ఈ సమస్య మీద నేను అంటే ప్రభావతి అని పిలవబడే ప్రద్యుమ్నుడి భార్య నన్నమాట, తిరిగి పరిశోధన (research) చేశాను. మా మహిళా సభలో కూలంకషంగా చర్చించాను. ఈ సమస్య కి అనేక కోణాలున్నాయి. మొగుడు భార్యామణి అంటే మురిసిపోవడం కాదు. భార్యామణి అంటే అర్ధం తెలుసుకోవాలి . భార్యలలో మణి అంటే ఏమిటీ? ఎంతమంది భార్యలు? అని నిలదీయాలి. మిగతా భార్యలు ఎక్కడ? అని ప్రశ్నించాలి. భర్త, యమునా తీరమున సంధ్యా సమయమున అని పాడుకొనే సందర్భాలు కనిపెట్టాలి. ఆ సంధ్య ఎవరో తెలుసుకొనే ప్రయత్నం చెయ్యాలి. వారికి తూర్పున ఉషోదయాలు, పడమర సంధ్యా రాగాలు లేకుండా జాగ్రత్త పడాలి. భార్య పతివ్రతగా ఉండాలనుకొనే ప్రతీ భర్తా సతీవ్రతం పాటించాల్సిందే. ‘ఒకే బాణమూ, ఒకటే మాటా, ఒకే భామకే రాముని ప్రేమా’ అన్నట్టు ఉండాల్సిందే. అల్లా అని “ఫో బాల నువ్విక పుట్టింటికి పొమ్ము బాలా” అనగానే ”ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు” అని పాడుకుంటూ వెళ్లిపోవడం కాదు. “ఐ నో గో, యు గెట్ ఔట్” అనగలగాలి. అంత ధైర్యం మనకి ఉందని వారికి అర్ధం అయితే చాలు వాడికి వేరే మార్గం లేక మన్ని ప్రేమించడం మొదలు పెట్టుతాడు. ఒకమాట కొంచెం రహస్యం గా చెపుతాను. పాపం మొగుడు, పెళ్ళైన కొత్తలో మనని తెగ ప్రేమించేస్తాడు. వాడి అవసరం అటువంటిది. ఆ టైము లోనే మనం పట్టు బిగించెయ్యాలి. పెళ్ళాం = బెల్లం , అమ్మా నాన్నా = అల్లం అని నూరి పోసేయాలి. అప్పుడే వారు మన వలలో పడుతారు. మనకి సిద్ధాంతాలు అన్నీ తెలిసినా, కొన్ని మొండి ఘటాల దగ్గర మన పప్పులు ఉడకక పోవచ్చు. కొండొకచో మన మొగుడితో ముచ్చట పడి పోయి వారి వలలో మనమే పడిపోవచ్చు. ఇవన్నీ occupational hazards. పెళ్ళాం అంటే లైఫ్ లాంగ్ ఉద్యోగం అనుకోవాలి. అప్పుడే మన హక్కుల కోసం పోరాటం చేయవచ్చు. అంతే తప్ప నా బాధ్యత, నాధర్మం అని సతీ అనుసూయ లాగా ఫీల్ అయితే మీ ఖర్మ, మిమ్మలని ఎవరూ బాగు చెయ్యలేరు. ఎప్పుడూ బాధ్యతల గురించి అంటీ ముట్టనట్టుండాలి కానీ హక్కుల కోసము అవిశ్రాంత పోరాటాలు సలపాలి.
సరే పెళ్లి అయింది. మనకి ధర్మ సూత్రాలు తెలియక కొంతకాలం సంసారం చేసేసాము. వాట్ నెక్స్ట్. అని ఆలోచించండి. ఇప్పటికైనా మేలుకొని జూలు విదల్చండి. 5-10 ఏళ్ళు సంసారం చేసిం తర్వాత మీకు జ్ఞానోదయము అయితే మొగుడు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. హాహాహ్హా నా మొగుడి గురించి నాకు తెలియదా ? వాట్ నాన్సెన్స్ అని ఇదైపోకండి. 10 ఏళ్ళు సంసారం చేసినా 25 ఏళ్ళు చేసినా మొగుడు గాడు ఓపట్టాన అర్ధం కాడు. అందుకనే వాడిని మొగుడు అంటారు. అర్ధం అయ్యేడని మనం భ్రమ పడతాము అని తెలుసుకోండి. నేను చెప్పింది మీరు నమ్మక పోతే, ఓ పని చేయండి. మీ ఇంటి చుట్టుపక్కల పె.గీ.గీ.దా.వా, అని పేరుబడ్డ ఒకడిని మీ ఇంటికి భోజనానికి పిలవండి. ఛండాలంగా సాంబారు పెట్టి వాడికి వడ్డించండి. వాడు లొట్టలు వేసుకుంటూ మిమ్మల్ని చూస్తూ గిన్నెడు సాంబారు తాగేస్తాడు. పెళ్ళాం గీచిన గీటు దాటని వాడు. అంటే అల్లా ఉంటాడా అని ఆశ్చర్య పడకండి. మొగుడు పైకి కనిపించేది ఒకడు, అవకాశం వస్తే మరొకడు. చాలామంది మొగుళ్లు అవకాశం లేక, దొరకక, మిమ్మల్ని హింసించే మార్గం తట్టక, మంచి భర్తలుగా మిగిలిపోతారు అని మీరు గ్రహించాలి.
ఈ విషయం పైన నేను చాలా లోతుగా, సమగ్రంగా అధ్యయనం చేశాను. అనేక మొగుళ్ళ మనస్థత్వాలు శోధించాను. అనేక మనస్థత్వ శాస్త్రవేత్తలతో చర్చించాను. చర్చించి, శోధించి ఆపైన మధించి, వాటిని క్రోడీకరించి పంచరత్నాలు లాంటి ఐదు ప్రశ్నలు తయారు చేశాను. సమయానుకూలంగా వాటిని మీ వారికి సంధించి జవాబులు రాబట్టండి.
1. ఉప్మా లో పచ్చి మిరపకాయలు బదులు ఎండు మిరప కాయలు వేయవచ్చా?
అ. సారీ డియర్ నిన్న పచ్చి మిర్చి మరిచిపోయాను.
ఆ. నువ్వు ఏం వేసినా బాగానే ఉంటుంది.
ఇ. ఫరవాలేదు ఏదైనా వేయవచ్చు.
ఈ. ఏదో ఒకటి అఘోరించు.
ఉ. పచ్చిమిర్చి అయిపోతే చెప్పి ఏడవాలి.
2. మా చెల్లెలికి పెళ్ళిలో బహుమతిగా ఫ్రిజ్ ఇద్దామా, మైక్రో ఓవెన్ ఇద్దామా ?
అ. అబ్బే అవేం బాగుంటాయి, ఓ LCD TV కొని ఇద్దాం.
ఆ. రెండూ ఇచ్చేస్తే నష్టం ఏమిటి.
ఇ. మనకి మీ నాన్న ఏం ఇచ్చాడో అంతకన్నా ఎక్కువ ఇవ్వక్కర్లేదు.
ఈ. ఒక అరడజను చెంచాలు ఇస్తే చాలదా
ఉ. అసలు పెళ్ళికి వెళ్లాలంటావా
3. పక్కింటావిడ 4 తులాల నెక్లసు కొనుక్కుంది, మరి నాకేంటి కొంటారు?
అ. 4 తులాలు అంటే 40 వేల మిల్లీ గ్రాములు, అంతా బరువు నీ మెడ
మోయలేదేమో సన్నుతాంగీ అంటాడా.
ఆ. Moon light కన్ననూ నీదు మోము bright ట, దూది పింజ కన్ననూ
నాదు పర్సు light ట అంటాడా.
ఇ. మీ తమ్ముడు ఓ లక్ష అప్పు ఇస్తాడేమో కనుక్కో అంటాడా
ఈ. ఇప్పుడు నీకు నగలు అవసరమా అంటాడా
ఉ. ఓ వడ్డాణం కొనుక్కో ఉన్న రెండు ఎకరాలు కూడా అమ్మేస్తాను అంటాడా
4. మీ పెళ్లి రోజున మీ ఆయన ఏంచేస్తాడు?
అ. ఉదయాన్నే లేవగానే “నీ కళ్ళల్లో నా కళ్ళు చూసుకోనా,
నీ ముక్కుతో నాముక్కు రాసుకోనా” అని పాడుతూ
NTR లాగా బుగ్గ కందిపోయేటట్టు చిటిక వేస్తాడా
ఆ. ఏడుస్తూ శలవు పెట్టి, నవ్వుతూ మిమ్మల్ని ఊరంతా తిప్పి
హోటల్ లో డిన్నర్ పెట్టిస్తాడా
ఇ. మీకో మంచి చీర కొనిపెట్టి, తను మాసిన లాగు, చిరిగిన చొక్కా
వేసుకొని ఆఫీసు కి వెళ్లిపోతాడా
ఈ. అసలు ఏం గుర్తు లేనట్టు ఆఫీసు కి వెళ్లిపోతాడా
ఉ. విషాదంగా భారంగా నిట్టూరుస్తూ, ఓ మందు బాటిలు ఓపెన్ చేసి
“కొయి లౌటాదె మేరే బీతే హువే దిన్” అని పాడుకుంటాడా
5. 31 రోజులు, పైవాడి బూతులు, కిందవాడి తిట్లూ భరిస్తూ కష్టపడి
1వ తారీఖుకి సంపాదించిన జీతం డబ్బులు
అ. మొత్తం మీచేతిలో పోసి అప్పుడప్పుడు పానిపూరి తింటానికి
ఓ పదిరూపాయలకి మిమ్మల్ని ప్రాధేయపడతాడా
ఆ. మొత్తం మీ చేతిలో పోసి పాకెట్ మని గా మీరిచ్చింది తీసుకుంటాడా
ఇ. ఇంటి ఖర్చులకి ఇంత అని ఇచ్చి మిగతాది తన దగ్గరే ఉంచుకుంటాడా
ఈ. మీకు పూలు కొనుక్కోడానికి 100 రూపాయలు ఇచ్చి మిగతాదంతా
తనే ఉంచుకుంటాడా
ఉ. మీకు ఏమి ఇవ్వకపోగా, ఇంటి ఖర్చులకి కూడా మీ నాన్న నడిగి
పట్టుకు రమ్మంటాడా
జవాబులు వచ్చింతర్వాత మార్కులు కింది విధంగా వేసుకోండి
అ కి 16 నించి 20 మార్కులు, ఆ కి 12నించి 16 మార్కులు, ఇ కి 8నించి 12 మార్కులు, ఈ కి 4 నించి 8 మార్కులు, ఉ కి 0 నించి 4 మార్కులు.
75+ వచ్చిన వాడిని అసలు నమ్మకండి. తేనె పూసిన కత్తిలాంటి వాడు . వాడు అందరితోనూ నవ్వుతూనే, మంచిగానే ఉంటాడు. అతి మంచి మంచిది కాదు . మిమ్మల్ని తెగ ప్రేమించేస్తాడు. అవకాశాలు సృష్టించుకుంటాడు నవ్వుతూనే ఎదురింట్లో ఏ ఛండిక తోనో లేక ఏ మార్తాండి తోనో కాపురం పెట్టేయగలడు. వాళ్ళిద్దరూ కలసి మీ జీవితం నవ్వుల పాలు చేసెయ్యగలరు. ఇటు వంటి వాడితో బహు జాగ్రత్త గా ఉండాలి. తాజమహల్ కట్టించేస్తాను నీ కోసం అంటాడు. కట్టించాలంటే ముందు నువ్వు పైకెళ్ళాలి గదా అనేస్తాడు కూడానూ.
60+ వచ్చిన వాళ్ళ తో కూడా కొంచెం జాగ్రత్త తప్పదు. అవకాశం లేక మంచిగా ఉండడానికి ప్రయత్నించే వాళ్లు వీళ్ళు . రోజూ రెండు తిట్లూ, నాలుగు మొట్టి కాయలు వేస్తుంటే తిన్నగానే మనకి నచ్చినట్టు ఉంటారు. కంట్రోల్ అన్నది ముఖ్యం వీళ్ళతోటి. వీడు కూడా చాలా బాగానే ప్రేమించే బాపతు.
45+ వీళ్ళు ఉత్తమ భర్తలు అనుకోవచ్చు. ప్రతిదీ ఆలోచించి ఒక మోతాదు లోనే చేస్తారు. ప్రేమించడం కూడా అంతే. కానీ వీళ్ళను కొంచెం పొగిడితే బాగానే ప్రేమించేస్తారు. వీళ్లతో మనకి ఏ భయం ఉండదు. ఇబ్బంది అసలే ఉండదు.
30+ మిమ్మల్ని ఉద్ధరించడానికి పెళ్లి చేసుకున్నట్టు ఫోజు కొట్టుతారు. కానీ కొంచెం భయస్తులు. అప్పడాల కర్ర కే భయపడుతారు. కాబట్టి దాని ఉపయోగం తప్పదు. ఉపయోగించి నంత కాలం మన చెప్పుచేతలలో ఉంటారు. గతి లేక, భయంతో చచ్చినట్టు ప్రేమిస్తారు. ఎంతగా ఉపయోగిస్తే అంతగా ప్రేమిస్తారు.
30 కన్నా తక్కువ అయితే ఒక మంచి లాయరు ని వెతుక్కోండి. వెంటనే విడాకులు తీసుకోండి.
మంగళం