ప్రద్యుమ్నుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రద్యుమ్నుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ప్రద్యుమ్నుడి మొదటి పెళ్లి చూపులు

1968 మే నెలలో ప్రద్యుమ్నుడు అన్నగారి పెళ్ళికి భీమవరం వెళ్లి,  జూన్ మొదటి వారంలో   జోర్హాట్ కి తిరిగి వచ్చేసాడు. 

అన్నగారి పెళ్ళిలో ఇద్దరు ముగ్గురు ప్రద్యుమ్నుడిని చూసి ముచ్చట పడ్డారు. అమ్మాయిలు కాదు. అమ్మాయిల తల్లి తండ్రులు. అన్నగారి పెళ్ళిలో తనకి కూడా పెళ్లికళ వచ్చేసిందని సంబర పడిపోయాడు ప్రద్యుమ్నుడు.

అందులో ఒకాయన ప్రద్యుమ్నుడు జోర్హాట్ తిరిగి వచ్చేలోపులే భీమవరం వచ్చి మాట్లాడి వెళ్లారు. అమ్మాయి జాతకం, ఫోటో కూడా ఇచ్చి, ప్రద్యుమ్నుడి ఫోటో జాతకం తీసుకు  వెళ్లారు. జాతకాలు కుదిరితే తెలియపరుస్తామని చెప్పారు. అబ్బాయి దసరాకో  సంక్రాంతికో  వచ్చినప్పుడు పెళ్లి చూపులు కార్యక్రమం పెట్టుకోవచ్చని ప్రద్యుమ్నుడి తండ్రిగారు ఆయనకు చెప్పారు  అమ్మాయి ఫోటో చూసి ప్రద్యుమ్నుడు మురిసిపోయాడు. ఇంట్లో అందరికీ కూడా ఫోటోలోని అమ్మాయి నచ్చింది.  అమ్మాయి పేరు రాధ. BA చివరి  సంవత్సరం చదువుతోంది. రాజమండ్రి దగ్గర ఏదో పల్లెటూరు వాళ్ళది.  పిల్ల తండ్రి తెలుగు మాష్టారు. వేదం కూడా చదువుకున్నారు.  ప్రద్యుమ్నుడి నాన్నగారు ముచ్చట పడ్డారు. కానీ  అమ్మగారు  “వీడికి కాబోయే  మామగారు కూడా తెలుగు మాష్టారేనా,  వేదం కూడానా”   అని నిరుత్సాహపడ్డారు.  

పిల్ల తండ్రి వెళ్ళిన తరువాత ప్రద్యుమ్నుడు మొహమాట పడ్డాడు “అప్పుడే నాకు పెళ్ళా?” అని.

“ఇప్పటికే 25 ఏళ్లు నిండాయి. ఇంకా ఎప్పుడూ చేసుకుంటాడుట? నెత్తిమీద తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయి. ఇంకో రెండు మూడేళ్ళు అయితే పిల్ల నివ్వడానికి ఎవరూ రారు” అని తీర్పు చెప్పేసారు ప్రద్యుమ్నుడి తండ్రి గారు.  

మొహమాటానికి మొహమాట పడ్డా, పెళ్లి చేసుకోవాలని ప్రద్యుమ్నుడు కూడా తొందర పడుతున్నాడు,  కాబట్టి తల ఊపేసాడు.  ఆ మద్యాహ్నం ఆంతరంగిక సభ జరిగింది. ఆ సభలో పెద్దక్క గారు తేల్చి చెప్పేసారు.

“పెద్దాడి పెళ్లిలో లాగా ఆడపడచు లాంఛనాలు రెండు వందలు చేతిలో పెడితే కుదరదు. చిన్నాడి పెళ్ళిలో మాకు తలా వెయ్యి ఇవ్వాల్సిందే. అమ్మకు అత్తగారి లాంఛనాలు రెండు వేలు ఇవ్వాలి”

“నలుగురికీ నాలుగువేలు అత్తగారికి రెండు వేలు, మొత్తం ఆరు వేలు అంటే దాదాపు కట్నం అంత అవుతుంది. అంత ఆశ పెట్టుకోకండి. నేనూ నలుగురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేశాను. కష్టసుఖాలు నాకు తెలుసు.” అని ఇంకో తీర్పు చెప్పారు ప్రద్యుమ్నుడి తండ్రిగారు.

“పెద్దాడి మామగారు నీ బాల్య స్నేహితుడని, ఆయన ఏమన్నా నువ్వు ఒప్పుకున్నావు. చిన్నాడి పెళ్ళిలో అలా కుదరదు. మాటలకి వెళ్ళినప్పుడు నేను కూడా వస్తాను ఈ మాటు” కరాఖండిగా చెప్పింది ప్రద్యుమ్నుడి పెద్దక్క. అంతటితో ఆగలేదు ఆవిడ,

“ఒరేయ్ పద్దూగా,  వాళ్ళు ఇవ్వకపోయినా నువ్వు మిగిలింది వేసి వెయ్యి రూపాయలూ ఇవ్వాల్సిందే” అని కూడా నొక్కి వక్కాణించింది.  “లేకపోతే నీ పెళ్ళికి మేం రాము” అనికూడా చెప్పింది.

“సరే అలాగే లే” అని ఒప్పేసుకున్నాడు ప్రద్యుమ్నుడు.

సభ తరువాత అరుగు మీద కూర్చుని ధూమ పానం చేస్తున్నప్పుడు, జాలి పడ్డాడు ప్రద్యుమ్నుడి పెద్ద బావగారు.

“మాకు పెళ్లి అయిన తరువాత కష్టాలు మొదలయితే, వీడికి పెళ్లి కాకుండానే మొదలవుతున్నాయి” 

“అదేమిటి? హాయిగా సంసారం చేస్తున్నారు కదా. మీకేం కష్టాలు?” ఆశ్చర్యపడ్డాడు ప్రద్యుమ్నుడు.

“కనిపించేది అంతా సత్యం కాదు ప్రద్యుమ్నా. మీ నాన్న మీ అక్కయ్యకు పసుపు కుంకుమ గా ఇచ్చిన అర ఎకరం మొన్న అమ్మితే పదిహేను వందలు  పూర్తిగా రాలేదు” అని నవ్వాడు పెద్దబావగారు.

“మేం అది ఎప్పుడో అమ్మేసాం” అని వంత పాడారు మిగతా బావలు కూడా.   

అప్పుడు  హితబోధ చేశారు బావలు నలుగురు,     

 “నాయనా ప్రద్యుమ్నా, పెళ్లి  అనేది ఒక ఆకర్షణ. ఆ ఆకర్షణ వ్యామోహంలో ముందు ముందు జరిగే విపరీత పరిణామాలను  అజ్ఞానులు  గ్రహించలేరు. పెళ్లికి పర్యవసానం బానిసత్వం.   స్త్రీ అయస్కాంతం లాగా ఆకర్షిస్తుంది కానీ  పెళ్లి అయిన స్త్రీలు   అణుబాంబులా పరివర్తనం చెందే అవకాశాలు ఎక్కువ.  అసలు ఆడపిల్లలు వయసుకు రాగానే ఈ పరివర్తనం మొదలవుతుందని,  అందుకనే  వారి  తల్లి తండ్రులు శాయశక్తులా ప్రయత్నించి వీలైనంత త్వరగా పెళ్లి అనే పేరుతో ఆ అణుబాంబుని ఇంకెవరి ఇంట్లోనో  వేసి ఊపిరి పీల్చుకుంటారనీ జ్ఞానులు బోధిస్తారు. అందుకే కట్నాలు ఇస్తారు, ఆడపడచు లాంఛనాలు, అత్తగారి లాంఛనాలు ఇస్తారు. అల్లుడు అలిగితే సైకిల్ కూడా కొనిపెడతారు.   మగవాడు నిమిత్తమాత్రుడు. అయస్కాంత శక్తికో అణు ధార్మిక శక్తికో బలై పోతూనే ఉంటాడు. కాబట్టి బుద్ధి తెచ్చుకుని పెళ్లి అనే ఆడ పిల్లల తల్లితండ్రుల కుతంత్రం లో  పడకు” అని ఉపదేశించారు.

“పెళ్లి చేసుకొని సంసారసాగరంలో మునిగేవాడు పురుషుడే. భార్యా పిల్లలు ఒడ్డున కూర్చుని వేడి వేడి వేరుసెనక్కాయలు తింటూ చప్పట్లు కొడతారు కానీ నీకు చేయ అందివ్వరు”  అని కూడా బోధించారు.

“ఎంత వీరోచితంగా పోరాడినా సంసారం  అనే మహా యుద్ధంలో  పురుషులు బాలచంద్రులు, అభిమన్యుల  లాగే అవతారం చాలించాల్సి ఉంటుంది.” అని కూడా ఉద్భోదించారు.

పోగాలము దాపురించిన వారు హిత వాక్యములు వినరు అని ఎవరో అన్నారు. ప్రద్యుమ్నుడు కూడా వినలేదు. పెళ్లి చేసుకొని సంసారసాగరాన్ని విజయవంతంగా ఈది, ముందు తరాలవారికి మార్గ దర్శనుడ నవుతానని భీష్మించాడు ప్రద్యుమ్నుడు. “గృహమే కదా స్వర్గసీమ” అని పాడి వినిపించేడు కూడా.

జోర్హాట్ లో కూడా కుటుంబీకులు కొంతమంది హిందీలోనూ, మరి కొంత మంది తెలుగులోనూ కూడా హితబోధ చేశారు. ప్రద్యుమ్నుడు పట్టించుకోలేదు. ఒక తెలుగాయన బ్రహ్మోపదేశం కూడా చేశారు.

“వత్సా, ప్రద్యుమ్నా, గృహస్తు అని ఎందుకు అంటారో తెలుసా?” సమాధానం కోసం చూడకుండా కొనసాగించాడు,

“గృహమే ఆస్తిగా కలవాడిని గృహస్తు అంటారు. మిగిలిన ఏ ఆస్తులూ భార్యా పిల్లలు వాడికి మిగలనీయరు. వారి సరదాలకు, వారి భోగాలకు, వారి టింగురంగా లకు  ఖర్చు అయిపోతుంది. తండ్రిగారు ఇచ్చిన గృహము కూడా అతి కష్టం మీద నిలుపుగో గలుగుతాడు. ఇంటికి దీపం అనిపించుకునే ఇల్లాలుని గృహస్తి అంటారు. అంటే గృహంలో ఏనుగు అని అర్ధం. వారికి ఎదురు చెప్పలేరు, తెలియకుండా ఏ పని చేయలేరు. చెవులు పెద్దవి కదా.” ఇంతటితో ఆగలేదు ఆయన.

“పెళ్లి అయిన కొంత కాలం తరువాత ”జాయెతు జాయె కహా, సంఝేగా కౌన్ యహా  దర్ద్ భరే దిల్ కి జుబా” అని పాడుకోవాలి. వలదు నాయనా వలదు పెళ్లి అనే యజ్ఞంలో సమిధి కావలదు”  అని ప్రభోదించారు.

అయినా ప్రద్యుమ్నుడు లక్ష్యపెట్టలేదు. పైగా,

“ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి” అని పాడాడు కూడా.

 ప్రద్యుమ్నుడు రాధ ఫోటో చూడగానే మనసు పాడేసుకున్నాడు ఆమె మీద. ఫోటోలో చూడగానే ప్రేమించడం ‘లవ్ యట్ ఫస్ట్ సైట్” అంటారా అని తనలో తనే చర్చించుకున్నాడు. “రాధే నా జీవనజ్యోతి” అని తీర్మానించుకున్నాడు. 

తండ్రిగారికి ఉత్తరం వ్రాద్దామనుకున్నాడు “పితాశ్రీ, కట్నకానుకలు, లాంఛనాలు అంటూ అడగవద్దు. అవసరమైతే పెళ్లి ఖర్చులు కూడా కొంత మనమే భరిస్తాం అని చెప్పండి వారికి” అని. కానీ అంత పని చేసే ధైర్యం చాలలేదు. విషయం తెలిస్తే, పెద్దక్కగారు రుద్రకాళి అవతారం ఎత్తుతుందేమో నని భయపడ్డాడు కూడా.

ఒక ఇరవై రోజుల తరువాత తండ్రిగారు ఉత్తరం వ్రాశారు. “ఇంకో రెండు సంబంధాలు వచ్చాయి. ఒకాయన హైదరాబాదులో ఉన్నతోద్యోగిగా ఉన్నారు. అబ్బాయికి హైదరాబాదు ట్రాన్స్ఫర్ కూడా చేయిస్తానన్నారు, అమ్మాయి అక్కడే M.Sc  చదువుతోంది. కట్న కానుకలు బాగానే ఇస్తారు అని మధ్యవర్తి చెప్పాడు. రాజమండ్రి ఆయన కూడా మళ్ళీ వచ్చారు. దసరాలకి వస్తే వెళ్లి చూసి ఏదో ఒకటి నిశ్చయించు కోవచ్చు”  అని.   

ఈ మాటు ప్రద్యుమ్నుడు బెదరలేదు, ఆలోచించలేదు. ధైర్యంగా తండ్రిగారికి ఉత్తరం వ్రాసేసాడు.

“నాకు ఇక్కడ ఉద్యోగం బాగానే ఉంది. ఆర్నెల్ల క్రితమే Ph.D  పని మొదలు పెట్టాను. ఇంకో నాల్గైదు ఏళ్లు పట్టవచ్చు. Ph.D వచ్చేదాకా  ఇక్కడినుంచి కదిలే ఉద్దేశ్యం లేదు. ఆయనెవరు నన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించడానికి. నేను  ఒప్పుకోకపోతే ఎవరూ ఏమీ చేయలేరు. రాజమండ్రి ఆయన మళ్ళీ వచ్చాడని అన్నారు కదా మీరు. పిల్లని ఇంతదూరం పంపడానికి ఆయన అప్పుడు అభ్యతరం చెప్పలేదు కదా. వారి  అమ్మాయి మన ఇంట్లో అందరికీ నచ్చింది కదా. ఇంకా సంబంధాలు చూడడం ఎందుకు?” అని నిర్మొహమాటంగా తన మనసులో మాట చెప్పేసాడు.

“దసరాలకి శలవు దొరకదు.  నెల క్రితమే కదా తిరిగి ఇక్కడకు వచ్చింది. సంక్రాంతికి రావడానికి ప్రయత్నిస్తాను.” అని కూడా వ్రాసాడు.                               

సంక్రాంతికి ఇంటికి వెళ్లాడు ప్రద్యుమ్నుడు. రాధా ప్రద్యుమ్నుల  జాతకాలు బ్రహ్మాండంగా కుదిరాయి అని చెప్పారు.  పెళ్లి చూపులు అన్నారు.  మొట్ట మొదటి పెళ్లి చూపులు ప్రద్యుమ్నుడికి.  శ్రద్ధగా తయారయ్యాడు. భూమికి చంద్ర మండలానికి మధ్య దూరం తెలుసుకున్నాడు. గుడ్డులో పోషక పదార్ధాలు ఏమిటో భట్టి పట్టాడు. ఎందుకైనా మంచిదని కాంగో దేశం వైశాల్యం కూడా కనుక్కున్నాడు. M.Sc. పరీక్షలకి కూడా  ఇంత కష్టపడలేదు కదా అని విచారించాడు.

పెళ్లి చూపులకి వెళ్ళారు. అమ్మాయి ఫోటోలో కన్నా బయటే  బాగుందని ప్రద్యుమ్నుడు  సరదా పడ్డాడు. వంటా వార్పూ , సంగీతం కూడా వచ్చునట. ఏదో సినిమాలో సుశీల పాడిన   కీర్తన కూడా పాడింది. “ఇది ఏ సినిమాలో పాట?” అని పెళ్లి కూతురి తరఫు వాళ్ళు ఎవరైనా అడుగుతారేమో నని భయపడ్డాడు ప్రద్యుమ్నుడు కానీ ఎవరూ అడగలేదు.  అమ్మాయితో ఏకాంతంగా మాట్లాడే అవకాశం వస్తుందేమో నని ప్రయత్నించాడు ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నుడి తండ్రి గారు వీటో చేసేసారు. ఇటువంటి తిక్క ఆచారాలు మన ఇంటా వంటా లేవని తేల్చేసారు. తను భట్టి పట్టిన నాలుగు విషయాలు అమ్మాయికి చెప్పి తన లోక జ్ఞానం ప్రదర్శించాలన్న ప్రద్యుమ్నుడి ఉత్సాహం నీరు కారిపోయింది.  పెళ్లి చూపుల కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. అమ్మాయి తండ్రి  మంచి రోజు చూసుకొని మిగతా విషయాలు మాట్లాడటానికి వస్తాం అని చెప్పారు.  

ప్రద్యుమ్నుడు  జోర్హాట్ వచ్చేసాడు. కలలో రెండు మూడు  యుగళ గీతాలు పాడుకొన్నాడు  కూడా రాధతో.

ఫిబ్రవరి నెలలో ప్రద్యుమ్నుడు తన బాసు గారితో  దులియాజాన్ లో ఒక కంపనీకి  వెళ్లాడు. బాసు  గారి గౌరవార్ధం వాళ్ళు ఆ రాత్రికి  అక్కడ ఒక విందు ఏర్పాటు చేశారు.  ఆ విందులో రామనాధం అనే ఒక తెలుగాయన ప్రద్యుమ్నుడితో పరిచయం చేసుకున్నారు.  విందు కాబట్టి మందు గట్రా ఉన్నాయి. ఒక గ్లాసు చేతితో పట్టుకుని, మరో చేత్తో సిగరెట్టు పట్టుకొని  ద్విపాత్రాభినయం  చేస్తున్న ప్రద్యుమ్నుడితో రామనాధం గారు చాలాసేపే మాట్లాడారు.  హాబీలు గట్రా కనుక్కున్నారు. జీతం, ప్రమోషను  వచ్చే అవకాశాలు కూడా  కనుక్కున్నారు.   ఆయన ప్రద్యుమ్నుడి బాసు గారితో కూడా మాట్లాడడం గమనించాడు ప్రద్యుమ్నుడు.

తిరిగి వచ్చేటప్పుడు బాసు గారు చెప్పారు ప్రద్యుమ్నుడితో “ఆ రామనాధం నీకేదైనా ఉద్యోగం ఇస్తాడేమో? నీ గురించి అడిగాడు నన్ను.”  

“అవునండీ నన్ను  కూడా చాలా విషయాలే అడిగారు. ప్రాజెక్ట్ వర్కు గురించే కాకుండా వ్యక్తిగత విషయాలు కూడా చాలానే అడిగారండి. ఏమైనా, నా Ph. D అయ్యేదాకా మిమ్మల్ని వదలనండి” అని చెప్పాడు ప్రద్యుమ్నుడు. 

 “అందుకనే కుర్రాడు బుద్ధిమంతుడే కానీ దుడుకు స్వభావం, అని చెప్పాను.   ప్రైవేట్ కంపనీలు వ్యక్తిగత విషయాలకి కూడా తగు ప్రాధాన్యత ఇస్తాయి.” అని  అన్నారు. 

ప్రద్యుమ్నుడు కలల్లో   రాధతో డ్యూయెట్లు పాడుకుంటూనే తండ్రి గారి  దగ్గర నుంచి శుభవార్త కోసం ఎదురు చూస్తున్నాడు. మార్చి అయిపోయింది. ఏప్రిల్ మొదలై వారం కూడా అయిపోయింది. తండ్రి గారి వద్ద నుంచి కబురు రాలేదు. మనసు కీడుని శంకించింది.  ఏమైనా అడ్డంకులు వచ్చాయేమో నని సమాధాన పడడానికి ప్రయత్నించాడు. నాన్నగారికి వ్రాసే ధైర్యం లేక ప్రద్యుమ్నుడు  పెద్దక్క గారికి ఉత్తరం వ్రాసాడు.

తిరుగు టపాలో ఉత్తరం వచ్చింది.

“వాళ్ళ వాళ్ళు ఎవరో దులియాజాన్ లో  ఉన్నారట.  నీ దురదృష్టం కొద్దీ నువ్వు వాళ్ళ ఆఫీసుకే వెళ్ళావట.  ఆయన నీతోనూ, మీ బాసుతో కూడానూ మాట్లాడారట. “కుర్రాడు పొగరుబోతు, సిగరెట్లు కాలుస్తాడు, మందు కొడతాడు, క్లబ్లో రాత్రి 10 గంటల దాకా పేకాట ఆడుతాడట.” అని సమాచారం తెలుసుకొని వాళ్ళ వాళ్లకి తెలియ పరిచారట” .

ఈ విషయం  మధ్యవర్తి ద్వారా తెలిసి ప్రద్యుమ్నుడి తండ్రి గారు అగ్గిరాముడై ఇంట్లో  కధకళి కూడా చేసేసారట. “ఉద్యోగం మాని ఇంటికి వచ్చేయమని నీకు తాఖీదు పంపడానికి ఆయన తయారయితే అతి కష్టం మీద నేనూ అమ్మ కలసి ఆపాం”, అని కూడా అక్కగారు తెలియజేశారు.

“ఔరా రామనాధం ఎంత పని చేసేవురా” అని ఆక్రోశించాడు ప్రద్యుమ్నుడు. 


ఉత్తర ప్రయాస

ఆ మధ్యన ఎక్కడో చదివాడు ప్రద్యుమ్నుడు. “ఉత్తరం వ్రాయడం ఒక చక్కటి ఆత్మీయ  అనుభూతి” అని ఒక ప్రముఖ వ్యక్తి అన్నారుట, ఏదో  సందర్భంలో. 

కాబట్టి ఆ చక్కటి చిక్కటి ఆత్మీయ అనుభూతిని  తను కూడా  పొందాలని ప్రద్యుమ్నుడు  కృతనిశ్చయుడు,  దృఢనిశ్చయుడు  అయిపోయాడు.  ఉత్తరం వ్రాయడం ఒక కళ అని కూడా విని ఉన్నాడు ప్రద్యుమ్నుడు. కాబట్టి ఆ కళను కూడా అభ్యాసం చెయ్యాలని నిర్ణయించు కున్నాడు.

ప్రద్యుమ్నుడు ఎప్పుడూ ఉత్తరాలు వ్రాయలేదా అంటే వ్రాశాడు, విశాఖపట్టణంలో చదువుకు జేరినప్పటి నుంచి,   ఉత్తరాలు వ్రాసేవాడు,  నాన్నగారికి. అవన్నీ బెదిరింపు ఉత్తరాలు అని వాళ్ళ నాన్నగారు వ్యాఖ్యానించేవారు.

“నాన్నగారూ నాన్నగారూ అర్జంటుగా వెంటనే 75 రూపాయిలు పంపించండి. లేకపోతే ఆకలి దప్పులతో అలమటించాల్సి వస్తుంది. మీరంతా క్షేమమని తలుస్తాను. మీరు వెంటనే డబ్బు పంపిస్తే నేను కూడా క్షేమంగానే ఉంటాను.” అని.

మొదటి రెండు మూడు ఉత్తరాలకి పాపం ఆయన బెదిరిపోయి అప్పో సప్పో చేసి వెంటనే డబ్బు పంపించేవారు. ఉత్తరాలలో అంకె మారేది కానీ మిగిలినదంతా డిటో గానే ఉండేది.  నాలుగు ఉత్తరాల తరువాత  ఆయన  ఆలోచించారు. అక్కడ చదువుతున్న ఒకరిద్దరు కుర్రాళ్ళ తల్లి తండ్రులను అడిగారు. వాళ్ళు ఈయనకు ధైర్యం చెప్పారు. “రెండు నెలలు మీరు పంపించక పోయినా క్షేమంగానే ఉంటాడు మీ అబ్బాయి” అని వాళ్ళపిల్లలతో వాళ్ళ  అనుభవాలు సోదాహరణం గా వివరించి చెప్పారు.

అప్పట్నించి ఆయనకు వీలైనప్పుడే  పంపించేవారు కానీ ప్రద్యుమ్నుడి ఆకలి దప్పుల ఘోష పట్టించుకోవడం మానేశారు. ప్రద్యుమ్నుడు వాళ్ళ నాన్నగారి కన్నా రెండాకులు ఎక్కువే చదివాడు. వాళ్ళ అన్నగారికి, అక్క గారికి ఆకలి ఘోష వినిపించాడు. వాళ్ళు రెండు మాట్లు పంపి ఆ తరువాత తండ్రిగారి జ్ఞానబోధ ఆకళింపు చేసుకొని  ప్రద్యుమ్నుడి ఆకలి గోల పట్టించుకోవడం మానేశారు.  పాపం ప్రద్యుమ్నుడి తండ్రి గారు ప్రతీ నెలా 10 – 15  తారీఖుల్లో డబ్బు పంపించేవారు, అడిగినంత కాకపోయినా.

ఆ తరువాత చదువయ్యి ఉద్యోగంలో జేరిన రెండు నెలలకి  ఉత్తరం వ్రాయాల్సి వచ్చింది పాపం ప్రద్యుమ్నుడికి. లీవ్ లెటర్. మార్నింగ్ షో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాల్సి వచ్చి. బాసు గారికి లీవ్ లెటర్ ఇంగ్లీష్ లో వ్రాసాడు. అనుకోకుండా అకస్మాత్తుగా కడుపు నొప్పి ఎలా వచ్చిందో, అర్జంటుగా సివిల్ హాస్పిటల్ కి వెళ్ళకపోతే ఆ నొప్పి పైకి పాకి గుండెలోకి వెళ్ళే, లేక కిందకు జారి మరొక దుర్యోగం పట్టే,  అవకాశాలు గురించి విపులంగా చర్చించి, ఒక రోజు శలవు ప్రసాదించవలసిందిగా అభ్యర్ధించాడు. ఆ లీవ్ లెటర్ చదివి, షాక్ అయి ఆయన వెంటనే లీవ్ ఇచ్చేసారు. ఓ సలహా కూడా ఇచ్చారు. శలవుకు  కారణాలు అంత విపులంగా చర్చించాల్సిన అవసరం లేదనిన్నీ, మాములుగా శలవు ఇమ్మని వ్రాస్తే ఇచ్చేస్తానని హామీ కూడా ఇచ్చారు ఆయన.  

బందుమిత్రులకి ఉత్తరాలు వ్రాసే అలవాటు  అబ్బలేదు ప్రద్యుమ్నుడికి.  ఉత్తరాలు వ్రాయాలంటే విసుగు, చిరాకు ప్రద్యుమ్నుడికి.  ఎవరైనా బంధు మిత్రులు ఉత్తరం  వ్రాసినా బాస్ గారి సూచన ప్రకారం క్లుప్తంగా “ మీ ఉత్తరం అందింది. సంగతులు తెలిసినవి. ఇంతే సంగతులు. చిత్తగించవలెను” అని జవాబు వ్రాసేవాడు. మళ్ళీ వాళ్లెవరు ఉత్తరాలు వ్రాసేవారు కాదు. తండ్రి గారికి కూడా ఉత్తరాలు వ్రాసేవాడు కాదు. ప్రతినెలా పంపే మనియార్దర్  లోనే “నేను క్షేమం. మీరు కూడా క్షేమమని తలుస్తాను”  అని ముక్తసరిగానే ముగించేసేవాడు.

మాములుగానైనా ఉత్తరం వ్రాసే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యలేదు ప్రద్యుమ్నుడు.  కళగా ఉత్తరం  వ్రాసే అవసరం కూడా  కలుగలేదు  ప్రద్యుమ్నుడుకి. కలం స్నేహాలు కానీ, ప్రేమలో పడడం కానీ ప్రద్యుమ్నుడు చెయ్యలేదు.       

ఉద్యోగంలో జేరాడు కాబట్టి పెళ్లి కూడా చేసేశారు పెద్దవాళ్ళు. అస్సాం లో ఉద్యోగం కాబట్టి, దూరాభారం కాబట్టి, పెళ్ళైన తరువాత తనతోనే సతీమణి ప్రభావతిని అస్సాం లోని జోర్హాట్ కి  తీసుకెళ్ళిపోయాడు ప్రద్యుమ్నుడు. అందుచేత భార్యామణికి ప్రేమలేఖలు వ్రాసే అవసరం కానీ అవకాశం గానీ కలుగలేదు ప్రద్యుమ్నుడికి.  ఆ దూరాభారం వల్లే భీమవరం కానీ విజయవాడ కానీ వచ్చినప్పుడు కలిసే వచ్చేవారు, కలిసే వెళ్ళేవారు.

రెండు మాట్లు ప్రభావతి పురిటికి ఇంటికి వెళ్ళినప్పుడు ఉత్తరాలు వ్రాసే  అవకాశం చిక్కినా ప్రద్యుమ్నుడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

“నిన్న వంకాయ ఆవ పెట్టి కూర చెయ్యబోయాను కానీ కూర మాడిపోయింది. ఉప్పు కూడా ఎక్కువయింది అనుకుంటాను.......  మొన్న చౌదరి గారి భార్యకి నలతగా ఉందని తెలిసి వెళ్లి చూచి వచ్చాను. ఇప్పుడు బాగానే ఉంది.” అంటూ ప్రద్యుమ్నుడు వ్రాసేవాడు.

“వంకాయ ఆవ పెట్టిన కూర మాడిపోవడమేమిటి?” అంటూ వంకాయ ఆవ పెట్టి కూర చేసే విధానం వివరించి వ్రాసేది ప్రభావతి జవాబు వ్రాస్తూ. పైగా చివర్లో “చౌదరి గారి భార్యకి నలతగా ఉంటే మీరు చూసి రావడమేమిటి,  జాగ్రత్తగా ఉండండి తేడా వస్తే కాళ్ళు విరగ  కొడతాడు ఆయన” అంటూ హెచ్చరించి ముగించేది.

ఈ విధంగా ప్రద్యుమ్నుడు దోసకాయ పచ్చడి చేయడం నేర్చుకునే లోపులే బారసాలకి వెళ్లి ప్రభావతిని తీసుకు వచ్చేసేవాడు జోర్హాట్‍‍కి.

దురదృష్టవశాత్తు ప్రద్యుమ్నుడికి ఉత్తరాలు వ్రాసే నేర్పు ఇంత కన్నా ఎదగలేదు ఇప్పటికి కూడా.  

ఉత్తరాలను వ్రాసే కళ గురించి గూగుల్లో చూశాడు కానీ చదివినది ఏది బుర్ర కెక్కలేదు. అయినా కళాత్మకమైన ఉత్తరాలు వ్రాసి చక్కటి ఆత్మీయ అనుభూతిని పొందాలన్న కోరిక ఇంకా బలపడింది ప్రద్యుమ్నుడిలో. 

మొదట ఉత్తర రచయిత నైతే తరువాత కళాత్మక రచయిత నవ్వ వచ్చని ధైర్యం తెచ్చుకున్నాడు.  ఉత్తరాలు స్థానిక పత్రికా సంపాదకులకు వ్రాస్తే బాగుంటుందని ప్రభావతి సలహా ఇచ్చింది. సంతోషంగా అంగీకరించాడు ప్రద్యుమ్నుడు.

మొదటగా కాలనీలో  ఉన్న శివాలయంలో అర్చన చేయించి, తన ఉత్తరాలు సంపాదకులకు నచ్చాలని ఆ పరమేశ్వరుడిని మొక్కుకున్నాడు. ఆ  సంపాదకులు, తన  ఉత్తరాలు పబ్లిష్ చేస్తే పాలాభిషేకం చేయిస్తానని కూడా నివేదించుకున్నాడు ఆ భోలా శంకరుడికి. 

రెండు వార్తాపత్రికలు  చదివి,  కష్టపడి ఒక  ఉత్తరం  “దేశసమస్యలపై మీరు  వ్రాస్తున్న  సంపాదకీయాలు  ముదావహముగా, ఆసక్తి దాయకంగా  నున్నవి. స్థానిక సమస్యలపై కూడా ముఖ్యంగా మా కాలనీలో కుక్కల సమస్యపై కూడా మీరు సంపాదకీయంలో ఉటంకించ వలసిందిగా ప్రార్ధిస్తున్నాను”.  అని వ్రాశాడు. ఇది  ఇంగ్లీషులోకి అనువాదం చేసి, రెండు కాపీలు చేసి, తెలుగు ఉత్తరం కూడా  రెండు కాపీలు చేసి నలుగురు సంపాదకులకు పంపించేశాడు ఉత్సాహంగా. 

పదిరోజులైనా ఏ సంపాదకుడు వాటిని ప్రచురించలేదు. దిగులు చెందక మళ్ళీ  ప్రద్యుమ్నుడు వాటికి కొద్ది కొద్దిగా మార్పులు చేసి పంపించాడు. ఇంకో పది రోజులైనా  సంపాదకులు కనికరించలేదు. పట్టు వదలని విక్రమార్కుడి లా  ఈ మాటు ఇంకో ఉత్తరం పూర్తిగా స్థానిక పత్రిక ‘ఎల్. బి. నగర్ వార్తా స్రవంతి’ కి వ్రాసి తనే పట్టుకెళ్లి పత్రిక  కార్యాలయంలో ఇచ్చి వచ్చాడు.  వారు కూడా అది ప్రచురించలేదు.

పాపం ప్రద్యుమ్నుడు కొంచెం నిరుత్సాహ పడ్డాడు. పత్రికలకి వ్రాసే విధానం గూర్చి కొంచెం శోధించాడు కానీ తనకు ఉన్న రాజకీయ పరిజ్ఞానం, స్థానిక సమస్యలపై అవగాహనా లేమి బహుశా అడ్డంకులేమో నని సరిపెట్టుకున్నాడు.  పాఠకుల ఉత్తరాల శీర్షికకు వ్రాయకూడదు అని తీర్మానించుకున్నాడు.    

పదిమందిని చంపితే కానీ వైద్యుడు కాలేడు అన్న విషయం గుర్తుకు తెచ్చింది ప్రభావతి. పదిమందిని  కష్టపెట్టయినా ఉత్తర రచయిత నవ్వాలని మరో మారు కృత నిశ్చయుడయ్యాడు ప్రద్యుమ్నుడు.  బంధు మిత్రులకు ఉత్తరాలు వ్రాయడమే మంచిదని, వ్రాయగా వ్రాయగా ఉత్తర కళ అబ్బునని, ఎన్ని కష్ట నిష్టురాలైనా భరించి ఉత్తరాలు వ్రాసే కళను పెంపొందించుకోవాలని ధృఢ నిశ్చయుడయ్యాడు ప్రద్యుమ్నుడు.        

పది మందికి వ్రాసి  పదిమంది బంధు మిత్రులతో విరోధం అంత క్షేమకరం కాదేమో నని అనుమానం వెళ్ళబుచ్చింది ప్రభావతి. ప్రద్యుమ్నుడు నిరశన వ్యక్తం చేసాడు. ప్రభావతితో ఈ విషయంపై చర్చించ కూడదని మరో తీర్మానం చేసుకున్నాడు.  పదిమందికి వ్రాసి వారి దీనాలాపాలు వినడం కన్నా, ఒకరినే పది ఉత్తరాలతో  కుళ్లపొడిచి  వారి హాహాకారాలు వినడమే శ్రవణానంద కరంగా ఉంటుందనే  దుర్బుద్ధి పొడ చూపింది ప్రద్యుమ్నుడిలో.  పైగా ప్రభావతి దగ్గరి బంధువుల్లో ఒకరికి వ్రాయాలనే శాడిస్టిక్ కోరిక బలపడింది ప్రద్యుమ్నుడిలో. అలా చేస్తే కళాభ్యాసం కుంటుపడుతుందేమో నని సందేహం కలిగింది. కళాభ్యాసం కోసం శాడిస్టిక్ కోరికను అణుచుకున్నాడు.    

ఎవరికి వ్రాద్దామా అని ఆలోచించాడు. ఆలోచించగా ఆలోచించగా  ఆంజనేయ శాస్త్రి గారు గుర్తుకు వచ్చారు. ఆంజనేయ శాస్త్రి గారితో ప్రద్యుమ్నుడికి పెద్దగా పరిచయం లేదు. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళుతుండగా బస్ లో పరిచయం అయ్యారు. ప్రద్యుమ్నుడి పక్క సీటు.

యల్. బి. నగర్ లో బస్ ఎక్కి, కండక్టర్ గారితో ముఖాముఖి తరువాత సీటు వెతుక్కుని వచ్చి సీటులో కూలబడ్డాడు ప్రద్యుమ్నుడు. 

పక్కనే అప్పటికే సుఖాసీనుడైన  ఆయన లేచి నుంచుని చెయ్యి ముందుకు జాపి “I am Anjaneya Sastri”  అన్నాడు.

ప్రద్యుమ్నుడు కూర్చునే చెయ్యి జాపి “మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది” అని అన్నాడు.

ఆయన నుంచునే చెయ్యి వదలకుండా ఇంకో మారు “I am Anjaneya Sastri”  అని అన్నాడు.

ఇక తప్పదనుకొని ప్రద్యుమ్నుడు లేచి “నన్ను ప్రద్యుమ్నుడు అంటారు”  అన్నాడు.

ఆయన చెయ్యి వదిలి తన సీట్లో కూర్చున్నాడు. ప్రద్యుమ్నుడు కూడా సీట్లో కూర్చుని తల నాలుగు వైపులా తిప్పి ప్రయాణికులను పరిశీలించి  “ ఏలూరు బస్సులు ఇంత డ్రై గా ఎందుకు ఉంటాయో” అనుకుని  నిట్టూర్చాడు.

“ఏమిటి చూస్తున్నారు. ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారా? “ అని ప్రశ్నించారు శాస్త్రి గారు.

“అబ్బే లేదండి, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూశాను” అని జవాబు ఇచ్చాడు ప్రద్యుమ్నుడు.

ఇంకో అరగంటలో ప్రద్యుమ్నుడు ఆంజనేయ శాస్త్రి గారి బయోడాటా అంతా విన్నాడు. వారు విజయవాడ లో ఉంటారుట.  పని మీద హైదరాబాదు వచ్చారుట. ఆయనకు సమాజ సేవ అంటే చాలా ఇష్టముట. ప్రస్తుతం ఆయన విజయవాడలో ఆత్మహత్యల నివారణ కౌన్సిలింగ్ కమిటీలో సభ్యుడుట. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకునే వారికి కౌన్సిలింగ్ చేసి వారిని ఆ ప్రయత్నం చేయకుండా ఆపుతారట. స్త్రీ జనోద్ధరణ కూడా వారి సమాజ సేవలో భాగమట.   ఇంకా చాలానే చెప్పారు. ప్రద్యుమ్నుడు నాలుగు మాట్లు ఆవలించాడు. ధైర్యం చేసి మధ్యలో ఆయన ఉపన్యాసం  ఆపి “మీకు నిద్ర రావటం లేదా” అని అడిగాడు.  ఆయన వాక్ప్రవాహం కొనసాగింది. మరింత ధైర్యం చేసి “పొద్దున్నుంచి అనేక పనులవల్ల అలసి పోయాను. నిద్ర ముంచుకు వస్తోంది” అని కూడా మొరపెట్టుకున్నాడు. అయినా శాస్త్రి గారు కనికరించ లేదు. ఇంకో పదినిముషాలు పైనే తన ఉపన్యాస ఝరిలో ప్రద్యుమ్నుడిని ముంచేసారు శాస్తిగారు. “ఇప్పుడు  తమ గురించి చెప్పండి” అని పృచ్చించారు శాస్త్రిగారు.

తప్పదనుకొని ప్రద్యుమ్నుడు “ నేను భీమవరంలోనూ, వాల్తేరు లోనూ విద్యాబ్యాసం చేశాను. జోర్హాట్, అస్సాం లో సైంటిస్ట్ గా పనిచేసాను. ప్రస్తుతం పనీ పాడు లేని రిటైర్డ్ వ్యక్తిని.” అని క్లుప్తంగా ముగించి బేగ్ లోంచి తువ్వాలు తీసి ముసుగు పెట్టుకొని నిద్రకు ఉపక్రమించాడు. ఆంజనేయ శాస్త్రిగారు “అప్పుడే నిద్రా” అని ఆశ్చర్యపోయారు.

ఉన్నట్టుండి ఎవరో కుదిపితే మెలుకవ  వచ్చింది ప్రద్యుమ్నుడికి.  ఎదురుగుండా శాస్త్రిగారు.

“మా ఊరు విజయవాడ  వచ్చేసింది. నాలుగున్నర అయింది. ఇక్కడ అరగంట బస్ ఆగుతుంది. మెలుకువగా ఉండండి. ఇంకో గంటలో ఏలూరు వచ్చేస్తుంది. ఇది నా ఎడ్రస్. మీరు విజయవాడ వస్తే నాకు తెలియజేయండి.  నేను వచ్చి కలుస్తాను. మీ ఎడ్రస్ ఇవ్వండి.” అన్నారు శాస్త్రిగారు. 

ఇంకా బద్ధకం వదలని ప్రద్యుమ్నుడు తన సెల్ నంబర్ చెప్పాడు. నిద్ర మత్తులోనో, కావాలనో   ఒక నంబర్ తప్పు చెప్పాడు. శాస్త్రిగారు తన సెల్ లో ఎక్కించుకున్నారు.

 ఏలూరు నుంచి తిరిగి రాగానే ప్రభావతి శాస్త్రిగారి ఎడ్రస్, ఎడ్రస్ బుక్కు లో ఎక్కించేసింది .  ఇది జరిగి నాలుగు ఏళ్లు అయింది.   

ఎడ్రస్ బుక్కు తీసి ఆంజనేయ శాస్త్రి గారి చిరునామా వెతికి  తీసాడు ప్రద్యుమ్నుడు.  ఉత్తరం వ్రాయడానికి ఉపక్రమించాడు. నాలుగు లైన్లు వ్రాసి, రెండు తీసేసి రెండు మార్చి వ్రాస్తూ నాలుగు రోజులకి ఒక  ఉత్తరం వ్రాయగలిగాడు.

బ్రహ్మశ్రీ వేదమూర్తులైన  శ్రీఆంజనేయ శాస్త్రి గారికి తమ మిత్రుడు ప్రద్యుమ్నుడు నిత్యం త్రికాలముల యందు అనేక నమస్కారములు చేస్తూ వ్రాయు లేఖార్ధములు. ( ఈ వాక్యం తన తండ్రిగారు తమ మామ గారికి వ్రాసే ఉత్తరంలో వ్రాసేవారు. అది గుర్తుకు వచ్చి కాపీ కొట్టేశాడు. ఆంజనేయ శాస్త్రి గారు తనకన్నా చిన్నవాడు అయినా, చిన్న  పామునైనా పెద్ద కర్ర తోనే కొట్టాలనే సూత్రం గుర్తుకు వచ్చి నమస్కారం తో సహా యధాతధంగా ఉంచేశాడు).

నాలుగు సంవత్సరాల క్రితం హైదరాబాదు నుంచి ఏలూరు వెళ్ళే బస్సులో తమ పరిచయ భాగ్యం కలిగింది. మీకు గుర్తు ఉందని ఆశిస్తున్నాను.  అప్పటి నుంచి మీకు ఉత్తరం వ్రాసి మీతో  పరిచయం పెంపొందించుకోవాలనే  ఉబలాటపడ్డాను. కానీ దైవానుగ్రహం కుదరక ఇప్పటిదాకా వ్రాయలేకపోయాను. ఇందుకు మీరు నన్ను క్షమించాలి. ఇప్పుడు ఈ ఉత్తరం వ్రాసే అవకాశం అనడం కన్నా అవసరం కలిగింది అని నిర్మొహమాటంగా ఒప్పుకుంటున్నాను.  

గత కొన్ని వారాలుగా జీవితం మీద చిరాకు పుడుతోంది. ఆర్ధికంగా గానీ ఆరోగ్యపరంగా గానీ బాగానే ఉంది.  ఇబ్బందులు ఏమీ లేవు. అయినా ఏదో నిరాసక్తత, నిరుత్సాహం ఆవరిస్తున్నాయి. జీవించి ఏమి చెయ్యాలో అర్ధం కావటం లేదు. నా అవసరం కూడా ఇంట్లో ఎవరికీ లేదు. నేను లేకపోయినా ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదనే నా విశ్వాసం. మా ఆవిడకు సమృద్ధిగానే, అవసరాలకి మించే ఫామిలీ పెన్షన్ వస్తుంది.  మా ఆఫీసు నుంచి మెడికల్ ఫసిలిటీస్  కూడా యధాతధంగానే ఉంటాయి. నేను లేకపోతే పని తగ్గి ఆవిడ ఇంకొంచెం ఆనందంగానే  ఉంటుందని నా అనుమానం.  ఆలోచిస్తుంటే వ్యర్ధ జీవితం గడుపుతున్నానేమో ననే నమ్మకం బలపడుతోంది.   జీవితం మీదే విరక్తి పుడుతోంది. శాంతి లోపిస్తోంది.  ఆ మధ్యన సన్యసించి దేశాలు తిరిగితే శాంతి లభిస్తుందేమో ననికూడా అనుకున్నాను. కానీ వంకాయ కూర మీద, బొబ్బట్లు, తొక్కుడు లడ్డూల మీదా వ్యామోహం చంపుకోలేక ఆ ఉద్దేశ్యం నుంచి విరమించుకున్నాను. ఈ వ్యామోహం కూడా జీవితం మీద ఒక విధంగా విరక్తి కలిగిస్తోంది. షేక్స్పియర్ గారి హేమ్లెట్ లాగానే “టు బి ఆర్ నాట్ టు బి” అనే ద్వైదీ భావన ( ఈ పదాలు ఎక్కడో చదివాడు ప్రద్యుమ్నుడు. అర్ధం తెలియకపోయినా బాగున్నాయి,  బరువుగా ఉంటాయి  అని ఇక్కడ వాడేశాడు)   కలుగుతోంది. ఆశా  నిరాశా నిస్పృహ ల మధ్య ఆలోచనలు తీవ్రతరమవుతుంటే మీరు గుర్తుకు వచ్చారు. ఈ జీవితం మీద విరక్తి, బొబ్బట్లు, తొక్కుడు లడ్డూల మీద అనురక్తి లకు సంబంధించిన ద్వందభావాల నుంచి విముక్తి కలిగే మార్గం మీరేదైనా ఉపదేశిస్తారేమో నని ఈ ఉత్తరం ఇప్పుడు మీకు వ్రాస్తున్నాను.  మీ గత అనుభావాల దృష్ట్యా మీరు తగు మార్గ నిర్దేశనం చేస్తారని ఆశిస్తునాను.

ఇట్లు,

భవదీయుడు,

ప్రద్యుమ్నుడు     

వెనక్కాల నుంచి ఉత్తరం చదివిన ప్రభావతి, “ఫరవాలేదు బాగానే వ్రాసారు.  క్లుప్తంగా విషయం వివరించారు. మీరు ఉత్తరాలు వ్రాయగలరు” అని సర్టిఫికెట్ ఇచ్చింది.

“విషయ వివరణ బాగానే కుదిరిందేమో కానీ కళాత్మకంగా కనిపించటం లేదు. సరే మొదటి ప్రయత్నం కదా చూద్దాం” అన్నాడు ప్రద్యుమ్నుడు. ఉత్తర కళ అబ్బుతుందేమో నని సంతోష పడ్డాడు కూడాను.

ఉత్తరం కవరులో పెట్టి పోస్ట్ చేసేసాడు. పాపం ఆంజనేయ శాస్త్రి అనుకుంది ప్రభావతి. వారం  రోజుల్లో తప్పితే పదిరోజుల్లో  నైనా జవాబు వస్తుందని అనుకున్నాడు ప్రద్యుమ్నుడు.

నాలుగు రోజుల తరువాత పొద్దున్నే టెలిఫోన్ వచ్చింది.  

టెలిఫోన్ ఎత్తి “ ప్రద్యుమ్నుడు ఇక్కడ” అన్నాడు మాములుగానే.  

“నమస్కారం, నా పేరు విజయ దుర్గ, విజయవాడ నుంచి శ్రీ ఆంజనేయ శాస్త్రి గారు నిన్న రాత్రి నాకు టెలిఫోన్ చేశారు. మీరు సంకట పరిస్థితుల్లో ఉన్నారని, వెంటనే వెళ్లి కౌన్సిలింగ్ చెయ్యమని చెప్పారు. నేను ఇప్పుడు మీ కాలనీ లో మీ రోడ్డులోకే  వచ్చేశాను. మీరు బయటకు వస్తే మీ ఇల్లు గుర్తుపడతాను.” అని అన్నారు.

ప్రద్యుమ్నుడు కొంచెం కంగారు పడ్డాడు. ఇదేమిటి ఈ  పర్యవసానం ఊహించలేదే  అనుకున్నాడు. కానీ గుమ్మం ముందుకు వచ్చింది ఆవిడ కాబట్టి  తప్పదనుకొని వీధిలోకి వెళ్లాడు. తమ ఇంటి పక్కనే కారు ఆపి ఎవరో స్త్రీ నుంచుని ఉన్నారు. ప్రద్యుమ్నుడిని చూసి ముందుకు వచ్చి విజయ దుర్గ అంటూ చెయ్యి జాపింది.

“ప్రద్యుమ్నుడు”  అంటూ  చెయ్యి కలిపాడు. చెయ్యి వదిలి ఆవిడను పరీక్షగా చూశాడు. సుమారు ఐదు  అడుగుల ఆరు  అంగుళాల కన్నా పొడుగు ఉంటుందేమో నని అంచనా వేసాడు.   పొడుగుకు తగ్గ లావు అని కూడా అనుకున్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాలేమో అని కూడా అనుమానపడ్డాడు.

“వెల్కం, వెల్కం, రండి, రండి” అంటూ ఇంట్లోకి ఆహ్వానించాడు.

సుఖాసీన అయిన తరువాత దుర్గ గారు చెప్పారు,

“నేను శాస్త్రి గారు కలిసి వైజాగ్ లో లా చదివాం. ఆయన  96లో పూర్తిచేశారు. నాకు అప్పుడే పెళ్లి గట్రా అయ్యాయి అందుచేత  నేను  98 లోనే పూర్తి చెయ్యగలిగాను.” 

“గట్రా అంటే ఏమిటండీ? “ అని అడగబోయాడు ప్రద్యుమ్నుడు కానీ ఆగిపోయాడు. దుర్గ గారు కొనసాగించారు,

“నేను ఇక్కడ ఓ కంపనీకి లీగల్ అడ్వైజర్ గా ఉన్నాను. కోర్టులో ప్రాక్టీసు కూడా చేస్తున్నాను. శాస్త్రి గారు అక్కడ కోర్టులో ప్రాక్టీసు చేస్తున్నారు. చాలా ఘట్టి వారండి. కేసు తీసుకుంటే సుప్రీం కోర్టు దాక తీసుకెళ్ళి కానీ వదలరండి. హై కోర్టు పని మీద ఇక్కడకు తరుచుగా వస్తూనే ఉంటారు. ఆయనే నన్ను ఈ సమాజ సేవకి ప్రోత్సహించారండి. మీరు వారికి బాగా తెలుసునట కదండీ. మిమ్మల్ని, మీ సమస్యని జాగ్రత్తగా స్టడీ చెయ్యమన్నారండి. తగు సూచనలు చేసి మీలో  ధైర్యం నింపమన్నారండి. వారు ఇంకో పది రోజుల్లో  వస్తారండి.  అప్పుడు మేము కలసి చర్చించి నిర్ణయిస్తామండి.” ఊపిరి  తీసుకోడానికి ఆగింది ఆవిడ.   

ప్రభావతి ఒక గ్లాసుడు మంచినీళ్ళు తీసుకు వచ్చింది. ఆవిడ రెండు గుక్కలు తాగి తిరిగి మొదలు పెట్టింది,

“శాస్త్రి గారు, మీరు ఆయనకు వ్రాసిన ఉత్తరం నాకు ఫాక్స్ (fax) చేసారండి. ముందుగా మీకు మా టెర్మ్స్ అండ్ కండిషన్స్ తెలియజేయాల్సిన బాధ్యత ఉంది నాకు. మాకు ఏదైనా అభ్యర్ధన వస్తే మేము ముందుగా వారి ఇంటికి వెళతాము. వారితోనూ, వారి ఇంట్లో వారితోనూ మాట్లాడి వస్తాము. అవసరమైతే ఇంకో విజిట్ కూడా చేయాల్సివస్తుంది.  ఈ విజిట్ ఒక్కటికి  Rs3000/ పుచ్చుకుంటాం. ఆ తరువాత విజిట్ కి Rs2000/ తీసుకుంటాము. మీరు మా ఆఫీసుకి వస్తే Rs.1500/ తీసుకుంటాము. మొదటి సమావేశం వారి వారి  ఇంట్లోనే జరుగుతుంది ఎందుకంటే ఈ సమస్యలో ఇంట్లోని వారి పాత్ర ఏమైనా ఉందేమో తెలుసుకోవడానికి.”

ప్రద్యుమ్నుడు వెంటనే అడ్డుపడ్డాడు.

“సమాజ సేవ ఉచితంగానే చేస్తారనుకున్నాను. చచ్చే ఆలోచనకే ఇంత ఖర్చు పెట్టాల్సి ఉంటుందని తెలియదు”

“ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని, పేదవారికి ఉచితంగానే చేస్తామండి” వివరించింది విజయ దుర్గ.

“అబ్బే ఆత్మహత్య ఆలోచన విరమించుకున్నానండి. మీ అవసరం ఇప్పుడు లేదు”  చెప్పాడు ప్రద్యుమ్నుడు.

“ ముందు ముందు మళ్ళీ  ఎప్పుడైనా కలగ వచ్చు కదండీ. ఆ ఆలోచన కూడా రాకుండా సలహా ఇస్తామండి”  దొరికిన కేసు వదల దలుచుకోలేదు విజయ దుర్గ.

“అబ్బే అవసరం లేదు. ఆ ఆలోచన ఇక మీదట రాదండి. హామీ ఇస్తాను” విన్నవించుకున్నాడు ప్రద్యుమ్నుడు.

“మీ అభ్యర్ధన మేరకే ఇప్పుడు వచ్చాను నేను. ఈ విజిట్ కి ఫీజు చెల్లించాలి మీరు” చివరి అస్త్రం ప్రయోగించింది విజయ దుర్గ.

ప్రద్యుమ్నుడు ఏదో అనే లోపునే ప్రభావతి కలగ జేసుకుంది,

“దుర్గమ్మ గారూ, శాస్త్రి గారికి వ్రాసిన ఉత్తరానికి పరిహారంగా ఆ మూడు వేలు ఇచ్చేస్తాం. మీరు వెళ్ళండి”

డబ్బు తీసుకొని వెళుతూ ప్రభావతికి ఒక సలహా ఇచ్చింది దుర్గమ్మ,   

“మీకు ఎప్పుడైనా విడాకులు తీసుకోవాలనిపిస్తే , నన్ను పిలవండి. ఇది నా కార్డు. “   

దుర్గమ్మ వెళ్ళిన వెంటనే దేముడి ముందు నిలుచుని ప్రమాణం చేసాడు ప్రద్యుమ్నుడు,

“ఇక ముందు అత్యవసర మైతే తప్ప ఎవరికీ ఉత్తరం వ్రాయను” అని.          


స్వయంకృతం

పాపం ప్రద్యుమ్నుడికి ఈ మధ్యన తీరుబడి ఎక్కువయింది. పాత విషయాలు కొన్ని గుర్తుకు వస్తున్నాయి. వేసిన తప్పటడుగులు తెలుసుకుంటున్నాడు.

పెళ్ళైన కొత్తలో పాపం ప్రద్యుమ్నుడికి పెళ్ళాం ప్రభావతి అంటే బోలెడు ప్రేమ ఉండేది. అప్పుడప్పుడు అది గోదావరి వరదలాగా పొంగిపోయేది. ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు పాపం ప్రద్యుమ్నుడు.

పెళ్ళైన కొత్తలో ప్రభావతి ప్రద్యుమ్నుడిని ఏమండీ అని పిలిచేది. మీరు అని సంబోధించేది. ప్రేమగా, గౌరవంగా , అభిమానంగా, ఆప్యాయంగా, మృదు మధురంగా, శ్రావ్యంగా   అలా పిలిచేటప్పటికి ప్రద్యుమ్నుడు ఆనందోత్సాహాలతో పొంగిపోయేడు.   ఎందుకంటే “ఏమండీ, మీరు” అని ప్రద్యుమ్నుడిని పిలిచిన ప్రప్రధమ వ్యక్తి ప్రభావతి. చిన్నప్పటి నుంచి, ఇంట్లోనూ, బయటా కూడా బంధు మిత్రులు, పరిచయస్తులు కూడా “ఒరేయ్, అరేయ్” అనే పిలిచేవారు. స్కూల్లో కొంతమంది మేష్టార్లు ప్రేమ ఎక్కువై, “శుంఠా, కుంకా” అని కూడా పిలిచేవారు.  కాలక్రమేణా వయసు పెరిగే కొద్ది “పద్దూ, పద్దుగాడు” లాంటివి స్థిరపడ్డాయి. ప్రేమ  ఎక్కువైనప్పుడు, జననీజనకులు, సోదర సోదరీమణులు  పద్దూ గాడిదా అని కూడా అనేవారు. 

ప్రభావతి పిలిచిన పిలుపుకి  ప్రద్యుమ్నుడు ఉప్పొంగిపోయి కృతజ్ఞతా భావంతో  ఒక అంగుళం వంగిపోయాడు. ప్రద్యుమ్నుడు ప్రభావతికి లొంగిపోవడానికి ఇక్కడే అంకురార్పణ జరిగింది.

జోర్హాట్ లో కాపురం పెట్టిన కొత్తలో ప్రద్యుమ్నుడి ఇంట్లో , మిక్సి, గ్రైండర్ ఇత్యాదులు లేవు. రుబ్బురోలు కూడా మూడు నెలల తరువాతే వచ్చింది. అప్పటిదాకా ప్రభావతి ఉదయం ఉపాహారంగా ఉప్మానే వడ్డించేది. సూజీ, గోధుమ రవ్వ, సేమ్యా, బ్రెడ్, అటుకుల  ఉప్మాలు చేసేది. రకరకాల ప్రయోగాలు కూడా చేసేది. అప్పటికి ఇంకా నియంతృత్వ పోకడులు అలవాటు కాకపోవడం వల్ల ప్రభావతి  ముందు హెచ్చరికలు చేసేది. ఈ వేళ గోధుమ రవ్వ + సేమ్యా ఉప్మా అని ప్రకటించేది. ఈ క్రమంలోనే టమోటా ఉప్మా , కేప్సికం, కేరట్, బటానీలు, బంగాళాదుంప, మిక్సెడ్ కూరల ఉప్మాలు కూడా వండి  వడ్డించింది. 

“ఆహా, ఈ పతివ్రతా తిలకం ఇంత కష్టపడి, నాకు రుచిగా వండి పెట్టాలని ఎంత తాపత్రయ పడుతోంది”  అనే ఉదార భావం ప్రద్యుమ్నుడిలో మొలకెత్తి, దయ, జాలి, కరుణ, ప్రేమ, అభిమానం ఇత్యాదులన్నీ నీరు, ఎరువు పోయగా ఆ మొలక వృక్ష మయింది. అప్పుడు ప్రద్యుమ్నుడు ఇంకో రెండు అంగుళాలు వంగాడు. 

ఇంకో పదిరోజుల్లో రుబ్బురోలు ప్రద్యుమ్నుడి ఇంట్లో గృహాప్రవేశం చేసింది.  జోర్హాట్లో  రుబ్బురోలు దొరకదు.  వాయుసేన లో పని చేసే ఒక తమిళ సోదరుడు ట్రాన్స్ఫర్ అయి వెళుతూ రుబ్బురోలు దానం చేశాడు ప్రద్యుమ్నుడికి ఒక తెలుగు మిత్రుడి సిఫార్సు తో.         

 ప్రభావతి ఆనందించినట్లు కనిపించినా ప్రద్యుమ్నుడు కడుంగడు ముదావహుడు అయ్యాడు, ఉప్మా పర్వం అయిపోతుంది గదా యని. పాపం ప్రభావతి కూడ ఉత్సాహంగానే ఇడ్లి, దోశ, మినపట్టు, పెసరట్టు, అప్పుడప్పుడు ఉప్మా సహిత పెసరట్టు కూడా వండి వడ్డించేది.

ఒక ఆదివారం ఎప్పటి లాగానే 8 గంటలకి నిద్ర లేచాడు ప్రద్యుమ్నుడు. వరండా లోంచి శబ్దాలు వినవస్తున్నాయి. ఏమిటా అని శ్రద్ధగా విన్నాడు. రుబ్బురోలులో ఏదో రుబ్బుతున్న చప్పుడు.

“ఆదివారం పొద్దున్నే ఏమిటి రుబ్బుతోంది ప్రభావతి”  అని ప్రశ్నించుకున్నాడు. సమాధానం కోసం వరండాలోకి వచ్చాడు.

ప్రభావతి రుబ్బురోలు ముందు కూర్చుని పెసర పప్పు రుబ్బుతోంది. రోలు ముందు ప్రభావతిని చూడగానే ఎప్పటిలాగానే ప్రద్యుమ్నుడికి జాలి పుట్టింది. జాలితో ప్రేమ పొంగుకు వచ్చింది. పొంగు ప్రవాహమయ్యే సూచనలు కనిపించాయి.

“రుబ్బు రోలు తీసుకు వచ్చి ఎంత పాపం చేశాను. ఈ నారీ శిరోమణి రెండు మూడు రోజుల కొక మారు ఈ రుబ్బుడు కార్యక్రమమునకు ఉపక్రమించు చున్నది కదా. దీనికంతయు కారణము నా నాలికయే కదా.” అని విచారించాడు.

“ప్రభావతి వంటి పిల్ల లేదోయ్ లేదోయ్

రోజూ  పప్పు రుబ్బిస్తే నన్ను

వదిలి పోతుందోయ్   వదిలి పోతుందోయ్”   అని పాడాడు ప్రద్యుమ్నుడు.

“నండూరి వారి అభిమానులు  కర్ర పుచ్చుకుని వస్తారు ఆయన పాటలని ఖూనీ చేస్తే” అని నవ్వింది ప్రద్యుమ్నుడి ఎంకి.

“మీరు దంతధావనాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని వస్తే పెసరట్లు వేసుకుందాం. ఈ లోపు చట్నీ కూడా చేసేస్తాను. ఉప్మా తయారయి పోయింది” అని చెప్పింది ప్రభావతి.

మళ్ళీ జాలి పొంగుకొచ్చింది ప్రద్యుమ్నుడికి.  జాలి తో పాటు ప్రేమ ప్రవాహం కూడా.

“చట్నీ వద్దు పతివ్రతా తిలకమా, పెసరట్టు ఉప్మా  తో బాగానే ఉంటుంది. అయినా వారం రోజుల క్రితం కొన్న కాశీనాథ్ భట్టాచార్య వారిచే తయారు జేయబడిన  జింజర్ కా పికెల్ ఉన్నది కదా” అన్నాడు ప్రద్యుమ్నుడు.

“ అది పికెల్ కాదు బెల్లం పాకం” అంది ప్రభావతి.

“గారెలలోకి, పెసరట్లకి కూడా బెల్లం పాకం బాగానే ఉంటుంది కదా భార్యామణీ” అన్నాడు ప్రద్యుమ్నుడు.

“మీ మొహం. మీరు మొహం కడుక్కు రండి. ఈ లోపు నాకు బోల్డు పనులున్నాయి” అని విసుక్కొంది ప్రభావతి.            

మళ్ళీ జాలి పొంగుకొచ్చింది. ఇంకో రెండు అంగుళాలు  వంగాడు. నడ్డి, తల భూమికి సమాంతరంగా వచ్చేస్తున్నాయేమో నని అనుమానం వచ్చింది ప్రద్యుమ్నుడికి. ఎంత ప్రేమ పొంగినా, ఇక మీద వంగకూడదు అని స్వగతంలో నిర్ణయించుకున్నాడు. 

ఇంకో  పదిహేను, ఇరవై  రోజులు రుబ్బురోలు పర్వం సలక్షణంగానే నడిచింది.   ఈ మాటు జాలికి చోటు ఇవ్వలేదు ప్రద్యుమ్నుడు, ప్రయత్నపూర్వకంగానే, కష్టంగానైనా. 

ఆ తరువాత వరుసగా నాల్గైదు  రోజులు ఉదయం ప్లేటులో ఉప్మా దర్సనమిచ్చింది, ఈ మధ్యనే తెప్పించిన  ప్రియా ఆవకాయతో సహా.  ఆరవ  రోజున కూడా ఉప్మా చూసి ప్రద్యుమ్నుడు, యదాలాపంగానే,  తెలివితక్కువగానే అడిగాడు ప్రభావతిని,

 “ప్రభా డియర్, ఏమైంది ఒంట్లో బాగాలేదా? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళనా?” అని.

“డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత సమస్య ఏమీ లేదు. కుడి భుజం నొప్పిగా ఉంది. కొంచెం వాచిందేమో కూడా.” అని జవాబు ఇచ్చింది ప్రభావతి కాఫీ ఇస్తూ.

ప్రద్యుమ్నుడికి సమస్య అర్ధం అయీ అవనట్టుగా ఉంది.  రుబ్బుడు కార్యక్రమంలో చెయ్యి నొప్పి పెట్టిందా అనే అనుమానం పొడచూపింది మనసులో.  కాఫీ తాగేసి ఆఫీసు కెళ్ళిపోయాడు.  వెళుతూ వెళుతూ ఓ సలహా కూడా ఇచ్చాడు.

“ఎందుకైనా మంచిది. ఒక మాటు ప్రతిమ దగ్గరకు వెళ్ళు. నేను టెలిఫోన్ చేసి చెబుతాను ప్రతిమకి”  అని.

“అఖ్ఖర్లేదు. ప్రతిమతో నాకు పరిచయం బాగానే ఉంది. మీకు అంతగా ప్రతిమతో మాట్లాడాలనిపిస్తే మాట్లాడుకోండి. నాకభ్యంతరం లేదు.   నా సంగతి సాకుగా చూపి మాట్లాడఖ్ఖరలేదు.” 

Dr. ప్రతిమ మెడికల్ ఆఫీసర్ గా పని చేస్తోంది వాళ్ళ ఆఫీసులోనే.  పెళ్ళికి ముందు  సుమారు ఆర్నెల్లు,   ప్రద్యుమ్నుడు ప్రతిమ చుట్టూ తిరిగేవాడని ప్రభావతికి తెలిసింది. అంతస్తుల్లో అంతరాలు ఎక్కువగా ఉన్నందున ప్రద్యుమ్నుడి ప్రయత్నాలు భంగమయ్యాయని కూడా తెలిసింది. ప్రతిమ తండ్రిగారికి, రెండు తేయాకు తోటలు ఉన్నాయని కూడా తెలిసింది ప్రభావతికి. కాలక్షేపం కోసమే ఉద్యోగం చేస్తోందని, ఆమె  లండన్ వెళ్ళే ప్రయత్నంలో ఉందని కూడా తెలిసింది. ఆమెకు కాబోయే భర్త అక్కడే ఉన్నాడని తెలిసి ప్రద్యుమ్నుడు ప్రేమ ప్రయత్నం విరమించుకున్నాడని కూడా భోగట్టా సేకరించింది, ప్రభావతి. 

ఇంకో వారం పది రోజులు ఇలాగే గడిచిపోయాయి. ఉప్మా, బ్రెడ్ జామ్, కారన్ఫ్లేక్స్ పరంపర కొనసాగింది. ప్రద్యుమ్నుడు మాట్లాడకుండా తిని వెళ్లిపోయేవాడు. “తనకే ఇవి తినడం విసుగొచ్చి , ఇడ్లీ, దోసల ప్రకరణం మళ్లీ ప్రభావతి మొదలు పెడుతుందేమో” నని ఆశగా ఎదురు చూస్తున్నాడు ప్రద్యుమ్నుడు.   

ఒక ఆదివారం ప్రద్యుమ్నుడుకి  ఉదయం నిద్రలేవగానే వరండాలో రుబ్బుడు శబ్దం శ్రావ్యంగా వినిపించింది. విజయ దరహాసం ప్రద్యుమ్నుడి పెదవుల మీదకు పాకింది. లేచి వరండాలోకి వచ్చాడు. పెసరపప్పు రుబ్బుతున్న ప్రభావతి ముగ్ధ మనోహరంగా కనిపించింది ప్రద్యుమ్నుడి కళ్ళకి.

“లేచారా?  నేను లేచేటప్పటికే 7-30 అయింది. పెసరట్టు ఉప్మా చేసుకుందాం. ఆప్పుడే 8 దాటింది.  కొంచెం ఈ కొబ్బరి కోరండి. ఇంకా ఉప్మా కూడా చెయ్యాలి.” అని అంది.

ప్రద్యుమ్నుడు ముందు జాగ్రత్తగా అన్నాడు,

“ఇంకా మొహం కడగలేదు. అయినా పెసరట్టు ఉప్మాకి చట్నీ అవసరం లేదులే” అన్నాడు సామరస్య పూర్వకంగానే.

“ఎంత, అయిదు నిముషాల పని. ఇది చేసేసి మీ కార్యక్రమాలకి వెళ్ళండి.” బతిమాలే ధోరణి లోనే అంది అనుకున్నాడు ప్రద్యుమ్నుడు.

“సరేలే కొబ్బరే కదా కోరెస్తే సరి. ఈ మాత్రం సహాయం చేయకపోతే ఎలా? ” అని కూడా అనుకున్నాడు.  

కోరం ముందు కూర్చుని కొబ్బరి చిప్ప పట్టుకొని కోరడానికి  ఉపక్రమించాడు ప్రద్యుమ్నుడు.   

ఇంతలో ప్రభావతి లేచి, వంటింట్లోకి వెళ్లి  ఐదు నిముషాల తర్వాత బయటకు వచ్చింది. మొహం సబ్బుతో తోమింది అనుకున్నాడు ప్రద్యుమ్నుడు.

“మొహం జిడ్డుగా ఉంది. ఆదివారం కదా ఎవరైనా వస్తే బాగుండదు” అంటూనే బెడ్ రూం లోకి వెళ్లింది. ఇంకో ఐదు నిముషాల తరువాత వచ్చింది. ఈ లోపునే ప్రద్యుమ్నుడు కొబ్బరి కోరడం పూర్తి చేసేశాడు. ప్రభావతి చూసి.

“బాగానే కోరారండి. సన్నగా మెత్తగా, నా కంటే బాగా ” అంది.  సన్నగా, మెత్తగా అంటే అర్ధం కాకపోయినా, “నా కంటే బాగా” అన్న మాట విని కొంచెం గర్వపడ్డాడు అమాయకుడు.

వంటింట్లోకి వెళుతూ అంది ప్రభావతి. “పెసరపప్పు నేను చాలా మట్టుకు  రుబ్బేశాను,  ఇంకో నాల్గైదు మాట్లు తిప్పితే సరిపోతుంది. అది మీరు చూడండి. ఈ లోపున నేను ఉప్మా చేస్తూ ఉంటాను.” 

రుబ్బురోలు కేసి చూశాడు ప్రద్యుమ్నుడు. పిండి మెత్తగానే కనిపిస్తోంది. ఇంకో నాల్గైడు మాట్లు పొత్రం తిప్పితే సరిపోతుందేమో అనుకున్నాడు. అయినా బింకంగానే అన్నాడు,

“నాకు రుబ్బడం చేత కాదు ప్రియతమా”

“ఇదేం, బ్రహ్మవిద్యా, రోజూ నేను రుబ్బుతుంటే చూస్తూనే ఉన్నారుగా”

“ఎప్పుడూ ఇటువంటివి చేయలేదు” దీనంగానే అన్నాడు ప్రద్యుమ్నుడు.  

“భలే వారే. M. Sc. చేశారు. అందులోనూ కెమిస్ట్రీ, మీకు తెలియక పోవడం ఏమిటీ. మీరు చెయ్యగలరు” నమ్మకం గానే అంది ప్రభావతి ధైర్యం చెబుతూ.

ప్రద్యుమ్నుడు వంటింట్లోకి తొంగి చూశాడు. ప్రభావతి కత్తిపీట ముందు వేసుకొని, ఉల్లిపాయలు తరుగుతోంది. పక్కనే పచ్చి మిరపకాయలు, అల్లం ఉన్నాయి కూడా. ఇక తప్పదనుకొని రుబ్బురోలు ముందు పీటపై కూర్చున్నాడు, రుబ్బడానికి సిద్ధమై. రెండు మాట్లు పొత్రం తిప్పాడు.

ఇంతలో ప్రభావతి చెప్పింది,  “ఆ పక్కనే మూత వేసిన గిన్నెలో ఇంకొంచెం పెసరపప్పు ఉంది, అది కూడా రుబ్బేయండి.” మూత తీసి చూశాడు ప్రద్యుమ్నుడు, మూడు నాలుగు గుప్పెళ్ళు పైనే ఉంది పెసరపప్పు అనుకున్నాడు.

“ఇంత పప్పు ఎందుకు? మనిద్దరికి రుబ్బిన పిండి సరిపోతుంది కదా?” అన్నాడు ప్రద్యుమ్నుడు విసుగ్గా.

“అదేమిటి, మీ అభయ్ సింగ్ వస్తానన్నాడు కదా ఈ వేళ బ్రెక్ఫాస్ట్ కి. మరిచిపోయారా?

“గుర్తు లేదు నాకు. ఎప్పుడు చెప్పాడు? అయినా వాడికి ఇడ్లీ, దోశ చేస్తే బాగుంటుంది కదా అడిగాడు ప్రద్యుమ్నుడు.

“నాలుగు రోజుల క్రితం క్లబ్బులో చెప్పాడు. మీరు రమ్మని ఆహ్వానించారు కూడాను. నాకూ గుర్తు లేదు. నిన్నరాత్రి పడుకునే ముందు గుర్తుకు వచ్చింది. పెసరపప్పు నానవేశాను” చెప్పింది ప్రభావతి.

ఎలాగూ తప్పదు కదా, వాడు వచ్చేలోపున పూర్తి చేయాలి, రుబ్బడం. లేకపోతే ఆఫీసులో నేను పిండి రుబ్బుతున్న వార్త ప్రసారం చేసేస్తాడు. గబగబా రుబ్బడం మొదలు పెట్టాడు ప్రద్యుమ్నుడు. ఇంకో పది నిముషాల్లో రుబ్బడం అయిపోయేటప్పుడు, చెప్పింది మళ్ళీ ప్రభావతి,

రుబ్బడం అయిపోతే,  పిండి గిన్నెలోకి తీసి, రోలు కడిగి,  ఈ వేయించిన వేరుసెనగపప్పు కొబ్బరితో కలిపి ఇంత మజ్జిగ పోసి రుబ్బెయ్యండి. నేను పోపు పెట్టేస్తాను. ప్రద్యుమ్నుడికి కోపం వచ్చింది. కానీ అభయ్ సింగ్ వచ్చేస్తాడేమో తొందరగా అని భయపడ్డాడు.  “పోనీ పాపం ఇంకా చెయ్యి నొప్పిగా ఉందేమో”  నని సరిపెట్టుకున్నాడు.   కొబ్బరి,  వేరుశెనగపప్పు కూడా మజ్జిగతో రుబ్బేసి, పచ్చడి ప్రభావతికి ఇచ్చేసి తన కార్యక్రమాలకి వెళ్ళిపోయాడు ఇంకేం మాట్లాడకుండా. 

గెడ్డం గీసుకుంటుంటే  అనుమానం వచ్చింది ప్రద్యుమ్నుడికి, “ఇది కావాలని చేసిందా లేక అనుకోకుండా జరిగిందా?” అని.

ఏమైతేనేం ఇంకో రెండు అంగుళాలు వంగ వలసి వచ్చిందిగా అనుకున్నాడు. తను వంగాడా? లేక ప్రభావతి కావాలని వంచిందా? సందేహం తీరలేదు. ఏమైనా లంబ కోణం కంటే తక్కువగానే వంగిపోయాను కదా, ప్రభావతి ముందు అని విచారించాడు ప్రద్యుమ్నుడు.

“సీతారామ స్వామీ నే చేసిన నేరం బేమి” అని పాడుకున్నాడు. 

ఈ పాట ఇంకో రెండు మూడు మాట్లు పాడుకోవలసి వచ్చింది,  పొదుపు  ఉద్యమంలోనూ (పొదుపు సమీకరణాలు ),  ప్రభావతి పుట్టినరోజు సందర్భంగానూ ( మా ఆవిడకు విడాకులు ఇచ్చేస్తాను   ).      

ఈ పాటలన్నీ అయేటప్పటికి,  చేతులతో కాలి వేళ్ళు పట్టుకునే స్టేజికి వచ్చేశానని విచారించాడు. 

ఇలాగే సాగితే తలతోనే కాలి వేళ్ళు అంటుకోవచ్చునేమో  అని దుఃఖించాడు పాపం ప్రద్యుమ్నుడు.