల రోగం పేరు చెపుతాడేమో నని ఆశగా చూసాను కానీ, “ఏమీ లేదండీ, వయసు గదా” అనేస్తున్నారు. సరే, ఆ నలుగురూ హైదరాబాద్ లోనే ఉన్నారు కదా అని తిరుగు ప్రయాణం అన్నమాట.

 
అప్పుడప్పుడు,  నేను ఎక్కడి వాడిని అనే ఆలోచన వస్తోంది.  ఆస్తి పాస్తులు ఎక్కడా లేవు. ఒకప్పుడు పొడగట్లపల్లిలో మా నాన్నగారికి పది ఎకరాలు, ఒక కొబ్బరి తోటా, ఓ ఇల్లు  ఉండేవిట. (పిత్రార్జితం, ముగ్గురు సోదరులు పంచుకొంటే వారికి వచ్చిన వాటా).  మా నాన్న గారు ఉండగానే,  నా చదువుకు చివరి ఎకరం అమ్మేశారు.  వెళ్ళి చూసే వాళ్ళు ఎవరూ లేక,  ఐదారు ఏళ్ల క్రితం, పక్క వాళ్ళు కొంత ఆక్రమించుకోగా మిగిలిన ఇంటి స్థలం అమ్మేసాం పొడగట్లపల్లిలో.  మా అమ్మగారు పోయిన తరువాత 78 నుంచి,  భీమవరంతో బంధం తెగిపోయింది. బంధు మిత్రులు చాలామంది హైదరాబాద్ చేరారు. నేను కూడా జోర్హట్లో  వాలంటరీ రిటైర్మెంట్ తరువాత వైజాగ్లో కొంతకాలం  చేసి,  హైదరాబాద్ లో ఒక కంపనీలో చేరాను. ఏడెనిమిది ఏళ్ల తర్వాత  విసుగొచ్చి పూర్తిగా  ఉద్యోగం నుంచి తప్పుకున్నాను.  


చీకు చింతా ఆట్టే లేవు ఒక్కటి తప్ప,  ముఖ్యంగా మా ఆవిడకి,  ఇల్లు మారాల్సి వచ్చినప్పుడు,  పొడగట్లపల్లిలో ఓ గుడిసె వేసుకున్నా సరిపోయేది అని వాపోతుంది.  సంపాదించింది ఖర్చు పెట్టుకోవడమే తప్ప కొంత పొదుపు చేయాలని మా ఇద్దరికీ కూడా పట్టకపోవడము, ఇప్పుడు మా ఇద్దరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది అప్పుడప్పుడు. అదన్న మాట సంగతి. అందుకనే ఎక్కడి వాడిని అనే అనుమానం వస్తోంది. పుట్టి పెరిగిన గో.జి వాడినా, ఓ డిగ్రీ ఇచ్చి మనిషిగా ఎదగడానికి అవకాశం కల్పించిన విశాఖ వాడినా, సుమారు 31 ఏళ్ళకి పైగా ఉద్యోగం ఇచ్చి  అక్కున చేర్చుకొని ఆదరించిన అస్సాం వాడినా. మా పిల్లలు “ we are from Assam”  అని చెప్పుకుంటారు. అస్సాం నుంచి వచ్చేసిన తరువాత ఈ 18 ఏళ్లలో నేను రెండు మాట్లు, మా శ్రీమతితో  ఒక మాటు జోర్హాట్ వెళ్ళాం. ఇంకో మాటు వెళ్లాలని, సకుటుంబ సపరివారంగా, ప్రణాళిక సిద్ధం అవుతోంది. ఏమవుతుందో చూడాలి. అందరూ ఇక్కడే (హైదరాబాద్) ఉన్నారని, గత రెండున్నరేళ్ళు తప్ప,  పదహారు ఏళ్లగా ఉండి తిరిగి ఇప్పుడు శేష జీవితం గడపడానికి వెళుతున్న హైదరాబాద్ వాడినా. ఏమో, నాకే తెలియటం లేదు. నాలాంటి వాళ్లనే అంటారనుకుంటాను,  తాడు బొంగరం లేని  వాళ్ళని.....దహా.


సమస్యలు అనేకం వచ్చాయి. పోయాయి. సమస్యల గురించి నేను (మేము) ఎప్పుడూ ఎక్కువుగా బాధపడలేదు, ఆలోచించలేదు, ఆ సమయంలో మనసుకు తోచినట్టు చేయడం తప్ప. నవ్వుతూ బతకడమే నేర్చుకున్నాను. గత ఏడాదిగా ఆ నవ్వు కూడా రేషన్ సామాన్ల లిస్టులో చేరిపోతోందేమో ననే అనుమానం వస్తోంది. ఏలూరులో మిత్రులు ఎవరూ  ఏర్పడ లేదు. కొంతమంది  పరిచయస్తులు తప్ప. చాలా మట్టుకు ఒంటరిగానే ఉన్నాం. హైదరాబాద్ తిరిగి వస్తే బంధు మిత్రుల సమక్షంలో పూర్వ ఉత్సాహం తిరిగి వస్తుందేమో నన్న ఆశ.


మళ్ళీ  హైదరాబాద్ లో L.B.Nagar లో, South End Park లోనే చేరుతున్నాం.  మా  మిత్రులు, హాస్యప్రియులు అక్కడే ఎక్కువగా ఉన్నారు. ఆ నలుగురికి తోడుగా ఇంకో యాభైమంది ఉంటారని ఆశ.......దహా.


సద్దుడు కార్యక్రమం మొదలయింది.  పాకర్స్ అండ్ మూవర్స్ ఈ కార్యక్రమం చేస్తారు. కానీ అంతకు ముందు సామాన్లు తగ్గించుట అనే ప్రణాళిక ఒకటి ఉంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఓ అరడజను ఇళ్ళు  మారినప్పుడు చాలా  సామాను వదిలించుకోవడం జరిగింది.  ఇప్పుడు మిగిలిన బరువైన సామాను వదిలించుకోవడం అన్నమాట.  ఇంకో  రెండు మూడు రోజుల్లో నెట్ కనక్షన్ పీకి వేయబడుతుంది. తిరిగి హైదరాబాద్ చేరిన తరువాత ఇంకో వారం పట్టవచ్చునేమో.  అంత దాకా శలవు.   

ఇంటి మొగుడు

ఈమాట  సెప్టెంబర్ 2013 సంచికలో  నా కధ  
 
ప్రచురితమైనది. మీ రందరూ ఈ కధ చదివి నన్నాదింప చేయ గోరుచున్నాను.

అన్నట్టు ఈ కధకు ఓ టాగ్ లైన్ కూడా ఉంది, ‘రైలు ప్రయాణంలో మరో కధ’  అని.

ఇదివరలో వ్రాసిన ‘రైలు ప్రయాణంలో ఒక కధ’ కి  V. శ్రావ్య గారు వ్రాసిన కామెంటు లో రెండవ సూచనకి అనుగుణంగా ప్రస్థుత కధ.    కధ,  ఇంకో కధ ల  లింకులు ఈమాట లో ఉన్నాయి.

కధను ప్రచురించిన ఈమాట సంపాదకులకు, ఐడియాలు ఇచ్చిన శ్రావ్య గారికి కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.