నా మౌన నిరశన వ్రతం

సాధారణంగా మాఆవిడ చేసే తప్పులు రోజుకి నాల్గైదు అయితే క్షమించేస్తాను. అంతకు మించితే ఆగ్రహిస్తాను. ఆగ్రహించి చేసేదేమీ లేదు కనక ఇల్లాంటి రోజులు నాలుగు లెఖ్ఖ పెట్టుతాను. మరుసటి రోజున మౌన నిరసన వ్రతం చేస్తాను. ఎదో విదంగా మరి నా అసమ్మతి తెలియచెయ్యాలి గదా. ఈ రోజున నేను మౌన నిరసన వ్రతంలో ఉన్నాను. ఈమధ్యన తరుచుగా వ్రతిస్తున్నాను లెండి. నేను కూర్చుని ఏదో వ్రాసుకుంటున్నాను. మాఆవిడ వెనకాల నుంచుని చూసింది. పెదవి విరిచి ’ప్చ్’ అంది. నేను విననట్టు నటించాను. ఈమాటు శబ్దస్థాయి పెంచి ’ప్చ్’ ,ప్చ్’ అని రెండు మాట్లు అంది. నేను వెనక్కి తిరిగి కనుబొమలు ఎగరేసాను, ఏంటి అనే అర్దం వచ్చేలా. ఎవరిని ఉద్ధరించడానికి వ్రాస్తున్నారు? ఎవరు చదువుతున్నారని వ్రాస్తున్నారు? ఎందుకు వ్రాస్తున్నారు? మీ రాతల్లో పరమార్దం ఏమిటీ? అని పృచ్చించింది (అర్ధం నాకు సరిగ్గా తెలియదు, ప్రశ్నించడం అనుకుంటాను. అచ్చు తప్పులున్న క్షమించవలెను. ఈమధ్యన కొంచెం గంభీరంగా వ్రాయడానికి ప్రయత్నిస్తున్నానన్న మాట).
సినీమాల్లో చూస్తుంటాంకదా. ఎక్కడో పాపం విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటుంటాడు. వారి చుట్టూ పుట్టలు పెరిగే దాకా ఎవరూ పట్టించుకోరు. పుట్టలు పెరిగాక ఇంద్రుడికి మంట పుట్టుకొస్తుంది. మేఘుడా పోయి కురిసి రమ్ము అంటాడు. ఆయన వచ్చి ఉరుములు మెరుపులు తోటి వర్షించేసి వెళ్ళిపోతాడు. గాలిగారూ మీరు వెళ్ళి రండంటాడు ఇంద్రుడు. ఈయన వచ్చి నానా హంగామా చేస్తాడు. ఇప్పుడు ఇంకొంచెం జోరుగా విశ్వామిత్రుడు ’నమశ్శివాయా’ అంటుంటాడు. అప్పుడు కాని ఇంద్రుడి మట్టిబుఱ్ఱకి తట్టదు. మేనకని పంపిస్తాడు. ఆవిడ వచ్చి వళ్ళంతా ఊపుకుంటూ ఊపుకుంటూ డేన్సాడుతూ పాడేస్తూంటుంది. సరిగ్గా పాట అయే సమయానికి విశ్వామిత్రుడు కళ్ళు తెరిచి మేనకతో డ్యూయెట్టు మొదలు పెట్టేస్తాడు. అస్తమానూ ఇంద్రుడు ఇల్లాచేస్తాడేమిటీ అని నాకో సందేహం. నోమేఘం, నోగాలి, డైరక్టుగా మేనకనో, ఘృతాచినో (ఈపేరు నాకు బాగా నచ్చింది. ఒకవేళ నేను స్వర్గానికి వెళ్తే ఈవిడ తోటే ఉంటాను.) పంపిచ వచ్చునుగదా. బహుశా ఇంద్రుడు కూడా గవర్నమెంటు సర్వెంటు అనుకుంటాను. నిబంధనల చట్రంలో ఇరుక్కుపోయుంటాడు. మా ఇనిస్టిట్యూట్ లో ఇనుస్ట్రమెంట్ మైంటనెన్స్ సెక్షను ఉండేది. ఏదైనా ఇనుస్ట్రమెంటు పాడైపోతే ఓ టెక్నీషియన్ వచ్చేవారు. వారు ఆ ఇనుస్ట్రమెంటు విప్పి చూసి వెళ్ళే వారు. ఆతర్వాత టెక్నికల్ ఆఫీసర్ వచ్చేవారు వారివల్లా కాకపోతే అప్పుడు సర్వీసు ఇంజనీరుని కంపనీ నించి పిలిపించ మనేవారు..వారిని పిల్పించాలంటే ఇంత తతంగం జరగాల్సిందే పాపం ఇంద్రుడుగారు కూడా, గాలిగారు, మేఘుడుగారి తర్వాతే మేనకగారిని పంపాలేమో

మాఅవిడ కూడా ఇల్లాగే చేస్తుంది నావ్రతభగ్నం చేయడానికి. మొదటగా మాటల యుద్ధం చేస్తుంది. నన్ను, నాఉద్యోగాన్ని, నారచనలని నానా మాటలు అంటుంది. ఆతర్వాత మావంశంలో ఒక్కొక్కరి మీద దాడి చేస్తుంది. మాఅమ్మతో మొదలుపెట్టి, మానాన్న, మాతాత, ముత్తాత దాకా వెళ్ళి పోతుంది . వీళ్ళందరూ చేసిన పనులన్నీ ఏకరువు పెడుతుంది. వాళ్ళలాంటి పన్లు చేసి ఆస్థులు కరగించేసారు కాబట్టి పొట్టపట్టుకొని ఆవిడ ఇంత దూరం రావల్సి వచ్చిందట, నన్ను పెళ్ళిచేసుకున్న ఖర్మానికి. మొదట్లో ఈమాటలు వింటుంటే నాకు కోపం వచ్చేది, ఉక్రోషం వచ్చేది, ఆపైన ఏడుపు వచ్చేది. ఇప్పుడు బాగా అలవాటు ఐపోయింది. (ఇన్ని తెలిసి నన్ను ఎందుకు పెళ్ళిచేసుకున్నావు అని అడగాలను కొనేవాడిని కాని ధైర్యం చాలేది కాదు.. మావంశస్థుల గురించి నాకు తెలియని విషయాలు ఈవిడకు ఎల్లాతెలిసాయో ఇప్పటికి నాకు అర్ధం కాలేదు. ఏమైతేనేం మాతాతలు అంత ఆస్థిపరులని ఈవిడ ద్వారానే తెలిసింది నాకు.) మాఆవిడ తిట్టటం మొదలు పెడితే నేను రామకృష్ణ పరమహంస ముద్ర లోకి వెళ్ళిపోతాను. బాసింపట్టు వేసుకొని రెండు చేతులు వళ్ళో పెట్టుకొని కళ్ళుమూసుకొని ఘృతాచి మీద మనసు లగ్నం చేసి కూర్చుంటాను. ఆతర్వాత చేతల యుద్ధం మొదలు పెడుతుంది. సెల్ నించి లేండు లైను కి మళ్ళీ మళ్ళీ ఫోను చేస్తుంది. నేను అంతర్జాలంలో ఉంటే, ఏదో సర్దుతున్నట్టు నటిస్తూ, BSNL కనక్షను తీసేస్తుంది. ఇల్లాంటివి  చాలా చేస్తుంది. చివరాఖరగా మాశంకరాన్ని పిలుస్తుంది. వాడు నాబాల్య మిత్రుడు. వాడు వచ్చి ఏదో విధంగా నన్ను మాటల్లోకి దింపేస్తాడు. మాఆవిడ విజయ గర్వంతో జయంనాదేలే అని పాడుకుంటుంది.