ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాను?


కాఫీ ఇచ్చి వెళ్లబోయింది మా ఆవిడ . 

“అవును దేవీ,  నేను నిన్ను ఎప్పుడు ప్రేమించడం మొదలు పెట్టానో చెప్పగలవా”  అని అడిగాను.

“అసలు మీరు నన్ను ప్రేమిస్తున్నారా?  అని కౌంటర్ వేసింది  మా ఆవిడ.  “పక్కింటి SWE లాగా మీరెప్పుడైనా  ఐ లవ్ యు రా చిన్నీ అని చెప్పారా? ఐ టూ రా కన్నా అని ఆవిడ లాగా నేనన్నానా ? ఏమిటో ఈ  మొగుడు అన్నీ ఇలాంటి సందేహాలే వస్తాయి”   అంటూ వెళ్లిపోయింది మా ఆవిడ  వంటింట్లోకి.

తీరుబడిగా కాఫీ  తాగుతూ ఆలోచించడం మొదలు పెట్టాను. How and when  ప్రేమించడం జరిగింది ? పెళ్ళికి ముందు మా ఇద్దరికీ పరిచయం లేదు. కనీసం బీరకాయ పీచు సంబంధమైనా లేదు రెండు కుటుంబాల మధ్య.  పెళ్లి చూపులలో కూడా  మేమిద్దరం  ఏమి మాట్లాడుకోలేదు.  పెళ్లి చూపులయిన  తరువాత బయట నుంచుని మాట్లాడుతున్నప్పుడు  వాళ్ళ తాత గారికి,  “నేను సిగరెట్లు   కాలుస్తానండి” అని చెప్పాను మా ఆవిడ వింటుండగా. అంతకు మించి అభిప్రాయాలూ, భావాలు, అభిరుచులు  పంచుకోవడం జరగలేదు.  సరే ఇరు వైపుల
పెద్దవారు ఆహా అంటే ఓహో అనుకున్నారు. చూపులు అయిన 15 రోజులలో పెళ్లి అయిపోయింది.
కారణాంతరాల వల్ల పెళ్లి అయిన తరువాత ఆర్నెల్లకి  కార్యం అన్నారు . ఆ 1st. రాత్రి కూడా  వాళ్ళ ఇంట్లో  మధ్య గదిలో (సీలింగ్ ఫాన్ ఉన్నది ఆ గదిలోనే) కానిచ్చేశాము. ఇవతలి గదిలో కబుర్లు చెప్పుకొనే వారు తెల్లవార్లు చెప్పుకుంటూనే ఉన్నారు. అవతల వైపు వరండా వేపు కిటికీ ఉంది గాని వరండాలో ట్రాఫ్ఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల తెరవడం కుదరలేదు.  కనీసం గుస గుస లాడుకోవడానికైనా వీలు లేక ఇద్దరిమధ్యా చర్చా కార్యక్రమం జరగలేదు. 
   
భార్యా సమేతంగా  జోర్హట్  ప్రయాణ మయ్యాను. విజయవాడ రైల్వే స్టేషనులో అయిన వాళ్లందరిని వదిలి, కళ్ళమ్మట నీళ్ళు కారుతుంటే,  ఏ మాత్రం పరిచయం లేని, భర్త అనే ఒకే ఒక నమ్మకంతో నా  చేయి పట్టుకొని 3000 kms.  ప్రయాణించడానికి సాహసించిన మా ఆవిడ  మీద మొదట సారిగా జాలి కలిగింది  నాకు. రైలు కదిలిన తరువాత సుమారు ఒక అరగంట దాకా ఏడుస్తూనే ఉన్న ఆవిడను  చూస్తూ కూర్చుండి పోయాను   ఎలా ఓదార్చాలో తెలియక.  దగ్గరకు తీసుకొని ఓదార్చేటంతటి చనువు లేకపోవడమే కారణం గావచ్చు.    

కొంచెం ఉద్వేగం తగ్గిన తరువాత చెప్పాను కొంచెం గంభీరంగా, ఇంకొంచెం డ్రమటిక్ గా “ఇప్పటినుంచి  మన జీవితం మొదలవుతుంది. నాలో నీకు నచ్చనివి చాలా ఉండవచ్చు అలాగే నాకు నచ్చనవి నీలో ఉండవచ్చు. కానీ ఒకరి కొకరుగా కలసి నడుద్దాం”  అని . 

విన్న వెంటనే చిరునవ్వు నవ్వింది మా ఆవిడ . ఓ రెండు నిముషాల తరువాత కొంచెం ఘట్టిగానే  నవ్వింది. “మీరు సినిమాలు ఎక్కువగా చూస్తారనుకుంటాను. అచ్చు సినిమాలో లాగానే చెప్పారు.” అని అంది. 

ఒక నిముషం సీరియస్ గానే మొహం పెట్టిన నేను  వెంటనే నవ్వేసాను. ఇద్దరు ఒకళ్ల నొకళ్లు చూసుకొని ఘట్టిగానే నవ్వుకున్నాము. ఐస్ బ్రేకింగ్ అన్నది  బహుశా ఆ క్షణంలో జరిగిందనుకుంటాను. అనాలోచితం గా, అనుకోకుండా ఓదార్చటానికి ఏమి చెప్పాలో తెలియక,  వదిలిన ఒక డయిలాగు చిత్రంగా ఇద్దరి మధ్య కొంచెం సన్నిహిత్వం  కలిగించింది. 

ఇంకో అరగంట తరువాత రాజమండ్రి స్టేషన్ లో ఒక భార్యా, భర్త,  ఒక చిన్న కుర్రాడు మా  కుపే లో ఎక్కడం, వాళ్ళు కలకత్తా,  ఆ తరువాత  గౌహతి దాకా మా తోటే ప్రయాణం చేయడంతో మళ్ళీ ఏడ్చే అవకాశం మా ఆవిడకి  గానీ ఓదార్చే అవకాశం నాకు గానీ  కుదరలేదు.   అల్లాగే చర్చా కార్యక్రమం కూడా వాయిదా పడింది. కానీ జోర్హాటు  చేరేటప్పటికి అంటే సుమారు రెండున్నర రోజుల తరువాత  ఇద్దరూ సరదాగానే  మాట్లాడుకోవడం  మొదలుపెట్టేసాము. 

కాపురం మొదలు పెట్టేటప్పడికి కొంచెం సాన్నిహిత్యం పెరిగినా చనువు పెరగలేదు.  జోర్హట్ లో నా హాస్టల్ రూంలో గృహా ప్రవేశం చేసింది. తమ వాళ్లు ఎవరూ తోడు రాకుండా కొత్త కాపురం మొదలు పెట్టేసాము. వాళ్లూ వీళ్లూ భోజనాలకి,  టిఫినీ లకి పిలవడం వల్ల ఒక వారం రోజులు ఇంట్లో  వంట చేయాల్సిన అవసరం రాలేదు. ఈ లోపున సంసారానికి కావల్సిన వన్నీ  సమకూర్చుకున్నాము. అప్పటికి జోర్హట్లో కుకింగ్ గాస్ దొరికేది కాదు. కిరోసిన్ స్టవ్ మీదే వంట.  వచ్చిన కొత్తలో మా ఆవిడకి  భాష సమస్య అయింది.  ఆమెకి తెలుగు తప్ప మరో భాష రాదు. ఉన్న అరడజను తెలుగు కుటుంబాలతో కాక మిగతా స్నేహితులతో మాట్లాడాలంటే నేను  దుబాసీ పాత్ర పోషించాల్సి వచ్చేది. 

అయిన వాళ్ళందరికీ దూరంగా, కష్ట సుఖాలు చెప్పుకోడానికి ఎవరూ లేకపోవడం మొదట్లో ఆవిడకి  కొంచెం ఇబ్బంది కలిగించినా క్రమక్రమం గా ఆ జీవితానికి అలవాటు పడిపోయింది. బహుశా రెండేళ్లు గడిచిన తరువాత కానీ పరస్పర నమ్మకం కుదరలేదేమో ననుకుంటాను. కష్టసుఖాలు నిర్భయంగా చర్చించుకోవడం అప్పుడే మొదలయింది. మీ ఇంట్లో అలాగా మా ఇంట్లో ఇలాగా అనేది పోయి మన ఇంట్లో ఇలాగే అనే విధానం వచ్చేసింది. మధ్యమధ్యలో అనేక చికాకులు వచ్చినా, కష్టాలు ఎదురైనా ఆ నమ్మకం ఇప్పటిదాకా బలపడుతూనే ఉంది. 
   
ఒక నెలరోజుల్లో మా ఆవిడ  నా  రొటీన్ కి అలవాటు పడిపోయింది.  ఉదయమే 8-8.15 మధ్య నేను  ఆఫీసు కెళ్లిపోయేవాడిని.  1-2 మధ్య ఒక అరగంట భోజనానికి వచ్చేవాడిని. మళ్ళీ సాధారణంగా  5.30-6 కి ఇంటికి తిరిగి వచ్చేవాడిని  ఆఫీసు నుంచి. వారానికి 3-4 రోజులు సాయంకాలం 7 గంటలకి క్లబ్బు కెళ్ళి రాత్రి  10.30-11 కి తిరిగి వచ్చేవాడిని.  పెళ్ళికి ముందు నుంచి కూడా  నేను  బ్రిడ్జ్ ఆటకి అడిక్ట్ అయ్యాను.  జోర్హట్  డిస్ట్రిక్ట్   టోర్నమెంట్స్ లో  ఇన్స్టిట్యూట్ తరఫున  ఆడేవాడిని.  మిగతా రోజులలో స్నేహితుల ఇళ్ళకి వెళ్లడమో, వాళ్ళు రావడమో జరిగేది. తెలుగు వాళ్ళు కలసి నప్పుడు అప్పుడప్పుడు అడ్డాట, లిటరేచరు ఆడేవాళ్ళం,   ముఖ్యంగా శలవు రోజుల్లో. మలయాళీ, తమిళ గ్రూపులు కలిస్తే 56, 28 ఆడేవాళ్ళం.  తదితర గ్రూపులైతే కాలక్షేపం కబుర్లు ఎక్కువగా ఉండేవి.  ఒక ఆరునెలల్లో  మా ఆవిడ  కూడా ఈ ఆటలన్నీ నేర్చేసుకుంది.   వచ్చిన రెండు మూడు నెలల్లో కొద్దిగా చల్తా హై హింది కూడా  నేర్చుకోవడంతో  మా ఆవిడ కాలక్షేపానికి లోటు  లేకపోయింది. 
 
ఆ తరువాత కూడా జీవితం మాములుగానే, సాఫీగానే సాగిపోయింది.  పెళ్ళైన కొత్తలో బాధ్యతలు ఉన్నా, ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువగా చికాకు పెట్టలేదు. దీనికి ముఖ్యకారణం మా ఆవిడ  అని నిస్సిగ్గుగా ఒప్పుకుంటాను.  అనవసరపు కోరికలే కాదు, బహుశా అవసరాలు కూడా అదుపులో పెట్టుకొని సంసారం సాగించింది.  ఏడాదిలోపులే ఒక అబ్బాయి పుట్టేసాడు.  ఆ తరువాత బాధ్యతలు  తీరాయనుకున్నప్పుడు, ఆరున్నరేళ్ళ తరువాత ఒక అమ్మాయి. పిల్లలు పెరగడం, వాళ్ళ చదువులు,  పెళ్ళిళ్ళవడం,  మనమలు, మనవరాళ్ళు  అంతా మాములుగానే అందరిళ్ళలో జరిగినట్టుగానే జరిగిపోయింది. మా ఆవిడకు  ఒక కంప్లయింట్ ఉంది.  పిల్లల చదువులో నేను శ్రద్ధ పెట్టలేదని, దగ్గర కూర్చుని చదివించలేదని. పిల్లాడు ఏడెనిమిది క్లాసులకి వచ్చేటప్పటికి, ఉద్యోగబాధ్యతలు పెరగడం,  వాడు పదోక్లాసుకి వచ్చేటప్పటికి ఒక ప్రాజెక్ట్ పనిమీద ఇంకోచోట సుమారు రెండేళ్లు ఉండాల్సిరావడం, ఆ టైములో నెలకి వారం, పదిరోజులకన్నా ఎక్కువుగా జోర్హాటులో లేకపోవడం కారణాలుగా చెపుతాను నేను.  ఉద్యోగ బాధ్యతలు పెరగడంతో  బ్రిడ్జ్ ఆటకి కూడా విడాకులు ఇచ్చేశాను. క్లబ్ కి వెళ్లడం కూడా మానేశాను.  కెరియర్ మీద పెట్టిన దృష్టి పిల్లల మీద పెట్టలేదన్నది  మా ఆవిడ  కంప్లైంట్.  పిల్లలు పోస్టు గ్రాడ్యుయేషను చేసారు కాబట్టి ఆ విషయంలో చింత కూడా లేదు మా ఇద్దరికీ.

ఏ ఒడిదుడుకులు లేకుండానే జీవితం ఇప్పటి దాకా సజావుగానే సాగిపోయింది. ఇప్పుడు రిటైరయి కూర్చున్న  తరువాత, ఒక శుభముహుర్తాన్న  వచ్చింది సందేహం నాకు, ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు పుట్టిందా ? అని. కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టాను.  ఈ సందేహ నివృత్తిలో మా ఆవిడ  సహకారం లభించలేదు. పైగా వెధవ సందేహాలూ మీరూనూ  అంటూ తీసి పాడేసింది.

సుదీర్ఘ సహజీవనంలో అనేక గుర్తు పెట్టుకునే క్షణాలు దొర్లిపోయాయి. కొన్ని సంతోషకరమైనవి, కొన్ని ఉద్విగ్న భరితమైనవి, కొన్ని కోప కారణమైనవి,  కొన్ని విచారకరమైనవి, కొన్ని హాస్యాస్పదమైనవి, కొన్ని అనుకున్నవే అయినా  మరికొన్ని అనుకోకుండా జరిగినవి ఉన్నాయి కానీ ఏ ఒక్క క్షణం కారణంగా  ప్రేమ పుట్టింది అని చెప్పడం కష్టం అనిపించింది నాకు.  స్వతహాగా నాకు కోపం కొంచెం ఎక్కువ. మా ఆవిడకి కోపం వచ్చినా ప్రదర్శించేది కాదు ఇదివరలో. ఇప్పుడు నాకు తగ్గింది,  ఆవిడకి పెరిగిందేమో నని నా అనుమానం.  కానీ ఎప్పుడు ఎలా పుట్టాయో తెలియని పరస్పర ప్రేమ, గౌరవం,  అభిమానం, చనువు   బలపడుతూనే వచ్చాయి.  ఇన్ని ఏళ్ల జీవితం లో ఎప్పుడూ మాటల ద్వారా ప్రేమ వ్యక్తం చేసుకోలేదు  మేమిద్దరం  కూడా.

జీవితం ఇప్పటిదాకా సంతృప్తిగానే గడిచిపోయింది.  పెళ్ళైన ఆరేడేళ్ళ దాకా కొన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ఆ తరువాత లేవు. ఇప్పుడు తలుచుకుంటే ఆశ్చర్యంగానూ, హాస్యాస్పదంగాను ఉంటుంది కానీ పెళ్ళైన రెండున్నర ఏళ్ళకి గానీ  తెగించి ఫిలిప్స్ ట్రాన్సిస్టర్ (కమాండర్) ఆరు వందలు పెట్టి కొనలేకపోయాను.  సంపాదించినది ఖర్చుపెట్టుకోవడమే తప్ప వెనకేసింది లేదు. ఇప్పుడు,   రెండేళ్లకో,  మూడేళ్ళకో అద్దె  ఇల్లు మారాల్సి వచ్చినప్పుడు ‘ఓ ఇల్లు కట్టుకుంటే బాగుండేదేమో’  నని అనిపిస్తోంది.  ఇది కూడా అసంతృప్తికి కారణం కాలేదు.

ఇంకో రెండేళ్లు ఇలాగే గడిపేసి, లేక  ఇంకా ముందరే,   చేసుకోలేము అని అనిపించినప్పుడో,   ఏదో ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాము. 


అవునూ, శంకర శాస్త్రి గారూ,  ఇదంతా ఇప్పుడు ఎందుకు చెపుతున్నారు? అంటే నిన్న  జూన్ 28కి పెళ్ళయి నలభై అయిదేళ్ళు గడిచాయి. అదన్నమాట సంగతి.......దహా.  

ఏక వాక్య టపా


నేను బాగా వ్రాశానని అనుకున్నా పాఠకులు నాతో ఏకీభవించక పోవడం వల్ల నా బ్లాగు చదవడానికి అతి కొద్దిమందే రావడం వల్ల చింతాక్రాంతుడనై ఏమి చెయ్యడానికి పాలుపోక ఇంకా బాగా వ్రాసే సత్తా లేకపోవడం వల్ల ఇంకేమి చెయ్యవలెనని సుదీర్ఘంగా నాలోచించగా కొంచెం వెరైటీగానూ  ప్రత్యేకంగానూ విలక్షణంగానూ కఠినంగానూ కొరుకుడు పడని విధంగానూ అర్ధంకాని పద్ధతిలోనూ ఏక వాక్య టపా వ్రాయాలని మదిలో మెరుపు మెరవగా నొక మిత్రుడిని ఏకవాక్య టపా ఎటుల వ్రాయాలని అడగగా వారున్నూ సుదీర్ఘ కాలం తమ సమయం వెచ్చించి పరిశోధించి ఆలోచించి మేధో మధనం చేసి ఒకే ఒక్క ఫుల్లు స్టాపు తో అదియున్నూ చివర  పెద్దగా పెట్టి మధ్యలో అనేకానేక నీ చిత్తం మెచ్చినన్ని నీ శక్తి సామర్ధ్యములను పదును బెట్టి నీ ఉహా శక్తికి మేధస్సు ను జోడించి  అది నీకు లేదని నాకు తెలిసినను మాట వరసకే చెప్పుచుంటినని కడు దీర్ఘముగా ఘట్టిగా నొక్కి వక్కాణిస్తూ  అనేకానేక  ,  ;  “ ”  ? !  ( )  ’  ఇత్యాదులను విరివిగా ఉపయోగిస్తూ నీకు వీలైనన్ని పేజీలు వ్రాయమని ఉపదేశించగా విన్న నా తోటి మిత్రుడొకడు కడుంగడు నాశ్చర్య చకితుడై నీవు  పాఠకులను దుఃఖిత మానసులను చేయ సంకిల్పింప కారణమేమియో  యని ప్రశ్నింపగా నేను పెదవులను ఈ చివరి నుంచి ఆ చివరకు సాగదీసి సుదీర్ఘ చిరునవ్వును వెలయించి తద్దినము ను జరుపుటకు యని జవాబివ్వగా వాడు మరల నాశ్చర్యముం బొందిన వాడై ఏ తద్దినము యని మరల ప్రశ్నింపగా ఈ మారు నేను వికటాట్టహాసం చేసి నిన్న 14వ తారీఖున  నా బ్లాగు నవ్వితే నవ్వండి మొదలు పెట్టిన  ఐదవ తద్దినం అని ఈ వేళ జ్ఞప్తికి వచ్చినదని   క్రూరంగా ఘోరంగా కర్కశంగా ఉద్ఘాటించగా యచట నున్న మిత్రులందరూ ముక్త కంఠముతో నవ్వితే నవ్వండి బ్లాగు పాఠకులందరికీ వారి సానుభూతి ప్రకటించగా వారి సానుభూతికి నాది కూడా జోడించి నా టపాలు చదివే సాహసం చేసిన చేస్తున్న కష్టపడి చదివి అవస్థ పడ్డ లేక అవస్థ పడుతూ చదివి కష్టపడ్డ  పాఠక దేవుళ్ళకు   ఈ ఏక వాక్య టపాలో మా సానుభూతి తెలియచేసుకుంటున్నాను

అదన్నమాట సంగతి. టపా పొడిగించుటకు కారణమేమనగా  , ; !  ఇత్యాదులు పెట్టుట మరచిపోయితిని. మీరు ఎక్కడ కావాల్సి వస్తే అక్కడ మీకు నచ్చినవి పెట్టుకొనవలెనని ప్రార్ధించుచున్నాను.