హాస్య బ్రహ్మ జంధ్యాల .. .... (వెలుగు నీడలు )

జంధ్యాల అంటే పెదాల చివర నుంచి చిన్నగా మొదలైన నవ్వు ,  బాబూ చిట్టీ అంటూ  పెరిగి  'ఏమిటీ, నీకు  కస్తూరి వారి గురించి తెలియదా'  అంటూ కోప్పడి,  చికెనవా ఉస్తిమోవ్ తినిపించి,  నేను కవయిత్రి ని కాదన్న వాడిని కత్తితో పొడుస్తా అని బెదిరించి, కనిపించిన ప్రియానంద భోజుల ను   (అంటే తెలుసా... ప్రియా పచ్చళ్లను ఆనందంగా భుజించేవాళ్లు)   పలకరిస్తూ, సుత్తి కొడుతూ,  పెద్దదై  పగలబడి నవ్విస్తుంది. 

హాస్య బ్రహ్మ జంధ్యాల తెలుగు సినిమాలో హాస్యానికి కొత్త నిర్వచనం చెప్పారు. చక్కగా కుటుంబ సమేతం గా చూడదగిన హాస్య చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అనేక సినిమాలకు రచయిత గా పని చేశారు. వారిని, వారి చిత్రాలను గుర్తు చేసుకొని మళ్ళీ మళ్ళీ నవ్వుకోవాలనే సదుద్దేశం తో శ్రీ పప్పు శ్రీనివాస రావు గారు మరికొంత మంది మిత్రులు కలిసి    'జంధ్యావందనం' అనే వెబ్ సైట్ ప్రారంభించారు. హాయిగా  నవ్వుకోవాలంటే, జంధ్యాల వారి గురించి తెలుసుకోవాలంటే   'జంధ్యావందనం'   దర్శించండి.

జంధ్యాల వారి  గురించి  శ్రీ కంచిభొట్ల శ్రీనివాస్ గారు  ఆంగ్లం లో  వ్రాసిన వ్యాసానికి నా తెలుగు అనువాదం జంధ్యావందనం  లో ప్రచురించబడింది. ఇది ఆరున్నొక్క భాగాలుగా ఉన్నాయి. వాటిని ఈ కింద లింకు లలో చదవవచ్చు.      


హాస్య బ్రహ్మ జంధ్యాల ...... (వెలుగు నీడలు)


రెండవ భాగం  

మూడవ భాగం  

నాలుగవ భాగం  

ఐదవ భాగం
చివరి భాగం  


మీకందరికి ఇవి నచ్చుతాయని, చదివి ఆనందిస్తారని  భావిస్తాను .  మీ కామెంట్లు ఏమైనా ఉంటే అక్కడే వ్రాస్తే సంతోషిస్తాను.

ఇంత చక్కటి విశ్లేషణతో జంధ్యాల వారి గురించి ఆగ్లం లో వ్రాసిన శ్రీ కంచిభొట్ల శ్రీనివాస్ గారి ని అభినందిస్తున్నాను. అనువాదం లో, భావ వ్యక్తీకరణ లో  పొరపాటు జరిగితే  వారు నన్ను మన్నిస్తారని ఆశిస్తున్నాను.  

తెలుగు లోకి అనువదించిన,  నా వ్యాసం ప్రచురించినందుకు  జంధ్యావందనం  సంపాదకులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను. 
  

నాకే ఎందుకు ఇల్లా జరిగింది

గత 15 రోజుల నుంచి శరీరం లో ఏదో అయినట్టు అనిపిస్తోంది. ఏదో తేడా, ఇతమిద్ధమని చెప్పలేక పోతున్నాను. అన్నీ అవయవాలు సక్రమం గా పని చేస్తున్నాయని పించినా, చికాకు గా ఉండడం, నిరాసక్తత, విసుగు, శరీరానికి ఏమౌతోందో అన్న బెంగ,భయం పట్టుకుంది. ఈ బెంగతోనే ఇంకో నెల పైన గడిచిపోయింది.  పోనీ ఒక మాటు డాక్టర్ దగ్గరకు వెళ్ళి రండి అని మా ఆవిడ సలహా ఇచ్చింది. ఇటువంటి చెప్పుకోలేని రోగానికి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచించాను. ఫిజిషియన్ దగ్గరికే వెళదామని నిర్ణయించుకున్నాను.

మా వీధిలోనే ఉన్న ఫిజియషన్ దగ్గరికెళ్లాను. నేను వెళ్ళేటప్పటికి అక్కడ ఒక పదిమంది దాకా పేషంట్లు కూర్చున్నారు. ఆలస్యము అవుతుందేమో మరొకడి దగ్గరికి వెళదామను కుంటుంటే రిసెప్షనిస్టు  వచ్చింది. సరే ఇక్కడే కూచుని వైట్ చేద్దాం అనుకొని కూర్చున్నాను. ఒక 10 నిముషాల తరువాత రిసెప్షనిస్టు కొంచెం ఫ్రీ అయింతరువాత, ఆమె దగ్గరికి వెళ్ళి నా రోగ హిస్టరీ , జాగ్రఫీ చెప్పి, ఆవిడ అడగక పోయినా నా చరిత్ర, గొప్పదనం, అడ్రెస్ అన్నీ వివరం గా  ఒక 15 నిముషాలలో చెప్పి, రెండు నవ్వులు నవ్వి అక్కడే నుంచున్నాను ఆవిడను చూస్తూ. ఏమనుకుందో కానీ ఆవిడ వెంటనే లోపలికి వెళ్ళి డాక్టర్ తో మాట్లాడి వచ్చి నన్ను లోపలికి వెళ్లమంది.  వెళ్ళాను. డాక్టర్ బాబు నా కేసి  చూసి,  చెప్పండి  మీ సమస్య ఏమిటి అన్నాడు. నేను విపులం గా చెప్పాను. ఆయన   ఆశ్చర్యపడ్డాడ నిపించింది. కొంచెం సేపు ఆలోచించాడు. 15 ఏళ్లగా ప్రాక్టీసు చేస్తున్నాను. ఇటువంటి  మెడికల్  సమస్య ఎప్పుడూ వినలేదండీ అన్నాడు.  సరే బల్ల మీద పడుకోండి పరీక్ష చేస్తానన్నాడు. 

నేను బల్లమీద పడుకున్నాను. ఆయన స్టెత్ తో నా ఛాతీ మీద నాల్గు వైపులా నొక్కాడు. శ్రద్ధగా విన్నాడు. ఊపిరి పీల్చమన్నాడు. గాలి వదలమన్నాడు. ఎక్కడినించి అని అడిగాను.  పీల్చిన చోటునుండే మరోచోటనుండి కాదు అని కోప్పడ్డాడు.  వదిలాను. బోర్లా పడుకోమన్నాడు. కున్నాను. మళ్ళీ అదే అన్నాడు . నేను అదే చేశాను.  నా చేయి పట్టుకొని నాడి  చూశాడు. ఈ మాటు కాళ్ళు వేళాడదీసి బల్లమీద కూర్చోమన్నాడు. కూర్చున్నాను. నా కళ్ళ రెప్పలు విడతీసి కళ్లలోకి కళ్ళు పెట్టి చూశాడు. ఈ పని మీ రిసెప్షనిస్టు  చేస్తే బాగుంటుంది అన్నాను. నాకేసి కోపంగా  చూశాడు. నోరు తెరవండి అన్నాడు. కొండ గుహ లాగా నోరు తెరిచాను. నా నోట్లోకి లైట్ వేశాడు.  డాక్టర్ గారండోయ్ ఇందాక నా కళ్ల లోకి లైట్ వేయలేదండీ.   బాటరీ లైట్ లేదేమో అనుకున్నాను,  అన్నాను. నోరు మూసుకోండి అన్నాడు.  వెంటనే మూసుకున్నాను. ఈ నోరు కాదు, ఇది తెరవండి  అన్నాడు. మళ్ళీ నోరు తెరిచాను. నాలిక బైట పెట్టండి అన్నాడు.  పెట్టాను. మరీ  అమ్మ వారిలా అంతా బైటికి పెట్టఖ్ఖర్లేదు అన్నాడు. కొంచెం లోపలికి లాగుకున్నాను.  నోరు మూసేయ్యండి అన్నాడు.  సార్ నాలుక లోపలికి లాగి మూయమంటారా అని అడిగాను.   కోపంగా చూశాడు ఆయన. నేను నోరు మూసుకున్నాను.  ఓ చిన్న సుత్తి తీసుకొని , నా మోకాలి మీద, మోచేతి మీద, అరికాళ్లమీద కొట్టాడు. సార్  ముక్కు పిండి వసూలు చేసింది 150 మీ రిసెప్షనిస్టు ఇలా దెబ్బలు తినడానికా అన్నాను. 300 ఇవ్వండి కొంచెం మెత్తగా కొడతాను అన్నాడు. నేను మళ్ళీ నోరు మూసుకున్నాను. 

ఇలా వచ్చి కుర్చీలో కూచోండి  అన్నాడు తన సీటు లో కూలబడుతూ. కూర్చున్నాను. ఏంటి డాక్టర్ గారూ ఏమైంది నాకు అన్నాను. ఆయన  బహు దీర్ఘంగా నిట్టూర్చి ఏమో తెలియటం లేదు. కొన్ని పరీక్షలు చేయించుకోండి. మందులు కూడా వ్రాసిస్తా,  వాడండి అన్నాడు. మందులు వ్రాసేశారు కదా ఇంకా టెస్ట్ లు ఎందుకండి అన్నాను. రిపోర్టులు వచ్చిన తరువాత అవసరమైతే మందులు మారుస్తాం. పక్క వీధిలోనే ఉంది డయోగ్నాస్టిక్ క్లినిక్, అక్కడే చేయించుకోండి. మనవాడే కొంచెం చవకగా చేస్తాడు అన్నాడు.  మీరు ముందు కళ్ల డాక్టర్ దగ్గరికి కూడా  వెళ్ళి చూపించుకోండి.  పైనే ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళితే 125 కే చూస్తారు అని చెప్పాడు.  సరే అని బయటకు వచ్చాను. రిసెప్షనిస్టు దగ్గరికి వెళ్ళి,   డాక్టర్ గారు BP చూడడం మరిచిపోయారు. మీరు చూసి పెట్టండి అన్నాను. ఆవిడ నర్సు ని పిలిచింది. అబ్బే ఈవిడ చూస్తే చాలా high వచ్చేస్తుంది. మీరు చూడకూడదా అన్నాను. నర్సు నన్ను లాక్కెళ్లి చూసేసింది. BP యే లెండి.

కళ్ళోడి దగ్గరకు వెళ్లమన్నారు కదా అని మెట్లు ఎక్కి పైకి వెళ్ళాను. అక్కడ  రిసెప్షనిస్టు కూర్చున్నాడు. ముక్తసరిగా మూడు ముక్కల్లో  చెప్పాల్సింది  చెప్పేశాను.  వెళ్ళి డాక్టరు గారిని చూడండి అన్నాడు. అక్కడ ఓ నలుగురు కూర్చుని ఉన్నారు. కళ్ళు నలుపుకుంటూ. నేను రిసెప్షనిస్టు కేసి ప్రశ్నార్ధకం గా చూశాను. వాళ్ళ కంట్లో మందు వేశాం. ఇంకో గంట టైమ్ ఉంది వాళ్ళకి అన్నాడు. నేను లోపలికి వెళ్ళాను. డాక్టరమ్మ కుర్చీలో కూచునుంది. రండి కూర్చోండి అంది. నేను కడుంగడు ముదావహుడనైతిని. ఏమిటి మీ ప్రాబ్లం అని అడిగింది. నేను ఒక చిన్న ఉపన్యాసం ఇచ్చాను ఆవిడ కేసి చూస్తూనే. కింద డాక్టర్ చేసిన టెస్ట్స్, చేయించుకోమన్న టెస్ట్స్, మందులు అన్నీ వివరంగా చెప్పాను ఆవిడ కేసి చూస్తూనే.  ఆయన మా వారే అంది ముసి ముసి గా నవ్వుతూ. అదృష్టవంతుడు అన్నాను. ఆవిడ మళ్ళీ నవ్వింది. నా కన్నులు మెరిసాయి. కళ్ళలో మందు వేయించుకోండి ఆ తరువాత చూస్తాను అంది. లేదండీ,  మీరు ఇక్కడ ఉంటారని తెలియక రెండు నెలలక్రితం,  కళ్ళు  సైట్ కి టెస్ట్ చేయించుకున్నానండి, Dr. భూషణరావు ఐ క్లినిక్, ఇక్కడ కంప్యూటర్ తో కళ్ళు పరీక్ష చేయబడును అని కూడా వ్రాసి ఉందండి అని చెప్పాను. వాడు మా అన్నయ్యే నండి అంటూ మళ్ళీ నవ్వింది. మళ్ళీ నేను చిత్తయ్యాను.

అయితే రండి కంప్యూటర్ ముందు కూర్చోండి అంది. నేను అక్కడ ఒక కుర్చీలో కూర్చున్నాను. ఆవిడ ఆ మిషను వెనక్కాల కూర్చుంది. ఈ రింగ్ లోకి చూడండి లైట్ కేసి అంది. నా దృష్టి అక్కడ నిలవటం లేదు. ఆవిడ మీదకే పోతోంది. అల్లా కాదు ఇక్కడ తదేక దృష్టి తో చూడండి. మీ కళ్ళలో ఏముందో నేను చూడాలి కదా అంది. నా కళ్ళల్లో ఏముంటుంది లెండి ఎదురుగా మీరే ఉన్నారు కదా అన్నాను.  నాకళ్లలో బాటరీ వేసి చూడండి అని సలహా కూడా ఇచ్చాను.  శంకరం అని పిలిచింది ఆవిడ. రిసెప్షనిస్టు వచ్చాడు. ఈయన తల కదలకుండా పట్టుకో అంది. వాడు ఉడుం పట్టు పట్టేశాడు.  ఆవిడ పని ఆవిడ చేసేసింది. నేను మళ్ళీ ఆవిడ టేబల్ దగ్గర ఆవిడ ఎదురుగా కూర్చున్నాను. డాక్టరమ్మ గారూ రిటైర్ అయి పని పాడు లేకుండా ఉన్నాను మీ క్లినిక్  లో ఏదైనా పని ఇప్పించండి అన్నాను. ఇక్కడ ఏమి ఖాళీలు  లేవు అంది.  జీతం ఇవ్వఖ్ఖర్లేదు నా కాలక్షేపం కోసమే అన్నాను. కుదరదు అనేసింది. 

నాతో మాట్లాడుతూనే మందులు,  వ్రాసేసింది. ఈ మందులు నోట్లోకి, ఈ డ్రాప్స్ కంట్లోకి అని కూడా చెప్పింది.  మా వారు వ్రాసిన టెస్ట్స్ చేయించుకొని మళ్ళీ రండి అంది.  అసలు మీ సమస్య కంటిది కాకపోవచ్చు.  మీ కళ్ళు  చూడకూడనివి కూడా  చూసేస్తున్నాయి .  ఈ NT వోడిని చూడండి అని సలహా ఇచ్చింది.  NT వోడా ఆయనేందుకండి  అన్నాను.  NT వోడు  కాదు  ENT డాక్టరు. పక్క వీధిలో నే ఉంటాడు. మన డయాగ్నోస్టిక్ క్లినిక్  కి రెండు బిల్డింగ్స్ అవతల.  మనవాడే  వెళ్ళి చూపించుకోండి. అంది.  మా రెండు స్లిప్స్ చూపిస్తే 100 కే చూస్తాడు అని కూడా చెప్పింది. అవసరమా ఆయన దగ్గరికి వెళ్ళడం అని అడిగాను. కంటికి దగ్గరగా ఉన్న అవయవాలు ఏమిటి చెప్పండి అని అడిగింది. నేను తడుము కోకుండా ముక్కు, నోరు, చెవి అన్నాను. చూసారా దగ్గరగా ఉన్నవాటి కేమైనా అయితే అప్పుడు కంటి కేమైనా కావచ్చు  కాబట్టి చూపించుకోండి. అవి సరిగ్గా ఉంటే అదృష్టవంతులే  అని కూడా అంది. అంటే లేవా అని అడిగాను. అల్లాగే అనిపిస్తోంది మరి అంది.  సరే అయిన ఖర్చు ఎలాగా అయింది  ఈ NT వోడి దగ్గరకు కూడా వెళదాం అని అనుకున్నాను.

డయాగ్నాస్టిక్  క్లినిక్ లో రక్తం ధారపోసి, మలమూత్రాదులు దానం చేసి  ఈ NT వోడి దగ్గరకు వెళ్ళాను.  నేను వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరూ లేరు. ఒక పెద్దావిడ కౌంటర్ వెనక్కాల   కూర్చుని బఠాణీలు నములుతోంది. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి సంగ్రహం గా నా కధ చెప్పాను. ఆవిడ సెల్ ఫోను లో మాట్లాడింది. అల్లుడూ వెంటనే వచ్చేయ్యి పేషంటు వచ్చారు అని చెప్పింది. కాసిని బఠాణీలు నా చేతిలో వేసి ఇవి నములుతూ ఉండండి డాక్టర్ గారు వచ్చేస్తారు అని చెప్పింది. ఐదు నిముషాలలో డాక్టరు గారు వచ్చారు తెల్ల కోటు బొత్తాలు పెట్టుకుంటూ.  రండి అంటూ నన్ను తన రూమ్ లోకి తీసుకెళ్ళాడు.  

ఆయన వెనకే ఆయన రూమ్ లోకి వెళ్ళి నా కధ అంతా ఆయనకి చెప్పాను. ఆయన  ఇద్దరు డాక్టర్ల రిపోర్ట్ లు చూశారు.  I see అన్నారు. చాలా కాంప్లెక్స్ ప్రాబ్లం గానే ఉంది అన్నారు.  అవునాండి అన్నాను. ఔను అన్నాడు ఆయన. నా దగ్గరకు వచ్చి నోరు తెరవండి అని చూశాడు. నా చెవి లోకి,  ముక్కు లోకి బాటరీ  లైట్ వేశాడు. నా గొంతు సవరించాడు తన చేతితో. మళ్ళీ ఐ సీ అన్నాడు. ఇప్పుడు కొన్ని టెస్ట్స్ చేస్తాను మీ ENT లు ఎలా పని చేస్తున్నాయో తెలుసు కోవడానికి. చెయ్యమంటారా అన్నాడు. అల్లాగే చెయ్యండి, 100 కట్టాను కదా అన్నాను. ఇంకొంచెం ఖర్చు అవుతుంది సుమారు 120-150 అన్నాడు. సరే కానివ్వండి. తప్పుతుందా అన్నాను. ఆయన నర్సు ని కేకేసి టెస్ట్ కి రెడీ చేయమన్నాడు. ఆవిడ గెంతుకుంటూ వెళ్లింది. ఈ టెస్ట్స్ మేము మన శాస్త్రాలు చదివి ఈ కాలానికి అనుగుణం గా డిజైన్ చేశాము అని చెప్పాడు. మేము ఆర్డర్ చేసిన ఎక్విప్మెంట్ ఇంకా రాలేదు. అవి వచ్చేదాకా ఈ టెస్ట్స్ ఉపయోగించి కనిపెడతాము అని కూడా వివరించారు.  ఇంతలో నర్సు వచ్చి రెడీ అని చెప్పింది. పదండి టెస్ట్ రూమ్ లోకి అన్నాడు.

టెస్ట్ రూమ్ లోకి వెళ్ళేముందు నర్సు నా కళ్ళకి గంతలు కట్టింది. ఇదేమిటి అన్నాను. ఈ టెస్ట్స్ కి ఇది అవసరం అన్నాడు. నన్ను నర్సు నడిపించుకొని తీసుకెళ్లింది. స్పర్శ భాగ్యం  బాగానే ఉంది అనుకున్నాను. టెస్ట్ రూమ్ లోకి వెళ్ళిన తరువాత  డాక్టరు గారు చెప్పారు. ఇప్పుడు కొన్ని శబ్దాలు వినిపిస్తాము అవి ఏమిటో చెప్పాలి అన్నాడు. అల్లాగే అన్నాను నేను. రెడీ,  ప్లే అన్నాడు. చప్పుడు వినిపించింది. తబలా అన్నాను. వెరీ గుడ్, నెక్స్ట్ అన్నాడు. మళ్ళీ శబ్దం వినిపించింది. వీణ అన్నాను. గూడ్ అన్నాడు. మళ్ళీ వినిపించింది. గిటార్ అన్నాను. ఇంకోటి వినిపించింది. నాదస్వరం అన్నాను. మీ చెవి బ్రహ్మాండంగా పని చేస్తోంది అన్నాడు.

ఇప్పుడు మీకు కొన్ని వాసనలు చూపిస్తాం. అవి ఏమిటో చెప్పాలి అన్నాడు. అల్లాగే అన్నాను. నాకూ హుషారు వచ్చేసింది. ఇప్పుడు ఒక ఆడ గొంతుక మధురంగా వినిపించింది. మీరు గిన్నె మూత తీసి గిన్నెలో ముక్కు పెట్టకుండా పైనుంచి ఆఘ్రాణించి వాసన చెప్పాలి అంది. మీరెవరండి అని అడిగాను. ఆవిడ డాక్టరు గారి భార్య అని నర్సు చెప్పింది. ఇందాకా వాయించింది ఆవిడే. పిల్లలకి మ్యూజిక్, వంటలు నేర్పుతుంది అని కూడా చెప్పింది.    నన్ను మళ్ళీ నడిపించుకొని గిన్నె దగ్గరికి తీసుకెళ్ళింది. నేను మూత తీసి వాసన చూశాను. పప్పు పులుసు వాసన వేస్తోంది అన్నాను.  వెరీ గుడ్ అని డాక్టర్ గారి భార్య అంది. చాలామంది సాంబార్ అంటారండి అని అంది. ఆయ్ మనది పగోజీ అండి. అయినా ఏ గాడిద అన్నాడండి అల్లాగ, వేయించి ఉడకపెట్టిన కందిపప్పు, ధనియాల పొడి వాసనా మేళవించిన ఈ వాసన తెలియని వాడు అని నేను ఆశ్చర్య పడ్డాను. ఆవిడ కిసుక్కున నవ్వింది. డాక్టరు గారు కోపంగా పని చూడండి అన్నాడు. రెండో గిన్నె తీసి చూశాను.  పచ్చిమిర్చి అల్లం దట్టించి కొత్తిమీర వాసనలు వెదజల్లుతున్న వంకాయ కూర అన్నాను. సెభాష్ అంది ఆవిడ. ముక్కు బాగానే పని చేస్తున్నట్టుంది అని గొణిగాడు డాక్టరు. ఉండండి అని ఆవిడ నాదగ్గరగా వచ్చి నా జడలో ఏమి పూలు పెట్టు కున్నానో చెప్పండి అంది.  ఇంకొంచెం దగ్గరగా రండి అని ఆవిడ జడ వాసన చూశాను. సన్నజాజులు, మొగలిరేకులు, దవనం వాసనలు వేస్తున్నాయి అని చెప్పాను. ఓహ్ యు ఆర్ గ్రేట్ అంది  ఆవిడ అబ్బురంగా.  మీ ముక్కు కత్తిలాగా పని చేస్తోంది అని ఆవిడ సర్టిఫికేట్ ఇచ్చారు.

ఇప్పుడు కొన్ని రుచులు చూపిస్తాము. నాలుగు చుక్కలు మీ నాలిక మీద వేస్తాం. ఏమి రుచో మీరు చెప్పాలి అంది ఆవిడ. నర్సమ్మ నా తల వెనక్కి వంచి పట్టుకోగా శ్రీమతి డాక్టర్ నా నోట్లో నాలుగు చుక్కలు వేశారు. తేనె పాకం అన్నాను. గూడ్ అంది  ఆవిడ. ఇంకో గ్లాసుడు పోయ్యండి అని అడిగాను. తరువాత అంది. నర్సమ్మ నన్ను వాష్ బేసిన్ దగ్గరికి తీసుకెళ్ళితే నేను నీళ్ళు పుక్కిలించి వేశాను. రెండో మాటు మళ్ళీ నాలుగు చుక్కలు. ఇది ఉప్పు వేసిన చింతపండు రసం అన్నాను. గుడ్ అంది  ఆవిడ. మూడో మాటు నిమ్మరసం లో ఉల్లికారం అన్నాను. సుమారు  20 మందికి ఈ టెస్ట్స్ చేశాం. ఎవరూ ఇంత కరెక్టు గా చెప్పలేదండీ అని ఆవిడ చాలా ఆనంద పడిపోయింది. 

నర్సు నా కళ్ల గంతలు విప్పింది. ఆవిడను చూశాను. మీకూ  కళ్ల డాక్టర్ కి పోలికలు ఉన్నాయండి అన్నాను.  మా పిన్ని గారమ్మాయే నండి అంది.   మీ ENT అంతా బాగానే ఉంది అన్నాడు డాక్టర్. T కి టెస్ట్ ఏమి చేయలేదు కదా డాక్టర్ గారూ అన్నాను.  నాలుకకి గొంతు కు దగ్గర సంబంధమే,  నాలిక బాగుంటే గొంతు బాగున్నట్టే అని తేల్చి చెప్పాడు డాక్టర్. నేను కొంచెం అనుమానం గా చూశాను.  ఆయన ఘట్టిగా నా గొంతు పట్టుకొని  నొక్కాడు. నేను కళ్ళు తేలేసి , నాలుక బైట పడేశాను. చూసారా గొంతు నొక్కితే కళ్ళు, నాలిక లలో రియాక్షన్ వచ్చింది కదా అన్నాడు.  నాకు ఒప్పుకోక తప్పలేదు.

 మరి అన్నీ బాగుంటే నా సమస్య ఏమిటి అన్నాను. మీరు  నారాయణ, గుండారావు లను చూడండి అన్నాడు డాక్టర్. వీళ్ళేవరండి  అన్నాను. నారాయణ నరాల డాక్టర్, గుండారావు గుండె డాక్టర్  వాళ్ళు పై వీధిలో ఉంటారు. మనవాళ్లే  వెళ్లిరండి. మేం అందరం కలిసి చర్చించి   రోగ నిర్ధారణ చేస్తాం  అని చెప్పాడు.  నాకేం చెయ్యాలో తోచలేదు. రేపు చూస్తాను లెండి అని వచ్చేశాను. ఇంకా ఎంతమంది చుట్టూ తిరగాలో అని విచారించాను.

సాయం కాలం మా బాల్య మిత్రుడు  శంకరం వచ్చాడు మా ఇంటికి,   ఏంటిరా డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నావుట అంటూ.  చూసిన డాక్టర్లు ఎవరు చెప్పలేకపోయారు.  ఇంకో ఇద్దరు ని చూడమని సలహా ఇచ్చారు. ఈ ఇద్దరితో ఆగుతుందా ఇంకా ఎంతమంది డాక్టర్ లను చూడాలో, అంతా అయోమయం గా ఉంది అని విచారించాను. అసలు నీ సమస్య ఏమిటి? అని అడిగాడు వాడు. నలుగురికి చెప్పుకోలేని సమస్య రా అని బాధపడ్డాను. చెప్పు ఫరవాలేదు నేనెవరికి చెప్పను అని హామీ ఇచ్చాడు. సమస్య ఏమిటంటే మా పక్కింటి  లావుపాటి ఆవిడ ఉంది కదా.ఎవరూ రంగమ్మ గారా?  లిఫ్ట్ లోకి అడ్డంగా కానీ వెళ్లలేని ఆవిడా అన్నాడు. అవును ఆవిడే,  గత రెండు నెలలు గా ఇలియానా లాగా కనపడుతోందిరా ఆవిడ  అని చెప్పాను.                                

శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు

నా కధ    శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు    అంతర్జాల పత్రిక  ఈ మాట  ఎల్లలు లేని ప్రపంచానికి ఎలెక్ట్రానిక్ తెలుగు పత్రిక,  సెప్టెంబర్ 2011, సంచిక    లో  ప్రచురించారు.  మీరందరూ  ఆ కధ


చదివి మీ అభిప్రాయాలు  చెప్పవలసిందిగా మనవి చేసుకుంటున్నాను . 

నా కధ వారి పత్రిక లో ప్రచురించినందుకు  ఈ మాట  యాజమాన్యానికి,  కధను  సవరించిన సంపాదకులకు ముఖ్యంగా శ్రీ మాధవ్ మాచవరం  గారికి  ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను.

అంచేత నేను చెప్పొచ్చేదేమిటంటే .... మాలిక పత్రికలో నా కధ

మాలిక పత్రికలో నా కధ  'అంచేత నేను చెప్పొచ్చేదేమిటంటే'   అచ్చయ్యింది. అంచేత మీరందరూ మాలిక పత్రిక,  శ్రావణ పూర్ణిమ సంచిక లో ఈ కధ చదివి మీ అభిప్రాయాలు తెలియ జేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను.

ఈ నా కధ ను వారి శ్రావణపూర్ణిమ సంచికలో ప్రచురించినందుకు మాలిక పత్రిక యాజమాన్యానికి ధన్యవాదాలు  తెలియజేసుకుంటున్నాను.  

పాక శాస్త్రము – ప్రాధమిక సూత్రాలు.

ఈ మధ్యన చాలా మంది ఆడ లేడీస్ మగ జెంట్సు కూడా  వంటలు వార్పులు అంటూ వ్రాసేస్తున్నారు.   తింటే వాంతులు అని కొంతమంది కామెంటుతున్నారు కూడాను.  TV లో కూడా ఛెడామడా చూపించేస్తున్నారు .  ఈ వంటలు అన్నీ చాలా శ్రద్ధగా చదివాను, చూశాను.  కొత్తరకం వంటల గురించి కొంచెం లోతుగా అధ్యయనం చేశాను.  ఇందులో చాలా మట్టుకు మా నాయనమ్మ చేసిన కూరలే. వాటికి  కొంచెం  విదేశీ పద్ధతులు,   కొంచెం ఉత్తర భారత రుచులు కలిపి పేరు మార్చి చలామణి చేసేస్తున్నారు అని అనుమానం వచ్చింది. రుచి మాట తినేవాడి ఖర్మ కానీ  అలంకరణ చేసి కంటికింపుగా (వాళ్ళ ఉద్దేశ్యం లో) చేసి పెట్టేస్తున్నారు.   నలభై ఏళ్ల నా రీసెర్చి అనుభవం తో  నేను కూడా కొన్ని కొత్త రకాల వంటకాలు దేశం మీదకు,  అమాయక పాఠకుల మీదకు వదులుదామని నిశ్చయించేసుకున్నాను.  నా రీసెర్చి కి ఈ వంటల కి సంబంధం ఏమిటంటారా. అదో పెద్దకధ.

 నేను చాలా కష్టపడి  రీసెర్చి చేసి దేశాన్ని ఉద్ధరించేద్దామనే సదుద్దేశం తోనే రీసెర్చి ఇన్స్టిట్యూట్ లో చేరాను. చేరిన కొత్తలో రీసెర్చి ఎల్లా చేయాలి, ఎందుకు చేయాలి అంటూ మా గ్రంధాలయం లో కూర్చుని పుస్తకాలు జర్నల్సు  తెగ చదివేశాను. ఒక ఏడాదిలో  జ్ఙాని నై పోయాను. వార్నీ,  రీసెర్చ్ అంటే ఇంత తేలికా అని హాచ్చెర్యపడిపోయాను. ఇక మనకి అడ్డేమిటి, విజృంభించేద్దామనుకున్నాను. కానీ ప్రతి సినిమాలోనూ ఒక విలను ఉంటాడు, ప్రతి అభిమన్యుడి  పతనం వెనకా ఒక సైంధవుడు ఉంటాడు, ప్రతి మొగుడి వెనక ఒక పెళ్ళాం ఉంటుంది, అని గ్రహించాల్సి వచ్చింది. నేను లైబ్రరి లో పుస్తకాలు కాచి వడబోస్తుంటే ఒక విషయం అర్ధం అయింది. ఇది చెప్పడం కొంచెం కష్టం.

 ఉదాహరణకి  ఒక పెద్ద ప్రొఫెసరు గారు ఉంటారు. ఆయన  లాబ్ లో బొల్డు మంది కుర్రాళ్ళు . కొద్దిమంది కుర్రమ్మలు కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా దేశాన్ని ఉద్దరించేద్దామనే సదుద్దేశం తోనే ఉంటారు. కానీ ప్రోఫసరు గార్కి టైమ్ తక్కువ , లాబ్ లో చోటు ఉండదు. కానీ ఎక్కువమందికి పేరు కు  ముందు డాక్టరు జేరిపించేద్దామనే దుగ్ద బలం గా ఉంటుంది. వీరు ఒకరోజు సాయంకాలం సభ లో కూర్చుంటారు. కుర్రాళ్ళు,   కుర్రమ్మలు  చుట్టూ చేరుతారు. ఆయన ఒలికించిన జ్ఙానం  మూట కట్టుకోడానికి,  నోట్ బుక్ లు పెన్సిల్ లు రబ్బర్ లు పట్టుకుని. అప్పుడే చీకటి పడుతూ ఉంటుంది. ఆకాశంలో చంద్రుడు ఇప్పుడే వచ్చేదామా, ఇంకోచెంసేపు ఆగుదామా అని దీర్ఘాలోచనలో ఉంటాడు. ఈయన కి ప్రోఫసరమ్మ గారు (అంటే సర్ గారి భార్య) ఒక గాజు గ్లాసు లో  నారింజ రసం ఇస్తుంది. ఈయన మెల్లిగా చప్పరిస్తూ,  రుచి ఆస్వాదిస్తూ తల పంకిస్తూ ఉంటాడు. ఇంతలో కొంపలు అంటుకున్నట్టు చంద్రుడు గారు మబ్బులను చీల్చి చెండాడి విజయ గర్వంతో బయట పడతాడు. ఈ మీటింగ్ ని చూసి పోనీ పాపం అని కొన్ని వెన్నెల కిరణాలు అటు వైపు పంపుతాడు.  

గురువుగారు చంద్రుడి కేసి చూస్తారు. వారు పంపిన కిరణాలు బేరీజు వేస్తారు. చేతిలో గ్లాసులోని  నారింజ రసం  లో చంద్రుడిని  చూస్తారు. ఆయనికి బల్బు వెలుగుతుంది. చిరునవ్వు నవ్వుతారు.  కుర్ర (ఆళ్ళు, అమ్మలు)  పెన్సిల్ తీసి పుస్తకం లో వ్రాసుకోవడానికి తయారుగా ఉంటారు. ఆయన గ్లాసు పైకెత్తుతారు. ఏం కనిపిస్తోంది  అంటూ ప్రశ్నిస్తారు. చుట్టూ ఉన్న వాళ్ళు మాములుగానే తెల్ల రంగు మొహానికి పూసుకొస్తారు కాబట్టి అదే మొహం  పెడతారు. (ఎవడైనా రంగు పూసుకోకుండా వచ్చి ఏమి కనిపించటం లేదు అంటే వాడికి ఇంకో రెండేళ్లదాకా  పని చేయడానికి ఏమి దొరకదు. ) తెల్ల మొహాల తోటి ఇంప్రెస్ అయిన గురువు గారు మళ్ళీ నవ్వి సెలవిచ్చారు.

 ఆ కిరణాలు నారింజ రసం లో పడి ఏమౌతున్నాయి.   ఎవరు మాట్లాడరు.
వక్రీకరణం చెందుతున్నాయి. ఆ చంద్రుడు చూడండి చిన్నగా కనిపిస్తున్నాడు. 
ఆళ్ళు + అమ్మలు  ముక్త కంఠం తో  వహ్వా అన్నారు. ఆచార్యుల వారికి ఉత్సాహం వచ్చేసింది.
రక రకాల కాంతి  కిరణాల తోటి  వక్రీకరణం  ఎల్లా ఉంటుంది ఉదయ కాంతి , మధ్యాహ్న కాంతి, సాయకాలం కాంతి, చంద్రకాంతి   అని భాష్యం చెప్పారు.
యస్ సార్ యెస్  అని  తాని తందాన అన్నారు శిష్య పుంగవులు.
గాఢత పెరిగే కొద్దీ వక్రీకరణలో  తేడా లేమిటి? ఇందులో నిమ్మరసం కలిస్తే ఏ విధంగా  మారుతాయి.
 ఏం చెప్పారు గురూ  గారు అని భజన మొదలెట్టారు శిష్య పరమాణువులు. ద్రోణాచార్యులు వారు అర్ధనిమీలత నేత్రులై 

నాయనా ధర్మజా నీవు పని మొదలు పెట్టు రేపటినించి. భీమార్జునులారా  మీరు నారింజలు, నిమ్మలు వెతకండి ఎక్కడ ఎవరింట్లో ఉన్నాయో? నకుల సహదేవులారా  మీరు గ్రంధాలయము నకు నరిగి ఈ విధమైన పని  ఇంతకు పూర్వము ఎవరు చేశారో చూసి వ్రాసుకు రండు. మనం వాటికి కొంచెం భిన్నంగా చేయాలి. అని ఉపదేశించారు.

మిగతా శిష్యా గ్రేసరులతో,    మనకి UV, IR కూడా వచ్చేస్తాయి ఇంకో  ఆర్నెలలో.  మీరు కూడా మొదలు పెట్టేయవచ్చు. రకరకాల కిరణాలు తోటి చేయవచ్చు. దబ్బరసం, నేరేడు రసం, రేగిరసం , పుచ్చకాయ రసం మొదలగు వాటితో చేసేయచ్చు. తేలికగా ఒక పది పరిశోధన గ్రంధాలు రచియించ వచ్చు. అమ్మా దుశ్సలా మీ ఇంట్లో మామిడి చెట్టు ఉంది కదా. నువ్వు మామిడి రసం మీద చేయవచ్చు.

ఇంతలో ఒక దుశ్శాసనుడు తెగించి అన్నాడు సార్ ఆపిల్ రసం తో కూడా చేసేద్దాం.
అంతే  గురుడు అగ్నిహోత్రుడయ్యాడు.  క్రోధారుణ నేత్రుడై,

 ఏమిరా దుశ్శాసనా కళ్ళు నెత్తి కెక్కినవా, ఉచితానుచితముల మరచితివా, ఆపిలు ధర ఎంతో ఎరుగవా మన రీసెర్చ్ గ్రాంట్ ఎంతో ఎరుగుదువా, మొత్తం అంతా కలపి అక్షరాలా 14 వేల 6వందల 43 రూపాయల 22 పైసలు. ఇందులో మీ 10 మందికి కెమికల్స్ కి, గాజు కుప్పెలకు, మొదలైన వాటికి తలకొకడికి సుమారు గా 12-13 వందలు. అందుకనే కదా ఇంత పొదుపుగా రీసెర్చిచేయిస్తున్నాను.   తక్కువ ఖర్చుతో ఎక్కువ Ph.D లు చేయించాలని    నేను  ఆలోచిస్తుంటే  ఆపిల్  కావాలిట  ఆపిల్  అని దులిపేశాడు. 

 దుశ్శాసనుడు మోమును చిన్నది చేసుకొని ఆచార్య దేవా తప్పును మన్నించుడు. అని ప్రాధేయ పడెను. గురు దేవులు శాంతం వహించి, శిష్య పరమాణువులకు  మార్గోపదేశము చేసి తను విశ్రాంత మందిరము నకేగెను.  ఆపైన శిష్యొత్తములు విజృంభించి ఒక 5-6 ఏళ్ళు ఘోరముగా, క్రూరముగా అనేక రసములను విశ్లేషించి ఒక అర డజను పైగా Ph.D  లు సంపాదించిన వారలైరి.

 ఇదే పద్ధతిలో నేను కూడా రీసెర్చ్ ని పొడిచేసి కాచి వడబోచి ఒక డాక్టొరేటు సంపాదించుదా మని ఉద్దేశ్యించిన వాడనై, మా చిన్న బాసు గారి సన్నిధానమున చేరి వారికి నా మనోగతము నెరిగించిన వాడనైతి.  కోతి కల్లు  తాగటం అంటే ఏమిటో, అగ్గిమీద గుగ్గిలం అంటే ఏమిటో కధ కళి లో శివతాండవం ఎల్లా ఉంటుందో మొదలైన వన్నీ తత్ క్షణంబే తెలిసిపోయాయి.

 నువ్వు రిసెర్చేది  పెట్రోలియం  మీద. ఇందులో అటువంటి శశభిషలు కుదరవని ఎరుగవా? అందులోనూ నువ్వాడే నాటకం అప్లైడ్ రిచేర్చి లో.  బేసిక్ రిచెర్చి ఇక్కడ కుదరదు.
 అని దురహంకార మదోన్మత్తుడై   పోరా పోమ్ము ఈ వేళ అట్టెండర్ రాలేదు. గాజు కుప్పెలను కడిగి శుభ్రపరచుము, యంత్ర పరికరములమీద దుమ్మును తొలగించుము
 అని ఆజ్ఙలు జారీ చేసి తాను సమావేశము న కరిగెను. ఆహా ! గాడు ప్రోపొసెస్, చిన్న బాసు డిస్పొసెస్ అని చింతించినవాడనై  కార్యోన్ముఖుడ  నైతిని.  ఈ విధము గా నా ఉత్సాహమున నీరు చల్లి నా  రిచెర్చి ప్రక్రియను కారు కష్టముల పాల్జేసిన సైంధవుడు మా చిన్న బాసు.       

 ఇప్పుడు ఈ వంట బ్లాగులు, వంట టి‌వి ప్రోగ్రాము లు చూసి చూసి  నేను కూడా పై ప్రొఫెసర్ గారిలా వంటల రీసెర్చ్ చేసేద్దామని  డిసైడెడ్ అన్న మాట.  ఇక మీరేం చేయలేరు. ఇది చదివి తరించడం తప్ప. సాధారణం గా నేను ఏ నిర్ణయాలు తీసుకోను ఎందుకంటే తీసుకొనే వారు వేరే ఉన్నారు. నేను ఆజ్ఙానువర్తి ని.  కానీ తీసుకున్నానంటే  మడమ తిప్పను. ఎందుకంటే రెండు కాళ్ళు విరిగి ప్లాస్టరు లో ఉంటాయి కనుక.  కారణాంతరముల వల్ల రాణీ గారు దూరదేశ మేగినప్పుడు మనకు ఆటవిడుపు కావున సాహసించితిని.

పాక శాస్త్రం లో ప్రాధమిక సూత్రాలు ఏమిటి అని ఆలోచించాను. చాలా మందికి ప్రాధమిక సూత్రాలు ఉంటాయని కూడా తెలియదని తెలిసి విచారించితిని.  ప్రాధమిక సూత్రాలు ముఖ్యమైనవి చూద్దాం.  

1. ఆహార్యం :  దీని గురించి నేను చాలా పరిశోధించి  తెలుసుకున్నాను. మా అమ్మమ్మ గారు చేసినట్టు మా అమ్మగారు చేయలేరు. మా అమ్మ గారు చేసినట్టు మా సోదరీ మణులు కానీ మా ఆవిడ కానీ చేయలేరు. రుచి కి సంబంధించి,  అందరూ ఒకటే స్కూలు. మా ఆమ్మమ్మ గారి దగ్గర  మా అమ్మ,   వారి దగ్గర నుంచి వీళ్ళు నేర్చుకున్నారు  తు చ తప్పకుండా . కానీ రుచిలో తేడా వచ్చేస్తుంది.  పదార్ధాలు,  పరిమాణాలు     అన్నీ అవే అయినప్పటికి. తేడా ఎక్కడ వస్తుందా అని చచ్చేటట్టు ఆలోచించాను. చావగా చావగా సమాధానం గోచరించింది.
మా అమ్మమ్మ గారు ఉదయమే స్నానం చేసి మడికట్టుకొని పూజ చేసి  వంటలోకి దిగేవారు. వంట చేసినంత సేపు ఆ నారాయణుడి మీదో , శంకరుడి మీదో, ఆ తల్లి పార్వతమ్మ మీదో పాటలో శ్లోకాలో చదువుతూ చేసేవారు.

 మా అమ్మ గారు స్నానం చేసి పూజ చేసి మొదలుపెట్టేవారు.  అవసరమైనప్పుడు మాత్రమే మడి కట్టుకొనేవారు. అంటే మా దువ్వూరి పెద్దమ్మ వచ్చినప్పుడో , మా  గుళ్ళపల్లి బాబయ్య వచ్చినప్పుడో, ఏవైనా వ్రతాలు, తద్దినాలు లాంటి సమయాల్లో మట్టుకు మడి కట్టుకొని నిష్ఠగా చేసేది. తద్దినం రోజున   గారెలకు వచ్చిన రుచి మిగతా రోజుల్లో  రాదేమిటి అని కూడా అనుకొనే వారం.  పాపం అమాయకురాలు.  ధర్మ సూక్ష్మం తెలియక, మా అమ్మ ,   తద్దినం రోజున నాలుగు పచ్చళ్ళ తో గారెల  రుచి బాగానే ఉంటుందని అనేది.  

 సరే మా ఆవిడ  కానీ మా సోదరీ మణులు కానీ ఆలస్యం గా లేచేవారు.  మడి కట్టుకోవడం మాట అటుంచి, స్నానం చేసో చెయ్యకో, ఏదో విధం గా ఇంత చేసి పాడేస్తే తినిపోతాడు కదా మొగుడు అనుకుంటూ చేసేవారు. పైగా వంట చేసేటప్పుడు  సినిమా పాటలు పాడుకొనే వారు. పోనీ ఆ పాటలైనా ఈశ్వరా జగదీశ్వరా లాంటి వి కావు ఆ వెధవ పాటలు  ఆ తెలిసిందిలే  ఓర్నాయనో తెలిసిందిరోయ్”   టైపు పాటలన్నమాట.  

కాబట్టి ఇందుమూలం గా నేను కనుక్కొన్నది ఏమిటంటే  రుచి  అమ్మమ్మ చేసినట్టు ఉండాలంటే, అమ్మమ్మ లాగానే సూర్యోదయ పూర్వమే లేచి స్నానమాచరించి  శుచిగా మడి కట్టుకొని, పూజ చేసి,   శ్రద్దగా  భగవంతుని ధ్యానిస్తూ, చేసే పనిమీద  దృష్టి నిలిపి  వంట చేయాలి. 

 2. పదార్ధాలు :  ఇవి కూడా చాలా ముఖ్యం. పదార్ధాలు అంటే వంటకు ఉపయోగించే  కూరగాయలు, పప్పు దినుసులు, పోపు సామాను, ఉల్లి, పచ్చిమిర్చి ఇత్యాదులన్నీ . వీటన్నిటికి కూడా స్థాండ ర్డైజేషను చేయాలి. గుంజి పచ్చిమిర్చి కి పగోజి పచ్చిమిర్చికి  రుచిలోను కారం లోను తేడాలుంటాయి. ఒకటి తిన్న వెంటనే గూబ గుయ్యుమనిపిస్తే, రెండోది కొంచెం ఆలస్యంగా నషాలానికి కెక్కుతుంది. భీమవరం  లో దొరికే ఆనపకాయకి హైదరాబాద్ లో దొరికే దానికి తేడాలుంటాయి.  టివి లోడోర్నకల్ లోని, భామ చేసి  చూపించిన  వంకాయ కూర, బెజవాడ పడతి చేస్తే అదే రుచి రాదు. కిటుకు ఎక్కడుందో గ్రహించారు గదా. టివి లో వంటల విషయం లో ఇంకో ధర్మసూక్ష్మం కూడా పాటించాలి.  వంట చేసే ఆవిడ ఒకరైతే హడావడి చేసే అంకాళమ్మ ఏంకరమ్మ, ఒకత్తుంటుంది. ఆవిడ మధ్య మధ్య  ప్రశ్నలు అడుగుతుంది.

 మీ హస్బెండ్ మీకు వంటలో హెల్పుతాడా? హెల్పడా మీరు చేసిన కొత్త రకం  వంటలు  ఆయనే తింటాడా  లేక బలవంతం గా మీరు ఆయన నోట్లో కుక్కుతారా? తిన్న వెంటనే ఆయనే హాస్పిటల్ కి పరిగెడతాడా  లేక రెండు రోజుల తరువాత మీరే అంబులెన్స్ లో తీసుకెళతారా ?. 

 ఇటువంటి ప్రశ్నలకు జవాబు ఇచ్చేటప్పుడు కలిగే ఆనందోత్సాహాలు  కూడా వంటల రుచి ని మార్చేస్తాయి. ఆనందోద్రేకాలతో  ఆవిడ గరిట ఘట్టిగా తిప్పేయవచ్చు. అప్పుడు గిన్నెలో పదార్ధాలు బాగా కలిసిపోవచ్చు. లేకపోతె కలిసినవి విడిపోవచ్చు  కారం సరిగ్గా పట్టవచ్చు పట్టకపోవచ్చు .  అందుకని టివి వంటలు చేసేటప్పుడు మీ పక్కింటా విడను తోడు తెచ్చుకోండి.  కూరగాయలు ఆవూరు నుంచే తెప్పించుకోండి. అవే బ్రాండ్ పదార్ధాలు ఉపయోగించండి.

 ఒక్కొక్కప్పుడు  ఒంటి  మీద  బంగారం  కూడా  పిచ్చ కాన్ఫిడెన్స్  ఇస్తుంది.  తిన్న వాడికేమైనా మన భుక్తికి లోటు ఉండదు అనే నమ్మకం కలిగిస్తుంది  అన్నమాట.  ఉన్న నగలన్నీ పెట్టుకొని మొదలుపెట్టండి. 

 3.పరికరాలు:  మా చిన్నప్పుడు మా అమ్మమ్మగారు  ఇత్తడిగిన్నెల్లోనే వంట చేసేవారు. మా అమ్మగారు కూడా చాలా కాలం ఇత్తడిగిన్నెల్లోనే చేసేవారు. ఆ తరువాత పాత బట్టలకి స్టీలు సామాను వ్యాపారం మా ఊళ్ళో కూడా అభివృద్ధి  చెందిన తరువాత స్టీలు గిన్నెలు ఉపయోగించడం మొదలు పెట్టారు. అప్పటినించి రుచి కొంచెం తగ్గిందేమో నని నా అనుమానం. మా ఆవిడ హయాము లో కుక్కర్లు , గ్యాస్ పొయ్యలు, మిక్సీ లు,   ఇత్యాదులు వచ్చి రుచులు ఇంకా తగ్గిపోయాయి.

 మినప రొట్టి కానీ కొయ్య రొట్టి కానీ ఇత్తడి సిబ్బెలో చేస్తే వచ్చే రుచి ఆహా అద్భుతం. ఆ రుచి మళ్ళీ ఇప్పటిదాకా నా జిహ్వకి రాలేదు. అది కూడా కుంపటి మీద చేస్తూ పైన ఇత్తడి పళ్ళెం మూతపెట్టి దానిమీద బొగ్గులు వేస్తే యమా యమా గా ఉండేది రుచి.  సారీ యమ్మి యమ్మి అనాలనుకుంటాను ఇప్పుడు.
  
మా అమ్మమ్మ గారు వంట మొదలు పెట్టినప్పుడు 4 కట్టెలు మండించేవారు కొంతసేపయిన తరువాత రెండు కట్టెలు తీసేసేవారు. మళ్ళీ ఇంకోటి పెట్టేవారు.   చివరికి వచ్చేటప్పటికి కట్టెలు తీసివేసి కట్టెలద్వారా వచ్చిన బొగ్గుల వేడితోటే చేసేవారు.

 Ph.D  చేద్దామని  వచ్చిన ఒక  తెలుగు  chemical engineer కి ఈ సమస్య ఇచ్చాను. రకరకాల గిన్నెలలో తెలుగు వంటలు, కట్టెలపొయ్యి, కుంపటి, గ్యాస్ స్టౌ ఉపయోగములలో heat transfer effects, ఉడుకుటలో తేడాలు, రుబ్బురోలు, మిక్సీ లో తేడాలు,    తద్వారా రుచిలో  మార్పులు.   పాపం విన్న వెంటనే పారిపోయాడు. కానీ నాకు ఘట్టి నమ్మకం ఒక్క దిబ్బరొట్టి తయారీ తోనే నాలుగు Ph.D లు సంపాయించవచ్చు అని.  

 మన తెలుగు సంస్కృతి అంతా తెలుగు వంటలలోనే ఉందని నమ్మినవాడిని. తెలుగు సంస్కృతి వర్ధిల్లాలంటే   తెలుగు వాళ్ళు అందరూ  మళ్ళీ,   ఇత్తడి గిన్నెలు,  రుబ్బురోలు,   కట్టెల   పొయ్యలు,      కుంపట్ల   తోటి వంటలు చేయాలని మనవి చేసుకుంటున్నాను.  కనీసం పండగలకి పబ్బాలకి అయినా అవి ఉపయోగించాలని, దీనికి విధిగా ఒక చట్టం చేయాలని ప్రభుత్వం వారిని డిమాండ్ చేస్తున్నాను.

 ముఖ్యమైన ప్రాధమిక సూత్రాలు పైన చెప్పాను. ఇంకా కొన్ని ఉన్నాయి. కొన్ని case specific కూడా ఉన్నాయి. ఇవి అన్నీ వంటల తయారీ లో చెబుతాను.

 తరువాత టపా  ‘వంకాయ పప్పు కూర భళా’  తయారు చేయడం ఎలా? తొందరలోనే వ్రాస్తాను. అప్పటిదాకా సెలవ్. 

సంసార సాగరం లో సుడిగుండం

నా కధ      సంసార సాగరం లో సుడిగుండం    మాలిక పత్రిక, ఉగాది సంచిక  లో ప్రచురించబడింది.  మీరందరూ చదివి మీ అభిప్రాయాలు  తెలియచేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను, తెలియ చేసుకుంటున్నాను మరియు అభ్యర్ధిస్తున్నాను. చదివి హాహాహః  అని కూడా అనుకోవాలని కోరుకుంటున్నాను.
 
నా కధ వారి పత్రిక లో ప్రచురించి  నందుకు మాలిక పత్రిక యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను.   


మీ కందరికి శుభవార్త

నా  బ్లాగులో ఒక నెల /  నెలా పదిహేను రోజులు / రెండు నెలలు  శలవు   తీసుకుంటున్నాను.  ఎందుకంటే  ఇల్లు, ఊరు మారుతున్నాను.  ఊరెందుకు మారుతున్నావు అని చాలా మంది అడిగారు. ఊరికేనే, సరదాగా, పని పాడు లేక అని జవాబు ఇచ్చాను. మీరు అడక్కండే. మళ్ళీ రిపీట్ చెయ్యాలి పై వాక్యం.


అవునూ నువ్వు ఊరు మారితే దానికి ఒక టపా వ్రాయాలా అని చిరాకు పడకండి.  ఒక నెల రోజులు టపాలు వ్రాయక పోతే, గురుడు టపా కట్టేశాడేమోనని,   మీరు  అపోహ పడి ఆనంద పడిపోతారేమో నని భయం వేసిందన్నమాట. కొంతమంది ఇంకా ఉత్సాహపడి సంబరంగా సానుభూతి సందేశాలు కూడా పంపిస్తారేమోనని కూడా అనుమానం వచ్చేసింది.
   
ఇంతకీ ఎక్కడకి అంటారా. ఏలూరు కి. మీది భీమవరం కదా ఏలూరు ఏంటీ మళ్ళీ అని ఇంకో ప్రశ్న వద్దు. దుర్భిణీ పెట్టుకొని మరీ చూశాను. భీమవరం, ఆ చుట్టుపక్కల కూడా ఒక్క పరిచయమైన ముఖం కానీ, బీరకాయ పీచు సంబంధం కలవాళ్లు కానీ  ఎవరూ కనిపించలేదు. ఆశ్చర్యం వేసింది. సుమారు 32 ఏళ్ళు ఉన్నాం భీమవరంలో. 78 లో మా అమ్మగారు పోయిన తరువాత వదిలేశాము. ఇప్పుడు ఎవరూ లేరు.    ఏలూరు, ఆ చుట్టుపక్కల నల్గురైదుగురు కనిపించారు. అంతా మా ఆవిడ వైపు వారే. సరే 16   ఏళ్ళు హైదరాబాదు లో మా వాళ్లందరి మధ్య ఆవిడ ఉంది కదా, ఒక రెండు మూడేళ్లు వాళ్ళ వాళ్ళ మధ్య మనం ఉండలేమా అని ఏలూరు కి మారిపోతున్నాము.  అదన్నమాట సంగతి. 

సరే నీ గొడవ అంతా మాకు ఎందుకు చెపుతున్నావు అని విసుక్కుంటున్నారా.  మావాళ్ళెవరూ ఒప్పుకోవడంలేదు నేను ఏలూరు వెళతానంటే, అందరూ ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడం ఎందుకు అని.   కనీసం మీ రెవరైనా రైట్ రైట్ అంటారేమో ననే ఆశ తో నన్నమాట . అదీ సంగతి మిత్రులారా.   

యమ పాశాన్ని అడుగు దూరంలో ఆపేసిన మా ఆవిడ

చచ్చి బతకడం అంటే ఏమిటో తెలుసుకున్నాను ఈ రోజు.  నరకానికి,  ఏ నరకమో తెలియదు కానీ కొద్ది దూరంలో ఆపి సతీ సావిత్రి లాగా మా ఆవిడ  నా ప్రాణాలు కాపాడి నన్ను పునర్జీవితుడిని  చేసింది.  నాకింత కష్టం వస్తుందని ఆవిడ కనిపెట్టి  తగు చర్యలు తీసుకొని ఉండకపోతే నేను మళ్ళీ ఇక్కడ కనిపించేవాడిని కాదు. ఇల్లా మీ అందరి మస్తిష్కాలు ఫలహారం చేసేవాడిని కాదు.  మా ఆవిడకి, నా భార్యా మణికి, పతివ్రతా శిరోమణికి నా శేష జీవితమంతా ఋణపడి ఉంటానని ఈ బ్లాగు ముఖంగా ప్రతిజ్ఙ చేస్తున్నాను. ఆ కధ ఏమిటంటే.

ఉదయం రోజులాగానే తెల్లవారింది.  సూర్య భగవానుడు రోజు లాగానే  మా ఇంటి వెనకాల రెండు చెట్ల మధ్యనించి పైకి లేస్తున్నాడు.  టైమ్ చూస్తే రోజులాగానే 7.00 AM అంటోంది. రోజులాగానే సిగరెట్టు వెలిగించి మంచం మీదనించి లేచాను. రోజు లాగానే కాఫీ అని అరిచాను. వస్తున్నా అని మా ఆవిడ అంది రోజులాగానే. అయ్యో ఈ వేళ కూడా ఏమి మార్పులేదు అంతా నిన్నటికి మల్లె, మొన్నటికి మల్లె రోజులాగానే మొదలవుతోంది అని విచారించాను రోజులాగానే.  నాకు జీవితం మీద విరక్తి పుట్టింది రోజులాగానే.  ఏదో ఒకటి చెయ్యాలి ఈ మోనోటోనస్  బతుకు మార్చాలి అనుకున్నాను. ఛీ ఎధవ బతుకు అనుకున్నాను. మళ్ళీ ఒక ఆత్మహత్య ప్రయత్నం చేద్దామా వినూత్నంగా, అని  అనుకున్నాను . ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చేసింది.  రెండు రోజులుగా ఒక TV  చానెల్ లోనూ, ఒక పత్రిక లోనూ ఒక ప్రకటన చూస్తున్నాను.  ఒక మహత్తర సాంఘిక టి‌వి చిత్రరాజము ఈ రోజున బ్రహ్మాండమైన విడుదల కాబోతోందని.  ఆలసించిన ఆశాభంగం, త్వరపడండి. చూసేయండి అని. ఆ సినిమా  పేరు ఐ లవ్ యు డాడీ.  కాబట్టి ఈ సినిమా నేను చూస్తాను అని,   ఉదయము  ప్రకాశముగా ప్రకటించినాను. ఆత్మహత్య చేసుకుంటాను అని ప్రకటించడం, చేసుకోక పోవడం నాకు అలవాటే.   అసలు నేను సినిమాలు చూడడం చాలా తక్కువ. అటువంటిది నేను సినిమా చూస్తానంటే ఎవరు నమ్మలేదు. అయినా అదే టైమ్ లో క్రికెట్టు మ్యాచ్ కూడా ఉంది కాబట్టి సినిమా చూడను అనే నిర్ధారణకు  వచ్చేసారు మా ఇంట్లో వాళ్ళంతా. కానీ వారొకటి తలచిన నేనొకటి తలచుదును గదా. 

ది 13-2-2011, 2-30. PM.
మధ్యాహ్నం 2-30 గంటలకి నేను క్రికెట్ చూడ్డం మొదలు పెట్టాను.  మా ఇంట్లో వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 5 గంటలకి నేను మా మిత్రుడు శంకరానికి ఫోను చేశాను. బాల్య మిత్రమా  ఒక వేళ నాకేమైనా అయితే నువ్వు పూనుకొని మా ఆవిడకి ఫ్యామిలి పెన్షన్ త్వరగా వచ్చేటట్టు చూడు. జోర్హాట్ లో డైరక్టరు బాగా తెలిసినవాడే. వారికి ఒక మైల్ పంపు. ఇక్కడ కూడా మా ఆఫీసు కెళ్ళి వాళ్ళకి తెలియపర్చి ఎకౌంట్స్ ఆఫీసరు ని కలిసి మాట్లాడు. ఆయన కూడా తెలిసినవాడే కాబట్టి అన్నీ ఆయనే చూస్తాడు.

వచ్చిన సంతాప సందేశాలు జాగ్రత్తగా భద్రపరచు.  పంపించని వాళ్ళకి గుర్తు చేసి వచ్చేటట్టు చూడు. నా బ్లాగులో కూడా నా అస్తమయ వార్త ప్రకటించి,  కామెంట్స్ అవి జాగ్రత్త చేయి. బ్లాగులో కామెంటు పెట్టని వారిని నేను దెయ్యమై పీడిస్తాను. అమ్మయ్య పీడా విరగడైంది అని కామెంటు పెట్టిన వాళ్లెవరైనా ఉంటే (అసలు వాళ్ళే ఎక్కువ ఉంటారేమో) వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. 

 ఆ తరువాత తెలిసిన స్వీట్ షాపు కి టెలిఫోన్ చేసి ఒక కే‌జి. మినపసున్నుండలు
, ఒక పది పూతరేకులు, ఒక అర కే‌జి. జీడిపప్పు పాకం , ఒక పావు కే‌జి బందరు లడ్డూలు వెంటనే పంపింఛమని చెప్పాను. చక్కెర వ్యాధి వల్ల ఇవి నాకు నిషిద్ధం మా ఇంట్లో. చివరి సారిగా తినేసి,  గోవింద కొట్టేద్దాము అని  నిశ్చయించుకున్నాను . 

 మా ఆవిడ విని కంగారు పడింది.  “తగునా ఇటు చేయ మీకు తగునా “ అని పాడింది. ఆవిడ కూడా తగు నివారణ చర్యలు మొదలు పెట్టింది.  మా పురోహితుడిని కాల్చేసింది.    అర్జెంటు గా వచ్చి  మృత్యుంజయ మంత్రం జపించమని అభ్యర్ధించింది. ఆయన ఇంకా యమర్జెంటు గా ఇంకెక్కడికో వెళ్లాల్సివచ్చి,  వాళ్ళ అబ్బాయి 12 ఏళ్ల కుర్రాడిని పంపిస్తానన్నాడు.  ఆవిడ స్నేహితులని నలుగురుని కూడా పిలిచింది. అఖండ కీర్తన చేయించడానికి. తను అభ్యంగన స్నానం ఆచరించి నిష్ఠ తో పట్టు చీర కట్టుకొని  పూజలు చేయటానికి ఉపక్రమించింది. ఎందుకేనా మంచిదని వాళ్ళ బంధువు ఒక RMP డాక్టరు కి  విషయం తెలియపర్చి రమ్మని కోరింది. 
 
13-2-2011, 5-45 PM. 

నేను కుర్చీలో నన్ను కట్టేసుకున్నాను. ఒక చెయ్యి విడిగా కట్టుకోకుండా వదిలేశాను. స్వీట్ లన్ని ఆ చేతికి అందేటట్టు పెట్టుకున్నాను.  RMP  డాక్టరు నా చేతికి  BP మిషను కట్టేశాడు. పాపం వాడి ECG. మిషను పాడైపోయిందిట. అందుకని మా ఆవిడకి సారీ కూడా చెప్పేశాడు.  నా గ్లూకో మీటరు దగ్గర పెట్టుకుని కూర్చున్నాడు.  శాస్త్రిగారబ్బాయి  పూజా సామాగ్రి రెడీ చేసి పెట్టుకున్నారు. అల్లాగే మా ఆవిడ కూడా. అఖండ కీర్తన టీమ్ హార్మోని, చిడతలు పట్టుకుని రెడీ గా కూర్చున్నారు.

సరిగ్గా 6-00 PM.
నేను ఒకపూతరేకు నమిలి మింగి TV చానెల్ మార్చాను. ఇది నా వ్రతం, ఎవరూ భంగం చేయవద్దు”  అని జనాంతికం గా ఉద్ఘాటించాను. 
 
 శాస్త్రిగారబ్బాయి  మంత్రాలు చదవడం మొదలు పెట్టారు.
భజన బృందం కరుణించు మా కామేశ్వరి అని మొదలుపెట్టేరు.
మా ఆవిడ మా ఇష్ట దైవం  భువనేశ్వరీ దేవి ని తలుచుకొని, “ఉద్యద్దినకర ద్యుతిమిందు కిరీటామ్, తుంగ కుచామ్, నయనత్రయ యుక్తామ్”  అంటూ ప్రార్ధనా శ్లోకాలు మొదలు పెట్టింది.
 మా అమ్మాయి నా ఒక్కడికి మాత్రమే టి‌వి కనిపించేటట్టు ఆరెంజ్ చేసింది. 

సినిమా మొదలయింది. హీరో గంభీరం గా నడుచుకుంటూ వస్తుంటాడు. నడుచుకుంటూ, నడుచుకుంటూ  వస్తున్న హీరో  పేరు పెద్ద అక్ష రా లతో తెర మీద.

BP  నార్మల్  80/130  అని అరిచాడు RMP. కట్టేసిన చేతి మీద చురుక్కు మంది. సుగర్ 150 ఓ‌కే. అని మళ్ళీ అరిచాడు ఆర్‌ఎం‌పి.
నమశ్శివాయః అంటూ శా. ఆ.  గొంతు మధురం గా వినిపిస్తోంది.
 కామేశ్వరీ అంటూ భజన బృందం,
 ప్రభజే భువనేశ్వరీమ్ అంటూ మా ఆవిడ. 

 హీరో ఆఫీసు లోకి అడుగు పెడుతాడు. నవ్వుతూ స్టాఫ్ వందన స్వీకారం చేస్తాడు. 

అప్పుడు నాకు అనుమానం వచ్చింది. నవ్వుతున్నాడా లేక పెదాలు విడదీసి పళ్ళు బయట పెట్టాడా   అని. 

BP 90/140   సుగర్ 160 అని ఆర్‌ఎం‌పి అరుపు.
 పాటలు, పూజల సౌండ్  రెండు డెసీబుల్స్ పెరిగాయి. 
నేనో మినపసున్నుండ ఆరగించాను.
ఎవరికైనా కాఫీ కావాలా అని  మా ఆమ్మాయి.

సినిమాలో “అద్భుతం ఫంటాస్టిక్ ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది” అంటాడు హీరో.  “తండ్రి చేయి పట్టుకుని నడుస్తున్న కుర్రాడు, నడిపిస్తున్న తండ్రి, గమ్యం చేరుతానంటున్న కొడుకు. వహ్వా వహ్వా గొప్ప ఐడియా”  అంటాడు హీరో.  ఈ కాన్సెప్ట్ గీసిన చిన్న హీరో ని పిలువ మంటాడు. 
 
చిన్న హీరో కి     హీరో అసలు హీరో  అంటే హీరో నే హీరో గా పూజిస్తుంటాడు. అర్ధం కాలేదా,  అదంతే, అల్లాగే ఉంటుంది. చిన్న హీరో తల్లి ఫోటోవు దగ్గర దీనాలాపనలు.  చిన్నతనం లోనే వదిలేసి వెళ్ళిన తండ్రి మీద కోపం, కసి, ఉక్రోషం  అన్నీ కక్కేస్తుంటాడు. 

వెంటనే కనిపెట్టేశాను నేను, వీడే వాడి కొడుకు అని. 

చిన్న హీరో అసలు హీరో సమావేశం.  రెండు ఇంక్రిమెంట్లతో ఉద్యోగం చిన్న హీరో కి హీరో దగ్గర.

 క్షమించాలి కలంలో కలకలం రేగుతోంది. పదాలు అటు ఇటూ అవుతున్నాయి. అర్ధం చేసుకోండీ. అచ్చు తుప్పులు, స్పెల్లింగ్ మిస్టేకులు పట్టించుకోకండి.   

నమో వెంకటేశా నమో తిరుమలేశా అని భజన బృందం పాట మార్చింది. 

అర్జెంటుగా మా ఆవిడా,  అమ్మాయి మంతనాలు. భజన బృందం బదులు ఘంటసాల బృందం వచ్చింది ట . భక్తి పాటలు మాత్రమే పాడే ఒప్పందం కుదిరిపోయింది.

మా ఆవిడ జనని శివకామినీ లోకి మారింది.
శా. అ. నమశ్శివాయః అంటూ జపిస్తున్నాడు.  

నేనో మినపసున్నీ, బందరు లడ్డూ ఒకే మాటు నోట్లోకి తోసేశాను.
 బి‌పి 140/210 సుగర్ 230   అని అరిచాడు ఆర్‌ఎం‌పి. 
మా ఆవిడ మంగళ సూత్రం తీసి ఫెడిల్ ఫెడెల్ మని కళ్ళకేసి  కొట్టేస్కుంది. కళ్లపైన కాయలు కాచాయి.

 “వద్దంటే విన్నావు కాదు. రెండు తులాల సూత్రం 4  తులాల గొలుసు. అంత ఘట్టిగా ఉన్నాయి కాబట్టి కళ్ళు వాచిపోయాయి. ఏదో ఒక  అరతులంతో చేయించుకొంటే వాచేవి కాదు కదా” అని జాలి పడ్డాను.

 “నయం అంత ఘట్టిగా  చేయించాను కాబట్టే మీ గుండె రెండు  ఎట్టాక్ లు  రెండు స్టెంటు లు తట్టుకుంది. ఇంకా ఘట్టిగా చేయిస్తే అసలు మీకు గుండె ఎట్టాక్,  సుగరు ఇల్లాంటివి వచ్చేవే కాదు.” అంటూ మా ఆవిడ టపా టపా మళ్ళీ కొట్టుకుంది. 
 
ఇన్సులిన్ ఎక్కించాలెమో అని మా అమ్మాయి అంది.
I am the doctor, ఏం చెయ్యాలో నాకు తెలుసు. నీ పని నువ్వు చూసుకో అని కోప్పడ్డాడు ఆర్‌ఎం‌పి.  
మా అమ్మాయి కాఫీ కాఫీ అంటూ వెళ్లిపోయింది.
        
తెరమీద హీరో కి చచ్చేంత జొరమ్ వెంటనే వచ్చేసింది. చిన్న హీరో,  హీరో కి రాత్రంతా కూర్చుని సేవలు చేసేస్తాడు.  హీరో మొహంలో ఆనందం, కృతజ్జత, ప్రేమ, అభిమానం , గుమ్మడి, నాగయ్య, పెరుమాళ్ళు అందరూ కనిపించేశారు. చిన్న హీరో మొహంలో  ఆనందం, ప్రేమ, అభిమానం, శోభన్ బాబు, రేలంగి, చదలవాడ కనిపించేశారు.

 చిన్న హీరోకి లవ్, చిన్న హీరోయిన్, ఆమె తల్లి,  తండ్రి.  
తండ్రి టాట్ అంటాడు.
తల్లి మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది.
చి.హీరోయిన్  జాలిగా చి. హీ కేసి, కోపంగా తండ్రికేసి చూస్తుంటుంది.
తండ్రి  హూ ఇస్ మదర్,  హూ ఇస్ ఫాదర్ అంటూ ???.
చి. హీ. మొహం లో కోపం, క్రోధం, ఆవేశం, ఆక్రోశం, బాధ,కసి, ఎస్‌వి‌ఆర్ , రాజనాల,రమణా రెడ్డి,రావు గోపాల రావు అందరూ కలిసి వచ్చేశారు. చి. హీ. చేతులు బిగించి బిగించి వదిలేసి బిగించి వదిలేసి, వెళ్ళిపోతాడు.

బి‌పి 200/300 రౌండ్ ఫిగర్ డేంజర్, డేంజర్, సుగర్ 350 అని అరిచాడు ఆర్‌ఎం‌పి . 

కానరారా కైలాస నివాసా, భజన బృందం,
ఆగర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరీ అంటూ శా. అ.,
మాంగల్యము నిలుపుమా మంగళ గౌరీ హారతి గైకొనుమా అంటూ మా ఆవిడ,
కాఫీ అండీ కాఫీ అంటూ మా అమ్మాయి ఘట్టిగా.

నా మోకాలి మీద చురుక్కు మంది. ఇన్సులిన్ ఎక్కించాను అన్నాడు ఆర్‌ఎం‌పి.
నేనింకో జీడిపప్పు పాకం కుక్కుకున్నాను నోట్లో.
ఈ జబ్బమీద మళ్ళీ చురుక్, బి‌పి కి ఇంకో ఇంజెక్షన్ అని ఆర్‌ఎం‌పి ఉవాచ. 

తెరమీద  చి. హీ మొహంలో మళ్ళీ అన్నీ ఫీలింగ్స్. I hate you డాడీ  అంటూ  కాగితాల మీద రాసి పడేస్తుంటాడు. 
హీరో కి తను చి. హీ. కి తండ్రి ని  అని తెలిసిపోతుంది.
సన్ను ని చూడడానికి కారులో వచ్చేస్తుంటాడు.
చి. హీ. కాగితాలు పడేస్తుంటాడు.
హీరో కారులో వచ్చేస్తుంటాడు. మొహం నిండా ఫీలింగ్లు, నోటినిండా డైలాగులు. 
 
నాలో ఉద్రేకం, ఉద్వేగం, ఆవేదన, కడుపు నొప్పి, మంట,  బాధ, ఏడుపు, దుఖ్ఖం, ఎన్‌టి‌ఆర్ విశ్వరూపం అన్నీ కలిసిపోయాయి.
బి‌పి మిషన్ ఫట్ మంది.
సుగర్ బియాండ్ లిమిట్స్ అంటోంది గ్లూకోమీటర్.
నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి.  
గుండె ఆగిపోయింది. 

ఆర్‌ఎం‌పి  I am sorry  అనేశాడు గంభీరం గా, విషాదంగా, కళ్ళు తుడుచుకుంటూ .  

మంగళం  ప్రద్యుమ్న చరితం మంగళం అని పాడుతున్నారు భజన బృందం.  
శా. అ. కి ఏం చెయ్యాలో తోచక బిక్కమొహం వేశాడు. 
మా అమ్మాయి నిశ్చేస్ఠురాలయిపోయింది.

మా ఆవిడ నిశ్చలం గా, దృఢంగా మనస్సు ఏకీకృతం చేసి  మంగళగౌరీ నా మాంగల్యం కాపాడుమా  అంటూ తల గౌరీదేవి  ఫోటో కేసి టపా టపా కొట్టేస్కుంటోంది.
 
ధడాంగ్ ఫడాంగ్  అంటూ పెద్ద శబ్దం.   ఉన్నట్టుండి కరెంటు పోయింది.
టి‌వి ఆగిపోయింది. 

నా కనుగుడ్లు కదిలాయి. ఆర్‌ఎం‌పి  నా గుండెల మీద దభెల్ దభెల్ మని రెండు గుద్దులు గుద్దాడు. ఎందుకేనా మంచిదని ఇంకో మారు కసి తీరా కొట్టాడు.  స్టెత్ తో కూడా కొట్టాడు. కొట్టుకొంటోంది వెధవ గుండె మళ్ళీ  అని అరిచాడు. మళ్ళీ ఇన్సులిన్ ఎక్కించాడు. బి‌పి మందు కూడా గుచ్చాడు.

 సుగర్ 415 అంది గ్లూకో మీటర్.  హార్ట్ బీట్ ఎక్కువే కానీ అండర్ కంట్రోల్ అని అరిచాడు మళ్ళీ ఆర్‌ఎం‌పి. 
 
నేను కళ్ళు తెరిచాను. నీరసంగా నవ్వేను. 
 
శా. అ. మా ఆవిడ ముందు సాష్టాంగపడి “మాతా మరకత శ్యామా “ అని మొదలుపెట్టేడు.
భజన బృందం మా ఆవిడ కాళ్లమీద  పడిపోయి “మహా సాధ్వి వమ్మా,  సాధ్వీవమ్మా  ప్రభావతీ  మహా సాధ్వీవమ్మా”   అని పాడారు. 

మా ఆవిడ “గైకొనుమా హారతి, హారతి గైకొనుమా మంగళ గౌరీ గైకొనుమా” అని పాడుతూ ఆ హారతి అందరికీ చూపించి నాకళ్ళకి కూడా అద్దింది.

నాకు కొంచెం ఓపిక వచ్చి మిగిలిన మినపసున్నిఉండ అందుకొని నోట్లో వేసుకున్నాను. 

ఆరోజున మా కాలనీలో కధలు కధలు గా చెప్పుకున్నారు.   మా ఆవిడ పాతివ్రత్యమహిమ గురించి. ఆయొక్క గౌరి దేవిని ఉపాసించి ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్ ని బద్దలు కొట్టించి   ఈ యొక్క కరెంటు ను ఆపీ , ఆ  యొక్క వెధవ మొగుడి ప్రాణం ఎల్లా కాపాడిందో.  ఏ  విధంగా ఆ యొక్క యమపాశాన్ని మా ఇంటి గుమ్మం ముందు ఆపిందో, ఇత్యాదులు.

ఆ సినిమా కధ గురించా  ఏమో నాకేమి తెలుసు.  కరెంటు వచ్చేటప్పటికి ఆ సినిమా అయిపోయింది.  అదీగాక మా ఆవిడ ఒట్టు పెట్టించుకుంది  నా సిగరెట్ల మీద,  మళ్ళీ అ చానెల్ చూడనని.  అది సంగతి. మిగతా కధ మీకేమైనా తెలిస్తే మా ఆవిడ వినకుండా నా చెవిలో చెప్పండి.


{అవునూ,  నేనింక సినిమా కధలు వ్రాయవచ్చంటారా(??)}