చచ్చి బతకడం అంటే ఏమిటో తెలుసుకున్నాను ఈ రోజు. నరకానికి, ఏ నరకమో తెలియదు కానీ కొద్ది దూరంలో ఆపి సతీ సావిత్రి లాగా మా ఆవిడ నా ప్రాణాలు కాపాడి నన్ను పునర్జీవితుడిని చేసింది. నాకింత కష్టం వస్తుందని ఆవిడ కనిపెట్టి తగు చర్యలు తీసుకొని ఉండకపోతే నేను మళ్ళీ ఇక్కడ కనిపించేవాడిని కాదు. ఇల్లా మీ అందరి మస్తిష్కాలు ఫలహారం చేసేవాడిని కాదు. మా ఆవిడకి, నా భార్యా మణికి, పతివ్రతా శిరోమణికి నా శేష జీవితమంతా ఋణపడి ఉంటానని ఈ బ్లాగు ముఖంగా ప్రతిజ్ఙ చేస్తున్నాను. ఆ కధ ఏమిటంటే.
ఉదయం రోజులాగానే తెల్లవారింది. సూర్య భగవానుడు రోజు లాగానే మా ఇంటి వెనకాల రెండు చెట్ల మధ్యనించి పైకి లేస్తున్నాడు. టైమ్ చూస్తే రోజులాగానే 7.00 AM అంటోంది. రోజులాగానే సిగరెట్టు వెలిగించి మంచం మీదనించి లేచాను. రోజు లాగానే కాఫీ అని అరిచాను. వస్తున్నా అని మా ఆవిడ అంది రోజులాగానే. అయ్యో ఈ వేళ కూడా ఏమి మార్పులేదు అంతా నిన్నటికి మల్లె, మొన్నటికి మల్లె రోజులాగానే మొదలవుతోంది అని విచారించాను రోజులాగానే. నాకు జీవితం మీద విరక్తి పుట్టింది రోజులాగానే. ఏదో ఒకటి చెయ్యాలి ఈ మోనోటోనస్ బతుకు మార్చాలి అనుకున్నాను. ఛీ ఎధవ బతుకు అనుకున్నాను. మళ్ళీ ఒక ఆత్మహత్య ప్రయత్నం చేద్దామా వినూత్నంగా, అని అనుకున్నాను . ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చేసింది. రెండు రోజులుగా ఒక TV చానెల్ లోనూ, ఒక పత్రిక లోనూ ఒక ప్రకటన చూస్తున్నాను. ఒక మహత్తర సాంఘిక టివి చిత్రరాజము ఈ రోజున బ్రహ్మాండమైన విడుదల కాబోతోందని. ఆలసించిన ఆశాభంగం, త్వరపడండి. చూసేయండి అని. ఆ సినిమా పేరు ‘ఐ లవ్ యు డాడీ’. కాబట్టి ఈ సినిమా నేను చూస్తాను అని, ఉదయము ప్రకాశముగా ప్రకటించినాను. ఆత్మహత్య చేసుకుంటాను అని ప్రకటించడం, చేసుకోక పోవడం నాకు అలవాటే. అసలు నేను సినిమాలు చూడడం చాలా తక్కువ. అటువంటిది నేను సినిమా చూస్తానంటే ఎవరు నమ్మలేదు. అయినా అదే టైమ్ లో క్రికెట్టు మ్యాచ్ కూడా ఉంది కాబట్టి సినిమా చూడను అనే నిర్ధారణకు వచ్చేసారు మా ఇంట్లో వాళ్ళంతా. కానీ వారొకటి తలచిన నేనొకటి తలచుదును గదా.
ది 13-2-2011, 2-30. PM.
మధ్యాహ్నం 2-30 గంటలకి నేను క్రికెట్ చూడ్డం మొదలు పెట్టాను. మా ఇంట్లో వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 5 గంటలకి నేను మా మిత్రుడు శంకరానికి ఫోను చేశాను. బాల్య మిత్రమా ఒక వేళ నాకేమైనా అయితే నువ్వు పూనుకొని మా ఆవిడకి ఫ్యామిలి పెన్షన్ త్వరగా వచ్చేటట్టు చూడు. జోర్హాట్ లో డైరక్టరు బాగా తెలిసినవాడే. వారికి ఒక మైల్ పంపు. ఇక్కడ కూడా మా ఆఫీసు కెళ్ళి వాళ్ళకి తెలియపర్చి ఎకౌంట్స్ ఆఫీసరు ని కలిసి మాట్లాడు. ఆయన కూడా తెలిసినవాడే కాబట్టి అన్నీ ఆయనే చూస్తాడు.
వచ్చిన సంతాప సందేశాలు జాగ్రత్తగా భద్రపరచు. పంపించని వాళ్ళకి గుర్తు చేసి వచ్చేటట్టు చూడు. నా బ్లాగులో కూడా నా అస్తమయ వార్త ప్రకటించి, కామెంట్స్ అవి జాగ్రత్త చేయి. బ్లాగులో కామెంటు పెట్టని వారిని నేను దెయ్యమై పీడిస్తాను. అమ్మయ్య పీడా విరగడైంది అని కామెంటు పెట్టిన వాళ్లెవరైనా ఉంటే (అసలు వాళ్ళే ఎక్కువ ఉంటారేమో) వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను.
ఆ తరువాత తెలిసిన స్వీట్ షాపు కి టెలిఫోన్ చేసి ఒక కేజి. మినపసున్నుండలు, ఒక పది పూతరేకులు, ఒక అర కేజి. జీడిపప్పు పాకం , ఒక పావు కేజి బందరు లడ్డూలు వెంటనే పంపింఛమని చెప్పాను. చక్కెర వ్యాధి వల్ల ఇవి నాకు నిషిద్ధం మా ఇంట్లో. చివరి సారిగా తినేసి, గోవింద కొట్టేద్దాము అని నిశ్చయించుకున్నాను .
ఆ తరువాత తెలిసిన స్వీట్ షాపు కి టెలిఫోన్ చేసి ఒక కేజి. మినపసున్నుండలు, ఒక పది పూతరేకులు, ఒక అర కేజి. జీడిపప్పు పాకం , ఒక పావు కేజి బందరు లడ్డూలు వెంటనే పంపింఛమని చెప్పాను. చక్కెర వ్యాధి వల్ల ఇవి నాకు నిషిద్ధం మా ఇంట్లో. చివరి సారిగా తినేసి, గోవింద కొట్టేద్దాము అని నిశ్చయించుకున్నాను .
మా ఆవిడ విని కంగారు పడింది. “తగునా ఇటు చేయ మీకు తగునా “ అని పాడింది. ఆవిడ కూడా తగు నివారణ చర్యలు మొదలు పెట్టింది. మా పురోహితుడిని కాల్చేసింది. అర్జెంటు గా వచ్చి మృత్యుంజయ మంత్రం జపించమని అభ్యర్ధించింది. ఆయన ఇంకా యమర్జెంటు గా ఇంకెక్కడికో వెళ్లాల్సివచ్చి, వాళ్ళ అబ్బాయి 12 ఏళ్ల కుర్రాడిని పంపిస్తానన్నాడు. ఆవిడ స్నేహితులని నలుగురుని కూడా పిలిచింది. అఖండ కీర్తన చేయించడానికి. తను అభ్యంగన స్నానం ఆచరించి నిష్ఠ తో పట్టు చీర కట్టుకొని పూజలు చేయటానికి ఉపక్రమించింది. ఎందుకేనా మంచిదని వాళ్ళ బంధువు ఒక RMP డాక్టరు కి విషయం తెలియపర్చి రమ్మని కోరింది.
13-2-2011, 5-45 PM.
నేను కుర్చీలో నన్ను కట్టేసుకున్నాను. ఒక చెయ్యి విడిగా కట్టుకోకుండా వదిలేశాను. స్వీట్ లన్ని ఆ చేతికి అందేటట్టు పెట్టుకున్నాను. RMP డాక్టరు నా చేతికి BP మిషను కట్టేశాడు. పాపం వాడి ECG. మిషను పాడైపోయిందిట. అందుకని మా ఆవిడకి సారీ కూడా చెప్పేశాడు. నా గ్లూకో మీటరు దగ్గర పెట్టుకుని కూర్చున్నాడు. శాస్త్రిగారబ్బాయి పూజా సామాగ్రి రెడీ చేసి పెట్టుకున్నారు. అల్లాగే మా ఆవిడ కూడా. అఖండ కీర్తన టీమ్ హార్మోని, చిడతలు పట్టుకుని రెడీ గా కూర్చున్నారు.
సరిగ్గా 6-00 PM.
నేను ఒకపూతరేకు నమిలి మింగి TV చానెల్ మార్చాను. “ఇది నా వ్రతం, ఎవరూ భంగం చేయవద్దు” అని జనాంతికం గా ఉద్ఘాటించాను.
శాస్త్రిగారబ్బాయి మంత్రాలు చదవడం మొదలు పెట్టారు.
భజన బృందం కరుణించు మా కామేశ్వరి అని మొదలుపెట్టేరు.
మా ఆవిడ మా ఇష్ట దైవం భువనేశ్వరీ దేవి ని తలుచుకొని, “ఉద్యద్దినకర ద్యుతిమిందు కిరీటామ్, తుంగ కుచామ్, నయనత్రయ యుక్తామ్” అంటూ ప్రార్ధనా శ్లోకాలు మొదలు పెట్టింది.
మా అమ్మాయి నా ఒక్కడికి మాత్రమే టివి కనిపించేటట్టు ఆరెంజ్ చేసింది.
సినిమా మొదలయింది. హీరో గంభీరం గా నడుచుకుంటూ వస్తుంటాడు. నడుచుకుంటూ, నడుచుకుంటూ వస్తున్న హీరో పేరు పెద్ద అక్ష రా లతో తెర మీద.
BP నార్మల్ 80/130 అని అరిచాడు RMP. కట్టేసిన చేతి మీద చురుక్కు మంది. సుగర్ 150 ఓకే. అని మళ్ళీ అరిచాడు ఆర్‌ఎంపి.
నమశ్శివాయః అంటూ శా. ఆ. గొంతు మధురం గా వినిపిస్తోంది.
కామేశ్వరీ అంటూ భజన బృందం,
ప్రభజే భువనేశ్వరీమ్ అంటూ మా ఆవిడ.
హీరో ఆఫీసు లోకి అడుగు పెడుతాడు. నవ్వుతూ స్టాఫ్ వందన స్వీకారం చేస్తాడు.
అప్పుడు నాకు అనుమానం వచ్చింది. నవ్వుతున్నాడా లేక పెదాలు విడదీసి పళ్ళు బయట పెట్టాడా అని.
BP 90/140 సుగర్ 160 అని ఆర్‌ఎంపి అరుపు.
పాటలు, పూజల సౌండ్ రెండు డెసీబుల్స్ పెరిగాయి.
నేనో మినపసున్నుండ ఆరగించాను.
ఎవరికైనా కాఫీ కావాలా అని మా ఆమ్మాయి.
సినిమాలో “అద్భుతం ఫంటాస్టిక్ ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది” అంటాడు హీరో. “తండ్రి చేయి పట్టుకుని నడుస్తున్న కుర్రాడు, నడిపిస్తున్న తండ్రి, గమ్యం చేరుతానంటున్న కొడుకు. వహ్వా వహ్వా గొప్ప ఐడియా” అంటాడు హీరో. ఈ కాన్సెప్ట్ గీసిన చిన్న హీరో ని పిలువ మంటాడు.
చిన్న హీరో కి ‘హీరో అసలు హీరో’ అంటే హీరో నే హీరో గా పూజిస్తుంటాడు. అర్ధం కాలేదా, అదంతే, అల్లాగే ఉంటుంది. చిన్న హీరో తల్లి ఫోటోవు దగ్గర దీనాలాపనలు. చిన్నతనం లోనే వదిలేసి వెళ్ళిన తండ్రి మీద కోపం, కసి, ఉక్రోషం అన్నీ కక్కేస్తుంటాడు.
వెంటనే కనిపెట్టేశాను నేను, వీడే వాడి కొడుకు అని.
చిన్న హీరో అసలు హీరో సమావేశం. రెండు ఇంక్రిమెంట్లతో ఉద్యోగం చిన్న హీరో కి హీరో దగ్గర.
క్షమించాలి కలంలో కలకలం రేగుతోంది. పదాలు అటు ఇటూ అవుతున్నాయి. అర్ధం చేసుకోండీ. అచ్చు తుప్పులు, స్పెల్లింగ్ మిస్టేకులు పట్టించుకోకండి.
నమో వెంకటేశా నమో తిరుమలేశా అని భజన బృందం పాట మార్చింది.
అర్జెంటుగా మా ఆవిడా, అమ్మాయి మంతనాలు. భజన బృందం బదులు ఘంటసాల బృందం వచ్చింది ట . భక్తి పాటలు మాత్రమే పాడే ఒప్పందం కుదిరిపోయింది.
మా ఆవిడ జనని శివకామినీ లోకి మారింది.
శా. అ. నమశ్శివాయః అంటూ జపిస్తున్నాడు.
నేనో మినపసున్నీ, బందరు లడ్డూ ఒకే మాటు నోట్లోకి తోసేశాను.
బిపి 140/210 సుగర్ 230 అని అరిచాడు ఆర్‌ఎంపి.
మా ఆవిడ మంగళ సూత్రం తీసి ఫెడిల్ ఫెడెల్ మని కళ్ళకేసి కొట్టేస్కుంది. కళ్లపైన కాయలు కాచాయి.
“వద్దంటే విన్నావు కాదు. రెండు తులాల సూత్రం 4 తులాల గొలుసు. అంత ఘట్టిగా ఉన్నాయి కాబట్టి కళ్ళు వాచిపోయాయి. ఏదో ఒక అరతులంతో చేయించుకొంటే వాచేవి కాదు కదా” అని జాలి పడ్డాను.
“నయం అంత ఘట్టిగా చేయించాను కాబట్టే మీ గుండె రెండు ఎట్టాక్ లు రెండు స్టెంటు లు తట్టుకుంది. ఇంకా ఘట్టిగా చేయిస్తే అసలు మీకు గుండె ఎట్టాక్, సుగరు ఇల్లాంటివి వచ్చేవే కాదు.” అంటూ మా ఆవిడ టపా టపా మళ్ళీ కొట్టుకుంది.
ఇన్సులిన్ ఎక్కించాలెమో అని మా అమ్మాయి అంది.
I am the doctor, ఏం చెయ్యాలో నాకు తెలుసు. నీ పని నువ్వు చూసుకో అని కోప్పడ్డాడు ఆర్‌ఎంపి.
మా అమ్మాయి కాఫీ కాఫీ అంటూ వెళ్లిపోయింది.
తెరమీద హీరో కి చచ్చేంత జొరమ్ వెంటనే వచ్చేసింది. చిన్న హీరో, హీరో కి రాత్రంతా కూర్చుని సేవలు చేసేస్తాడు. హీరో మొహంలో ఆనందం, కృతజ్జత, ప్రేమ, అభిమానం , గుమ్మడి, నాగయ్య, పెరుమాళ్ళు అందరూ కనిపించేశారు. చిన్న హీరో మొహంలో ఆనందం, ప్రేమ, అభిమానం, శోభన్ బాబు, రేలంగి, చదలవాడ కనిపించేశారు.
చిన్న హీరోకి లవ్, చిన్న హీరోయిన్, ఆమె తల్లి, తండ్రి.
తండ్రి టాట్ అంటాడు.
తల్లి మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది.
చి.హీరోయిన్ జాలిగా చి. హీ కేసి, కోపంగా తండ్రికేసి చూస్తుంటుంది.
తండ్రి హూ ఇస్ మదర్, హూ ఇస్ ఫాదర్ అంటూ ???.
చి. హీ. మొహం లో కోపం, క్రోధం, ఆవేశం, ఆక్రోశం, బాధ,కసి, ఎస్‌విఆర్ , రాజనాల,రమణా రెడ్డి,రావు గోపాల రావు అందరూ కలిసి వచ్చేశారు. చి. హీ. చేతులు బిగించి బిగించి వదిలేసి బిగించి వదిలేసి, వెళ్ళిపోతాడు.
బిపి 200/300 రౌండ్ ఫిగర్ డేంజర్, డేంజర్, సుగర్ 350 అని అరిచాడు ఆర్‌ఎంపి .
కానరారా కైలాస నివాసా, భజన బృందం,
ఆగర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరీ అంటూ శా. అ.,
మాంగల్యము నిలుపుమా మంగళ గౌరీ హారతి గైకొనుమా అంటూ మా ఆవిడ,
కాఫీ అండీ కాఫీ అంటూ మా అమ్మాయి ఘట్టిగా.
నా మోకాలి మీద చురుక్కు మంది. ఇన్సులిన్ ఎక్కించాను అన్నాడు ఆర్‌ఎంపి.
నేనింకో జీడిపప్పు పాకం కుక్కుకున్నాను నోట్లో.
ఈ జబ్బమీద మళ్ళీ చురుక్, బిపి కి ఇంకో ఇంజెక్షన్ అని ఆర్‌ఎంపి ఉవాచ.
తెరమీద చి. హీ మొహంలో మళ్ళీ అన్నీ ఫీలింగ్స్. I hate you డాడీ అంటూ కాగితాల మీద రాసి పడేస్తుంటాడు.
హీరో కి తను చి. హీ. కి తండ్రి ని అని తెలిసిపోతుంది.
సన్ను ని చూడడానికి కారులో వచ్చేస్తుంటాడు.
చి. హీ. కాగితాలు పడేస్తుంటాడు.
హీరో కారులో వచ్చేస్తుంటాడు. మొహం నిండా ఫీలింగ్లు, నోటినిండా డైలాగులు.
నాలో ఉద్రేకం, ఉద్వేగం, ఆవేదన, కడుపు నొప్పి, మంట, బాధ, ఏడుపు, దుఖ్ఖం, ఎన్‌టిఆర్ విశ్వరూపం అన్నీ కలిసిపోయాయి.
బిపి మిషన్ ఫట్ మంది.
సుగర్ బియాండ్ లిమిట్స్ అంటోంది గ్లూకోమీటర్.
నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి.
గుండె ఆగిపోయింది.
ఆర్‌ఎంపి I am sorry అనేశాడు గంభీరం గా, విషాదంగా, కళ్ళు తుడుచుకుంటూ .
మంగళం ప్రద్యుమ్న చరితం మంగళం అని పాడుతున్నారు భజన బృందం.
శా. అ. కి ఏం చెయ్యాలో తోచక బిక్కమొహం వేశాడు.
మా అమ్మాయి నిశ్చేస్ఠురాలయిపోయింది.
మా ఆవిడ నిశ్చలం గా, దృఢంగా మనస్సు ఏకీకృతం చేసి మంగళగౌరీ నా మాంగల్యం కాపాడుమా అంటూ తల గౌరీదేవి ఫోటో కేసి టపా టపా కొట్టేస్కుంటోంది.
ధడాంగ్ ఫడాంగ్ అంటూ పెద్ద శబ్దం. ఉన్నట్టుండి కరెంటు పోయింది.
టివి ఆగిపోయింది.
నా కనుగుడ్లు కదిలాయి. ఆర్‌ఎంపి నా గుండెల మీద దభెల్ దభెల్ మని రెండు గుద్దులు గుద్దాడు. ఎందుకేనా మంచిదని ఇంకో మారు కసి తీరా కొట్టాడు. స్టెత్ తో కూడా కొట్టాడు. కొట్టుకొంటోంది వెధవ గుండె మళ్ళీ అని అరిచాడు. మళ్ళీ ఇన్సులిన్ ఎక్కించాడు. బిపి మందు కూడా గుచ్చాడు.
సుగర్ 415 అంది గ్లూకో మీటర్. హార్ట్ బీట్ ఎక్కువే కానీ అండర్ కంట్రోల్ అని అరిచాడు మళ్ళీ ఆర్‌ఎంపి.
నేను కళ్ళు తెరిచాను. నీరసంగా నవ్వేను.
శా. అ. మా ఆవిడ ముందు సాష్టాంగపడి “మాతా మరకత శ్యామా “ అని మొదలుపెట్టేడు.
భజన బృందం మా ఆవిడ కాళ్లమీద పడిపోయి “మహా సాధ్వి వమ్మా, సాధ్వీవమ్మా ప్రభావతీ మహా సాధ్వీవమ్మా” అని పాడారు.
మా ఆవిడ “గైకొనుమా హారతి, హారతి గైకొనుమా మంగళ గౌరీ గైకొనుమా” అని పాడుతూ ఆ హారతి అందరికీ చూపించి నాకళ్ళకి కూడా అద్దింది.
నాకు కొంచెం ఓపిక వచ్చి మిగిలిన మినపసున్నిఉండ అందుకొని నోట్లో వేసుకున్నాను.
ఆరోజున మా కాలనీలో కధలు కధలు గా చెప్పుకున్నారు. మా ఆవిడ పాతివ్రత్యమహిమ గురించి. ఆయొక్క గౌరి దేవిని ఉపాసించి ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్ ని బద్దలు కొట్టించి ఈ యొక్క కరెంటు ను ఆపీ , ఆ యొక్క వెధవ మొగుడి ప్రాణం ఎల్లా కాపాడిందో. ఏ విధంగా ఆ యొక్క యమపాశాన్ని మా ఇంటి గుమ్మం ముందు ఆపిందో, ఇత్యాదులు.
ఆ సినిమా కధ గురించా ఏమో నాకేమి తెలుసు. కరెంటు వచ్చేటప్పటికి ఆ సినిమా అయిపోయింది. అదీగాక మా ఆవిడ ఒట్టు పెట్టించుకుంది నా సిగరెట్ల మీద, మళ్ళీ అ చానెల్ చూడనని. అది సంగతి. మిగతా కధ మీకేమైనా తెలిస్తే మా ఆవిడ వినకుండా నా చెవిలో చెప్పండి.
{అవునూ, నేనింక సినిమా కధలు వ్రాయవచ్చంటారా(??)}