విజయవాడ లో బ్లాగర్స్ సమావేశం - పుస్తక ప్రదర్శన సందర్శనం

నూతన సంవత్సరం, జనవరి 8 వ తారీఖున విజయవాడ లో బ్లాగర్స్ సమావేశము నిర్వహించుటకునున్నూ, శ్రీ రహ్మానుద్దీన్ షేక్ గారిచే వికిపీడియా గురించి, బ్లాగు లు ఎలా మొదలుపెట్టాలి, ఎలా నిర్వహించాలి అనియున్నూ అన్న విషయములపై ఉపన్యాస మిప్పించుటకు నున్నూ సకల సన్నాహములు చేసితిమి కాన తమరెల్లరును విచ్చేసి సభను జయప్రదం చేసి మమ్ము నానంద పరచవలిసింది గా కోరుచున్నాము అని శ్రీ ఆత్రేయ గారు (లిపి లేని భాష బ్లాగు) , బ్లాగులోనూ,  శ్రీ రహ్మానుద్దీన్ గారు  మైల్ లోనూ బొట్టు పెట్టకుండా పిలిచినందున, తోటి బ్లాగర్స్ ను కలిసి పరిచయ భాగ్యం కలిగించుకొనుటకు, ఆపైన విజయవాడ లో జరుగుతున్న పుస్తక ప్రదర్శన ను మదీయ పాద ధూళి చే పావన మొనర్చుట కున్నూ సంకల్పించిన వాడ నైతిని. సరే, మన నిర్ణయాలు హై కమాండు వారికి వారి అనుమతి కొరకు నివేదించితిని. షరతులతో కూడిన ఆమోదము నిచ్చిరి.

ఒక రోజు ముందరే ఎందుకైనా మంచిదని, ముందు జాగ్రత్త గా  ఒక అరగంట ఆలస్యం గా వస్తానని శ్రీ రహ్మాన్ గారి వద్ద పర్మిషన్ తీసుకున్నాను . పర్మిషన్ తీసుకొన్నా , వారి నాశ్చర్య చకితులను చేయు దురుద్దేశం తో ఆదివారం ఉదయం 8-30 గంటలకు ఏలూరు కొత్త బస్ స్టాండ్ నకు చేరుకున్నాను. అయ్యో తాతగారూ,  ఇప్పుడే 3-4 నిముషాల కింద ఒక బస్ వెళ్లిందండి అని విచారం వెలిబుచ్చి ఇంకో పావుగంటలో మరొకటి వచ్చును కాన చింతించవలదు అని ఆశ్వాసము నిచ్చారు RTC వారు. సరే అని చేయుటకు నేమీ లేక సిగరెట్టు వెలిగించాను. (హెచ్చెరిక: సిగరెట్టు కాల్చుట హానికరము, కాల్చువారికి, వారి చుట్టుపక్కల నున్న వారికి కూడా. కాన కలకాలము బతుక దల్చిన వారు కాల్చు వారి చుట్టుపక్కల నుండుట శ్రేయస్కరము కాదు). మూడవ సిగరెట్టు పాడువేయు సమయమునకు డీలక్స్ బస్ వచ్చింది. ఎక్కి కూచున్నాను. ఇంకో పది నిముషాలలో బయల్దేరింది,  సుమారు  10 నిముషాలు తక్కువ 9 గంటలకు. ఆహా! అన్న టైమ్ కు ముందుగానే చేరుదును గదా అని సంతోషించాను. బయల్దేరిన 15-20 నిముషాలలో బస్ ఆగింది. డ్రైవరు గారు ఆహా అనిరి, ఓహో అనిరి, ఐ సీ అని కూడా అన్నారు. ఈ బస్ ముందునకు వెళ్ళుటకు ఇంజను సహకరించుట లేదు అని సెలవిచ్చారు.  మరేం ఫరవాలేదు, వెంటనే ఇంకో బస్ పంపిస్తారు,  మీరు నిశ్చింత గా ఉండండి అని నమ్మకం గా చెప్పారు.

బస్ దిగాను. కొద్ది దూరం లో ఒక టీ కొట్టు కనిపించింది. ఒక టీ తాగుతూ  ఒక సిగరెట్టు పీల్చి, చేయునదేమీ లేక  ఇంకొక సిగరెట్టు కాలుస్తూ మరొక టీ సేవించి, ఎదురుగా నున్న పొలమునకు కొద్దిగా నీరు పట్టి, మరొక సిగరెట్టు తగలేస్తూ  ఇంకా ఎన్ని టీలు తాగవలనో నని చింతించు చుండగా దూరము గా బస్ కనిపించినది. వచ్చిన బస్ నెక్కి కూర్చున్నాను. చాలా మంది ఎక్కేశారు. అప్పుడు ఒక వీర వెంకట సత్యన్నారాయణ నృసింహ స్వామి గారు ఠాట్ అన్నారు. వాట్ ఈస్ దిస్ అన్నారు. మనం ఎక్కిన బస్ ఏమిటి? ఇప్పుడు వచ్చిన బస్ ఏమిటి? కుదరదు అన్నారు. వారి శిష్యులు వెంటనే అవును,  మనం బస్ స్టాండ్ లో ఎక్కినది డీలక్స్ బస్ ఇప్పుడు వచ్చినది ఎక్స్ప్రెస్  బస్.  రెంటికీ మధ్య బస్ చార్జి లో 5 రూపాయల తేడా.  RTC  వారు తేడా డబ్బులు ఇవ్వాలి లేదా డీలక్స్ బస్ పంపాలి అని ఘట్టిగా అన్నారు.  కొద్ది సేపు వాదోపవాదముల తరువాత బస్ బయల్దేరింది. శ్రీ వీ.వెం.స.నృ.స్వా. గారు నా పక్క సీటులో కూర్చున్నారు.  నా కేసి చూసి నిరసన గా నవ్వారు. మీలాంటి వారు  ప్రొటెస్ట్ చేయటం లేదండీ. అసలు మీ  లాంటి వారి వల్లే ఈ దేశం ఇలా తగులడి పోతోంది అని వ్రాక్కుచ్చారు. నేను నిశ్శబ్దమును వరించాను.

అవరోధముల నధిగమించి, విజయవాడ బ్లాగర్స్ సమావేశ సభా ప్రాంగణమునకు నేను చేరునప్పటికి 10- 40 అయింది. అప్పటికే 12 మంది అక్కడ ఉన్నారు. అందరికీ తలో నమస్కార బాణం వేసి, పరిచయం చేసుకొని ఉచితాసనము నలంకరించాను. లిపిలేని భాష బ్లాగు శ్రీ ఆత్రేయ గారు,  బాబు కార్టూన్స్ బ్లాగు శ్రీ దుర్గా ప్రసాద్  గారు, 64 కళలు బ్లాగు కళాసాగర్ గారు, అక్షర మోహనం బ్లాగు మోహన రాం ప్రసాద్ గారు  ఇంకా కొంతమంది బ్లాగర్స్ ని  పరిచయం చేసుకున్నాను.   మెల్ల మెల్లగా  ఇంకొంతమంది వచ్చారు. శ్రీ  ఆత్రేయగారు టీలు,  స్నాక్స్ తెప్పించారు. ముదమార తిని, తాగాము. సుమారు 20 మంది చేరిన తరువాత  పరస్పర పరిచయ ఉపన్యాసముల తరువాత 10 గంటలకు మొదలవాల్సిన  కార్యక్రమం  11-30 కి  మొదలయింది.

శ్రీ రహ్మాన్ గారు చెడుగుడు ఆడేశారు, వికిపీడియా వికిపీడియా అంటూ. వికిపీడియా గురించి వివరించి, మనమందరం దాని అభివృద్ధికి  ఏమి,  ఎలా చెయ్యాలో విశదీకరించారు. మీరందరూ వికిపీడియా లో తగు పాత్ర పోషించాలని ఉద్భోదించారు. వికిపీడియా గురించి కొంత చర్చా కార్యక్రమం జరిగింది. ఆ తరువాత శ్రీ రహ్మాన్ గారు బ్లాగు బహు  బ్లాగు అంటూ కబాడీ మొదలు పెట్టారు. రహ్మాన్ గారి చెడుగుడు కార్యక్రమం జరుగుతుండగా మరి కొంత మంది బ్లాగర్స్ వచ్చారు.

నేను అభ్యంతర కార్యక్రమ నిర్వహణకై బయటకు వెళ్ళాను. అప్పుడే శ్రీ P.శ్రీకాంత్ (నవ్వులాట బ్లాగు) గారి దర్శన, పరిచయ భాగ్యాలు కలిగాయి. కొంచెం సేపు నవ్వుకోలు కబుర్లు చెప్పుకున్నాము. ఒకే ఈకలు గల పక్షుల మగుట చేత (Birds of the same feather, హాస్యం) త్వరగానే కలిసిపోయా మనిపించింది. వారు ఎంత చక్కటి జోకులు వ్రాస్తారో అంతకన్నా ఎక్కువ చక్కగా మాట్లాడుతారు. ఆ సమయం లోనే  పాక వేదం బ్లాగు Dr.కౌటిల్య గారు విజయం చేశారు. మరికొంతసేపు ముచ్చటించుకొన్న తరువాత మళ్ళీ సభాప్రాంగణమునకు చేరితిమి.

బ్లాగులమీద చర్చా కార్యక్రమం జరుగుతోంది. కొంతమంది ఔత్సాహికులు బ్లాగు మొదలుపెట్టు సదుద్దేశం తో ప్రశ్న ల బాణాలు వేస్తుంటే రహ్మాన్ గారు చతురతతో సమాధానం ఇస్తున్నారు. వారి ప్రశ్నలకి వీరు అలిసిపోయారో,  వీరి సమాధానాలకు వారు సంతసించారో తెలియదు కాని సమావేశం ముగిసింది అని ప్రకటించారు. ఒంటిగంట దాటిందనుకుంటాను. ఆ వెనువెంటనే ఫోటో సెషన్ మొదలయింది. నకులుడు వాన చినుకుల మధ్యనుంచి గుర్రపు స్వారీ చేసే వాడట అని విన్నాను. నేను కూడా నకులుడి ని ఫాలో అయ్యి,  ఒక్క ఫోటో కూడా మిస్ కాకుండా అందరి ఫొటోల్లోనూ ఢాం ఢాం అంటూ పడిపోయాను. అన్నట్టు వనజా వనమాలి గారు కూడా మధ్యలో వచ్చారు. వారి పరిచయభాగ్యం కూడా కలిగింది. మధ్యలో అత్యవసర కారణాల వల్ల కొంతమంది వెళ్ళిపోయారు. ఫోటో సెషన్ సమాప్తం అయే టప్పటికి సుమారు ఒక ఇరవై  మంది దాకా ఉన్నారు. సభ గ్రాండ్ సక్సెస్ అయింది అనుకున్నాము.

ఈ సభ ఇంత బాగా నిర్వహించినందుకు శ్రీ ఆత్రేయ గారిని, వికీపీడియా గురించి, బ్లాగుల గురించి ఎన్నో విషయాలు అందరికీ అర్ధం అయేటట్టు గా చెప్పిన ఉపన్యాస కేసరి శ్రీ రహ్మానుద్దీన్ షేక్  గారిని  అభినందిస్తున్నాను.  ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.  అల్లాగే ఎంతో ఉత్సాహం గా పోల్గొన్న తోటి బ్లాగర్స్ కి, కాబోయే బ్లాగర్స్ కి, సభలో పాల్గొన్న మిగతా వారికి  కూడా  అభినందనలు, ధన్యవాదాలు.  (నాకు నేను చెప్పుకోవడం బాగుండదు కాబట్టి కామెంట్లలో మీరు చెప్పేయండి).

సభ అయిపోయింది. భోజనం ఎవరు పెట్టిస్తారా అని చూస్తున్నాను. ఇంతలో కౌటిల్య గారూ, రహ్మాన్ గారూ తరువాతి ప్రోగ్రామ్ ఏమిటి గురువుగారూ అన్నారు.  శిష్యులారా భోజనమొనర్చి పుస్తక ప్రదర్శనకేగుదము అని అన్నాను .  పుస్తక ప్రదర్శన కు దగ్గరగా ఉన్న రామయ్య హోటల్ కి వెళ్ళాం. శ్రీ రహ్మాన్ బిల్ కట్టడానికి ఉద్యుక్తుడయ్యారు. నేను కూడా మొహమాటానికి,  “నేను ఇస్తాను లెండి”  అని అతని జేబులో పర్సు తీయబోయాను. పరవాలేదు లెండి,  నా పర్సు లోది నేనే ఇస్తాను లెండి అన్నారు. సరే అతని పర్సు లోని రొఖ్ఖం అతను తీయడమే ధర్మం అని ఉరుకున్నాను. అన్నదాతా రహ్మాన్ సుఖీభవా అన్నాను. 

భోజనం చేసి  పుస్తక ప్రదర్శన కేగి కినేగే స్టాల్ లో ఒక పదినిముషాలు భుక్తాయాసం తీర్చుకొని పుస్తకాలు చూడడానికి వెళ్లాము నేను,  కౌటిల్య గారు. రహ్మాన్ గారు కినిగే స్టాల్ లో ఉండిపోయారు.  నేను ప్రదర్శనకు వచ్చేముందు ఫలానా పుస్తకాలు కొందామని అనుకోలేదు. ఏదైనా కనిపిస్తే నచ్చితే కొందాములే అనే అనుకున్నాను. కాబట్టి ఏదైనా పుస్తకం కోసం వెతకడం అనే కార్యక్రమం లేదు.

ప్రదర్శన లో సుమారు 300 పైన స్టాల్సు ఉన్నాయి. హైదరాబాద్ లో పుస్తక ప్రదర్శన చూసి కూడా మూడేళ్లు దాటింది. గుర్తున్నంత వరకు నాకు హైదరాబాద్ కన్నా  విజయవాడ ప్రదర్శన బెటర్ ఆర్గనైజ్డ్ అని అనిపించింది. విశాలమైన ప్రాంగణం లో ప్రదర్శన పెట్టడం వల్ల ఇరుకుగా, ఇంకన్వీనియంట్ గా అనిపించలేదు. ఆదివారం కావటం వల్ల జనం ఎక్కువగా ఉన్నారు అయినా పుస్తకాలు తిరగేయడానికి, అక్కడక్కడ నాల్గైదు పంక్తులు చదవడానికి ఇబ్బంది గా అనిపించ లేదు.  ప్రదర్శనలో నేను విన్న, చదివిన, రచయితల పుస్తకాలు చాలానే కనిపించాయి. తెలియని వి ఇంకా చాలా ఎక్కువే.  ఇంగ్లిష్,  తెలుగు పుస్తకాలు,  అతి తక్కువుగా కొన్ని హింది,   తప్ప మిగతా భాషల పుస్తకాలు నాకు కనిపించలేదు. ఎక్కడైనా ఒకటి అరా ఉన్నాయేమో బహుశా నేను గమనించలేదు.  రెండు మూడు చోట్ల పాత పుస్తకాలు (అలా కనిపించాయి నాకు) 50% రిబేట్ మీద కూడా అమ్ముతున్నార నుకుంటాను. ఒకటి రెండు చోట్ల 3 పుస్తకాలు Rs. 100/  స్కీము కనిపించింది. ఎక్కువగా ఇంగ్లిష్ నవలలు. నాకు తెలిసిన రచయితలకన్నా తెలియని రచయితల పుస్తకాలు ఎక్కువ అందులో. కొనే సాహసం చేయలేదు.  అన్ని  రకాల పుస్తకాలు,  పిల్లల పుస్తకాలు నుంచి అధ్యాత్మిక పుస్తకాలు దాకా విరివిగానే కనిపించాయి.   ప్రాంగణం మధ్యలో తినుబండారాల స్టాల్సు  ఉన్నాయి. హాయిగా కూర్చుని తినడానికి,  తాగడానికి  తగు సంఖ్యలో కుర్చీలు కూడా ఉన్నాయి. అయినా స్థలం నీట్ అండ్ క్లీన్ గానే ఉంది.  మొత్తం మీద ప్రదర్శన సంతృప్తి కలిగించింది.

సుమారు 3 గంటలు తిరిగాము ప్రదర్శన లో. నేను కొన్న మొదటి పుస్తకం నవోదయా లో అమరావతి కధలు. ఇది చాలమాట్లే చదివాను. ఈ మధ్యన అంటే గత ఏడెనిమిది ఏళ్లలో చదవ లేదు. అక్కడే రాబిన్ కుక్ వ్రాసిన ‘Seizure’  కనిపించింది. వెంటనే కొనేశాను. 2007 లో ననుకుంటాను పూనా వెళ్ళాను. NCL  గెస్ట్  హౌస్ లో దిగాను సతీ సమేతంగా. రాత్రి భోజనాల దగ్గర IIP లో పని చేస్తున్న పాత మితృడొకడు కనిపించాడు ఈ పుస్తకం తో. సరే,  నీ మొహం మండా నువ్వెల్లా ఉన్నావు  లాంటి ఉభయ కుశలోపరి కార్యక్రమం తరువాత,  వాడి చేతిలో పుస్తకం తీసుకొని ఆ రాత్రి చదవడం మొదలుపెట్టాను. రాత్రి 1-30 -2 దాకా చదివానను కుంటాను. అల్లాగే నిద్రపోయాను. తెల్లారి 8 గంటలకి,  వెధవ  నిద్ర లేపాడు. నేను వెళ్లిపోతున్నాను కాబట్టి పుస్తకం ఇచ్చెయ్యి అని గొడవ పెట్టాడు. ఏడుస్తున్నాడు కదా అని ఇచ్చేశాను. మళ్ళీ అది దొరక లేదు. నేను పూర్తిగా చదవ లేక పోయాను. అందుచే కొన్నాను. ఇవికాక ఓల్గా వి రెండు, శ్రీపాద వారిది ఒకటి, కధా సరిత్సాగరం, P.G వుడ్ హౌస్ కధలు తెలుగు అనువాదం, బాపు గారి బొమ్మలు పుస్తకం  ఒకటి  కొన్నాను. అన్నట్టు  సుజాత & రహ్మాన్ విరచిత బ్లాగు పుస్తకం కూడా కొన్నాను.

తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ కినెగే స్టాల్ కెళ్ళాము. శ్రీ అనిల్ అట్లూరి గారి తో పరిచయం చేసుకున్నాను. వారు స్టాల్ నిర్వహణ లో బిజీ గా ఉండడం వల్ల ఎక్కువగా మాట్లాడడానికి సమయం దొరకలేదు.  రహ్మాన్ గారికి,  అనిల్ గారికి,  కౌటిల్య గారికి ధన్యవాదాలు  చెప్పి  6.30 గంటలకి  బయల్దేరి,  ఏలూరుకి మళ్ళీ క్షేమం గానే చేరాను.  

పుస్తకాలు 8,9  కొనేశాను హుషారుగానే. ఇవన్నీ ఎప్పటికి చదువుతానో. ఒక ఆర్నెల్లు పడుతుందేమో? ఏమో చూద్దాం.               
  

పొదుపు సమీకరణాలు

నా కధ   పొదుపు సమీకరణాలు  అంతర్జాల పత్రిక  ఈ మాట’  ఎల్లలు లేని ప్రపంచానికి ఎలెక్ట్రానిక్ తెలుగు పత్రిక,  జనవరి 2012, సంచిక   లో  ప్రచురించారు.  మీరందరూ  ఆ కధ


చదివి మీ అభిప్రాయాలు  చెప్పవలసిందిగా మనవి చేసుకుంటున్నాను . 

నా కధ వారి పత్రిక లో ప్రచురించినందుకు  ఈ మాట  యాజమాన్యానికి,  కధను  సవరించిన సంపాదకులకు  ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను.

ఆంధ్రజ్యోతి సంపాదకులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు.. కానీ వారికిది భావ్యమా?


నిన్న  జనవరి ఒకటవ తారీఖున సాయంకాలం 3-4 గంటల మధ్యన బ్లాగ్మిత్రురాలు ఒకరు ఒక మెయిల్ పంపించారు.

బులుసు గారూ మీ కధ నాకు ప్రేమించి పెళ్లి చేసుకొనే యోగ్యత లేదా  ఆంధ్ర జ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధం లో వచ్చింది,  చూసారా అని. వెంటనే చూశాను.

కడుంగడు నానందించితిని.
మీదు మిక్కిలి సంతోషించితిని.
అమందానంద కందళిత హృదయారవిందుడ నైతిని.   
హర్షాతిరేకమున గంతులు వైచితిని
మనం వ్రాసే కాలక్షేపం కధలు పత్రికలకెక్కే స్థాయికి ఉన్నాయేమో నని మనంబు సంభ్రమానందాశ్చర్య డోలలూగినది.
ఆనందమాయే అలి నీలవేణీ అని కూడా పాడుకున్నాను మా ఆవిడకు చెప్పి.
హర్ తర్ఫ్ బజ్ నే లగీ శేఖడో షెహనాయియా అని హిందీలో  కూడా పాడుకున్నాను.

ఏలూరు రోడ్లన్నీ తిరిగి ఆంధ్రజ్యోతి దినపత్రిక కొనుక్కొచ్చాను.  కనిపించిన వాళ్ళ చేత బలవంతం గా చదివించాను. వాళ్ళు నవ్వకపోయినా నేనే నవ్వి, వాళ్ళని మొహమాట పెట్టి నవ్వించాను.

మా యావిడ కూడా చిరునవ్వుతో అందరికితో బాటు నాకు కూడా పంచదార కలిపిన కాఫీ ఇచ్చింది.

శుభం భూయాత్ అని అనుకున్నాను.  

అన్నట్టు మరిచి పోయాను.  మొదట చెప్పవలసింది ఇక్కడ చెపుతున్నాను.

ఆగస్టు 2011 లో నా బ్లాగులో పబ్లిష్ చేసుకున్న నా కధ  నాకు ప్రేమించి పెళ్లి చేసుకొనే యోగ్యత లేదా  ఆంధ్ర జ్యోతి దినపత్రిక జనవరి 1, ఆదివారం అనుబంధం లో ప్రచురించినందుకు ఆంధ్రజ్యోతి సంపాదకులకు మనఃస్ఫూర్తిగా కృతజ్ఞత లు, ధన్యవాదాలు తెలియ జేసుకుంటున్నాను.  వారికిదే నా నమస్సుమాంజలులు.

కానీ ఇంత ఆనందం లోనూ ఎక్కడో మనసులో ఒక మూల కలుక్కుమంది.

నా కధ  పత్రిక లో వచ్చిందని ఎవరో చెప్పేదాకా నాకు తెలియలేదు.
అయినా సరే  ముగాంబో ఖుష్ బహుత్ ఖుష్ అవడం  కొంచెం తేడాగా  అనిపించింది.

ఔరా మనని మాట వరసకు కూడా అడగకుండా వారి పత్రికలో మన కధ వేసుకోవడం సబబా? వారికిది భావ్యమా? అనే సందేహం వచ్చింది.

అడిగితే కాదనము కదా. డెందమానందమందగా తిరుగు టపాలో అంగీకారం తెలియ చేసుండెడి వారము కదా !  

అడుగలేదు ఫో. ఓయీ నీ కధ మా పత్రిక లో వేసుకుంటున్నామని తెలియ చేయవచ్చును కదా. ఆనందమనుభవించుము. నూతన సంవత్సరమున పండగ చేసుకొనుము అని తెలియపర్చుటకు కూడా అనర్హులమా?

ఆలోచించిన కొలది మనంబున నానందము సన్నగిల్లి,  క్రోధము ఆవహింప జొచ్చెను. ఇది ఏమి? పనీ , పాడు లేని వాడ ననుకును చుంటిని  కానీ ఇంత పనికి మాలిన వాడినా యన్న యనుమానం కలిగెను.

కాపీ రైటు, సింగినాధం జీలకర్ర  అని ఉపన్యాసం ఇవ్వను. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాటి నమలు పరిచేటందుకు  సమయం, ధనం మన వద్ద లేవు.  

కానీ బహుళ జనాదరణ పొందిన ఒక పత్రిక,  రచయిత అనుమతి తీసుకోవాలనే కనీస మర్యాద పాటించ లేదేమో నని అనుమానం. అంతే మరేమీ లేదు.

పత్రికా స్వేచ్ఛ లో ఇది కూడా ఒక భాగమేమో. ఏమో.

నేనేం చెప్పగలను. బాధ్యతలే తప్ప హక్కులు లేని ఒక అనామకుడిని.