లక్ష వత్తుల నోము – 2


లక్ష వత్తుల నోము చెయ్యాలని సంకల్పించటానికి కారణాలు చెప్పాలి గదా. ప్రముఖులతో పరిచయాలు అని వారఫలాలు చెపితే నిజం చేశాం, ఏదో విధంగా ఒత్తిడి పెంచుకొని, మన పరిచయ భాగ్యం వైద్య శిఖామణులకు కలిగించాము.  ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన తరువాత నాలో కొన్ని ప్రశ్నలు ఉదయించాయి. ప్రముఖత్వం (ఇది సరియైన పదమో కాదో నాకు తెలియదు. కానీ, నా భావం మీరు గ్రహిస్తారని నా నమ్మకం) అనగా నేమి? ఇది ఎవరికి గలుగుతుంది? నాకేల గలగలేదు? ఇది ఎలా గలిగించుకోవాలి? వీటికి సమాధానలకై నా పద్ధతిలో నేను అన్వేషణ మొదలు పెట్టాను.

అసలు నాకు ఎప్పుడైనా,  ఎవరైనా ప్రముఖత్వం ఆపాదించారా? ఆపాదించినచో ఎందుకు?  దించనిచో ఏల? ప్ర్రాముఖ్యం గలిగే పనులు నేనేల చేయలేదు? చేసినచో  నేల ప్రాముఖ్యం నాపాదించలేదు? (వ్యాకరణం అటూ ఇటూ అయితే క్షమించవలెను)

అన్నట్టు,  తప్పులున్న క్షమించవలెను అన్న వాక్యం మీరు ఉత్తరాలలో ఎప్పుడైనా వాడారా? నేను విధిగా వాడాల్సి వచ్చేది. మా నాన్నగారికి వ్రాసినా, మాఅగ్రజుడికి వ్రాసినా, మా బావగార్లకి వ్రాసినా కూడా. ఉత్తరాలు మా అక్కగార్లకి వ్రాసినా,  అడ్రెస్ చేయడం బావగార్లకే ఆచారంగా ఉండేది. పెళ్ళైన కొత్తలో మా ఆవిడ నాకు వ్రాసిన ఉత్తరాల్లో, పాపం అల్లాగే వ్రాసేది (ఆచారం ప్రకారం అనుకుంటాను).  ఒక  ఏడాది అయిన  తరువాత నేను వ్రాయడం ఆచారంగా మారింది. ఈ ఘోర దుర్భరావమాన పరిస్థితులలోంచి బయట పడడానికి నేను ఒక  మార్గం ఎంచుకున్నాను. ఉత్తరాలు వ్రాయకపోవడం. అందువల్ల  పెళ్ళైన ఏడాదికి మా ఇంటికి ఉత్తరాలు వ్రాసే అధికారం కూడా మా ఆవిడకే కట్టబెట్టడం జరిగింది.  

అసలు ఈ ఉత్తరాలు వ్రాయడం అన్న ప్రక్రియ చిన్నప్పుడు హైస్కూల్ లో చదువుకునేటప్పుడు మా ఇంగ్లిష్ మాష్టారు మొదలు పెట్టించారు. “అనారోగ్య కారణాల వల్ల, నేను స్కూల్ కి రాలేకపోతున్నాను కాబట్టి నాకు మూడు రోజులు శలవు ప్రసాదించండి” అని ప్రధానోపాధ్యాయుడు గారికి ఇంగ్లీష్లో ఉత్తరం వ్రాయమన్నారు.  వ్రాశాము. మాష్టారు ఎర్ర పెన్నుతో ఐదారు చోట్ల అండర్లైన్ చేసి మమ్మల్ని బెంచీ ఎక్కించారు. ఆయన ఇలాంటి చిలిపి పనులు ఇంకా చేశారు. విహార యాత్ర గురించి మిత్రుడికి ఉత్తరం వ్రాయమన్నారు, మన పండగల గురించి అమెరికన్ మిత్రుడికి కూడా వ్రాయమన్నారు. ఏమిటో,  మనం ఇంగ్లీష్లో వ్రాస్తే మన తెలుగు మిత్రుడికే అర్ధం కాదు,  పాపం అమెరికా మిత్రుడికి ఏమి అర్ధం అవుతుంది? అని గింజుకున్నాం. కానీ ఈ  విషయం మా ఇంగ్లిష్ మాష్టారుకి అర్ధం కాలేదు.  

యూనివర్సిటీ లోకి అడుగు పెట్టేదాకా మళ్ళీ  ఎవరికీ ఉత్తరం వ్రాయాల్సిన అవసరం కలగలేదు. యూనివర్సిటీ లో చేరిన తరువాత మొదటిమాటు మా నాన్న గారికి వ్రాయాల్సివచ్చింది. “జేబులు నిండుకున్నాయి. స్వంత ఖర్చులకి ఒక ఏభై రూపాయలు, మెస్ ఖర్చులకి, పుస్తకాలకి ఇంకో వంద రూపాయలు పంపించండి” అని ఉత్తరం వ్రాయాలి  అన్న మాట.  ఈ ఉత్తరం వినయ పూర్వకంగానూ, భక్తి శ్రద్ధలు ఉట్టి పడేటట్టుగానూ వ్రాయాలి అనుకున్నాను.  దీనంగా కూడా వ్రాస్తే వెంటనే పంపించేస్తారు కదా అని కూడా అనుకున్నాను. మా నాన్నగారు తెలుగు పండితులు కాబట్టి తెలుగులో వ్రాసి వారిని ఒప్పించడం, మెప్పించడం కష్టం కాబట్టి ఇంగ్లీష్లోనే వ్రాశాను. కానీ, ఇక్కడ ఒక విషయం మరిచిపోయాను. మా నాన్నగారు తెలుగు పండితులే అయినా మెట్రిక్ కూడా చేశారు. మా నాన్నగారి కాలంలో మెట్రిక్ ఈజికొల్టు మా కాలంలో బియ్యే అని అనేవారు. మా నాన్నగారి దగ్గరనుంచి తిరుగు టపాలో ఉత్తరం వచ్చింది నాల్గురోజుల్లో. నేను వ్రాసిన ఉత్తరంలో ఎర్ర సిరాతో అండర్ లైన్ చేసి  “ఆ ఉత్తరాన్ని సరి చేసి వ్రాసి పంపితే డబ్బు పంపుతాను” అని శ్రీముఖం పంపారు. అప్పటినుంచి మా నాన్నగారికి ఎప్పుడూ ఇంగ్లీష్లో  వ్రాయలేదు నేను. తెలుగులోనే “డబ్బులు అయిపోయాయి. వెంటనే ఇంత పంపించండి” అని రెండు లైన్లు మాత్రమే వ్రాసేవాడిని. కింద ఇంకో లైన్ వ్రాసేవాడిని. “తప్పులున్న మన్నించవలెను”  అని.  అప్పట్నుంచి నేను వ్రాసే ఉత్తరాలలో “తప్పులున్న క్షమించవలెను” అన్న వాక్యం స్థిర నివాసం ఏర్పరుచుకుంది.

క్షమించాలి.  ప్ర్రాముఖ్యత  తో మొదలు పెట్టి క్షమించాలి లోకి దిగింది టపా.  ప్రముఖుడిని అనిపించుకోవాలని కోరిక కలిగిన తరువాత ఏం చెయ్యాలా?అని ఆలోచించాను. ప్రస్థుతం బ్లాగు తప్ప మరో వ్యాపకం లేదు. ప్రముఖ బ్లాగరు అనిపించుకున్నా కోరిక తీరవచ్చు నేమో యనుకున్నాను. నాలుగుంపావు ఏళ్ళగా వ్రాస్తున్నా 65 టపాలు మాత్రమే వేయగలిగాను. ఇంతకాలంగా వ్రాస్తున్నా లక్ష పాఠకులను కూడా ఆకర్షించలేక పోయిన ఏకైక బ్లాగరును నేనేనేమో అన్న సంశయం కలిగి బలపడింది. ప్రముఖ బ్లాగర్ అనిపించుకోవాలంటే కనీసం ఒక లక్ష మంది పాఠకులైనా మన బ్లాగ్ ను సందర్సించాలి గదా.

అందుకని ఈ లక్షవత్తుల నోము మొదలుపెట్టాను. కనీసం ఒక లక్ష పాఠకులు నా బ్లాగు చిరునామాను వత్తే వ్రతం అన్న మాట.  ఇకపై నెలకి కనీసం మూడో నాలుగో టపాలు వేస్తే ఐదారు / ఏడెనిమిది  నెలల్లో ఆశయం సిద్ధించవచ్చు అనే ఆశ కలిగింది.   నెలకి మూడు నాలుగు కధలు వ్రాసే సత్తా మనకి లేదు. కాబట్టి కధలు,  కాకరకాయలతో  పాటు, సోది  కబుర్లు కూడా చెపుదామని అనుకుంటున్నాను.  సోది కబుర్లు అంటే నిర్వచనం నాకు తెలియదు. పనికి రానివి లేదా పనికి మాలినవి అనే అర్ధం వస్తుందనుకుంటాను. మళ్ళీ రెంటికీ తేడా అడగకండి.

అదన్నమాట సంగతి. పాఠకాకర్షణ స్కీము  మొదలవుతోంది నా బ్లాగులో.....దహా.

యధాశక్తి  తమరెల్లరూ  విచ్చేసి నా వ్రతం సంపూర్ణంగా సఫలమయేటట్టు సహకరించాల్సిందిగా కోరుచున్నాను.             

లక్ష వత్తుల నోము


లక్ష వత్తుల నోము చేయాలని సంకల్పం చెప్పుకున్నాను. లక్షవత్తుల నోము అంటే వీడికి తెలుసునా అనుకునే వాళ్ళే ఎక్కువుగా ఉంటారనే అనుకుంటాను. అయినా సరే,  అనుకున్నాను కాబట్టి నేను అనుకున్న లక్షవత్తుల నోము ఆచరించి తీరుతాను అని బ్లాగ్ముఖంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.

ఇంతకీ ఇంత ఘోర ప్రతిజ్ఞ చేయాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది అని మీలో కొంతమందికి అనుమానం వచ్చేఉంటుంది. మీ అనుమాన నివృత్తి చేయడం నా ధర్మం. సంగతేమిటంటే,

కిందటి ఆదివారం మద్యాహ్నం భోజనానంతరం,  చేయడానికి ఏమి లేక వారఫలాల మీద దృష్టి పోనిచ్చాను. సాధారణంగా నేను వార ఫలాలు చూడను. కానీ ఆవేళ పొద్దున్న  మా ఇంటి నుంచి వెళ్ళిన కరంటు తిరిగి ఇంకా రాలేదు. కరంటు రాకడ ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరు గదా! అందువల్ల టివి కానీ నెట్ కానీ అందుబాటులో లేకపోవడంతో పొద్దున్నే చదివిన పేపరే మళ్ళీ  చదవాల్సి వచ్చింది. అప్పుడు చదవని వారఫలాలు ఇప్పుడు చదవాల్సి వచ్చింది. వారఫలాల్లో ప్రముఖులతో పరిచయం పెంచుకుంటారు అని వ్రాశారు.

నేను పరిచయం పెంచుకోవాల్సిన ప్రముఖులు ఎవరా అని ఆలోచించడం మొదలు పెట్టాను. అయినా ఇప్పుడు పరిచయం పెంచుకోవాల్సిన అగత్యం ఏమిటి?  అన్న ప్రశ్న ఉత్పన్నం అయింది. బహుశా నాతోటే ప్రముఖులు పరిచయం పెంచుకుంటారా? అన్న అనుమానం పొడ చూపింది. ఎలెక్షన్స్ అయిపోయాయి కాబట్టి రాజకీయ ప్రముఖులు నా మొఖం చూడ్డానికి రారు. నేను పని చేసిన శాస్త్ర రంగంలో నాకు తెలిసిన ప్రముఖులు  కొంతమంది ఇంకా చురుకుగా ఉన్నా,  చాలామంది పదవీ విరమణ చేసి విశ్రాంత జీవనం గడుపుతున్నారు. కొంతమంది పరలోకాలకు వెళ్ళిపోయారు  కూడానూ. చురుకుగా ఉన్న వాళ్లకీ,  మనకి శాస్త్ర సాంకేతిక విషయాల్లో  పది ఏళ్ల గాప్ వచ్చింది. కాబట్టి వారికి మన సలహాల  అవసరం ఉండదు. ఇదివరకు అప్పుడప్పుడు ఏ సెలక్షన్ కమిటీ లోనో  మెంబర్ గా పిలిచేవారు. గత ఐదారేళ్ళగా   ఎవరూ పిలవటం లేదు కూడాను.

ఇతర రంగాలలో మనకి ఓనమాలు తెలియవు కాబట్టి ప్రముఖులు ఎవరు?  హూ?  కౌన్? అని తీవ్రంగా ఆలోచించడం కొన సాగించాను. మిత్రులు  కొంతమందికి  టెలిఫోన్ చేసి వారికి తెలిసిన ప్రముఖులకి గానీ, అప్రముఖులకు గానీ నా గురించి ఏమైనా చెప్పారా అని అమాయకంగానే అడిగాను. వాళ్ళు ఫెళ్లుమని నవ్వారు. "నీలో ఏముందని నీ గురించి చెప్పాలి"  అని మళ్ళీ  ఘొల్లుమని నవ్వారు. విని  నేను బోరు బోరుమని ఏడ్చాను. మనస్సులో ఒత్తిడి పెరగడం మొదలు పెట్టింది. కానీ సమస్య తీరలేదు. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఆలోచన తెగలేదు. మర్నాడు ఆరు గంటలకి పక్క మీద నుంచి లేచేటప్పటికి మనస్సు ఒత్తిడికి గురవుతోందని గ్రహించాను,  కానీ ఆలోచనలు మళ్ళీ   ముసురుకున్నాయి.  ఒత్తిడి తగ్గించుకోవటానికి, రామా క్రిష్ణా అని ఘట్టిగానే అనుకోవడం మొదలు పెట్టాను. విని విని మా ఆవిడ ఎదురిళ్ళకీ,   పక్కిళ్ళకీ  వెళ్ళి రమా అని కానీ క్రిష్ణా అనికాని రమ్యకృష్ణ అని కానీ ఎవరైనా ఉన్నారా అని కనుక్కొని ఎవరు లేరని నిర్ధారణ చేసుకొని వచ్చింది. మా ఆవిడే నా శీలాన్ని శంకించిందని తెలిసి నా మనసు  ఇంకా ఒత్తిడికి గురి అయ్యింది.  

కాలం గడిచేకొద్దీ ఒత్తిడి హృదయానికి పాకింది. సుమారు సాయంకాలం నాల్గు గంటలకి ఒత్తిడి తీవ్రతరమై గుండె  నొప్పిగా మారింది.  ఒక రెండు మూడు గంటలు భరించి లాభం లేదని మా అమ్మాయికి ఫోన్ చేశాను.  పది నిముషాల్లో మా అమ్మాయి,  అల్లుడు వారి కారులో నన్ను హాస్పిటల్కి చేర్చారు. హాస్పిటల్లో వాళ్ళు “మీ రాక మాకెంతో సంతోషం సుమండి” అంటూ పాడుతూ నా కాలికీ,   చేతికీ,  గుండెకీ  ECG బిగించేసి,  వచ్చిన గ్రాఫ్ షీటు చూసి ఖంగారు పడిపోయి నన్ను  ICCU లోకి పట్టుకు పోయి బెడ్ మీద పడుకోబెట్టి ట్రీట్మెంట్ మొదలు పెట్టేశారు. రాత్రి సుమారు పదకొండు గంటలకి  ఓ నిద్రమాత్ర ఇచ్చి “జో అచ్చ్యుతానంద జోజో ముకుందా” అని పాడేరేమో నని అనుమానం. 

మర్నాడు ఉదయం అంతా ప్రశాంతంగానే ఉంది. “మనసున శాంతి  నిండి పోయెనే, కడుపులో ఆకలి పెరుగుచుండెనే, గుండెలో నొప్పి మాయమాయెనే,  ఇంక ఇంటికి వెళ్ళిపోదునే” అని పాడాను. డాక్టరుగారు కోప్పడ్డారు. “ఇక్కడి నుంచి నిన్ను పంపే హక్కు మాకు మాత్రమే ఉంది. ఇప్పుడు యాంజియో తీస్తాము” అని నన్ను తీసుకుపోయి అదేదో తీసేశారు. “మూడు చోట్ల బ్లాకులు ఉన్నాయి. అంతకు మించి మరేమి లేదు. రేపు మూడు స్టెంట్లు పెట్టేస్తాం” అని సరదా పడ్డారు. వాళ్ళు అంత ముచ్చట పడుతుంటే కాదనడం ఎందుకు అని ఒప్పేసుకున్నాను. మర్నాడు మూడు స్టెంట్లు పెట్టేశారు. ఇంకో రోజు ICCUలోనే ఉంచి మర్నాడు రూంకి షిఫ్ట్ చేశారు. మర్నాడు “అంతా బాగానే ఉంది,  నౌ యు గో హోం” అన్నారు.   వెళ్లేముందు పాటించాల్సిన నియమాలు, మింగాల్సిన మందులు ఇత్యాదుల గురించి నాకు,  మా ఆవిడకి కూడా వివరించారు.  తినుము, తినకుము అని వ్రాసి ఉన్న ఒక పెద్దకాగితం కూడా చేతిలో పెట్టారు. సలహాలు సూచనలు కూడా పెద్దలిస్ట్ చెప్పారు. “వేయి శుభములు కలుగు నీకు పోయి రారా పేషెంటూ”  అని పాడి సాగనంపారు.

ఇంటికి వచ్చిన తరువాత రెండు గంటల పాటు  డాక్టర్ల సూచన ఒకటి పాటించాను. “ఇప్పుడు మూడు ఇదివరలో ఒకటి మొత్తం నాలుగు స్టెంట్లు నా శరీరంలో రక్త ప్రసరణ నిరాటంకంగా కొనసాగిస్తుండగా నాకేల భయం” అనుకున్నాను.  “ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము” అని పాడుకొని ఐదు రోజుల వియోగం తరువాత ఒక సిగరెట్టును ముద్దు పెట్టుకున్నాను.  “ఏమైనా చెప్పండి కానీ ఆ  ఒక్కటి చెప్పకండి” అని మా బంధు మిత్రులందరికీ విన్నవించుకున్నాను.  

మూడు రోజులయింది ఇంటికి వచ్చి. అంతా బాగానే ఉంది.   

అదీ సంగతి.  ఇతి వార్తాః సమాప్తః.

ఇంతకీ ఈ విషయానికి లక్షవత్తుల నోముకి లింకేమిటి? అని మీకు సందేహం వచ్చి ఉండాలి. అంత తొందరెందుకు? వచ్చినవాడిని చెప్పకుండా ఉంటానా? వేచి చూడుడు. ఈ లోపు మీ ఉహాగానాలు మీరు సాగించండి.

సశేషం.       

నవ్వితే నవ్వ౦డి: నా పుస్తకం పై సమీక్ష

నవ్వితే నవ్వ౦డి: నా పుస్తకం పై సమీక్ష: నా పుస్తకం "బులుసు సుబ్రహ్మణ్యం కధలు"  మీద  శ్రీమతి  జి.ఎస్. లక్ష్మిగారు అంతర్జాల పత్రిక మాలిక , సెప్టెంబర్ 2014 సంచికలో ఒక సమీక్...

నా పుస్తకం పై సమీక్ష

నా పుస్తకం "బులుసు సుబ్రహ్మణ్యం కధలు"  మీద  శ్రీమతి  జి.ఎస్. లక్ష్మిగారు అంతర్జాల పత్రిక మాలిక , సెప్టెంబర్ 2014 సంచికలో ఒక సమీక్ష వ్రాశారు. పుస్తకం కన్నా సమీక్ష బాగుంది అని నాకు అనిపించింది. మీరు సమీక్ష

 ఇక్కడ 

http://magazine.maalika.org/2014/09/02/%E0%B0%AC%E0%B1%81%E0%B0%B2%E0%B1%81%E0%B0%B8%E0%B1%81-%E0%B0%B8%E0%B1%81%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A3%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82-%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2/

చదవవచ్చు.

సమీక్ష వ్రాసిన శ్రీమతి లక్ష్మి గారికి, ప్రచురించిన మాలిక పత్రిక సంపాదకులకు కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 

అన్నట్టు,  ఇప్పుడు "బులుసు సుబ్రహ్మణ్యం కధలు",    "నవోదయా బుక్ హౌస్", కాచిగూడ చౌరస్తా, హైదరాబాద్ మరియూ "విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్" అన్ని బుక్ షాపుల్లోనూ కూడా దొరుకుతుంది. 

అంతర్జాలంలో kinige.com లో eబుక్,  ప్రింట్ బుక్ కూడా దొరుకుతుందని ఇదివరలో చెప్పాను.

పాఠకులు అందరికీ ధన్యవాదాలు.