బద్ధకం గా నిద్ర లేచాను. కళ్ళు నులుముకొని చేతిలో ఘృతాచి అని వ్రాసుకొని, చూచిన తరువాత చెవులకి వినిపించింది.
తెలవార వచ్చే తెలియక నా స్వామి
మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు లేరా
లేరా లేరా లేరా ప్రద్యుమ్నా లేరా
అని వంటింట్లోంచి ప్రభావతి పాటని దున్నేస్తోంది. పక్కకి ఒత్తిగిలి, ఉదయమే గాన కచేరీ చేస్తోందేమిటా అని నేను ఒకింత చింతా క్రాంతుడ నయితిని. ఇంతలో బెడ్ రూమ్ తలుపు తెరుచుకొని ప్రభావతి
లేచితివా ప్రియా కాఫీ తాగుమా ఆ ఆ ఆ కాఫీ తాగుమా సఖా తాగుమా
అంటూ కాఫీ కప్పు నాచేతిలో పెట్టి వంటింట్లోకి తుర్రుమంది.
కుత్సిత బుద్ధితో కుళ్ళిపోయినదని ప్రభావతి భావించే నా మనస్సు వెంటనే కీడును శంకించింది. గత మూడు నాలుగు దినములలో నేను చేసిన రాక్షస కృత్యములు ఏమైనా ఉన్నాయా అని నిశితం గా శోధించాను. రెండు రోజుల క్రితం జోర్హట్ టౌన్ లో అగర్వాల్ కొట్టులో నేను మరిచిపోయిన ప్రభావతి హాండ్ బాగ్ సంగతి ఒకటే గుర్తుకొచ్చింది. ఆవిడ భుజాలంకారమైన సంచీ ఉన్నదో లేదో కూడా గమనించ లేకపోవడం నా పొరపాటని నా కర్ధమయేటట్టు కోపపడింది. ఇంటి కొచ్చేదాకా ఈ చిన్న విషయం కూడా కనిపెట్ట లేక పోయిన నేను సైంటిస్టు ఎలా అయానని కూడా విచారించింది. నాకు డిగ్రీ ఇచ్చిన యూనివర్సిటి నీ, ఆ డిగ్రీ ని నమ్మి ఉద్యోగం ఇచ్చిన మా ఇన్స్టిట్యూట్ నీ కూడా దుమ్మెత్తి పోసింది. ఇలాంటి సైంటిస్టులు ఉండబట్టే మన దేశం అమెరికా కన్నా వెనక బడిపోయిందని విశ్లేషించింది. మళ్ళీ నేను గుండెలు గోక్కుంటూ, రొప్పుతూ రోజుతూ సైకిల్ తొక్కుతూ 7 కి.మీ. లు వెళ్ళి ఆ బాగ్ తీసుకొచ్చేదాకా అష్టోత్తరం, సహస్రనామం పూజలు జరిపించింది.
మా ఆవిడ హాండ్ బాగ్ మర్చి పోతే, అది నేను గమనించక పోతే , మనదేశం అమెరికా కన్నా వెనక పడిపోతుందనే ధర్మ సూత్రం తెలిసింది. అంతకు మించి నేను చేసిన అఘాయిత్యాలు ఏమి గుర్తుకు రాలేదు.
కాఫీ తాగుతూ నా ఆలోచనలలో నే నుండగా మా ఆవిడ మళ్ళీ వచ్చింది. ఉదయం అల్పాహారం తయారు అవుతోంది. త్వరగా తెమలండి అన్నది. నేను నా ఆలోచనల నవతలికి నెట్టి, దంత ధావనాది కార్యక్రమములను జయప్రదంగా ముగించుకొని డైనింగ్ టేబల్ వద్ద ఆసీనుడ నైతిని. జీడి పప్పు ఉప్మా భరిత నేతి పెసరట్టు, కొబ్బరి చట్నీ తో సహా కంచం లో దర్శనమిచ్చింది. ఏమి నా భాగ్యము అని ఆనందపడవలసిన నా మనస్సు, కుత్సిత బుద్ధితో కూడిన దౌట వల్ల కీడును శంకించింది. ఉపద్రవమేదో పైబడనున్నదేమో నన్న భయం నన్నావేశించింది. కా నున్నది కాక మానదు, నేను నిమిత్తమాత్రుడనే నని తలచి తినుట కుపక్రమించితిని. ఇంతలో మా యావిడ చిరునవ్వు లొలికిస్తూ ఎదురుగా కూర్చుంది.
ఈ వేళ మీ అమ్మ గారి పుట్టిన రోజు అంది.
నాకొక్కమారుగా పులకమారింది.
ఎక్కడున్నారో అత్త గారు, మిమ్మల్ని తలుచుకుంటున్నారు అని అంటూ నీళ్ళ గ్లాసు అందించింది.
మా అమ్మ పుట్టిన రోజు నాకే తెలియదు, నీకెలా తెలిసింది అని ప్రశ్నించాను.
ఎప్పుడో మాటల సందర్భంలో చెప్పారు ఆశ్వీయుజ శుద్ధ పంచమి నాడు పుట్టానని. ఈ వేళ కేలండరు చూస్తే గుర్తుకు వచ్చింది అని కూడా చెప్పింది.
అయ్యో నేనెంత దుర్మతిని, అనవసరం గా, అన్యాయంగా, అక్రమంగా, దురుద్దేశ పూరితుడ నై అపార్ధం చేసుకుంటిని గదా అని విచారించితిని. నా ఈ పాపానికి నిష్కృతి లేదు అని కూడా దుఃఖించితిని.
ఈ వేళ మీ అమ్మగారికి ఇష్టమైన చక్రపొంగలి, నేతిగారెలు, మైసూర్ పాక్ చేస్తున్నా నండి అని ప్రభావతి ప్రకటించింది.
నే నానంద పరవశుడనై, హృదయముప్పొంగ సంతోష కన్నీరు కారుస్తూ
చినుకులా రాలి, నదులుగా సాగి, వరదలై పోయి, కడలి లా పొంగె నీ ప్రేమా, అత్త పై నీ ప్రేమా అని పాడాను.
అత్తగారు పోయి నాలుగేళ్ళైనా ఇంకా ఇలా గుర్తు పెట్టుకున్నందుకు మా ఆవిడను చూసి గర్వించాను. శెభాష్ ప్రభావతీ శెభాష్ అని మెచ్చుకున్నాను. సూర్యుడు చంద్రుడి లాగా కనిపించాడు. మా ఇంటి పక్కనున్న మురికి కాలువలో నుంచి మలయ మారుతాలు వీచాయి. ప్రకృతి పరవశించి నట్టని పించింది. ఇంకా తయారు కాని మైసూర్ పాక్ వాసన నాలుకని తొందర పెట్టేసింది.
కానీ దుశ్శంకా పూరితమైన నా మనస్సు, మళ్ళీ శాంతం భోషాణం, శాంతం భోషాణం అని హెచ్చరించింది. వరాలప్పుడే ఇచ్చేయకు అని జాగ్రత్త చెప్పింది. నేను కూడా which పుట్టా what పాము అని ఆలోచించి, చెలరేగే ఆనంద కెరటాలను శాంతింప చేశాను.
శనివారమగుటచేతనూ ఆఫీసు కెళ్లఖ్ఖర్లేదు కనకనూ, పేపరు విప్పి వియత్నాం లో అమెరికా కు జరుగుతున్న నష్టాలు, కంబోడియా లో అనావృష్టి, మెక్సికో లో జరుగుతున్న సమావేశ ఫలితాలు గురించి విశ్లేషాత్మక వ్యాసాలు క్షుణ్ణముగా చదివేశాను. ముందుకు వెళ్లిపోతున్న మన దేశం, వెనక్కి పోతున్న దారిద్ర్యం గురించి పరిశోధనాత్మక రచన చదివి సంతోషించాను.
స్నానాదులు ముగించుకొని మా అమ్మగారి జన్మదిన సందర్భంగా ఇస్త్రీ చేసిన చొక్కా, లుంగీ ధరించి TV ముందు కూచున్నాను. కోటూ, టై ధరించి కూచున్న నలుగురి పెద్ద మనుషుల మధ్య, వేదాలు వాటి ప్రాశస్త్యం గురించి చర్చ విన్నాను. కొంత సేపటికి ప్రభావతి వంట ముగించుకొని కొత్త చీర కట్టుకొని వచ్చి కూర్చుంది.
12 గంటలవుతోంది భోజనం చేస్తారా అంది.
అల్లాగే అని డైనింగ్ టేబులు వద్దకు నడిచాను.
పులిహార నారగించి నేతిగారెలు తింటుండగా మళ్ళీ నా మనసులో నానంద కెరటాలు ఉప్పొంగి కధకళి చేయడం మొదలుపెట్టాయి. ఇంతలో చక్రపొంగలి గిన్నె ముందుకు తోసింది. నేతిగారెల తరువాత రెండు చెంచాల చక్రపొంగలి నోట్లోకి వెళ్ళగానే నాలిక పరవశించి మనస్సు తన్మయత్వం చెందింది. సరిగ్గా ఆ క్షణం లోనే మా యావిడ,
ప్చ్ , ఏమిటో పాపం అంది .
ఏమైంది, పదార్ధాలు అన్నీచాలా బాగా ఉన్నాయి దేవి అని అన్నాను.
అత్తగారి కోరిక ఒకటి తీరకుండానే వెళ్ళిపోయారు అని దీర్ఘంగా నిట్టూర్చింది ప్రభావతి.
చక్రపొంగలి ముగించి మైసూర్ పాక్ ముక్క నోట్లో పడగానే నా మనసు అదుపు తప్పింది.
ఏమా కోరిక దేవి అని పృచ్చించితిని.
నలుగురి ఆడ పడచులకి ఉంది, పెద్ద కోడలికి ఉంది, నీకు కూడా చేయించాలే అనేవారు మీ అమ్మ గారు అని అంది.
సరిగ్గా ఇక్కడే నా నాలుక అదుపు, నా మనస్సు వశం తప్పాయి. పరమానంద భరితమైన మనస్సు తొందర పెట్టడంవల్ల,
ఈ నవ నవాభ్యుదయ విశాల సృష్టిలో చిత్రములన్నీ నావేలే, కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే అని పాడేశాను.
పాడి ఏమిటా కోరిక అని బహు ప్రేమగా అడిగాను.
ఆ! మీవల్లే మవుతుంది లెండి ఇప్పుడు అని ప్రభావతి అంది.
అంతే, నాలో గయుడికి అభయమిచ్చిన అర్జునుడు నిద్ర లేచాడు,
నిటిలాక్షుండిపు డెత్తి వచ్చినన్ రానీ, బంధుల్, మిత్రుల్ తుదకు సామ్రాజ్య ప్రభల్ పోయినన్ పోనీ మా యమ్మ కోరిక తీర్చెద, నీ మనంబునకు శాంతి చేకూర్చెదన్, ఆ ఆ ఆ ఆయ్
అని భీషణంగా వాగ్దానం చేసేశాను.
ఆ ఏమీ లేదండీ. అందరికీ ఉంది కదా నీ మెడలోనే లేదు. నీకు కూడా ఒక చంద్ర హారం చేయిస్తానే అనేవారు మీ అమ్మగారు.
నింగికెగసిన ఆనందోత్సాహాలు డుబుక్కున నేల మీదకు పడి నాకేసి జాలిగా చూశాయి. వేడి చేసి మరీ ఇనుము మీద సమ్మెట దెబ్బలు కొట్టి వంచే అలవాటు ఉన్న మా ఆవిడ, చల్లబడిన నా ఉత్సాహం చూసి అంది,
ఈ కోరిక తీరకుండా ఆవిడ ఏ వైతరణి మధ్యలో ఆగిపోయారో పాపం.
వైతరణి మధ్యలోనా? ఆగిపోయిందా? నీకెలా తెలుసు?
గరుడ పురాణంలో చెప్పారండి.
గరుడ పురాణమా? నువ్వెప్పుడు చదివావు?
మీ నాన్నగారు పోయినప్పుడు పంతులు గారు చదివారు కదండీ ఆ పదిరోజులునూ. అప్పుడు విన్నానండి.
ఆయన చెప్పాడా నీకు?
ఆయన చదివి చెపుతుంటే నేను విన్నాను. నాకు అలానే అర్ధం అయింది మరి.
నేను అప్పులపాలై పోయే భవిష్య పురాణం కనిపిస్తోంది నాకు.
అంతే లెండి
అంతే లెండా? ఏమిటి నీ ఉద్దేశ్యం?
తల్లితండ్రుల కోరిక తీర్చిన కొడుకే ధన్యజీవి అంటారు. అయినా మీరేం చెయ్యగలరు లెండి. పాపం ఆవిడకు ఆ అదృష్టం లేకపోయిన తరువాత.
నేనేం చెయ్యలేనా? ఆవిడకి అదృష్టం లేదా?
ఎందుకు అరుస్తారు అలాగా చెవికోసిన మేకలాగా.
చెవికోసిన మేకా ?
చాలితిరేని ముందునకు సాగి కొనుడొక చంద్రహారం
చాలరేని చాలిక మిన్న కుండుడు తీర్చెదడు నా పుత్రుడు
ఛాలెంజి చేసి పెరిగి పెద్దవాడై తన నాయనమ్మ కోరిక
చాలని వారి మనంబులు ఝల్లుమనన్, ప్రేమతోడన్ ఆ ఆ ఆ ఆ
అని పద్యం కూడా పాడేసింది.
నాకూ పౌరుషం వచ్చేసి నాలో ఉగ్ర నరసింహుడు మేలుకొన్నాడు. కోపంబుతో నాలుక తడబడగా,
నేనే ఓ కాసు బంగారం తోటి ఒక చంద్రహారం ఘనం గా చేయిస్తాను అని ప్రకాశముగా ప్రకటించేశాను.
కాసు బంగారం తోటి చంద్రహారం లోని మొదటి అక్షరం కూడా రాదు. నాలుగైదు కాసులు వేస్తేనే కానీ కంటికి ఆనదు అని గంట వాయించి ఘంటాపధం గా చెప్పింది.
నాలుగైదు కాసులా ? అంటే 12-15 వేలా ? అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది అని నిరాశ పడిపోయాను నేను.
ఆ భగవంతుడు ఏ మట్టి నింపాడో కానీ మా ఆవిడ బుఱ్ఱ లోంచి ఐడియా లు అలా మొలకెత్తి వచ్చేస్తాయి.
మీరెలాగు వాడడటం లేదు కదా ఉంగరం ఒక కాసు ఉంటుంది, మీ పులిగోరు గొలుసు ఇప్పుడు ఫాషను కాదు కదా అది రెండు కాసులు ఉంటుంది. ఇవి వేస్తే తరుగు పోను ఇంకో 7-8 వేలు వేస్తే సరిపోతుంది.
నేను మాములుగానే దీర్ఘంగా నిట్టూర్చాను. పరిస్థితులు చెయ్యి దాటినప్పుడు ఏ మొగుడైనా చేయునది అదేకదా.
సరే ఈ మాటు హైదరాబాద్ వెళ్లినప్పుడు చేయిస్తాను అన్నాను.
భలే వారే, బంగారం ధర ఎల్లా పెరుగు తోందా తెలుసా? నెలకి 3-4 వందలు పెరుగుతోంది. 7-8 నెలలు ఆగితే కొన్నట్టే, తడిసి మోపెడవుతుంది అని తేల్చేసింది ప్రభావతి.
సరే మళ్ళీ నెల కొంటాను. త్రిఫ్ట్ సొసైటీ లో అప్పు తీసుకోవాలి కదా.
పుట్టిన రోజు నాడు ఆవిడ కోరిక తీరుస్తే చెంగు చెంగు న స్వర్గానికి వెళ్లిపోతుంది. ఆపైన మీ ఇష్టం.
ఈ వేళ ఎలా కుదురుతుందే, బాంక్ లో 6500 రూపాయలే ఉన్నాయి.
దానిదేముంది. 5000 కి చెక్కు ఇచ్చేయండి. మిగతాది లోన్ వచ్చిన తరువాత ఇవ్వ వచ్చు. అగర్వాల్ తమ్ముడిదే కదా బంగారం కొట్టు. ఒప్పుకుంటాడు.
తప్పుతుందా మరి అనుకుంటూ అగర్వాల్ కి టెలిఫోన్ చేసి, వాడి తమ్ముడి కొట్లో నా పులిగోరు, ఉంగరం సమర్పించి, 5000 కి చెక్కు ఇచ్చి, 4300 కి మాట ఇచ్చి చంద్రహారం తీసుకొచ్చాము మా ఆవిడ, ఆవిడ పతీ పరమేశ్వరుడైన నేను.
వారం రోజుల తరువాత మా సోదరుడు టెలిఫోన్ చేశాడు.
ఏరా మరదలు, పిల్లలు అందరూ కులాసా నా
ఆ అంతా బాగున్నారు అక్కడ అంతా కులాసాయేనా
ఆ. మళ్ళీ నెలలో చంద్రానికి ఉపనయనం చేస్తారుట. అక్క నీకు చెప్పమంది. తేదీ నిర్ణయించిన తరువాత నీతో మాట్లాడుతానని చెప్పింది.
నేను రాలేనేమో రా
ఏమి ఏమైంది?
ప్రస్థుతానికి పర్సు ఖాళీ. వస్తే మళ్ళీ నాలుగైదు వేలు ఖర్చు. కష్టం.
నువ్వు రాకపోతే అక్కయ్య బాధ పడుతుంది. అయినా అంత కష్టం ఎలా వచ్చింది. ఏమి కొన్నావేమిటి?
మొన్న అమ్మ పుట్టినరోజున మా యావిడకి చంద్రహారం చేయించానురా.
అమ్మ పుట్టిన రోజునా ? ఆశ్చర్యపడ్డాడు శ్రీరామచంద్రుడు.
మొన్న 18 వ తారీఖున ఆశ్వీయుజ పంచమి నాడు.
ఆశ్వీయుజ పంచమా! మళ్ళీ ఆ.పడ్డాడు శ్రీ.చం. ఈ నెలే నా అని అడిగాడు.
ఆ ఈ నెలే
ఈ నెల మాఘమాసం రా లక్ష్మణా అన్నాడు శ్రీ. చం. ఆశ్వీయుజం అంటే కిందటి సెప్టెంబరు అనుకుంటాను.
మాఘమాసమా ఇది. సరిగ్గా తెలుసా నీకు.
అయినా అమ్మ పుట్టినరోజు అమ్మకి నాన్నకి కూడా గుర్తులేదు నీకెలా తెలిసిందిరా.
మా ఆవిడ చెప్పింది. అమ్మ చెప్పిందిట.
అమ్మ చెప్పడమేమిటిరా మూ.శి (మూర్ఖ శిఖామణి) ఉండు. కమలా మీ మరిది ఏమో అంటున్నాడు. చూడు.
బాగున్నావా ప్రద్యుమ్నా . అన్నగారు అంత ఆశ్చర్యపడి పోతున్నారేమిటి లక్ష్మణా.
మా ఆవిడకి చంద్రహారం చేయించాను.
సంతోషం. అదృష్టవంతురాలు ప్రభ. పెళ్ళైన దగ్గరనించి పోరుతున్నాను. మీ అగ్రజుడు ఇంకా కనికరించలేదు.
నీకు చంద్రహారం లేదా?
లేదు, నాకేమిటి మన ఇంట్లో ఇప్పటిదాకా ఎవరికీ లేదు
ఎవరికీ లేదా, మా అప్పచెళ్లెవరికీ లేదా?
లేదు. లేదు. లేదు.
అదేమిటీ మా యావిడ అల్లాగ చెప్పింది? మీ అందరికీ చంద్రహారం ఉంది. మా యావిడకే లేదు కాబట్టి నీకు నేను చేయిస్తాను అని మా అమ్మ చెప్పింది అని.
అందుకని నువ్వు కొనేశావా?
ఏదో మా అమ్మ కోరిక తీర్చేద్దామని.
అయినా ఆ విషయం అత్తగారు దగ్గర ఉన్న నాకు చెప్పేది. కూతుర్లకి చెప్పేది. ఎక్కడో అస్సాం లో ఉన్న మీ ఆవిడ కెలా చెప్పింది. నువ్వో భజగోవిందాని వోయి లక్ష్మణా.
భజగోవిందాన్నా .
అవును. నువ్వు పప్పుసుద్దవే ప్రద్యుమ్నా .