1967 లో ప్రద్యుమ్నుడి
అగ్రజుడి వివాహం అయింది. వారి
అన్నయ్య పెళ్ళిలోనే ఇద్దరు
ప్రద్యుమ్నుడిని చూసి ముచ్చట పడ్డారు. (అబ్బే అమ్మాయిలు కాదు, వారి తండ్రులు). ప్రద్యుమ్నుడు
మహానందపడ్డాడు. ఫరవాలేదు, తనకీ గిరాకీ ఉందని సంబరపడ్డాడు.
వాళ్ళలో ఒకాయన మరీ తొందర పడి, పెళ్లి అయిన మూడో రోజునే ప్రద్యుమ్నుడి
ఇంటికి మాట్లాడటానికి వచ్చేసి,
ప్రద్యుమ్నుడి నాన్నగారితో మాట్లాడారు.
ప్రద్యుమ్నుడి తోటి కూడా మాట్లాడారు. జోర్హాట్ అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంది? లాంటివి
అడిగారు. ఉత్సాహంగా ప్రద్యుమ్నుడు, రైలు రూటు బాగా విపులంగా చెప్పాడు.
"భీమవరం నుండి నిడదవోలు
వెళ్ళవలెను. అక్కడ నుండి కలకత్తా వెళ్ళు మద్రాస్ మెయిల్ ఎక్కవలెను.
సుమారు ఇరవై ఏడు గంటల తరువాత హౌరా చేరెదము. అక్కడ నాల్గైదు గంటలు విశ్రాంతి
గదులలో విశ్రాంతి తీసుకొనవలెను. ఆ తరువాత సమస్తిపూర్ ఎక్స్ ప్రెస్ లో బరౌనీ చేరవలెను. బరౌనిలో ఒక నాలుగైదు
గంటలు ప్లాట్ఫారం పొడుగు, వెడల్పు కొలవవలెను. ఆ తరువాత
తీన్సుకియా మెయిల్ ఎక్కవలెను. ఆ తరువాత న్యూబంగైగాం లో దిగి బ్రాడ్ గేజ్ నుంచి
మీటర్ గేజ్ రైలుకు మారవలెను. సుమారు 16
గంటల తరువాత మరియాని స్టేషన్ లో దిగవలెను. అక్కడనుండి బస్ లో సుమారు ఇరవై కిమీలు ప్రయాణించి జోర్హాట్ చేరవలెను. జోర్హాట్ బస్
స్టాండ్ నుండి రిక్షా ఎక్కవలెను. సుమారు
ఏడు కిమీలు తరువాత మా లాబొరేటరీ
కాలనీ గేటు, అక్కడ నుంచి ఇంకో అరకిమి
ప్రయాణించి (రిక్షాలోనే) మా గృహమునకు చేరవలెను" అని.
ఇంత విపులంగా చెప్పిన తరువాత ఆయన అన్నారు “అంటే సుమారు మూడు నాలుగు రోజులు
పడుతుందన్నమాట”. ప్రద్యుమ్నుడు మందస్మిత
వదనారవిందుడై, “అవునండి రైళ్ళు లేట్ అవడం సహజమే కదా అప్పుడప్పుడు ఇంకో అర రోజు
పట్టవచ్చునండి” అని చెప్పాడు. ఆయన గంభీర వదనుడై ప్రద్యుమ్నుడి కేసి తీక్షణంగా చూసి
ఊరుకున్నాడు. “కలకత్తా నుంచి విమానంలో వెళ్ళవచ్చు. డకోటా విమానాలు నడుస్తాయి.
కలకత్తా నుంచి గౌహతి, అక్కడనుండి జోర్హాట్ వెళ్ళతాయి.
గౌహతి హాల్ట్ తో కలిపి సుమారు రెండు గంటలు
మాత్రమే పడుతుంది అని కూడా చెప్పాడు ప్రద్యుమ్నుడు. ఎందుకైనా మంచిదని, విమానం టికట్టు ధర నూట అరవై ఐదు రూపాయలు
మాత్రమే, అంటే నా జీతంలో సుమారు ఐదవ వంతు మాత్రమే అని గొప్పగా కూడా చెప్పాడు. ఆయన
ఇంకో చిరునవ్వు వెలిగించారు తన మొహంలో.
నాల్గైదు రోజుల తరువాత పెళ్ళిలో ముచ్చట పడ్డ రెండో ఆయన కూడా
వచ్చాడు. ఆయన కూడా అదే ప్రశ్న వేశాడు. అంత విపులంగానూ ప్రద్యుమ్నుడు ఉపన్యాసం
ఇచ్చాడు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు మామగారి పీఠము ఎక్కుతారు,
ఇంకో నాల్గైదు నెలల్లో “ప్రద్యుమ్నుడు పెళ్లికొడుకాయెనే” అనే పాట ఇంట్లో
వినిపిస్తుందని సంబర పడ్డాడు ప్రద్యుమ్నుడు.
శలవు లేనందున ప్రద్యుమ్నుడు మర్నాడే జోర్హాట్ బయల్దేరి వచ్చేశాడు.
బయల్దేరే ముందు నాన్నగారు చెప్పారు ప్రద్యుమ్నుడికి “మేము వెళ్ళి చూసి వస్తాము.
నచ్చితే ఫోటో పంపుతాము. వీలు చూసుకొని వస్తే ఏదో ఒకటి నిశ్చయం చేసుకోవచ్చు” అని.
ప్రద్యుమ్నుడు అమితానంద హృదయారవిందుడయ్యాడని వేరే చెప్పఖ్ఖర్లేదు
కదా.
జోర్హాట్ తిరిగి వచ్చిన ప్రద్యుమ్నుడి మనసు కాబోయే ఇద్దరి
మామగార్ల ఇంటిలోని కాబోయే భార్యామణుల చుట్టూ తిరగడం మొదలు పెట్టింది. నెలయింది,
రెండు నెలలయ్యాయి. ఫోటో కాదు గదా ఆవిషయమై ఉత్తరం కూడా రాలేదు తండ్రి గారి వద్ద
నుంచి. ఎప్పుడూ ఉత్తరాలు వ్రాయడానికి బద్ధకించే ప్రద్యుమ్నుడు, తరువాతి రెండు
నెలల్లో నాలుగు ఉత్తరాలు వ్రాశాడు తండ్రికి. “ఇక్కడ నేను క్షేమం. అక్కడ మీరు డిటో
అని తలుస్తాను. అన్ని విశేషములతో వెంటనే
వివరంగా జవాబు వ్రాయవలెను” అంటూ. వివరంగా కాదు కదా క్లుప్తంగా కూడా ఏ విశేషము
తెలియపరచ బడలేదు.
ఆత్రుత పట్టలేక ప్రద్యుమ్నుడు పెద్దక్క గారికి ఉత్తరం వ్రాసాడు, తండ్రికి వ్రాసే ధైర్యం లేక. “మ.ల.స
సుబ్బలక్ష్మి అక్కగారి పాదపద్మములకు శతాధిక వందనము లాచరించి తమ సోదరుడు
ప్రద్యుమ్నుడు వ్రాయు లేఖార్ధములు. అచట మీరందరును క్షేమంగా యున్నారని తలుస్తాను.
ఇక్కడ నా పరిస్థితి ఏమో నాకే తెలియుట లేదు. మనంబున అశాంతి
పేరుకుపోవుచున్నట్టు అనుమానముగా నున్నది.
నిద్ర పట్టుట లేదు. పట్టినా ఘటోత్కచుడు హహహ్హహా అంటూ ప్రత్యక్ష మవుతున్నాడు కానీ
శశిరేఖ కానరాకున్నది. మధ్యలో ఏమైనదో
తెలియరాకున్నది. నీకు తెలిసినచో నాకు వెంటనే తెలియ పర్చవలెను. ఇట్లు, భవదీయ సోదర
శ్రేష్టుడు, ప్రద్యుమ్నుడి వ్రాలు”
వెంటనే జవాబు రాలేదు కానీ ఒక నెల తరువాత ఉత్తరం వచ్చింది
అక్కగారి వద్ద నుంచి. ఆవిడ ఉ.కు. లు (ఉభయ కుశలోపరి) అన్నీ వదిలి డైరెక్టుగా రంగంలోకి వచ్చారు.
“అడ్డగాడిదా, ఏబ్రాసి మొహం గాడా, బుద్ధి ఉందా నీకు అప్రాచ్యపు వెధవా. (ఇది చదివిన
తరువాత, పాపం ప్రద్యుమ్నుడికి కళ్ళు
చెమర్చాయి, అక్క గారికి తన మీద ఉన్న సదభిప్రాయానికి). వాళ్లకి ఏం చెప్పావురా
నువ్వు? భీమవరం నుంచి జోర్హాట్ వెళ్ళడానికి
ఐదు రోజులు పడుతుందా? రైలు, కారు, బస్సు,
రిక్షా, చివరికి ఒంటెద్దు బండి కూడా ఎక్కాలని చెప్పావా?
ఎవడిస్తాడురా పిల్లని నీకు? కంచర గాడిదా.
పెళ్ళిలో చూసిన ఇద్దరిలో ఎవరూ
మాట్లాడలేదు. మధ్యవర్తి ద్వారా కనుక్కొన్నాడు నాన్న. అంత దూరం పిల్లని పంపటానికి
వాళ్ళకి ఇష్టం లేదుట. ఎప్పుడైనా పిల్లని చూడాలనిపించినా లేక ఏ కష్టమైనా పిల్లకి
వస్తే, వెళ్ళి రావడానికైనా పది రోజులు
ప్రయాణాలు మా వల్ల కాదు అని చెప్పారుట మధ్యవర్తికి. అంతే కాదు ఈ వార్త శరవేగంగా
విస్తరిస్తోంది. గోదావరి జిల్లాలలో మంచి
కుటుంబం, ఆచార సాంప్రదాయాలు ఉన్న వాళ్లెవరు నీకు పిల్ల నిచ్చేందుకు సిద్ధంగా లేరు
అని మధ్యవర్తి నొక్కి వక్కాణించాడుట. ఇప్పుడు నాన్న మధ్యవర్తిని పక్క జిల్లాలకి
పంపుతున్నాడుట. నీకు పెళ్లి సంబంధాలు వెతకటానికి,
ఆలస్యం అయితే వాళ్లకి కూడా ఈ వార్త చేరిపోతుందనే భయంతో. చుంచు మొహం వెధవా,
ఆ నోటి దూల తగ్గించుకోరా అంటే విన్నావా? అనుభవించు.” అని ఆశీర్వదిస్తూ వ్రాశారు.
పాపం ప్రద్యుమ్నుడు హతాశుడయ్యాడు. డైరీలో వ్రాసుకున్నాడు. “కాబోయే
పెళ్ళికొడుకు లెవరు కాబోయే మామగారితో హాస్య సంభాషణ చేయరాదు. చేసినచో పెళ్లి
చేసుకొనే అవకాశం కోల్పోయెదరు.” ప్రద్యుమ్నుడు
ధీరోదాత్తుడు కాబట్టి ధైర్యంగా సహనం వహించి “ఏడ తానున్నాదో
నా శశిరేఖ, జాడ తెలిసిన చెప్పి పోవా” అని రాగం తీయకుండానే పాడుకోవడం మొదలు
పెట్టాడు.
రాగం సంగతి వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్పుకోవాలి. పాపం
ప్రద్యుమ్నుడు ఒకానొక కాలంలో రాగయుక్తంగా కర్నాటక సంగీతం ప్రాక్టీస్ చెయ్యాల్సి
వచ్చింది. కావాలని ప్రద్యుమ్నుడు ప్రాక్టీస్ చెయ్యలేదు. ఆశువుగా వచ్చేసేది.
జోర్హాట్లో శీతాకాలంలో సాయంకాలం
నాలుగున్నరకే చీకటి పడిపోయేది. అందుచే
ఆఫీసు ఉదయం ఎనిమిదిన్నరకే పెట్టేవారు. అందువల్ల, ఉదయం ఎనిమిది కల్లా స్నానం చేయాల్సి వచ్చేది,
కనీసం వారంలో మూడు రోజులైనా. పదహారు – ఇరవై డిగ్రీలు ఉన్న నీరు ఒంటి మీద పడగానే
అప్రయత్నంగానే “రసిక రాజ తగువారము కామా” టైప్ పాటలు నోటి వెంట వచ్చేసేవి, సరిగమ,
రిర్రి గగ్గా లతో సహా. కధకళి కూడా చేసేవాడేమో నని అతని రూమ్మేట్స్ అనుమానం. అతని
రూమ్మేట్స్ స్థిత ప్రజ్ఞులు. ఏ ఆదివారమో గెస్ట్ హౌస్ కి పోయి స్నానం చేసి
వచ్చేవారు. అక్కడికీ, రాగాలాపన చేయలేక ఒక
ఇమ్మర్షన్ హీటర్ కొనుక్కున్నాడు ప్రద్యుమ్నుడు. హాస్టల్లో తీవ్రవాదులు చాలా మందే
ఉండేవారు. పక్కవాడిది లాక్కుని వాడుకోవడమే తప్ప వాళ్ళు కొనరు. రెండు అనుభవాలతో
పాపం ప్రద్యుమ్నుడు రాగాలాపనే ఉత్తమం అనుకున్నాడు.
ఈ విధంగా పాపం ప్రద్యుమ్నుడు మేఘాలాపన చేసుకుంటూ విచారంగా కాలం
వెళ్ళబుచ్చేవాడు, శశిరేఖాగమనాభిలాషియై. అక్కగారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
విశేషాలేమైనా ఉంటే ఆమె తెలియ పరిచేటట్టు,
బదులుగా ఆమెకి ఒక అస్సాం పట్టుచీర ప్రద్యుమ్నుడు బహుకరించేటట్టు. ఆమె అప్పుడు
తణుకులో ఉండేది. భీమవరం నుంచి చూపులకి వెళ్ళేటప్పుడు, ఈమె కూడా తల్లి తండ్రుల ఆహ్వానం మీద వెళ్ళేది.
వెళ్ళిన రెండు రోజులకి ఉత్తరం వ్రాసేది ప్రద్యుమ్నుడికి. పిల్ల నచ్చలేదని ఒక
రెండు, జాతకాలు నప్పలేదని మరో రెండు ఉత్తరాలు వచ్చాయి. ప్రద్యుమ్నుడికి అసహనం
పెరిగిపోతోంది. “అన్నయ్య వివాహ వార్షికోత్సవం చేసేసుకున్నాడు. నాకు ఇంకా మీరేమి
కుదర్చలేదు” అని వాపోయాడు. “దేనికైనా సమయం రావాలి. కల్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు” అని ఆక్క గారు ప్రద్యుమ్నుడిని అనునయించేవారు. ఇంకో ఏడాది తరువాత,
కక్కొచ్చే అమ్మాయినైనా చేసుకోవడానికి ప్రద్యుమ్నుడు రెడి అయ్యే
పరిస్థితుల్లో ఒక సంఘటన జరిగింది.
అక్కయ్య
దగ్గరనుంచి ఉత్తరం వచ్చింది. అమ్మాయి తండ్రి పూనాలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రద్యుమ్నుడి అమ్మా, నాన్నా, వదినగారు, అన్నయ్య, పెద్ద
అక్కయ్య అందరూ అమ్మాయిని చూశారు.
అమ్మాయి వాళ్ళు రాజమండ్రి వచ్చినప్పుడు వెళ్ళి చూసి వచ్చారు. అమ్మాయి ప్రద్యుమ్నుడి
ఇంట్లో వాళ్లకి నచ్చేసింది బాగానే.
ప్రద్యుమ్నుడి అమ్మగారు “చెంపకి చారడేసి కళ్ళు, చిన్న నోరు, గుండ్రటి కళ గలిగిన మొహం, లక్షణంగా
ఉంది పిల్ల” అన్నారని వ్రాసింది ఉత్తరంలో
ప్రద్యుమ్నుడి అక్క. ప్రద్యుమ్నుడి వదిన రెండు అడుగులు ముందుకు వేసి “ప్రద్యుమ్నుడి
కన్నా చాలా బాగుంటుంది” అని అంది అని కూడా
వ్రాసింది. ఫోటో కూడా పంపింది. ప్రద్యుమ్నుడి ఆశ చిగురించి మొగ్గలు వేసింది. “మన మొహానికి అందమైన అమ్మాయి దొరకడం అంటే
అదృష్టమే కదా” అని ప్రద్యుమ్నుడు మురిసి
పోయాడు, ఫోటో చూసి (నిజం చెప్పాలంటే, ఆ
అమ్మాయికి నేను తగిన వాడినా? అనే అనుమానం క్షణ కాలం కలిగింది
ప్రద్యుమ్నుడికి). ప్రద్యుమ్నుడు వాల్ రైట్,
వాల్ రైట్ అనేశాడు. అన్నాడు కదా అని మధ్యవర్తి రాయబారాలు నడుస్తున్నాయి.
ఒక నెల
తరువాత ప్రద్యుమ్నుడు ఆఫీసు పని మీద పూనా NCL కి ( National Chemical
Laboratory) వెళ్ళాల్సి వచ్చింది. ప్రద్యుమ్నుడు
వస్తున్నాడని తెలిసి, చూడడానికి వాళ్ళు వస్తామన్నారు, ప్రద్యుమ్నుడు ఉండే NCL అతిధి గృహానికి. సరే నన్నాడు ప్రద్యుమ్నుడు. అమ్మాయిని
తీసుకు వస్తాము, ఒకరినొకరు చూసుకోవచ్చు అని కూడా అన్నారు. ప్రద్యుమ్నుడు
కడుంగడు ముదావహుడయ్యాడు.
సాయం కాలం
ఆరున్నరకి వేంచేశారు. అమ్మాయి, తల్లి తండ్రులు మరియూ సోదరుడు. కుశల ప్రశ్నలు
అయ్యాయి.
“అమ్మాయి B.A lit. ఫైనల్ ఇయర్, అబ్బాయి క్లాసు
౧౧” అని చెప్పారు.
ప్రద్యుమ్నుడు, M.Sc.
chem. అని చెప్పుకున్నాడు.
“పూనా తరుచు
వస్తారా” అని ప్రశ్నించారు.
“అబ్బే లేదండి,
ఇదే మొదటి మాటు” అని జవాబు ఇచ్చాడు.
జోర్హాట్
గురించి అడిగారు. చెప్పాడు.
ఆయనా, ప్రద్యుమ్నుడు సెంట్రల్ స్కేల్స్, అలొవెన్సేస్ గురించి చర్చించుకున్నారు. ఆయన కూడా సెంట్రల్ గవ్. ఉద్యోగే. ఒక పది నిముషాల
తరువాత ఆయన లేచాడు.
“మీ గెస్ట్
హౌస్ బాగుంది. చెట్లు, పూలు గట్రా
బాగున్నాయి. పూర్తిగా చూస్తాం” అంటూ. ఆయన తోటి ఆవిడా, అబ్బాయి కూడా బయటకు వెళ్లారు. అమ్మాయి,
ప్రద్యుమ్నుడు మిగిలారు రూములో. ఒక నిముషం పాటు కిటికీ లోంచి ప్రకృతి
చూసారు ఇద్దరూ. ఏం మాట్లాడాలో తట్టలేదు
ప్రద్యుమ్నుడికి. మట్టి బుర్ర కదా. తెగించి
అడిగాడు.
“సినిమాలు
గట్రా చూస్తారా బాగా?”
“ఊ.”
“తెలుగు
సినిమాలు వస్తాయా?”
“అప్పుడప్పుడు.”
“పుస్తకాలు
చదువుతారా?”
“ఫిలిం ఫేర్, స్టార్ డస్ట్ లాంటివి. క్లాసు పుస్తకాలు చదవాలి కదా. టైము ఉండదు.”
“తెలుగు చదవడం,
వ్రాయడం వచ్చునా ?” (అమ్మాయి అక్కడే
పుట్టి పెరిగిందిట)
“వచ్చు.”
ఇంకేం
మాట్లాడాలో తోచలేదు ప్రద్యుమ్నుడుకి. తనవి
చచ్చు పుచ్చు పురాతన భావాలు కాబట్టి,
అడిగేశాడు ధైర్యం చేసి.
“వంటా వార్పూ
వచ్చునా?”
నవ్వింది. “నేర్చుకుంటాను”
అని కూడా అంది.
ప్రద్యుమ్నుడు
మహా తెలివితేటలు కానీ, లౌక్యం తెలిసిన వాడు కానీ కాదు. అందువల్ల యదాలాపంగా అనేశాడు.
“దానిదేముంది.
నాకూ రాదు. ఇద్దరం కలిసి నేర్చుకుందాం”
అమ్మాయి మళ్ళీ
నవ్వింది. నవ్వితే బాగానే ఉంది స్మా
అనుకున్నాడు. ఉత్సాహం పెరిగిపోయింది.
“జోర్హట్లో
కుకింగ్ గాస్ లేదు. ఇంకో నాల్గైదు ఏళ్ళకి
గానీ రాదేమో. కిరోసిన్ స్టవ్, కుంపటి మాత్రమే ఉపయోగించాలి”
అమ్మాయి ఏమి
మాట్లాడలేదు. అక్కడితో ఊరుకుంటే ప్రద్యుమ్నుడి జీవితం ఎన్ని మలుపులు తిరిగేదో
తెలియదు. ప్రద్యుమ్నుడిలో ఉత్సాహం పేట్రేగి పోయి అడిగాడు.
“మీ ఇంట్లో
గాస్ ఉందా?”
ఒక్క క్షణం
ఆలోచించి “తెలియదు” అని జవాబు ఇచ్చింది.
ప్రద్యుమ్నుడు
ఆశ్చర్యపోయాడు.
“తెలియదా” అని
రెట్టించాడు.
అదే సమాధానం మళ్ళీ
వచ్చింది. ప్రద్యుమ్నుడిలో జోకర్ నిద్ర లేచాడు.
“కిరోసిన్
స్టవ్ వెలిగించినప్పుడు, ఆర్పినప్పుడు వాసన వస్తుంది. కట్టెలు మండిస్తే అంతో ఇంతో
పొగ వస్తుంది. గాస్ అయితే బహుశా ఏమి తెలియదు. ఇందులో ఏదీ మీ అనుభవంలోకి రాలేదా”
“లేదు. మేము
సాధారణంగా వంటింట్లోకి వెళ్ళము. మా ఆమ్మ డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తుంది అన్నీ”
ఈ మాటు అవాక్కయ్యాడు
ప్రద్యుమ్నుడు. మళ్ళీ అడిగాడు ఈ మాటు
కొంచెం వ్యంగ్యంగానే.
“మీ
అమ్మగారికి వంటలో కాకపోయినా, వంటింట్లో
కనీసం గిన్నెలు కడగడం, సర్దడం లాంటివి చేయరా”
“లేదు. అలవాటు
లేదు. నేను చదువు కోవాలి కదా. అమ్మ నన్ను వంటింట్లోకి రానివ్వదు”
ప్రద్యుమ్నుడికి
నమ్మశక్యంగా లేదు. ఏమనాలో తెలియలేదు. ఈ అమ్మాయి పెళ్ళైన తరువాత వంటిల్లు అలెర్జీ
అంటే ఏం చెయ్యాలి అనే ఊహ కూడా వచ్చింది. ఇంతలో ఆ అమ్మాయి అడిగింది.
“జోర్హాట్లో
సౌత్ ఇండియన్ హోటల్స్ ఉన్నాయా”
“ఒకటి ఉంది.
కానీ మాకు ఏడు కి.మీ. దూరం. మా కాలనీకి ఐదారు కి.మీ.లలో చిన్న టీ కొట్లు తప్ప హోటల్స్ ఏమీ లేవు. ఏం అల్లా అడిగారు.”
“ఏం లేదు.
అవసరం ఉంటుంది కదా. వంట మనిషి దొరుకుతుందా”
“ఏమో.
తెలియదు. మా కాలనీలో ఎవరి ఇంట్లోనూ వంట మనిషి ఉన్నట్టు వినలేదు. మా గెస్ట్ హౌస్ లో
ఇద్దరు కుక్కులున్నారు. ఎప్పుడైనా, ఏదైనా పార్టీలకు వాళ్ళను వాడుకుంటారు
అనధికారకంగా. ఏం అల్లా అడిగారు” రెట్టించాడు
ప్రద్యుమ్నుడు తెలివి తక్కువుగా.
“మనం ఒక వంట
మనిషిని పెట్టుకోవచ్చా? మీరు 1500 పైగా సంపాదిస్తున్నారు కదా.”
ఈ మారు
ప్రద్యుమ్నుడికి కోపం వచ్చింది.
“క్షమించండి.
నాకు సుమారు 1200 దాకా మాత్రమే వస్తుంది.
క్వార్టర్ రెంటు, కరెంటు, పీ.యఫ్. త్రిఫ్ట్ సొసైటీ, LIC మొదలైనవి పోగా 850 – 900 చేతికి వస్తుంది.
ఇందులో మూడు వందలు ఇంటికి పంపుతాను.
సుమారు మూడు - నాలుగు వందలు నాకు ఖర్చు అవుతుంది. మిగిలిన నూట ఏభై - రెండు
వందలు నెలాఖరున బేంకులో వేస్తాను. వంట మనిషిని పెట్టుకునే స్తోమత నాకు లేదు. నా జీతం 1200. ఈ విషయం మా నాన్నగారు, మీ నాన్నగారికి చెప్పారు. మాకు HRA, CCA లాంటివి
లేవు. అన్నట్టు నేను సిగరెట్లు కాలుస్తాను బాగానే.” అన్నాడు ప్రద్యుమ్నుడు కించెత్
కోపంగానే.
ఆ తరువాత
సంభాషణ సాగలేదు. వాతావరణం వేడెక్కినట్టు అనిపించింది ప్రద్యుమ్నుడికి. అమ్మాయి అప్రసన్నంగానే ఉన్నట్టు కనిపించింది. ఒక
ఐదు నిముషాల తరువాత తల్లి తండ్రులు వచ్చారు.
“నా పూర్తి
జీతం 1200 మాత్రమే. చేతికి వచ్చేది 850
మాత్రమే” అని చెప్పాడు ప్రద్యుమ్నుడు తండ్రితో.
“నాకు తెలుసు.
మీ నాన్నగారు చెప్పారు” అన్నాడు ఆయన. అని అమ్మాయి కేసి చూసి నవ్వాడు.
“నేను ఆదివారం
హైదరాబాదు వెళతాను. మీ నాన్నగారితోను, అన్నయ్యగారితోను మాట్లాడి వస్తాను” అన్నాడు ఆయన.
“బహుశా ఆ
అవసరం ఉండదేమో. మా నాన్నగారు మీకు వ్రాస్తారు. నేను మా అన్నయ్యతోటి మాట్లాడుతాను
రేపు బొంబాయి నుంచి.” అన్నాడు ప్రద్యుమ్నుడు కొంచెం దురుసుగానే.
ఈ మాటు
అవాక్కవడం వాళ్ళ వంతయింది.
“ఏమైంది.” ఆయన
ఖంగారుగానే అడిగారు.
“ఏమి లేదు. మీ
తాహతుకు నేను తగనేమో. మీ అమ్మాయిని అడగండి, ఇంటికి వెళ్ళిన తరువాత. మీరు శ్రమ తీసుకొని ఇంత
దూరం నన్ను కలవడానికి వచ్చినందుకు ధన్యవాదాలు.” అన్నాడు ప్రద్యుమ్నుడు సిగరెట్టు
తీసి నోట్లో పెట్టుకుంటూ.
ఆమె తల్లి తండ్రులు
ఆమె కేసి ఒక అరనిముషం చూశారు. ఆమె ఏమి మాట్లాడలేదు. ప్రద్యుమ్నుడి కేసి ఇంకో మారు
చూశారు.
“ఇంకో మాటు
ఆలోచించండి, మీ నాన్నగారితో కూడా చెప్పండి
కారణాలు. నేను కూడా మీ అన్నయ్య గారితో మాట్లాడుతాను ఎల్లుండ. రేపు మీరు మాట్లాడిన
తరువాత. Hope that, the problem if any will be resolved.” అని అన్నాడు ఆయన. వాళ్ళు వెళ్ళిపోయారు
కరచాలనాలు, నమస్కారాల తరువాత.
ఆ రాత్రంతా
ఆలోచించాడు ప్రద్యుమ్నుడు. పొరపాటు చేస్తున్నానా, అని. అమ్మాయి సరదాగానే అందేమో
ననే అనుమానం వచ్చింది. కానీ మాట తీరు అల్లా అనిపించలేదని నిర్ధారణకు వచ్చాడు. తను
కొంచెం వ్యంగ్యంగానే మాట్లాడాడు కదా, ఆమె కూడా అల్లాగే జవాబు ఇచ్చిందా అని కూడా
ఆలోచించాడు. ఆమె పలుకులు అలా అనిపించలేదని అనుకున్నాడు. చిన్న పిల్ల, ఇటువంటి
సందర్భాలలో మాట్లాడడం తెలియదేమో
ననుకున్నాడు. కానీ సరిపెట్టుకోలేకపోయాడు. వాళ్ళ నాన్నగారు అలా అన్న తరువాత కనీసం
ఆమె “సారీ, పొరపాటుగా మాట్లాడాను” అని కూడా అనలేదు కాబట్టి ఉద్దేశపూర్వకంగానే
అన్నదేమో నన్న అనుమానం బలపడింది. పెళ్లి అయిన తరువాత, "ఇంటికి డబ్బు పంపించవద్దు,
వారానికి నాల్గైదు మాట్లు హోటల్ కి వెళ్ళాలి, వంట చెయ్యడం నాకు కష్టం" లాంటి మాటలు
అంటే జీవితం ఎలా తయారు అవుతుంది అని బహుశా కొంచెం అతిగానే ఆలోచించాడేమో
ప్రద్యుమ్నుడు. అమ్మాయి అందంగా ఉంది కాబట్టి, ఆమె
తండ్రిగారు సామరస్యపూర్వకంగా మాట్లాడారు కాబట్టి సరిపెట్టుకోవటానికి
ప్రద్యుమ్నుడు శతధా ప్రయత్నించాడు. కానీ సమాధాన పడలేకపోయాడు.
మర్నాడు
బొంబాయి నుంచి అన్నగారికి టెలిఫోన్ చేశాడు. విషయం వివరించి, తన భయాల గురించి చెప్పాడు.
“పెళ్లి చూపులలో పిల్ల ఒద్దికగానే మాట్లాడింది.
వంటా వార్పూ రాదని తల్లిగారు చెప్పారు. మా అమ్మాయిలకి నేర్పినట్టే మీ అమ్మాయికి
నేర్పుతాను అని అమ్మ అంది. తొందర పడుతున్నావేమో
మళ్ళీ ఆలోచించు” అని సలహా ఇచ్చాడు
అగ్రజుడు. అయినా ప్రద్యుమ్నుడు తన మనసును
ఒప్పించలేకపోయాడు.
తరువాత ఏం
జరిగిందా అంటారా? ఏం జరుగుతుంది. విధి ప్రభావతితో ముడివేసిన ప్రద్యుమ్నుడి జాతకానికి సుచిత్ర ఎందుకు అందుతుంది ?