గమనిక :- ఈ టపా ఆగస్ట్ 2, 2010 న ఈ బ్లాగులో పబ్లిష్ అయింది. మా కాలనీ సౌత్ ఎండ్ పార్క్ (యల్.బి.నగర్) లోని 'స్నేహ సమాఖ్య' వార్షిక సంచిక 2007 'లిఖిత' కోసం మిత్రుల ప్రోద్బలంతో మొట్ట మొదటి మాటు ప్రయత్నం చేసి రెండు కధలు వ్రాసాను. ( వీటిని కధలు అనవచ్చా అనే సందేహం). మిత్రులు శ్రీ శాస్త్రి గారు, వీటిని దిద్ది ప్రోత్సహించారు. మూడు మాట్లు చిత్తు ప్రతులను సరి చేయడం జరిగిందని గుర్తు. ఈ రెండు రచనలు 'లిఖిత 2007' లో ప్రచురించ బడ్డాయి.
మొదటి రచనలు కాబట్టి వీటిమీద నాకు అభిమానం ఎక్కువ. అందులో ఇది ఒకటి. ఇక చదవండి.
“తెలుగదేల యన్న” అంటూ మొదలు పెట్టి “దేశ భాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయల వారు ఓ పద్యం రాశారని విన్నాం. అంటే ఆకాలంలో కూడా తెలుగు అదేలా అనే వారున్నారని మనం అర్ధంచేసుకోవాలని మా బండోడు వక్కాణించాడు. తెలుగుమీద ఇప్పుడు బోలెడు అభిమానం ఉన్నా, చిన్నప్పుడు తెలుగంటే నాకు చాలా భయం ఉండేది.
మా మాష్టార్లు, ఒకరిద్దరు తప్పితే, మాకు టిఫిన్లు బాగా పెట్టేవారు. పెసరట్టు, మినపరోస్ట్ వీపుమీద, కొంచెం లైట్ గా పడితే పెసరట్టు, అరచేతి ముద్రలు కూడా ముద్రిస్తే మినపరోస్ట్ అని అర్ధం. తొడమీద గిల్లితే పకోడి అనీ, మెలిపెట్టి గిల్లితే పునుకులు అనీ, బుగ్గమీద పొంగిస్తే బూరెలు అనీ, అరచేయి వెనక్కి తిప్పి ముణుకులు వాయగొడ్తే కజ్జికాయలు, మైసూర్ పాక్ అనీ అనేవాళ్ళం.
ఈ భయం కాస్తా 4 & 5 తరగతుల్లో కోపంగా మారింది. అప్పటిదాకా, అల, వల లాంటి చిన్నపదాలు ఉక్తలేఖనంలో (Dictation ) చెప్పేవారు. 4 & 5 తరగతుల్లో రెండు, మూడు అంతస్తుల అక్షరాలు చెప్పేవారు, విష్వక్సేనుడు, అదృష్టము లాంటివి. తరగతి పెరుగుతున్న కొద్దీ అంతస్తులు పెరిగేవి. రె౦డవఫారంకి వచ్చేటప్పటికి, అశ్వత్థవృక్షము, శాస్త్రనిర్దిష్టము, మత్సాకృతి ఇత్యాదులు. చెప్పటమేకాదు, పలకమనేవారు. మూతి అష్టవంకరలు తిప్పి, కాళ్ళు చేతులు కొట్టుకుంటూ పలకడానికి ప్రయత్నించే వాళ్ళం. కాని ఎక్కడో దొరికి పోయేవాళ్ళం.
మాతెలుగు మాష్టారికి ఓ విజ్ఞాపన పత్రం ఇచ్చుకున్నాము.
"ఇలా రెండు మూడు అంతస్తుల అక్షరాలు ఒకటి రెండు కన్నా ఎక్కువ ఉన్న పదాలు డిక్టేషనులో ఇవ్వకూడదు" అని, "తప్పుచేస్తే పకోడీలు తప్ప మినపరోస్ట్లు, కజ్జికాయలు పెట్టరాదు" అనిన్నూ విన్నవించుకున్నాము.
ఏ కళనున్నారో కానీ మొదటిదానికి ఒప్పుకున్నారు కానీ రెండవదానికి ఘట్టిగా నో అనేసారు. గుడ్డిలో మెల్ల అని సంతోషించాము.
కానీ మా తెలుగు మాష్టారు అంత రాజకీయం చేస్తారనుకో లేదు. రెండు మూడు అక్షరాలవే ఇచ్చారు., అర్ఘ్యము, స్మృతి, దంష్ట్రము, ఇత్యాదులు. పెనం మీద నించి పొయ్యలో పడ్డట్టయింది మా పని. రెండు మూడు అక్షరాలవే వ్రాయలేక పొతున్నారా వెధవ ల్లారా అంటూ అందరికీ మినపరోస్ట్ తినిపించేసారు.
నామట్టుకునాకు ఒక ఘోరమైన పదము సుమారు అరడజను రోస్ట్ లు ఇప్పించింది. చ్ఛేద్యము అన్న పదం పాఠంలో రెండు మాట్లు వచ్చింది. రెండుమాట్లు దాని ముందర అక్షరాలు వేరు. ఒకటి సరళమైనది, రెండోది రెండంతస్తుల అక్షరం. ఆయన పలకమంటాడు. మనకి కుదిరి చావదు. సరళ అక్షరయుక్త చ్ఛేద్యమునకే రెండు మినపరోస్ట్లు దొరికాయి.
చ కి ఎ కారం, ఆపైన దీర్ఘం, కి౦ద చ తోటి వత్తడం, పైగా కింద చ గుండెలో గునపం ది౦చడం, ఇవన్నీ ఏకకాలంలో ఉచ్చరించడం మాటలా.
రెండో ఫారం చదువుతున్న చిన్న బుర్రకి, అందులో మట్టి తప్ప సరుకు లేని అమాయకపు బుర్రకి, కుదురుతుందా అని నేను ప్రశ్నిస్తున్నాను.
కష్టపడి బిగపెట్టి చ్ఛే అన్న వెంటనే ద్యము అనేటప్పటికి అప్రయత్నంగానే ద కి కూడా గునపం దిగిపోయేది. ద్య కి గునపం దిగడం, మాష్టారు మినపరోస్ట్ తినిపించెయ్యడం ఏక కాలంలో జరిగి పోయేవి. అంతవేగంగా ఆయన ఎల్లా రియాక్టు అయ్యేవారో నాకు అర్ధం అయ్యేది కాదు.
ఈ మాష్టారే్ పిల్లల్లో ఒరిజినాలిటీ పెంచాలని అత్యుత్సాహ పడిపోయేవారు. ఒక చిన్నకధ చెప్పి దాన్ని వ్రాయమనేవారు. మేమంతా సరళ పదాల తోటే వ్రాసేవాళ్ళం. కాని తెలుగు సారు కి దొరకకుండా తెలుగులో వ్రాయడం మా వల్ల కాదని తేలిపోయింది. "ఒకడు మరొకడిని నీకు ఏమి జబ్బు?" అని అడిగాడు అని వ్రాస్తే కూడా టిఫిను దొరికేది. "నీకేమి జబ్బు" అని వ్రాయాలిట.
విడి పదాలను కలపడానికి సవాలక్ష మార్గాలు అన్వేషించారు మన కవులు, వ్యాకరణవేత్తలు. వీటన్నిటికి సంధులు, సమాసం అని చాలా పేర్లే పెట్టారు. ముందు తరాలలో చిన్న చిన్న బుర్రలతో, చిన్న చిన్న కుర్రాళ్ళు నేర్చుకోవాలి కదా అని ఆలోచించకు౦డా వాళ్ళు అన్నేసి సూత్రాలు కనిపెట్టేసారు. ఒకదాని కంటే మరొకటి కఠినమైనది. సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి అంటూ ప్రతీదానికి అరపేజి కంఠతా పట్టాల్సి వచ్చేది. కంఠతా పట్టింది, వ్రాసేయడం, అప్ప చెప్పడం కొంచం కష్టం అయినా సాధించేవాళ్ళం. అది అన్వయించడానికి తాతలు దిగివచ్చేవారు.
ఒక పదం ఇచ్చి విడగొట్టండనే వారు. రెండు పదాలు ఇచ్చి కలిపేయండనే వారు. ఈ విడగొట్టడ మేమిటో ఆ కలిపేయడ మేమిటో ఒక పట్టాన బో్ధపడేది కాదు. ఎల్లా విడగొడితే్ ఏంతంటా వస్తుందో. ఎన్ని కష్టాలు. అక్కడికి మా మాష్టారు తో మొఱ పెట్టుకున్నాం.
"సార్, ఇది మంచి పద్దతి కాదు. అలా కలిసిపోయిన వాటిని విడగొట్టడం పాపం" అని.
ఆయన ఓచిరునవ్వు నవ్వి,
"పోనీ లెండిరా ఆ పాపం మనకెందుకు, ఈ రెంటినీ కలిపి పుణ్యం కూడబెట్టుకోండి" అని అన్నారు.
రెంటినీ కలపి పలకడం కన్నా, ఒకదాన్ని విడగొట్టడమే మాశరీరాలకు మంచిదనిపి౦చేలా చేసారు.
ఈ సంధుల తొటే కొట్టుకు ఛస్తుంటే సమాసాలు వచ్చి పడ్డాయి. కర్మదారయ అన్నారు, తత్పురుష అన్నారు, ఒక దానికీ లింకు దొరికేది కాదు. చేతన్, చేన్, తోడన్, తోన్, అంటూ అవస్థ పడేవాళ్ళం.
"తోడన్ నే తోడలేక ఛస్తుంటే తోకలాగ తోన్ ఏమిటిరా" అని ఏడ్చేవాడు మాబండోడు.
ఈసమాసాల్లో కూడా చాలా గ్రేడు లున్నాయి. విశేషణ కర్మదారయ, ప్రధమా, ద్వితీయ అ౦టూ తత్పురష కి బోలెడు ఉ౦డేవి. ఒకటే కష్టంగా ఉ౦టే, మళ్ళీ అ౦దులో ఇన్ని రకాలా అని దుఃఖించేవాళ్ళం.
`విగతభర్తృక` అన్న పదం నాకు బాగా తినిపించింది. దీని అర్దం ఇప్పటికీ నాకు సరిగ్గా తెలియదు. పోయిన భర్త కలది అనే అర్ధం వస్తు౦దను కుంటాను. ఆయన ఎవరో పోవడం ఏమిటో, పోయినాయన ఈవిడకు కలగడం ఏమిటో?. అసలు ఇలాంటి పదాలు కనిపెట్ట వచ్చా అని కోప్పడ్డాను. అప్పుడు మానవ హక్కుల కమిషన్ లేదు కాని, ఉంటే తప్పకు౦డా ఫిర్యాదు చేసేవాడిని. ఇలాంటి పదాలతో పిల్లలను హింస పెట్టడం నేరం అని కమిషన్ ను ఒప్పించడం పెద్ద కష్టం కాదు అనుకుంటాను. ఇంతకీ ‘విగతభర్తృక’ అన్నది ఏసమాసమో మీకు తెలుసా? ‘విగత’ ఉంది కదా అని విశేషణ కర్మదారయ అన్నాను. ఒక పెసరట్టు దొరికింది. ఏమైతే అవుతుంది అని ఏదో తత్పురుష అన్నాను . మినపరోస్ట్ తినిపించేసారు. పట్టు వదలని విక్రమార్కుడి లాగ మరేదో అన్నాను కజ్జికాయలు తినిపించేసారు.
‘స,శ,ష, ర,ఱ,ట,ఠ లు ప్రాణాలు తీసేసాయి. ఏది, ఎక్కడ, ఎల్లా, ఎప్పుడు, ఎ౦దుకు వాడాలో ఇప్పటికి నాకు సరిగ్గా తెలియదు.
సంధులు, సమాసాలు, విభక్తులు, భక్తులతోటి కుస్తీ పడుతుంటే, తీరుబడిగా, చిద్విలాసంగా నవ్వుతూ గురువులు, లఘువులు మా మీదకు దూకేసాయి. తోడుగా గణాలను తెచ్చుకున్నాయి. యగణం, మగణం, భగణం అ౦టూ హోరెత్తించేశాయి.
మేము బిత్తరపోయి చూస్తుంటే ఉత్పలమాలలు, చంపకమాలలు, వాటికి కాపలాగా శార్దూలాలు, మత్తేభాలు పైన పడ్డాయి వికటాట్టహాసాలతో.
ఇంకా మేమేమైనా మిగిలి ఉంటే మీద పొయ్యడానికి సీసం లను తోడుతెచ్చుకున్నాయి.
ఒకళ్ళా, ఇద్దరా కవులు కొల్లేటి చాంతాడంత లిస్టు. ఒక్కొక్కడు కనీసం ఓ అరడజను వ్రాసిపడేసాడు. ఎవరు, ఎందుకు, ఏంవ్రాసాడో ఎలా గుర్తుపెట్టుకోవడం? నానా అవస్తలు పడేవాళ్ళం.
గురువులను, లఘువులను గుర్తి౦చడం ఓ యజ్నం లాగ ఉండేది. లఘువులు కొంచెం తేలిక అనిపించినా, గురువులు కష్టం అయ్యేది.
"అన్నిచోట్లా గురువులు అంతేరా, ఓపట్టాన అర్ధంకారు" అని విశదీకరించాడు మాబండోడు.
ముందు అక్షరాన్ని బట్టి లఘువు కాస్తా గురువు అయిపోయేవాడు.
"ఈనాటి విద్యార్ధి రేపటి ఉపాద్యాయుడు" అని బోదించేవారు మా మాష్టారు. "కొంతమంది లఘువులు ఎప్పటికి మారరు మన బండోడి లాగ" అని చమత్కరించే వారు కూడాను.
పద్యాలు, ప్రతిపదార్ధాలతో దుంపతెగిపోయేది. కొన్నిపద్యాలు ఫరవాలేదు, కొన్ని తెలిసిన పదాలు దొరికేవి. కొన్నిపద్యాలలో ఒట్టు, ఒక్కటంటే ఒక్కటి కూడా తెలిసిన పదం ఉండేది కాదు. ఏదైనా ఒక పదం విడగొట్టితే అందులోంచి తెలిసిన దేదైనా ఊడిపడేది.
"అట జని గాంచె భూమిసురుడు" అంతదాకా ఈజీ అనిపించినా, ఆపైన "అంబర చుంబి శిరఝరీ" దుడుంగ్, ఫుడుంగ్, అంటూ పద్యం అయి పోయేదాకా ఒక్కమాట అర్ధం అయి చావదు.
"ధాటీ ఘోట ఘరట్ట ఘట్టన మిళద్గ్రాషిష్ఠ" నా బొంద, నా పిండాకూడు ఏమైనా అర్ధం అవుతుందా. అవి పలికేటప్పటికే ఆయాసం వచ్చేసేది.
వీటి తోటే గుంజీలు తీస్తుంటే నానార్ధాలు అనేవారు. ఒకే పదానికి రెండు చోట్ల రెండర్ధాలు, కొండకచో ఇంకాఎక్కువ.
మా మాష్టార్లు మట్టుకు పద్యపాఠాలు చెప్పేటప్పుడు పరవశించి పోయేవారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిమాన కవి. ఆ కవి పాఠం వచ్చిందంటే కొండొకచో కృష్ణుడి పాత్రలో లీనమైపోయిన యన్. టి. వోడు లాగ అయిపోయేవారు. ఒక్కో పదానికి అర్ధం, వాటిలోని భావ చమత్కృతి విడమర్చి మరీ చేప్పేవారు.
5,6 ఫారంలకు వచ్చేటప్పటికి వ్యాకరణం అంటే వ్యతిరేకత పూర్తిగా పోకున్నా తెలుగు లోని తేనె తీయందనాలు, మందార మకరంద మాధుర్యాలు అర్ధం అవటం మొదలు పెట్టేయి.
యస్.యస్.ఎల్.సి తోటి తెలుగు పాఠాలు అయిపోయాయి. కాలేజి కెళ్ళి ఊపిరి పీల్చుకున్నాం.
లాటిన్, గ్రీకు భాషలు చాలా కష్టమైన భాషలు అంటారు. చిన్నప్పుడు తెలుగు అన్నిటికన్నా కష్టం అనిపించేది.
అందుకే అనేవాళ్ళం తెలుగదేలా అని.