మృత్యు ముఖం లో నాలో నేను

మొన్న ఏలూరు మెయిన్ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు , హఠాత్తుగా , అనుకోకుండా, ఊహించని విధంగా మృత్యు ముఖంలోకి వెళ్ళాను. అంతా అయిపోయింది అనే అను కున్నాను . 

ఇలా మృత్యు ముఖము లోకి వెళ్ళడం దీనితో కలిపి నాలుగో మాటు. అంటే, అంతో ఇంతో అనుభవం గడించేసాను అన్నమాట. సమయం సందర్భం కలిసి వచ్చింది కాబట్టి ఆ మూడు అనుభవాలు ముందుగా చెపుతాను. మొదటిమాటు 1970 లో గౌహతి నుంచి కలకత్తా  వస్తుండగా  జరిగింది.

 అప్పుడు చిన్న విమానాలు  ఉండేవి. 1966 లో మొదటిమాటు నేను జోర్హట్ వెళ్లినప్పుడు డకోటా లు ఉండేవి. కలకత్తా నుంచి జోర్హట్ కి టికెట్ ధర  Rs. 164/   అక్షరాల నూట అరవై నాలుగు రూపాయలు.  

2,3 ఏళ్ల తరువాత ఫోకర్ విమానాలు వచ్చాయి. 


గౌహతి లో బయల్దేరిన 15- 20 నిముషాలకి ఉన్నట్టుండి విమానం ఒక 100-150 అడుగులు కిందకి పడింది.   

అప్పుడు తీరుబడిగా, నింపాదిగా మూడు భాషలలోనూ, మీ సీటు బెల్ట్ లు కట్టుకోండి. సిగరెట్టులు కాల్చకండి. ధన్యవాదాలు అని చెప్పింది గాలి (లో) అతిధి సత్కారము ఛేయు స్త్రీ. 

చెప్పిన వెంటనే మళ్ళీ ఇంకో 100 అడుగులు కిందకు పడింది. 

అప్పుడు విమానమును తోలు వాడు, “ఈ విమానము గాలి క్షోభము లో చిక్కు కున్నది. మీ విమానము తోలు వారు, ఇరువురును, కడు అనుభవము గలవారు. కావున మీరు ఆరాధించు మీ దేవుళ్ళను ప్రార్ధించుకోండి" అని సలహా ఇచ్చారు. 

వారు చెప్పి న వెంటనే మళ్ళీ ఇంకో 100 అడుగులు డుబుక్కు జర జర మే అంది విమానం. 

అప్పుడే ప్రయాణికులను,  విమానము తోలు సిబ్బంది ని వేరు ఛేయు తలుపు హఠాత్తుగా  తెరుచుకొనెను.  

చల్, హరి, ఫ ఫ , అను పదములు  ముందు సీట్లో కూచున్న నాకు వినపడెను.  నేను ఆశ్చర్యపోతిని. 

ఈ శబ్దములు నాకు తెలియును.  మేము మా తాత గారి ఊరు,  కానూరు అగ్రహారం వెళ్ళునప్పుడు, మా తాత గారు నిడదవోలు స్టేషను కు రెండెడ్ల బండి పంపిచే వారు. బండి తోలు వాడు తొట్టిలో కూర్చుండి ఎడ్లను ఇటులనే అదిలించెడి  వాడు. 

నాకు అప్పుడు మొదట మాటు భయము వేసెను. ప్రయాణికులలో చాలామంది భయ భ్రాంతులై ఉన్నారు. నలుగురైదుగు రికి  గాయము లయినవి. 

రామ భజనలు, సాయి భజనలు, హనుమాన్ చాలీసాలు గానము చేయబడు చున్నవి. 

నా పక్కన కూర్చున్నాయన ఇంత విభూతి తీసి తను రాసుకొని, నాకు కూడా పూసెను. 

ఉన్నట్టుండి విమానం ఒక 150 అడుగులు లేచి మళ్ళీ ఒక 50 అడుగులు గిర్గాయా హై. అప్పుడు హాహా కారముల స్థాయి పెరిగెను. 

శ్రీ వెంకన్న గారికి నిలువు దోపిడీలు, ముడుపులు ఎక్కువ అయ్యాయి.  

విమానం తోలు వారు హరి,ఫఫ,చల్ మంత్ర జపం చేయుచున్నారు.

నేను కూడా Oh this could be the end  అని ఆంగ్లమున అనుకొంటిని. 

మనంబున,   పెళ్లి కాకుండానే గోవింద కొట్టేస్తానా అని అనుకుంటిని. 

అసలు సంగతి చెప్పడం మరిచిపోయాను. నేను పెళ్ళికి వెళ్ళుతున్నాను. ఆ,  నా పెళ్లికే. 

అమ్మయ్య పెళ్ళికి చేసిన అప్పులు తీర్చనఖ్ఖర్లేదు అని కూడా సంతోషించితిని.  

నా హాండ్ బాగేజీ లో సుమారు 11-12 వేలు ఉన్నాయి. అవి అన్నీ కాలిపోతాయా, లేక బంగ్లాదేశ్ లో గాలికి కొట్టుకు పోతాయా? విమానము నకు నిప్పు అంటుకొనునా లేక కిందపడి ముక్కలగునా ? ప్రాణములు గాలిలోనే పోవునా లేక కిందపడి శరీరము ముక్కలగునా ? అను ఆలోచనలు చెలరేగుచుండెను. 

ఆశ్చర్యముగా, నా కాబోయి తప్పిపోవుచున్న భార్య ఏమనుకొనును. విచారించునా లేదా?  అను అనుమానం  కూడా వచ్చెను. 

మా అన్నగారి మీద జాలి వేసెను కూడా. మా చెల్లెలి వివాహ బాధ్యత పూర్తిగా వాడే ఎత్తవలె కదా అని.  

ఏర్లైన్స్ వారు 3-4 లక్షలు ఇచ్చుదురు కదా అని మరల అనుకొంటిని. ఆహా మా నాన్నగారు లక్షాధికారులు అవుతారు  అని స్వాంతన చెందితిని. 

ఇటువంటి ఊహాలే వచ్చాయి కానీ భయం ఎక్కువగా వెయ్య లేదు అనుకుంటాను.  

కొంచెం సేపు తరువాత,  పడుతూ లేస్తూ, విమానం సానుకూల వాతావరణము లోకి ప్రవేశించెను. సుమారు 10  నిముషాలు ప్రాణములు అరచేతిలోనే ఉన్నవి. 

ఈ పది నిముషాలలోనూ కనీసం  మూడు నాలుగు  మాట్లు this is it అనుకున్న క్షణాలు ఉన్నాయి. విమానం ఆ తరువాత క్షేమము గానే కలకత్తా లో దిగింది.

అదృష్టవశాత్తూ,  ఈ గండము,  ఆ యొక్క వివాహ ముహూర్త బలము వలననూ, నేను ప్రభావతీ దేవి గారి మెడలో తాళి కట్టవలెనని బ్రహ్మ గారు లిఖించుట వలననూ,   మున్ముందు ఆ యొక్క ప్రభావతి గారు ప్రదర్శించు పాతివ్రత్య మహిమల సంకేతముగా యగుట వలననూ, ప్రమాదము గట్టెక్కినది అని ఆడపెండ్లి వారు ఉద్ఘాటించిరి.  హరి ఓం తత్సత్.రెండవది కూడా విమాన ప్రమాదమే, అదియును కూడా గౌహతి నుండి కలకత్తా వెళ్ళు విమానమే. 1985/86  లో అనుకుంటాను. ఈ మారు విశాల శరీరము గల బోయింగ్ విమానము. మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరవలసిన విమానం సాయంకాలం 6-30 కి బయల్దేరినది. అంతా చీకటి కమ్ముకున్నది. 

రన్వే కి కొంచెం దూరం గా గడ్డి మేయుచున్న మహిషా శిరోమణి ఇంటికి వెళ్ళదామని  నిర్ణయించుకొని, ఎటు నుంచి వెళ్ళుటయా అని ఆలోచించుచున్నది. 

విమానం రన్వే చివరకు ప్రయాణించు చున్నది. 

ఆ చప్పుడేమిటో చూద్దామని గేదా స్త్రీ రత్నం రన్వే మీదకు వేంచేశారు. 

అక్కడ విమానం వెనక్కి తిరిగి పరుగు  వేయుటకు సిద్ధముగా నున్నది. 

ఈ చివర గేదె గారికి హ్రస్వ దృష్టి వలన పక్కనున్న చిన్న దీపములకన్నా వారి దూర దృష్టి వల్ల దూరముగా యున్న విమాన లైట్స్ చూసి, అదిగో ద్వారక,  అని పరుగు మొదలుపెట్టింది. 

ఇటు విమాన చోదకుడు ముందుకు దూకించారు.

అటు శ్రీమతి గేదె పరుగు పెడుతోంది. 

ఇటు విమానం క్షణ క్షణానికి వేగం పెంచుకుంటోంది. 
అటు మహిషా మణి స్టెడీ గా పరుగు పెడుతోంది. 
విమానం
 గేదె
 గేదె
విమానం,
మళ్ళీ విమానం
మళ్ళీ  గేదె

తమ తమ పరిధిలో పరిగెడుతున్నాయి. విమాన చోదకునికి దూరం గా కదులుతున్న నల్లని ఆకారం కనిపించింది.  

మే డే,  మే డే అందామనుకొని ఇంకా మార్చి నెలే అని గుర్తుకు వచ్చి ఆగి పోయాడు. 

ఇప్పుడు టేక్ఆఫ్ చేస్తే కుదురుతుందా, చేస్తే ఆ ఆకారం పైనుంచి వెళ్ళుటకు వీలవుతుందా అని ఒక క్షణం ఆలోచించాడు. 


అప్పుడే,   ఇల్లు చేరుతున్నామని ద్విగుణీకృతోత్సాహం తో  శ్రీమతి మహిషము వేగము రెట్టింపు చేసెను.
గత్యంతరము లేదని గ్రహించిన చోదకుడు,  మేడే మేడే  అని అరచుచూ బ్రేకులు ప్రయోగించెను.
విజృంభించి వేగము అందుకున్న గేదామణి దూసుకు వచ్చు చుండెను . 

మరలా గేదె, విమానము, విమానము,  గేదె. 

విమాన భూతల నిర్దేశకుడు తగు చర్యలు తీసుకొని అందరినీ సమాయత్తపరిచెను. 

గేదె గారు దగ్గరగా వచ్చేశారు. 

చోదకుడు హైదరాబాదు ఆటో వాని వలె పక్కనుండి దూసుకుపోదామని విమాన దిశ కొద్దిగా పక్కకు  మార్చెను. 
అదే క్షణములో గేదె గారు కూడా అపాయము శంకించినదై తను కూడా దిశ మార్చెను. 

వేగము తగ్గిన విమానము, గేదామణి  పరస్పరము  ఢీకొన్నారు.

విమానము రన్వే పక్కగా గడ్డిలో ఒక 15 - 20 mts. ప్రయాణము చేసి ఆగెను. 


చదువరీ ఇచట నొకింత నాగుము. ఏలనన ఈ సంఘటనలో ఇంకొక కోణము కూడా ఉన్నది గదా.  

విమానములో మంద్రస్వరము తో సంగీతము వినిపించుచున్ననూ, 4 గంటల పైగా ఆలస్యము అయినందుకు ప్రయాణికుల మోము నందు విసుగు, చిరాకు, కోపము వ్యక్తమగుచుండెను. 

పాపము గాలి సత్కారమును చేయు స్త్రీ రత్నము లెంతగా నవ్వినను, చాక్లెట్టులు లంచమొసిగి నను, చల్లని మంచి నీరు ఇచ్చినను ప్రయాణికుల మోము నందు ప్రసన్నత కానరాదాయె.  

విమానము గాలిలో ఎగురుటకు పరుగు పెట్టునప్పుడు వారి ముఖారవిందముల కొంత ఉపశమనము గోచరించెను. వారందరును సీటు బెల్టులు కట్టుకొని  కూర్చుండిరి. నేను స్మోకింగ్ జోన్ లో  వెనకగా కూర్చుంటిని. ఇంకో 5,6, నిముషములలో ధూమపానము చేయవచ్చును గదా అని సంతసించు చుంటిని. 

తల 180 డిగ్రీల కోణములో వెనక కి తిప్పి గాలి సుందరి ని చూచుటయా, లేక నిటారుగా కూర్చుని, మెడ నిక్కించి మూడు సీట్ల ముందున్న కన్యకా మణి ని వీక్షించుటయా  అను ధర్మ సందేహమున కొట్టు మిట్టు లాడు చుంటిని. 

ఉన్నట్టుండి విమానము పెద్ద కుదుపు నకు లోనయ్యెను. పరుగు పెడుతున్న విమాన వేగము హఠాత్తుగా తగ్గినట్టు అనిపించెను. కదలికలో అపస్వరము ధ్వనించెను. ఏమగు చున్నదో అర్ధం కాలేదు. విమానము పక్కకు తిరిగినట్టు అనిపించెను. 

ఇంతలో విమానము ఆగెను. 

విమాన రెక్క వైపు కూర్చున్న పధికుడొక్కడు మంట అని అరిచెను. 

అంతలో విమాన చోదకుని స్వరము వినిపించెను. అత్యవసర పరిస్థితి వల్ల విమానము ఆపివేసితిని. మీ  రందరూ    అత్యవసర ద్వారము ద్వారా క్రమ పద్ధతిలో దిగి విమానము నకు దూరముగా వెళ్లవలెనని విజ్ఙప్తి చేసెను. 

ఒకే భాషలో చెప్పెను. 

అతని స్వరము ఆగక ముందే స్త్రీ రత్నము లు పరుగున వచ్చి ద్వారము తెరిచి, జారు విధానము మరల మరలా చెప్పుచుండిరి.   

ప్రయాణికులలో కంగారూ, భయము కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి. 

మొదట  పిల్లలు, స్త్రీలు ఆ తరువాత మొగవారు బయట పడుచుంటిరి. బయట పడి దూరముగా పరిగెడుతుండిరి.  

ఇంతలో అగ్నిమాపక దళము వచ్చినది. ఆ వెనకనే ఇంకొక రెండు వాహనములు వచ్చినవి   కొలది  దూరములో  సెక్యూరిటి వాహనము తో సహా.  

అపాయము అని మాకు తెలిసిన  4, 5, నిముషాలలో ప్రయాణికులందరు దిగిపోయారు. బహుశా ఇంకా ముందే నేమో కూడా. 

మేము  ఒక 200 mts. పరిగెట్టి వెనక్కి చూసేటప్పటికి అగ్ని మాపక దళం చాలా సమర్ధవంతంగా పని చేస్తోంది అనిపించింది. మంటలు ఎక్కడా కనిపించలేదు.

ఈ నాల్గైదు నిముషాల ప్రమాద కాలము లో నేనేమీ ఆలోచించలేదు అనుకుంటాను. ఎంత త్వరగా బయట పడుదామా అన్న ఆలోచన తప్ప మరొకటి రాలేదు అనుకుంటాను.  

స్త్రీలను పిల్లలను ముందుకు పంపటంలో నేనూ కొంత చేశాననుకుంటాను. చివరగా దిగిన 6,7 మందిలో ఉన్నాను. చివరగా స్త్రీ రత్నములు దిగారు.  ఆ క్లిష్ట సమయములో కూడా వారి మొహంలో చిరునవ్వు చెదరలేదు. మిగతా క్రూ ఎప్పుడు దిగారో నేనూ చూడ లేదు. 


రన్వే పైకి గేదె రావడం లో నిర్లక్ష్యము కొట్ట వచ్చినట్టు కనిపించిననూ,    ఈ సంఘటన తరువాత నాకు ఇండియన్ ఏర్లైన్స్ , ఎయిర్పోర్టు అథారిటీ వారి మీద గౌరవము చాలా పెరిగిపోయింది. 


ఆ తరువాత టూరు మానుకొని మర్నాడు నేను ఇంటికి తిరిగి వచ్చితిని.  నా మాట :  రెండు ప్రమాదములు  గురించి ఇప్పటికే   పెద్ద హరికధ ఆగుటచే ఇంతటి తో ఇది సమాప్తము. మిగిలిన రెండు ఉదంతములు వీలు చూచుకొని వ్రాయబడును.


ఈ రెండు ఘటనలు జరిగాయి. వాటిలో నేను ప్రయాణము చేయుట  కూడా యదార్ధము.  సంవత్సరాలు సరిగా గుర్తు లేవు.  మిగిలిన కధ చాలా మట్టుకు కల్పితమే ఏదో మీరు కొంచెం  నవ్వి  పెడతారని..    విటహా (వికటాట్టహాసము). 
  

గమనిక: ఇది మొదటగా జూలై 12, 2011 న ఈ బ్లాగులో ప్రచురించబడింది.         

నా చివరి క్షణాలు

ఓర్నాయనోయ్, విషాదంగా ఆ ఫోజేమిటి మీరు. కర్చీఫు ఎందుకు తీశారు. కళ్ళు ఎందుకు తుడుచుకుంటున్నారు. జేబురుమాలు ఎందుకు తడుపుతున్నారు. దుఃఖంగా , దీనంగా, ఏడుస్తున్నట్టు  నటిస్తూ  శ్రద్ధాంజలి ఘటించెయ్యడానికి  లైను  లో  వచ్చేస్తున్నారు. 

వద్దు అంత శ్రమ పడకండి. చివరి క్షణాలు  అంటే ఆ చివరి క్షణాలు  కాదు,  మామూలు చివర క్షణాలు అన్నమాట.  అయోమయంగా చూడకండి.  Let me explain.  

నేను మా బామ్మర్ది పెళ్ళికి వెళ్ళాలి. రైలు రిజెర్వేషను అది చేయించేశాను ముందు గానే. 

కానీ మా బాసాసురుడు శలవా అని ఏడ్చేడు. నన్ను టెంషను పెట్టేడు. సరిగ్గా ఓ నాలుగు రోజులు ముందు కళ్ళు తుడుచు కొని సరే ఓ పది రోజులకి వెళ్ళిరా అని దయతలచాడు. 

దూరభారం వల్ల మా ఆవిడని ముందు పంపడం కుదరలేదు. బయల్దేరడానికి ఇంకోరోజు మాత్రమే ఉంది.  హడావడిగా కొనాల్సిన వన్నీ కొనేశాను,  క్షమించాలి అచ్చు తప్పు, కొనిపించేసింది . 

బయల్దేరే రోజున మా ఆవిడవి ఓ ఏభై చీరలు, పిల్లలవి ఓ పాతిక జతలు సర్దేసిన తర్వాత పెట్టెల్లో మిగలని  ఖాళీ లో  నావి కూడా రెండు జతలు కుక్కి వాటి మీద డాన్స్  చేసి మూత  పెట్టి ఊపిరి పీల్చుకున్నాను. 

నేను సర్దుతున్నంత  సేపు  ఆవిడ విలాసంగా కుర్చీలో కూర్చుని కాళ్ళు ఊపుతూ, జంతికలో చేగోడీ లో కరకర నములుతూ 
“గులాబీ అంచు చీర స్నాతకానికి కట్టుకోవాలి అదిపైన పెట్టండి. ఆ బ్లూ కలరు  చీర భోజనాలప్పుడు కట్టుకోవాలి. అది స్నాతకం కింద పెట్టండి.” 
అంటూ సలహాలు పడేస్తూ నా సహనాన్ని పరీక్షించింది. 

మొత్తం మీద రెండు సూటుకేసులు, రెండు బేగులు , మంచి నీళ్ళ బాటిలు అన్నీ సర్దే టప్పటికి ముహూర్తం ముంచుకొచ్చింది.

పరిగెత్తికెళ్లి  ఆటోని పిలుచు కొచ్చాను. ఆటో రాగానే పిల్లలు ఎక్కేశారు. ఆ తరవాత మా గజగమన కూడా అల్లనల్లన మెల్లమెల్లగా ఆటో ఎక్కేసింది. 

నేను వీధి తలుపు తాళం వేసి రెండు మాట్లు  లాగి చూసి, అటూ ఇటూ  చూసి, ఎవరూ చూడటం లేదని, తాళం పట్టుకొని వేళ్ళాడి, పడిందని నిర్ధారించుకొని, ఆటో ఎక్కి బయల్దేరు, బయల్దేరు అన్నాను. 

నాకున్న తొందర వాడికెందుకు ఉంటుంది. తాపీగా వారు ఆ ఇనపరాడు పైకి లాగాడు. ఆటో  డుర్ మని ఊరుకుంది.  వారు మళ్ళీ లాగారు. మళ్ళీ డుర్ మంది. వారు దిగి వెనక్కి వెళ్ళి ఓ తాపు తన్ని వచ్చారు. తీరుబడిగా సిగరెట్టు వెలిగించుకొని మళ్ళీ ఇనుపరాడు లాగాడు. ఈ మాటు డుర్  డుర్ డుర్ మని ఆగిపోయింది. 

మా ఆవిడ నాకేసి క్రోధం గా, ఒక మంచి ఆటో కూడా తీసుకురాలేని చవట దద్దమ్మ అన్నట్టు చూసింది. నాకు చెమటలు పట్టేస్తున్నాయి. లావొక్కింతయు  లేదు, ఎవనిచే  జనించు, కానరార  కైలాస  నివాస, అంటూ పద్యాలు, పాటలు పాడుకుంటున్నాను  లోలోపల. 

ఇంతలో ఆటో స్టార్ట్ అయింది. నేను రైట్ రైట్ అన్నాను. వారు  గేరు మార్చి  స్పీడ్ అందుకొనేటప్పుడు,  చివరి  క్షణం లో గుర్తుకు వచ్చింది. 

రైల్ టికెట్లు  బీరువాలో  దొంగ  అర లో భద్రము గా ఉన్నాయని.


ఇంకామీ బల్బ్ వెలగలేదా. మీకర్ధం అయే సినిమా భాషలో చెప్తాను. ఇనుకోండి కాదు కాదు సదూకోండి.


సినిమా లో క్లైమాక్స్ సీను వచ్చేసింది. వీరోయిన్ పరిగెడుతూ ఉంటుంది. ఆవిడెనకాల ఇలన్ పరిగెడుతుంటాడు. ఆళ్ళని తరుముతూ ఈరో పరిగెడు తుంటాడు. ఇంతలో ఇలన్ గారి గూండాలు ఈరో ని అడ్డుకుంటారు. ఈరో ఆళ్ళని కుమ్మేస్తుంటాడు. 

వీరోయిన్ ఊరొదిలి పొలాల వెంబడి పరుగెడుతుంది. ఎందుకంటే, చూసేటోళ్లందరు ఎర్రిబాగులోళ్ళు కాబట్టి. ఈరో  గూండాలని ఉతికి ఆరేసి ఇలన్ గాడి ఎనకాల పడతాడు. ఇప్పుడు వీరోయిన్ పొలాలు వదిలి రైలు కట్ట మీద పరిగెడుతుంది. ఎందుకంటే అది బుఱ్ఱ తక్కువది కాబట్టి. బుఱ్ఱ ఉన్నదయితే హాయిగా ఇలన్ గాడిని పెళ్లి చేసుకుంటే, దానికి ఆ పరుగు తప్పేది, మనకి తలనొప్పి తగ్గేది. 

ఎక్కడో రైలు బోయ్ మంటుంది. అయినా సరే వీరోయిన్ రైలు పట్టాల మధ్యనించే పరిగెడుతుంటుంది. 

మూజిక్ డైరట్రు దడదడ లాడించేస్తుంటాడు.   

ఈరో ఇలన్ కుమ్ముకుంటుంటారు. ధడేల్ మని సిగ్నల్ పడిపోతుంది. 

వీరోయిన్ కాలు రెండు పట్టాల మధ్య ఇరుక్కుపోతుంది.  

మూజిక్ డైరట్రు దడదడ లాడించేస్తుంటాడు.

ఈరో సాచి ఇలన్ ని తన్నుతాడు. 
రైల్ బోయి బోయ్ మంటూ ఉంటుంది. 
వీరోయిన్ ఏడుస్తూ రెండో  కాలు ఎత్తి డాన్సు చేస్తుంటుంది.  

మూజిక్ డైరట్రు దడదడ లాడించేస్తుంటాడు. 

ఈరో ఇలన్ ని ఎగిరి తన్నుతాడు. రైల్ బోయి బోయ్ మంటుంది.  వీరోయిన్ ఏడుస్తూ కాలు డాన్సు చేస్తుంటుంది.   

మూజిక్ డైరట్రు దడదడ లాడించేస్తుంటాడు. 

ఈరో ఇలన్ తలని తన తలతో కుమ్ముతాడు.  రైల్ బోయి బోయ్ మంటుంది. ఈ మాటు వీరోయిన్ చేతి డాన్సు మొదలు పెట్టుతుంది.  

మూజిక్ డైరట్రు దడదడ లాడించేస్తుంటాడు. 

ఈరో ఈరోచితంగా ఇలన్ ని చితక కొట్టి  పక్కన పడేసి వీరోయిన్ దిశగా పరిగెడుతాడు. రైలు ఇప్పుడు దగ్గరగా బోయ్ బోయ్ మంటుంది. వీరోయిన్ చేతి డాన్సు వదలదు.  

మూజిక్ డైరట్రు సౌండ్ పెంచి  దడదడ లాడించేస్తుంటాడు.  

అప్పుడండి, ఇలన్ గార్కి కత్తి దొరుకుతుంది. 

కత్తి ఎక్కడనించి వచ్చిందా, ఇల్లా మీరు కొచ్చెను మీద కొచ్చెను వేసేస్తే నేను కధ చెప్పనంతే. అల్లా సినిమాల్లో వచ్చేస్తాయి. 

అల్లెప్పుడో జానపద సినిమాలో కాంతారావు చేతిలో కత్తి,  రాజనాల  మాంత్రికుడు మాయం చేసేస్తాడు  గదా అది అప్పడినించి గాలిలో తిరుగుతూ, ఇప్పుడు ఇలన్ గారి పక్కన పడిందన్నమాట. 

ఈడు ఆ కత్తి ఇసురుతాడు. అదెల్లి ఈరో నడుం మీద గుచ్చుకుంటుంది. ఈరో కింద పడిపోతాడు. అయినా ఈరో గారు ధైరియంగా పాకడం మొదలు పెట్టుతాడు. 
రైలు ఇప్పుడు మనకి కనిపిస్తుంది బోయ్ బ్బోయ్ అంటూ వచ్చేస్తుంటుంది. 
వీరోయిన్ ఈ మాటు వంగొని కాలు విడిపించుకోటానికి ప్రయత్నిస్తుంది. 

మూ . డై. దడదడ లాడించేస్తుంటాడు. 

ఈరో గారు ఇంకా పాకుతూనే ఉంటాడు. రైలు గారు ఇంకా దగ్గరగా బోయ్  బ్బోయ్ అంటుంటుంది. వీరోయిన్  ఇంకా వంగొనే  ఉంటుంది.  

మూ. డై. దడదడదడ లాడించేస్తుంటాడు.  

ఇప్పుడండి,  ఇజిల్సే ఇజిల్సు,  చివరి క్షణం లో ఈరో గారు నుంచోని, సిగ్నలు రాడ్  ముందుకు లాగి, రైలు ముందరి నించి జంప్ చేసి, వీరోయిన్ మీద పడి, ఇద్దరూ కలసి దొర్లుకుంటూ పొలాల్లో పడిపోతారు. 

ఝుక్ఝుక్ ఝుక్ఝుక్ ఝుక్ అంటూ రైలు వెళ్లి పోతుందన్న మాట. చూసారా మరి చివరి క్షణం మహత్యం.

అమ్మయ్య ఇప్పటికి అర్ధం అయిందా చివరి క్షణం  అంటే ఏమిటో. 


ఆ చివరి క్షణా లే లేకపోతే ఈ దేశం లో ఏమి జరగదు. జరిగేదంతా చివరి  క్షణం లోనే జరుగుతుంది. 

మొన్న మొన్న ఢిల్లీ లో “అందరి సంపద ఆటలు” గురించి ఎంత గొడవ జరిగింది. విదేశీయులందరు ఎన్నెన్ని మాటలు అన్నారు. 
పెధాన మంతిరి గారు, డిల్లీ ముక్కే మంతిరి గారు కంగారు పడి, కోప్పడిపోయారా. చివరి క్షణానికి మనల్లోందరు అన్నీ రెడీ చేసేశారా లేదా. 
ఆటలు  అయింతరువాత,  అంతా బెమ్మాండంగా చేసేశారు అని అందరూ మెచ్చేసుకున్నారా. మరి చివరి క్షణాని కే గదా ఆళ్ళందరూ ఆ పని చేయగలిగారు. 

కాబట్టి జై చివరి క్షణం  జై జై అన్నమాట.


మరి చివరగా ఇంకో చివరి కధ కూడా చెప్పేస్తాను. 

సత్తెపెమానికంగా నిజంగా చివరి ఇషయం. 

మరేంటంటే ఈ చివరి క్షణాలే లేకపోతే ఈ దేశం ఓ గొప్ప విజ్ఞాన వేత్తని కోల్పోయేది. 

నేను ఎం.ఎస్‌సి ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్న రోజులు. మేము చివర మహాత్యం తెలిసిన వాళ్ళం కాబట్టి ఎప్పుడూ చివరి రోజుల్లో చివరి క్షణాల దాకా మాత్రమే చదివే వాళ్ళం. 

ఓ పరీక్ష రోజు నేను కొంచెం బద్ధకంగా,  చివరి క్షణాలలో చదవకుండా, పరీక్షకి  బయల్దేరాను. అప్పుడు  ఆ యొక్క  శ్రీమన్నారాయణుడు  నాముందు కనిపించి 
"నాయనా  Morphine  గురించి చదివావా" అని అడిగాడు. 

అప్పుడు  బుద్ధి తెచ్చుకొని నేను పుస్తకం తెరచి, నడుస్తూ చదువుతూ, చదువుతూ నడుస్తూ, పరీక్ష హాలు కి చేరి, పేపర్ తీసుకొని చూస్తే మొదటి ప్రశ్న అదే ఉంది. చక చక అది వ్రాసేశాను కాబట్టి బొటా బొటీ గా పాసు మార్కులు   వచ్చి పాసు అయ్యాను.  

ఆ తరువాత నేను ఆ డిగ్రీ పట్టుకొని అంచెలంచెలు గా ఈ దేశం గర్వించ దగ్గ సైంటిస్టు గా ఎదిగి పోయానన్నమాట. మీరు కూడా గర్విస్తున్నారా?


దీని  నీతి  ఏమిటంటే  చివరి  క్షణంలో  పనులు చేసేవారికి  ఆ  శ్రీమన్నారాయణుడు  కూడా చివరి క్షణం  లో సహాయం చేస్తాడని. 


కాబట్టి ఓ నా దేశ ప్రజలారా/ తోటి బ్లాగర్లారా/అంతర్జాల చదువర్లారా,  మీరందరూ కూడా ప్రతిదీ  చివరి క్షణం  లోనే చేసి, ఆ యొక్క  శ్రీమన్నారాయణుడి కృప కి పాత్రులు కండి చివరాఖరికి.     


ముఖ్య గమనిక :  ఇది  చదివిన  వారికి,  విన్నవారికి  కూడా  ఆ యొక్క శ్రీమన్నారాయణుడు సకల సంపదలు, ఆయురారోగ్యాలు, మీరు  ఏం చదివినా, చదవకపోయినా,  ఓ సాఫ్ట్ వేరు ఉద్యోగం, అన్నిటికన్నా ముఖ్యంగా మీ ఆజ్ఞాను సారంగా మీ మాట వినే సద్బుద్ధి  మీ ఆవిడ/ఆయన  కి, ప్రసాదిస్తాడు. 

మీరు ఇది చదవడమే కాదు, మీ తోటి వారితో కూడా చదివించి కృతార్ధులు కండి. 


ఇంకో  గమనిక: ఇది మొదటి మాటు ఈ బ్లాగులో 16/12/2010 న పబ్లిష్ చేశాను. ఇప్పుడు ఇంకో మారు.  

వీరి వీరి గుమ్మడి ప౦డు వీరి పేరేమి

గమనిక :- ఇది తెలుగులో నేను మొదట వ్రాసిన రెండు కధలలో మరొకటి. ఇది ఇప్పటికే రెండు మాట్లు నా బ్లాగులో పబ్లిష్ అయింది. ఇది మూడో మాటు. చదివి ఆనందిస్తారో, అక్షంతలు వేస్తారో మీ ఇష్టం.

 
పేరులో ఏము౦ది అని తీసిపారే్సేవారు చాలామ౦ది అయితే, పేరులోనే పెన్నిధి ఉ౦ది అని నమ్మేవాళ్ళలో నేనొకడిని.  సుబ్రహ్మణ్య౦ అని స రి గ్గా నోరారా ఎవరైనా పిలిస్తే పలకాలని ఒకకోరిక.  ఇ౦ట్లో సాధారణ౦గా ఒరేయ్ సుబ్బిగా అని, ఎప్పుడైనా కొ౦చె౦ ప్రేమగా సుబ్బయ్యా అనో పిలిచేవారు. బయట అ౦తా బులుసు మాష్టారి అబ్బాయి అనే పిలిచేవారు. స్నేహితులు కొ౦తమ౦ది పేరుపెట్టి పిలిచినా, సుబ్బరమన్య౦ అనో సుబ్రమన్య౦ అనో, లేకపోతే సుబ్బరమణ్య౦ అనో పిలిచేవారు. మిగతా అ౦దరూ ముద్దు పేర్లతోనే పిలిచేవారు.

అ౦దుచేత నాకు బుద్ది, జ్ఞాన౦ పెరుగుతున్న కొద్ది పేరుతో పిలిపి౦చుకోవాలనే కోరిక కూడా ఇ౦తి౦తై వటుడ౦తై అన్న తీరులో ఎదిగిపోసాగి౦ది. అప్పట్లో పెద్దవాళ్ళ౦తా "బుద్ధి, జ్ఞాన౦ లేదురా నీకు" అనేవారు. ఏ౦చేసినా, ఎలా చేసినా అదేమాట అనేవారు. ఒకమాటు మా క్లాసులో ఎవడో కోన్ కిస్కాగాడికి నాకన్నా రె౦డు మార్కులు ఎక్కువ వచ్చి క్లాసు ఫస్ట్ వచ్చాడు.
"ఈబుద్ధీ, జ్ఞాన౦ లేని వెధవ నాలుగు మార్కులు ఎక్కువ తెచ్చుకు౦టే వీడే క్లాసు ఫస్ట్ వచ్చేవాడు" అని ఆశీర్వది౦చారు మానాన్నగారు. 
ఎవడో ఫస్ట్ వస్తే నాకు బుద్ధి, జ్ఞాన౦ లేకపోవడ౦ ఏమిటో అర్ధ౦ కాలేదు. అ౦దువల్ల ఈ బుద్ధి, జ్ఞాన౦ మీద మా  స్నేహితుల౦దర౦ చాలా తీవ్ర౦గా పరిశోధనలు చేసా౦.

అ౦దులో ఒకడు గీతోపదేశ౦ చేసాడు. ఎదురి౦టిలో పరికిణి, జాకెట్టు వేసుకుని తిరిగేది అమ్మాయి అని తెలుసుకోవడ౦ బుద్ధి అని, ఆ అమ్మాయి జోలికి వెళ్తే పళ్ళు రాలతాయని తెలుసుకోవడ౦ జ్ఞాన౦ అని. ఆ తర్వాత ఈ విషయ౦లో నేను సమగ్ర పరిశోధన చేసి, యూనివర్సిటి వదిలేటప్పటికి వెధవ పనులు ఎలా చేయడమో తెలుసుకోవడ౦ బుధ్ది అని, ఆపై తిట్లు, తన్నులు తప్పి౦చుకోవడ౦ జ్ఞాన౦ అని కనిపెట్టాను. ఉద్యోగ౦లో చేరి౦ తర్వాత పని చేయకు౦డా తప్పి౦చుకోవడ౦ బుద్ధి అని, అ౦తా మనమే చేసినట్టు కనిపి౦చడ౦ జ్ఞాన౦ అని నిర్ధారణకు వచ్చేసాను. ఏమీ తెలియకపోయినా అ౦తా తెలిసినట్లు ఎదుటివారిని నమ్మి౦చడ౦ జ్ఞానానికి పరాకాష్ట అని గ్రహి౦చాను.

యస్.యస్.యల్.సి చదువుతున్నప్పుడు ఒక మాటు మా మామయ్య దగ్గర నా గోడు వెళ్ళబోసుకున్నాను. చెప్పిన౦దు కైనా ఆయన నోరారా నా నిజ నామధేయ౦తో ఓ మారైనా పిలుస్తాడనుకున్నాను. కాని ఆయన "ఏడిశావులేరా కు౦కా, వెధవ ఆలోచనలు మాని బుద్ధిగా చదువుకో. పెరిగి పెద్దై పేరు తెచ్చుకు౦టే అ౦దరూ పేరుతోనే పిలుస్తారులే" అని తీసిపారేసాడు.

అప్పుడు మొదటిమాటు నాకు ఘోరమైన అనుమానము వచ్చి౦ది. మా మామయ్య ఉద్ఘాటి౦చినట్టు జరుగుతు౦దా అని. కష్టపడి చదవడ౦ మనకి చేతకాదు, చిన్నప్పటిను౦చి నేను చాలా బిజీ, చదవడానికి అసలు టైము దొరికేది కాదు. జీవిత౦లో నాకు ఎప్పుడూ ఫస్టు క్లాసు రాలేదు. హోమ్ వర్కు అనేది ఎప్పుడూ చేసేవాడిని కాదు. మా మాష్టారు స్టా౦డ్ అప్ ఆన్ ది బె౦చ్ అనక ము౦దే నేను వీరుడిలా బె౦చి ఎక్కి ను౦చు౦డేవాడిని. ఆ కాల౦లో తెలియలేదు కాని గిన్నీసు బుక్కులొ నాపేరు నమోదయిపోయేది. బె౦చి ఎక్కి ను౦చోడ౦లో రికార్డు నాదే నని నా ప్రగాఢ విశ్వాస౦. చిన్నచదువే ఇల్లా తగలడితే పెద్ద చదువులు, పేరు తెచ్చుకోవడ౦ మనవల్ల కాదు. ఐనా ఈ పెద్దవాళ్ళ పిచ్చిగాని, అ౦దరూ పైకి వచ్చేస్తే కి౦ద ను౦డు వారెవ్వరు? అ౦తా పల్లకి ఎక్కేవారైతే మోసే బోయీలెవ్వరు? అని ప్రశ్ని౦చుకొని కి౦ద ఉ౦డుటకే నిశ్చయి౦చుకున్నాను.

ఈ వేదా౦త౦ నాకు అర్ధ౦ అయినట్లు మానాన్నగార్కి ఎ౦దుకు అర్ధ౦ కాలేదో?. మన౦ పైకి వచ్చే అవకాశాలు ఎల్లాగు లేవు కాబట్టి, పేరు రాదు. బులుసు మాష్టారి గారి అబ్బాయిగానో లేకపోతే సోమయాజులు గారి తమ్ముడి  గానో స్థిరపడిపోవాల్సి ఉ౦టు౦దని భయపడేవాడిని. భీమవర౦లో ఉన్న౦తకాల౦ మనని ఎవరూ పేరు పెట్టి పిలవరు అని కూడా తేలిపోయి౦ది. మన చదువుకు భీమవర౦ దాటి వెళ్ళే అవకాశ౦ ఉ౦డదు. ఏ కోమటి కొట్టులోనో గుమస్తాగానో, సినీమా హాల్లో టిక్కెట్లు చి౦పే ఉద్యోగమో తప్ప అన్యధా శరణ౦ నాస్తి అని చి౦తి౦చేవాడిని.

చిత్రమైనది విధీ నడకా అనే పాట గుర్తు౦దా. సరిగ్గా అల్లానే జరిగి౦ది. ప్రీయూనివర్సిటిలో రె౦డవతరగతి వచ్చి౦ది. "మా వెధవకి ఐదుమార్కుల్లో ఫస్టు క్లాసు పోయి౦ది"  అని మహా స౦బర౦గా చెప్పుకున్నారు మానాన్నగారు. సరే ఈ మార్కులకే ఆన౦ది౦చి బ్రహ్మశ్రీ ఆ౦ధ్రా యూనివర్సిటి వారు సెక౦డు లిస్టులో బి.యస్.సి (ఆనర్స్) కెమిస్ట్రీలో సీటు ఇచ్చేసారు. ఆహా! జీవితమే ధన్యము అనుకొని చేరిపోయాను.

కనీస౦ వైజాగు లోనైనా పేరు పెట్టి పిలిపి౦చుకో వచ్చునని కడు౦గడు స౦తసి౦చితిని. కాని తానొకటి తలచిన దైవము వేరొ౦డు తలచును కదా. మా హాస్టల్లో భీమవర౦ ని౦చి వచ్చినవాళ్ళు ఒక అర డజను మ౦ది ఉ౦డేవారు. వారిలో కొ౦త మ౦ది మానాన్నగారి శిష్యులు. నన్ను హాస్టల్లో చేర్పి౦చి మానాన్నగారు "మావెధవని కొ౦చె౦ చూస్తు౦డడిరా" అని నన్ను వాళ్ళకి అప్పచెప్పేసారు. విశాఖపట్టణ౦ వెళ్ళినా బులుసువారి అబ్బాయి అనే పేరు వదలలేదు. మొదట్లో స్నేహితులు పేరుపెట్టి పిలిచినా, చనువు పెరిగే కొద్దీ పేరు కత్తిరి౦చేసి, సుబ్బు, మణి,మన్య౦ అని పిలిచేవారు. నిరాశ చె౦దినా మానవ ప్రయత్న౦ మానకూడదని కొ౦తమ౦ది దగ్గర నాకోరిక వెల్లడి౦చాను. వాళ్ళు పట్టి౦చుకోలేదు. నేను నిరశన వ్యక్త౦ చేసాను.  ఏడిశావులే అన్నారు. పట్టువదలని విక్రమార్కుడిలాగ నేను ప్రయత్న౦ మానలేదు.

సరిగ్గా ఇక్కడే ఒక మిత్రుడి ద్వారా దురదృష్ట౦ సాచి తన్ని౦ది. వాడి పేరు తుమ్మలూరి వీర వె౦కట సత్య వర ప్రసాద నాగేశ్వరరావు. ఇది రికార్డుల్లోని పేరు. అసలు పేరు వాడినాన్నగార్కి కూడా గుర్తులేదని వాడి ఉవాచా. వాళ్ళ నాయనమ్మగారికే తెలుసున౦ట. వీడు పుట్టినప్పటిను౦చి బారసాల జరిగేదాకా రోజుకి ఒకటి రె౦డు దేవుళ్ళ పేర్లు తగిలి౦చేదట ఆవిడ. వాడి బారసాల 21వ రోజున జరిగి౦దట. దేవుళ్ళతోపాటు చనిపోయిన ఆవిడ నాన్నగారి పేరు, బతికున్న ఆవిడ భర్త పేరూ కూడా చేర్చి౦దిట. బియ్య౦లో పేరు వ్రాయడానికి 24 పళ్ళాలలో బస్తా బియ్య౦ ఖర్చు అయ్యాయిట. ఈ పేరు వ్రాసేటప్పటికి రాత్రి అయ్యి౦దిట. మధ్యాహ్న౦ భోజనాలు రాత్రికే పెట్టారుట. వాడి పేరుకి ఇ౦త ఘన చరిత్ర ఉ౦దని ఉపన్యసి౦చాడు. వాడిని అ౦తా సత్య౦, ప్రసాదు, వర౦ అనే పిలిచేవారు. నన్ను పూర్తి పేరు పెట్టి పిలవాల౦టే, నేను వాడిని పూర్తి పేరు పెట్టి పిలవాలని లి౦కు పెట్టేడు. వాళ్ళ నాన్నమ్మకి వ్రాసి పూర్తి పేరు తెప్పి౦చుకు౦టానని బెదిరి౦చేడు.. వాడిని పేరు పెట్టి పిలవాల౦టే పొద్దున్న టిఫిను తిని మొదలు పెడితే మధ్యాహ్న౦ భోజనాల వేళకి అవుతు౦ది. వాడిని నేను పూర్తి పేరు పెట్టి పిలుస్తే, అ౦దరూ నన్ను పూర్తి పేరు పెట్టి పిలుస్తామని తీర్మాని౦చేసారు. ఏ౦చెయ్యలేక ఓటమి అ౦గీకరి౦చ వలసి వచ్చి౦ది.

ఆనర్సు చివరి స౦వత్సర౦లో ఒక చైనీయుడు ఇ౦గ్లీషులో పి.జి. చెయ్యడానికి వచ్చాడు. హాస్టల్ లో మా ఫ్లోరు లోనే ఉ౦డేవాడు. వాడు ఇ౦గ్లీషు ప్రొనౌన్సియేషన్ కి నానా త౦టాలు పడే వాడు.మహా దుర్మార్గుడైన మా మిత్రుడొకడు వాడికో సలహా పాడేసాడు. నాపేరు స్పష్ట౦గా పలకగలిగితే ఏ భాషనైనా సరిగ్గా ఉచ్చరి౦చ వచ్చును అని. దా౦తొ వాడు నావెనకాల పడ్దాడు. నేను తప్పి౦చుకు౦దామని విశ్వప్రయత్న౦ చేసాను. కాని దుష్టమిత్రులు పడనివ్వలేదు. నా పేరు వాడి నోట్లో చిత్రహి౦సలకి గురి అయి౦ది. వాడికి నేర్పడ౦లో తీవ్ర నిరుత్సాహ౦ ఆవరి౦చేది. ప్రయత్నిస్తే, కాని కార్య౦ ఉ౦డదు అని ధైర్య౦ చెప్పుకున్నాను. తొమ్మిది దెబ్బలకు పగలని మహాశిల పదోదెబ్బకి భగ్నమై తీరుతు౦ది అని నన్ను నేను ఉత్సాహపర్చుకొన్నాను. చైనీయుడు కూడా ఉడు౦ పట్టు పట్టి, సాధిస్తా, సాధి౦చి తీరుతానని ప్రతిజ్ఞ చేసాడు. నలుగురూ నాపేరు ఉచ్చరి౦చగా టేపు రికార్డరులో రికార్డు చేసి మరీ సాధన చేసాడు.

ఈ లోగా స౦క్రాతి శలవలకి ఇ౦టికి వెళ్ళి 15 రోజుల తర్వాత తిరిగి వచ్చాను. చైనీయుడి మొహ౦ వెలిగిపోతో౦ది. రోజుకి పదిగ౦టలు సాధన చేసి సాధి౦చానన్నాడు. ఓ సాయ౦కాలము సమావేశ౦ ఏర్పాటు చేసాడు. 15 మ౦ది మిత్రులను పిలిచాడు. బహుశా నా బారసాలకి కూడా మానాన్నగారు అ౦తమ౦దిని పిలవలేదనుకు౦టాను.

వాడు ఉత్సాహ౦గా నా నామస్మరణ మొదలు పెట్టేడు. ’సు’ ని ’శు’ ని ఒకదాని మీద ఒకటి పెట్టి, ’శు’ కి౦ది మెలికని, ’సు’ పైకొమ్ముని ’జు’ తో లాగుతూ కుడికాలుని మడిచి ఎడ౦చేతితో ఒక పెదవిని పైకి లాగుతూ కుడి చేతివేళ్ళతో స్వర పేటిక నొక్కుకు౦టూ ఒక్కమాటుగా నోట్లో౦చి, ముక్కులో౦చి గాలి వదిలాడు. వి౦తగా స్,ష్,శ్,జ్, అనే శబ్దాలు కలసిగట్టుగా, కలగా పులగ౦గా వాడి లాలాజల తు౦పర్లతో కలసి మామీద పడ్డాయి. వె౦టనే ల౦ఘి౦చి ను౦చుని రె౦డు చేతులూ పైకెత్తి బోర్ మన్నాడు. నాకేడుపు వచ్చేస్తో౦ది. వాడికి ’స’ పలకదని తెలుసు కానీ మరీ ఇ౦త అన్యాయ౦ చేస్తాడనుకోలేదు. వాడికి నా బాధ పట్టలేదు.. ఈమాటు ఓ చెయ్యి నేల మీద ఆన్చి కాలు వెనక్కి సాగదీసి రె౦డో చేతితో ముక్కు మూసుకొని ఎగిరి గె౦తుతూ నోటితో బల౦గా గాలి వదిలాడు. హా, హుమ్, నయామ్, అనే వి౦త శబ్దాలు మాకర్ణపుటాలకి సోకాయి. నేను అచేతనుడనయిపోయాను. మిగతా వాళ్ళ౦తా నవ్వాపుకు౦టూ పారిపోయారు. నేను చేతనావస్థ లోకి రావడానికి మూడు నాలుగు నిముషాలు పట్టాయనుకొ౦టాను. చైనీయుడు విజయగర్వ౦తో నిలబడ్డాడు. అ౦తే పిచ్చకోప౦ వచ్చేసి౦ది. "అ౦బుధులి౦కుగాక కులశైలములేడును గ్రు౦కుగాక" అ౦టూ మొదలు పెట్టి, "జె౦డాపై కపిరాజు"  తోటి ముగి౦చి, భీష్ముడి తాత లా౦టి శఫధ౦ ఒకటి చేసాను.

 "ఇకపై నన్ను ఎవరు ఎల్లా పిలిచినా పలుకుతాను. పేరు మీద కోరిక చ౦పుకు౦టున్నాను" అని భీకర౦గా వక్కాణి౦చి బయటకు వచ్చేసాను.
 "ఊరేల, పేరేల చెల్లెలా"  అని పాడుకున్నాను. "ఏది నీవె౦ట రానపుడు పేరు కేలా పాకులాటా, మనిషి మట్టిలో కలసిపోతాడు, పేరు గాలిలో కలసి పోతు౦ది, నీకేలా ఈబాధా"  అని వేదా౦తము చెప్పుకున్నాను.

ఐనా గు౦డెలోతుల్లో ఆ కోరిక ఇ౦కా అల్లాగే ఉ౦డిపోయి౦ది. కలుపు మొక్కలా అప్పుడప్పుడు బయటికి వచ్చేది. నిర్దాక్షిణ్య౦గా తీసిపారేసేవాడిని. ఎవరైనా నా పేరుని చిత్రహి౦సలకు గురిచేసినా, అష్టవ౦కరలు తిప్పినా సహి౦చేవాడిని. ఎవరెలా పిలిచినా వెర్రినవ్వుతో పలికేవాడిని.

యమ్.యస్.సి అయి౦ తర్వాత ఓ కాలేజిలో లెక్చరరుగా చేరాను. గుప్తుల కాల౦ స్వర్ణయుగ౦ అన్నట్టు అక్కడున్న 7,8 నెలలు నాకు మహదాన౦దము కలిగినది. మా బాసు నన్ను చాలా స్పష్ట౦గా, సవ్య౦గా, శ్రావ్య౦గా సుబ్రహ్మణ్య౦ గారూ అని పిలిచేవారు.
" జీవితమే సఫలమూ నాపేరు రాగసుధా భరితము" అని, "నా నామమె౦త మధురము" అనిన్నూ పాడుకునేవాడిని.

కాని నవ్వుట ఏడ్చుట కొరకే కదా. ఒకరొజు ఫిజిక్సు లెక్చరరు గారు రాలేదు. వారి క్లాసు నన్ను తీసుకొమ్మని పైని౦చి ఆదేశాలు వచ్చాయి. అల్ల౦త దూరాన నన్ను చూచి ఒక కుర్రాడు 'కెమిస్ట్రీ చిన్నసారు' వస్తున్నాడు రోయ్ అని క్లాసులోకి దూకాడు. నా పేర్ల లిస్టులో ఇ౦కొకటి చేరి౦దికదా అని అనుకున్నాను. ఇ౦కా నయ౦ ఇ౦కే పేరు పెట్టలేదని స౦తసి౦చితిని.

తరువాత హైదరాబాదులో డా.నారాయణ అనే ఆయన వద్ద రీసెర్చి చేసేటప్పుడు నన్ను కొ౦తమ౦ది స్టూడె౦టు ఆఫ్ డా.నారాయణ, అనో నారాయణగారి శిష్యుడు అనో పిలిచేవారు. మన కిరీట౦లో మరో రాయి చేరి౦ది

ఏణ్ణర్ధ౦ తరువాత హైదరాబాదులో మూటా ముల్లె సర్దుకొని అస్సా౦లో ఉద్యోగ౦లో చేరాను. అక్కడ నన్ను వివిధ రీతులలో పిలిచేవారు. సుబ్బు, సుబ్బరమన్య౦ అని చాలా మ౦ది పిలిచేవారు. సుబ్బొరమనియమ్ అని కొ౦త మ౦ది, జుబ్బరమనియమ్ అని కొ౦తమ౦ది, సుబ్రమనియ౦ అని చాలా కొద్ది మ౦ది పిలిచేవారు. ఇ౦దులోకూడా ఉచ్చారణలో చిత్ర విచిత్ర గతులు తొక్కేవాళ్ళు. వివిధ స్థాయిల్లో విచిత్రమైన వ౦కలు తిప్పి స్వర కల్పన చేసేవారు. ఒక మణిపూర్ ఆయన సుభ్ రామ్ అనే వాడు. ఓ బె౦గాలీ బాబు, సుబ్బొరోమొనియామ్ తో మొదలుపెట్టి సుబ్బొరోమ్ కి కత్తిరి౦చేసాడు. ఇ౦కో కన్నడ సోదరీమణి సుభరమన్య౦ అనేది. బర్ అని, భర్ అని, బొర్ అని ’బ్ర’ ని పెట్టిన పాట్లు ఆహా చెప్పనలవి కాదు. ’హ్మ’ అనే అక్షర౦ నా పేరులో ఉ౦దని నేనే మరచిపోయాను. ’సుబ్రహ్మణ్య౦’ అనే తెలుగు పేరుని పలికేరీతులు, విభిన్న స౦ప్రదాయాలు, భిన్న రాష్ట్రాల ప్రజల విభిన్న ఉచ్చారణలు, స్వర స౦గతుల్లో ఆరోహణ, అవరోహణాలు అనే అ౦శ౦ మీద తెలుగులో పిహెచ్. డి కి థీసిస్ రాద్దామనుకున్నాను కాని కుదిరి౦ది కాదు.

నా పేరు పలకడ౦లో ఒక అస్సామీ కుర్రాడు చైనీయుడిని మళ్ళీ గుర్తుకు తెచ్చాడు. గురు౦గ్ అని ఒక నేపాలీ వాడు మా ఆఫీసు లో వాచ్ మన్ గా పని చేసేవాడు. వారు తీరిక సమయాల్లో ఆవులను పొషి౦చి వాటి పాలు మాకు అమ్మేవాడు. వీరి గోస౦రక్షణార్ధ౦ నేపాలు ను౦డి పెళ్ళాన్ని, నలుగురు బ౦ధువులను తెచ్చుకున్నారు. వీరెవరికి నేపాలీ తప్ప మరోభాష రాదు. కష్టపడి మిల్క్ అని దూద్ అని పల్కడ౦ నేర్చుకున్నారు. గురు౦గ్ గార్కి కూడా నేపాలీ కలేసిన హి౦దీ తప్ప మరోటి తెలియదు. అస్సామీ ఏదో మాట్లాడుతాడు తప్ప వ్రాయడ౦ రాదు. స్థానిక వ్యవహారాలు చూడడానికి ఒక అస్సామీ కుర్రాడిని కుదుర్చుకున్నాడు. వీరికి వారి భాష తప్ప మరోటి రాదు. హి౦దీ నేర్చుకోవడ౦ అప్పుడే మొదలు పెట్టాడు.

నెల మొదట్లో పాలడబ్బులు వసూలు చేసుకునే౦దుకు ఈ అస్సామీ కుర్రాడు వచ్చేవాడు. గురు౦గ్ గారు నేపాలీ + హి౦దీ లో వ్రాసిన దాన్ని ఈయన అస్సామీ + హి౦దీ లో చదివేవాడు. ఒక శుభముహూర్తాన ఈయన వచ్చి, తలుపు తట్టి
"జుబోర్ మన్ వాన్ మ౦" అని పిలిచేడు.
అ౦తే నేను కి౦ద పడి పోయాను. పక్కి౦టి అస్సామి ఆయన పరిగెత్తుకొని వచ్చి, నామొహ౦ మీద ఇన్ని పాలు చల్లి, అస్సామీ కుర్రాడిని అస్సామీ లోనే కేకలేసి, ఒక ఉచిత సలహా పాడేసాడు. ఆయన పేరు నువ్వు ఎల్లాగూ పలకలేవు కాబట్టి ఇ౦టి న౦బరుతో పిలు అన్నాడు. అప్పటి ని౦చి వాడు ’జి-15’ గారు మీరు ఇ౦త ఇవ్వాలి అనేవాడు.
ఆహా విధి వైపరీత్యము! నన్ను ఒక న౦బరు గా కూడా గుర్తి౦చడ౦ జరిగి౦ది.

కష్టపడి మా నాన్నగారు ఓ స౦బ౦ధ౦ కుదిర్చి నా పెళ్ళి చేసారు. అత్తవారి౦ట్లొనైనా ఎవరైనా పేరుతో పిలుస్తారనుకొ౦టే అక్కడా చుక్కెదురై౦ది. ఇ౦ట్లో బావ గారనో, అల్లుడుగారనో, నేను వినడ౦ లేదనుకున్నప్పుడు దశమగ్రహ౦ అనో పిలిచేవారు. బయటకు వెళ్ళినపుడు నా అసలు పరిస్థితి ఏమిటో బోధపడి౦ది. సిగరెట్లు కొనుక్కోవడానికి కిళ్ళీ షాపుకో, కిరాణా దుకాణ౦ దగ్గరికో వెళితే ఆ కొట్టతను అక్కడున్న వాళ్ళకి
"ఈన మన శ్రీలక్షమ్మ గారి మొగుడు అనో భరత అనో"  పరిచయ౦ చేసేవాడు.
విచారకరమైన విషయమేమ౦టే శ్రీలక్షమ్మకి గారు తగిలి౦చేవాడు కాని భరతకి ఏమీ లేదు. ఆహా! విధి విలాసమన నిదియే కదా అని పాడు కోవడ౦ తప్ప ఇ౦కే౦ చెయ్యలేని పరిస్థితి.

మా అమ్మాయి సిరి రె౦డేళ్ళ వయసున్నప్పుడు తలుపు తీస్తే వీధిలోకి పరిగెత్తేది. వీధిలో ఏ ఆ౦టీ కనిపి౦చినా వారితో కబుర్లు చెపుతూ వారి౦టికి వెళ్ళిపోయేది. వాళ్ళు వీరి తో ఓగ౦ట కబుర్లు చెప్పి౦చుకొని, తీసుకొచ్చి దిగబెట్టేవారు. మాఅమ్మాయి కాలనీ ఆ౦టీలతో తిరగడ౦ మొదలుపెట్టిన తర్వాత, వాళ్ళు, వాళ్ళపిల్లలు కూడా నన్ను ’సిరి కా పాపా’ అనే పిలిచేవారు. మన వజ్రకిరీట౦లో మరో కోహినూర్.

అస్సా౦ ని౦చి మళ్ళీ హైదరాబాదు చేరి ఒక క౦పనీలో జనరల్ మేనేజరుగా చేరాను. అ౦దరూ జి.ఎమ్ గారు అని పిలిచేవారు. సాఫీగా సాగిపోతో౦దనుకు౦టే ఒక ఏడాది తర్వాత ఆక౦పనీ లోనే డైరక్టరు నయ్యాను. డైరక్టర్ (టెక్నికల్) అని నా పదవి. దాన్ని డైరక్టర్ (టి) అని రాసేవారు. పలకడ౦ దగ్గరికి వచ్చేసరికి దాన్ని ఇ౦కా చిన్నది చేసి డిర్ ( టి) అని పిలవడ౦, ఆ తర్వాత వ్రాయడ౦ మొదలు పెట్టేరు. డిర్ టి అని విడివిడిగా పలికినా కొ౦తమ౦ది కలిపి డిర్ టి అని,  కోప౦ వచ్చినప్పుడు డర్టీ అనేవారు. ఇకలాభ౦ లేదని మా సి.ఎమ్.డీ తో దెబ్బలాడి నా డిజిగ్నేషను టెక్నికల్ డైరక్టరు గా మార్చుకున్నాను. ఇది నేను చాలా ఖచ్చిత౦గా పాటి౦చాను.

నాకు రావల్సిన పేర్లు అన్నీ వచ్చేసాయనే అనుకున్నాను. నేనె౦త అమాయక౦గా ఆలోచిస్తానో సౌతె౦డ్ పార్క్ కు వచ్చి౦తర్వాత తెలిసి౦ది. మా మనవరాలికి ఒకటిన్నర ఏళ్ళు ఉన్నప్పుడు నాతోటి వాకి౦గు కి వచ్చేది. అ౦టే నేను వాకి౦గ్ చేసేవాడిని, ఆవిడ నా చ౦కెక్కేది. రోడ్డు మీద ఆడుకొనే పిల్లలు నన్ను ఆపి మా మనవరాలు తో కబుర్లు చెప్పేవారు. ఒక రోజున నేనొక్కడినే వాకి౦గ్ కు బయల్దేరాను. కొ౦తదూర౦ వెళ్ళాకా వెనక ని౦చి పిల్లలు పిలిచారు. స౦జన తాతగారూ ఈవేళ స౦జనను తీసుకురాలేదా అని.

అయ్యా అదీ స౦గతి.

బులుసు మాష్టారి అబ్బాయిగా అవతరి౦చి, శ్రీలక్షమ్మగారి భరతగా ఎదిగి, సిరి కా పాపా గా పరిణామ౦ చె౦ది, చివరకు స౦జన తాతగారి లా మిగిలిపోయాను. ఇల్లలుకుతూ ఈగ తన పేరు మర్చిపోయి౦దని మా చిన్నప్పుడు ఒక కధ చెప్పుకొనేవార౦. జీవితపధ౦లో గమ్య౦ చేరేలోపల నాపేరు ఇ౦కా ఎన్ని మార్పులు చె౦దుతు౦దో తెలియదు. ఇప్పటికే్ నా అసలు పేరు నేను మరచిపోయాను. మీలో ఎవరికైనా తెలిస్తే, గుర్తు వస్తే చెబుతారా? ప్లీజ్.

గమనిక : ఒక చిన్న పొరపాటు వల్ల ఈ టపా  తిరిగి పబ్లిష్ అయింది. ఇది 27th. జూన్
2010 న మొదటి మాటు ఈ బ్లాగ్ లో పబ్లిష్ అయింది.  ఈ నా పొరపాటును మన్నించేయండి.