హాస్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
హాస్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

మా ఆవిడ- నా పెళ్లి చూపుల ప్రహసనము

నాపేరు ప్రద్యుమ్నుడు. నేను మాఊరు భీమవరానికి సుమారు 3000 kms  దూరంలో అస్సాం లో  ఓ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో సైంటిస్టు గా పనిచేస్తూ హాయిగా బతికేస్తున్నాను.  

మా నాన్న గార్కి ఉన్నట్టుండి ఒక అనుమానం వచ్చింది. అక్కడెక్కడో నేను అస్సాంలోని జోర్హాట్ లో సుఖపడిపోతున్నానేమోనని.   జీవితం అంటే సుఖాలే కాదు కష్టాలు కూడా ఉంటాయి, కాదు ఉండాలి అని తీర్మానించుకొన్నవారై నాకు ఒక ఉత్తరం వ్రాసారు. 

“నాయనా పుత్రరత్నమా నీకు సంబంధాలు చూస్తున్నాను. వీలు చూసికొని వచ్చి పెళ్ళి చేసుకొని సంసార సాగరంలో దూకు” అని. నేను వెంటనే యమర్జంటుగా తిరుగు టపాలో జవాబు వ్రాసాను. 

“నా ప్రియ జనకా, నా క్షేమం కోరు మీరు ఇటువంటి పని చేయ తగునా మీకిది తగదు తగదు. ఏదో నాలుగిళ్ళలో వారాలు చెప్పుకొని హాయిగా బతుకు తున్నాను. నన్నిటుల ఒక గూటి పక్షిని చేయ తగదు.” అని. 

 “ నేను పడుతున్నాను, మీ అన్నగారు పడుతున్నారు కష్టాలు. నువ్వు తప్పించు కుంటానంటే కుదరదు కాక కుదరదు.” అని మళ్ళీ వారు ఉత్తరంలో గంభీరంగా ఉద్ఘాటించారు.  

అయినా ఈ తల్లిదండ్రులకు,  ఇల్లా పిల్లలని ముఖ్యంగా మగపిల్లలని సంసార కూపంలో పడవేసి వాళ్ళు మునగలేక, తేలలేక  హే కృష్ణా, ముకుందా, మురారీ   అని పాడుతుంటే విని ఆనందించాలనే  బలీయమైన కోరిక ఎందుకు కలుగుతుందో నాకు అర్ధం కాదు. ఆడ పిల్లల తల్లిదండ్రుల మనస్తత్వం అర్ధం చేసుకోవచ్చు. ఎంత త్వరగా  ఈ అణుబాంబును  ఎవరింట్లో నైనా పడవేసి బాధ్యత తప్పించుకోవాలనే కోరిక, వాళ్ళకి ఉండడంలో తప్పు లేదు. మగ పిల్లల తల్లిదండ్రులు,  సంసార సాగరాన కష్టాలు  అనంతమని, మునిగేవాడు మగాడే అని తెలిసి కూడా ముక్కు పచ్చలారని పసి బాబును పెళ్లి అనే బంధంలో ఎందుకు ఇరికిస్తారో?   విధి బలీయమని చెప్పి, నన్ను విధి వంచితుడను చేసి యావజ్జీవ శిక్ష కు నన్ను ఒప్పించారు మా వాళ్ళు అందరూ కలసి.

నేను సైంటిస్టు ని అవడంవల్ల ప్రతిదీ ప్రణాళికా బద్ధంగా చేయాలని అనుకుంటాను. ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న తరువాత వాట్ నెక్స్ట్ అని ఆలోచించాను. పెళ్ళిచూపులు అనే ఒక మహత్తర  పరీక్షా కార్యక్రమం ఉంటుందని గ్రహించాను. ఈ విషయమై చర్చించుటకై  నా మిత్ర మండలి సమావేశం ఏర్పాటు చేశాను. మిత్రమండలిలో  నేను కాక, ఉన్ని కృష్ణన్ నారాయణ మీనన్ (ఉకృనామీ) మరియు పరమ శివన్ నీల కంఠన్ (పశినీకం) వరుసగా విజయవాడ, హైదరాబాదు లలో పెరిగిన  మలయాళీ, తమిళ సోదరులు,  సభ్యులు. 

అసలు ఈ పెళ్లి అనగా ఏమి అని పృచ్చించాడు ఉకృనామీ.  నేను ఉగ్ర నరసింహ మూర్తి నై  పోయాను.  వాట్ ఈజ్ దిస్? జిస్ దేశ్ మే గంగా బెహతీ హై  లో పుట్టి,  పవిత్ర గోదావరి, కృష్ణా ల జలం `పీ తూ ,  ఇల్లాంటి ప్రశ్న వేయడానికి నీ బుద్ధి కేమి రోగమొచ్చింది అని కోప్పడ్డాను. పెళ్లి అనగా వివాహం అనగా నూరేళ్ళ పంట.  మూడు ముళ్ళ బంధం అనగా  రెండు మనసులు,  రెండు తనువులు, రెండు కుటుంబాలు, రెండు వంశాలు, ఇంకా ఇంకా బోలెడు రెండులు ఒకటయ్యే వ్యవస్థ . సహజీవనం సౌభాగ్యం ఏక జీవనం దౌర్భాగ్యం అని పురాణాలు ఘోషిస్తున్నాయి. మేరా భారత్ మహాన్ లో ఈ వివాహ వ్యవస్థకు సమున్నత స్థానం కలదు. ఈ యొక్క  వివాహ వ్యవస్థను అమెరికా అను దేశం లోనూ, జర్మని దేశం లోనూ మరియు అయిస్లాండ్ దేశస్థులున్నూ చాలా ఇష్టపడెదరు. వారందరూ జంటగా మన దేశమునకు విచ్చేసి ఈ విధానమును కూలంకషము గా నభ్యసించి వివాహ భోజనమ్ము లారగించి స్వదేశముల కేగి విడాకులు తీసుకొనిరని ఎరుగవా అని క్రోధముగా  నుపన్యసించితిని.  

పశినీకం  నన్ను శాంతపరచి, ఉకృనామీ ని సమాధానపరచి,   మా తక్షణ కర్తవ్యమును ప్రభోదించుము అని అడుగుకొనెను. నేనప్పుడు శాంత స్వరూపుడనై ఈ కింది విధముగా వచియించితిని.  మిత్రులారా వివాహము అను బృహత్కార్యములో పెళ్లి చూపులు అనగా మారేజి లుక్సు అనునది ప్రధమ సోపానం. పెళ్ళిచూపులు అనగా పరస్పర ప్రశ్నోత్తర కార్యక్రమము. వాట్ టు పూచ్? అండ్ హౌ టు ఆన్సర్? అను విషయమై మీ సలహాలను అర్ధించుచున్నవాడను, అని విశదీకరించితిని. 

నా మిత్రులిరువురు దీర్ఘముగా నిశ్వసించి, ఇది గంభీర సమస్య యగుటచే, దీర్ఘము గా నాలోచించ వలయును కాబట్టి, హిందూస్థాన్ ఇయర్ బుక్, హూ ఈజ్ హూ అండ్ జెనరల్  నాలెడ్జి  గ్రంధములు చదివి మూడురోజుల తరువాత మరలా సమావేశమై చర్చించెదము అని నుడివిరి. 

తదుపరి సమావేశం లో ఉకృనామీ “నేనొక 10 ప్రశ్నలను తయారు చేసితిని” అని చెప్పగానే “నేనొక 10 జవాబులను తయారు చేసితిని” అని  పశినీకం  తెలియపర్చెను. అమెరికా అధ్యక్షుని పేరేమి? భారత ఆర్ధిక మంత్రి పేరు చెప్పగలవా? భారత రాజధానికి నేపాలు రాజధానికి మధ్య దూరమెంత? గుడ్డులోని పచ్చసొన లోని పోషక పదార్ధములను వివరింపుము? ఇల్లాంటి ప్రశ్నలు ఉకృనామీ చదవగానే  వాటికి జవాబులు పశినీకం చెప్పేడు. 

నాకు అరికాలి మంట నెత్తికి ఎక్కింది. అన్నీ ఇటువంటి ప్రశ్నలు కాదు. వారి వారి  అభిరుచులు, రుచులు, భావములు తెలుసుకొను ప్రశ్నలు కావలెను. అయినా ప్రశ్నలు లా కాకుండా అభిప్రాయములు పంచుకొను విధముగా నుండవలెను, అని  వివరించితిని. 

పరస్పర అవగాహనా కార్యక్రమం,  గ్రూప్ డిస్కషను ఇత్యాదులలో అనుభవా రాహిత్యము వల్ల నీకు అవసరమగు ప్రశ్నావళి తయారుచేయుటకు మేము అశక్తులము అని శోకతప్త హృదయులై  భోరు మని వారు విలపించిరి.

నేనునూ విచార గ్రస్తుడనై, చింతాక్రాంతుడనై ఈ పెళ్లి చూపులు అను నదిని దాటి వివాహము  అను సాగరము చేరుట ఎట్లు అని చింతించుచూ రావు గారి గృహంబునకు నరిగితిని. నా వెనకాలే మిత్రులిరువురు అరుగుదెంచిరి. 

నే  నరుగునప్పటికే  అచట రావు గారు, భావన అక్కయ్య, శాస్త్రి అంకులు, కామేశ్వరి ఆంటీ, Dr. రఘుపతి, మిసెస్ సుధా రఘుపతి కూర్చొని అడ్డాట ఆడుకుంటున్నారు. 

భావనా అక్కయ్య కోపంగా అంటున్నారు ”రావు మహాశయా తురఫు జాకీ బయట ఉండగా మణేలా ఎవరైనా వేస్తారా?  నాయనా ప్రద్యుమ్నా మీ ఆంధ్రా యూనివర్సిటీ లో అడ్డాట ఆడడం రాని వాళ్ళకు M.Sc, Ph.D లు కూడా ఇచ్చేస్తారా. మీ యూనివర్సిటీ లో మరీ ఇంత స్టాండర్డ్స్ దిగజారిపోయాయా"  అని ప్రశ్నించారు. 

నేను సమాధానం చెప్పేలోపలే,  “అడ్డాట దాకా ఎందుకు అక్కయ్య గారూ, పెళ్ళిచూపుల్లో  ఏమి చెయ్యాలో, అడగాలో కూడా తెలియని అమాయక జీవులు వారు” అని వ్రాక్కుచ్చాడు ఉకృనామీ.  

ఎవరికి పెళ్ళిచూపులు, ఏమా కధ అని అడిగారు శాస్త్రి గారు . ఆయన వయసులో పెద్దవారు కాబట్టి మా అందరికీ గురుతుల్యులు. ఎవరికి  ఏ సమస్య వచ్చినా ఆయన సలహాలు మాకు శిరోధార్యం అన్నమాట. 

ఉకృనామీ గాడు సంగతి సందర్భాలు వివరించాడు. అప్పుడు నేను అవనత మస్తకుడనై,  వినమ్రుడనై, ముకుళిత హస్తుడనై  వారిని,  వారి వారి పెళ్ళిచూపుల అనుభవములను సోదాహరణముగా వర్ణింపుమని   అర్ధించితిని.  మగవారు దీర్ఘముగా నిశ్వసించిరి  మరియూ ఆడించేవారు చిరునవ్వులు ఒలక బోసిరి.  

శ్రీ శాస్త్రి గారు లేచి కనులు తుడుచుకొని, ముక్కు చీదుకొని ఇటుల ఉపన్యసించిరి. “నాయనా ప్రద్యుమ్నా, నాదొక విషాద గాధ. నాకు పెళ్లి చూపుల అనుభవం లేదు నాయనా లేదు. ఒకరోజు మా తాతగారు  వీధి అరుగు మీద కూర్చొని  విద్యార్ధులచే  వేదాభ్యాసము  చేయించు చుండగా, వీధిలో నడుచుచూ వెళుతున్న ఓ ఘనాపాటి గారు ఆగి వేద పఠనం లో గొంతు కలిపారుట.  పాఠం అయిన తరువాత మా తాతగారు, ఆ ఘనాపాటి  గారూ కుశల ప్రశ్నలు వేసుకొని, ఒకరి వివరములు మరొకరు తెలుసుకొని , వారికి పెళ్లీడు కొచ్చిన మనవరాలు ఉందని, వీరికి వయసుకొచ్చిన మనవడు ఉన్నాడని తెలుసుకొని కడుంగడు ముదావహులై శుభం అనుకొన్నారట. అంతే మా పెళ్లి  1935 లో జరిగిపోయింది.” అని కూర్చున్నారు.   

అప్పుడు శ్రీ రావు గారు లేచి విషణ్ణ వదనముతో, దు:ఖముచే గద్గదికమైన గొంతు సవరించుకొని “మిత్రమా ఇప్పటికి  సుమారుగా 32 ఏళ్ల  క్రితము మా మేనమామ గారింట నొక ఆడ శిశువు జన్మించెను. జన్మించిన రోజునే మా మేనమామ గారు, చేతిలో చెయ్యేసి  చెప్పు అక్కా,  నా కూతురే నీ కోడలని, అని పాడితే, మా అమ్మగారు ఉత్సాహభరితులై , మాట ఇచ్చితిరా, మాట తప్పనురా అని పాడేరు ట. అంతే.  మా మామ కూతురికి  యుక్త వయసు రాగానే, అంటే ఆమె SSLCని పెఢెల్ ఫేడెల్ మని హ్యాట్రిక్కు తన్నులు తన్నిన తర్వాత, నాకు పెళ్లి చేసేశారు. ఇదిగో ఇల్లా అయింది నా బతుకు” అని విచారించి కూర్చున్నారు.

చివరగా Dr. రఘుపతి గారు నుంచోని  గంభీర వదనుడై, మాట్లాడ బోవుతుండగా, మిసెస్ సుధా రఘుపతి లేచెను. అప్పుడు Dr. రఘుపతి కూర్చున్నాడు.  మిసెస్ సుధా రఘుపతి  చిరునవ్వు నవ్వి “You see when Dr. రఘుపతి  Delhi లో  Ph.D   చేస్తుండగా, one day నన్ను చూశాడు. Next day కూడా మళ్ళీ same place  లో మళ్ళీ చూశాడు.  Then, he fell in love నా తోటి. Then after ఒక year మేము marriage చేసుకున్నాము.”  అని మళ్ళీ ఘట్టిగా నవ్వి కూర్చొనెను. అందరూ జాలిగా  Dr. రఘుపతి కేసి చూశారు.  ఆయన  మెల్లగా  “రెండో మాటు చూసి ఉండకుండా ఉండాల్సింది”  అని విచారించెను.  

ఔరా నాకు సలహాలు ఇచ్చువారే  లేరా అని విచారించితిని.  కానీ  విధి విధానము తప్పింప నెవరి తరము. తానొకటి తలచిన దైవము వేరొండు తలచును గదా.    

ఇది  జరిగిన సరిగ్గా  పదిహేను  రోజులకు నాకు మా అన్న  గారి దగ్గరి నించి నాలుగు వైపులా పసుపు పూయబడి మధ్యలో కుంకుమ రాగ రంజితమైన ఒక ఉత్తరం వచ్చింది.  ఈ ఉత్తరం లో మావదిన గారు మృదు మధుర స్వనంతో వ్రాక్కుచ్చారు. 

“ నాయనా ప్రద్యుమ్నా నీ వివాహం నిశ్చయించబడింది.  వధువు, కృష్ణా తీర విజయవాడ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ సోమయాజులు  గారి జ్యేష్ట పుత్రిక  చి. ల. సౌ. ప్రభావతి.  అమ్మాయి ఇంటర్ లో ఇంగ్లీష్ లో జారి పడిందిట. అందుకని తుచ్చ మ్లేచ్ఛ భాష నేల నేర్పించ వలెనని తండ్రి గారు కినుక వహించి తెలుగు విద్వాన్, మరియూ ఉ. భా. ప్ర. (ఉభయ భాషా ప్రవీణ) పరీక్షలు పాసు చేయించారట. పెళ్లి చూపులలో  మీ నాన్నగారు ఆమెతో తెలుగు లోనూ, సంస్కృతం లోనూ నాలుగు పద్యాలు, రెండు శ్లోకాలు పాడించి ముగ్దులై పోయారు. మీ అమ్మగారు  నీకు అత్యంత ప్రీతిపాత్రమైన పనసకాయ ఆవ పెట్టిన కూర  చేయు విధానము  గురించి  విశదముగా చర్చించి కడుంగడు ముదాహవులయినారు.  మేము ఇంకేమన్నా అడుగుదామని ప్రయత్నించినను,  వారు వీటో చేసేశారు.  అయిననూ పనసకాయ ఆవ పెట్టిచేయు  కూర విధి విధానములు తెలియని నామాట వారేల వినుదురు. అమ్మాయి  చూచుటకు బాగానే ఉంది. ఈ వివాహము జరుగుట నిశ్చయము, తధ్యము మరియూ శిరోధార్యమని మీ జనకులు నొక్కి వక్కాణించారు. కాబట్టి బుద్ధిగా వచ్చి పెళ్లి చేసుకొని వెళ్లమని నీకు వ్రాయవలిసిందిగా మీ తండ్రిగారు మీ అగ్రజుని ఆదేశించగా, వారి ఆజ్ఞా నుసారము నేను నీకు తెలియ పరచు చుంటిని.  మిగతా వివరములతో మీ నాన్నగారు త్వరలోనే నీకు జాబు వ్రాసెదరు.  మంగళం మహత్.”   

మా వదినగారు శలవిచ్చినట్టు ఇంకొక 10 రోజుల తర్వాత మానాన్నగారు  ఉత్తరం రాశారు.  "జూన్ 28, 1970  తారీఖున వివాహ మహోత్సవం నిర్ణయింపబడినది. కాబట్టి నువ్వు వచ్చి ఆ మూడు ముళ్ళూ వేసి కృతార్ధుడవు కమ్ము. కనీసం ఓ నాలుగు రోజుల ముందు అఘోరిస్తే కార్యక్రమములు అన్నీ సక్రమంగా జరుపుకొంటాము. అమ్మాయి ఫోటో పంపుతున్నాను. చూసి ఆనందించు" అని సారాంశము.  

అమ్మాయి ఫోటో లో బాగానే ఉంది. పెళ్ళిచూపులు లేకుండా  అంటే అమ్మాయిని నేను చూడకుండా నాపెళ్ళి నిశ్చయం అవటం బాధిస్తున్నా, మా నాన్న గారు కొంచెం అగ్నిహోత్రావధాన్లు టైపు కాబట్టి, నేనేమన్నా చెల్లదు కాబట్టి , గత్యంతరం లేక ఒప్పుకున్నాను. ఒప్పుకోక పోతే జరిగేది కూడా నాకు తెలుసు. 

ఆ అమ్మాయి చేత ఏ కమండలానికో తాళి కట్టించేసి, జోర్హాట్ తీసుకొచ్చి ఆ కమండలాన్ని  నామెడలో వేసి , ఆ అమ్మాయిని నానెత్తి  మీద  కూర్చోపెట్టి భీమవరం వెళ్లిపోతారు. కాదనే ధైర్యం నేను చేయలేను కాబట్టి ఓ వారం రోజుల ముందుగా నేను భీమవరం చేరిపోయాను, అవునండీ పెళ్లి చేసుకోవటానికే


(ఇది మొదటి మాటు 11/01/2011 న ప్రచురించ బడింది.)          

పశుపతి పెళ్లి చూపులు


నమస్కారమండి లహరి గారూ. నా పేరు పశుపతి.


నమస్కారమండీ. నేనూ మిమ్మల్ని గుర్తు పట్టాను కానీ చిన్న సంశయం తో పలకరించలేదు.

ఫరవాలేదు లెండి. నేను మీ చిత్రం చాలా మాట్లే చూసాను కనుక వెంటనే గుర్తు పట్టాను.

చాలా మాట్లు అంటే ఎన్ని మాట్లు చూసారు?  చిత్రం అంటే ఫొటోనా? నవ్వుతూనే అడిగింది లహరి. 

అవునండి. ఓ పది పన్నెండు మాట్లు చూసాను మీ చిత్రం. మా నాన్నగారు పంపించినప్పుడు మొదటి మాటు, మా అక్కయ్యకు చూపించి నప్పుడు రెండో మాటు, మా బావగారికి చూపించి నప్పుడు మూడో మాటు. నా చిత్రం పక్కన మీది పెట్టి రెండు సరిపోయాయా అని కూడా చూసాను లెండి.

మాచింగ్ అయ్యాయా?

ఆ ఆయ్యాయండి. మా నాన్నగారికి మన జాతకాలు కూడ సరిపోయాయి.

జాతకాలు మా నాన్నగారూ చూపించారండి. పెళ్లి చూపులకి డేట్ ఫిక్స్ చేస్తామన్నారు. ఆ లోపుల మీతో ఒక మాటు మాట్లాడదామని  మిమల్ని ఇలా రమ్మన్నానండి. అంది లహరి.

లోపలి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం రండి. అన్నాడు పశుపతి.

రెస్టారెంట్ లో ఒక మూల సీట్స్ చూసుకొని కూర్చున్నారు ఇద్దరూ.

మీరు ఫోటోలో చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పుడు ఇలా సరదాగానే ఉన్నారు. 

నాకు ఫోటో ఫోబియా ఉందండి. ఎవరైనా ఫోటో తీస్తుంటే నేను బిగుసుకుపోతాను. నవ్వలేను. విశ్వప్రయత్నం చేసి నవ్వాననుకుంటాను కానీ అదేమిటో దివాలా తీసిన వాడి మొహంలా వచ్చేస్తుందండి.

మీకు తెలియకుండా ఎవరినైనా తియ్యమనకపోయారా ?
                                              
భలేవారే. ఈ విషయంలో నాకు అతీంద్రియ శక్తి ఉందనుకుంటానండి. అంతెందుకు నడుస్తున్నప్పుడు ఒక ఏభై మీటర్ల దూరం లో  ఫోటో స్టూడియో ఉంటే ఇక్కడ నుంచే నేను బిగుసుకు పోతానండి. ఎవరి చేతిలోనైనా కెమేరా చూసినా నా పరిస్థితి డిటో అండి. వెంటనే  వారికి దూరంగా వెళ్ళి పోతానండి.  నన్ను ఫోటో తీసిన  కెమేరా కానీ, కెమేరా ఉన్న సెల్ ఫోన్ కానీ మళ్ళీ  పనికి రాదండి.

అదేమిటండి.  అల్లా ఎల్లా అవుతుంది. మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు

నిజమండి. ఆ తరువాత ఆ కెమేరా తో ఏం తీసినా కట్టెలాగ బిగుసుకు పోయినట్టే పడతారు మనుషులు. ఒక్కోమాటు  వీడి తల వాడికి వాడిది మరొకడికి వెళ్ళి పోతుందండి. కెమేరా లోనే ఏదో తేడా వస్తుందండి.  నమ్మండి.

లహరి నవ్వింది. మనోహరంగా నవ్వింది అనిపించింది పశుపతికి. అదే చెప్పాడు.
మీరు నవ్వితే ఇంకా బాగుంటారండి లహరి గారూ.
లహరి సిగ్గుపడింది. ఇంతలో సర్వారావు వచ్చాడు.

హిహిహి . ఏం కావాలండీ. కాఫీ సరిపోతుందాండి? కాఫీ తరువాత  ఐస్ క్రీం ఏమైనా తీసుకుంటారా?

అదేమిటోయ్ సర్వేశ్వర శర్మా అల్లా అడిగావు? పశుపతి అడిగాడు.

ఈ వరుసలో ఉన్న మూడు టేబుల్స్ ప్రేమికుల టేబుల్స్అండి. మద్యాహ్నం రెండు నుంచి నాలుగు దాకా కూర్చుని కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోతారండి. వాళ్ళు వచ్చిన పావు గంటకి వస్తామండి ఆర్డర్ కోసం . వాళ్ళు  ఆర్డరిచ్చిన అరగంట కి మేము కాఫీ తెస్తామండి. తెచ్చిన అరగంటకి వాళ్ళు తాగుతారండి. ఇంకో పావుగంట తరువాత మేము బిల్లు, సోంపు పళ్ళెం తెస్తామండి. ఓ పావుగంట సోంపు నమిలి బిల్లు చెల్లించి  వెళ్ళిపోతారండి.

మధ్యలో ఐస్ క్రీం ఎందుకు అడిగింది లహరి.

అదాండీ. వాళ్ళు త్వరగా తాగేస్తే  ఫిల్ ఇన్ ది బ్లాంక్ లాగ ఐస్ క్రీం మేమే తెస్తామండి. బిల్లు వాళ్ళే కట్టాలండి.

లహరి గారూ నాకు ఆకలేస్తోంది. మధ్యాహ్నం భోజనం చేయలేదు నేను. మీరేమైనా తింటారా?

నేను భోజనం చేసే వచ్చానండి. మీరు భోజనం చేసేలోపు నేను కాఫీ తాగి ఐస్ క్రీం తింటాను. నవ్వుతూ అంది లహరి.

లహరి గారా ఇంకా గారూ లోనే ఉన్నారా  అంటు ఆశ్చర్యపడ్డాడు సర్వాశ్రీ. ఇంకా మొగ్గ తొడగని ప్రేమా అని ప్రశ్నార్ధకం వదిలాడు. 
 
పశుపతి లహరి, లహరి పశుపతి,  hmm  పేర్లకి శృతి లయలు  కలిసినట్టు లేవండి. అబ్బాయిగారు పేరు మార్చుకుంటే బాగుంటుందేమో అని ఓ సలహా కూడా కక్కేసాడు సర్వానంద్.

లహరి నవ్వుతోంది పగలబడి నవ్వుతోంది. మైమరచి చూస్తున్నాడు పశుపతి లహరిని. పదిహేను సెకన్లలో తేరుకుని ఐ యాం సారీ అంది పశుపతి తో. పశుపతి చిరునవ్వు తో లహరి చెయ్యి మృదువుగా నొక్కాడు.

ఇదిగో సర్వార్కర్ నువ్వు నాకు ఒక ప్లేటు ఇడ్లీ ఆ తరువాత  మసాలా దోస,  అమ్మగారికి ఓ కాఫీ పట్టుకురా. అమ్మగారికి ఐస్ క్రీం తెచ్చినప్పుడు నాకు కాఫీ తీసుకురా. త్వరగా నాకు అంత టైం లేదు.
ఎస్ సర్ అంటూ సర్వారాం వెళ్లాడు.

మీ పేరు సర్వానంద్ కి కూడా తెలుసునా? చూసారా మీ భాష నాకు కూడా వచ్చేస్తోంది. సర్వానంద్ అని.

వాడు నా సహాధ్యాయి చిన్నప్పుడు. పదో క్లాసు దాకా కలిసి చదువుకున్నాం. అర్జంట్ పనులుండడం వల్ల వాడు అక్కడ ఆగిపోయాడు. పనీ పాడు లేక నేను యం. టెక్  చేసాను.

ఏం, ఆర్ధిక పరిస్థితుల వల్ల అతను ఉద్యోగంలో చేరాడా?

వాళ్ళ నాన్న గారు  శాస్త్రి కేటరర్స్  అనే పరిశ్రమ స్థాపించారు. రెండేళ్లయినా అది వారి ఇంట్లోనే ఉండిపోయింది. అప్పుడు ఆయన వాళ్ళ వీధిలోనే ఉండే, పనీ పాడు లేని సంఖ్యా, నామ శాస్త్ర,  జ్యోతిషవేత్తని సంప్రదించారు. వారు మూడు గుణకారాలు, ఆరు ప్లస్సులు చేసి శాస్త్రి అండ్ కేటర్రర్స్ అని పేరు మార్చమన్నారు. ఆయన పేరు  మార్చిన రెండేళ్లలో వీధిన బడ్డారు. వీడు మా వూళ్ళో  హోటల్ లో వైటర్గా చేరాడు. దిన దిన ప్రవర్ధమానుడగుచూ అప్పుడెప్పుడో  ఇలా ఇక్కడ దర్శనమిచ్చాడు. 
   
మీరేమి అనుకోక పొతే  ఇలాంటి  పేరు నేను మొదటిమాటు వినడం. చాలా పాత పేరు. పేరు మార్చుకోవాలని మీకు ఎప్పుడూ అనిపించలేదా? పెళ్లి చూపులకు ముందు మిమ్మల్ని చూడాలనుకున్న కారణాలలో ఇది ఒకటి.  పాత పేరు లాగ మీ భావాలు కూడా అల్లాగే ఉంటాయేమో నని తెలుసుకుందామని,  కలుద్దాం అన్నాను,   అంది లహరి నిర్మొహమాటంగా.

పశుపతి లేచి నుంచున్నాడు. తూర్పు ఎటువైపో మీకు తెలుసా అని అడిగాడు లహరిని.

తూర్పా ఎందుకు? అని ఆశ్చర్యంతో  అడిగింది. నాకూ సరిగ్గా తెలియదు.

ఇంతలో సర్వేశ్వరుడు మంచి నీళ్ళు పట్టుకు వచ్చాడు.

నాయనా సర్వా తూర్పు ఎటు?  నీకు తెలుసునా?

తూర్పు ఎటో తెలియదు కానీ దక్షిణ తెలుసునండి.

పోనీ అదైనా చెప్పు. సూర్యుడి ముందు నులుచుంటే కుడి వైపు దక్షిణం అని ఎవరో చెప్పారు.

ఆ దక్షిణం నాకూ తెలియదండి. మీ పర్సులో ఉండేది,  మీరు బిల్లు చెల్లించిన తరువాత నా చేతిలో పెట్టే దక్షిణ,  ఆంగ్లమున టిప్ అనబడేది   మాత్రమే నాకు  తెలుసు.

మళ్ళీ నవ్వింది లహరి. పశుపతి ఆమె కేసే చూసాడు.

'చూపులు కలిసిన శుభవేళా నేనెందుకు ఇక్కడ’ అంటూ సర్వోత్తమరావు వెళ్ళిపోయాడు.
లహరి కొద్దిగా సిగ్గుపడింది.

సిగ్గు పడితే మీరింకా బాగుంటారండి అంటూ పశుపతి ఆశ్చర్యపడిపోయాడు.

తూర్పు ఎందుకో చెప్పలేదు అంటూ మాట మార్చింది లహరి.

తూర్పు తిరిగి దండం పెడదామని అంటూ కూర్చున్నాడు పశుపతి.

దండమా? ఎందుకు? అని ఏక పద ప్రశ్నలు రెండు వేసింది లహరి.

పేరు మార్చుకోమంటేనూ. ఈ పేరు వెనక్కాల హైదరాబాద్ లో  4 ఫ్లాటులు, ఒక అరడజను ప్లాటులు, మా వూళ్ళో  నాల్గెకరాల కొబ్బరి తోట, ఇంకో సంఖ్య ఎక్కువ  ఎకరాల మాగాణి, ఇంకో నాల్గైదు ప్లాటులు,    ఐదు వందల గజాల్లో ఎనిమిది గదుల ఇల్లు, ఇంటి చుట్టూ పూల మొక్కలు, సరిగ్గా తెలియదు కానీ ఓ పాతిక లక్షల డిపాజిట్స్ ఉన్నాయండి.  పేరు మారిస్తే ఇవన్నీ నాకు హుష్ కాకి అయిపోతాయండి.

పేరు మారిస్తేనా? అంటూ ఆశ్చర్య పడిపోయింది లహరి.

మా నాన్న గారి పేరు వినాయక శాస్త్రి. వారి తండ్రి గారి పేరు పశుపతి ఇవే పేర్లు మా ఇంటిలో ఆరు  తరాలుగా వస్తున్నాయి. ఆరు తరాలుగా మా ఉంట్లో ఒకడే కొడుకు. ఆరుతరాల వెనక వినాయక శాస్త్రి గారికి చాలాకాలం సంతానం కలుగకపోతే, పశుపతిని ఆరాధించారుట. వారి కృపా కటాక్షాల వల్ల పుట్టిన ఒకే ఒక మగ సంతానానికి పశుపతి అని పేరు పెట్టారుట. వారు పుట్టిన వేళా విశేషం వల్ల ఆ వినాయక శాస్త్రి గారికి కలిసివచ్చిందిట. ఇలా పేర్లు పెట్టడం వల్లే ఇప్పటికి ఇంత ఆస్తి సమకూరిందని మా నాన్నగారి ధృడ విశ్వాసం. అందుచేత పేరు మార్చడం కుదరదు. అంతే కాదు నాకు కలిగే మొదటి మగ సంతానానికి వినాయక శాస్త్రి అనే పేరు పెట్టాలి. లేకపోతే మా వంశ గౌరవం, ప్రతిష్ట మంట కలిసిపోతాయని మా పితాశ్రీ శాసనం లిఖించారు. సుమారు నాల్గైదు కోట్ల ఆస్థిని,  పేరు కోసం వదులుకునే ఉద్దేశ్యం నాకు లేదని మా సర్వేశ్వరుడి సాక్షిగా మనవి చేసుకుంటున్నాను, అన్నాడు పశుపతి ఇడ్లీ  ప్లేటు తనముందు,  కాఫీ కప్పు లహరి ముందు పెడుతున్నసర్వా రాయుడిని చూసి.

మధ్యలో నా పేరెందుకు కానీ, పేరు కోసం ఆవిడ మట్టుకు ఇంత ఆస్థిని వదులుకోమని చెప్పరు. కదండీ లహరి గారూ అంటూ వెళ్ళిపోయాడు, సర్వా పుంగవుడు.  

అన్నట్టు, మీకు వంటా, వార్పూ లలో ప్రవేశం ఉందా అని అడిగాడు పశుపతి, ఇడ్లీ ముక్క నోట్లో పెట్టుకుంటూ. 

సమాధానం చెప్పటానికి లహరి సంశయించింది. లేదండి నాకు వంట చేయడం రాదు.

ఫరవాలేదు లెండి. మా అక్కయ్య కూడా పెళ్ళికి ముందే నేర్చుకుంది వంట చేయటం అని నవ్వాడు పశుపతి. 
నాకు బాగా వచ్చండి వంట చేయటం. గత రెండేళ్లగా ఉద్యోగం చేసుకుంటూ రాత్రికి వంట చేసుకుంటున్నానండి. పగలు ఆపీసు కేంటిన్ లో తింటానండి అని కూడా చెప్పాడు.

వంట చెయ్యడం మీ హాబీ అన్నమాట అంది లహరి.

కాదండి. హోటల్ భోజనం చెయ్యలేక వండుకుంటున్నానండి.

రెండు మూడు నిముషాలు ఈయన ఇడ్లీ తినడం లోనూ ఆవిడ కాఫీ తాగడం లోనూ ఏకాగ్రత చూపించారు.

నాకు క్రికెట్ అంటే ఇష్టం. మాచిలన్ని టివిలో చూస్తాను. నేను టేబుల్ టెన్నిస్ ఆడతానండి. మీరేమైనా ఆడతారా అని అడిగింది లహరి.

ఆ, బాగానే ఆడతానండి అబద్ధాలు. జవాబు చెప్పాడు పశుపతి. లహరి నవ్వింది.

ఎటువంటి అబద్ధాలు?  ఉదాహరణకి చెప్పండి అని అడిగింది.

ఇందాకా చెప్పాను కదండీ, నాలుగు కోట్ల ఆస్థి అని. కాదండి,  అందులో మా అక్కయ్యకి సగ భాగం ఉందండి. నవ్వుతూనే చెప్పాడు పశుపతి.

ఇంత ఆస్థి ఉండి కూడా, మాలాంటి సామాన్య కుటుంబీకుల సంబంధం చూస్తున్నారేమిటి? అడిగింది లహరి.

నవ్వేసాడు పశుపతి. పెళ్ళిళ్ళ పేరయ్య,  ముందు కొన్ని ఉన్నవాళ్ళ సంబంధాలే తెచ్చాడండి. ఆ ఇళ్లలో వ్యక్తుల ప్రవర్తన, మాటతీరు మా నాన్నగారికి, నాకు కూడా  నచ్చలేదండి. ఆడంబరాలు, షో ఎక్కువ అనిపించిందండి. ఇంకా చూస్తూనే ఉన్నామండి. నెల రోజుల క్రితం, మీ బాబయ్య గారు మీ వివరాలు పేరయ్య గారికి ఇచ్చారు కదండీ. అక్కడే ఉన్న మా నాన్నగారు మీ ఫోటో చూసి, తరువాత  మీ కుటుంబం గురించి వాకబు చేసి,   పేరయ్య గారిని మీ ఇంటికి పంపారు. అదండి సంగతి. ఏమీ దాచకుండా చెప్పాడు పశుపతి.

మీ గురించి కూడా మా బాబయ్య వాకబు చేసారండి చెప్పింది లహరి.

ఇంకేం ఇద్దరూ ప్రొసీడ్ అయిపోండి. పబ్లిక్ గార్డెన్స్, సినిమాహాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నాయి అన్నాడు సర్వయ్య దోశ  పశుపతి ముందు పెడుతూ.

సర్వాసేన్ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావోయ్ అన్నాడు పశుపతి. మాట్లాడకుండా వెళ్ళిపోయాడు సర్వా పండిట్.

ఇతను మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు. మీరు తాత్సారం చేస్తే ఎవరో ఇంకో అదృష్టవంతురాలు ఎగరేసుకు పోతుంది ఇతనిని,  అని సలహా ఇచ్చాడు లహరికి,  దోశ తిని చెయ్యి కడుగుకుందుకు పశుపతి వెళ్ళినప్పుడు,  కాఫీ,  ఐస్ క్రీం తెచ్చిన సర్వాసింగ్.

వీళ్ళ ఇంట్లో ఆచార వ్యవహారాలు, పూజా పునస్కారాలు  ఎక్కువ అని తెలిసింది.  కట్నం వద్దన్నా,   కలిగిన వాళ్ళు,    నేను సర్దుకు పోగలనా అనే అనుమానం అంది లహరి. 

మరేం ఫరవాలేదండి. ఈయన తల్లి తండ్రులు మంచివారండి. వారి వ్యవహారాలు ఇతరులకి ఇబ్బంది కలిగించవండి. భేషజాలు అసలు లేవండి. వాళ్ళ అల్లుడు గారు అరపేంట్ల ఆధునికుడే నండి. హాయిగా కలిసిపోయారండి. ఈయనకి కూడా భక్తి ఉంది కానీ పూజలు గట్రా ఎక్కువుగా అలవాటు కాలేదండి  చెప్పాడు సర్వాయరప్ప.    

ఇంతలో పశుపతి వచ్చి కాఫీ సేవనం మొదలుపెట్టాడు. లహరి ఐస్ క్రీం చప్పరించ సాగింది.

కౌంటర్ దగ్గర ఏదో  కలకలం మొదలయింది. ఒకామె కుక్కని తీసుకు వచ్చింది. “కుక్కలని అనుమతించము” అని చెప్పాడు కౌంటర్ లో కూర్చున్న కేషియర్. “ఇది కుక్క కాదు. జర్మన్ షెప్పర్డ్  డాగ్” అంది ఆమె. “కాలభైరవుడు దిగి వచ్చినా అనుమతించేది లేదు. మీ కారులో ఉంచి రండి” అన్నాడు కేషియర్.  “మా కిట్టూకి ఐస్ క్రీం అంటే ఇష్టం. అందుకే తీసుకు వచ్చాను”   అంది ఆమె. “సారీ మేడం,  నేనేం చెయ్యలేను. ఇక్కడ డాగ్స్ కి కూడ అనుమతి లేదు” అన్నాడు  కేషియర్.   

ఇంతలో కిట్టూ గారు  ముక్కు ఎగ పీల్చారు. ఒక్క ఉదుటున జంప్ చేసారు. అప్రయత్నంగా ఆమె గొలుసు వదిలేసింది. వేగంగా కిట్టూ గారు రెండు మూడు టేబుల్స్ దాటి లహరి ముందున్న ఐస్ క్రీం మీదకు లంఘించారు. భయంతో లహరి రెండు గెంతులు గెంతి, అప్పటికే నుంచుని కుక్కని ఆదలించే ప్రయత్నం చేస్తున్న పశుపతి మీద పడి ఘట్టిగా పట్టుకుంది. అప్రయత్నంగా పశుపతి చేతులు లహరి చుట్టూ పడ్డాయి.  తేరుకొని,  కిట్టూని పట్టుకుని యజమానురాలు బయటకు తీసుకెళ్ళింది, లహరికి మరీ మరీ సారీ చెపుతూ. భయంతో బిర్ర బిగుసుకు పోయిన లహరి ఇంకో అరనిముషం పశుపతిని పట్టుకుని అలాగే ఉంది. 

ఆ తరువాత అతన్ని వదిలి “సారీ అండి నాకు కుక్కలంటే బాగా భయం” అంది. 

“నాకూ కుక్కలంటే భయమేనండి. ఈ వేళే,  మీరు పక్కనుంటే ధైర్యం వచ్చింది” అని నవ్వాడు పశుపతి.

బిల్ పే చేసి సర్వాబ్రహ్మకి దక్షిణ ఇవ్వకుండానే బయటకు వచ్చారు. 

ఈ మీటింగ్ మీకు  అసంపూర్తిగానే మిగిలింది అనుకుంటాను. మీ నెక్స్ట్ కాల్ కోసం ఎదురు చూస్తాను అన్నాడు పశుపతి. 

మీటింగ్ సంతృప్తి గానే ముగిసింది  నాకు. మీరు OK అంటే  మా నాన్నగారు  మీ నాన్నగారిని కలవడానికి ఈ వారంలో వస్తారు. అంది సిగ్గు పడుతూ లహరి. 

                                   
 



   
 

స్వయంకృతం

పాపం ప్రద్యుమ్నుడికి ఈ మధ్యన తీరుబడి ఎక్కువయింది. పాత విషయాలు కొన్ని గుర్తుకు వస్తున్నాయి. వేసిన తప్పటడుగులు తెలుసుకుంటున్నాడు.

పెళ్ళైన కొత్తలో పాపం ప్రద్యుమ్నుడికి పెళ్ళాం ప్రభావతి అంటే బోలెడు ప్రేమ ఉండేది. అప్పుడప్పుడు అది గోదావరి వరదలాగా పొంగిపోయేది. ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు పాపం ప్రద్యుమ్నుడు.

పెళ్ళైన కొత్తలో ప్రభావతి ప్రద్యుమ్నుడిని ఏమండీ అని పిలిచేది. మీరు అని సంబోధించేది. ప్రేమగా, గౌరవంగా , అభిమానంగా, ఆప్యాయంగా, మృదు మధురంగా, శ్రావ్యంగా   అలా పిలిచేటప్పటికి ప్రద్యుమ్నుడు ఆనందోత్సాహాలతో పొంగిపోయేడు.   ఎందుకంటే “ఏమండీ, మీరు” అని ప్రద్యుమ్నుడిని పిలిచిన ప్రప్రధమ వ్యక్తి ప్రభావతి. చిన్నప్పటి నుంచి, ఇంట్లోనూ, బయటా కూడా బంధు మిత్రులు, పరిచయస్తులు కూడా “ఒరేయ్, అరేయ్” అనే పిలిచేవారు. స్కూల్లో కొంతమంది మేష్టార్లు ప్రేమ ఎక్కువై, “శుంఠా, కుంకా” అని కూడా పిలిచేవారు.  కాలక్రమేణా వయసు పెరిగే కొద్ది “పద్దూ, పద్దుగాడు” లాంటివి స్థిరపడ్డాయి. ప్రేమ  ఎక్కువైనప్పుడు, జననీజనకులు, సోదర సోదరీమణులు  పద్దూ గాడిదా అని కూడా అనేవారు. 

ప్రభావతి పిలిచిన పిలుపుకి  ప్రద్యుమ్నుడు ఉప్పొంగిపోయి కృతజ్ఞతా భావంతో  ఒక అంగుళం వంగిపోయాడు. ప్రద్యుమ్నుడు ప్రభావతికి లొంగిపోవడానికి ఇక్కడే అంకురార్పణ జరిగింది.

జోర్హాట్ లో కాపురం పెట్టిన కొత్తలో ప్రద్యుమ్నుడి ఇంట్లో , మిక్సి, గ్రైండర్ ఇత్యాదులు లేవు. రుబ్బురోలు కూడా మూడు నెలల తరువాతే వచ్చింది. అప్పటిదాకా ప్రభావతి ఉదయం ఉపాహారంగా ఉప్మానే వడ్డించేది. సూజీ, గోధుమ రవ్వ, సేమ్యా, బ్రెడ్, అటుకుల  ఉప్మాలు చేసేది. రకరకాల ప్రయోగాలు కూడా చేసేది. అప్పటికి ఇంకా నియంతృత్వ పోకడులు అలవాటు కాకపోవడం వల్ల ప్రభావతి  ముందు హెచ్చరికలు చేసేది. ఈ వేళ గోధుమ రవ్వ + సేమ్యా ఉప్మా అని ప్రకటించేది. ఈ క్రమంలోనే టమోటా ఉప్మా , కేప్సికం, కేరట్, బటానీలు, బంగాళాదుంప, మిక్సెడ్ కూరల ఉప్మాలు కూడా వండి  వడ్డించింది. 

“ఆహా, ఈ పతివ్రతా తిలకం ఇంత కష్టపడి, నాకు రుచిగా వండి పెట్టాలని ఎంత తాపత్రయ పడుతోంది”  అనే ఉదార భావం ప్రద్యుమ్నుడిలో మొలకెత్తి, దయ, జాలి, కరుణ, ప్రేమ, అభిమానం ఇత్యాదులన్నీ నీరు, ఎరువు పోయగా ఆ మొలక వృక్ష మయింది. అప్పుడు ప్రద్యుమ్నుడు ఇంకో రెండు అంగుళాలు వంగాడు. 

ఇంకో పదిరోజుల్లో రుబ్బురోలు ప్రద్యుమ్నుడి ఇంట్లో గృహాప్రవేశం చేసింది.  జోర్హాట్లో  రుబ్బురోలు దొరకదు.  వాయుసేన లో పని చేసే ఒక తమిళ సోదరుడు ట్రాన్స్ఫర్ అయి వెళుతూ రుబ్బురోలు దానం చేశాడు ప్రద్యుమ్నుడికి ఒక తెలుగు మిత్రుడి సిఫార్సు తో.         

 ప్రభావతి ఆనందించినట్లు కనిపించినా ప్రద్యుమ్నుడు కడుంగడు ముదావహుడు అయ్యాడు, ఉప్మా పర్వం అయిపోతుంది గదా యని. పాపం ప్రభావతి కూడ ఉత్సాహంగానే ఇడ్లి, దోశ, మినపట్టు, పెసరట్టు, అప్పుడప్పుడు ఉప్మా సహిత పెసరట్టు కూడా వండి వడ్డించేది.

ఒక ఆదివారం ఎప్పటి లాగానే 8 గంటలకి నిద్ర లేచాడు ప్రద్యుమ్నుడు. వరండా లోంచి శబ్దాలు వినవస్తున్నాయి. ఏమిటా అని శ్రద్ధగా విన్నాడు. రుబ్బురోలులో ఏదో రుబ్బుతున్న చప్పుడు.

“ఆదివారం పొద్దున్నే ఏమిటి రుబ్బుతోంది ప్రభావతి”  అని ప్రశ్నించుకున్నాడు. సమాధానం కోసం వరండాలోకి వచ్చాడు.

ప్రభావతి రుబ్బురోలు ముందు కూర్చుని పెసర పప్పు రుబ్బుతోంది. రోలు ముందు ప్రభావతిని చూడగానే ఎప్పటిలాగానే ప్రద్యుమ్నుడికి జాలి పుట్టింది. జాలితో ప్రేమ పొంగుకు వచ్చింది. పొంగు ప్రవాహమయ్యే సూచనలు కనిపించాయి.

“రుబ్బు రోలు తీసుకు వచ్చి ఎంత పాపం చేశాను. ఈ నారీ శిరోమణి రెండు మూడు రోజుల కొక మారు ఈ రుబ్బుడు కార్యక్రమమునకు ఉపక్రమించు చున్నది కదా. దీనికంతయు కారణము నా నాలికయే కదా.” అని విచారించాడు.

“ప్రభావతి వంటి పిల్ల లేదోయ్ లేదోయ్

రోజూ  పప్పు రుబ్బిస్తే నన్ను

వదిలి పోతుందోయ్   వదిలి పోతుందోయ్”   అని పాడాడు ప్రద్యుమ్నుడు.

“నండూరి వారి అభిమానులు  కర్ర పుచ్చుకుని వస్తారు ఆయన పాటలని ఖూనీ చేస్తే” అని నవ్వింది ప్రద్యుమ్నుడి ఎంకి.

“మీరు దంతధావనాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని వస్తే పెసరట్లు వేసుకుందాం. ఈ లోపు చట్నీ కూడా చేసేస్తాను. ఉప్మా తయారయి పోయింది” అని చెప్పింది ప్రభావతి.

మళ్ళీ జాలి పొంగుకొచ్చింది ప్రద్యుమ్నుడికి.  జాలి తో పాటు ప్రేమ ప్రవాహం కూడా.

“చట్నీ వద్దు పతివ్రతా తిలకమా, పెసరట్టు ఉప్మా  తో బాగానే ఉంటుంది. అయినా వారం రోజుల క్రితం కొన్న కాశీనాథ్ భట్టాచార్య వారిచే తయారు జేయబడిన  జింజర్ కా పికెల్ ఉన్నది కదా” అన్నాడు ప్రద్యుమ్నుడు.

“ అది పికెల్ కాదు బెల్లం పాకం” అంది ప్రభావతి.

“గారెలలోకి, పెసరట్లకి కూడా బెల్లం పాకం బాగానే ఉంటుంది కదా భార్యామణీ” అన్నాడు ప్రద్యుమ్నుడు.

“మీ మొహం. మీరు మొహం కడుక్కు రండి. ఈ లోపు నాకు బోల్డు పనులున్నాయి” అని విసుక్కొంది ప్రభావతి.            

మళ్ళీ జాలి పొంగుకొచ్చింది. ఇంకో రెండు అంగుళాలు  వంగాడు. నడ్డి, తల భూమికి సమాంతరంగా వచ్చేస్తున్నాయేమో నని అనుమానం వచ్చింది ప్రద్యుమ్నుడికి. ఎంత ప్రేమ పొంగినా, ఇక మీద వంగకూడదు అని స్వగతంలో నిర్ణయించుకున్నాడు. 

ఇంకో  పదిహేను, ఇరవై  రోజులు రుబ్బురోలు పర్వం సలక్షణంగానే నడిచింది.   ఈ మాటు జాలికి చోటు ఇవ్వలేదు ప్రద్యుమ్నుడు, ప్రయత్నపూర్వకంగానే, కష్టంగానైనా. 

ఆ తరువాత వరుసగా నాల్గైదు  రోజులు ఉదయం ప్లేటులో ఉప్మా దర్సనమిచ్చింది, ఈ మధ్యనే తెప్పించిన  ప్రియా ఆవకాయతో సహా.  ఆరవ  రోజున కూడా ఉప్మా చూసి ప్రద్యుమ్నుడు, యదాలాపంగానే,  తెలివితక్కువగానే అడిగాడు ప్రభావతిని,

 “ప్రభా డియర్, ఏమైంది ఒంట్లో బాగాలేదా? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళనా?” అని.

“డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత సమస్య ఏమీ లేదు. కుడి భుజం నొప్పిగా ఉంది. కొంచెం వాచిందేమో కూడా.” అని జవాబు ఇచ్చింది ప్రభావతి కాఫీ ఇస్తూ.

ప్రద్యుమ్నుడికి సమస్య అర్ధం అయీ అవనట్టుగా ఉంది.  రుబ్బుడు కార్యక్రమంలో చెయ్యి నొప్పి పెట్టిందా అనే అనుమానం పొడచూపింది మనసులో.  కాఫీ తాగేసి ఆఫీసు కెళ్ళిపోయాడు.  వెళుతూ వెళుతూ ఓ సలహా కూడా ఇచ్చాడు.

“ఎందుకైనా మంచిది. ఒక మాటు ప్రతిమ దగ్గరకు వెళ్ళు. నేను టెలిఫోన్ చేసి చెబుతాను ప్రతిమకి”  అని.

“అఖ్ఖర్లేదు. ప్రతిమతో నాకు పరిచయం బాగానే ఉంది. మీకు అంతగా ప్రతిమతో మాట్లాడాలనిపిస్తే మాట్లాడుకోండి. నాకభ్యంతరం లేదు.   నా సంగతి సాకుగా చూపి మాట్లాడఖ్ఖరలేదు.” 

Dr. ప్రతిమ మెడికల్ ఆఫీసర్ గా పని చేస్తోంది వాళ్ళ ఆఫీసులోనే.  పెళ్ళికి ముందు  సుమారు ఆర్నెల్లు,   ప్రద్యుమ్నుడు ప్రతిమ చుట్టూ తిరిగేవాడని ప్రభావతికి తెలిసింది. అంతస్తుల్లో అంతరాలు ఎక్కువగా ఉన్నందున ప్రద్యుమ్నుడి ప్రయత్నాలు భంగమయ్యాయని కూడా తెలిసింది. ప్రతిమ తండ్రిగారికి, రెండు తేయాకు తోటలు ఉన్నాయని కూడా తెలిసింది ప్రభావతికి. కాలక్షేపం కోసమే ఉద్యోగం చేస్తోందని, ఆమె  లండన్ వెళ్ళే ప్రయత్నంలో ఉందని కూడా తెలిసింది. ఆమెకు కాబోయే భర్త అక్కడే ఉన్నాడని తెలిసి ప్రద్యుమ్నుడు ప్రేమ ప్రయత్నం విరమించుకున్నాడని కూడా భోగట్టా సేకరించింది, ప్రభావతి. 

ఇంకో వారం పది రోజులు ఇలాగే గడిచిపోయాయి. ఉప్మా, బ్రెడ్ జామ్, కారన్ఫ్లేక్స్ పరంపర కొనసాగింది. ప్రద్యుమ్నుడు మాట్లాడకుండా తిని వెళ్లిపోయేవాడు. “తనకే ఇవి తినడం విసుగొచ్చి , ఇడ్లీ, దోసల ప్రకరణం మళ్లీ ప్రభావతి మొదలు పెడుతుందేమో” నని ఆశగా ఎదురు చూస్తున్నాడు ప్రద్యుమ్నుడు.   

ఒక ఆదివారం ప్రద్యుమ్నుడుకి  ఉదయం నిద్రలేవగానే వరండాలో రుబ్బుడు శబ్దం శ్రావ్యంగా వినిపించింది. విజయ దరహాసం ప్రద్యుమ్నుడి పెదవుల మీదకు పాకింది. లేచి వరండాలోకి వచ్చాడు. పెసరపప్పు రుబ్బుతున్న ప్రభావతి ముగ్ధ మనోహరంగా కనిపించింది ప్రద్యుమ్నుడి కళ్ళకి.

“లేచారా?  నేను లేచేటప్పటికే 7-30 అయింది. పెసరట్టు ఉప్మా చేసుకుందాం. ఆప్పుడే 8 దాటింది.  కొంచెం ఈ కొబ్బరి కోరండి. ఇంకా ఉప్మా కూడా చెయ్యాలి.” అని అంది.

ప్రద్యుమ్నుడు ముందు జాగ్రత్తగా అన్నాడు,

“ఇంకా మొహం కడగలేదు. అయినా పెసరట్టు ఉప్మాకి చట్నీ అవసరం లేదులే” అన్నాడు సామరస్య పూర్వకంగానే.

“ఎంత, అయిదు నిముషాల పని. ఇది చేసేసి మీ కార్యక్రమాలకి వెళ్ళండి.” బతిమాలే ధోరణి లోనే అంది అనుకున్నాడు ప్రద్యుమ్నుడు.

“సరేలే కొబ్బరే కదా కోరెస్తే సరి. ఈ మాత్రం సహాయం చేయకపోతే ఎలా? ” అని కూడా అనుకున్నాడు.  

కోరం ముందు కూర్చుని కొబ్బరి చిప్ప పట్టుకొని కోరడానికి  ఉపక్రమించాడు ప్రద్యుమ్నుడు.   

ఇంతలో ప్రభావతి లేచి, వంటింట్లోకి వెళ్లి  ఐదు నిముషాల తర్వాత బయటకు వచ్చింది. మొహం సబ్బుతో తోమింది అనుకున్నాడు ప్రద్యుమ్నుడు.

“మొహం జిడ్డుగా ఉంది. ఆదివారం కదా ఎవరైనా వస్తే బాగుండదు” అంటూనే బెడ్ రూం లోకి వెళ్లింది. ఇంకో ఐదు నిముషాల తరువాత వచ్చింది. ఈ లోపునే ప్రద్యుమ్నుడు కొబ్బరి కోరడం పూర్తి చేసేశాడు. ప్రభావతి చూసి.

“బాగానే కోరారండి. సన్నగా మెత్తగా, నా కంటే బాగా ” అంది.  సన్నగా, మెత్తగా అంటే అర్ధం కాకపోయినా, “నా కంటే బాగా” అన్న మాట విని కొంచెం గర్వపడ్డాడు అమాయకుడు.

వంటింట్లోకి వెళుతూ అంది ప్రభావతి. “పెసరపప్పు నేను చాలా మట్టుకు  రుబ్బేశాను,  ఇంకో నాల్గైదు మాట్లు తిప్పితే సరిపోతుంది. అది మీరు చూడండి. ఈ లోపున నేను ఉప్మా చేస్తూ ఉంటాను.” 

రుబ్బురోలు కేసి చూశాడు ప్రద్యుమ్నుడు. పిండి మెత్తగానే కనిపిస్తోంది. ఇంకో నాల్గైడు మాట్లు పొత్రం తిప్పితే సరిపోతుందేమో అనుకున్నాడు. అయినా బింకంగానే అన్నాడు,

“నాకు రుబ్బడం చేత కాదు ప్రియతమా”

“ఇదేం, బ్రహ్మవిద్యా, రోజూ నేను రుబ్బుతుంటే చూస్తూనే ఉన్నారుగా”

“ఎప్పుడూ ఇటువంటివి చేయలేదు” దీనంగానే అన్నాడు ప్రద్యుమ్నుడు.  

“భలే వారే. M. Sc. చేశారు. అందులోనూ కెమిస్ట్రీ, మీకు తెలియక పోవడం ఏమిటీ. మీరు చెయ్యగలరు” నమ్మకం గానే అంది ప్రభావతి ధైర్యం చెబుతూ.

ప్రద్యుమ్నుడు వంటింట్లోకి తొంగి చూశాడు. ప్రభావతి కత్తిపీట ముందు వేసుకొని, ఉల్లిపాయలు తరుగుతోంది. పక్కనే పచ్చి మిరపకాయలు, అల్లం ఉన్నాయి కూడా. ఇక తప్పదనుకొని రుబ్బురోలు ముందు పీటపై కూర్చున్నాడు, రుబ్బడానికి సిద్ధమై. రెండు మాట్లు పొత్రం తిప్పాడు.

ఇంతలో ప్రభావతి చెప్పింది,  “ఆ పక్కనే మూత వేసిన గిన్నెలో ఇంకొంచెం పెసరపప్పు ఉంది, అది కూడా రుబ్బేయండి.” మూత తీసి చూశాడు ప్రద్యుమ్నుడు, మూడు నాలుగు గుప్పెళ్ళు పైనే ఉంది పెసరపప్పు అనుకున్నాడు.

“ఇంత పప్పు ఎందుకు? మనిద్దరికి రుబ్బిన పిండి సరిపోతుంది కదా?” అన్నాడు ప్రద్యుమ్నుడు విసుగ్గా.

“అదేమిటి, మీ అభయ్ సింగ్ వస్తానన్నాడు కదా ఈ వేళ బ్రెక్ఫాస్ట్ కి. మరిచిపోయారా?

“గుర్తు లేదు నాకు. ఎప్పుడు చెప్పాడు? అయినా వాడికి ఇడ్లీ, దోశ చేస్తే బాగుంటుంది కదా అడిగాడు ప్రద్యుమ్నుడు.

“నాలుగు రోజుల క్రితం క్లబ్బులో చెప్పాడు. మీరు రమ్మని ఆహ్వానించారు కూడాను. నాకూ గుర్తు లేదు. నిన్నరాత్రి పడుకునే ముందు గుర్తుకు వచ్చింది. పెసరపప్పు నానవేశాను” చెప్పింది ప్రభావతి.

ఎలాగూ తప్పదు కదా, వాడు వచ్చేలోపున పూర్తి చేయాలి, రుబ్బడం. లేకపోతే ఆఫీసులో నేను పిండి రుబ్బుతున్న వార్త ప్రసారం చేసేస్తాడు. గబగబా రుబ్బడం మొదలు పెట్టాడు ప్రద్యుమ్నుడు. ఇంకో పది నిముషాల్లో రుబ్బడం అయిపోయేటప్పుడు, చెప్పింది మళ్ళీ ప్రభావతి,

రుబ్బడం అయిపోతే,  పిండి గిన్నెలోకి తీసి, రోలు కడిగి,  ఈ వేయించిన వేరుసెనగపప్పు కొబ్బరితో కలిపి ఇంత మజ్జిగ పోసి రుబ్బెయ్యండి. నేను పోపు పెట్టేస్తాను. ప్రద్యుమ్నుడికి కోపం వచ్చింది. కానీ అభయ్ సింగ్ వచ్చేస్తాడేమో తొందరగా అని భయపడ్డాడు.  “పోనీ పాపం ఇంకా చెయ్యి నొప్పిగా ఉందేమో”  నని సరిపెట్టుకున్నాడు.   కొబ్బరి,  వేరుశెనగపప్పు కూడా మజ్జిగతో రుబ్బేసి, పచ్చడి ప్రభావతికి ఇచ్చేసి తన కార్యక్రమాలకి వెళ్ళిపోయాడు ఇంకేం మాట్లాడకుండా. 

గెడ్డం గీసుకుంటుంటే  అనుమానం వచ్చింది ప్రద్యుమ్నుడికి, “ఇది కావాలని చేసిందా లేక అనుకోకుండా జరిగిందా?” అని.

ఏమైతేనేం ఇంకో రెండు అంగుళాలు వంగ వలసి వచ్చిందిగా అనుకున్నాడు. తను వంగాడా? లేక ప్రభావతి కావాలని వంచిందా? సందేహం తీరలేదు. ఏమైనా లంబ కోణం కంటే తక్కువగానే వంగిపోయాను కదా, ప్రభావతి ముందు అని విచారించాడు ప్రద్యుమ్నుడు.

“సీతారామ స్వామీ నే చేసిన నేరం బేమి” అని పాడుకున్నాడు. 

ఈ పాట ఇంకో రెండు మూడు మాట్లు పాడుకోవలసి వచ్చింది,  పొదుపు  ఉద్యమంలోనూ (పొదుపు సమీకరణాలు ),  ప్రభావతి పుట్టినరోజు సందర్భంగానూ ( మా ఆవిడకు విడాకులు ఇచ్చేస్తాను   ).      

ఈ పాటలన్నీ అయేటప్పటికి,  చేతులతో కాలి వేళ్ళు పట్టుకునే స్టేజికి వచ్చేశానని విచారించాడు. 

ఇలాగే సాగితే తలతోనే కాలి వేళ్ళు అంటుకోవచ్చునేమో  అని దుఃఖించాడు పాపం ప్రద్యుమ్నుడు.