ప్రభావతి హనీమూన్

జ్ఞాని ఎరుగు సుజ్ఞానుల మరుగు
అజ్ఞాని ఏ మెరుగు అతడుండే తావు                /జ్ఞాని /
ఇంటి పురుషుడి గుణము ఇల్లాలు తానెరుగు
వాకిళ్ళు ఊడ్చేటి  వనితా ఏ మెరుగు              /జ్ఞాని /

ప్రభావతి  సన్నగా పాడుతోంది. ప్రభావతి  సమయానుకూలంగా, సందర్భాను సారంగా పాడడం అలవాటు చేసుకుంది. 

ఈ అలవాటు చిన్నప్పటి నుంచి లేదుట.  పెళ్లి చూపులకోసమే  కర్నాటక సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న ప్రభావతి,  మొట్ట మొదటి పెళ్లి చూపుల్లోనే మొదటి కచేరి చేసిందిట.  ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’ అంటూ సంగీతయుక్తంగా  పాడి పెళ్లి చూపుల కొచ్చిన వారిని ఒకింత చింతాక్రాంతులను చేసిందిట. సంగీత యుక్తం అంటే ప్రభావతి   ఒక్కో పదాన్ని సరిగమప లతో వత్తి వత్తి,  మహానుభావులను చిక్కింప చేసి, వందనములు దగ్గరికి పావుగంటకి వచ్చేలోపుల, భ్రుకుటి ముడిచి, చేతులు తిప్పుతూ, తొడ వాయగొట్టుకుంటూ, చిత్ర విచిత్ర ముఖ విన్యాసాలతో వారిని బెదరగొట్టిందిట.  పాపం అమ్మాయి నెందుకు కష్టపెట్టడం అని వాళ్ళు వెళ్ళిపోయారుట.  రెండో చూపుల్లో భావయుక్తంగా ‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి’ అని జాలిగా పాడితే,  పాట పాడమంటే ఏడుస్తుందేమిటో అని వాళ్ళు కంగారుపడి  వెళ్ళి పోయారుట.  రెండు అనుభవాల తరువాత లలిత సంగీతంలోకి దిగి ‘అందానికి అందం నేనే  నీ జీవన మకరందం నేనే’ అని మనసారా పాడితే ఇంత అందం నాకేనా అని నిరుత్తరుడయ్యాడుట  పెళ్ళికొడుకు. నాలుగో మాటు ‘ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము’ అని విషాద గీతిక ఎత్తుకుంటే, ఇంత విషాదం మేము భరించలేము అని భయపడ్డారుట. పాడి పాడి విసుగెత్తి, చిరాకేసి చివరగా ప్రద్యుమ్నుడి   పెళ్లి చూపుల్లో ‘నరసింహ స్వామినిరా నిన్ను నంజుకు తింటనురా” అని పాడేటప్పటికి, ఒప్పుకోకపోతే గుమ్మం దాటనివ్వదేమో నని భయపడి ఒప్పేసుకున్నాము అని చెప్తాడు ప్రద్యుమ్నుడు.   

పెళ్ళైన తరువాత ప్రభావతికి పాటలు పాడే అవసరం కానీ అవకాశం కానీ లేకపోయింది.  ప్రద్యుమ్నుడు  కూడా ఎప్పుడూ ప్రభావతితో కలిసి యుగళ గీతం పాడటానికి ఉత్సుకత ప్రదర్శించ లేదుట. ఒంటరిగా సోలో పాటలు ఒకటి రెండు మాట్లు పాడుకుని తనకే నచ్చక మానేసింది అని పుకారు. ఈ పుకారుకి  ప్రద్యుమ్నుడే  ఆద్యుడు అని ఆమె అనుమానం కానీ ఋజువులు లేక ఉరుకుందని  విశ్వసనీయ వర్గాల భోగట్టా.  మొదట పిల్లాడు పుట్టినప్పుడు జోల పాటలు ప్రాక్టీసు చేసిందిట. రెండు మూడు మాట్లు విన్న తరువాత, ఈవిడ పాడటానికి ముందే బుద్ధిగా నిద్రపోవడం మొదలు పెట్టేడుట పిల్లాడు అని ప్రద్యుమ్నుడు  అంటాడు ఆత్మీయుల దగ్గర.

తన పాటమీద ఇంత దుష్ప్రచారం జరిగినా అప్పుడప్పుడు ప్రద్యుమ్నుడు మాత్రమే ఇంట్లో ఉన్నప్పుడు అవసరార్ధం ప్రభావతి పాడుతుంది. ఆ పాటలు కూడా అత్తగారు పాడుకునే పాటలే పాడుతుంది. తల్లి అంటే ప్రద్యుమ్నుడికి వల్లమాలిన అభిమానం. ఆవిడ పోయిన తరువాత ఆ అభిమానం ఇంకా ఊడలు  తొడిగింది. ప్రద్యుమ్నుడుకి తల్లి పాడుకునే  తత్వాలు, లక్ష్మణ దేవర నిద్ర, పులి – ఆవు,  ఇత్యాది పాటలు చాలా చాలా ఇష్టం. దురదృష్టవశాత్తూ ప్రద్యుమ్నుడు ఏక సంధా గ్రాహి కాదు కదా పాతిక  సంధాగ్రాహి కూడా కాదు. అందుకని అతనికి ఆ పాటలు రాలేదు, చరణాలు గుర్తు ఉండేవి కావు. ప్రభావతి ఆ పాటలు కొన్ని పట్టేసింది. అవసరార్ధం ప్రయోగించేది. ఇక్కడ ఒక చిన్న ఉప కధ కూడా చెప్పుకోవాలి. 

ప్రద్యుమ్నుడికి   పాతకాలపు అలవాట్లు ఎక్కువ. సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగినందున ఆచార వ్యవహారాలు కూడా ఎక్కువే. ఎప్పుడో ఏకాంతంలో తప్ప పెళ్ళాన్ని పేరుతో పిలిచేవాడు కాదు. ఇదిగో, ఏమోయ్ ఇత్యాదులే ఎక్కువుగా వినియోగించేవాడు.  ప్రభావతికి ఇష్టం లేకపోయినా సర్దుకుపోయింది. తను మొగుడిని ఇంట్లో  ఏమండీ అని పిలిచినా, బయట నలుగురిలో ప్రద్యుమ్నా  అనే పిలిచేది.  ప్రద్యుమ్నుడు  కూడా సర్దుకు పోయేవాడు. మాములుగా ఏమండీ అని పిలిచినా,  అవసరార్ధం మరేమోనండి అంటూ మొదలు పెట్టేది. ప్రభావతి పాట పాడినా,  మరేమోనండి అంటూ మొదలు పెట్టినా ప్రద్యుమ్నుడుకి అర్ధం అయిపోయేది,  ఏదో కొంపలు మునిగే వ్యవహారం అని. ఈ విషయం ప్రభావతికి అర్ధం అయినా పధ్ధతి మార్చుకోలేదు, కొత్త టెక్నిక్స్ ఉపయోగించలేదు. ఈ పాతకాలం మొగుడుకి ఈ చిట్కాలు చాలు, కొత్తవి కనిపెట్టఖ్ఖర్లేదు అని అనుకుందేమో నని ప్రద్యుమ్నుడి  అనుమానం.

ప్రద్యుమ్నుడు నలుగురిలోకి వెళ్ళినప్పుడు ప్రభా  అని పిలిచినా అవసరార్ధం ప్రేమగా ప్రభూ అనో పాబ్ అని ఇంగ్లీషులోనో పిలుస్తుంటాడు భార్యని ఇంట్లో.  ప్రద్యుమ్నుడికి జిహ్వ చాపల్యం కొంచెం ఎక్కువే. ఉద్యోగ్యరీత్యా తెలుగు నేలకి దూరంగా ఉన్నందువల్ల, ఎప్పుడైనా సున్నుండలో, తొక్కుడు లడ్డూలో, బొబ్బట్లో  తినాలనే కోరిక కలిగినపుడు భార్యని ప్రసన్నం చేసుకోవడం ఆవశ్యకం కాబట్టి  ప్రేమ కొంచెం ఎక్కువ మోతాదులోనే ఒలకపోస్తాడు. అలాగని పూర్తిగా భార్యని శ్రమ పెట్టడు.  కావాల్సిన సరకులన్నీ తనే తెస్తాడు. వండేటప్పుడు భార్యకు విసనకర్రతో విసురుతాడు కూడా. ప్రభావతి నుదుట మీద పట్టే చెమటను తువ్వాలుతో తుడుస్తాడు కూడానూ.  ప్రద్యుమ్నుడు ఇంత శ్రమ పడ్డా ప్రభ  తగు ప్రతిఫలం రాబట్టుతుంది వంట మధ్యలో. మొన్నా మధ్యన శంకరం గారింటికి వెళ్ళినప్పుడు ఆవిడ పెట్టిన రవికల గుడ్డకి మాచ్ అయ్యే చీర కొనడానికి ప్రద్యుమ్నుడిని  ఒప్పిస్తుంది. మూడునాలుగు  నెలలకోసారి ప్రద్యుమ్నుడికి డబ్బు అవసరమవుతుంది. అప్పుడు కూడా భార్యని ముద్దుగా పిలుస్తాడు. సహృదయంతో ప్రభావతి భర్త ఆర్ధికావసరం తీరుస్తుంది. వడ్డీ ఎక్కువైతే నేమి భార్యకే ఇస్తున్నాను కదా యని సమాధాన పడతాడు ప్రద్యుమ్నుడు. అన్నట్టు ప్రభావతి వాయిదాల పధ్ధతికి ఒప్పుకుంటుంది ఇంకొంచెం ఎక్కువ వడ్డితో. అప్పుడప్పుడు ఏక కాలంలో రెండు వడ్డీలు కూడా కడుతుంటాడు ప్రద్యుమ్నుడు.

ఇప్పుడు ప్రభావతి పాడే పాటను శ్రద్ధగా విన్నాడు ప్రద్యుమ్నుడు. విని,
“ప్రభా, ఏమి నీ కోరిక?” అని డైరెక్టుగా  అడిగేశాడు.
“ఏముంది? చిన్నదే, మనం ఇంతకాలం వాయిదా వేస్తూ వస్తున్న హనీమూన్ కి వెళదామండి” 

“పెళ్ళైన నలభై నాల్గేళ్ళకి హనీమూన్ కా? నవ్వుతారు నలుగురూ”
“మీరే కదా ఇన్నాళ్ళు వాయిదా వేస్తున్నది”

“నేనా?”
“ఔను, మీరే. పెళ్ళైన మర్నాడు అడిగితే “శోభనం కాకుండా హనీమూన్ కి వెళితే బాగుండదు” అన్నారు. శోభనం రోజున అడిగితే ”ఇప్పటికే రెండు మాట్లు శలవు పెట్టాను. ఇంకోమాటు ఇవ్వరు. చూద్దాం ఇంకో ఏడాది తరువాత” అన్నారు. సరే, ఏడాది తిరక్కుండానే తల్లిని చేసేశారు. చేసి,  “పిల్లాడితో హనీమూన్ ఏమిటి? ఇంకో రెండు మూడేళ్ళ తరువాత,  వాడిని మీ అమ్మగారి దగ్గర వదిలి వెళదాము” అన్నారు. వాడికి మూడేళ్ళు వచ్చేటప్పటికి స్కూల్, అడ్మిషన్, డొనేషన్ అన్నారు. వాడికి ఐదేళ్లు వచ్చేటప్పటికి అమ్మాయి పుట్టింది. మళ్ళీ చక్రం అలాగే తిరిగింది. దానికి ఐదేళ్లు వచ్చేటప్పటికి ఖర్చులు పెరిగాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగాయన్నారు. చూస్తుండగానే వాడు కాలేజికి వచ్చేశాడు. ఏ వేసవి సెలవుల్లోనో వెళదామంటే,  “ఎదిగిన పిల్లల్నిఇంట్లో  వదిలి హనీమూన్ ఏమిటి? నవ్వుతారు విన్నవాళ్ళు” అన్నారు. పిల్లల చదువులు అయ్యాయి.  పెళ్ళిళ్ళు అయ్యాయి. వాళ్ళు హనీమూన్ లకు వెళ్లి వచ్చారు.  మీరు రిటైర్ అయ్యారు. హైదరాబాదుకి వచ్చేశాము.  మనమలు,  మనవరాళ్ళు  పుట్టారు.  వాళ్ళ అచ్చటా ముచ్చటా అయ్యాయి.  పిల్లలు ఇక్కడే  ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ పిల్లలతో హాయిగానే  ఉన్నారు. ఇప్పుడైనా మన హనీమూన్ ముచ్చట తీరవలసిందే” అని  ఘట్టిగా నొక్కి వక్కాణించి, ఆయాసం తీర్చుకుందుకు రెండు నిముషాలు ఆగింది.

“ఇప్పుడు తీర్ధయాత్రల వయసు కదా, హనీమూన్ అంటే బాగుండదేమో”  అన్నాడు ప్రద్యుమ్నుడు.  
“తీర్ధయాత్రలు అంటూ గుళ్ళు గోపురాలు తిప్పితే నేనొప్పుకోను. మొన్న మనవరాలు  అడిగింది  కూడా, నాలుగు రోజుల క్రితం వాళ్ళ బాబయ్యా,  పిన్ని హనీమూన్ కి వెళ్లారుట కొడైకెనాల్.  దాని అమ్మా నాన్న పెళ్ళైన కొత్తలో కులుమనాలి వెళ్లామని చెప్పారుట.  మీరు ఎక్కడికి వెళ్లారని అడిగింది  ఐదేళ్ల భడవ. మీ తాతయ్య నన్ను ఎక్కడికీ తీసుకెళ్ళలేదు అని చెప్పాను.  “నేను పెద్దై ఉద్యోగం చేసి, నిన్ను హనీమూన్ కి పంపిస్తానులే అమ్మమ్మా” అంది  నా మనవరాలు .

“అందుకా,  ఇప్పుడు హనీమూన్  మళ్ళీ  గుర్తుకు వచ్చింది”
“మరిచిపోతే కదా గుర్తుకు రావడానికి. 43 ఏళ్ల నా కోరిక ఇప్పుడు తీరాల్సిందే”  ఖండితంగా చెప్పింది ప్రభావతి.

“ఇప్పుడు హనీమూన్ అనరు. బిట్టర్ మూన్ అంటారేమో”
“మొన్నెప్పుడో మీరే చెప్పారు కదా పేపర్లో వచ్చిందని. అమెరికాలో డెబ్భై ఏళ్ల వాడెవడో  అరవై నాలుగేళ్ల ఆవిడని పెళ్లి చేసుకొని హనీమూన్ కి  వెళ్ళాడని” 

“వాళ్ళ పద్ధతులు వేరు. అక్కడ ఎవరూ పట్టించుకోరు.”
“వృద్ధాప్యపు హనీమూన్ అనండి.  పోనీ విహార యాత్ర అనుకోండి. మనం ఇద్దరం, మన ఇద్దరమే ఎక్కడికేనా ఒక పదిహేను రోజులు వెళ్లి రావాల్సిందే” 
     
“అలాగే, చూద్దాంలే” సంధి చేసుకోడానికి ప్రయత్నం చేశాడు ప్రద్యుమ్నుడు.  
“చూద్దాం అంటే కాదు. చూద్దాం చూద్దాం అంటూనే ఏళ్లు గడిపేశారు మీరు. ఈ వేళ ప్రోగ్రాం నిర్ణయించాల్సిందే. అంతదాకా నో వంటా. నో భోజనం.”

“అంతలా భీష్మ ప్రతిజ్ఞ పడితే ఎలా. 15 రోజుల  ప్రోగ్రాం అంటే మాటలా?  ఎన్ని చూడాలి?”
“ఏ సబ్ మై జాన్తా నహీ. ఊటి, కోడై కెనాల్, బెంగళూరు వెడదాం . డిసెంబర్లోనే. ఎలా వెళ్ళాలో, ఏమేం చూడాలో ఫిక్స్ చేయండి.” 

“డిసెంబర్లో ఊటి, కొడైకెనాల్ అంటే చలి బాగా ఎక్కువగా ఉంటుంది. హోటల్ రూములోనే కూర్చుని ఒకళ్ళ నొకళ్ళు చూసుకుంటూ గడపాలి. మే, జూన్లలో అయితే బాగుంటుంది.”
“జోర్హాట్ కంటే ఎక్కువ చలిగా ఉంటుందా?”

“ఆ. షిల్లాంగ్ కన్నా ఎక్కువే ఉంటుందని విన్నాను. అక్కడ తిరగాలంటే   స్వెట్టర్లకి, ఓవర్ కోట్లకి ఇద్దరికీ కలిపి పదివేలపైనే అవుతుందేమో? అవి  మళ్ళీ  ఎందుకూ పనికి రావు ఇక్కడ”                      
అనుమానంగా ప్రభావతి, ప్రద్యుమ్నుడి మొహంలోకి తీక్షణంగా చూసింది.  నిజమే చెబుతున్నాడేమో ననుకుంది.
“అయితే సరే. బెంగుళూరు, కేరళ చూసి వద్దాం. బెంగుళూరుకి మన స్వెట్టర్లు సరిపోతాయి. ఇంకో పది రోజుల్లో బయల్దేరాలి. మీ అరెంజ్మెంట్లు చేసుకోండి.” 

“పది రోజులు అంటే విమానం టికెట్లు కూడా  దొరకవు. దొరికినా రెండు మూడు రెట్లు ఎక్కువ పెట్టాలి” యధాశక్తి ఒక అడ్డుపుల్ల మళ్ళీ  వేశాడు ప్రద్యుమ్నుడు.  
మళ్ళీ అనుమానంగా చూసింది ప్రభావతి ఇంకొంచెం తీక్షణంగా. నమ్మ బుద్ధి కాలేదు. పంతంగానే అంది,
“అమ్మాయి  కారు తీసుకుందాం. పదిహేను రోజులు అల్లుడు ఇంటినుంచి పని చేసుకుంటాడు. అవసరమైతే బైకు మీద వెళతాడు ఆఫీసుకి. నేను చెపితే కాదనడు.”

చివరి అస్త్రం ప్రయోగించాడు ప్రద్యుమ్నుడు.
“అంత దూరం నేను డ్రైవు చెయ్యలేను. ఆ ప్రదేశాలు నాకు తెలియవు కూడా”
“వెధవ కబుర్లు చెప్పకండి.  మూడు నెలల  క్రితం అల్లుడి కారులో రాజమండ్రి వెళ్లి వచ్చాము. శనివారం పొద్దున్న బయల్దేరి, రాత్రి పెళ్లిలో హాజరు వేయించుకొని మర్నాడు ఉదయమే బయల్దేరి వచ్చాము.”

“అప్పుడు అమ్మాయి కూడా ఉంది. అది కొంత దూరం డ్రైవు చేసింది.” ప్రద్యుమ్నుడు ప్రయత్నం ఆపలేదు.
“మరేం ఫరవాలేదు. మూడుగంటలకో సారి ఒక గంట రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అవసరమైతే అక్కడే ఒక డ్రైవరుని వెతుక్కోవచ్చు” ప్రభావతి పట్టు విడవలేదు. 

ఇంకో పది నిముషాల వాదోపవాదాల తరువాత ఎప్పటిలాగానే ప్రద్యుమ్నుడు ఓడిపోయాడు.

“సరే శ్రీకాంత్ కి, నంబియార్ కి, పిళ్ళైకి టెలిఫోన్ చేస్తాను. వాళ్ళు ఊళ్ళో ఉంటారో లేదో కనుక్కోవాలి కదా” అన్నాడు ప్రద్యుమ్నుడు.
ప్రభావతి ప్రద్యుమ్నుడి కేసి మళ్ళీ  తీక్షణంగా చూసింది.
“మనం హనీమూన్ కి వెళుతున్నామా? చుట్టపు చూపులకు వెళుతున్నామా? మనం హోటల్ లోనే ఉండాలి” 

“పదిహేను  రోజులు హోటల్ అంటే అరవై వేల పైనే అవుతుంది. అయినా నంబియార్ ఇంట్లో దిగకపోతే వాడు ప్రాణం తీసేస్తాడు. హైదరాబాద్ వచ్చినప్పుడు వాడు మన ఇంట్లోనే దిగాడు నీ బలవంతం పైనే,  వాడికి దగ్గర బంధువులు ఇక్కడ ఉన్నా. LB నగర్ నుంచి మియాపూర్ వెళ్లాడు పెళ్ళికి, రెండు రోజులు కాబ్ మీద.” అనునయంగానే అన్నాడు ప్రద్యుమ్నుడు.
ఒక నిముషం ఆలోచించి తలూపింది ప్రభావతి అంగీకారంగా.
“కేననూర్ వెళదాం. నంబియార్ ఇంట్లో రెండు రోజులు ఉందాం. కానీ మిగతా చోట్ల హోటల్ లోనే ఉండాలి.” ఖరాఖండిగా చెప్పింది ప్రభావతి. “ఎవరింట్లో ఉన్నా స్వేచ్చ ఉండదు. వాళ్ళ టైం టేబుల్ ప్రకారం ఉండాలి. వాళ్లకి అంతో ఇంతో సహాయం చేయాలి, ఇంటి పనులలోనో, వంట పనులలోనో. మీ మేనల్లుడు అయినా, మా పెదనాన్న గారబ్బాయి అయినా,  వాళ్ళ ఇంట్లో ఉండడానికి వీల్లేదు.” 

యధావిధిగా తీవ్ర చర్చల తరువాత కనీసం ఒక యాభై వేలు హోటల్ ఖర్చులకి అంగీకరించాడు ప్రద్యుమ్నుడు. కాఫీ, టిఫిన్, భోజనాలకి అదనంగా అవుతుందని కూడా వివరించాడు ప్రద్యుమ్నుడు.

“ఐ డోంట్ కేర్.” అని  వ్రాక్కుచ్చింది ప్రభావతి. ప్రభావతికి కోపం వస్తే అప్పుడప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది.   ఒక మారు కేలండర్ కేసి చూసి “ 20 – 22 మధ్య బయల్దేరుదాం. మీ బడ్జెట్, ప్రోగ్రాం,  ప్రణాళికలు సిద్ధం చేసుకోండి” అని సలహా పాడేసి వంటింట్లోకి వెళ్ళింది ప్రభావతి.

నంబియార్ కి, పిళ్ళైకి, శ్రీకాంత్ కి టెలిఫోన్ చేసి, నెట్ తో కుస్తీ పట్టి మూడు గంటల తరువాత పూర్తి ప్రణాళిక తయారు చేశాడు ప్రద్యుమ్నుడు.  మంచి హోటల్స్ కనుక్కొని,  బుక్ చేసే బాధ్యత వాళ్లకి అప్పజెప్పి, తాత్కాలిక బడ్జెట్ ప్రపోజల్ తయారు చేసి గుండెలు బాదుకున్నాడు ప్రద్యుమ్నుడు. 
 
“కనిష్టంగా లక్షా పాతిక వేలు, గరిష్టంగా లక్షా అరవై వేలు అయ్యేటట్టు ఉంది. కర్ణాటక  నాలుగున్నర  రోజులు, కేరళ ఆరున్నర  రోజులు, రెండు రోజులు రానూ పోనూ,  రెండు రోజులు నంబియార్ ఇంట్లో, మొత్తం పదిహేను రోజులు. శ్రీమతి నంబియార్ కి, మనవలకి ఏదైనా తీసుకెళ్ళాలి గదా.   రెండు మూడు రోజులు తగ్గిస్తే బాగుంటుందేమో. ఆలోచించు” అన్నాడు ప్రద్యుమ్నుడు. 

“వాట్ డు యు మీన్? నతింగ్ డూయింగ్. వుయ్ కెన్ ఎఫర్డ్ ఇట్ మిస్టర్ ప్రద్యుమ్నా. యాడ్ అనదర్ 25 తౌజండ్స్ ఫర్ పర్చేజేస్ ఫర్ మై గ్రాండ్ చిల్డ్రెన్ అండ్ చిల్డ్రన్” అంది ప్రభావతి.
ఇంకోమాటు ప్రద్యుమ్నుడి గుండె లయ తప్పింది.  ప్రణాళిక చూసి అంగీకార ముద్ర కూడా వేసింది ప్రభావతి.

ఇంకో రోజు తరువాత పూర్తి బడ్జెట్ ప్రపోజల్ తయారు చేశాడు. హోటల్ బుకింగ్స్ అవీ చేయించటానికి వీలుగా 20 – 22 తారీఖుల మధ్య  ప్రయాణ తేదీ,  ముహూర్తం  నిర్ణయించమని  ప్రభావతిని అడిగాడు. సరేనంది ప్రభావతి.   ప్రద్యుమ్నుడికి ఇటువంటి వాటి మీద నమ్మకం లేకపోయినా, ప్రభావతికి నమ్మకం ఎక్కువే. ప్రభావతికి పంచాంగం చూడడం వచ్చు కానీ ముహూర్తాలు, మంచి రోజుల  గురించి అవగాహన తక్కువే.

మర్నాడు వనస్థలిపురంలో ఉంటున్న  గురువుగారి దగ్గరకు వెళ్లి వచ్చింది ప్రభావతి.  గురువుగారు అంటే సిద్ధాంతి రామేశ్వర శర్మ గారు. వాళ్ళ నాన్నగారు వేమూరి కామేశ్వర శాస్త్రి గారు భీమవరం వాస్తవ్యులు.  ప్రద్యుమ్న ప్రభావతిల కళ్యాణం జరిపించారు.  రామేశ్వర శర్మ,  ప్రద్యుమ్నుడు యస్.యస్.యల్.సి. దాకా కలిసి చదువుకున్నారు. ఆ తరువాత శర్మ తండ్రిగారి వద్ద పౌరోహిత్యం, కొంత వేదం, ప్రద్యుమ్నుడి తండ్రిగారి వద్ద జ్యోతిషం నేర్చుకున్నాడు. కామేశ్వర శాస్త్రి గారు కాలం చేసిన తరువాత శర్మ ఇరవై ఏళ్ల  క్రితం హైదరాబాదు జేరేడు, మామగారి ప్రోద్బలంతో. మెల్లి మెల్లిగా పేరు సంపాదించాడు. పేరుతో బాటు, రెండు ఇళ్ళు, నాలుగు ప్లాట్లు, ఓ కారు, సమృద్ధిగా బేంక్ బాలన్సు  కూడా సంపాదించాడు.  ప్రద్యుమ్నుడి పిల్లల పెళ్ళిళ్ళు శర్మ చేయించాడు. పదిహేనేళ్ల గా ప్రద్యుమ్నుడు ,శర్మల స్నేహం పెరిగింది. ప్రభావతికి  కూడా శర్మ అంటే నమ్మకం, గౌరవం  బాగా పెరిగింది.

గురువుగారి దగ్గరనుండి వచ్చినప్పటినుంచి  సీరియస్ గా ఉంది ప్రభావతి. కూతురితో ఒక పావుగంట, కోడలితో పది నిముషాలు రహస్య మంతనాలు చేసింది. ఇంకో అరగంట తరువాత ప్రద్యుమ్నుడిని అడిగింది.

“రెండు నెలల క్రితం గురువుగారు ఏదో చెప్పారుట మీకు,  నాకు చెప్పలేదేం?”
“రెండు నెలల క్రితమా? ఏమో? ఏం చెప్పాడో? నాకు గుర్తు లేదు”

“మీకేదో గండం ఉందని చెప్పారుట, మీరు నాకు ఎందుకు చెప్పలేదు?”
“గండమా? నాన్సెన్స్. నాకు గుర్తు లేదు. అయినా నేను ఇలాంటివి నమ్మనని తెలుసు గదా  నీకు”

“నాకు నమ్మకం ఉంది గదా”
“ఉంటే నువ్వు ఏం చేసేదానివి? ఏదో వ్రతం కాకపొతే మరేదో పూజ చేయించి వాడికి ఓ ఐదు వేలు సమర్పించేదానివి. అంతే కదా. అందుకనే నీకు చెప్పలేదేమో నేను. ఆ సంగతి నిజంగానే మర్చిపోయాను.”
 
“ఉగాది వెళ్ళేదాకా మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పారుట”
“వాడి బొంద.  వాడికో పది రూపాయలు కావాల్సినప్పుడు ఇలాంటివన్నీ చెబుతాడని అంటారు కొంతమంది. అయినా రెండేళ్ళ క్రితం నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాడు చెప్పలేదే మరి.”

“ముహూర్తం పెట్టమంటే, “ఇంకో మూడు నాలుగు నెలలు జాగ్రత్తగా ఉండాలమ్మా మీరు. వాహన గండం కావచ్చు, మరోటి కావచ్చు. అయినా తప్పదు, వెళ్ళాలి అనుకుంటే 22 ఉదయం 8-20 నిముషాలకి బయల్దేరి వెళ్ళండి. 21న నేను వచ్చి జపం చేస్తాను” అన్నాడు.
“నేను చెప్పాను కదా. జపం అని మూడు నాలుగు వేలు వసూలు చేస్తాడు” 

“నెల రోజుల క్రితం మనం ఆటోలో వెళుతుంటే కారు గుద్దింది. మర్చిపోయారా?”
“గుద్దడం కాదు. రాసుకు పోయింది. హైదరాబాదులో ఇవన్నీ సర్వ సాధారణమే”

“ఏమో. గురువుగారు చెప్పినప్పుడు నాకు వెంటనే గుర్తుకు వచ్చింది. మన ప్రయాణం ఆపేస్తే మంచిదనిపిస్తోంది.”
“నీ మొహం. అందరితోనూ మాట్లాడి ప్రోగ్రాం ఫిక్స్ చేస్తే ఇప్పుడు మానేస్తానంటావేం? బాగుండదు. నవ్వుతాడు నంబియారు.”

“ఏం నవ్వడు. నేను చెబుతాను నంబియారుకి, శ్రీకాంత్ కి.”
“ఇంకో మాటు ఆలోచించు. అమ్మాయితోనూ, అబ్బాయితోనూ మాట్లాడు.”

“మాట్లాడాను. కాన్సిల్ చేసేయమన్నారు. కాన్సిల్ చేసేయండి. ఐదారు నెలల తరువాత  వెళదాము ”
“సరే నీ ఇష్టం”  ఇంకా బెట్టు చేయకుండా ఒప్పేసుకున్నాడు ప్రద్యుమ్నుడు.

నిన్న సాయంకాలం  వాకింగుకి  వెళ్ళినప్పుడు గురువుగారికి చేసిన కాల్ డిలీటు చేశాడు ప్రద్యుమ్నుడు,   ప్రభావతి చూడకుండా. ఒక లక్ష రూపాయిలు,   15 రోజుల తిరుగుడు శ్రమ,  డ్రైవింగ్ ఒత్తిడి తగ్గినందుకు సంతోషించాడు డెబ్బై ఏళ్ల  ప్రద్యుమ్నుడు. 

ఇంటి ఇల్లాలి బలహీనత పతిదేవుడెరుగు
వాకిళ్ళు ఊడ్చేటి  వనితా ఏ మెరుగు
జ్ఞాని ఎరుగు సుజ్ఞానుల మరుగు
అజ్ఞాని ఏ మెరుగు అతడుండే తావు  

అని పాడుకున్నాడు ప్రద్యుమ్నుడు లోలోన.  



ఈ కధ  14th ATA CONFERENCE SOUVENIR 2016 లో ప్రచురించ బడింది.  “సంస్కృతి”,  ATA రజతోత్సవ మహా సభల ప్రత్యేక జ్ఞాపిక లో. చికాగో లో జులై 2016 లో జరిగిన మహోత్సవం లో ఈ సంచిక ఆవిష్కరించ బడింది.

ఈ కధకి సరైన లింక్ ఇవ్వడం నాకు కుదరలేదు. అందుకని పూర్తి కధ పైన ఇచ్చాను. ఈ కధ ఆ సావనీర్ లో చదవాలనుకునే వారు,  ఇక్కడ    221-224 పేజీలలో ఈ కధ చూడవచ్చు.


 నా కధ ప్రచురించిన సావనీర్ సంపాదకులకు, ATA సభల నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియ చేస్తున్నాను. 

మా ఆవిడ – మంగళ సూత్రం



చాలాకాలమైంది కధ వ్రాసి. వ్రాసే కధలు నచ్చటం లేదు. వ్రాసే  కధలన్నీ మూస ధోరణిలోనే ఉన్నాయని అనిపించడం మొదలయింది. ప్రభావతి ప్రద్యుమ్నుల కధలు  బోరు కొట్టడం మొదలయింది. ఎంతసేపూ భార్యా భర్తల సరాగాలేనా అని మిత్రుడొకరు కోప్పడ్డారు కూడాను ఆ మధ్యన.  అయినా,  నాకు చేతనైన విధానంలోనే మరొకటి వ్రాశాను.

మా ఆవిడ – మంగళ సూత్రం  అనే కధను ఈమాట జాల పత్రిక వారు వారి జనవరి 2016 సంచికలో ప్రచురించారు. 

 

చదివి మీ అభిప్ర్రాయం తెలుపవలసిందిగా కోరుచున్నాను.  

కధను  ప్రచురించినందుకు ఈమాట సంపాదకులకు ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాను.