ఇది కూడా ఒక ప్రేమ కధే

కామాక్షి, కామన్నారాయణ ఇద్దరూ కూడపలుక్కొని ప్రేమించేసుకున్నారు. ప్రేమకేముంది, ఎంతమంది ప్రేమించుకోవటం లేదూ అంటూ సాగదీయకండి.  వీళ్ళ ప్రేమలో కొంచెం తేడా ఉంది. 
 
కా.., కా....., ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు కాదు. కనీసం ఎప్పుడూ, ఏ క్లాసు కలిసి చదువుకోలేదు. ఒకే ఊరిలో ఉన్నా పేటలు వేరు. వారి ఇంటికి వీరి ఇంటికి  ఐదు  కిలోమీటర్స్ దూరం ఉంది. ఇద్దరూ అంతర్జాలంలో, ముఖ పుస్తకంలో పరిచయం అయ్యారు.  కా..... స్నేహితుడి,  స్నేహితుల లిస్టులో కా.. ఉంది. కా.. ఒక రోజున ఆ లిస్టు తెరిచి చూసింది యదాలాపంగానే. కా..... పేరు చూసి ఆశ్చర్యపోయింది. ఇంకా ఇలాంటి పేర్లు గల కుర్రాళ్ళు ఉన్నారే అని ఒకింత సంభ్రమానికి గురైంది. తన పేరు అంటే తనకి ఇష్టం లేదు. పేరు మార్చుకోవాలని అనుకుంది గానీ తండ్రి ససేమిరా అన్నాడు. తన అమ్మమ్మ పేరు మార్చుకోవడానికి వీల్లేదు అని శాసనం చేసాడు. ఆయన కారణాలు ఆయనకి ఉన్నాయి.  పూట గడవని రోజుల్లో, వారి  అమ్మమ్మగారు,  కా.. తండ్రికి  రెండు ఎకరాలు ఇచ్చింది. ఆ కృతజ్ఞతా భావంతో పూర్తిగా ఒంగిపోయిన కా..తండ్రి తన కూతురికి అమ్మమ్మ పేరు కామాక్షి అని  పెట్టేసాడు. 1989 లో ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో చేరిన రోజునుండి కా..కి తన పేరు మీద కోపం పెరిగిపోయింది. స్నేహితురాళ్ళ పేర్లు  అందంగా ఉన్నాయి. తన కిలాంటి పేరు పెట్టిన తండ్రి మీద కూడా కోపం కలిగింది. పెద్దైనా, తండ్రి   మీదా, పేరు మీదా కోపం తగ్గలేదు.

కా.....  పేరు చూసినప్పుడు, తనలాంటి  అభాగ్యుడు మరొకడు ఉన్నాడని కొంచెం ఊరట కలిగింది. అతని కధా కమామీషు తెలుసుకోవాలనే కోరికా కలిగింది. ముఖపుస్తకంలో స్నేహితురాలిగా చేర్చుకొమ్మని అభ్యర్ధన పంపింది.  కా.....  చేర్చుకున్నాడు. ఇద్దరూ స్నేహితులయ్యారు కాని పరిచయం పెరగలేదు. ముఖపుస్తకంలో ఫోటోలు చూడడమే తప్ప మరేమి తెలియదు ఒకరి గురించి మరొకరికి. స్నేహితులయ్యారు కానీ, ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలని ఉన్నా, తెలుసుకునే ధైర్యం చేయలేకపోయారు.

కానీ విధి బలీయమైనది. కానున్నది జరిగి తీరుతుంది. ఏమీ తోచక, సినిమాకి వెళ్ళే డబ్బులు లేక, త్యాగరాయ కళామందిర్ లో సంగీతం వినడానికి వెళ్లాడు కా..... సంగీతం పిచ్చి ఉన్న స్నేహితురాలి అక్క బలవంతం వల్ల, ఆమెకి  తోడుగా  కా.. వచ్చింది త్యా.క.మం. కి. తలలు ఊపుతూ, తొడలు చరుచుకుంటూ, చేతులు తిప్పుతున్న శ్రోతలని, ఒకే పదాన్ని పదిమాటులు పాడుతున్న గాయకుణ్ణి, చూసి, చూసి, ఇద్దరూ విధివశాన్న ఏకకాలంలో బయటకు వచ్చారు. ఒకరినొకరు చూశారు. ఎక్కడో చూసినట్టుందే  అని మళ్ళీ  చూసుకున్నారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని ఆశ్చర్యపడ్డారు. మీరు కా.....  నా అని ఈవిడంటే, అవును మీరు కా.. నా అని వీరు ప్రశ్నించారు.

నేను కామాక్షినే అని ఆమె,  నేను కామన్నారాయణని  అని వీరు,  పరిచయం చేసుకున్నారు. కుశలప్రశ్నలు వేసుకున్నారు.  హౌ ఆర్ యూ అంటే ఐ యాం ఫైన్ అని చెప్పుకున్నారు. ఇద్దరూ అక్కడికి వచ్చిన కారణాలు చెప్పుకొని, సంగీతమంటే ఇద్దరికీ ప్రాణం కాదని తెలుసుకొని ఆనందించారు. జేబులు నిండుకున్నాయి అని నిర్మొహమాటంగా చెప్పిన కా....., కా.. కి నచ్చేడు. తనకిష్టం లేకపోయినా తోటివారి సంతోషం కోసం మూడుగంటల పాటు శాస్త్రీయసంగీతం వినడానికి సిద్ధపడిన కా.. ఔదార్యం కా.....కి నచ్చేసింది. 

యం.ఎస్.సి, జూ,  చేసి మూడేళ్ళగా ఉద్యోగం వెతుకుతున్నానండి. ఎక్కడ ఉందో ఇంకా కనిపించలేదండి అని కా..... విచారిస్తే, బి.ఎస్.సి. బి.ఇ.డి. చేసి ఏడాదిగా స్కూళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నానని కా.. నిట్టూర్చింది. ఇద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నామా అని మళ్ళీ ఆశ్చర్యపడ్డారు. ఫస్ట్ క్లాసులో పాసైన వాళ్ళే ఇంకా రోడ్లు కొలుస్తుంటే, సెకండ్ క్లాసు వాడిని నన్నెప్పుడు ఉద్యోగం కనికరిస్తుందో నని బెంగగా ఉందండి అని కా..... వాపోతే, తెలుగు మీడియం స్కూళ్ళు ఎప్పుడు వస్తాయో యని ఎదురు చూస్తున్నానని కా..బాధపడింది. నాలుగేళ్ల క్రితం మిగిలిన ఒక ఎకరం అమ్మి, అప్పులు తీర్చి ఓ ఆటో కొన్నాడు మా నాన్న అని కా.. చెపితే, మా నాన్న ఒక కాంట్రాక్టర్ దగ్గర గుమాస్తాగా చేస్తున్నాడండి. ఏడాదికి ఓ మూడు నాలుగు వందల కన్నా ఆయన జీతం పెంచడండి, అది తప్ప మరో ఉద్యోగం ఈయనకి  చేతకాదండి. ఆ కాంట్రాక్టర్ దగ్గరే అప్పు చేసి చదివించిన కొడుకు ఇంకా ఆయనకి ఉపయోగపడలేక పోతున్నాడు అని కా..... దిగులుపడ్డాడు. ఇద్దరి ఇళ్ళ మధ్య ఐదు కిలోమీటర్స్ ఉన్నాయి అని తెలుసుకున్నారు.

ఇల్లాగే  మరి  కొన్ని కష్టాలు చెప్పుకున్నారు. విడివిడిగానూ, సంయుక్తంగానూ,  దీర్ఘంగానూ, హస్రంగానూ  కూడా పలుమార్లు నిశ్వసించారు.  ఈ నిట్టూర్పుల నుంచి ఎప్పుడు విముక్తి దొరుకుతుందో అని ఇంకోమారు నిట్టూర్చారు. ఇంక ఉపిరితిత్తులకు పని చెప్పలేనండి, వెళతాను అన్నాడు కా..... సరే వెళ్ళి రండి. నేను ఇంకో గంట ఇలాగే గడపాలి అంది కా.. రెండు అడుగులు వేసి వెనక్కి వచ్చాడు కా..... మళ్ళీ నిట్టుర్చాడానికి ఏమైనా చెపుతాడేమో నని సందేహించింది కా..  మీ సెల్ నంబర్ ఇస్తారా అని అడిగాడు కా..... ఇద్దరూ సెల్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు.

పది రోజులు గడిచాయి. సెల్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు కానీ ఎవరూ కాల్ చెయ్యలేదు. పదకొండో రోజున తెగించి, ధైర్యం చేసి కా.....  మిస్సుడ్ కాల్ ఇచ్చాడు. చూశాను కానీ టాక్ టైం లేనందున కాల్ చెయ్యలేకపోయాను అని ఎస్ యం ఎస్ ఇచ్చింది కా.. మర్నాడు. చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది కానీ నా పరిస్థితి అంతే నండి అని sms  చేశాడు కా..... మర్నాడు.   నిట్టూర్పు అని sms చేసింది, కా..  కొంచెం దీర్ఘంగా డిటో అండి అని జవాబు ఇచ్చాడు, కా.....  

ఇంకో రెండు మూడు మాట్లు SMSలలో నిశ్వసించిన తరువాత కా..... కాల్ చేసాడు. మీరు రేపు సాయంకాలం నాలుగు గంటలకి మీ పక్క కాలనీ సాయినాద   కాలనీ లోని శివాలయంకి రండి అని చెప్పాడు. ద కాదండీ ధ అని కా.. చెప్పెలోపునే కా..... పెట్టేసాడు.

ఎందుకు పిలిచాడో అని ఆలోచించింది. కొత్త కష్టాలు ఏమైనా వచ్చాయేమో నని కంగారు పడింది. మొన్న మాట్లాడుకున్నప్పుడు ఎక్కువగా కష్టాలు నిట్టూర్పులే తప్ప మరేవి మాటల్లో రాలేదని అనుకుంది. ఈ రోజు  ఆట్టే నిట్టూర్చకూడదని నిర్ణయించుకుంది. కష్టమైనా చిరునవ్వులే చిందించాలనుకుంది. ఐదు నిముషాలు ముందుగానే  శివాలయం చేరుకుంది. అప్పటికే కా..... వచ్చేసాడు.
నమస్కారమండి
నమస్కారం
బాగున్నారా
ఆ, మీరెలా ఉన్నారు
బాగానే ఉన్నానండి
నాకైతే అర కిలోమీటరు.  మీరు పాపం నాలుగున్నర కిమీలు నడిచి వచ్చారు
ఫరవాలేదండి. నాకు అలవాటే.
ఒక రెండు నిముషాలు నిశ్శబ్దం  రాజ్యమేలింది.
రండి. దర్శనం చేసుకొద్దాము
పదండి.

దర్శనం చేసుకున్నారు. ఇద్దరినీ చూసి పూజారి గారు ఒక కొబ్బరి చిప్ప ఇచ్చాడు, కొబ్బరికాయ కొట్టకపోయినా. ఒక చోట కూర్చుని చిప్ప పగలకొట్టి తినడం మొదలుపెట్టారు.

ఎందుకో రమ్మనారు అంది కా.. ఉండబట్టలేక.
చిన్నగా నవ్వాడు కా.....
నాలుగు  రోజులక్రితం ఉద్యోగంలో చేరానండి అన్నాడు కా.....
అభినందనలు. ఎక్కడా?
అభినందనలు చెప్పేంటంతది కాదండీ. మా ఇంటిపక్కన ఇద్దరు పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకున్నానండి. నిన్ననే ఇంకో ఇద్దరు చేరేరండి. నాలుగు ఇంటూ రెండు,  ఎనిమిది వందలు వస్తుందండి నెలకి. నిన్ననే వాళ్ళ తల్లితండ్రుల దగ్గర   అడ్వాన్స్ తీసుకున్నానండి. నాలుగు వందలు.
సంతోషం. నిజంగా చాలా ఆనందంగా ఉందండి అంది ఉత్సాహంగా కా..

థాంక్స్ అండి. యంఎస్ సి చదివి రెండో క్లాసు పిల్లలకి ట్యూషన్ చెపుతున్నావా అని నవ్వారండి మా  స్నేహితులు. నిన్న రాత్రి నాలుగు వందలూ మా నాన్నకి ఇచ్చానండి. ఆయన కళ్ళలో నీళ్ళు. అందులో రెండు వందలు నాకు ఇచ్చారండి. ఎందుకో నా కళ్ళలోనూ నీళ్ళు వచ్చాయండి. రెండు వందలు నన్ను అట్టేపెట్టుకొని  మిగతాది ఇంటికి ఇమ్మంది మా అమ్మ.

“ఇంత చదువూ చెప్పించి చివరకి చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పుకోవల్సివచ్చిందా నాయనా. ఓ ఏభై వేలు ఇచ్చి నీకొక మంచి ఉద్యోగం కూడా కుదర్చలేకపోయాము”  అని మా అమ్మ ఏడ్చేసిందండి.

వద్దనుకుంటూనే నిట్టూర్చింది కా..
కా..... కూడా నిట్టూర్చాడు.

ఈ పని ఒక రెండేళ్ళ ముందే ఎందుకు చేయలేదా అని అనిపించింది నాకు అన్నాడు కా.....
దేనికైనా టైం రావాలండి అంది కా.. 
మీతోటి పరిచయం తరువాతే ఇలా నిర్ణయం తీసుకున్నానండి. మీకు థాంక్స్ చెప్పుకోవాలి. అన్నాడు కా.....
నాకా ఎందుకు?  అని ఆశ్చర్యపడింది కా..
మీకు మిస్సుడు కాల్ ఇచ్చినప్పుడు అనిపించింది. ఏదో విధంగా ఎంతో కొంత సంపాదించాలని. అనుకోకుండా ఈ ట్యూషన్ మాష్టరు ఉద్యోగం దొరికింది. ఈ వేళే వంద రూపాయల టాక్ టైం వేయించానండి. వారానికి ఒక పది నిముషాలు మాట్లాడుకోవచ్చండి అని నవ్వాడు కా.....
కా.. కూడా నవ్వింది.  పార్టీ ఇవ్వాలండి అంది.
సరే నని గుడి బయట రెండు బజ్జీలు చెరొకటి తిని ఒక చెరుకురసం ఇద్దరూ తాగారు. ఇంతకన్నా ఎక్కువగా ఇవ్వలేనండి అని మళ్ళీ నవ్వాడు కా.....

ఇంకా ఉంది.  


గమనిక  :- ఈ టపా మొదటి మాటు 21/10/2014  ఈ బ్లాగులో ప్రచురితమైనది.

సిరి రా మోకాలు అడ్డుట

భూమి గుండ్రం గా ఉందిట -- మీకు తెలుసా?   ఈ విషయం నాకు మొన్ననే తెలిసింది. ఓ శుభ ముహూర్తాన్న బ్లాగు మూసి, తాళం వేసి, తూర్పు తిరిగి దండం పెట్టి, నడక మొదలుపెట్టాను శూన్యం లోకి. చిత్రంగా సుమారు మూడు నెలల తరువాత  మళ్ళీ  బ్లాగు దగ్గరకు వచ్చాను. భూమియే కాదు, బ్లాగు కూడా గుండ్రం గానే ఉంది అని అవగతమైనది. బ్లాగు తెరిచి లోపలికి వెళ్ళి చూస్తే మూడు  ఆసక్తి (నాకే)  గల విషయాలు తెలిసాయి. 

౧. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు. బ్లాగు మూసిన డిసెంబర్ నెలలో పాఠకులు    మూడువేల నాలుగు వందల మంది బ్లాగుకి వచ్చారు. ఇది ఆల్ టైం రికార్డ్ . 

 ౨. జనవరిలో  పాఠకుల  సంఖ్య  50,000 దాటి ప్రస్తుతం ఇంకో రెండు వేల నాలుగు వందలు పైగా  పెరిగారు. రెండున్నర ఏళ్ల పైగా వ్రాస్తుంటే మొన్ననే ఏభై వేలు దాటారంటే నా బ్లాగు పరిస్థితికి నాకే జాలి వేసింది. కానీ మూసివేసిన తరువాత కూడా నెలకి 750 – 1000  దాకా వస్తున్నారని ఆనందము కలిగింది.

౩. మూసివేసిన తరువాత కూడా ఇంకో అర డజను ఫాలోయర్స్ పెరిగినందుకు ముదావహుడను కూడా అయ్యాను.

ఈ ఏడుపు ఏడవడానికి బ్లాగు తెరవాలా అని మీరు కోప్పడకండి. ఇంకో ముఖ్య విషయం మీతో పంచుకోవాలని ఈ వేళ బ్లాగు తాళాలు తీసాను.  

బ్లాగు మూసివేసిన వారం రోజులకు ఆఫ్రికా ఖండం లో ఒక చిన్న దేశంలోని పర్యాటక శాఖ ఉన్నతాధికారి (అని ఆయనే చెప్పుకున్నారు)  నుంచి టెలిఫోన్ వచ్చింది. మీకు కొద్ది రోజుల క్రితం ఒక మెయిల్ పంపాం. మీ వద్దనుండి జవాబు రాలేదు అందుకే టెలిఫోన్ చేసాను అని చెప్పాడు ఆయన. సారీ నాకు మెయిల్ రాలేదు అన్నాను. బహుశా స్పాం లోకి వెళ్ళి ఉంటుంది, చూసి జవాబు ఇవ్వండి అన్నారు.  నేను వెతికాను. మెయిల్ కనిపించింది. పర్యాటక అభివృద్ధి కోసం వారు ఒక కొత్త స్కీము  మొదలు పెట్టారుట.  ఈ స్కీములో డెవలపింగ్ దేశాలనుంచి ప్రతీ సంవత్సరం ఒక ఐదుగురు వ్యక్తులను ఎన్నిక చేసి వారికి రెండు  లక్షల డాలర్స్ బహుమతి ఇస్తారుట.  ఆ వ్యక్తి తనతో ఇంకో నలుగురిని  తీసుకుని  వాళ్ళ దేశం వెళ్ళాలిట. ఖర్చులన్నీ వారే భరిస్తారుట.  పది రోజులు వారి దేశం లో విఐపి  లాగా చూస్తారట. దేశం అంతా తిప్పి చూపిస్తారట. తిరిగి వచ్చేటప్పుడు  ఒక్కొక్కరికి  రెండు వేల డాలర్స్ విలువ చేసే బహుమతులు ఇస్తారుట,  వాళ్ళ దేశం లో తయారు చేసే హస్త కళలు, ఇతర మెమెంటోలు.  వాళ్ళ దేశం గురించి ఒక రెండు పేరాలు కూడా వ్రాసారు.  ఈ ఇరవై మంది వాళ్ళ దేశపర్యాటకానికి వారి వారి  దేశాలలో  తగు ప్రచారం కల్పిస్తారనే ఆశ వ్యక్తం చేసారు.

చూడగానే ఆసక్తి కలిగింది. కానీ ఇలాంటివి చాలానే మెయిల్ లు వస్తుంటాయి. స్పాం లోకి వెళ్ళిపోతుంటాయి. వాటిని ఎప్పుడూ పట్టించుకో లేదు. ఇది కూడా అలాగే అనుకుని ఊరుకున్నాను.  ఒక వారం రోజుల తరువాత మళ్ళీ టెలిఫోన్ చేసాడు ఆయన.  నేను ఇలాంటివి నమ్మను అని ఖరాఖండిగా చెప్పేసాను.  ఏంచేస్తే మీరు నమ్ముతారు అని అడిగాడు. ఆలోచించకుండా  “మీ గురించి, మీ సంస్థ గురించే కాదు మీ దేశం గురించి కూడా నాకు తెలియదు. మీ గురించి ఎంక్వైరి చేయాలంటే నాకో రెండు వేల డాలర్లు ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టే ఉద్దేశ్యం నాకు లేదు.” అని చెప్పాను. నేను మళ్ళీ  మాట్లాడుతాను అని చెప్పేడు.  

ఇంకో వారం  రోజుల తరువాత  మళ్ళీ  టెలిఫోన్  చేసాడు. మీకు రెండు వేల డాలర్స్ ఇవ్వడానికి మా సంస్థ అంగీకరించింది. మీ బేంక్ వివరాలు చెపితే మేము పంపిస్తాము  అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది.  భయం వేసింది, వీళ్ళ ఉచ్చులో పడుతున్నానా అని.  ఓ వెఱ్ఱి నవ్వు నవ్వి,  సారీ నా బాంక్ వివరాలు ఎవరికీ ఇవ్వను. అయినా నా మీద అంత ఇంట్రెస్ట్  ఎందుకు మీకు, ఇంకోరెవరినైనా తీసుకోవచ్చు కదా అని కూడా అన్నాను. మీరు బేంక్ గురించి  ఇలా అంటారని అనుమానించాను కానీ ప్రయత్నం చేసాను,  అని నవ్వాడు. మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి మాకు నాలుగు  నెలల పైన పట్టింది.  కంప్యూటర్ ద్వారా  రాండం గా ఐదు దేశాలని ఎన్నుకున్నాం. ఆ దేశంలో ప్రదేశాలను కూడా రాండం గానే ఎన్నుకున్నాం. ఆ చోట్ల లో చిన్న పట్టణాలను టార్గెట్ చేసి ఆరు అంకెల టెలిఫోన్ నంబర్లను రాండం గా జెనేరేట్ చేసాం. పెద్ద పట్టణాలలో విదేశయానాలు చేసేవారు ఎక్కువుగా ఉంటారని అనుకున్నాం. వారి కి ఇలాంటి చిన్న దేశాల మీద ఆసక్తి ఉండకపోవచ్చు. వారి వల్ల మాకు ఎక్కువ ప్రచారం జరగక పోవచ్చు.  ఆ తరువాత STD  కోడ్ కూడా రాండం గానే తీసాం. మీ నంబర్ వచ్చింది. మీ పేరు, నంబర్ ద్వారా మా ఎక్స్పర్ట్స్ మీ వివరాలు  సేకరించారు. మీ దేశం తో మాకు దౌత్య సంబంధాలు ఉన్నాయి.  డిల్లీ లో మీ  ఆఫీసు నించి, ఇతరత్రా   మీ గురించి వివరాలు  సేకరించాము,  అని సుదీర్ఘం గా ఉపన్యాసం ఇచ్చాడు. ఇది అంతా చేయడానికి మాకు నాలుగు నెలలు పట్టింది. ఇప్పుడు మళ్ళీ   మొదలు పెట్టాలంటే ఇంకో అంత టైం పడుతుంది కదా అని కూడా చెప్పాడు. మీ బేంకు పేరు చెప్పండి. మేమేదో మార్గం ఆలోచిస్తాం అన్నాడు. అది చెప్పడానికి అభ్యంతరం లేదు అని బేంక్, బ్రాంచ్ చెప్పాను.

ఇంత వివరంగా మన గురించి వివరాలు సేకరించారంటే కొంత నిజం ఉండే ఉంటుంది. ఇప్పుడు నాకు కొంత నమ్మకం కలిగింది,  అనుమానాలు పూర్తిగా తీరకపోయినా.    లెఖ్ఖలు వేయడం మొదలు పెట్టాను. ఒక కోటి రూపాయలు దాకా వచ్చే అవకాశం కనిపిస్తోంది. టాక్స్ ఓ ముఫై లక్షలు పోయినా డెబ్భై  లక్షలు  మిగులుతాయేమో.   నిజం చెప్పద్దూ ఆశ పెరగడం  మొదలయింది. ఒక పది రోజుల  తరువాత మా బేంక్ మేనేజర్ ఫోన్ చేసాడు. వెళ్లాను. వారు అడిగిన ఋజువులు అన్నీ చూపించాను. నా పాన్ కార్డ్, నా పెన్షన్ మెమో, ఆ అధికారి పేరు, టెలిఫోన్ నంబర్, ఆయన నాకు టెలిఫోన్ చేసిన తేదీలు లాంటివి అడిగి నిర్దారించుకున్నాడు. రెండు రోజుల్లో మీ అకౌంట్ లో 2000 డాలర్స్ ఆ రోజు మారకం ధరతో జమ చేయబడతాయి.  రేపు మీరు ఒక హామీ పత్రం ఒక స్యూరిటి సంతకం తో ఇవ్వాల్సి ఉంటుంది,  మీరు సరి అయిన ఖర్చు వివరాలు ఇవ్వకపోతే, డబ్బు తిరిగి ఇస్తానని. సరే నని వచ్చాను.

ఆ వేళ డాలర్స్ గురించి అడిగాను తప్ప ఎలా నిర్దారించుకోవాలో తెలియలేదు. వాళ్ళు డబ్బు పంపిన తరువాత కూడా ఇంకా అనుమానం ఎందుకు అని మనసు తొందర పెట్టింది. ఏమో ఎర వేసారేమో అనే అనుమానం కూడా వచ్చింది.  డబ్బు నా అకౌంట్ లో జమ అయిన మర్నాడు ఆయన మళ్ళీ  టెలిఫోన్ చేసాడు. ఇప్పుడు మా మీద నమ్మకం కుదిరిందా అని అడిగాడు.  పదిహేను ఇరవై రోజులలో మీ నిర్ధారణ చేసుకుని అంగీకారం తెలుపుతారని ఆశిస్తున్నాను అన్నాడు. మా దేశం తో దౌత్య సంబంధాలు ఉన్నాయంటున్నారు కదా, మా ప్రభుత్వం ద్వారా ఇది పంపించవచ్చు కదా అని అడిగాను. ఈ స్కీము ఈ సంవత్సరమే మొదలు పెడుతున్నాము. మా ప్రెసిడెంట్ దీన్ని ఆఫీషియల్ గా జూన్  చివరి వారం లో ప్రారంభిస్తారు.  అప్పుడు వారు  మీ పేర్లు వెల్లడిస్తారు. అప్పటిదాకా రహస్యం గానే ఉంచమని మనవి.  అంతదాకా మేము మా పని అనదికారికం గా చేసుకోవాలి. మీకు బహుమతి డబ్బు  కూడా ఆ తరువాతే పంపిస్తాం,  మీ ప్రభుత్వ అనుమతి తో మా రాయబార కార్యాలయం ద్వారా. మా దేశం లో మీ బృందం పర్యటన అక్టోబర్ చివరి  వారం నుంచి నవంబర్ మొదటి వారం దాకా ఉంటుంది. నవంబర్ నాలుగవ తారీఖున మా ప్రెసిడెంట్ మిమ్మలనందరిని కలుస్తారు. అని చెప్పాడు.

కిం కర్తవ్యం అనుకున్నాను. నాకు నమ్మకం కుదిరినా, వాళ్ళు డబ్బు పంపారు కాబట్టి  ఏదో విధంగా నిర్ధారణ కార్యక్రమం మొదలు పెట్టాలి. మా మిత్రుడి కుమారుడు సౌత్ ఆఫ్రికా లో ఉన్నాడు. వాడికి  టెలిఫోన్ చేసాను. విషయం వివరంగా చెప్పి ఏమైనా చేయగలవా అని అడిగాను. ప్రయత్నిస్తాను అని చెప్పాడు. ఎందుకైనా మంచిదని బ్లాగ్మిత్రులు శ్రీ పప్పు శ్రీనివాస రావు గారిని సంప్రదించాను. వారు కూడా వారి  మిత్రులతో మాట్లాడి చేయగలిగినదంతా చేస్తానని హామీ ఇచ్చారు.  ఒక పదిరోజులు తరువాత శ్రీ పప్పు శ్రీనివాస రావు గారు, ఇందులో అనుమానించాల్సింది ఏమీ లేదని చెప్పారు. వారి మిత్రులు ఈ విషయం చెప్పారని తెలిపారు. ఇంకో పది రోజుల  తరువాత మా మిత్రుని కుమారుడు అదే విషయం చెప్పాడు. వాళ్ళ ఆఫీసు తో లావా దేవీలు ఉన్న ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ద్వారా కనుక్కున్నాడట. ఆ అధికారిని, అతని వివరాలనీ కూడా పంపించాడు.  అంతేకాదు మిగతా నలుగురి విజేతల  పేర్లు కూడా  పంపించాడు.  విజేతలు అనవచ్చా. నేను కూడా ఒకడిని.

 నాల్గైదు రోజుల తరువాత  ఆయన  ఫోన్  చేస్తే అంగీకారం తెలిపాను. ఆయన  సంతోషించాడు.  ఒక పదిహేను  రోజుల తరువాత వారి నుంచి కొన్ని పత్రాలు వచ్చాయి.  వాటిని న్యాయపరం గా,  పరిశీలించి  పూర్తి చేసి పంపించాను.

అదీ సంగతి. ఈ శుభ వార్త  మీ తోటి పంచుకోవాలని బ్లాగుకి తాళం తెరిచాను.


అడిగిన వెంటనే స్పందించి వారి మిత్రుల ద్వారా నా అనుమానం నివృత్తి చేసినందుకు శ్రీ పప్పు శ్రీనివాస రావు గారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గమనిక: - ఈ టపా మొదటి మాటు ఏప్రిల్ ఒకటవ తారీఖు 2013 న పబ్లిష్ చేయబడినది.