ఏమో, నాకూ అనుమానం వచ్చేస్తోంది

బద్ధకం గా నిద్ర  లేచాను. కళ్ళు నులుముకొని  చేతిలో  ఘృతాచి    అని వ్రాసుకొని,  చూచిన తరువాత  చెవులకి వినిపించింది. 

తెలవార వచ్చే తెలియక నా స్వామి
మళ్ళీ పరుండేవు లేరా  మళ్ళీ పరుండేవు లేరా
లేరా లేరా లేరా ప్రద్యుమ్నా లేరా

అని వంటింట్లోంచి ప్రభావతి పాటని దున్నేస్తోంది. పక్కకి ఒత్తిగిలి,  ఉదయమే  గాన కచేరీ చేస్తోందేమిటా అని నేను ఒకింత చింతా క్రాంతుడ నయితిని. ఇంతలో బెడ్ రూమ్ తలుపు తెరుచుకొని ప్రభావతి

లేచితివా ప్రియా కాఫీ తాగుమా ఆ ఆ ఆ కాఫీ తాగుమా సఖా తాగుమా
అంటూ కాఫీ కప్పు నాచేతిలో పెట్టి వంటింట్లోకి తుర్రుమంది.

కుత్సిత బుద్ధితో కుళ్ళిపోయినదని ప్రభావతి భావించే నా మనస్సు వెంటనే కీడును శంకించింది. గత మూడు నాలుగు దినములలో నేను చేసిన రాక్షస కృత్యములు ఏమైనా ఉన్నాయా అని నిశితం గా శోధించాను. రెండు రోజుల క్రితం జోర్హట్ టౌన్ లో అగర్వాల్ కొట్టులో  నేను మరిచిపోయిన ప్రభావతి హాండ్ బాగ్  సంగతి   ఒకటే  గుర్తుకొచ్చింది. ఆవిడ భుజాలంకారమైన సంచీ ఉన్నదో లేదో కూడా గమనించ  లేకపోవడం నా పొరపాటని నా కర్ధమయేటట్టు కోపపడింది. ఇంటి కొచ్చేదాకా ఈ చిన్న విషయం కూడా  కనిపెట్ట లేక పోయిన నేను సైంటిస్టు ఎలా అయానని కూడా విచారించింది. నాకు డిగ్రీ ఇచ్చిన యూనివర్సిటి నీ, ఆ డిగ్రీ ని  నమ్మి ఉద్యోగం ఇచ్చిన మా ఇన్స్టిట్యూట్ నీ కూడా దుమ్మెత్తి పోసింది. ఇలాంటి సైంటిస్టులు ఉండబట్టే మన  దేశం అమెరికా కన్నా వెనక బడిపోయిందని విశ్లేషించింది. మళ్ళీ నేను గుండెలు గోక్కుంటూ, రొప్పుతూ రోజుతూ సైకిల్ తొక్కుతూ 7 కి.మీ. లు వెళ్ళి ఆ బాగ్ తీసుకొచ్చేదాకా అష్టోత్తరం, సహస్రనామం పూజలు జరిపించింది. 

మా ఆవిడ హాండ్ బాగ్ మర్చి పోతే,  అది నేను గమనించక పోతే ,  మనదేశం అమెరికా కన్నా వెనక పడిపోతుందనే ధర్మ సూత్రం తెలిసింది. అంతకు మించి నేను చేసిన అఘాయిత్యాలు ఏమి గుర్తుకు రాలేదు.

కాఫీ తాగుతూ నా ఆలోచనలలో నే నుండగా మా ఆవిడ మళ్ళీ వచ్చింది. ఉదయం అల్పాహారం తయారు అవుతోంది. త్వరగా తెమలండి అన్నది. నేను నా ఆలోచనల నవతలికి నెట్టి, దంత ధావనాది కార్యక్రమములను జయప్రదంగా ముగించుకొని డైనింగ్ టేబల్ వద్ద ఆసీనుడ నైతిని. జీడి పప్పు ఉప్మా భరిత నేతి పెసరట్టు,  కొబ్బరి చట్నీ తో సహా కంచం లో దర్శనమిచ్చింది. ఏమి నా భాగ్యము అని ఆనందపడవలసిన నా మనస్సు, కుత్సిత బుద్ధితో కూడిన దౌట వల్ల కీడును శంకించింది. ఉపద్రవమేదో పైబడనున్నదేమో నన్న భయం నన్నావేశించింది. కా నున్నది కాక మానదు, నేను నిమిత్తమాత్రుడనే నని తలచి తినుట కుపక్రమించితిని. ఇంతలో మా యావిడ చిరునవ్వు లొలికిస్తూ ఎదురుగా కూర్చుంది. 

ఈ వేళ మీ అమ్మ గారి పుట్టిన రోజు అంది.

నాకొక్కమారుగా పులకమారింది.

ఎక్కడున్నారో అత్త గారు,  మిమ్మల్ని తలుచుకుంటున్నారు అని అంటూ నీళ్ళ గ్లాసు అందించింది.

మా అమ్మ పుట్టిన రోజు నాకే తెలియదు, నీకెలా తెలిసింది అని ప్రశ్నించాను.

ఎప్పుడో మాటల సందర్భంలో చెప్పారు ఆశ్వీయుజ శుద్ధ పంచమి నాడు పుట్టానని. ఈ వేళ కేలండరు చూస్తే గుర్తుకు వచ్చింది అని  కూడా చెప్పింది.

అయ్యో నేనెంత దుర్మతిని, అనవసరం గా, అన్యాయంగా, అక్రమంగా, దురుద్దేశ  పూరితుడ నై అపార్ధం చేసుకుంటిని గదా అని విచారించితిని. నా ఈ పాపానికి నిష్కృతి లేదు అని కూడా దుఃఖించితిని.

ఈ వేళ మీ అమ్మగారికి ఇష్టమైన చక్రపొంగలి, నేతిగారెలు, మైసూర్ పాక్ చేస్తున్నా  నండి అని ప్రభావతి   ప్రకటించింది.

నే నానంద పరవశుడనై, హృదయముప్పొంగ సంతోష కన్నీరు కారుస్తూ

చినుకులా రాలి, నదులుగా సాగి, వరదలై పోయి, కడలి లా పొంగె నీ ప్రేమా, అత్త పై నీ ప్రేమా అని పాడాను.

అత్తగారు పోయి నాలుగేళ్ళైనా ఇంకా ఇలా గుర్తు పెట్టుకున్నందుకు మా ఆవిడను చూసి గర్వించాను. శెభాష్ ప్రభావతీ శెభాష్ అని మెచ్చుకున్నాను. సూర్యుడు చంద్రుడి లాగా కనిపించాడు. మా ఇంటి పక్కనున్న మురికి కాలువలో నుంచి మలయ మారుతాలు వీచాయి. ప్రకృతి పరవశించి నట్టని పించింది. ఇంకా తయారు కాని మైసూర్ పాక్ వాసన నాలుకని తొందర పెట్టేసింది.

కానీ దుశ్శంకా పూరితమైన నా మనస్సు, మళ్ళీ శాంతం భోషాణం, శాంతం భోషాణం అని హెచ్చరించింది. వరాలప్పుడే ఇచ్చేయకు అని జాగ్రత్త చెప్పింది.  నేను కూడా which పుట్టా what పాము అని ఆలోచించి,  చెలరేగే ఆనంద కెరటాలను శాంతింప చేశాను.

శనివారమగుటచేతనూ ఆఫీసు కెళ్లఖ్ఖర్లేదు కనకనూ,  పేపరు విప్పి వియత్నాం లో అమెరికా కు జరుగుతున్న నష్టాలు, కంబోడియా లో  అనావృష్టి, మెక్సికో లో  జరుగుతున్న సమావేశ ఫలితాలు గురించి విశ్లేషాత్మక వ్యాసాలు క్షుణ్ణముగా చదివేశాను.  ముందుకు వెళ్లిపోతున్న మన దేశం,  వెనక్కి పోతున్న దారిద్ర్యం గురించి పరిశోధనాత్మక రచన చదివి సంతోషించాను.

స్నానాదులు ముగించుకొని మా అమ్మగారి జన్మదిన సందర్భంగా ఇస్త్రీ చేసిన చొక్కా,  లుంగీ ధరించి TV ముందు కూచున్నాను. కోటూ,  టై ధరించి కూచున్న నలుగురి పెద్ద మనుషుల మధ్య,  వేదాలు వాటి ప్రాశస్త్యం గురించి చర్చ విన్నాను.  కొంత సేపటికి ప్రభావతి వంట ముగించుకొని కొత్త చీర కట్టుకొని వచ్చి కూర్చుంది. 

12 గంటలవుతోంది భోజనం చేస్తారా అంది. 

అల్లాగే అని డైనింగ్ టేబులు వద్దకు నడిచాను.  

పులిహార నారగించి నేతిగారెలు తింటుండగా మళ్ళీ నా మనసులో నానంద కెరటాలు ఉప్పొంగి కధకళి చేయడం మొదలుపెట్టాయి. ఇంతలో చక్రపొంగలి గిన్నె ముందుకు తోసింది. నేతిగారెల తరువాత రెండు చెంచాల చక్రపొంగలి నోట్లోకి వెళ్ళగానే నాలిక పరవశించి మనస్సు తన్మయత్వం చెందింది. సరిగ్గా ఆ క్షణం లోనే మా యావిడ,

 ప్చ్ ,  ఏమిటో పాపం   అంది .

ఏమైంది,  పదార్ధాలు అన్నీచాలా  బాగా ఉన్నాయి దేవి అని అన్నాను.

అత్తగారి కోరిక ఒకటి తీరకుండానే వెళ్ళిపోయారు అని దీర్ఘంగా నిట్టూర్చింది ప్రభావతి.

చక్రపొంగలి ముగించి మైసూర్ పాక్    ముక్క  నోట్లో పడగానే నా మనసు అదుపు తప్పింది.

ఏమా కోరిక దేవి అని పృచ్చించితిని.

నలుగురి ఆడ పడచులకి ఉంది, పెద్ద కోడలికి ఉంది,  నీకు కూడా చేయించాలే అనేవారు మీ అమ్మ గారు అని అంది.

సరిగ్గా ఇక్కడే నా నాలుక అదుపు,  నా మనస్సు వశం తప్పాయి. పరమానంద భరితమైన మనస్సు తొందర పెట్టడంవల్ల,

ఈ నవ నవాభ్యుదయ విశాల సృష్టిలో చిత్రములన్నీ నావేలే, కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే అని పాడేశాను. 

పాడి ఏమిటా కోరిక అని బహు ప్రేమగా అడిగాను.

!  మీవల్లే మవుతుంది  లెండి ఇప్పుడు అని ప్రభావతి అంది.

అంతే,  నాలో  గయుడికి అభయమిచ్చిన అర్జునుడు నిద్ర లేచాడు, 

నిటిలాక్షుండిపు డెత్తి వచ్చినన్ రానీ, బంధుల్, మిత్రుల్  తుదకు సామ్రాజ్య ప్రభల్ పోయినన్ పోనీ మా యమ్మ కోరిక తీర్చెద, నీ  మనంబునకు శాంతి చేకూర్చెదన్, ఆ ఆ ఆ ఆయ్ 

అని భీషణంగా వాగ్దానం చేసేశాను.

ఆ ఏమీ లేదండీ.  అందరికీ ఉంది కదా నీ మెడలోనే లేదు. నీకు కూడా ఒక చంద్ర హారం చేయిస్తానే అనేవారు మీ అమ్మగారు.

నింగికెగసిన ఆనందోత్సాహాలు డుబుక్కున నేల మీదకు పడి నాకేసి జాలిగా చూశాయి. వేడి చేసి మరీ ఇనుము మీద  సమ్మెట దెబ్బలు కొట్టి వంచే  అలవాటు ఉన్న  మా ఆవిడ, చల్లబడిన నా ఉత్సాహం చూసి అంది,

ఈ కోరిక తీరకుండా ఆవిడ ఏ వైతరణి మధ్యలో ఆగిపోయారో  పాపం.

వైతరణి మధ్యలోనా?  ఆగిపోయిందా? నీకెలా తెలుసు?

గరుడ పురాణంలో చెప్పారండి.

గరుడ పురాణమా? నువ్వెప్పుడు చదివావు?

మీ నాన్నగారు పోయినప్పుడు పంతులు గారు చదివారు కదండీ ఆ పదిరోజులునూ. అప్పుడు విన్నానండి.

ఆయన చెప్పాడా నీకు?

ఆయన చదివి చెపుతుంటే నేను విన్నాను. నాకు అలానే అర్ధం అయింది మరి.

నేను అప్పులపాలై పోయే భవిష్య పురాణం కనిపిస్తోంది నాకు.

అంతే లెండి

అంతే లెండా? ఏమిటి  నీ ఉద్దేశ్యం?

తల్లితండ్రుల కోరిక తీర్చిన కొడుకే ధన్యజీవి అంటారు. అయినా మీరేం చెయ్యగలరు లెండి. పాపం ఆవిడకు ఆ అదృష్టం లేకపోయిన తరువాత.

నేనేం చెయ్యలేనా? ఆవిడకి అదృష్టం లేదా?

ఎందుకు అరుస్తారు అలాగా చెవికోసిన మేకలాగా.

చెవికోసిన మేకా ?

చాలితిరేని ముందునకు సాగి కొనుడొక చంద్రహారం
చాలరేని  చాలిక మిన్న కుండుడు తీర్చెదడు నా పుత్రుడు
ఛాలెంజి చేసి పెరిగి పెద్దవాడై  తన నాయనమ్మ కోరిక
చాలని వారి మనంబులు ఝల్లుమనన్,  ప్రేమతోడన్  ఆ ఆ ఆ ఆ

అని  పద్యం కూడా పాడేసింది.

నాకూ పౌరుషం వచ్చేసి నాలో ఉగ్ర నరసింహుడు మేలుకొన్నాడు. కోపంబుతో నాలుక తడబడగా,

నేనే  ఓ కాసు బంగారం తోటి ఒక చంద్రహారం ఘనం గా చేయిస్తాను అని ప్రకాశముగా ప్రకటించేశాను.

కాసు బంగారం తోటి చంద్రహారం లోని మొదటి అక్షరం కూడా రాదు. నాలుగైదు కాసులు వేస్తేనే కానీ కంటికి ఆనదు అని గంట వాయించి ఘంటాపధం గా చెప్పింది.

నాలుగైదు కాసులా ? అంటే 12-15 వేలా ? అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది అని నిరాశ పడిపోయాను నేను.

ఆ భగవంతుడు ఏ మట్టి నింపాడో కానీ మా ఆవిడ బుఱ్ఱ లోంచి ఐడియా లు అలా మొలకెత్తి వచ్చేస్తాయి.

మీరెలాగు వాడడటం లేదు కదా ఉంగరం ఒక కాసు ఉంటుంది, మీ పులిగోరు గొలుసు ఇప్పుడు ఫాషను కాదు కదా అది రెండు కాసులు ఉంటుంది. ఇవి వేస్తే తరుగు పోను ఇంకో 7-8 వేలు వేస్తే సరిపోతుంది.

నేను మాములుగానే దీర్ఘంగా నిట్టూర్చాను. పరిస్థితులు చెయ్యి దాటినప్పుడు ఏ మొగుడైనా చేయునది అదేకదా.  

సరే ఈ మాటు హైదరాబాద్ వెళ్లినప్పుడు చేయిస్తాను అన్నాను.

భలే వారే,  బంగారం ధర ఎల్లా పెరుగు తోందా తెలుసా? నెలకి 3-4 వందలు పెరుగుతోంది. 7-8 నెలలు ఆగితే కొన్నట్టే,  తడిసి మోపెడవుతుంది  అని తేల్చేసింది ప్రభావతి.

సరే మళ్ళీ నెల కొంటాను. త్రిఫ్ట్ సొసైటీ లో అప్పు తీసుకోవాలి కదా.

పుట్టిన రోజు నాడు ఆవిడ కోరిక తీరుస్తే చెంగు చెంగు న స్వర్గానికి వెళ్లిపోతుంది. ఆపైన మీ ఇష్టం.

ఈ వేళ ఎలా కుదురుతుందే, బాంక్ లో 6500 రూపాయలే ఉన్నాయి.

దానిదేముంది. 5000 కి చెక్కు ఇచ్చేయండి. మిగతాది లోన్ వచ్చిన తరువాత ఇవ్వ వచ్చు. అగర్వాల్ తమ్ముడిదే కదా బంగారం కొట్టు. ఒప్పుకుంటాడు.

తప్పుతుందా మరి అనుకుంటూ అగర్వాల్ కి టెలిఫోన్ చేసి, వాడి తమ్ముడి  కొట్లో నా పులిగోరు,  ఉంగరం సమర్పించి,   5000 కి చెక్కు ఇచ్చి, 4300 కి మాట ఇచ్చి చంద్రహారం తీసుకొచ్చాము  మా ఆవిడ, ఆవిడ పతీ పరమేశ్వరుడైన నేను.  

వారం రోజుల తరువాత మా సోదరుడు టెలిఫోన్ చేశాడు.

ఏరా  మరదలు, పిల్లలు అందరూ కులాసా నా

ఆ అంతా బాగున్నారు అక్కడ అంతా కులాసాయేనా

ఆ. మళ్ళీ నెలలో చంద్రానికి ఉపనయనం చేస్తారుట. అక్క నీకు చెప్పమంది. తేదీ నిర్ణయించిన తరువాత నీతో మాట్లాడుతానని చెప్పింది.

నేను రాలేనేమో రా

ఏమి ఏమైంది?

ప్రస్థుతానికి  పర్సు ఖాళీ. వస్తే మళ్ళీ నాలుగైదు వేలు ఖర్చు. కష్టం.

నువ్వు రాకపోతే అక్కయ్య బాధ పడుతుంది. అయినా అంత కష్టం ఎలా వచ్చింది. ఏమి కొన్నావేమిటి?

మొన్న అమ్మ పుట్టినరోజున మా యావిడకి చంద్రహారం చేయించానురా.

అమ్మ పుట్టిన రోజునా ? ఆశ్చర్యపడ్డాడు శ్రీరామచంద్రుడు.

మొన్న 18 వ తారీఖున ఆశ్వీయుజ పంచమి నాడు.

ఆశ్వీయుజ పంచమా! మళ్ళీ ఆ.పడ్డాడు శ్రీ.చం.  ఈ నెలే నా అని అడిగాడు.

ఆ ఈ నెలే

ఈ నెల మాఘమాసం రా లక్ష్మణా అన్నాడు శ్రీ. చం. ఆశ్వీయుజం అంటే కిందటి సెప్టెంబరు అనుకుంటాను.

మాఘమాసమా ఇది. సరిగ్గా తెలుసా నీకు.

అయినా అమ్మ పుట్టినరోజు అమ్మకి నాన్నకి కూడా గుర్తులేదు నీకెలా తెలిసిందిరా.

మా ఆవిడ చెప్పింది. అమ్మ చెప్పిందిట.

అమ్మ చెప్పడమేమిటిరా మూ.శి (మూర్ఖ శిఖామణి) ఉండు. కమలా మీ మరిది ఏమో అంటున్నాడు. చూడు.

బాగున్నావా  ప్రద్యుమ్నా . అన్నగారు అంత ఆశ్చర్యపడి  పోతున్నారేమిటి లక్ష్మణా.

మా ఆవిడకి చంద్రహారం చేయించాను.

సంతోషం. అదృష్టవంతురాలు ప్రభ. పెళ్ళైన దగ్గరనించి పోరుతున్నాను. మీ అగ్రజుడు ఇంకా కనికరించలేదు.

నీకు చంద్రహారం లేదా?

లేదు,  నాకేమిటి మన ఇంట్లో ఇప్పటిదాకా ఎవరికీ  లేదు      

ఎవరికీ లేదా, మా అప్పచెళ్లెవరికీ లేదా?

లేదు. లేదు. లేదు.

అదేమిటీ మా యావిడ అల్లాగ చెప్పింది? మీ అందరికీ చంద్రహారం ఉంది. మా యావిడకే లేదు కాబట్టి నీకు నేను చేయిస్తాను అని మా అమ్మ చెప్పింది అని.

అందుకని నువ్వు కొనేశావా?

ఏదో మా అమ్మ కోరిక తీర్చేద్దామని.

అయినా ఆ విషయం అత్తగారు దగ్గర ఉన్న నాకు చెప్పేది. కూతుర్లకి చెప్పేది. ఎక్కడో అస్సాం లో ఉన్న మీ ఆవిడ కెలా చెప్పింది.  నువ్వో భజగోవిందాని వోయి లక్ష్మణా.

భజగోవిందాన్నా .

అవును.  నువ్వు పప్పుసుద్దవే ప్రద్యుమ్నా .

ఏమో నాకూ అనుమానం వచ్చేస్తోంది,  నేను పప్పుసుద్దనేమో నని. 

మీరేమంటారు ?
  
                     
          
              

42 కామెంట్‌లు:

shanky చెప్పారు...

హేవిటో అంతా విష్ణుమాయ. అయినా గురువుగారూ మీరు ఇటువంటి టెక్నిక్కులు పబిలిక్కుగా చెప్పడం భావ్యమా? ఇక ఇప్పుడు ఎన్ని ఇళ్లలో ఎంతమంది భాజగోవిందాలకు మూడనుందో :))

(ఎందుకైనా మంచిది ఈ పోస్టు నా సతీమణి కళ్ళబడకుండా కాపాడుకోవలె :) )

buddhamurali చెప్పారు...

నాలుగయిదు కాసులు కాదు కానీ పన్నెండు కాసుల్లో చంద్ర హారం లు ఉన్నాయండి ఆలోచించండి

జ్యోతిర్మయి చెప్పారు...

హ..హ..
ఇలా రాసేసి మీకేమీ సంబంధం లేనట్టు నవ్వితే నవ్వండి అనడం ఏమీ బాగాలేదండీ..

అజ్ఞాత చెప్పారు...

ఏమయితేనేమి మా చెల్లాయికి చంద్ర హారం అమిరింది కదా!!! :)

తృష్ణ చెప్పారు...

మధ్యలో ఓచోట 'సంతోష కన్నీరు' అనేకన్నా 'ఆనందబాష్పాలు' అనాల్సిందేమోనండి...

ఏమిటో మీరిన్ని చెప్పినా నాకు పిన్నిగారికన్నా మీ పైనే అనుమానం కలుగుతోంది....:)

SHANKAR.S చెప్పారు...

గురువుగారూ మొదటి కామెంట్ నాదే. నా ప్రొఫైల్ ఏమయిపోయిందో ఏంటో? :((( పేరు కూడా నేను బజ్జులోకి వచ్చిన మొదట్లో ఉన్న ప్రొఫైల్ పేరు "shanky" అని వచ్చింది. ఈ సారి అంతా గూగులోడి మాయలా ఉంది :(((

- SHANKAR.S

అజ్ఞాత చెప్పారు...

"""ఆశ్వయుజ శుద్ధ పంచమి""" అంటే దసరా రోజులేమో కదా గురుగారు!? బావుంది మీ టపా......

శ్రీలలిత చెప్పారు...

చక్రపొంగలి వండిపెట్టి చంద్రహారాలు చేయించుకోవచ్చని నాకింతవరకూ తెలియలేదుస్మండీ...
మావారి పెళ్ళినాటి ఉంగరం బీరువాలో ఏమూల వుందో వెతకాలి.. కాస్త ప్రభావతిగారినడిగి ఇంకా ఏమూలల ఏమేమి వున్నాయో తెలిసే ఆస్కారముందేమో కనుక్కుందురూ...

ఆ.సౌమ్య చెప్పారు...

అబ్బ ప్రభావతి గారి తెలివితేటలకి నా దిష్టే తగిలేలా ఉంది. ముందు దిష్టి తీయండి ఇంటికెళ్ళి :)))

ఆ.సౌమ్య చెప్పారు...

ఆమాటెలా ఉన్నా మీరు మళ్ళీ బ్లాగుల్లోకి వచ్చారు....చాల సంతోషం. మళ్ళీ పారిపోకండేం. ఏదీ పోస్టులో ప్రభావతి గారికి ప్రమాణం చేసినట్టు పద్యం చదివి చెయ్యండి! ఊ మొదలెట్టండి...నిటలాక్షుండిపు డెత్తి వచ్చినన్ రానీ....

అజ్ఞాత చెప్పారు...

చేతకాని దద్దమ్మ, మూ.శి., భజ గోవిందం అన్నీ కరక్టే! "మీకు ఎలాగా చేతనవ్వదూ" అని చెప్పినప్పుడు ఎందుకు విన్నారు కాదు? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. అనుభవించండి.

ఇంతకీ చిరకాల దర్శనం. ఏలూరు ఎఫెక్టా? పూర్తిగా నల్లపూసైపోయేరు (అంటే ప్రభావతి గారి మెడలో అని కాదండోయ్!)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

అప్పుడెప్పుడో..చంద్రహారం చేయించాబట్టి సరిపోయింది. ఇప్పుడైతే ఇంకా దిగులు పడే వారు.:)))) కాస్త ఆ దిగులుని ఇప్పటికైనా మర్చిపోండి. మాస్టారు..

శేఖర్ (Sekhar) చెప్పారు...

అక్షరాల వెంట పరుగులెత్తించారు సుతి మెత్తని హాస్యం తో....చాల బాగుంది గురు గారు :))

జలతారు వెన్నెల చెప్పారు...

బాగా నవ్వించారు

Zilebi చెప్పారు...

బులుసు వారు,

హమ్మయ్య! మళ్ళీ వచ్చేరు !

ప్రభావతి గారికి శుభాకాంక్షలు !

ఇలా ప్రతి సారీ మరో లాటరీ వారికి తగులు గాక!

జై సుబ్రహ్మణ్య స్వామీ వారికి !

చీర్స్
జిలేబి.

రసజ్ఞ చెప్పారు...

హహహ!భలే భలేగా ఉంది! ఈ అవిడియా ఏదో బాగుందే! చంద్రహారానికి చక్కెరపొంగలి, నేతిగారెలు, ఉప్మా పెసరట్టు, మైసూరు పాక్ చెయ్యాలంటే మరి వడ్డాణానికి ఏమి సమర్పించాలో కాస్త కనుక్కుని చెప్దురూ నా కోసం! ఆ జాబితాలో నాకు చేతకాని వంటలేమన్నా ఉంటే ఇప్పటినుండే నేర్చుకుంటాను ;) అన్నట్టు ఆశ్వయుజ శుద్ధ పంచమి అంటే దసరా నవరాత్రులు కదా!!!!

Advaitha Aanandam చెప్పారు...

ఎన్నాల్టికి కనపడ్డారండీ.....
ఇన్ని రోజులూ టపాలు ఎందుకు రాయలేదో... కనీసం వేరేవారి బ్లాగుల్లో మీ కామెంట్లు ఎందుకు కనబడలేదొ చెప్పి తీరాలి.....

ఇంక మీ టపా విషయానికి వస్తే....

నిజానిజాలు తెలియనిదే నేను మాత్రం ఒక్క మాట కూడా రాయను/చెప్పను.......
ఇందులో మీపైనే అనుమానం వచ్చే అంశాలు కూడా లేకపోలేదు....
ముమ్మాటికీ ప్రభావతిగారి తప్పు లేదని మాత్రం చెప్పగలను.......

మధురవాణి చెప్పారు...

చాన్నాళ్ళకి వచ్చారే మమ్మల్ని నవ్వించడానికి..
పాపం ప్రభావతి గారెంత అమాయకులండీ.. ఏ వడ్డాణమో అడక్కుండా పాపం చిన్నపాటి చంద్రహారంతో సరిపెట్టుకున్నారు. ప్చ్.. బొత్తిగా సత్తెకాలపు మనిషల్లే ఉన్నారు పాపం.. :)))))

జేబి - JB చెప్పారు...

:D:D:D

రాజ్ కుమార్ చెప్పారు...

ఆహా.. ఎంత కాలానికి ఎంత కాలానికీ...
గురువుగారూ... ఆ పద్యాలూ, పాటలూ, హిహిహిహిహిహి.. సూపరు...
భజగోవిందం గురువుగారూ... ః))))))))

కావాలంటే ఇస్తాలే.. నావన్నీ ఇక నీవెలే...యెకాడికోఓఓఓఓ పోయొచ్చాను గురూజీ..

Kottapali చెప్పారు...

బహుకాల దర్శనం, వృధా కాలేదు! ఎంత గొప్ప అత్తగారో, కోడలికి చంద్రహారం లేదని వైతరిణీ మధ్యలోనించీ ఎస్సెమ్మెస్ కొట్టారు! అద్భుతం.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శంకర్ గారికి,

ధన్యవాదాలు. గూగులోడి మాయ కాదు అంతా శంకర మాయ అనాలి. .... దహా
ఇవన్నీ పాత పద్ధతు లండి. ఇప్పటి కొత్త పద్ధతులు నాకూ తెలియవు. తెలుసుకోవాలని ఉంది. ఈ టపా శంకర పత్ని గారికి మెయిల్ చేస్తున్నాను. ...... దహా.

బుద్ధ మురళి గారికి,

నాలుగైదు కాసులకే ప్రద్యుమ్నుడికి చుక్కలు కనిపించాయి. పన్నెండు కాసులంటే చుక్కల్లోకి వెళ్లి పోతాడేమో ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

జ్యోతిర్మయి గారికి,

ధన్యవాదాలు. నా బ్లాగు శీర్షిక నవ్వకపోతే నవ్విపొండి అని మార్చేయ్యనా........ దహా.

కష్టేఫలి గారికి,

ఎంతసేపూ చెల్లాయి గారి తరుఫునేనా, అప్పుడప్పుడు ప్రద్యుమ్నుడిని కూడా కాపాడండి. ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

తృష్ణ గారికి,

అదేమిటో అందరికీ పిన్నిగారి మీదే జాలి, ప్రద్యుమ్నుడి మీద అనుమానం. అంతే లెండి. ఏంచేస్తాం.
సంతోష కన్నీరు అంటే కొంచెం హాస్యం గా ఉంటుందేమో ననుకున్నాను. ఇంకోమాటు ఉపయోగించను లెండి. ధన్యవాదాలు.

అనానిమస్ గారికి,

అబ్బే అంత జ్ఞానం ప్రద్యుమ్నుడికి ఉంటే చంద్రహారం ఎందుకు చేయిస్తాడు?...... దహా.
ధన్యవాదాలు.

శ్రీలలిత గారికి,
చక్రపొంగలి కి ప్రద్యుమ్నుడు పడిపోయాడు. అందరికీ ఇది కుదరదేమో.
అయినా నాకు తెలియక అడుగుతాను, మీ ఇంట్లో మీకు తెలియని రహస్యాలు ఉంటాయా?
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

ఆ. సౌమ్య గారికి,

ప్రద్యుమ్నుడిని దిష్టి బొమ్మలా నిలబెట్టిన ప్రభావతికి దిష్టి ప్రద్యుమ్నుడే తీయాలా? అన్యాయం కదూ.
నేనెక్కడికి వెళతానండి. ఇక్కడే ఉంటాను బ్లాగుల్లోనూ, + ల్లోనూ పరిభ్రమిస్తూ. మీ అభిమానానికి కృతజ్ఞుడిని. ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

అనానిమస్ గారికి,

అనండి, అనండి ఇంకేమైనా బాకీ ఉన్నాయా? వింటే ఇన్ని కధలు, వెతలు ఉండేవి కావు కదా..... దహా.
ఏ ఎఫ్ఫెక్ట్ కాదండి. కొంతకాలం దూరం గా ఉండవలిసి వచ్చింది. అంతే. ధన్యవాదాలు.

వనజ వనమాలి గారికి,
నిజమేనండి, ఇప్పుడు బంగారం కొట్లోకి వెళ్ళే తాహతు కూడా లేదు.
మీ బ్లాగులో కామెంటు పెట్ట లేక పోతున్నాను, కుదరటం లేదు. ఎందుకనో.
ధన్యవాదాలు.

శేఖర్ (Sekhar) గారికి,
ధన్యవాదాలు. మీకు నచ్చినందులకు.


జలతారు వెన్నెల గారికి,

ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

జిలేబీ గారికి,

ప్రభావతి గారికి శుభాకాంక్షలు అనే కానీ ప్రద్యుమ్నుడికి సానుభూతి చూపించరా మీరు. నిరసన ప్రకటిస్తున్నాను.
మీ ఆదరాభిమానాలకి కృతజ్ఞుడిని. ధన్యవాదాలు.

రసజ్ఞ గారికి,

ఆశ్వీయుజ పంచమి అంటే ప్రద్యుమ్నుడికి తెలిస్తే మోసపోతాడా. తెలివి తక్కువ వాడు, అమాయకుడు, నో. వే. కొ. లే (నోట్లో వేలు పెట్టినా కొరక లేనివాడు) కాబట్టే ఆవిడ అల్లా ఆడించేస్తోంది.
వడ్డాణాల కి ఈ లెఖ్ఖలు చాలవు లెండి. ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

మాధవి గారికి,

ఏమీ లేదండి. మా కంప్యూటర్ కి సుస్తీ చేసి రెండు ఆపరేషన్ ల తరువాత కాలం చేసింది. కొత్తది కొనటానికి శ్రీమతి గారి అప్రూవల్ ఆలశ్యం అయింది. అందువల్ల నేను అదృశ్యం గా ఉండాల్సి వచ్చింది.........దహా.
అంత సాక్ష్యం చూపించినా ప్రద్యుమ్నుడి మీద మీకు జాలి కలుగదా? హతవిధీ నేనేమి చేయవలె?
మీ అభిమానానికి కృతజ్ఞుడిని. ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మధుర వాణి గారికి,

వడ్డాణాలు అడిగితే పాపం ప్రద్యుమ్నుడు అప్పుడే దండ కమండలాలు చేత బట్టి అస్సాం అరణ్యాల లోకి పారిపోయేవాడు. అవును పాపం ప్రద్యుమ్నుడు సత్తెకాలపు మనిషే.
ధన్యవాదాలు.

జేబి-JB గారికి,

ధన్యవాదాలు.

రాజ్ కుమార్ గారికి,

గురువుగారు భజగోవిందం అని ఒప్పేసుకున్నా రన్నమాట. ఆ పాటలన్నీ గుర్తు తెచ్చుకోండి. ముందు ముందు పనికి వస్తాయి............ దహా.
ధన్యవాదాలు.

నారాయణ స్వామి గారికి,

ధన్యవాదాలు. అత్తగార్ల గొప్పదనం వారు కాలం చేసిన తరువాత కానీ కోడళ్ళకి తెలియదేమో............దహా.

శశి కళ చెప్పారు...

ఆహా...గరుడ పురాణం...దెబ్బకి చంద్ర హారం...
హ...హ....మనలో మాట ఈ మంత్రం ఎవరికైనా పారుతుందా...గురువుగారు?

హరే కృష్ణ చెప్పారు...

మీరెలాగు వాడడటం లేదు కదా ఉంగరం ఒక కాసు ఉంటుంది, మీ పులిగోరు గొలుసు ఇప్పుడు ఫాషను కాదు కదా అది రెండు కాసులు ఉంటుంది. ఇవి వేస్తే తరుగు పోను ఇంకో 7-8 వేలు వేస్తే సరిపోతుంది.
హహ సూపర్

చంద్రహారం చివరి లైన్లు వడదెబ్బ అంతే :)

kosuru చెప్పారు...

naaku ee kadha meeda anumanamga undi. Meeru prabhavati gaari meeda abhondaalu vestunnatlu ga anipistondi. Any way idi kadhe ayite kashtapadi navvuko vachchu. Thanks

Murthy చెప్పారు...

చాలా చక్కగా నవ్వించారు సుబ్రహ్మణ్యం గారు.
అన్న్యోన్న దంపతులలో ఎప్పుడూ "శ్రీమతి" ముందు "మతి" లేనట్లుగా "శ్రీ" ప్రవర్తిస్తాడు.
ఎంతయినా "శ్రీమతి" లో సగం "శ్రీ" యే కదండి.
అప్పుడు ఒక ప్రక్క తియ్యటి బాధ, మరొక ప్రక్క "తియ్యటి అనుభూతి" ఉండటం ప్రకృతి సహజం.

Advaitha Aanandam చెప్పారు...

" మా కంప్యూటర్ కి సుస్తీ చేసి రెండు ఆపరేషన్ ల తరువాత కాలం చేసింది. కొత్తది కొనటానికి శ్రీమతి గారి అప్రూవల్ ఆలశ్యం అయింది. "


---అందుకేనా ఇలా అభాండాలు వేసేస్తున్నారు....
దొరికారు చూడండి... పాపం అమాయకురాలైన ప్రభావతిగారి గురించి అలా రాసేస్తారా....???

:-)

Sunil చెప్పారు...

గురూజీ
చాలాకాలం తరువాత ఈ టపా వ్రాస్తున్నాను. నన్ను మీరు మర్చిపోయినట్టున్నారు. నేను ఇదివరకూ జెర్మనీ నుండి మీకు టపాలు వ్రాసేవాడిని. గత సంవత్సరమే ఇక్కడికి వచ్చాను. IISc, Bangalore లో RA గా పని చేస్తున్నాను. .
మీ కఠ తెగ నచ్చేసి నెను కూడా మీలాగే ఆవేశంగా నా would be కి మీ బ్లొగ్ ను పరిచయం చేశాను. ఆమె కి కూడా మీ కథ బాగా నచ్చినట్టుంది. అయితే ఇక్కడ ప్రభావతి గారి నుండి ఏమైనా నేర్చుకుంటుందేమోనని తెగ భయం గా ఉంది.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శశికళ గారికి,

కఠోర నియమాలతో మంత్రం పఠిస్తే పారవచ్చును. ప్రయత్నించండి. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు.

హరేకృష్ణ గారికి,

వడదెబ్బ అంటే శీతాకాలం లో పడిన వడదెబ్బ అన్నమాట. ధన్యవాదాలు.

కోసూరు గారికి,

కష్టపడి నవ్వుకోవలసి వచ్చిందా? కనీసం నవ్వడానికైనా కష్టపడ్డారు అదే పదివేలు. ధన్యవాదాలు.

More Entertainment గారికి,
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

డి.ఎస్. ఆర్. మూర్తి గారికి,

చిన్న సవరణ . శ్రీమతి లో శ్రీ మూడవ భాగం. సగం కాదు.
>>> అప్పుడు ఒక ప్రక్క తియ్యటి బాధ, మరొక ప్రక్క "తియ్యటి అనుభూతి" ఉండటం ప్రకృతి సహజం.
బాధే సౌఖ్యమనే భావన వచ్చేస్తుంది లెండి పెళ్ళి అయితే. ధన్యవాదాలు.

మాధవి గారికి,

ధన్యవాదాలు. మీరు కూడా ఆల్లాగే అంటారా, పాపం ప్రద్యుమ్నుడు అనరా ? సతివ్రతా శిరోమణు డి మీద అభాండాలా? హతవిధీ.

సునీల్ గారికి,

ఎంతమాట హెంత మాట. మిమ్మల్ని మర్చి పోవడమా, లేదు లేదు. వెల్కం బాక్. ఇంతకీ పెళ్ళి ఎప్పుడు, ఎక్కడా? ముందస్తుగా శుభాకాంక్షలు.
కధలు చదివి , సినిమాలు చూసి ఎవరూ మారరు. గుర్తు పెట్టుకోండి. ........... దహా.
ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

మీ ప్రభావతి గారికి ఒక సలహా.
చక్రపొంగలి వగైరా వంటకాల ట్రైనింగ్ క్లాసులకి మంచి డిమాండ్ ఉన్నట్టుంది.

More Entertainment చెప్పారు...

hii.. Nice Post Great job.

Thanks for sharing.

Pasi చెప్పారు...

Mamaji,

Nenu Pasi from USA. Itlaa maa attamma ni anatam emi baagaaledu. Intaki Attamma ee blogs chadutunnatlu ledu. Nenu phone chesi cheptaanu.

I heard you bought a new samsung notebook. Congratulations. Hope we can see more blog posts from now.

Bye for now,
Pasi.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

బోనగిరి గారికి,

ధన్యవాదాలు. భార్య చేతి రుచి మొగుడికి నచ్చి తీరాలి.
వంటల బ్లాగులు చాలానే ఉన్నాయి కదండి. మళ్ళీ ఇంకోటి ఎందుకు. ...... దహా.

More Entertainment గారికి,
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

పసి గారికి,

ధన్యవాదాలు. మీ అత్తమ్మ గారు ఇవన్నీ చదివితే, మళ్ళీ మాటు నువ్వు వచ్చినప్పుడు నన్ను శంకర గిరి మాన్యాలలో వెతుక్కోవాలి. ............ దహా.

కొత్తావకాయ చెప్పారు...

మీ అనుమానం నేను తీర్చేదేముంది కానీ, ప్రభావతి గారు తిలకినీతిలకం సుమండీ! ఎన్ని కిటుకులున్నాయ్ ఆవిడ వద్ద!! (మూడో సారి చదువుకోడానికి వచ్చినప్పుడు కామెంటడానికి కుదిరింది.)

Unknown చెప్పారు...

వంటకాలను ఇలా కూడ వాడుకొవచ్చని ప్రభావతి గారు చెప్పకనె చెప్పరు చాలా ఉపయొగకరంగా ఉన్నాఇ

మీ భాష విధానం బాగున్నై అద్భుతం

Unknown చెప్పారు...

వంటకాలను ఇలా కూడ వాడుకొవచ్చని ప్రభావతి గారు చెప్పకనె చెప్పరు చాలా ఉపయొగకరంగా ఉన్నాఇ

మీ భాష విధానం బాగున్నై అద్భుతం

Unknown చెప్పారు...

వంటకాలను ఇలా కూడ వాడుకొవచ్చని ప్రభావతి గారు చెప్పకనె చెప్పరు చాలా ఉపయొగకరంగా ఉన్నాఇ

మీ భాష విధానం బాగున్నై అద్భుతం