ప్రద్యుమ్నుడి మొదటి పెళ్లి చూపులు

1968 మే నెలలో ప్రద్యుమ్నుడు అన్నగారి పెళ్ళికి భీమవరం వెళ్లి,  జూన్ మొదటి వారంలో   జోర్హాట్ కి తిరిగి వచ్చేసాడు. 

అన్నగారి పెళ్ళిలో ఇద్దరు ముగ్గురు ప్రద్యుమ్నుడిని చూసి ముచ్చట పడ్డారు. అమ్మాయిలు కాదు. అమ్మాయిల తల్లి తండ్రులు. అన్నగారి పెళ్ళిలో తనకి కూడా పెళ్లికళ వచ్చేసిందని సంబర పడిపోయాడు ప్రద్యుమ్నుడు.

అందులో ఒకాయన ప్రద్యుమ్నుడు జోర్హాట్ తిరిగి వచ్చేలోపులే భీమవరం వచ్చి మాట్లాడి వెళ్లారు. అమ్మాయి జాతకం, ఫోటో కూడా ఇచ్చి, ప్రద్యుమ్నుడి ఫోటో జాతకం తీసుకు  వెళ్లారు. జాతకాలు కుదిరితే తెలియపరుస్తామని చెప్పారు. అబ్బాయి దసరాకో  సంక్రాంతికో  వచ్చినప్పుడు పెళ్లి చూపులు కార్యక్రమం పెట్టుకోవచ్చని ప్రద్యుమ్నుడి తండ్రిగారు ఆయనకు చెప్పారు  అమ్మాయి ఫోటో చూసి ప్రద్యుమ్నుడు మురిసిపోయాడు. ఇంట్లో అందరికీ కూడా ఫోటోలోని అమ్మాయి నచ్చింది.  అమ్మాయి పేరు రాధ. BA చివరి  సంవత్సరం చదువుతోంది. రాజమండ్రి దగ్గర ఏదో పల్లెటూరు వాళ్ళది.  పిల్ల తండ్రి తెలుగు మాష్టారు. వేదం కూడా చదువుకున్నారు.  ప్రద్యుమ్నుడి నాన్నగారు ముచ్చట పడ్డారు. కానీ  అమ్మగారు  “వీడికి కాబోయే  మామగారు కూడా తెలుగు మాష్టారేనా,  వేదం కూడానా”   అని నిరుత్సాహపడ్డారు.  

పిల్ల తండ్రి వెళ్ళిన తరువాత ప్రద్యుమ్నుడు మొహమాట పడ్డాడు “అప్పుడే నాకు పెళ్ళా?” అని.

“ఇప్పటికే 25 ఏళ్లు నిండాయి. ఇంకా ఎప్పుడూ చేసుకుంటాడుట? నెత్తిమీద తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయి. ఇంకో రెండు మూడేళ్ళు అయితే పిల్ల నివ్వడానికి ఎవరూ రారు” అని తీర్పు చెప్పేసారు ప్రద్యుమ్నుడి తండ్రి గారు.  

మొహమాటానికి మొహమాట పడ్డా, పెళ్లి చేసుకోవాలని ప్రద్యుమ్నుడు కూడా తొందర పడుతున్నాడు,  కాబట్టి తల ఊపేసాడు.  ఆ మద్యాహ్నం ఆంతరంగిక సభ జరిగింది. ఆ సభలో పెద్దక్క గారు తేల్చి చెప్పేసారు.

“పెద్దాడి పెళ్లిలో లాగా ఆడపడచు లాంఛనాలు రెండు వందలు చేతిలో పెడితే కుదరదు. చిన్నాడి పెళ్ళిలో మాకు తలా వెయ్యి ఇవ్వాల్సిందే. అమ్మకు అత్తగారి లాంఛనాలు రెండు వేలు ఇవ్వాలి”

“నలుగురికీ నాలుగువేలు అత్తగారికి రెండు వేలు, మొత్తం ఆరు వేలు అంటే దాదాపు కట్నం అంత అవుతుంది. అంత ఆశ పెట్టుకోకండి. నేనూ నలుగురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేశాను. కష్టసుఖాలు నాకు తెలుసు.” అని ఇంకో తీర్పు చెప్పారు ప్రద్యుమ్నుడి తండ్రిగారు.

“పెద్దాడి మామగారు నీ బాల్య స్నేహితుడని, ఆయన ఏమన్నా నువ్వు ఒప్పుకున్నావు. చిన్నాడి పెళ్ళిలో అలా కుదరదు. మాటలకి వెళ్ళినప్పుడు నేను కూడా వస్తాను ఈ మాటు” కరాఖండిగా చెప్పింది ప్రద్యుమ్నుడి పెద్దక్క. అంతటితో ఆగలేదు ఆవిడ,

“ఒరేయ్ పద్దూగా,  వాళ్ళు ఇవ్వకపోయినా నువ్వు మిగిలింది వేసి వెయ్యి రూపాయలూ ఇవ్వాల్సిందే” అని కూడా నొక్కి వక్కాణించింది.  “లేకపోతే నీ పెళ్ళికి మేం రాము” అనికూడా చెప్పింది.

“సరే అలాగే లే” అని ఒప్పేసుకున్నాడు ప్రద్యుమ్నుడు.

సభ తరువాత అరుగు మీద కూర్చుని ధూమ పానం చేస్తున్నప్పుడు, జాలి పడ్డాడు ప్రద్యుమ్నుడి పెద్ద బావగారు.

“మాకు పెళ్లి అయిన తరువాత కష్టాలు మొదలయితే, వీడికి పెళ్లి కాకుండానే మొదలవుతున్నాయి” 

“అదేమిటి? హాయిగా సంసారం చేస్తున్నారు కదా. మీకేం కష్టాలు?” ఆశ్చర్యపడ్డాడు ప్రద్యుమ్నుడు.

“కనిపించేది అంతా సత్యం కాదు ప్రద్యుమ్నా. మీ నాన్న మీ అక్కయ్యకు పసుపు కుంకుమ గా ఇచ్చిన అర ఎకరం మొన్న అమ్మితే పదిహేను వందలు  పూర్తిగా రాలేదు” అని నవ్వాడు పెద్దబావగారు.

“మేం అది ఎప్పుడో అమ్మేసాం” అని వంత పాడారు మిగతా బావలు కూడా.   

అప్పుడు  హితబోధ చేశారు బావలు నలుగురు,     

 “నాయనా ప్రద్యుమ్నా, పెళ్లి  అనేది ఒక ఆకర్షణ. ఆ ఆకర్షణ వ్యామోహంలో ముందు ముందు జరిగే విపరీత పరిణామాలను  అజ్ఞానులు  గ్రహించలేరు. పెళ్లికి పర్యవసానం బానిసత్వం.   స్త్రీ అయస్కాంతం లాగా ఆకర్షిస్తుంది కానీ  పెళ్లి అయిన స్త్రీలు   అణుబాంబులా పరివర్తనం చెందే అవకాశాలు ఎక్కువ.  అసలు ఆడపిల్లలు వయసుకు రాగానే ఈ పరివర్తనం మొదలవుతుందని,  అందుకనే  వారి  తల్లి తండ్రులు శాయశక్తులా ప్రయత్నించి వీలైనంత త్వరగా పెళ్లి అనే పేరుతో ఆ అణుబాంబుని ఇంకెవరి ఇంట్లోనో  వేసి ఊపిరి పీల్చుకుంటారనీ జ్ఞానులు బోధిస్తారు. అందుకే కట్నాలు ఇస్తారు, ఆడపడచు లాంఛనాలు, అత్తగారి లాంఛనాలు ఇస్తారు. అల్లుడు అలిగితే సైకిల్ కూడా కొనిపెడతారు.   మగవాడు నిమిత్తమాత్రుడు. అయస్కాంత శక్తికో అణు ధార్మిక శక్తికో బలై పోతూనే ఉంటాడు. కాబట్టి బుద్ధి తెచ్చుకుని పెళ్లి అనే ఆడ పిల్లల తల్లితండ్రుల కుతంత్రం లో  పడకు” అని ఉపదేశించారు.

“పెళ్లి చేసుకొని సంసారసాగరంలో మునిగేవాడు పురుషుడే. భార్యా పిల్లలు ఒడ్డున కూర్చుని వేడి వేడి వేరుసెనక్కాయలు తింటూ చప్పట్లు కొడతారు కానీ నీకు చేయ అందివ్వరు”  అని కూడా బోధించారు.

“ఎంత వీరోచితంగా పోరాడినా సంసారం  అనే మహా యుద్ధంలో  పురుషులు బాలచంద్రులు, అభిమన్యుల  లాగే అవతారం చాలించాల్సి ఉంటుంది.” అని కూడా ఉద్భోదించారు.

పోగాలము దాపురించిన వారు హిత వాక్యములు వినరు అని ఎవరో అన్నారు. ప్రద్యుమ్నుడు కూడా వినలేదు. పెళ్లి చేసుకొని సంసారసాగరాన్ని విజయవంతంగా ఈది, ముందు తరాలవారికి మార్గ దర్శనుడ నవుతానని భీష్మించాడు ప్రద్యుమ్నుడు. “గృహమే కదా స్వర్గసీమ” అని పాడి వినిపించేడు కూడా.

జోర్హాట్ లో కూడా కుటుంబీకులు కొంతమంది హిందీలోనూ, మరి కొంత మంది తెలుగులోనూ కూడా హితబోధ చేశారు. ప్రద్యుమ్నుడు పట్టించుకోలేదు. ఒక తెలుగాయన బ్రహ్మోపదేశం కూడా చేశారు.

“వత్సా, ప్రద్యుమ్నా, గృహస్తు అని ఎందుకు అంటారో తెలుసా?” సమాధానం కోసం చూడకుండా కొనసాగించాడు,

“గృహమే ఆస్తిగా కలవాడిని గృహస్తు అంటారు. మిగిలిన ఏ ఆస్తులూ భార్యా పిల్లలు వాడికి మిగలనీయరు. వారి సరదాలకు, వారి భోగాలకు, వారి టింగురంగా లకు  ఖర్చు అయిపోతుంది. తండ్రిగారు ఇచ్చిన గృహము కూడా అతి కష్టం మీద నిలుపుగో గలుగుతాడు. ఇంటికి దీపం అనిపించుకునే ఇల్లాలుని గృహస్తి అంటారు. అంటే గృహంలో ఏనుగు అని అర్ధం. వారికి ఎదురు చెప్పలేరు, తెలియకుండా ఏ పని చేయలేరు. చెవులు పెద్దవి కదా.” ఇంతటితో ఆగలేదు ఆయన.

“పెళ్లి అయిన కొంత కాలం తరువాత ”జాయెతు జాయె కహా, సంఝేగా కౌన్ యహా  దర్ద్ భరే దిల్ కి జుబా” అని పాడుకోవాలి. వలదు నాయనా వలదు పెళ్లి అనే యజ్ఞంలో సమిధి కావలదు”  అని ప్రభోదించారు.

అయినా ప్రద్యుమ్నుడు లక్ష్యపెట్టలేదు. పైగా,

“ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి” అని పాడాడు కూడా.

 ప్రద్యుమ్నుడు రాధ ఫోటో చూడగానే మనసు పాడేసుకున్నాడు ఆమె మీద. ఫోటోలో చూడగానే ప్రేమించడం ‘లవ్ యట్ ఫస్ట్ సైట్” అంటారా అని తనలో తనే చర్చించుకున్నాడు. “రాధే నా జీవనజ్యోతి” అని తీర్మానించుకున్నాడు. 

తండ్రిగారికి ఉత్తరం వ్రాద్దామనుకున్నాడు “పితాశ్రీ, కట్నకానుకలు, లాంఛనాలు అంటూ అడగవద్దు. అవసరమైతే పెళ్లి ఖర్చులు కూడా కొంత మనమే భరిస్తాం అని చెప్పండి వారికి” అని. కానీ అంత పని చేసే ధైర్యం చాలలేదు. విషయం తెలిస్తే, పెద్దక్కగారు రుద్రకాళి అవతారం ఎత్తుతుందేమో నని భయపడ్డాడు కూడా.

ఒక ఇరవై రోజుల తరువాత తండ్రిగారు ఉత్తరం వ్రాశారు. “ఇంకో రెండు సంబంధాలు వచ్చాయి. ఒకాయన హైదరాబాదులో ఉన్నతోద్యోగిగా ఉన్నారు. అబ్బాయికి హైదరాబాదు ట్రాన్స్ఫర్ కూడా చేయిస్తానన్నారు, అమ్మాయి అక్కడే M.Sc  చదువుతోంది. కట్న కానుకలు బాగానే ఇస్తారు అని మధ్యవర్తి చెప్పాడు. రాజమండ్రి ఆయన కూడా మళ్ళీ వచ్చారు. దసరాలకి వస్తే వెళ్లి చూసి ఏదో ఒకటి నిశ్చయించు కోవచ్చు”  అని.   

ఈ మాటు ప్రద్యుమ్నుడు బెదరలేదు, ఆలోచించలేదు. ధైర్యంగా తండ్రిగారికి ఉత్తరం వ్రాసేసాడు.

“నాకు ఇక్కడ ఉద్యోగం బాగానే ఉంది. ఆర్నెల్ల క్రితమే Ph.D  పని మొదలు పెట్టాను. ఇంకో నాల్గైదు ఏళ్లు పట్టవచ్చు. Ph.D వచ్చేదాకా  ఇక్కడినుంచి కదిలే ఉద్దేశ్యం లేదు. ఆయనెవరు నన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించడానికి. నేను  ఒప్పుకోకపోతే ఎవరూ ఏమీ చేయలేరు. రాజమండ్రి ఆయన మళ్ళీ వచ్చాడని అన్నారు కదా మీరు. పిల్లని ఇంతదూరం పంపడానికి ఆయన అప్పుడు అభ్యతరం చెప్పలేదు కదా. వారి  అమ్మాయి మన ఇంట్లో అందరికీ నచ్చింది కదా. ఇంకా సంబంధాలు చూడడం ఎందుకు?” అని నిర్మొహమాటంగా తన మనసులో మాట చెప్పేసాడు.

“దసరాలకి శలవు దొరకదు.  నెల క్రితమే కదా తిరిగి ఇక్కడకు వచ్చింది. సంక్రాంతికి రావడానికి ప్రయత్నిస్తాను.” అని కూడా వ్రాసాడు.                               

సంక్రాంతికి ఇంటికి వెళ్లాడు ప్రద్యుమ్నుడు. రాధా ప్రద్యుమ్నుల  జాతకాలు బ్రహ్మాండంగా కుదిరాయి అని చెప్పారు.  పెళ్లి చూపులు అన్నారు.  మొట్ట మొదటి పెళ్లి చూపులు ప్రద్యుమ్నుడికి.  శ్రద్ధగా తయారయ్యాడు. భూమికి చంద్ర మండలానికి మధ్య దూరం తెలుసుకున్నాడు. గుడ్డులో పోషక పదార్ధాలు ఏమిటో భట్టి పట్టాడు. ఎందుకైనా మంచిదని కాంగో దేశం వైశాల్యం కూడా కనుక్కున్నాడు. M.Sc. పరీక్షలకి కూడా  ఇంత కష్టపడలేదు కదా అని విచారించాడు.

పెళ్లి చూపులకి వెళ్ళారు. అమ్మాయి ఫోటోలో కన్నా బయటే  బాగుందని ప్రద్యుమ్నుడు  సరదా పడ్డాడు. వంటా వార్పూ , సంగీతం కూడా వచ్చునట. ఏదో సినిమాలో సుశీల పాడిన   కీర్తన కూడా పాడింది. “ఇది ఏ సినిమాలో పాట?” అని పెళ్లి కూతురి తరఫు వాళ్ళు ఎవరైనా అడుగుతారేమో నని భయపడ్డాడు ప్రద్యుమ్నుడు కానీ ఎవరూ అడగలేదు.  అమ్మాయితో ఏకాంతంగా మాట్లాడే అవకాశం వస్తుందేమో నని ప్రయత్నించాడు ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నుడి తండ్రి గారు వీటో చేసేసారు. ఇటువంటి తిక్క ఆచారాలు మన ఇంటా వంటా లేవని తేల్చేసారు. తను భట్టి పట్టిన నాలుగు విషయాలు అమ్మాయికి చెప్పి తన లోక జ్ఞానం ప్రదర్శించాలన్న ప్రద్యుమ్నుడి ఉత్సాహం నీరు కారిపోయింది.  పెళ్లి చూపుల కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. అమ్మాయి తండ్రి  మంచి రోజు చూసుకొని మిగతా విషయాలు మాట్లాడటానికి వస్తాం అని చెప్పారు.  

ప్రద్యుమ్నుడు  జోర్హాట్ వచ్చేసాడు. కలలో రెండు మూడు  యుగళ గీతాలు పాడుకొన్నాడు  కూడా రాధతో.

ఫిబ్రవరి నెలలో ప్రద్యుమ్నుడు తన బాసు గారితో  దులియాజాన్ లో ఒక కంపనీకి  వెళ్లాడు. బాసు  గారి గౌరవార్ధం వాళ్ళు ఆ రాత్రికి  అక్కడ ఒక విందు ఏర్పాటు చేశారు.  ఆ విందులో రామనాధం అనే ఒక తెలుగాయన ప్రద్యుమ్నుడితో పరిచయం చేసుకున్నారు.  విందు కాబట్టి మందు గట్రా ఉన్నాయి. ఒక గ్లాసు చేతితో పట్టుకుని, మరో చేత్తో సిగరెట్టు పట్టుకొని  ద్విపాత్రాభినయం  చేస్తున్న ప్రద్యుమ్నుడితో రామనాధం గారు చాలాసేపే మాట్లాడారు.  హాబీలు గట్రా కనుక్కున్నారు. జీతం, ప్రమోషను  వచ్చే అవకాశాలు కూడా  కనుక్కున్నారు.   ఆయన ప్రద్యుమ్నుడి బాసు గారితో కూడా మాట్లాడడం గమనించాడు ప్రద్యుమ్నుడు.

తిరిగి వచ్చేటప్పుడు బాసు గారు చెప్పారు ప్రద్యుమ్నుడితో “ఆ రామనాధం నీకేదైనా ఉద్యోగం ఇస్తాడేమో? నీ గురించి అడిగాడు నన్ను.”  

“అవునండీ నన్ను  కూడా చాలా విషయాలే అడిగారు. ప్రాజెక్ట్ వర్కు గురించే కాకుండా వ్యక్తిగత విషయాలు కూడా చాలానే అడిగారండి. ఏమైనా, నా Ph. D అయ్యేదాకా మిమ్మల్ని వదలనండి” అని చెప్పాడు ప్రద్యుమ్నుడు. 

 “అందుకనే కుర్రాడు బుద్ధిమంతుడే కానీ దుడుకు స్వభావం, అని చెప్పాను.   ప్రైవేట్ కంపనీలు వ్యక్తిగత విషయాలకి కూడా తగు ప్రాధాన్యత ఇస్తాయి.” అని  అన్నారు. 

ప్రద్యుమ్నుడు కలల్లో   రాధతో డ్యూయెట్లు పాడుకుంటూనే తండ్రి గారి  దగ్గర నుంచి శుభవార్త కోసం ఎదురు చూస్తున్నాడు. మార్చి అయిపోయింది. ఏప్రిల్ మొదలై వారం కూడా అయిపోయింది. తండ్రి గారి వద్ద నుంచి కబురు రాలేదు. మనసు కీడుని శంకించింది.  ఏమైనా అడ్డంకులు వచ్చాయేమో నని సమాధాన పడడానికి ప్రయత్నించాడు. నాన్నగారికి వ్రాసే ధైర్యం లేక ప్రద్యుమ్నుడు  పెద్దక్క గారికి ఉత్తరం వ్రాసాడు.

తిరుగు టపాలో ఉత్తరం వచ్చింది.

“వాళ్ళ వాళ్ళు ఎవరో దులియాజాన్ లో  ఉన్నారట.  నీ దురదృష్టం కొద్దీ నువ్వు వాళ్ళ ఆఫీసుకే వెళ్ళావట.  ఆయన నీతోనూ, మీ బాసుతో కూడానూ మాట్లాడారట. “కుర్రాడు పొగరుబోతు, సిగరెట్లు కాలుస్తాడు, మందు కొడతాడు, క్లబ్లో రాత్రి 10 గంటల దాకా పేకాట ఆడుతాడట.” అని సమాచారం తెలుసుకొని వాళ్ళ వాళ్లకి తెలియ పరిచారట” .

ఈ విషయం  మధ్యవర్తి ద్వారా తెలిసి ప్రద్యుమ్నుడి తండ్రి గారు అగ్గిరాముడై ఇంట్లో  కధకళి కూడా చేసేసారట. “ఉద్యోగం మాని ఇంటికి వచ్చేయమని నీకు తాఖీదు పంపడానికి ఆయన తయారయితే అతి కష్టం మీద నేనూ అమ్మ కలసి ఆపాం”, అని కూడా అక్కగారు తెలియజేశారు.

“ఔరా రామనాధం ఎంత పని చేసేవురా” అని ఆక్రోశించాడు ప్రద్యుమ్నుడు. 


అనగనగా ఒక రోజు

ప్రద్యుమ్నుడు చేస్తున్న పని ఆపి ఇంటికి వెళ్ళడానికి తయారు అవుతున్నాడు. సమయం 6-30 PM అయింది.  తయారవడం అంటే కిటికీలు మూయాలి. ఆ తరువాత తలుపులు వేయాలి. ఈ లోపుల యాష్ ట్రే ఖాళీ చెయ్యాలి. రేపు శలవు. ఎవరూ రారు కాబట్టి లాబ్ లో అన్నీ ఆఫ్ చేసారో లేదో చూడాలి. ఏ వాటర్ బాత్  ఆవిర్లు కక్కుతోందో చూడాలి.

ఈ వేళ చటర్జీ గారబ్బాయి పుట్టిన రోజు ఫంక్షను ఉంది. పెళ్ళైన పది ఏళ్ళకి పుట్టాడని అపురూపం గా పెంచుకుంటున్నాడు. మరీ మరీ చెప్పాడు. వెళ్ళాలి. కనీసం ఏడు గంటలికి వెళితే తొమ్మిదికి ఇంటికి జేరవచ్చును. తన లాబ్ లోని  నాలుగు రూములూ చూసి వచ్చి తన గదిలో కిటికీ తలుపులు వేయడం  మొదలు పెట్టాడు ప్రద్యుమ్నుడు.

ఇంతలో టెలిఫోన్ మోగింది. ప్రభావతి చేస్తోందేమో అనుకున్నాడు. ఎత్తలేదు. ఇంటికి వెళుతున్నాం కదా అని. మోగుతూనే ఉంది. విసుక్కుంటూ ఎత్తాడు.

“ప్రద్యుమ్నా, నేను చాలిహా ని. ఢిల్లీ నుంచి ఈ వేళ Prof. శంకరరావు  వచ్చారు. నిన్ను కలవాలని అంటున్నారు. నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు గెస్ట్ హౌస్ లో ఆయన్ని కలిసి వెళ్ళు”  అని చెప్పాడు డైరెక్టర్ గారి PA. 

పైగా  “ఈ సూచన బాసుగారి అంగీకారం తోనే ఇవ్వబడింది ” అని నవ్వాడు చాలిహా . 

“ఏమిటి అంత అర్జెంట్. రేపు మీటింగ్ లో కలుస్తాను గదా. లంచ్ టైము లో మాట్లాడుకోవచ్చు కూడాను”

“అన్నట్టు రేపు అఫీషియల్ లంచ్ లేదు. Dr.Sinha, chairman,  రేపు మద్యాహ్నం ఫ్లైట్ లో కలకత్తా వెళ్లి పోతున్నాడు.  చండీఘడ్ Dr.Saxena కూడా అదే ఫ్లైట్ లో వెళ్ళిపోతున్నాడు. మీ శంకరరావు కూడా మీటింగ్ తరువాత కారులో కాజీరంగా వెళుతున్నాడు. మర్నాడు ఉదయమే ఏనుగు ఎక్కి, అక్కడినుంచే గౌహతి వెళ్లి విమానం ఎక్కేస్తాడు. మిగిలింది నువ్వు, మరో ముగ్గురు హెడ్స్,  లోకల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కాలేజీ నిపుణులు, మీ ONGC ఉపాధ్యాయ. అంతే. అందుకని లంచ్ ఏర్పాటు చెయ్యలేదు. మన బాసు కూడా లంచ్ కి ఇంటికి వెళ్ళాలి ” చెప్పాడు చాలిహా. 

“అన్యాయం. బాసు కేమైంది” అడిగాడు ప్రద్యుమ్నుడు.

“రేపు రాఖీ పూర్ణిమ. వాళ్ళ చెల్లెలు వస్తోంది. ఈ వేళే వెయ్యి రూపాయలు తెప్పించాడు బేంక్ నుంచి. భారీగానే ఇస్తాడేమో చెల్లెలుకి?” సందేహం వెలిబుచ్చాడు చాలిహా.

“అయితే నేను రేపు  లంచ్ ఇంట్లోనే చెప్పుకోవాలా?” అనుమానంగానే అడిగాడు ప్రద్యుమ్నుడు.

“అఖ్ఖర్లేదు. మాములుగా లంచ్ ఉంటుంది గదా గెస్ట్ హౌస్ లో. మిగతా మెంబర్స్ కి. నువ్వూ వెళ్ళు” సలహా ఇచ్చాడు చాలిహా.

“వద్దులే. చుక్కా, చుక్కలు లేని లంచ్ ఎందుకు? నేను ఇంటికే వెళతాను. మా ఆవిడ రేపు బిజీ కాకపొతే, స్పెషల్ గా వంట చేయడానికి ఒప్పుకుంటే, ఉపాధ్యాయని మా ఇంటికే తీసు కెళ్ళతాను” చెప్పాడు ప్రద్యుమ్నుడు.

“టైగర్ ఫుడ్ చేయిస్తావా? నేను కూడా వస్తాను.” అడిగాడు చాలిహా.

“వచ్చేయ్.ఏదో ఒకటి ఉంటుందిలే.” చెప్పాడు ప్రద్యుమ్నుడు.

“నేను ప్రభావతినే అడుగుతాను. చటర్జీ ఇంటికి వస్తున్నారు కదా?” అడిగాడు చాలిహా.

“ఆ, మధ్యలో శంకరరావుని పెట్టావు కదా నాకు. ఆయనకు నాతోటి ఏం అవసరమో?” అడిగాడు ప్రద్యుమ్నుడు.

“రేపు మీ వాళ్ళు ముగ్గురున్నారు కదా. ఆ విషయం బహుశా. ఇందాకా ఆయన  అరగంట మాట్లాడాడు మన  బాసు తో. పొద్దున్న కూడ మాట్లాడాడు” అభిప్రాయ పడ్డాడు చాలిహా.

ఇంటికి బయల్దేరిన ప్రద్యుమ్నుడు ఆగాడు. ప్రభావతికి  టెలిఫోన్  చేశాడు.

“నాకు, అర్జెంటు పని పడింది. గెస్ట్ హౌస్ లో మీటింగ్ ఉంది. నువ్వూ, పిల్లలు వెళ్ళండి చటర్జీ ఇంటికి. నేను ఆలస్యంగా వస్తానని చెప్పు.” ఫోన్ పెట్టేశాడు.  చర్చకి తావు ఇవ్వకుండా.

కూర్చుని సిగరెట్ వెలిగించాడు. మూసిన కిటికీ తలుపు ఒకటి తెరిచాడు. ఆలోచనలో పడ్డాడు.  శంకరరావు గారికి ఇప్పుడు ఇంత అర్జంటుగా నాతో మాట్లాడవలసిన పని ఏమిటీ? రేపు జరగబోయే ఇంటెర్వ్యూ గురించి కాదు కదా. బాసుగారితో రెండు మాట్లు ఆయన మాట్లాడాడు కాబట్టి బహుశా దాని గురించే అయి ఉండాలి  బాసుగారు ఈయన ద్వారా నాకేమైనా సందేశం ఇస్తున్నారా?  అని అనుమానపడ్డాడు ప్రద్యుమ్నుడు.  తన Ph.D కి బాసుగారే   ఇక్కడ గైడ్. తనతో డైరెక్ట్ గా చెప్పే చనువు ఉంది ఆయనకు.  ఏమో బాసుల తీరు ఊహించడం కష్టమే.

శంకరరావు గారు బయాలిజీ ఆయన. ఆయనతో నాకు పరిచయం కూడా తక్కువే.  ఆయన  మన Research council  లో మెంబెర్ కూడా. గత రెండేళ్లలో మూడు మాట్లు కలిసాం RC మీటింగ్స్ లో. అంతకు మించి పరిచయం లేదు. RC మీటింగ్స్ లో ఘోష్ ఎక్కువగా మాట్లాడేవారు, మన డిపార్ట్మెంట్ గురించి. ఘోష్ తో పాటు  నేను.  బసంత్ వారి ప్రశ్నలకు సమాధానం చెప్పేవాళ్ళం. ఘోష్ కాకుండా మేమిద్దరమే ప్రాజెక్ట్ లీడర్స్ మా డిపార్ట్మెంట్ లో.     

రేపు సెలెక్షన్ కమిటీ మీటింగ్ ఉంది. నా డిపార్ట్మెంట్ నుంచి ముగ్గురు ఇంటర్వ్యూ కి ఉన్నారు.  ఇద్దరు గురించి బెంగ లేదు.  100% ఎలిజిబిలిటీ గ్రేడ్స్ లో ఉన్నారు.  శశికాంత్ సైకియా ఒకడు 75% గ్రేడ్ లో ఉన్నాడు.  మొత్తం రేపు ఇంటర్వ్యూ లో ఐదుగురు ఉన్నారు ఆ గ్రేడ్ లో. 5*.75 = 3.75 అంటే నలుగురిని ప్రమోట్ చేయవచ్చును.

మిగిలే ఒకడు ఎవరు? శశికాంత్ తెలివైన వాడే. కష్టపడి పనిచేస్తాడు. ఇంకొంచెం ఎక్కువే చేస్తాడు.  గత ఐదారు ఏళ్లలో అతను పని చేసిన ప్రాజెక్ట్ నుంచి  రెండు  పేపర్స్  పాలిమర్ కెమిస్ట్రీ లోనూ,  ఒకటి ఫ్యూయల్ లోనూ వచ్చాయి.  వాటిలో ఇతని పని  బాగానే ఉంది. ఇంకో నాలుగు ఇండియన్ జర్నల్స్ లో వచ్చాయి.  సెమినార్స్ లో కూడా ప్రెజెంట్ చేశారు.  న్యాయంగా పని ప్రకారం చూస్తే ఇతనికి  రావాలి. కానీ మనిషి దుడుకు. అందరితోనూ దెబ్బలాడుతాడు,  నాతో సహా.  ఇన్స్టి ట్యూట్లో  జరిగే అన్యాయాలన్నిటికి  అతను తప్ప మిగతా వాళ్ళు అందరూ కారణమంటాడు.  నేను హెడ్ అయిన ఈ తొమ్మిది నెలలలోనూ  మూడు మాట్లు ఇతనితో కూర్చుని చెప్పాను “పద్ధతి మార్చుకోవయ్యా” అని.

“అదేమిటి సార్ మీరు కూడా ఇలానే అంటారు. మీకు కూడా ఎరోగంట్ అనే పేరు ఉంది తెలుసునా?” అని కూడా అడిగాడు.   

ఎలా ఇతనిని దారిలో పెట్టడం? ఒక విధంగా ఇతనే సమస్య అయ్యాడు నాకు నా డిపార్ట్మెంట్ లో. వాళ్ళ ఆవిడతో కూడా చెప్పాను ఒక మాటు విసిగిపోయి.
“బాసులు మీరే దారిలో పెట్టలేకపోతే
, దాసిని నావల్ల ఏమౌతుంది అని నవ్వేసింది.

భర్తలు మొండివాళ్ళు అయితే భార్యలకు హాస్య ధోరణి అలవాటు అవుతుంది అన్నారెవరో. ఏమో. ప్రభావతి ఏమంటుందో కనుక్కోవాలి. ఇంకో మాటు నవ్వుకున్నాడు.   

ఇదివరకు మన డిపార్ట్మెంట్  అనేవాడిని. ఇప్పుడు నా అంటున్నాను అనుకొని కూడా  నవ్వుకున్నాడు ప్రద్యుమ్నుడు. తనకి పొగరు ఇంకా పెరుగుతోందేమో నని కూడా అనుకున్నాడు.   

నాలుగు రోజుల క్రితము బాసు (డైరెక్టర్)  గారి దగ్గరకు వెళ్ళి చెప్పాడు కూడానూ, తన డిపార్ట్మెంట్ కేండిడేట్స్ గురించి. ఆయన శ్రద్ధగానే విన్నాడు. శశికాంత్ గురించే సుమారు పావుగంట పైనే మాట్లాడారు.

“అతని గురించి మంచిగా వినలేదు. మొన్న వర్క్ షాప్ లో కూడా ఏదో గొడవ అయ్యిందిట అతనితో. రేపు ప్రమోషన్ వస్తే ప్రాజెక్ట్ లీడర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. తోటి వాళ్ళతో సామరస్యంగా లేకపోతే, project execution లో  నీకే చిక్కులు వస్తాయి. నేనైనా,  నిన్నే సంజాయిషీ అడగాల్సి ఉంటుంది. ఆలోచించుకో” అని అన్నారు కూడా.    

పేపర్స్ విషయంలో బాసుగారు క్రిటికల్ గానే అడిగారు.

“పేపర్స్ మిగతా వాళ్లకి కూడా బాగానే ఉన్నాయి. అతని ఈ పేపర్స్ లో సీనియర్ ఆధర్ ఎవరు?”

సూటిగా సమాధానం ఇవ్వలేదు ప్రద్యుమ్నుడు. మొత్తం పేపర్స్ లో,  మూడులో  మాత్రం అతను మొదట అని మిగతా వాటిలో అప్పటి హెడ్ శంకర్ ఘోష్, తను అని చెప్పలేదు. 

 “అల్లా అని కాదు సార్. టేబుల్ వర్క్ అంతా అతనూ, సుభాష్ చేశారు. నేను కానీ,  శంకర్ ఘోష్ కానీ అతనికి రెండో మాటు చెప్పాల్సిన అవసరం రాలేదు. ఎక్స్పెరిమెంటల్ డిజైను, టెస్టింగ్  అన్నీ సుభాష్ సహాయంతో  అతనే  చేశాడు. ఆధర్ షిప్ అంటారా,  మన ఆనవాయితీ  ప్రకారం చివరి పేరు మీదే”

బాసుగారు ఫక్కున నవ్వాడు. “ప్రద్యుమ్నా నీలో కూడా ఏరోగన్సీ ఇంకా తగ్గలేదు. కొంచెం తగ్గించుకోవాలయ్యా . కుర్చీలో కూచున్న తరువాత కొంచెం సామరస్యంగా ఉండాలి. నోటికే మొస్తే అది అనేయకూడదు. నువ్వు ఒక మాటు అన్నావట కదా శంకర్ ఘోష్ తో, “బయో కెమిస్ట్రీ ఆయన  డైరెక్టర్ కి పెట్రోలియం తో ఏం పని? ఆయన పేరు ఎందుకు పెట్టాలి?”  అని. ఘోష్ చెప్పాడు నాకు. నీకు తెలుసునా, నువ్వు ఘోష్ తో అప్పుడప్పుడు విభేదించినా ,  ఘోష్ కి నువ్వంటే చాలా ఇష్టం. నీ గత CR excellent లు ఉన్నాయి ఇదివరకు. వెళ్ళే ముందు ఔట్ స్టాండింగ్ ఇచ్చాడు. నేను యధాతధంగా అప్రూవ్ చేశాను, నువ్వు అల్లా అన్నావని తెలిసినా”

ప్రద్యుమ్నుడు సిగ్గుతో తలదించుకున్నాడు.

“కుర్చీలో కూర్చుంటే కొన్ని అధికారాలు ఉంటాయి. వాటితో అప్పుడప్పుడు తలనొప్పులు కూడా ఉంటాయి. కొన్ని సర్దుబాట్లు అవసరం కూడా, నాకు ఇష్టం కాకపోయినా. చూద్దాం మీ వాడి సంగతి, నేనేమీ హామీ ఇవ్వలేను” అని ముగించాడు బాసుగారు.

ప్రద్యుమ్నుడు లేచాడు, “ సార్ ఇది హెడ్ గా నా మొదటి ఏడు, ఇంకా మూడు నెలలుంది ఏడాది పూర్తికావడానికి. ఇప్పుడు నా అభ్యర్ధిని గట్టెక్కించ లేకపోతే డిపార్ట్మెంట్ లో నామీద గౌరవం తగ్గే అవకాశం ఉంది. అంతకన్నా నేనింకేం చెప్పలేను.”

బాసుగారు నవ్వారు. “ చూద్దాం ప్రద్యుమ్నా, మీ  వాడు ఇంటర్వ్యూ బాగా చేస్తే, తలతిక్కగా మాట్లాడకుండా ఉంటే, కమిటీ రికమెండ్ చేస్తే, నీ కోసం ఒప్పుకుంటాను. మనిషి మారాలని ఘట్టిగా చెప్పు అతనికి.”

తలకాయ ఊపి బయటకు వచ్చేశాడు ప్రద్యుమ్నుడు. 

అదంతా గుర్తుకు వచ్చింది ప్రద్యుమ్నుడికి.  ఇప్పుడు ఈ శంకరరావు గారు ఏం మాట్లాడుతాడో? ఏం చెప్తాడో? బాసుగారు ఏం మాట్లాడేడో?

సాధారణంగా subject expert లు కమిటీ మీటింగ్ ముందు హెడ్స్ తో మీటింగ్ పెట్టరు. ఇంటర్వ్యూ అయిన తరువాత మాత్రమే వాళ్ళ అభిప్రాయాలు చెబుతారు.  అయినా శంకరరావు గారు తన సబ్జెక్ట్ expert కాదు. మన expert ఉపాధ్యాయ. కొంపదీసి Dr. Sinha రావటం లేదా? శంకరరావు గారు chairman గా ఉంటాడా?

 గెస్ట్ హౌస్ ఇన్ చార్జ్ కి టెలిఫోన్ చేసాడు ప్రద్యుమ్నుడు. Sinha, టుక్లై  టీ రీసెర్చ్ గెస్ట్ హౌస్ కి వెళ్ళాడుట. రేపు మీటింగ్ కి అక్కడనుంచే వస్తాడుట. సంగతి తెలిసింది. మరి ఈయన తన తోటి ఏం మాట్లాడుతాడు? బాసు గారు ఏం చెప్పాడో?  శశికాంత్ కి ఈ మాటు అవకాశం లేదా?

ఐదుగురిలో ముగ్గురి పేర్లు ఖాయంగా వినిపిస్తున్నాయి. కెమికల్ ఇంజనీరింగ్  గొగై, మన శశికాంత్ లో ఒకడే సెలెక్ట్ అవుతాడు అని వినికిడి. కెం. ఇంజ్ హెడ్ డిప్యూటి డైరక్టర్, తను అసిస్టంట్ డైరక్టర్. ఆయన మాటకే ఎక్కువ విలువ ఉంటుందా?  డైరక్టర్ లేనప్పుడు ఆయన ఇన్స్టిట్యూట్ బాధ్యతలు చూస్తుంటాడు కూడానూ. ఏమో మరి ఏమౌతుందో?

 సీనియర్ బసంత్ ని కాదని తనకు హెడ్ గా బాధ్యతలు ఇచ్చారు, తొమ్మిది నెలల క్రితం. ఇప్పుడు శశికాంత్ విషయంలో డిపార్ట్మెంట్ లో రాజకీయాలు మొదలవుతాయా? ఇప్పటి దాకా బసంత్ తనని సపోర్ట్ చేస్తున్నాడు. కానీ ఇది అవకాశంగా తీసుకొంటే గొడవలు మొదలవుతాయి.  బాసు గారికి తెలియదా? ఆయన ఒత్తిడిలు ఆయనకు ఉంటాయి. కానీ నాకు సూటిగా చెప్పవచ్చు గదా? శంకరరావు గారిని మధ్యలో దింపడం దేనికి?   

బాసుగారు తన గైడే కాదు, ఒకప్పుడు తన బ్రిడ్జ్ పార్టనర్ కూడా. ఆ చనువుతో రెండు మూడు మాట్లు  బాసుగారితో తీవ్రంగానే విభేదించడం జరిగింది. బహుశా దురుసుగా మాట్లాడేనేమో కూడా.  బాసు గారు తనకి ఒక గుణపాఠం నేర్పాలనుకుంటున్నాడా? తోటి తెలుగువాడు శంకరరావు గారి మాట వింటాను అనుకున్నాడా?  తన దురుసుతనం శశికాంత్ ని దెబ్బకొడుతుందా? హెడ్ గా ఉండడం ఇంత కష్టమా? తన ప్రవర్తన తన డిపార్ట్మెంట్ కాండిడేట్స్ మీద పడుతుందా?  లేక బాసు గారు డివైడ్ అండ్ రూల్ పాలసీ మా డిపార్ట్మెంట్ లో మొదలుపెడుతున్నాడా? పరోక్షంగా బసంత్ కి సపోర్ట్ చేస్తాడా? అయ్యుండకపోవచ్చు.  తనంటే బాసు గారికి చాలా, ఇష్టం,  అభిమానం. ఫామిలీ ఫ్రెండు కూడాను. అయినా బాసులు కదా. ఏమైనా చేస్తారేమో?         

 చూద్దాం. ఈయన ఏమంటాడో? మాట్లాడుదాం. అనుకొని లేచాడు. దుకాణం కట్టేసి గెస్ట్ హౌస్ జేరాడు. శంకరరావు గారితో భేటి అయ్యాడు.

“ఏమండీ ప్రద్యుమ్నుడు గారూ  బాగున్నారా?” అడిగారు శంకరరావు గారు.

“బాగానే ఉన్నామండి. ధన్యవాదాలు”  

“మీ RRL కి వస్తే బాగుంటుందండి. సైంటిఫిక్ వాతావరణం  కనిపిస్తుంది. పోలిటిక్స్  తక్కువే అనుకుంటాను” 

“లేకపోలేదు, కానీ పై లెవెల్స్ లోనే ఉన్నాయి. Work culture మిగతా వాటితో పోలిస్తే ఇక్కడ ఎక్కువే నండి.”

“Good, Nice to hear that. ఇంకేమిటండి సంగతులు. ఎంతమంది పిల్లలు మీకు?”

“ఒకబ్బాయి, ఒకమ్మాయి నండి.” అసలు సంగతికి రాకుండా డొంక తిరుగుడు ఎందుకో నని  ప్రద్యుమ్నుడికి చిరాకుగా ఉంది.

“నాకు ఇద్దరూ మగపిల్లలే నండి. ఆవిధంగా అదృష్టమే అనుకోవాలి.”

“అదేమిటండి మీరు కూడా అలా అంటారు. ఎవరైనా ఒకటే కదా” కొంచెం ఆశ్చర్యం ఒలకపోసాడు ప్రద్యుమ్నుడు.

“అబ్బే నా ఉద్దేశం అది కాదు. ఆడపిల్లలకి పెళ్లి చేయడం అంటే యజ్ఞం అండి. పెళ్ళికొడుకుని వెతకాలి.  అతని గురించి వాకబు చెయ్యాలి. ఉద్యోగం గురించి కనుక్కోవాలి.  కుటుంబం గురించి కనుక్కోవాలి. ఆర్ధిక స్థితిగతులు వాకబు చెయ్యాలి. చాలా చెయ్యాలండి. మా అన్నయ్య ఉన్నాడు. వాడికి ముగ్గురు ఆడపిల్లలు. ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయి. మూడో అమ్మాయి కోసం వెతుకుతున్నాడు. ఇందులో కొన్ని పనులు నాకు అప్పజెపుతాడు. వాడు రాజమండ్రి లో ఉంటాడు. అన్నట్టు మీ ఎరికలో ఏమైనా సంబందాలు ఉంటే చెప్పండి.”

ప్రద్యుమ్నుడికి విసుగ్గా ఉంది. ఇవన్నీ వినడానికి. అవతల చటర్జీ ఇంటికి ఇంకా లేటయితే బాగుండదు. ఈయన సంగతి తేల్చడు.  అయినా ఓపిగ్గా అడిగాడు,

“శాఖా బేధాలు ఉన్నా ఫరవాలేదా?”   

“అబ్బే మా వాడికి పట్టింపులు ఎక్కువే నండి. ఎంత చెప్పినా వినడు.”    

ప్రద్యుమ్నుడు మాట్లాడలేదు.

“అవునూ, అత్యవసరమైతే ఇక్కడి నుంచి మీ ఊరు ఏమిటన్నారు?’

“భీమవరం. ప.గో.జి.“

“తెలుసును. మా వాళ్ళు ఉన్నారండి అక్కడ,  అంటే ఉండి అగ్రహారంలో.”

ప్రద్యుమ్నుడి చిరాకు పరాకాష్ట కి చేరుకుంటోంది. ఆయన కొనసాగించాడు.

“ఇక్కడి నుంచి రోజూ ఫ్లైట్స్ ఉన్నాయా కలకత్తాకి? కలకత్తా నుంచి హైదరాబాద్ కి?”

“ఈ వేళ మీరు వచ్చిన ఫ్లైట్ వారానికి ఐదు రోజులు ఉంటుందండీ. ఇది కాక ఇంకో ఫ్లైట్ ఉంది మద్యాహ్నం  2 గంటలికి. అది చిన్నది, ఫోకర్.  రోజూ  ఉంటుంది.  హైదరాబాద్ కి కూడా కలకత్తా నుంచి  వారంలో నాల్గైదు రోజులు మాత్రమే ఉందనుకుంటాను” ప్రద్యుమ్న ఉవాచా.  అసహనంగా కుర్చీలో కదిలాడు.      

“ఒక సంబంధం వచ్చిందండి. కుర్రాడు M.Tech. చేసాడు, IIT కాన్పూర్ లో. అమెరికా అవకాశాలు వచ్చాయిట కానీ తల్లీ తండ్రులను వదిలి వెళ్లడం ఇష్టం లేదుట. తండ్రికి ఆరోగ్యం అంత బాగా లేదుట.  తణుకు చుట్టుపక్కల 15 ఎకరాలు ఉన్నాయట. స్థితిమంతులే. ఆయన తణుకులో హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నారట, ఏదో స్కూల్లో. “

ప్రద్యుమ్నుడు సహనం కోల్పోతున్నాడు. ఇంటర్వ్యూ విషయానికి వస్తే మాట్లాడి వెళ్ళిపోదామని చూస్తున్నాడు.  ఆయన కొనసాగించాడు,

“అబ్బాయి ONGC  లో పనిచేస్తున్నాడు.  మొన్నటిదాకా డెహ్రాడున్ లో పని చేశాడుట. ఆర్నెల్ల క్రితం అస్సాం లో నజిరా కి బదలి మీద వచ్చాడుట. అతని గురించి శ్రమ అనుకోకుండా వాకబు చేసి చెబుతారా? మనిషి ఎటువంటి వాడు? బుద్ధిమంతుడేనా? చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ కానీ డెహ్రాడున్ లో కానీ ఏమైనా ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా?  కోపిస్టా? వగైరా,  ఇవి అతని వివరాలు.”    అంటూ జేబులోంచి ఒక కాగితం తీసి ఇచ్చాడు.

మాట్లాడకుండా పుచ్చుకొని జేబులో పెట్టుకున్నాడు ప్రద్యుమ్నుడు,

“రేపు శిబ్సాగర్ నుంచి Dr. ఉపాధ్యాయ వస్తున్నారండి.  ఆయన ONGC లో chief chemist. ఆయనకి తెలిసే ఉంటుంది. కనుక్కుందాం” అన్నాడు ప్రద్యుమ్నుడు.  

“కుర్రాడు నజిరా లో ఉంటాడండి. మీకు వీలైనప్పుడు నాల్గైదు రోజుల్లో ఒక మాటు వెళ్లి కనుక్కుంటే ఋణపడి ఉంటాను” అన్నాడు శంకరరావుగారు. ప్రద్యుమ్నుడు ఈ విషయం పొడిగించ దలచుకోలేదు ఇంకా,

“అల్లాగే నండి. నజిరా లో మన తెలుగు వాళ్ళు సుమారు ఆరేడుగురు ఉన్నారు. నేను వెళ్లి కనుక్కొని మీకు చెబుతాను. ఇంతకీ మీరు నన్ను పిలిచిన విషయం? ”  

“అసలు నేను ఈ వేళ నజిరా వెళదామనుకున్నాను.   మీ డైరక్టర్ తో  చెప్పాను. ఆయన మీ గురించి చెప్పారు. మీకు ONGC  తో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయట కదా. మీకు అక్కడ పరిచయాలు బాగానే ఉన్నాయిట. మీకు చెబితే మీరు ఈ పని చేస్తారు అని చెప్పారండి. నేనే మీ డిపార్ట్మెంట్ కి వద్దామనుకున్నాను. కానీ ఆఫీసులో మాట్లాడం కుదరదేమో నని రాలేదు. మీ డైరక్టర్ గారే చెప్పారు. “మీకు చెబుతాను. ప్రద్యుమ్నుడే వచ్చి మీతో మాట్లాడుతాడు”” అని.

ప్రద్యుమ్నుడు నవ్వేసాడు. ఇదా సంగతి అనుకున్నాడు. ఎంత టెన్షన్ పడ్డాను ఇప్పటిదాకా అని అనుకున్నాడు.

“అల్లాగే నండి. ఆ అబ్బాయి గురించి క్షుణ్ణంగా తెలుసుకొని మీకు టెలిఫోన్ చేస్తాను, రెండు మూడు రోజుల్లో. మీరు నిశ్చింతగా ఉండండి” అని చెప్పి సెలవు తీసుకొని చటర్జీ ఇంటికి వెళ్లాడు తేలిక పడిన మనసుతో.