ఉజ్వల భట్టాచార్య తో నా నౌకా విహారం

అది 1967  సంవత్సరం. అప్పటి కి, ప్రద్యుమ్నుడు అని పిలవబడే నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఎందుకు కాలేదు అంటే కాలేదు అంతే. అక్కడికీ  మానాన్న గారిని అడిగాను 
నాన్నగారూ నాన్నగారూ నాకింకా ఎందుకు పెళ్లి చేయలేదు అని. 
వారు మా అన్నయ్య కేసి చూపించి అగ్రజుని కి కాకుండా అనుజుడికి పెళ్లి చేసే ఆచారం మన ఇంటా బయటా కూడా లేదు అని సెలవిచ్చారు. 
నేను ఆగ్రహము తో కుపితుడ నై,  క్రోధము తో దు:ఖితుడనై, విచార వదనుడనై  ఇట్లు వ్రాక్కుచ్చితిని  
 సోదరా,  సహోదరా నీకును 27 ఏళ్లు వచ్చెను. అయినను  బ్రహ్మచర్య  వ్రతమేలా నాచరించు చుంటివి. నీకిది భావ్యమా 
 మా తండ్రిగారి జ్యేష్ట పుత్రుడు మందహాసం చేసి  నువ్వు అరిచి ఏడ్చి మొత్తుకున్నా సరే,  నాకు 750 రూప్యములు జీతము వచ్చు వరకు విహాహం చేసుకోను కోను కోను అని నొక్కి వక్కాణించెను.  నేను ఉండునది హైదరాబాదా మజాకానా అని కూడా అన్నాడు . మై నహీ కరూంగా  అని  ఎఫెక్టు కోసం హూ అని కూడా అన్నాడు. 
నేను వెంటనే గుణకారం, భాగహారం కూడా చేసేసి వాడి ఇంక్రిమెంట్ 25 రూకలు, ఏడాదికి పెరుగు డి.ఏ 50-70 రూకలు వెరసి 2 వత్సరములు దాకా వీడి పెళ్లి కి అవకాశం లేదనిపించి, సంయమనం పాటించి మృదు మధుర స్వనం తో ఉద్ఘాటించితిని 
  సుబ్బావధాన్లు గారి ప్రధమ దౌహిత్రుడా,  సోమయాజులు గారి ద్వితీయ పౌత్రుడా, మీ తాత గార లిరువురును 17 ఏళ్లు వచ్చుటకు ముందే వివాహము చేసికొనిరి.  కుల గౌరవము,  వంశ గౌరవము నిలబెట్టు నుద్దేశ్యము లేదాఅని.  
లేదు అని చాలా సింపుల్ గా సమాధాన మిచ్చాడు. 
అయినను ఆశ చావక నేను ఈ మారు శాంత గంభీర స్వరం తో 
 ఎక్కడో 3000 కి.మీ  దూరం లో అస్సాం లో తిండి తిప్పలు, కాఫి టిఫిన్లు  కూడా లేకుండా నేను అవస్థ పడుతుంటే నా మీద ఇసు మంత యైన కనికరం లేదా. నా క్లాసు మేటు తిరు వెంకటాచారి గుర్తున్నాడా, ఎప్పుడూ పరీక్షలు తప్పుతూ,  బి.ఏ ఇంకా చదువుతూ, నా కన్నా ఒక ఏడాది చిన్న వాడైన చారి, పెళ్లి చేసుకొని,  తండ్రి గారి ని తాత ను చేసాడని విని నప్పుడు నీకేమి అనిపించలేదా?  హతవిధీ బుద్ధి తెచ్చుకొనుము  అంటూ గద్గద గొంతు తో ఘోషించితిని. 
అయినను వాడు చలించలేదు.


అందువల్ల నాకు ఇంకా పెళ్లి కాలేదన్న మాట.   అయినను నేను నిరుత్సాహం చెందక ధైర్యవంతో బుద్ధిమంతః అని ఎవరూ అననిది నేనే అనుకొని, బుద్ధిమంతుడను కాబట్టి  ధైర్యం తెచ్చుకొని సంసారం  అను సాగరం లో దూకుట  అను కార్యక్రమమును పోస్ట్ పోను చేసుకొన్నాను. 
కానీ మనస్సో కోతిహి అని కూడా విని యుండుట వలన ఆ యొక్క చంచలమైన మనస్సు తో అలోచించి, పోనీ, ఎవరో ఒక సుందరిని లవ్వాడేసి  ప్రేమించి, సుందరీ ఆమె తల్లి దండ్రులు అంగీకరిస్తే,  మా నాన్నశివ తాండవం చెయ్యకపోతే, పెళ్ళాడేస్తే ఎల్లా ఉంటుంది అని కూడా  సుదీర్ఘం గా చింతించితిని. 
ఎందుకైనా మంచిదని ఈ విషయం నా మిత్ర మండలి లో చర్చకు పెట్టాను. నా మిత్రమండలి అనగా ఉన్నికృష్ణన్ నారాయణ మీనన్,  గణపతి అయ్యర్ అను నా ఇద్దరు మితృలు. మేము ముగ్గురము చాలా మంచి మితృలము. ముగ్గురము దక్షిణ భారతీయ బ్రహ్మచారు లమగు ట చే మా బంధము ఇంకను బలపడినది.  సుమారు గా ఒకే వయసు వార మగుటచే అభిరుచులు కూడా ఒకటి గా నుండెడివి. 
ముగ్గురము ఏక కంఠము తో ఏక తాటిపై  నడిచే వారము.  ఒకే సినిమా మూడు టికెట్లు పై చూసేవారము , ఒకే బిల్లుపై మూడు ప్లేట్లు ఇడ్లి తిని ఆరు ప్లేట్ల సాంబారు తాగెడి వారము. మా ముక్కులు, కర్ణములు, కనులు చురుకుగా పనిచేసి మా కాలనీ లో ఎవరింటిలో ఇడ్లీలు, దోసలు ఇత్యాదులు చేసిరో మరు నిముషమందే కనిపెట్టేసి భిక్షకు వెళ్లి పోయేవారము. వీరు సౌత్ ఇండియన్ , వారు నార్త్ వారు, వీరు బెంగాలీ, వారు అస్సామీ అను బేధ భావము చూపక  అందరి ఇళ్ళ లోను వారు పిలవక పోయినా వెళ్లి వారిని సంతోషపెట్టి వచ్చెడివారము.  అంతటి దృఢమైన మితృత్వము మాది.


ఇప్పుడు మేము ఈ సమస్య పై  డా. సదానంద గర్గ్  గారింట్లో కూర్చుని వారి శ్రీమతి ఇచ్చిన టీ తాగుతూ  ఆలు బొండా లు తింటూ,  లవ్వా, మారేజియా,  లవ్వు+మారేజి యా అని సుదీర్ఘంగా చర్చించి సమాధానం దొరకక,  ఖిన్నులమై, విషణ్ణ  వదనులమై వారింట్లోనే ఆలూ పరోఠా తిని ఇంటికి పోయితిమి. 

మరు నాడు ఆదివారమగుట చే రావు గారింట్లో పెసరట్టు ఉప్మా + కొబ్బరి చట్నీఅని సమాచారం ఉండుట వల్ల ఉదయమే 8.30 గం.  రావు గారింట్లో మరల సమావేశమై తిమి. (3*4) + (2* 2)   = 16  పెసరట్లకు సరిపడు పిండి రుబ్బిన రావు గారి భుజ బలమును కీర్తించి తినుటకు ఉపక్రమించితిమి. 
ఇంతలో కుశాగ్ర బుద్ది గల శ్రీమతి భావనారావు అక్కయ్య గారు ప్రశ్నించారు 
 ఇంతకీ ఎవరిని ప్రేమించ దలిచారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారు? మన కాలనీ లో కానీ మన లాబ్ లో గాని పెళ్లీడు ఆడపిల్లలు ఎవరూ లేరను కుంటాను.  
మేము స్టన్నయి పోయాము. అవును కదా బేసిక్స్ ని పట్టించు కోకుండా ఇంత సేపు అనవసర చర్చలు చేసామా అని విచారించాము. అనుమాన నివృత్తి కొరకు మేము మా తీక్షణ వీక్షణాలు  కాలనీ లోని ప్రతీ గృహంబు లోనికి పంపాము. అంకుల్ అంకుల్ అను 10 ఏళ్ళ కన్నా తక్కువ వయసు గల ఆడ పిల్లలే కనిపించారు. లాబ్ లో కూడా ఆంటీలు, పిన్నిలు, అక్కయ్యలు తప్ప  ప్రేయసి కాగల వారెవరూ కాన రాలేదు. 


హా హతవిధీ అనియున్ను ఔరా ఔరౌరా అనియున్ను దు:ఖించితిమి. 
భావన గారే ఒక ఉపాయము సూచించినారు. అయ్యరు గారు అయ్యరిని  పెళ్లి చేసు కోకపోతే ఆస్తి దక్కదు కాబట్టి గణపతి కి లవ్వు అఖ్ఖర్లేదు.  ఉ. కృ. నా. మీ కి మేనరికం ఉంది కాబట్టి వారి పప్పులు ఉడకవు. ప్రద్యుమ్నుడు  కూడా రెండేళ్ళ బట్టి పెళ్లి పెళ్లి అంటున్నాడు. ఇంకో రెండేళ్లు ఇల్లాగే పెళ్లి అంటూ గడిపేస్తాడు. కావున  అంత దాకా ఏదో నాల్గిళ్ళలో  ఇలాగే వారాలు చెప్పుకుంటూ గడిపేయండి అని సలహా ఇచ్చారు.  అక్కయ్యగారూ   మా మనో భావాలూ దెబ్బతిన్నాయి దీనికి మేము నిరశన వ్యక్తం చేస్తున్నాము అని గ్లాసులో కాఫీ గడగడా తాగేసి బయటకు వచ్చేసాము.


మా డైరక్టరు మీద మా చెడ్డ కోపం వచ్చేసింది. ఎంత సేపూ నా లాబ్ లో యువ శక్తి, సగటు వయస్సు 34 మాత్రమే అని డప్పాలు కొట్టు కోవడం తప్పితే, ఇంత గంభీర సమస్య పొంచి ఉన్నదని గ్రహించ లేక పోయాడు. బొత్తిగా దూరదృష్టి కానీ హ్రస్వ దృష్టి  కానీ లేని వాళ్ళని  డైరక్టర్లుగా ఎంపిక చేయడం వల్లే మన దేశం ముందుకు వెళ్ళ లేక పోతోందని  విచారించాము. ఈ మారు అయినా పెళ్లి కాని 20 – 24  వయసు గల అందమైన అమ్మాయిలకి కాని,  పెళ్లీడు కు వచ్చిన అందమైన అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులకు  మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని తీర్మానించేసాము. దురదృష్ట వశాత్తు మా లాబ్ కి రెండు మూడు కి.మీ దూరంలో గృహ సముదాయాలు ఏమీ లేవు. జోర్హాట్ టౌను కెళ్ళి ప్రయత్నిద్దామంటే 7 కి.మీ దూరం.  కష్టములు ఈ విధము గా కూడా వచ్చునా అని విచారించి, విధిని బహుపరి విధముల దూరితిమి. ఈ విధంబుగా మేము దు:ఖించు చుండగా రోజులు వారములుగా, అవి నెలలుగా మారిపోవు చున్నవి.


ఒక రోజున నాకూ మా డా. శంకర్ ఘోష్   అంటే మాచిన్న బాసు కి  అభిప్రాయ బేధాలు వచ్చి ఆయన నన్ను అన రాని మాటలు అన్నా, అవనత మస్తకుడనై ఆలకించి నా సీట్లోకి వచ్చి ఆసీనుడ నగుచుండగా, ధనుర్విముక్త శరం లా పరిగెట్టుకు వచ్చిన ఉన్ని కృష్ణన్ నారాయణ మీనన్ నా ఎదుట సీట్లో కూలబడ్డాడు. 
రొప్పు తున్నాడు. ఏ నాగుపామో పగపట్టి వాడి వెనకాల పడిందేమో నని అనుమానం వచ్చి, ఎందుకైనా మంచిదని నా కాళ్ళు రెండూ  ఎత్తి కుర్చీలో పెట్టేసాను. 
పాములు పగపట్టవు అదంతా ట్రాష్ అని తెలిసినను, పగబట్ట కూడదనే శాస్త్రం వాటికి తెలుసునో లేదో అని చిన్న అనుమానమన్న మాట.  
రొప్పుతూనే ఉన్ని కృష్ణన్ నారాయణ మీనన్  ఉజ్వల ఉజ్వల ఉజ్వల భట్టాచార్య కి ఈ వేళ అప్పాయింట్ మెంట్ ఆర్డర్ డిస్పాచ్ అయింది. ఇప్పుడే అని చెప్పాడు. 

నా కళ్ళ ముందు స్వర్గంలో ఘృతాచి నాట్యం చేస్తూ కనిపించింది. తెలుగు సినిమా లో భారీ హీరోయిన్  రారా నా సామి రారా అని పాడి నట్టనిపించింది. ఇద్దరం చేతులు పట్టుకొని  కుహూ కుహూ బోలే కోఎలియా  కోఎలియా కోఎలియా సనిదప సానీదాపా సస్సా రిర్రీ గగ్గా మమ్మా కోఎలియా   అని పాడేము. బొత్తి గా సంగీత జ్ఞానం లేక పోయినా సంగీతం లో ఓలలాడే సాం. 
ఆ తదుపరి వివరాలు చెప్పేడు. 22 యియర్స్ 4 మంత్స్, అన్ మారిడ్,   M.sc. Micro biology, Gauhati, C/O  శ్రీ తన్మయ భట్టాచార్య, dy. C.E, railways, maaligaon .  Bio chemistry dept., joining as JRF, ఇతి  వార్తః సమాప్తః  
ఇంతలో మా గణపతి అయ్యర్ కూడా వచ్చేసి వీడు చెప్పిన కధే పునః ప్రసారం చేసాడు.       


ఆ రోజు నించి,
ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు గౌహతీ లో నా ఉజ్వలను చూసిరావా ఆఆ ఆఆ  
నీలి మేఘాలలో  గాలి కెరటాలలో ఉజ్వల పాటే  వినిపించు నాకు
గున్ గునా తాహు వహీ గీత్  మై ఉజ్వలా కేలియే
మేరి సపనోంకి రాణి కబ్ ఆయేగీ తూ ఉజ్వలా ఓ ఉజ్వలా 

 అని పాటలు పాడుకుంటూ భారంగా రోజులు లెఖ్ఖ పెట్టు కుంటుండగా ఒక రోజు నా కల లోకి 
రావోయి మా ఇంటికి మావా మాటున్నది మంచి మాటున్నది  అని పాడుకుంటూ  ఉజ్వల వచ్చేసింది. 
నేను కంగారు పడిపోయాను. మొహం చూద్దామంటే కనిపించటం లేదు. 
అయినా ఉజ్వల బెంగాలీ పాటో అస్సామీ పాటో పాడాలి కానీ  వై తెలుగు పాట పాడింగ్ అని కూడా అనుమానం వచ్చేసింది. 
ఆహా పెళ్లి కాకుండానే తెలుగు నేర్చేసు కున్న మహా తెలుగు పతివ్రత అని ఆనందపడి పోయాను. 
ఒక డ్యూయెట్ వేసుకుందా మనిపించింది.  ఏ పాట పాడాలి అని ఆలోచిస్తుంటే తను సిగ్గుతో ననుకుంటాను పారిపోయింది.  
అయినా నేను డూపు ని పెట్టి పాడేసుకుందా మని అనుకున్నాను. లాహిరి లాహిరి లాహిరి లో  పాడాలి అనుకున్నాను.  ఎల్లాగూ ఉజ్వల మొహం కనిపించ లేదు కాబట్టి, నేనూ జమున  కలసి పాడేద్దామని, జమున  లో ఉజ్వలని చూసు కుందామని అనుకున్నాను.  
కానీ ఇంతలో మా ఉన్ని కృష్ణన్ నారాయణ మీనన్ పరిగెత్తు కుంటూ వచ్చేసాడు. నా చెవిలో జమున కాదు సావిత్రి లాహిరి లాహిరి పాటలో అని సలహా  కూసాడు. 
నాకు మండిపోయింది  కోపం ముక్కు కి ఎక్కింది. 
ఓరీ దుర్మార్గ దుశ్చింత దుర్యోధనా నా కల లోకి నా అనుమతి లేకుండా ప్రవేశించి నాకే సలహాలు ఇచ్చుచుంటివా అని వాడిని మెడ పట్టుకుని నా కల ముఖ ద్వారం దాకా తీసుకెళ్ళి ఒక్క తోపు తోసాను. 
మళ్ళీ నేను ఆలోచించాను.  మొన్న చూసిన ఇంగ్లిష్ సినిమా లోని హీరోయిన్ ని పెట్టుకుంటే బాగుంటుంది కదా అనుకొని ఆవిడను పిలిచాను. పాపం ఆవిడ వెంటనే వచ్చేసింది. 
ఆవిడకు సీను చెప్పేను. ఆవిడ మేకప్పు వేసుకొని వచ్చేసింది. 
నువ్వు అల్లా పది గజాల చీర కట్టుకొని ఒక్క మొహం మాత్రమే చూపిస్తే  ఎల్లా? ఈ మాత్రం దానికి నువ్వు ఎందుకు నా కల్లోకి అని కోప పడ్డాను.  
తెలుగు సినిమా కాబట్టి తెలుగు వేషం అంది. 
ఇంతలో సినిమా డైరక్టరుగా  వేషం మార్చేసుకొని  ఉన్ని కృష్ణన్ నారాయణ మీనన్  యాక్షన్ యాక్షన్ అని అరిచేడు. 
ఆ పక్కనే కెమేరా మాన్ గా గణపతి అయ్యర్ కనిపించేడు. ఉన్నట్టుండి నేను క్లాపు బాయ్ గా మారి పోయాను.  టేక్  124 నౌకా విహారం అని అరిచేను. 
ఆ ఇంగ్లిష్ ఆవిడ ఒక్కత్తే  నావలో కూర్చుని  లాహిడ్ లాహిడ్ లాహిడ్ లూల్ జంగమే హుయాళా హుయలా అని పాడేస్తోంది. 
నా కల్లోకి మళ్ళీ వచ్చి నన్ను క్లాప్ బాయ్ ని చేసిన ఉన్ని కృష్ణన్ నారాయణ మీనన్ ని నరికేద్దామని కత్తి కోసం నేను వెతుకుతూంటే మెలుకువ వచ్చేసింది.


రెండు రోజుల తర్వాత ముహూర్తం రానే వచ్చింది. ఉజ్వల ఉద్యోగంలో చేరే రోజు. 
ఆవేళ నేను రంగు రంగుల చారల బుష్ కోటు వేసుకొని పైజామా లాంటి ఫాంటు వేసుకొని (ఆ రోజుల్లో అవే ఫాషన్), పక్కింటావిడ జర్మనీ నించి తెచ్చుకొన్న సెంటు పూసుకొని , టిప్ టాప్ గా తయారయి అరగంట ముందు ఆఫీస్ గేట్ దగ్గర కాపలా కి వెళ్లి పోయాను.  
11గం.  అయింది ఉజ్వల జాడలేదు. 
నేను బహు చింతా క్రాంతుడనై  biochemistry dept. కి వెళ్ళితిని. 
అక్కడ నన్ను చూసి డా. సుర్జిత్ సేన్ గుప్తా, రా రా నీకు మా కొత్త గా చేరిన ఉజ్వల ని పరిచయం చేస్తా అని తీసుకెళ్ళి, భూమికి ఐదు అడుగుల మూడు అంగుళాల ఎత్తులో , గుండ్రంగా ఉన్న ఒక మనిషి ని చూపించి 
Meet Mr. ujvala Bhattacharya   అన్నాడు. 

నా కాళ్ళ కింద భూమి కంపించింది. కనుల ముందు అమావాస్య  చీకట్లు కమ్మేసాయి. నాగుండెల మీద విధి టంగ్  టంగ్ టంగ్ అంటూ సమ్మెట దెబ్బలు కొడుతున్నాడు. ఒక్కమాటు గా విషాద సంగీతం నా చెవిలో మారు మ్రోగిపోయింది.

పెను చీకటాయే లోకం  చెలరేగే నాలో శోకం,   అని పాడుకుంటూ శూన్యం లోకి భారంగా బరువుగా అడుగు లేసుకుంటూ  వెళ్లి పోయాను ..  

ఏమండోయ్ అలా వెళ్లి పోతున్నారేమిటి, ఇలా రండి.

ఇలా రండి అనగానే చేతులు ఊపేసుకుంటూ వచ్చేయడమేనా? 

అల్లా వెళ్ళండి ఏలూరు RR పేట మెయిన్  రోడ్ లో మా ఇంటినుంచి రెండు వీధుల అవతల స్వీట్ షాప్ ఉంది. అక్కడనుంచి ఒక kg స్వీట్ తీసుకోండి, కొంచెం ముందుకు వస్తే పళ్ల దుకాణం ఉంది అక్కడ ఒకఅర డజను ఏపిల్ లో, ఒక పరక రసాలో పట్టుకురండి. పరక అంటే 14(13+1) ఇస్తాడు, లెఖ్ఖపెట్టండి.   

అంతా అవే పట్టుకు రాకండి. అక్కడ అంగూరు, నల్ల ద్రాక్ష కూడా ఉన్నాయి. అవికూడా తీసుకు రావచ్చు రెండేసి kgలు.  

నేనన్నది నల్ల ద్రాక్ష, నల్లగా ఉన్నవన్నీ ద్రాక్షలు కావు. మీరు పట్టుకు వచ్చినవి నేరేడు పళ్ళు. అవి ఇచ్చేసి మరొకటి తీసుకు రండి. 

చవకగా వచ్చాయని బూందీ లడ్డూలు పట్టుకు వస్తారుటండీ ఎవరైనా. బందరు లడ్డు, జీడిపాకం ,  బాదం హల్వా,  ఏలూరు లో కూడా కాజు బర్ఫీ బాగానే ఉంటుంది.

ఆ వచ్చారా, స్వీట్లు పళ్ళు రెండూ పట్టుకు వచ్చారా , ఆ కుర్చీలో కూచొండి. 

ఏమిటీ మీకు పళ్ళు దొరకలేదంటారా కొంచెం ప్రయత్నిస్తే నాలుగు అడుగులు వేస్తే దొరకక  పోతాయా. సరే వెళ్ళి ఆ బెంచీ లో కూర్చోండి . 

ఇక్కడ క్రెడిట్ కార్డ్ లు నడవవండి. ఆ మాత్రం కాష్ మీ జేబులో లేదా. లేకపోతే యేం, వేలికి ఉంగరం ఉందికదా, బంగారం  కొట్టు లో తాకట్టు పెడితే డబ్బు ఇచ్చేవాడు కదా. ఆ మాత్రం తెలియదా మాష్టారూ,  వెళ్ళి ఆ నేల మీద కూర్చోండి. ఏం చేస్తాం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహా దేవా అన్నారు.  

ఏంటమ్మా చిట్టీ, ఆయన మన దొడ్లో గులాబీ పూవు కోసుకు వచ్చాడా. ఆయన్ని గేటు దగ్గర నిలబెట్టేద్దాం తల్లీ. 

భలేవారండి రెండు కే‌జిలు స్వీట్స్, పాతిక పళ్ళు పట్టుకు వచ్చారా. ఒరేయ్ ఈయనని స్టేజ్ మీద సోఫా లో కూర్చొబెట్టు.  

ఓ ఓ రెండు అరటి  పళ్ళు పట్టుకొని ఊపుకుంటూ వచ్చేస్తున్నారే, అరటి పళ్ళు అక్కడ పెట్టి వెళ్ళి నేలలో కూర్చోండి. 

అమ్మయ్య  రావాల్సిన  వాళ్ళు  అందరూ వచ్చేశారా. మిమ్మలని అందరినీ ఈ వేళ ఇలా ఆహ్వానించడానికి కారణం చెప్పేముందు రెండు ముక్కలు చెప్పాల్సిన అవసరం పడింది. ఏమిటి మాష్టారూ దీన్ని ఆహ్వానం అంటారా అని గొణుక్కోకండి. ఇది కొంచెం వెరైటీ గా ఉంది కదా. మార్పును ఆహ్వానించడం నేర్చుకోవాలి. 

నేల మీద కొంచెం ఇరుకు గానే ఉన్నట్టుంది. కొంచెం ఓపిక పట్టండి.  ఈ వేళ ఈ శుభ సందర్భంలో చెప్పడానికి  6 పేజీల ఉపన్యాసం తయారు చేసుకున్నాను. కానీ మీ అందరినీ  ఇలా చూసిన తరువాత మొదటి పేజీ అనవసరం అనుకున్నాను. 

భాయియోమ్,  బెహనోమ్ మీ కందరికి నామీద ఇంతో అంతో అభిమానం ఉందనే అనుకున్నాను. కానీ ఈ వేళ కుర్చీల్లో  ముగ్గురు, బెంచిలో ఐదుగురు కనిపిస్తున్నారు. నేలలో ఒక 40-45 మంది ఇరుక్కుని కూర్చున్నారు. దీన్ని బట్టే తెలుస్తోంది నా మీద మీకు ఎంత ప్రేమ, అభిమానం, ఆదరణ ఉన్నాయో.  నా మీద మీకు ఉన్న ఈ అన్నిటికి నేను కరిగి నీరైపోయాను అని వ్రాసాను మొదటి పేజీలో . ఇప్పుడు అది తీసేశాను.

ఇంతకీ ఈ వేళ ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశానంటే ఈ వేళ నా బ్లాగు కి  366 వ దినం. 

ఏడాది కాలం వీడిని మనం భరించామా అని  కన్నీరు మున్నీరు అవాల్సిన దినం అని మీరు అనుకుంటే,  ఇప్పుడు చేయగలిగింది ఏమి లేదు అని మనవి చేసుకుంటున్నాను. గతం గతః . కంగారు పడకండి. బ్లాగు లో ఇన్ని రాశాను. అంతమంది చదివారు. ఇంతమంది కామెంటారు అన్న లెఖ్ఖలు చెప్పను. 

ఎందుకంటే ఏ బ్లాగు లోనైనా ఇవే అంకెలు ఒక 10% అటూ ఇటూ గా. ఒక్క బ్లాగరు చెప్పితే 100 బ్లాగర్ల కధ అదే.  అదీకాక ఈ మధ్యనే 239 వ దినం కూడా చేసుకున్నాము. అందుకని ఈ వేళ ఏం చెబుదామా అని ఆలోచించాను. ఎందుకు ఆలోచించాల్సి వచ్చిందంటే, ఇక్కడ   చూడండి. 


అందుకని  సింహావలోకనం, ఆత్మ శోధనం, అంతర్మధనం మొదలు పెట్టాను.  మొదటగా బ్లాగుల్లో కామెంట్లు, ప్రతి కామెంట్లు అంటే కామెంటుకి జవాబు కామెంట్లు మొదలైన వాటిని గురించి పరిశోధించి,   ఆలోచించాను. నేను  ఇతరుల బ్లాగుల్లో పెట్టిన కామెంట్లు చూస్తే  నాకొక విషయం అర్ధమైనది. కడుంగడు  విచారించితిని,  విచారించి  బాధపడితిని,  బాధపడి దుఃఖించితిని. నాకు తెలియకుండానే నేను ఇంత పాపము చేయుచున్నవాడనా అని మళ్ళీ విచారించి, బాధపడి, దుఃఖించితిని. 

ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నాను.  ఇకపై నేను ఎవరి బ్లాగులోనూ, బజ్ లోనూ కామెంటు పెట్టకూడదని ఒట్టు పెట్టుకున్నాను.


ఎందువలనా   అంటే

నా చిన్నప్పటినించి కూడా  నా పాదం  యొక్క గొప్పదనం బాగా ప్రసిద్దికెక్కింది.  
పరమ యోగులకు పరమొసగెడి  నీ  పాదము  అని పాడుకొనేవారు.  

ఎవరికైనా వంట్లో బాగాలేదని తెలిసి  వాళ్ళని చూడడానికి నేను వెళితే, నేను వారి వీధి గుమ్మం దాటకుండానే ఇంట్లో  ఘెల్లుమనేవారు.  

ఆ తరువాత నేను అంతా అయిపోయిన తరువాతే పరామర్శ కి వెళ్ళేవాడిని.  

నేను బాన్ వాయేజ్ అంటే వాడి విమానం ఎక్కడో కూలుతుంది.  బెస్ట్ విషెస్ చెపితే వాడికి మూడిందన్నమాట. 

ఇప్పుడు బ్లాగుల్లోకి వచ్చిన తరువాత, ఎవరి బ్లాగులోనైనా నేను మొదటి కామెంటు పెట్టితే ఆపైన కామెంట్లు ఉండవు.  ఇల్లా కాదని మధ్యలో కామెంటు పెట్టితే అక్కడితో ఆగి పోతాయి కామెంట్లు.  చివర పెడుదామని ఆగితే ఆ బ్లాగులో కామెంట్లు ఆగవు,  అలా వస్తూనే ఉంటాయి .  

కామెంట్లు పెట్టకుండా ఉందామంటే  చేతి దురద ఎక్కడో అక్కడ  గోకకపోతే  కానీ  తీరేది కాదు.

బజ్ ల్లో కూడా మన ప్రభావం డిటో. సుమారు 20 %  బజ్ లో నాదే చివరి కామెంటు. 

హాహాహాహ్హ.  నేనేమి  చేయవలే ?  What do i do ?  ముఝే  క్యా  కర్నా  హై ?

అని మూడు భాషల్లోనూ విచారించి తీసుకున్న నిర్ణయం అన్నమాట. అమ్మయ్య వీడు కామెంటు పెట్టడు కాబట్టి వీడి బ్లాగు లో కామెంటు పెట్టఖ్ఖర్లేదు అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.  మీరు కామెంటు పెట్టకపోతే నేను , ఒట్టు తీసి గట్టు మీద పెట్టి  మీ బ్లాగు లో కామెంటు పెట్టేస్తాను.  మీ కామెంటు బాక్స్ లో ఇంకేమీ పడవు. నా కత్తికి రెండు వైపులా పదును అని మీరు  గ్రహించ వలెను. హాహాహ్హ.

తరువాత  ఇంకో  క్రూర నిర్ణయం  ఘోరంగా తీసుకున్నది  ఏమిటంటే   ముందు ముందు నేను ఈ జోకరు వేషం తీసేసి పండితుడి వేషం వేద్దామని. మొన్న ఒకాయన నన్ను చూసి మీరు వ్రాసినవి చదివితే నవ్వు రావడం లేదు కానీ మిమ్మలని చూస్తే నవ్వు ఆగటం లేదండీ అని పడి  పడి నవ్వాడు. అందుచే ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. 

అంతా మిధ్య,  ఆత్మ = పరమాత్మ, త్వమేవాహం అనే పద్ధతిలో వేదాంతం బోధిస్తూ వ్రాసేద్దామని. మీ సందేహాలకి సమాధానాలు చెప్పేస్తాను. మీ జాతకాలు చెప్పేస్తాను.  మిమ్మలని సన్మార్గం లో నడిపించే గురుతర బాధ్యత తీసుకుందామని నిర్ణయించుకున్నాను.   

పేరు కూడా మార్చేసు కుంటాను.  శ్రీశ్రీశ్రీ సుబ్రహ్మణ్య సచ్చిదానంద భారతి స్వామీజీ.  

ప్రస్తుతం 4 సంస్కృత శ్లోకాలు, ఒక పది తెలుగు పద్యాలు, ఇంకో పది పాటలు నేర్చుకొనే  కార్య క్రమం లో ఉన్నాను. ఇవి నేర్చుకున్న తరువాత కార్య రంగములోకి దూకుతాను.

ఒక వేళ ఏ కారణము చేతనైనా పై అవతారం కుదరకపోతే (అంటే కాషాయ వస్త్రాలు నా మొహానికి సూట్ కాకపోతే)  మారు వేషం వేసుకుని,  దుఃఖభరితమై, విషాదాంతమై, గుండెలను పిండి, మనసును ఎండబెట్టే, జీవిత సత్యాలను అనగా TV సీరియల్ కధలని   మీ ముందు నుంచోపెట్టి  మీ జేబు రుమాళ్లను తడిపి ఆరేసుకునేటట్టు  రచించాలని నిర్ణయం కూడా తీసుకున్నాను.

అందుచే నేను నా బ్లాగు శీర్షిక మారుద్దామా  లేక ఇంకో బ్లాగు తెరుద్దామా అని  ఆలోచిస్తున్నాను. కొన్ని శీర్షికలు అండర్ కన్సిడరేషన్,

ఏడిస్తే  ఏడవండి,  ఏడవకపోతే మీ మీదే ఒట్టు,  ఇక్కడకొచ్చి ఏడవండి,  రండి ఏడిపించి పంపుతాను,  ఏడుపు మేడు ఈజీ,   ఇవి TV  ఏడుపు బ్లాగు కి సంబంధించినవి.

నా ఆత్మే మీ పరమాత్మ,  నాలో మీ దేవుడు, మీ బంగారం లో నా పరమాత్మ,  మీ పర్సు నాకివ్వండి నా ఆశీస్సులు మీకిస్తాను,  అనేవి నా వేదాంతం బ్లాగులు కి సంబధించినవి.

ఇంకా మంచివి మీకేమైనా తోస్తే నాకు చెప్పండి.  ఏదో ఒక అవతారం ఎత్తుదామని డిసైడ్ అయిపోయాను.  ఏదీ  అన్నది మీరే చెప్పండి.

అవునూ  ఆ  పై శీర్షిక ఏమిటీ  ఇక్కడ  వ్రాసినదేమిటీ అని ? మార్కు మొహం పెట్టకండి.  TV సీరియల్లా మజాకా నా.      అదండీ సంగతి.

All said and done అదేమిటి ఇంగ్లీష్ లో అంటే, ఏడ్వాల్సిన ఏడుపు అంతా తెలుగు లో ఏడ్చేసిన తరువాత మీకు అర్ధం కాకుండా ఇంగ్లీష్ లో ఏడుద్దామనుకున్నాను. కానీ మీరు కోప్పడితే  తెలుగులోనే కానిచ్చేస్తాను.  

ఈ ఏడాదిలో 30 టపాలు వ్రాసాను. ఇందులో 5 కధలు,   స్నేహ సమాఖ్య, సౌత్ ఎండ్ పార్క్ , L. B. నగర్  వారి  వార్షిక సంచిక  లిఖిత  లలో ప్రచురించబడ్డాయి.  మిగిలిన  25 కధలు బ్లాగు కోసమే ఈ ఏడాది కాలం లో  వ్రాసుకున్నవి. 

1980 ల దాకా అంతో ఇంతో తెలుగు సాహిత్యం తో పరిచయం ఉంది. నేను 80 ల తరువాత తెలుగు సాహిత్యం ఎక్కువగా చదవలేదు. చదివిన ఇంగ్లిష్ ఫిక్షన్ కూడా కాలక్షేపం కోసం రైలు ప్రయాణాల్లోనూ, ఎయిర్ పోర్ట్ లో వెయిటింగ్ టైమ్ లో చదివినవే.    

82 లో మా నాన్న గారు పోయిన  తరువాత తెలుగులో ఉత్తరం కూడా వ్రాయలేదు. 

అటువంటిది నేను తెలుగులో కధలు వ్రాస్తానని ఎప్పుడూ అనుకోలేదు.  నేను తెలుగులో వ్రాయ గలను అనే నమ్మకం కలిగించిన మిత్రులు చాలా మంది ఉన్నారు బ్లాగుల్లో.  ఈ కింది టపా లు నా లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.


బులుసు గారూ మీకిది తగునా?
 

బులుసు బ్లాగు, లాగు, స్పాటు, లాఫూ!


బులుసేరియా మరియూ దాని పర్యవసానాలు.. 

 
జ్యోతి గార్కి, మలక్పేట రౌడీ గార్కి, జిలేబి గార్కి, కార్తీక్ గార్కి, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ చేసు కుంటున్నాను.   

గత ఏడాది కాలం గా బ్లాగుల్లో అనేక మంది సహృదయులతో పరిచయం కలిగింది.  అందరూ నా మంచిని కోరుకున్న వారు , నన్ను ప్రోత్సహించిన వారు.  వీరందరికి, నన్నాదరించి,  ప్రోత్సహించిన పాఠక మహా శయులందరికి మనః పూర్వకం గా కృతజ్ఙత లు,  ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 


గమనిక :- ఇది మొదటగా 14/06/2011 న ఈ బ్లాగులో ప్రచురించబడింది.