కధలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కధలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

మా ఆవిడ- నా పెళ్లి చూపుల ప్రహసనము

నాపేరు ప్రద్యుమ్నుడు. నేను మాఊరు భీమవరానికి సుమారు 3000 kms  దూరంలో అస్సాం లో  ఓ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో సైంటిస్టు గా పనిచేస్తూ హాయిగా బతికేస్తున్నాను.  

మా నాన్న గార్కి ఉన్నట్టుండి ఒక అనుమానం వచ్చింది. అక్కడెక్కడో నేను అస్సాంలోని జోర్హాట్ లో సుఖపడిపోతున్నానేమోనని.   జీవితం అంటే సుఖాలే కాదు కష్టాలు కూడా ఉంటాయి, కాదు ఉండాలి అని తీర్మానించుకొన్నవారై నాకు ఒక ఉత్తరం వ్రాసారు. 

“నాయనా పుత్రరత్నమా నీకు సంబంధాలు చూస్తున్నాను. వీలు చూసికొని వచ్చి పెళ్ళి చేసుకొని సంసార సాగరంలో దూకు” అని. నేను వెంటనే యమర్జంటుగా తిరుగు టపాలో జవాబు వ్రాసాను. 

“నా ప్రియ జనకా, నా క్షేమం కోరు మీరు ఇటువంటి పని చేయ తగునా మీకిది తగదు తగదు. ఏదో నాలుగిళ్ళలో వారాలు చెప్పుకొని హాయిగా బతుకు తున్నాను. నన్నిటుల ఒక గూటి పక్షిని చేయ తగదు.” అని. 

 “ నేను పడుతున్నాను, మీ అన్నగారు పడుతున్నారు కష్టాలు. నువ్వు తప్పించు కుంటానంటే కుదరదు కాక కుదరదు.” అని మళ్ళీ వారు ఉత్తరంలో గంభీరంగా ఉద్ఘాటించారు.  

అయినా ఈ తల్లిదండ్రులకు,  ఇల్లా పిల్లలని ముఖ్యంగా మగపిల్లలని సంసార కూపంలో పడవేసి వాళ్ళు మునగలేక, తేలలేక  హే కృష్ణా, ముకుందా, మురారీ   అని పాడుతుంటే విని ఆనందించాలనే  బలీయమైన కోరిక ఎందుకు కలుగుతుందో నాకు అర్ధం కాదు. ఆడ పిల్లల తల్లిదండ్రుల మనస్తత్వం అర్ధం చేసుకోవచ్చు. ఎంత త్వరగా  ఈ అణుబాంబును  ఎవరింట్లో నైనా పడవేసి బాధ్యత తప్పించుకోవాలనే కోరిక, వాళ్ళకి ఉండడంలో తప్పు లేదు. మగ పిల్లల తల్లిదండ్రులు,  సంసార సాగరాన కష్టాలు  అనంతమని, మునిగేవాడు మగాడే అని తెలిసి కూడా ముక్కు పచ్చలారని పసి బాబును పెళ్లి అనే బంధంలో ఎందుకు ఇరికిస్తారో?   విధి బలీయమని చెప్పి, నన్ను విధి వంచితుడను చేసి యావజ్జీవ శిక్ష కు నన్ను ఒప్పించారు మా వాళ్ళు అందరూ కలసి.

నేను సైంటిస్టు ని అవడంవల్ల ప్రతిదీ ప్రణాళికా బద్ధంగా చేయాలని అనుకుంటాను. ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న తరువాత వాట్ నెక్స్ట్ అని ఆలోచించాను. పెళ్ళిచూపులు అనే ఒక మహత్తర  పరీక్షా కార్యక్రమం ఉంటుందని గ్రహించాను. ఈ విషయమై చర్చించుటకై  నా మిత్ర మండలి సమావేశం ఏర్పాటు చేశాను. మిత్రమండలిలో  నేను కాక, ఉన్ని కృష్ణన్ నారాయణ మీనన్ (ఉకృనామీ) మరియు పరమ శివన్ నీల కంఠన్ (పశినీకం) వరుసగా విజయవాడ, హైదరాబాదు లలో పెరిగిన  మలయాళీ, తమిళ సోదరులు,  సభ్యులు. 

అసలు ఈ పెళ్లి అనగా ఏమి అని పృచ్చించాడు ఉకృనామీ.  నేను ఉగ్ర నరసింహ మూర్తి నై  పోయాను.  వాట్ ఈజ్ దిస్? జిస్ దేశ్ మే గంగా బెహతీ హై  లో పుట్టి,  పవిత్ర గోదావరి, కృష్ణా ల జలం `పీ తూ ,  ఇల్లాంటి ప్రశ్న వేయడానికి నీ బుద్ధి కేమి రోగమొచ్చింది అని కోప్పడ్డాను. పెళ్లి అనగా వివాహం అనగా నూరేళ్ళ పంట.  మూడు ముళ్ళ బంధం అనగా  రెండు మనసులు,  రెండు తనువులు, రెండు కుటుంబాలు, రెండు వంశాలు, ఇంకా ఇంకా బోలెడు రెండులు ఒకటయ్యే వ్యవస్థ . సహజీవనం సౌభాగ్యం ఏక జీవనం దౌర్భాగ్యం అని పురాణాలు ఘోషిస్తున్నాయి. మేరా భారత్ మహాన్ లో ఈ వివాహ వ్యవస్థకు సమున్నత స్థానం కలదు. ఈ యొక్క  వివాహ వ్యవస్థను అమెరికా అను దేశం లోనూ, జర్మని దేశం లోనూ మరియు అయిస్లాండ్ దేశస్థులున్నూ చాలా ఇష్టపడెదరు. వారందరూ జంటగా మన దేశమునకు విచ్చేసి ఈ విధానమును కూలంకషము గా నభ్యసించి వివాహ భోజనమ్ము లారగించి స్వదేశముల కేగి విడాకులు తీసుకొనిరని ఎరుగవా అని క్రోధముగా  నుపన్యసించితిని.  

పశినీకం  నన్ను శాంతపరచి, ఉకృనామీ ని సమాధానపరచి,   మా తక్షణ కర్తవ్యమును ప్రభోదించుము అని అడుగుకొనెను. నేనప్పుడు శాంత స్వరూపుడనై ఈ కింది విధముగా వచియించితిని.  మిత్రులారా వివాహము అను బృహత్కార్యములో పెళ్లి చూపులు అనగా మారేజి లుక్సు అనునది ప్రధమ సోపానం. పెళ్ళిచూపులు అనగా పరస్పర ప్రశ్నోత్తర కార్యక్రమము. వాట్ టు పూచ్? అండ్ హౌ టు ఆన్సర్? అను విషయమై మీ సలహాలను అర్ధించుచున్నవాడను, అని విశదీకరించితిని. 

నా మిత్రులిరువురు దీర్ఘముగా నిశ్వసించి, ఇది గంభీర సమస్య యగుటచే, దీర్ఘము గా నాలోచించ వలయును కాబట్టి, హిందూస్థాన్ ఇయర్ బుక్, హూ ఈజ్ హూ అండ్ జెనరల్  నాలెడ్జి  గ్రంధములు చదివి మూడురోజుల తరువాత మరలా సమావేశమై చర్చించెదము అని నుడివిరి. 

తదుపరి సమావేశం లో ఉకృనామీ “నేనొక 10 ప్రశ్నలను తయారు చేసితిని” అని చెప్పగానే “నేనొక 10 జవాబులను తయారు చేసితిని” అని  పశినీకం  తెలియపర్చెను. అమెరికా అధ్యక్షుని పేరేమి? భారత ఆర్ధిక మంత్రి పేరు చెప్పగలవా? భారత రాజధానికి నేపాలు రాజధానికి మధ్య దూరమెంత? గుడ్డులోని పచ్చసొన లోని పోషక పదార్ధములను వివరింపుము? ఇల్లాంటి ప్రశ్నలు ఉకృనామీ చదవగానే  వాటికి జవాబులు పశినీకం చెప్పేడు. 

నాకు అరికాలి మంట నెత్తికి ఎక్కింది. అన్నీ ఇటువంటి ప్రశ్నలు కాదు. వారి వారి  అభిరుచులు, రుచులు, భావములు తెలుసుకొను ప్రశ్నలు కావలెను. అయినా ప్రశ్నలు లా కాకుండా అభిప్రాయములు పంచుకొను విధముగా నుండవలెను, అని  వివరించితిని. 

పరస్పర అవగాహనా కార్యక్రమం,  గ్రూప్ డిస్కషను ఇత్యాదులలో అనుభవా రాహిత్యము వల్ల నీకు అవసరమగు ప్రశ్నావళి తయారుచేయుటకు మేము అశక్తులము అని శోకతప్త హృదయులై  భోరు మని వారు విలపించిరి.

నేనునూ విచార గ్రస్తుడనై, చింతాక్రాంతుడనై ఈ పెళ్లి చూపులు అను నదిని దాటి వివాహము  అను సాగరము చేరుట ఎట్లు అని చింతించుచూ రావు గారి గృహంబునకు నరిగితిని. నా వెనకాలే మిత్రులిరువురు అరుగుదెంచిరి. 

నే  నరుగునప్పటికే  అచట రావు గారు, భావన అక్కయ్య, శాస్త్రి అంకులు, కామేశ్వరి ఆంటీ, Dr. రఘుపతి, మిసెస్ సుధా రఘుపతి కూర్చొని అడ్డాట ఆడుకుంటున్నారు. 

భావనా అక్కయ్య కోపంగా అంటున్నారు ”రావు మహాశయా తురఫు జాకీ బయట ఉండగా మణేలా ఎవరైనా వేస్తారా?  నాయనా ప్రద్యుమ్నా మీ ఆంధ్రా యూనివర్సిటీ లో అడ్డాట ఆడడం రాని వాళ్ళకు M.Sc, Ph.D లు కూడా ఇచ్చేస్తారా. మీ యూనివర్సిటీ లో మరీ ఇంత స్టాండర్డ్స్ దిగజారిపోయాయా"  అని ప్రశ్నించారు. 

నేను సమాధానం చెప్పేలోపలే,  “అడ్డాట దాకా ఎందుకు అక్కయ్య గారూ, పెళ్ళిచూపుల్లో  ఏమి చెయ్యాలో, అడగాలో కూడా తెలియని అమాయక జీవులు వారు” అని వ్రాక్కుచ్చాడు ఉకృనామీ.  

ఎవరికి పెళ్ళిచూపులు, ఏమా కధ అని అడిగారు శాస్త్రి గారు . ఆయన వయసులో పెద్దవారు కాబట్టి మా అందరికీ గురుతుల్యులు. ఎవరికి  ఏ సమస్య వచ్చినా ఆయన సలహాలు మాకు శిరోధార్యం అన్నమాట. 

ఉకృనామీ గాడు సంగతి సందర్భాలు వివరించాడు. అప్పుడు నేను అవనత మస్తకుడనై,  వినమ్రుడనై, ముకుళిత హస్తుడనై  వారిని,  వారి వారి పెళ్ళిచూపుల అనుభవములను సోదాహరణముగా వర్ణింపుమని   అర్ధించితిని.  మగవారు దీర్ఘముగా నిశ్వసించిరి  మరియూ ఆడించేవారు చిరునవ్వులు ఒలక బోసిరి.  

శ్రీ శాస్త్రి గారు లేచి కనులు తుడుచుకొని, ముక్కు చీదుకొని ఇటుల ఉపన్యసించిరి. “నాయనా ప్రద్యుమ్నా, నాదొక విషాద గాధ. నాకు పెళ్లి చూపుల అనుభవం లేదు నాయనా లేదు. ఒకరోజు మా తాతగారు  వీధి అరుగు మీద కూర్చొని  విద్యార్ధులచే  వేదాభ్యాసము  చేయించు చుండగా, వీధిలో నడుచుచూ వెళుతున్న ఓ ఘనాపాటి గారు ఆగి వేద పఠనం లో గొంతు కలిపారుట.  పాఠం అయిన తరువాత మా తాతగారు, ఆ ఘనాపాటి  గారూ కుశల ప్రశ్నలు వేసుకొని, ఒకరి వివరములు మరొకరు తెలుసుకొని , వారికి పెళ్లీడు కొచ్చిన మనవరాలు ఉందని, వీరికి వయసుకొచ్చిన మనవడు ఉన్నాడని తెలుసుకొని కడుంగడు ముదావహులై శుభం అనుకొన్నారట. అంతే మా పెళ్లి  1935 లో జరిగిపోయింది.” అని కూర్చున్నారు.   

అప్పుడు శ్రీ రావు గారు లేచి విషణ్ణ వదనముతో, దు:ఖముచే గద్గదికమైన గొంతు సవరించుకొని “మిత్రమా ఇప్పటికి  సుమారుగా 32 ఏళ్ల  క్రితము మా మేనమామ గారింట నొక ఆడ శిశువు జన్మించెను. జన్మించిన రోజునే మా మేనమామ గారు, చేతిలో చెయ్యేసి  చెప్పు అక్కా,  నా కూతురే నీ కోడలని, అని పాడితే, మా అమ్మగారు ఉత్సాహభరితులై , మాట ఇచ్చితిరా, మాట తప్పనురా అని పాడేరు ట. అంతే.  మా మామ కూతురికి  యుక్త వయసు రాగానే, అంటే ఆమె SSLCని పెఢెల్ ఫేడెల్ మని హ్యాట్రిక్కు తన్నులు తన్నిన తర్వాత, నాకు పెళ్లి చేసేశారు. ఇదిగో ఇల్లా అయింది నా బతుకు” అని విచారించి కూర్చున్నారు.

చివరగా Dr. రఘుపతి గారు నుంచోని  గంభీర వదనుడై, మాట్లాడ బోవుతుండగా, మిసెస్ సుధా రఘుపతి లేచెను. అప్పుడు Dr. రఘుపతి కూర్చున్నాడు.  మిసెస్ సుధా రఘుపతి  చిరునవ్వు నవ్వి “You see when Dr. రఘుపతి  Delhi లో  Ph.D   చేస్తుండగా, one day నన్ను చూశాడు. Next day కూడా మళ్ళీ same place  లో మళ్ళీ చూశాడు.  Then, he fell in love నా తోటి. Then after ఒక year మేము marriage చేసుకున్నాము.”  అని మళ్ళీ ఘట్టిగా నవ్వి కూర్చొనెను. అందరూ జాలిగా  Dr. రఘుపతి కేసి చూశారు.  ఆయన  మెల్లగా  “రెండో మాటు చూసి ఉండకుండా ఉండాల్సింది”  అని విచారించెను.  

ఔరా నాకు సలహాలు ఇచ్చువారే  లేరా అని విచారించితిని.  కానీ  విధి విధానము తప్పింప నెవరి తరము. తానొకటి తలచిన దైవము వేరొండు తలచును గదా.    

ఇది  జరిగిన సరిగ్గా  పదిహేను  రోజులకు నాకు మా అన్న  గారి దగ్గరి నించి నాలుగు వైపులా పసుపు పూయబడి మధ్యలో కుంకుమ రాగ రంజితమైన ఒక ఉత్తరం వచ్చింది.  ఈ ఉత్తరం లో మావదిన గారు మృదు మధుర స్వనంతో వ్రాక్కుచ్చారు. 

“ నాయనా ప్రద్యుమ్నా నీ వివాహం నిశ్చయించబడింది.  వధువు, కృష్ణా తీర విజయవాడ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ సోమయాజులు  గారి జ్యేష్ట పుత్రిక  చి. ల. సౌ. ప్రభావతి.  అమ్మాయి ఇంటర్ లో ఇంగ్లీష్ లో జారి పడిందిట. అందుకని తుచ్చ మ్లేచ్ఛ భాష నేల నేర్పించ వలెనని తండ్రి గారు కినుక వహించి తెలుగు విద్వాన్, మరియూ ఉ. భా. ప్ర. (ఉభయ భాషా ప్రవీణ) పరీక్షలు పాసు చేయించారట. పెళ్లి చూపులలో  మీ నాన్నగారు ఆమెతో తెలుగు లోనూ, సంస్కృతం లోనూ నాలుగు పద్యాలు, రెండు శ్లోకాలు పాడించి ముగ్దులై పోయారు. మీ అమ్మగారు  నీకు అత్యంత ప్రీతిపాత్రమైన పనసకాయ ఆవ పెట్టిన కూర  చేయు విధానము  గురించి  విశదముగా చర్చించి కడుంగడు ముదాహవులయినారు.  మేము ఇంకేమన్నా అడుగుదామని ప్రయత్నించినను,  వారు వీటో చేసేశారు.  అయిననూ పనసకాయ ఆవ పెట్టిచేయు  కూర విధి విధానములు తెలియని నామాట వారేల వినుదురు. అమ్మాయి  చూచుటకు బాగానే ఉంది. ఈ వివాహము జరుగుట నిశ్చయము, తధ్యము మరియూ శిరోధార్యమని మీ జనకులు నొక్కి వక్కాణించారు. కాబట్టి బుద్ధిగా వచ్చి పెళ్లి చేసుకొని వెళ్లమని నీకు వ్రాయవలిసిందిగా మీ తండ్రిగారు మీ అగ్రజుని ఆదేశించగా, వారి ఆజ్ఞా నుసారము నేను నీకు తెలియ పరచు చుంటిని.  మిగతా వివరములతో మీ నాన్నగారు త్వరలోనే నీకు జాబు వ్రాసెదరు.  మంగళం మహత్.”   

మా వదినగారు శలవిచ్చినట్టు ఇంకొక 10 రోజుల తర్వాత మానాన్నగారు  ఉత్తరం రాశారు.  "జూన్ 28, 1970  తారీఖున వివాహ మహోత్సవం నిర్ణయింపబడినది. కాబట్టి నువ్వు వచ్చి ఆ మూడు ముళ్ళూ వేసి కృతార్ధుడవు కమ్ము. కనీసం ఓ నాలుగు రోజుల ముందు అఘోరిస్తే కార్యక్రమములు అన్నీ సక్రమంగా జరుపుకొంటాము. అమ్మాయి ఫోటో పంపుతున్నాను. చూసి ఆనందించు" అని సారాంశము.  

అమ్మాయి ఫోటో లో బాగానే ఉంది. పెళ్ళిచూపులు లేకుండా  అంటే అమ్మాయిని నేను చూడకుండా నాపెళ్ళి నిశ్చయం అవటం బాధిస్తున్నా, మా నాన్న గారు కొంచెం అగ్నిహోత్రావధాన్లు టైపు కాబట్టి, నేనేమన్నా చెల్లదు కాబట్టి , గత్యంతరం లేక ఒప్పుకున్నాను. ఒప్పుకోక పోతే జరిగేది కూడా నాకు తెలుసు. 

ఆ అమ్మాయి చేత ఏ కమండలానికో తాళి కట్టించేసి, జోర్హాట్ తీసుకొచ్చి ఆ కమండలాన్ని  నామెడలో వేసి , ఆ అమ్మాయిని నానెత్తి  మీద  కూర్చోపెట్టి భీమవరం వెళ్లిపోతారు. కాదనే ధైర్యం నేను చేయలేను కాబట్టి ఓ వారం రోజుల ముందుగా నేను భీమవరం చేరిపోయాను, అవునండీ పెళ్లి చేసుకోవటానికే


(ఇది మొదటి మాటు 11/01/2011 న ప్రచురించ బడింది.)          

పశుపతి పెళ్లి చూపులు


నమస్కారమండి లహరి గారూ. నా పేరు పశుపతి.


నమస్కారమండీ. నేనూ మిమ్మల్ని గుర్తు పట్టాను కానీ చిన్న సంశయం తో పలకరించలేదు.

ఫరవాలేదు లెండి. నేను మీ చిత్రం చాలా మాట్లే చూసాను కనుక వెంటనే గుర్తు పట్టాను.

చాలా మాట్లు అంటే ఎన్ని మాట్లు చూసారు?  చిత్రం అంటే ఫొటోనా? నవ్వుతూనే అడిగింది లహరి. 

అవునండి. ఓ పది పన్నెండు మాట్లు చూసాను మీ చిత్రం. మా నాన్నగారు పంపించినప్పుడు మొదటి మాటు, మా అక్కయ్యకు చూపించి నప్పుడు రెండో మాటు, మా బావగారికి చూపించి నప్పుడు మూడో మాటు. నా చిత్రం పక్కన మీది పెట్టి రెండు సరిపోయాయా అని కూడా చూసాను లెండి.

మాచింగ్ అయ్యాయా?

ఆ ఆయ్యాయండి. మా నాన్నగారికి మన జాతకాలు కూడ సరిపోయాయి.

జాతకాలు మా నాన్నగారూ చూపించారండి. పెళ్లి చూపులకి డేట్ ఫిక్స్ చేస్తామన్నారు. ఆ లోపుల మీతో ఒక మాటు మాట్లాడదామని  మిమల్ని ఇలా రమ్మన్నానండి. అంది లహరి.

లోపలి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం రండి. అన్నాడు పశుపతి.

రెస్టారెంట్ లో ఒక మూల సీట్స్ చూసుకొని కూర్చున్నారు ఇద్దరూ.

మీరు ఫోటోలో చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పుడు ఇలా సరదాగానే ఉన్నారు. 

నాకు ఫోటో ఫోబియా ఉందండి. ఎవరైనా ఫోటో తీస్తుంటే నేను బిగుసుకుపోతాను. నవ్వలేను. విశ్వప్రయత్నం చేసి నవ్వాననుకుంటాను కానీ అదేమిటో దివాలా తీసిన వాడి మొహంలా వచ్చేస్తుందండి.

మీకు తెలియకుండా ఎవరినైనా తియ్యమనకపోయారా ?
                                              
భలేవారే. ఈ విషయంలో నాకు అతీంద్రియ శక్తి ఉందనుకుంటానండి. అంతెందుకు నడుస్తున్నప్పుడు ఒక ఏభై మీటర్ల దూరం లో  ఫోటో స్టూడియో ఉంటే ఇక్కడ నుంచే నేను బిగుసుకు పోతానండి. ఎవరి చేతిలోనైనా కెమేరా చూసినా నా పరిస్థితి డిటో అండి. వెంటనే  వారికి దూరంగా వెళ్ళి పోతానండి.  నన్ను ఫోటో తీసిన  కెమేరా కానీ, కెమేరా ఉన్న సెల్ ఫోన్ కానీ మళ్ళీ  పనికి రాదండి.

అదేమిటండి.  అల్లా ఎల్లా అవుతుంది. మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు

నిజమండి. ఆ తరువాత ఆ కెమేరా తో ఏం తీసినా కట్టెలాగ బిగుసుకు పోయినట్టే పడతారు మనుషులు. ఒక్కోమాటు  వీడి తల వాడికి వాడిది మరొకడికి వెళ్ళి పోతుందండి. కెమేరా లోనే ఏదో తేడా వస్తుందండి.  నమ్మండి.

లహరి నవ్వింది. మనోహరంగా నవ్వింది అనిపించింది పశుపతికి. అదే చెప్పాడు.
మీరు నవ్వితే ఇంకా బాగుంటారండి లహరి గారూ.
లహరి సిగ్గుపడింది. ఇంతలో సర్వారావు వచ్చాడు.

హిహిహి . ఏం కావాలండీ. కాఫీ సరిపోతుందాండి? కాఫీ తరువాత  ఐస్ క్రీం ఏమైనా తీసుకుంటారా?

అదేమిటోయ్ సర్వేశ్వర శర్మా అల్లా అడిగావు? పశుపతి అడిగాడు.

ఈ వరుసలో ఉన్న మూడు టేబుల్స్ ప్రేమికుల టేబుల్స్అండి. మద్యాహ్నం రెండు నుంచి నాలుగు దాకా కూర్చుని కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోతారండి. వాళ్ళు వచ్చిన పావు గంటకి వస్తామండి ఆర్డర్ కోసం . వాళ్ళు  ఆర్డరిచ్చిన అరగంట కి మేము కాఫీ తెస్తామండి. తెచ్చిన అరగంటకి వాళ్ళు తాగుతారండి. ఇంకో పావుగంట తరువాత మేము బిల్లు, సోంపు పళ్ళెం తెస్తామండి. ఓ పావుగంట సోంపు నమిలి బిల్లు చెల్లించి  వెళ్ళిపోతారండి.

మధ్యలో ఐస్ క్రీం ఎందుకు అడిగింది లహరి.

అదాండీ. వాళ్ళు త్వరగా తాగేస్తే  ఫిల్ ఇన్ ది బ్లాంక్ లాగ ఐస్ క్రీం మేమే తెస్తామండి. బిల్లు వాళ్ళే కట్టాలండి.

లహరి గారూ నాకు ఆకలేస్తోంది. మధ్యాహ్నం భోజనం చేయలేదు నేను. మీరేమైనా తింటారా?

నేను భోజనం చేసే వచ్చానండి. మీరు భోజనం చేసేలోపు నేను కాఫీ తాగి ఐస్ క్రీం తింటాను. నవ్వుతూ అంది లహరి.

లహరి గారా ఇంకా గారూ లోనే ఉన్నారా  అంటు ఆశ్చర్యపడ్డాడు సర్వాశ్రీ. ఇంకా మొగ్గ తొడగని ప్రేమా అని ప్రశ్నార్ధకం వదిలాడు. 
 
పశుపతి లహరి, లహరి పశుపతి,  hmm  పేర్లకి శృతి లయలు  కలిసినట్టు లేవండి. అబ్బాయిగారు పేరు మార్చుకుంటే బాగుంటుందేమో అని ఓ సలహా కూడా కక్కేసాడు సర్వానంద్.

లహరి నవ్వుతోంది పగలబడి నవ్వుతోంది. మైమరచి చూస్తున్నాడు పశుపతి లహరిని. పదిహేను సెకన్లలో తేరుకుని ఐ యాం సారీ అంది పశుపతి తో. పశుపతి చిరునవ్వు తో లహరి చెయ్యి మృదువుగా నొక్కాడు.

ఇదిగో సర్వార్కర్ నువ్వు నాకు ఒక ప్లేటు ఇడ్లీ ఆ తరువాత  మసాలా దోస,  అమ్మగారికి ఓ కాఫీ పట్టుకురా. అమ్మగారికి ఐస్ క్రీం తెచ్చినప్పుడు నాకు కాఫీ తీసుకురా. త్వరగా నాకు అంత టైం లేదు.
ఎస్ సర్ అంటూ సర్వారాం వెళ్లాడు.

మీ పేరు సర్వానంద్ కి కూడా తెలుసునా? చూసారా మీ భాష నాకు కూడా వచ్చేస్తోంది. సర్వానంద్ అని.

వాడు నా సహాధ్యాయి చిన్నప్పుడు. పదో క్లాసు దాకా కలిసి చదువుకున్నాం. అర్జంట్ పనులుండడం వల్ల వాడు అక్కడ ఆగిపోయాడు. పనీ పాడు లేక నేను యం. టెక్  చేసాను.

ఏం, ఆర్ధిక పరిస్థితుల వల్ల అతను ఉద్యోగంలో చేరాడా?

వాళ్ళ నాన్న గారు  శాస్త్రి కేటరర్స్  అనే పరిశ్రమ స్థాపించారు. రెండేళ్లయినా అది వారి ఇంట్లోనే ఉండిపోయింది. అప్పుడు ఆయన వాళ్ళ వీధిలోనే ఉండే, పనీ పాడు లేని సంఖ్యా, నామ శాస్త్ర,  జ్యోతిషవేత్తని సంప్రదించారు. వారు మూడు గుణకారాలు, ఆరు ప్లస్సులు చేసి శాస్త్రి అండ్ కేటర్రర్స్ అని పేరు మార్చమన్నారు. ఆయన పేరు  మార్చిన రెండేళ్లలో వీధిన బడ్డారు. వీడు మా వూళ్ళో  హోటల్ లో వైటర్గా చేరాడు. దిన దిన ప్రవర్ధమానుడగుచూ అప్పుడెప్పుడో  ఇలా ఇక్కడ దర్శనమిచ్చాడు. 
   
మీరేమి అనుకోక పొతే  ఇలాంటి  పేరు నేను మొదటిమాటు వినడం. చాలా పాత పేరు. పేరు మార్చుకోవాలని మీకు ఎప్పుడూ అనిపించలేదా? పెళ్లి చూపులకు ముందు మిమ్మల్ని చూడాలనుకున్న కారణాలలో ఇది ఒకటి.  పాత పేరు లాగ మీ భావాలు కూడా అల్లాగే ఉంటాయేమో నని తెలుసుకుందామని,  కలుద్దాం అన్నాను,   అంది లహరి నిర్మొహమాటంగా.

పశుపతి లేచి నుంచున్నాడు. తూర్పు ఎటువైపో మీకు తెలుసా అని అడిగాడు లహరిని.

తూర్పా ఎందుకు? అని ఆశ్చర్యంతో  అడిగింది. నాకూ సరిగ్గా తెలియదు.

ఇంతలో సర్వేశ్వరుడు మంచి నీళ్ళు పట్టుకు వచ్చాడు.

నాయనా సర్వా తూర్పు ఎటు?  నీకు తెలుసునా?

తూర్పు ఎటో తెలియదు కానీ దక్షిణ తెలుసునండి.

పోనీ అదైనా చెప్పు. సూర్యుడి ముందు నులుచుంటే కుడి వైపు దక్షిణం అని ఎవరో చెప్పారు.

ఆ దక్షిణం నాకూ తెలియదండి. మీ పర్సులో ఉండేది,  మీరు బిల్లు చెల్లించిన తరువాత నా చేతిలో పెట్టే దక్షిణ,  ఆంగ్లమున టిప్ అనబడేది   మాత్రమే నాకు  తెలుసు.

మళ్ళీ నవ్వింది లహరి. పశుపతి ఆమె కేసే చూసాడు.

'చూపులు కలిసిన శుభవేళా నేనెందుకు ఇక్కడ’ అంటూ సర్వోత్తమరావు వెళ్ళిపోయాడు.
లహరి కొద్దిగా సిగ్గుపడింది.

సిగ్గు పడితే మీరింకా బాగుంటారండి అంటూ పశుపతి ఆశ్చర్యపడిపోయాడు.

తూర్పు ఎందుకో చెప్పలేదు అంటూ మాట మార్చింది లహరి.

తూర్పు తిరిగి దండం పెడదామని అంటూ కూర్చున్నాడు పశుపతి.

దండమా? ఎందుకు? అని ఏక పద ప్రశ్నలు రెండు వేసింది లహరి.

పేరు మార్చుకోమంటేనూ. ఈ పేరు వెనక్కాల హైదరాబాద్ లో  4 ఫ్లాటులు, ఒక అరడజను ప్లాటులు, మా వూళ్ళో  నాల్గెకరాల కొబ్బరి తోట, ఇంకో సంఖ్య ఎక్కువ  ఎకరాల మాగాణి, ఇంకో నాల్గైదు ప్లాటులు,    ఐదు వందల గజాల్లో ఎనిమిది గదుల ఇల్లు, ఇంటి చుట్టూ పూల మొక్కలు, సరిగ్గా తెలియదు కానీ ఓ పాతిక లక్షల డిపాజిట్స్ ఉన్నాయండి.  పేరు మారిస్తే ఇవన్నీ నాకు హుష్ కాకి అయిపోతాయండి.

పేరు మారిస్తేనా? అంటూ ఆశ్చర్య పడిపోయింది లహరి.

మా నాన్న గారి పేరు వినాయక శాస్త్రి. వారి తండ్రి గారి పేరు పశుపతి ఇవే పేర్లు మా ఇంటిలో ఆరు  తరాలుగా వస్తున్నాయి. ఆరు తరాలుగా మా ఉంట్లో ఒకడే కొడుకు. ఆరుతరాల వెనక వినాయక శాస్త్రి గారికి చాలాకాలం సంతానం కలుగకపోతే, పశుపతిని ఆరాధించారుట. వారి కృపా కటాక్షాల వల్ల పుట్టిన ఒకే ఒక మగ సంతానానికి పశుపతి అని పేరు పెట్టారుట. వారు పుట్టిన వేళా విశేషం వల్ల ఆ వినాయక శాస్త్రి గారికి కలిసివచ్చిందిట. ఇలా పేర్లు పెట్టడం వల్లే ఇప్పటికి ఇంత ఆస్తి సమకూరిందని మా నాన్నగారి ధృడ విశ్వాసం. అందుచేత పేరు మార్చడం కుదరదు. అంతే కాదు నాకు కలిగే మొదటి మగ సంతానానికి వినాయక శాస్త్రి అనే పేరు పెట్టాలి. లేకపోతే మా వంశ గౌరవం, ప్రతిష్ట మంట కలిసిపోతాయని మా పితాశ్రీ శాసనం లిఖించారు. సుమారు నాల్గైదు కోట్ల ఆస్థిని,  పేరు కోసం వదులుకునే ఉద్దేశ్యం నాకు లేదని మా సర్వేశ్వరుడి సాక్షిగా మనవి చేసుకుంటున్నాను, అన్నాడు పశుపతి ఇడ్లీ  ప్లేటు తనముందు,  కాఫీ కప్పు లహరి ముందు పెడుతున్నసర్వా రాయుడిని చూసి.

మధ్యలో నా పేరెందుకు కానీ, పేరు కోసం ఆవిడ మట్టుకు ఇంత ఆస్థిని వదులుకోమని చెప్పరు. కదండీ లహరి గారూ అంటూ వెళ్ళిపోయాడు, సర్వా పుంగవుడు.  

అన్నట్టు, మీకు వంటా, వార్పూ లలో ప్రవేశం ఉందా అని అడిగాడు పశుపతి, ఇడ్లీ ముక్క నోట్లో పెట్టుకుంటూ. 

సమాధానం చెప్పటానికి లహరి సంశయించింది. లేదండి నాకు వంట చేయడం రాదు.

ఫరవాలేదు లెండి. మా అక్కయ్య కూడా పెళ్ళికి ముందే నేర్చుకుంది వంట చేయటం అని నవ్వాడు పశుపతి. 
నాకు బాగా వచ్చండి వంట చేయటం. గత రెండేళ్లగా ఉద్యోగం చేసుకుంటూ రాత్రికి వంట చేసుకుంటున్నానండి. పగలు ఆపీసు కేంటిన్ లో తింటానండి అని కూడా చెప్పాడు.

వంట చెయ్యడం మీ హాబీ అన్నమాట అంది లహరి.

కాదండి. హోటల్ భోజనం చెయ్యలేక వండుకుంటున్నానండి.

రెండు మూడు నిముషాలు ఈయన ఇడ్లీ తినడం లోనూ ఆవిడ కాఫీ తాగడం లోనూ ఏకాగ్రత చూపించారు.

నాకు క్రికెట్ అంటే ఇష్టం. మాచిలన్ని టివిలో చూస్తాను. నేను టేబుల్ టెన్నిస్ ఆడతానండి. మీరేమైనా ఆడతారా అని అడిగింది లహరి.

ఆ, బాగానే ఆడతానండి అబద్ధాలు. జవాబు చెప్పాడు పశుపతి. లహరి నవ్వింది.

ఎటువంటి అబద్ధాలు?  ఉదాహరణకి చెప్పండి అని అడిగింది.

ఇందాకా చెప్పాను కదండీ, నాలుగు కోట్ల ఆస్థి అని. కాదండి,  అందులో మా అక్కయ్యకి సగ భాగం ఉందండి. నవ్వుతూనే చెప్పాడు పశుపతి.

ఇంత ఆస్థి ఉండి కూడా, మాలాంటి సామాన్య కుటుంబీకుల సంబంధం చూస్తున్నారేమిటి? అడిగింది లహరి.

నవ్వేసాడు పశుపతి. పెళ్ళిళ్ళ పేరయ్య,  ముందు కొన్ని ఉన్నవాళ్ళ సంబంధాలే తెచ్చాడండి. ఆ ఇళ్లలో వ్యక్తుల ప్రవర్తన, మాటతీరు మా నాన్నగారికి, నాకు కూడా  నచ్చలేదండి. ఆడంబరాలు, షో ఎక్కువ అనిపించిందండి. ఇంకా చూస్తూనే ఉన్నామండి. నెల రోజుల క్రితం, మీ బాబయ్య గారు మీ వివరాలు పేరయ్య గారికి ఇచ్చారు కదండీ. అక్కడే ఉన్న మా నాన్నగారు మీ ఫోటో చూసి, తరువాత  మీ కుటుంబం గురించి వాకబు చేసి,   పేరయ్య గారిని మీ ఇంటికి పంపారు. అదండి సంగతి. ఏమీ దాచకుండా చెప్పాడు పశుపతి.

మీ గురించి కూడా మా బాబయ్య వాకబు చేసారండి చెప్పింది లహరి.

ఇంకేం ఇద్దరూ ప్రొసీడ్ అయిపోండి. పబ్లిక్ గార్డెన్స్, సినిమాహాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నాయి అన్నాడు సర్వయ్య దోశ  పశుపతి ముందు పెడుతూ.

సర్వాసేన్ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావోయ్ అన్నాడు పశుపతి. మాట్లాడకుండా వెళ్ళిపోయాడు సర్వా పండిట్.

ఇతను మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు. మీరు తాత్సారం చేస్తే ఎవరో ఇంకో అదృష్టవంతురాలు ఎగరేసుకు పోతుంది ఇతనిని,  అని సలహా ఇచ్చాడు లహరికి,  దోశ తిని చెయ్యి కడుగుకుందుకు పశుపతి వెళ్ళినప్పుడు,  కాఫీ,  ఐస్ క్రీం తెచ్చిన సర్వాసింగ్.

వీళ్ళ ఇంట్లో ఆచార వ్యవహారాలు, పూజా పునస్కారాలు  ఎక్కువ అని తెలిసింది.  కట్నం వద్దన్నా,   కలిగిన వాళ్ళు,    నేను సర్దుకు పోగలనా అనే అనుమానం అంది లహరి. 

మరేం ఫరవాలేదండి. ఈయన తల్లి తండ్రులు మంచివారండి. వారి వ్యవహారాలు ఇతరులకి ఇబ్బంది కలిగించవండి. భేషజాలు అసలు లేవండి. వాళ్ళ అల్లుడు గారు అరపేంట్ల ఆధునికుడే నండి. హాయిగా కలిసిపోయారండి. ఈయనకి కూడా భక్తి ఉంది కానీ పూజలు గట్రా ఎక్కువుగా అలవాటు కాలేదండి  చెప్పాడు సర్వాయరప్ప.    

ఇంతలో పశుపతి వచ్చి కాఫీ సేవనం మొదలుపెట్టాడు. లహరి ఐస్ క్రీం చప్పరించ సాగింది.

కౌంటర్ దగ్గర ఏదో  కలకలం మొదలయింది. ఒకామె కుక్కని తీసుకు వచ్చింది. “కుక్కలని అనుమతించము” అని చెప్పాడు కౌంటర్ లో కూర్చున్న కేషియర్. “ఇది కుక్క కాదు. జర్మన్ షెప్పర్డ్  డాగ్” అంది ఆమె. “కాలభైరవుడు దిగి వచ్చినా అనుమతించేది లేదు. మీ కారులో ఉంచి రండి” అన్నాడు కేషియర్.  “మా కిట్టూకి ఐస్ క్రీం అంటే ఇష్టం. అందుకే తీసుకు వచ్చాను”   అంది ఆమె. “సారీ మేడం,  నేనేం చెయ్యలేను. ఇక్కడ డాగ్స్ కి కూడ అనుమతి లేదు” అన్నాడు  కేషియర్.   

ఇంతలో కిట్టూ గారు  ముక్కు ఎగ పీల్చారు. ఒక్క ఉదుటున జంప్ చేసారు. అప్రయత్నంగా ఆమె గొలుసు వదిలేసింది. వేగంగా కిట్టూ గారు రెండు మూడు టేబుల్స్ దాటి లహరి ముందున్న ఐస్ క్రీం మీదకు లంఘించారు. భయంతో లహరి రెండు గెంతులు గెంతి, అప్పటికే నుంచుని కుక్కని ఆదలించే ప్రయత్నం చేస్తున్న పశుపతి మీద పడి ఘట్టిగా పట్టుకుంది. అప్రయత్నంగా పశుపతి చేతులు లహరి చుట్టూ పడ్డాయి.  తేరుకొని,  కిట్టూని పట్టుకుని యజమానురాలు బయటకు తీసుకెళ్ళింది, లహరికి మరీ మరీ సారీ చెపుతూ. భయంతో బిర్ర బిగుసుకు పోయిన లహరి ఇంకో అరనిముషం పశుపతిని పట్టుకుని అలాగే ఉంది. 

ఆ తరువాత అతన్ని వదిలి “సారీ అండి నాకు కుక్కలంటే బాగా భయం” అంది. 

“నాకూ కుక్కలంటే భయమేనండి. ఈ వేళే,  మీరు పక్కనుంటే ధైర్యం వచ్చింది” అని నవ్వాడు పశుపతి.

బిల్ పే చేసి సర్వాబ్రహ్మకి దక్షిణ ఇవ్వకుండానే బయటకు వచ్చారు. 

ఈ మీటింగ్ మీకు  అసంపూర్తిగానే మిగిలింది అనుకుంటాను. మీ నెక్స్ట్ కాల్ కోసం ఎదురు చూస్తాను అన్నాడు పశుపతి. 

మీటింగ్ సంతృప్తి గానే ముగిసింది  నాకు. మీరు OK అంటే  మా నాన్నగారు  మీ నాన్నగారిని కలవడానికి ఈ వారంలో వస్తారు. అంది సిగ్గు పడుతూ లహరి. 

                                   
 



   
 

మా ఆవిడకు విడాకులు ఇచ్చేస్తాను

ఉపోద్ఘాతం: ఈ టపా తిరిగి వెయ్యడానికి ఒక కారణం ఉంది. కిందటి నెలలో రెండు దినాలు వచ్చాయి. ఒకటి జూన్ 14 న ఈ బ్లాగు పుట్టిన రోజు. మరిచే పోయాను. రెండవది జూన్ 28న మా ఏభై వ  వివాహవార్షిక దినం. ఇది గుర్తు ఉంది. కానీ కరోనా కారణంగా హడావడి ఏమి చేయలేదు. కానీ సంగతి తెలిసిన ఒక మిత్రుడు అడిగాడు. 

"ఈ ఏభై ఏళ్లలో విడాకులు తీసుకోవాలని అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? వివరింపుము" అని. వాడు సరదాగానే అడిగాడు. అంతే  సరదాగా నేను ఈ టపా లింక్ వాడికి పంపాను. 

మీరు కూడా చదివెయ్యండి. 

                      మా ఆవిడకు విడాకులు ఇచ్చేస్తాను 
  

ఇది ఉన్నట్టుండి తీసుకొన్న నిర్ణయం కాదు. అనేక విధాలుగా, అనేక కోణాలలో ఆలోచించి, చర్చించి, ఇంకో మార్గం ఏది తోచక తీసుకో బోతున్న నూతన సంవత్సర తీర్మానం. అయినా తీర్మానం చేసుకొనే ముందు బ్లాగు మితృలు, బ్లాగు బంధువులు, బ్లాగాప్తులు అయిన మీ అందరికీ తెలియపర్చి, మీ సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలని పించింది.

జనవరి ఒకటవ తేదీన మీరందరూ ఈ బ్లాగు నించి ఆ బ్లాగు లోకి పరిగెడుతూ , నూతన శుభాకాంక్షలు  అని నొక్కుతూ మధ్య మధ్యలో మీ బ్లాగులోకి వెళ్ళి, ఇంకా కాంక్షించని వారెవరా అని లెక్క చూసుకుంటూ చాలా బిజీ గా తిరుగుతుంటారని  తెలుసు కాబట్టి, నాలుగు  రోజులు ముందుగా నా ఈ జీవన్మరణ సమస్య మీ ముందుకు తెచ్చాను. మీరు జాగ్రత్తగా ఆలోచించి, అవసరమైతే మీ పక్కవారి బుఱ్ఱ కూడా తినేసి నాకు తగు సూచనలు చేసి, నాకు మార్గదర్శకులు  కండు అని ఎలుగెత్తి   నివేదించుకుంటున్నాను. మీరైతే బోల్డన్ని బ్లాగులు చదివేసి   బోల్డంత  జ్ఞానము  సంపాదించిన,  జ్ఞానము నిండుకున్న మెదడు కలవారని (అచ్చు తప్పయిన క్షమించవలెను) మీకు సవినయంగా,  వినమ్రము గా విన్నవించు కుంటున్నానన్నమాట.

ఈ నా సమస్య ఈ నాటిది కాదు. అనేక  సంవత్సరముల నుండి నన్ను మానసిక క్షోభ కు గురిచేస్తున్న బృహత్తర సమస్య. జూన్ 29, 1970 నుంచి నామనస్సులో మెదలుచున్న ఆలోచన. జూన్ 28, 1970 న ప్రద్యుమ్నుడు అనబడే నాకు చి. ల. సౌ. ప్రభావతి అనబడు కన్యాకామణి తో వివాహ మహోత్సవం జరిగింది. 

అసలు పెళ్లి రోజున,   పెళ్లి పీటల మీద ఏం జరిగిందో మీరు ఊహించగలరా.   పెళ్లి పీటల మీద నేను కూర్చుని బ్రహ్మ గారు చెప్పినవి  అన్నీ బుద్ధిగా చేసేస్తున్నాను . కొంత సేపైన తరువాత కాబోయే మా ఆవిడని  ఓ బుట్టలో కూర్చోపెట్టి తీసుకు వచ్చి నా ఎదురుగా కూర్చోపెట్టారు. మధ్యలో ఒక తెర. అప్పుడు ఆసీనులైన సదాసదులలో  గుసగుసలు మొదలయ్యాయి. మెల్లగా మొదలైన గుస గుస లు కొద్ది సేపటికి బ్రహ్మగారి మంత్రాల స్థాయి దాటి పోయాయి. ఇంతలో కాబోయే  మా ఆవిడ ని  తీసుకొచ్చి పీటల మీద  నాపక్కన కూర్చో పెట్టారు. ఇప్పుడు గుసగుసలు రూపాంతరం చెంది రణగొణ ధ్వనులుగా మారాయి.  నేను కొంచెం ఉత్సుకత తో ఓ గుసగుస ల మాష్టారుని పిలిచి ఈ రణగొణ ధ్వనుల కారణమేమి అని అడిగితిని. ఆయన నాచెవిలో అరుస్తూ రహస్యం గా చెప్పాడు. “పెళ్లి కొడుకు కన్నా పెళ్లి కూతురు అంగుళం  పైగా   పొడుగు అని చెప్పు కుంటున్నారు”  చెప్పిన వాడు  ఊరుకోకుండా నా నెత్తి  మీద వాడి వేలు పెట్టి నా కాబోయే ఆవిడ తలతో సరిచూసి  కొలిచి అంగుళన్నర అని ప్రకాశముగా గుసగుస లాడి వెళ్లిపోయాడు. నాకు మండింది. 

నా కాబోయే  ఆవిడ కేసి చూసాను. ఆవిడ బాసిం పట్టు వేసుకొని, నిటారుగా కూర్చొని స్నేహితులతో గుసగుస లాడేస్తోంది.  అప్పుడు నేను ఆవిడతో చెప్పాను. "కొంచెం తలకాయ వంచుకొని, బుద్ధిగా పెళ్లి కూతురు లాగా సిగ్గుపడుతూ కూర్చో"  అని. "అల్లా నాకు చేత కాదు. నాకు ఇల్లానే బాగుంటుంది" అని అనేసిందండి. పైగా మాయాబజారు లో సావిత్రి లాగా హాహాహా అని  నవ్వింది కూడా.  

నాకు మళ్ళీ కాలింది. కాలదా అని అడుగు తున్నాను. ఇంకా తాళి కట్టకుండానే ఇంత మాట అనేసింది. కట్టింతరువాత ఇంకెన్ని  అంటుందో, ఇంకెంత అవమానకర మాటలు వినాల్సి వస్తుందో నని అనుమానం వచ్చేసింది నాకు. అనుమానం కాస్తా  పెను భూతమై విడాకులు ఇచ్చేద్దా మను కున్నాను. పెళ్లి కాకుండా విడాకులు ఇవ్వడం బాగుండదు,  చట్టం కూడా ఒప్పుకోదు కాబట్టి పెళ్లి చేసుకొని వెంటనే విడాకులు ఇచ్చేద్దామను కొని  పెళ్లి చేసేసు కొన్నాను. విడాకులు తీసుకోవటానికి ఇది మొదటి కారణం.   

సరే పెళ్లి అయిపోయింది. భార్యామణి ని తీసుకెళ్ళి నేను ఉద్యోగం చేస్తున్న ఊరిలో  కాపురం  పెట్టేశాను. మా ఆవిడ పెళ్ళైన కొత్తలో కొంచెం నాజూకుగా పొడుగ్గా కనిపించేది. నేను పుష్టిగా గుండ్రం గా (అంటే లావు కాదండోయ్ )  కొంచెం పొట్టిగా కనబడే  వాడిని. పొట్టి అంటే మరీ పొట్టి కాదండోయ్. 5 అడుగుల మీద ఇంకో మూడున్నర, నాలుగు అంగుళాలు ఉంటాను. ఏదో పొట్టి వెధవకి పొడుగు అమ్మాయిని కట్టబెడితే పిల్లలు పొడుగ్గా పుడతారు అనే భ్రమతో  మా వాళ్ళు ఇల్లా మా ఇద్దరికీ పెళ్లి చేసేసా రన్న మాట. 

తను పొడుగు అయితేనేం కొంచెం వంగి నడవ వచ్చు కదా, ఊహూ నిటారుగా గెడకఱ్ఱ  లాగా నుంచొని మరీ నడిచేది. కాపురం పెట్టిన  కొత్తలో మేమిద్దరం కలసి నడుస్తుంటే, చూసేవాళ్ళు  కొద్దిగా చిరునవ్వు నవ్వేవాళ్లు.  ఏదో మమ్మల్ని పలకరిస్తున్నారని  అనుకొనే వాడిని. కానీ  తెలియని వాళ్ళు కూడా నవ్వుతుంటే నాకు అనుమానం వచ్చేసింది. నవ్విన వాళ్ల పళ్లే బయట పడతాయని సరి పెట్టుకొని, మా నడక కార్యక్రమం కానిచ్చే వాడిని. కొద్ది కాలం గడిచే టప్పటికి గుసగుసలు మొదలయ్యాయి మా కాలనీ లో . మేము నడుస్తున్నప్పుడు, చిరు హాసాలు కాస్తా నవ్వులు గా మారిపోయాయి.  నాకు అర్ధం కాలేదు. అప్పుడు ఓ గుసగుస మితృడిని అడిగాను. " What is this gusa  gusa" అని. “ మీరు ఇద్దరూ కలిసి నడుస్తుంటే number 10 లాగా ఉన్నారు"  అని అను కుంటు న్నారు అందరూ అని అట్టహాసం చేసి వెళ్ళి పోయాడు . నాకు మళ్ళీ మండింది. ఏం చేయలేక, అప్పటినించి నేను ఆవిడ వెనక్కాల, ఆవిడ అడుగు జాడల్లో కనీసం పది అడుగుల దూరం లో నడవడం మొదలు పెట్టేను.  ఇది రెండవ కారణం.

అసలు పెళ్ళాం అంటే ఎల్లా ఉండాలి. వినయ విధేయతలు మూర్తీభవించాలా వద్దా ? పతివ్రతగా, పతి ఇష్టమే తన ఇష్టం గా మసలుకోవాలా వద్దా ? పతియే ప్రత్యక్ష దైవం అనుకోవాలా వద్దా ? అని అడుగుతున్నాను మిమ్మల్ని.  పెళ్ళైన కొత్తలో ఇంకా ఆర్నెల్లు కూడా కాకుండా,  కొంపలంటుకు  పోయినట్టు  మా ఆవిడ పుట్టిన రోజు వచ్చేసింది. సరే new పెళ్ళాం, new పుట్టిన రోజు, new కాపురం అని నేను new గా ఆలోచించి , మా ఆవిడ కి తెలియకుండా surprise చేద్దామని, బజారు వెళ్ళి 475 రూపాయలు పెట్టి ఒక చీర కొనుక్కువచ్చాను. ఆ కాలం లో నా జీతం నెలకి 1186రూపాయల 64పైసలు. 475 అంటే 1/3 జీతం కన్నా ఎక్కువ.  
తెగించి,  ధైర్యం చేసి నేనొక చీర కొని పుట్టిన రోజు ఉదయమే,  Happy birth day to you  అని పాడి బోల్డు నవ్వులు నవ్వుతూ, నేనే హారతి ఇచ్చి చీర ప్రెజెంట్ చేస్తే, చూసి "ఇదేం చీరండి, ఈ అంచేమిటి, అసలు ఆ రంగేమిటి, నాకు నప్పుతుందనే కొన్నారా? మీరు ఒక్కరే ఎందుకు వెళ్లారు? నన్నెందుకు తీసుకెళ్ల లేదు? చీర కూడా కొనడం చేతకాని వాళ్ళా  మీరు" అంటూ కడిగేసింది. 
మీరే చెప్పండి ఇదేమైనా బాగుందా? Love  love గా నేనో చీర పట్టుకొస్తే,  new  మొగుడు అని కూడా చూడకుండా, what is this రంగు అని అంటుందా. పైగా  “యే క్యా హై “ అని హిందీలో కూడా అడిగిందండి. అప్పటికప్పుడు నన్ను మళ్ళీ బజారు తీసికెళ్ళి , ఆ చీర మార్చేసి ఇంకో వంద రూపాయలు వేసి , చీర తీసుకొని, పుట్టిన రోజు ఛీరంటే ఇల్లా ఉండాలి అని నాకో క్లాసు పీకిందండి.  What do i do now?   అప్పుడు ఖచ్చితం గా విడాకులు తీసేసు కోవాలని డిసైడు అయిపోయాను.  ఇది మూడో కారణం.

ఇల్లా చెపుతూ పోతే బోలెడు కారణాలు ఉన్నాయి. రోజు రోజు కు ఒక కారణం లిస్టు లోకి ఎక్కుతోంది. నేను మంచి వాడను, బుద్ధిమంతుడను, నోట్లో వేలు పెట్టినా కొరకలేని వాడను  కాబట్టి, సహనం వహించి ఈ సంసార సాగరాన్ని ఈదుకుంటూ  వస్తున్నాను  ఇన్నాళ్లుగా. పెళ్ళైన దగ్గరనించి ఇప్పటి దాకా  నేను స్వతంత్రించి ఏమి చేయలేక పోయాను. చివరాఖరికి నేను వేసుకొనే లాగూ చొక్కా, జేబురుమాలు దగ్గరినించి అన్నీ ఆవిడ ఇష్ట ప్రకారమే కొంటుంది. "మా ఆయనికి ఏమి తెలియదండి అన్నీ నేనే చూసుకోవాలి" అని అందరికీ చెపుతుందండి. చూసి చూసి, విసిగి వేసారి ఆవేశంతో  భర్త అంటే ఎవరు  అని నేనో పద్యం కూడా రాసేసాను.


శాంతభూషణుడే కానీ అలుగుటయే ఎరుంగని అమాయక జీవి వాడూ   
ఔనౌను అనుటయే కానీ కాదు  లేదు అని అనలేని  పిరికి జీవి వాడూ
ఆఫీసులో ఉగ్ర నరసింహుడే యైనా గృహంగణమున సాధు జీవి వాడూ
మీసాలు పెంచిన రౌడీయైనా నిజసతికి దాసోహమనెడి అల్పజీవి వాడూ

ఆ ఆ ఆ  ఆ అహహ్హ ఆహాహా  ఆ ఆ హా హాహ హా ఆ ఆ ఆ


అని రాగం కూడా తీసి పాడుకొనే వాడిని. ఇల్లాగే పడుతూ లేస్తూ సర్దుకుపోతూ 40 ఏళ్ళగా ఈ సంసార రధాన్ని లాక్కువచ్చాను.  

మొన్న మా బావమరిది వచ్చాడు హైదరాబాదు లో ఎవరిదో పెళ్ళికి. అక్కా తమ్ముళ్ళు ఇద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళ బంధువుల ఇళ్ళలో ఏవో గొడవల గురించి మాట్లాడుతూ మా ఆవిడ అంది. “ఏదోరా మీ బావ కొంచెం పొట్టి అయినా, మా సంసారం సాఫీ గా, సరదాగానే సాగిపోయింది ఇప్పటిదాకా” . 

అంటే 40 ఏళ్ల తర్వాత కూడా  నేను పొట్టి  అన్న విషయం ఇంకా నొక్కి మరీ వక్కాణించాలా? నేను 5 అడుగుల 4 అంగుళాలు ఉంటే ఆవిడ 5 అడుగుల ఐదున్నర అంగుళాలు. ఈ  మాత్రం దానికే  ఆవిడ పొడుగు నేను పొట్టి అని చాటింపు వేయాలా అని ప్రశ్నిస్తున్నాను. ఆవిడ పెద్ద పొడుగా అని నేను కొచ్చెనింగు అన్న మాట. ఇహ నే తాళ జాల, విడాకులే శరణ్యం అని మరొక్కమారు కఠిన నిర్ణయం తీసేసుకొన్నాను.  కొత్త సంవత్సరం లో మంచి లాయరు ని వెతికి  విడాకుల కార్యాచరణ మొదలు పెట్టేస్తాను.


నా వ్యధా భరిత కధ మీరు కూడా విన్నారు  కాబట్టి మీ సలహాలు సూచనలు కూడా నాకు పంపండి.  విడాకులు ఇచ్చవలెనా?
ఇచ్చకూడదా? 


గమనిక :- ఈ టపా మొదట ఈ బ్లాగులో 28/12/2010 న ప్రచురించబడింది.