నాకూ దుర్బుద్ధి పుట్టింది.


 దుర్బుద్ధులు అనేక రకాలుగా ఉంటాయనుకుంటాను.  అవి పుట్టడానికి  కూడా అనేక కారణాలు ఉంటాయి. నాలో ఒక దుర్బుద్ధి / క్రూర బుద్ధి తరచుగా పుట్టేది.  కోపం వస్తే ఎదుటి వాడిని ఏసేద్దామా? అనే క్రూర, దుష్ట,  దుర్బుద్ధి.  కానీ ఏమీ చెయ్యలేక పోయేవాడిని.  నా అసహయతకి చింతించేవాడిని.  చేతకానితనానికి సిగ్గు పడేవాడిని.  అప్పుడెప్పుడో  ఏదో సినిమాలో  “చూపులతో చంపేస్తాను”  అన్న హీరోని చూసి ధైర్యం తెచ్చుకున్నాను.  ఆ విధంగా ప్రయత్నం చేసాను.  “ఏమిటా చూపు? కొడతావా”  అంటూ మీదకు వచ్చారు కొంతమంది.  అలా  చూస్తే,  వాళ్ళ సంగతి ఏమో కానీ మనం కీర్తిశేషులు అయ్యే అవకాశం ఉందని గ్రహించి ఆ పధ్ధతి విడనాడాను.  తేలికైన విధానాల గూర్చి ఆలోచించాను.   అప్పుడే ఒక మెరుపు మెరిసింది.  బోధి వృక్షం కనిపించింది.  ఒక ఆపిల్ పండు కూడా  దొరికింది.  జ్ఞానోదయం అయింది.
 
రచనలతో చంపేద్దాం అనే నిర్ణయానికి వచ్చాను.  బ్లాగుల్లోకి వచ్చాను.  ఎవరి మీద  కోపం వచ్చిందో,   వాళ్లకి  నా బ్లాగు లింకు  పంపించాను.  వాళ్ళు నాతోటి మాట్లాడం మానేసారు.   భ్యుహహ్హా  అని నవ్వుకున్నాను.  

దుర్బుద్ధి శాంతించింది అని అనుకున్నాను.   కానీ మొన్న మళ్ళీ  తలెత్తింది. మొన్న అంటే మొన్న కాదు ఒక ఆరేడు నెలల క్రితం.

ఏలూరు నుంచి హైదరాబాదుకి తిరిగి వచ్చిన కొత్తలో ఒక బంధువు ఇంట్లో  ఏదో ఫంక్షనుకి  వెళ్లాను.  అక్కడ ఇంకో తాతగారు మా మనవరాలితో మాట్లాడారు.

మీ తాతేం చేస్తున్నాడే? కనిపించటం లేదు. పెద్ద గుఱ్ఱానికి పళ్ళు తోముతున్నాడా?

మా మనమరాలికి కోపం వచ్చింది.
“మీకు మల్లె మాతాత గుఱ్ఱాలని వెతకడు.  మా  తాత తెలుగులో  రచనలు చేస్తున్నాడు. మహా బిజీ” అంది.

ఆయన నవ్వాడు. పెళ్ళున నవ్వాడు.

“మీ తాత,  వాళ్ళ నాన్నకి  తెలుగులో ఉత్తరం వ్రాస్తే,  ఆయన ఆ ఉత్తరంలో ఓ పది చోట్ల అండర్ లైన్ చేసి, సరిచేయుము అని తిరిగి పంపించాడు ఆ ఉత్తరం.  నీకు తెలుసా? అలాంటి వాడు తెలుగులో వ్రాయడమా ? హహహ్హా” అని   మళ్ళీ నవ్వాడు.  “ఎక్కడ వ్రాసాడు.  నేనెక్కడా చూడలేదే” అని కూడ అన్నాడు.

“ఇంటర్నెట్లో వ్రాస్తాడు” అని చెప్పింది మా మనమరాలు.

ఆయన నమ్మలేదు.  అక్కడే ఉన్న మా అమ్మాయిని అడిగాడు. నిజమేనని  మా అమ్మాయి కూడా చెప్పింది.

“నువ్వు చదివావా” అని అడిగాడు మా అమ్మాయిని.

“లేదండీ.  నేను తెలుగు చదవలేను కదా బాబయ్యా” అంది.  

ఆయన ఇంకో పక్క కూర్చున్న నా దగ్గరికి వచ్చి చెప్పాడు,

“ఒరేయ్ నువ్వు ఏదో కధలు కాకరకాయలు వ్రాస్తున్నావట.  నాలుగు ప్రింట్ ఔట్లు పంపు నాకు.  తెలుగో కాదో చెపుతాను”  అని నవ్వాడు.

మండుకొచ్చింది నాకు.  వెంటనే పంపుదామనుకున్నాను కానీ నాకన్నా రెండేళ్లు చిన్నవాడు అని జాలి వేసింది.  
నా వీలునామాలో వ్రాసేద్దామనుకున్నాను.  ‘నేను కాలం చేసిన తరువాత వెధవకి నాలుగు నా కధలు పంపించండి’  అని.

“ఈ మాత్రం దానికి వీలునామా ఎందుకు లెండి.  నేను పంపిస్తాను కదా”  అని హామీ ఇచ్చింది మా ఆవిడ.

ఆ తరువాత రహస్యంగా విచారణ చేసాను. మా బంధువుల్లో, మిత్రుల్లో చాలామందికి నేను బ్లాగుల్లో కధలు వ్రాస్తానని తెలియదు అని నిర్ధారణ చేసుకున్నాను.  కొంతమందికి చెప్పినా నమ్మలేదు.  అందులో ఒక బంధువు, ఆయనకి నేను ఎప్పుడో 80ల్లో వ్రాసిన ఉత్తరం బయట పెట్టి నా పరువు తీసే ప్రయత్నం చేసాడు. నాకు పరువు లేదు కాబట్టి బతికిపోయాను.  ఆయనకి వ్రాసిన ఉత్తరంలో.

బ్రహ్మశ్రీ వేదమూర్తులైన శ్రీ ఫలానా గారికి తమ కజిన్ బ్రదర్ కుమారుడు శ్రీ బులుసు సుబ్రహ్మణ్యం నిత్యం త్రికాలములందు అనేక నమస్కారములు చేసి వ్రాయునది..........

ఆ తరువాత ఒక్క తెలుగు పదం  లేదు.  ఇది ఆయన బయట పెట్టిన తరువాత ఇంకో ఆయన కూడా 

“అవునవును నాకూ వ్రాసిన ఒకటి రెండు ఉత్తరాలలలో కూడా మొదటి రెండు మూడు పంక్తులు అవే.  ఆ తరువాత నో తెలుగు.  బహుశా ఆ పంక్తులు ఎక్కడో కాపీ కొట్టుంటాడు.” అని కూడా అనేసాడు.

‘తమ కజిన్ బ్రదర్ కుమారుడు శ్రీ బులుసు సుబ్రహ్మణ్యం’  అన్న పంక్తి నా స్వంతమే అని చెప్పినా నమ్మరు కాబట్టి నోరు మూసుకున్నాను.   

అప్పుడు మళ్ళీ  దుర్బుద్ధి మొగ్గ తొడిగింది.  నవ్విన వాళ్ళ పేర్లు నా వీలునామాలో చేర్చాలని నిర్ణయించుకున్నాను.  ప్రింట్ ఔట్లు పంపాల్సిన పేర్లు పది దాటాయి.  క్రోధం పెంపొందింది.  కసి రేగింది.  అయినా విజ్ఞుడను కాబట్టి సమయం కోసం వేచి చూద్దాం అనుకున్నాను.  కాలం భారంగా గడవసాగింది.  ఆ తరువాత అతి భారంగా గడవసాగింది.

అటువంటి సమయంలోనే  అనుకోకుండా జీవితం మలుపు తిరిగింది.  ప్రతీకారేచ్ఛ  శాంతించే అవకాశం కనిపించింది.
ఒక రోజున ప్రముఖ  బ్లాగ్మిత్రులు శ్రీ పంతుల గోపాలకృష్ణరావు గారు (http://apuroopam.blogspot.in),  వారి అమ్మాయి ప్రముఖ బ్లాగరు శ్రీమతి సుధారాణి గారు (http://www.illalimuchatlu.blogspot.in),   మా  గృహం పావనం చేసారు.  
“కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు”  అని పద్యం పాడుదామనుకున్నాను  కానీ వచ్చిన వారు తెలుగు పండితులు కాబట్టి సాహసం చెయ్యలేకపోయాను.

ఓ గంట పైగా సరదాగా కబుర్లు చెప్పుకున్నాం.

మాటల సందర్భంలో వారు మా శ్రీమతిని అడిగారు  “మీరు, మీవారి కధలు ఎన్ని చదివారు”  అని.

ఆమె “ అబ్బే నేనేం చదవలేదు. కంప్యూటరు ముందు కూర్చుని, కదలకుండా,   ఆ చిన్న అక్షరాలు చదవడం నా వల్ల కాదు” అని వివరించారు. 

వెంటనే నా హిట్ లిస్ట్లో ఇంకో పేరు చేరిపోయిందని చెప్పఖ్ఖర్లేదు కదా. 

“మీ బ్లాగు కధల ప్రింటులు తీసుకోలేదా” అని   శ్రీ గోపాలకృష్ణ గారు అడిగారు నన్ను.

నా వెఱ్ఱి మొహంలో తెల్లమొహం కూడా చేర్చి,  “లేదు”  అని మెల్లిగా జవాబు ఇచ్చాను.    

వెంటనే టపాలన్నిటి  ప్రింట్ ఔట్లు తీసుకోండి అని సలహా ఇచ్చారు.

“మీ కధల పుస్తకం కూడా ఒకటి తీసుకురండి”  అని సుధారాణి గారు కూడా అన్నారు. 

కొంత చర్చ జరిగింది. ఎడిటింగులో  సహాయం చేస్తామని వారివురూ హామీ కూడా ఇచ్చారు.   మా శ్రీమతిగారు కూడా వారితో బాటు ప్రోత్సహించారు.  సరే నని ఒప్పుకున్నాను.


వెళ్ళేముందు శ్రీ గోపాలకృష్ణ గారు వారి పుస్తకం  ‘కందాలూ మకరందాలూ’ నాకు బహుకరించారు.

వారి పుస్తకం చదివాను. తేలికైన పదాలతో పసందైన కందాలు రచించారు.  నాకు నచ్చిన వాటిలో ఒకటి,

రాజీవాక్షుల తోడను
రోజూ  గొడవలు పడుచును రుక్కుట కంటెన్
రాజీ పడుచును మనమే
హాజీ యనుచును గులాము  లగుటయె  మేలౌ  

వారూ నేనూ ఒకే మార్గంలోని బాటసారులమని అర్ధం కూడా అయింది..............దహా.

సాహితీ ప్రియులకు ఉచితంగానే పుస్తకం అన్న వారి ఉద్దేశం కూడా నాకు నచ్చింది.


మా శ్రీమతితో తగు చర్చల అనంతరం ఒక సంకలనం ప్రచురించటానికి నిర్ణయించుకున్నాం.   

ఒక నెల రోజుల ప్రయాసం తరువాత ముఫై ఐదు కధలు ఎన్నుకున్నాను.  సుమారుగా 225 – 230, A4  సైజు పేజీలు ఉండే అవకాశం ఉంది.  కరక్షన్, ఎడిటింగు కార్యక్రమం చేపట్టాను.  మొదటి ప్రింట్ అవుట్ వారం   రోజుల క్రితం తీసాను.  వీలైతే కొన్ని  కధలు తీసివేసి 200 పేజీలకు కుదించాలని అనుకుంటున్నాను.

ప్రస్థుతం పుస్తకాలు అమ్మకానికి పెడదామని అనుకోవటం లేదు. ఒక  300   కాపీలు మాత్రమే వేద్దామని ఆలోచన.  

కావాలనే  హాస్య ప్రియులకు,  మిత్రులకి ఉచితంగానే పంపుదామని అనుకుంటున్నాను. 

అంతా అనుకున్న ప్రకారం జరిగితే,  బహుశా జూన్ రెండవ వారానికి  ప్రచురించి,  ఆ ఇంకో తాతగారికి ఒక కాపీ పంపి భ్యుహహ్హా అని వి.టా.హా (వికటాట్టహాసం) చేయాలని సంకల్పించాను.

పుస్తకం వేస్తే దానికో పేరు/శీర్షిక/టైటిల్ ఉండాలి కదా. అనుకుంటున్న  పేర్లు,

౧. ప్రద్యుమ్న ప్రభావతీయం  (నా బ్లాగు నవ్వితే నవ్వండిలో  ఇతర కధలు)  
౨. నవ్వితే నవ్వండి ( నా బ్లాగు కధలు)
౩. కాలక్షేపం బఠానీలు ( నవ్వితే నవ్వండి బ్లాగు కధలు)

మీ   సలహాలు సూచనలు స్వీకరించబడును. దయచేసి ఇవ్వండి.


మిత్రులకి పంపిన తరువాత కూడా బోలెడు పుస్తకాలు మిగులుతాయి కాబట్టి ఏమి చెయ్యాలి అని దీర్ఘంగా చింతించాను. ఇకపై,  నా శేషజీవితంలో, ఏ ఫంక్షనుకి వెళ్ళినా, వాళ్లకి నాలుగు,  నా పుస్తకాలు ఇచ్చేద్దామని ఘోరమైన నిర్ణయం తీసేసుకున్నాను. వాళ్లకి ఇవ్వాల్సిన బహుమతి డబ్బులు మిగులుతాయి కాబట్టి నష్టంలో లాభం అని కూడా సంతసించాను.  

అదన్నమాట సంగతి.     


బ్లాగుల్లోకి వచ్చిన తరువాత అనేక మంది మిత్రులు దొరికారు.  గురువుగారూ అంటూ ఆప్యాయంగా పిలేచేవారు ఎక్కువే.  మీ అందరి ప్రోత్సాహంతోనే  నేను ఇన్ని కధలు వ్రాయగలిగాను.  ఇంత ఆప్యాయత, అభిమానం బ్లాగుల్లోకి రాకపోతే నాకు దొరికేది కాదు. అందరికీ ధన్యవాదాలు మాత్రమే చెప్పగలను. 

ఇంతగా నన్ను అభిమానించిన మీకు ఈ విషయం చెబుదామని ఈ టపా.

ఎలాగా మొదలు పెట్టాను కాబట్టి బ్లాగు విషయాలు కొన్ని మీతో పంచుకోవాలనిపించింది.

ఇప్పటిదాకా 58 టపాలు వేసాను.   

నా బ్లాగులో మొదటి కధ 2010  జూన్ 14, సోమవారం ప్రచురించ బడింది.   

సుమారు నెల తరువాత, రెండవ టపాకి  మొదటి కామెంటు  శ్రీలలితగారు పెట్టారు.  

అప్పట్లో టపా వేసి బ్లాగు తెరిచి కూర్చునేవాడిని,  ఎవరైనా కామెంటు పెడతారేమోనని.  ఎంతమంది చూసారో కూడా తెలిసేది కాదు.  అప్పటికి స్టాట్స్ కౌంటర్ పెట్టలేదు.  (పెట్టలేదు అనడం కన్నా పెట్టడం తెలియలేదు అని ఒప్పుకుంటాను).   

ఆగస్ట్ రెండున వేసిన  మూడవ టపా ‘తెలుగు అదేలా అనే అంటాం’ తో నలుగురి కళ్ళలో పడ్డాను అనుకుంటాను.

అప్పటినుంచి ప్రతీ టపాకి అన్నో ఇన్నో కామెంట్లు వచ్చేవి.

బ్లాగులోకి వచ్చిన, సరిగ్గా   ఏడాది తరువాత. జూన్ 14, 2011న   వేసిన  ‘ఏమండోయ్  అలా వెళ్ళిపోతున్నారేమిటి, ఇలా రండి’,  టపాకి అత్యధికంగా 63 కామెంట్లు వచ్చాయి.

మొత్తం ఇప్పటిదాకా  1627 కామెంట్లు వస్తే 1611 పబ్లిష్ చేయబడ్డాయి.   

ఇందులో ఎక్కువుగా  కామెంట్లు పెట్టింది నేనే, 418.  సుదూరంగా,  రెండవ స్థానంలో 59  కామెంట్లతో,  ఆ. సౌమ్య గారు, వారికి కొద్ది దూరంలో  44 కామెంట్లతో మనసుపలికే గారు మూడవ స్థానంలో ఉన్నారు.  

(ఈ సమాచారం  ‘సంకలిని బ్లాగిల్లు’  వారి బ్లాగు సమాచారం నుండి గ్రహించాను. వారికి ధన్యవాదాలు.)  

ఇప్పటిదాకా 73946 మంది నా టపాలు చదివారు. ఇందులో నా విజిట్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు.

ఫిబ్రవరి 17, 2011న  వేసిన  ‘యమ పాశాన్ని అడుగు దూరంలో ఆపేసిన మా ఆవిడ’  టపాని అత్యధికంగా 2076 మంది చదివారు.  1837 మంది చదివిన ‘హాస్యబ్రహ్మ జంధ్యాల...  (వెలుగు నీడలు)’ టపాది రెండవ స్థానం.           


వ్రాయాలన్న ఉత్సాహం ఇప్పుడు తగ్గు ముఖం పట్టింది. వ్రాస్తున్నవి నాకే సంతృప్తి కలిగించటం లేదు. అందుకని పబ్లిష్ చెయ్యడం లేదు. ఒక అరడజను పైగా టపాలు వివిధ స్టేజిల్లో పూర్తి కాకుండా ఉన్నాయి. ఏదో విధంగా వాటిని పూర్తిచేసి పబ్లిష్ చెయ్యాలన్న సంకల్పం అయితే  ఉంది. చూడాలి ఎంతవరకు చెయ్యగలనో.  

నా కదల పుస్తకం తీసుకురావాలని ప్రోత్సాహించిన శ్రీ గోపాలకృష్ణ గారికి, వారి అమ్మాయి శ్రీమతి సుధారాణి గారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. 

ప్రోత్సాహంతో పాటు, తగు ఆర్ధిక సహాయం చేయడానికి అంగీకరించిన నా  శ్రీమతి శ్రీలక్ష్మి గారికి కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.............దహా.