మా ఆవిడ ముచ్చట్లు - నా వాహన యోగం

సాయం సమయం సుమారు 6-30 గం // అయింది. ప్రద్యుమ్నుడు అనబడే నేను ఆఫీసు నించి ఇంటికి చేరాను. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది.  మా అబ్బాయి,  అమ్మాయి ఆడుకోవడానికి  వెళ్ళారు.  తలుపు తీసి మా ఆవిడ విస విసా వెళ్ళిపోయింది లోపలికి. నేను మా బెడ్ రూం లోకి వెళ్లి బట్టలు మార్చుకొని ముందు గదిలోకి వచ్చి కాపీ అని జనాంతికంగా అని కుర్చీలో  కూర్చున్నాను.  ఓ పది నిముషాల తర్వాత మా ఆవిడ ఓ కప్పు కాపీ తెచ్చి నా ఎదుట పెట్టి గుర్రు మని లోపలికి వెళ్లి పోయింది. మూడు రోజులుగా మా ఇంట్లో ఒకానొక అత్యవసర పరిస్థితి ప్రకటించబడింది.  ఏంచెయ్యాలో తోచక నేను,  సరే మాట్లాడుదాం రా అని పిలిచాను. లోపలి నించే ఆవిడ గుర్  గుర్, ఇంకేముంది మాట్లాడటానికి  గుర్  గుర్ అంది. నాకునుం  క్రోధము ఆవేశించగా అణుచుకొని,  (శాంతం భోషాణం కాబట్టి అందులో  నేను తరచుగా  దాక్కొంటాను కాబట్టి) ,   మా ఆవిడను చర్చలకు ఆహ్వానించాను.  ఆవిడ వేంచేసి నా ఎదుట సుఖాసీన అయి  పద్యం ఎత్తుకుంది   

పుట్టితి  పూజ్యుడౌ  సంస్కృత మాష్టారు ఇంట మెట్టితి ఘనుడౌ తెలుగు మాష్టారి ఇల్లు
చేపట్టితి చేతకాని ఒక సైంటిస్టును, పులక్ బారువా కొనే నొక సెకండ్ హాండ్ లాంబ్రేట్టా  
స్కూటర్, కొనే నొక మోటారు సైకిలు శశిధర్ సైకియా, గతి లేదా నా మొగుడి కొక కొత్త   
స్కూటరయినా మధుసూదనా,ముకుందా, మురారీ, మాధవా ఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ  

అని కడుంగడు దు:ఖిత మది యయి గద్గదస్వరం తో దీనంగా ఆలపించెను.   ఆమె విచారాశ్రువులు నన్ను కదలించగా కఠినమగు నా కర్కశహృదయ మొకింత కరుగ నారంభించెను. అంతలో కర్తవ్యము గుర్తుకు రాగా నామెను మందలించ సాహసించ దలచితిని.  

దేవీ శ్రీ దేవీ నీకేల ఈ అలుక నేనెంత నా జీతమెంత ఈడ్చి తన్నినను చేతికి  2500 రూకలు రావుగాదా, బాంకు లో ఉన్నది 5000 మించదు గదా, 10000 స్కూటర్ కొనుట ఎట్లు, అదియును గాక మీ తమ్ముని వివాహ శుభ ముహూర్తము వచ్చుచున్నది  మనం వెళ్ళవలసి యుండును గదా, కావున నీ పంతం మానుమా అని చెప్పితిని.

బిరబిరా కృష్ణమ్మ పరుగు లెడుతున్నట్టు మా ఆవిడ కోపగృహంబు జొచ్చెను . నేనుకూడా డూడూ బసవన్న లాగ ఆమె వెంట నరిగితిని. నరిగి,

చిగురు బోడి,  నా హృదయరాణి, వాళ్ళెవరో కొన్నారని మనం కొనదగునా,  సఖీ వలదు, అలుక మానుము ప్రియే చారుశిలే

అని పాడితిని. కాదు కాదు శీలే  అనాలి అని ఆమె బోధించెను.

ఆ తరువాత  దారుణమైన, తీవ్రమైన చర్చలానంతరం ఈ కింద నొసంగు నొడంబడిక కు సమ్మతించడ మైనది

1.  కొత్త స్కూటర్ కొనుటకు నిశ్చయించడం అయినది.
2. రేపే లోను కు అప్లై చేయవలె.
3. సంసార సాగరమున ఆర్ధిక తుపాను నివారించుట కై  శ్రీమతి ప్రభావతి  తమ తమ్ముని వివాహమునకు నేగుట అను విషయమై తగు సమయంలో తగు నిర్ణయం శ్రీమతి  ప్రభావతి ప్రద్యుమ్నుడు తీసుకొనుట కై  తదుపరి చర్చలు జరుప బడగలవు.
4. ఈ పైన చెప్పిన ఏ విషయమైనను ఉద్దేశ్యపూర్వకముగా నుల్లంఘించిన  లేక త్వరితగతి కార్యా చరణ చేయకున్న శ్రీ ప్రద్యుమ్నులు వారిచే  నిరాహారదీక్ష చేయించబడును.

దీని పై  శ్రీమతి  ప్రభావతి ప్రద్యుమ్నుడు వ్రాలు అని సంతకం చేయడమైనది.

మర్నాడు పొద్దున్నే నేను మామూలుగానే ఆఫీసు కు నరిగితిని. సంతకం పెట్టి ల్యాబ్ లో ఒక రౌండు కొట్టి నా సీటు లో కూర్చుంటిని. సుమారు 10.30 గం// అయింది. మా స్టెనో కుమారి అలకా హజారికా కిసుక్కున నవ్వి లోను అప్లికేషను పూర్తి చేసి పట్టుకు వచ్చాను. మీరు సంతకం పెట్టితే ఆఫీసులో ఇచ్చేస్తాను అని చెప్పింది. ఆహా అన్నాను ఆహాహా అని కూడా అన్నాను. అసలు నీకు ఎవరు చెప్పారు. నీకు వేరే ఏమీ పనిలేదా ? వారం రోజులయింది. దీపక్ గారి రిపోర్ట్ ఇంకా టైపు చెయ్యలేదు. ఈ పనులన్నీ వదిలి What is this loan application? అని ఘట్టిగా కోప్పడ్డాను. అలక మళ్ళీ కిసుక్కున నవ్వింది. ప్రభావతి దీదీ 9 గం// కి టెలిఫోను చేసారు. మీరు మర్చిపోతారేమో నని గుర్తు చేయమన్నారు అని చల్లగా చెప్పింది. ఈ వేళ సాయంకాలం లోగా డైరక్టరు గారి టేబులు మీదకు పంపే బాధ్యత నన్నే తీసుకొమ్మని చెప్పారండి అని అనెను. నేను గుర్ గుర్ మంటూనే సంతకం పెట్టి ఇచ్చితిని. అలకమ్మ గారు అది పుచ్చుకొని తుర్రు మనెను. ఈవిడ ఇంకా ఎవరికి టెలిఫోను చేసిందా అని ఆలోచిస్తుంటే గణగణ మని ఫోను మోగింది. 

నేను శాస్త్రి ని నువ్వు నువ్వేనా
అవును నేను నేనే
ఏమిటి అమ్మాయి స్కూటర్  కొనిపిస్తోందిట. నాకు చెప్పలేదేం
మీకు ఎల్లా తెలిసింది
మీ  స్టెనో మా స్టెనో కి చెప్పితే ఆవిడ నాకు చెప్పి మిగత అందరి స్టెనో లకి చెప్పేసింది ట.
అంటే ఇప్పుడు ఇది టాప్ న్యూస్ అన్నమాట లాబ్ లో
అవును good luck  వాహన యోగ ప్రాప్తిరస్తు అని దీవించి పెట్టేసాడు

ఇంతలోకి మా త్రిపాఠి గారు వచ్చి ఎదురుగా ఆసీనుడయ్యాడు.
రేపే వెళ్లి పట్టు కొచ్చేస్తున్నావుట? ఏ స్కూటర్?  చూసావా? మాట్లడావా?     
అంటూ ప్రశ్నల శరంపర కురిపించేసాడు. ఓ నవ్వు నవ్వి ఊరుకొన్నాను.
అస్సాంలో కురుస్తున్న వర్షాల గురించి, రాజస్తాన్ లో కాయని ఎండల గురించి, పెరుగుతున్న ధరల గురించి ఓ పావు గంట ఉపన్యాసం ఇచ్చి వెళ్ళి పోయాడు. నేను చంకలో ఓనోట్ బుక్కు,. చెవిలో ఓ పెన్సిలు పెట్టుకొని లైబ్రరీ వైపు అడుగులు  వేసాను. నాల్గు  అడుగులు వేసానో లేదో మా  సదానంద  గర్గ్  తగులుకున్నాడు.

సో హాపీ టు నొ దట్ యు హావ్ ఫైనల్లీ డిసైడెడ్ టు పర్చేజ్ ఎ వెహికిల్.  వై డోన్టు యు గో ఫర్  ఎ ఫోర్ వీలర్ ?

నాకు మండుకు వచ్చేసింది. నీకెవరు చెప్పారు అని అడిగితిని. వాడు ఓ నవ్వు విసిరి ఓ మాటు ఘట్టిగా గాలి పీల్చి, హవా మే ఖబర్ హై అని వడి వడి గా అడుగులు వేసుకుంటూ నిష్క్రమించాడు. ఇప్పుడు ఇంక లైబ్రరీ లో కూర్చుంటే ఎంత మంది జోకులు వినవలసి ఉంటుందో అని నేను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాను.  ఫోను మోగింది. ఎత్తేను.

షుడ్ ఐ కాల్ ఫర్ టెండర్స్ సార్ ? ఏజ్ దిస్ అపియర్స్ టు బి ఏన్ ఇమ్మీడియట్ అండ్ ఇంపార్టంట్ పర్చేజ్, వుయ్ మే హావ్ టు సెండ్ దిస్ ఫర్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ది డైరక్టర్.

మా పర్చేజ్ ఆఫీసరు. మాట్లాడకుండా ఫోను పెట్టేసాను.

.ఒంటిగంటి కి లంచి కి ఇంటికి వెళ్ళేటప్పటికి, మా ఆవిడ మంచి మూడు లో ఉన్నారు. సా  ధిం  చె  నే  మ  న సా  అంటూ త్యాగరాజు గారి పని పట్టేస్తున్నారు. నేను నిశ్శబ్దంగా నాపని కానిచ్చేస్తున్నాను, భోజనం చెయ్యడం.  మా ఆవిడ, నేను మా కార్యక్రమాలు ఒకేమాటు పూర్తిచేసాము.

సాయంకాలం 3గం// కి టౌను వెళ్ళుతున్నాం. శాస్త్రిగారి తో మీరు కూడా రండి.
నాకు తీరుబడి లేదు
అనుకున్నాను, అవసరమైన రోజున మీకు  మీటింగులు ఉంటాయని
అంత తొందరెందుకో నాలుగైదు రోజులు ఆగవచ్చు కదా
ఎల్లుండ కల్లా స్కూటరు ఇంట్లో ఉండాలి
డబ్బు అరేంజ్ చెయ్యాలి కదా
ఆ పని అయిపోయింది
నాకు తెలియకుండా ఎల్లా అయింది
మీకు తెలిస్తే అవదని నాకు తెలుసు కాబట్టి.  శాస్త్రి గారి ఎకౌంట్ లోంచి 3500 మీ ఎకౌంటు లోకి ట్రాన్స్ ఫర్ అయింది. సాయంకాలం 4 గం// ల కల్లా చెక్కు వచ్చేస్తుంది మీకు ఆఫీసు నించి. అలక చెప్పింది. Credit and Thrift society నించి ఈ నెల లో మళ్ళీ ఓ నాలుగు వేలు తీసుకోవచ్చుట కదా. అలక చెప్పింది. అది శాస్త్రి గారికి ఇచ్చేయవచ్చును.
పక్కా ప్లాను వేసేసి నట్టున్నావు
మీరు కూడా వస్తే బాగుంటుంది
నేను వెళ్ళుతున్నాను ఆఫీసు కి
పిలచినా బిగువటరా భళిరా

ఆఫీసు కు వచ్చానన్న మాటే కానీ మా బాసు నా అప్లికేషను మీద నాట్ అప్రూవ్డ్ అని రాసేస్తే బాగుండునని అనుకొన్నాను.  సుమారు 2.30 గం// కి ఫోను గణగణ మంది.

డైరక్టర్ హియర్
యువర్ శిష్యా హియర్  (నేను ఆయన దగ్గర Ph.D చేశాను అందుచే నన్ను అల్లాగ కూడా పిలుస్తారు )
హహ్హా, ఏమిటీ అత్యవసర కోటాలో స్కూటరు ఎడ్వాన్స్  కావాలా నీకు
అబ్బే వద్దండి
ఓ. కే గుడ్ లక్
థాంక్యూ సర్

చివరి ఆశ కూడా ఆవిరై పోయింది. ఇప్పుడు స్కూటర్ తప్పేటట్టు లేదు. ఇంకో రెండు వందలు నెల జీతంలో కట్. అయిపోబోయిన సొసైటీ లోను కంటిన్యూ  అవుతుందని  చింతించితిని.

నీ ఆశా  అడియాసా  చేజారే  మణి పూసా   లంబాడోళ్ళ రాందాసా
గుండెల్లో గునపాలే  గుచ్చారే  మీవాళ్ళు    గుండెల్లో ఆఆఆ గుండెల్లో

అని పాడుకున్నాను. ఓ గంట తర్వాత అలక చెక్కు పట్టుకొచ్చి చూపించింది. రేపు నేను మీ ఎకౌంటులో డిపాజిట్ చేస్తానని చెప్పింది. సాయంకాలం మా  ఆవిడ చెప్పింది ఆల్విన్ పుష్పక్ బాగుందండి చూడడానికి. సిల్వర్  గ్రే కలర్ ది సెలక్టు చేసాం.  లాంబ్రెట్టా నచ్చలేదు నాకు. అయినా మన హైద్రాబాదు ది మనం కొనాలి కదా,. రిజిస్ట్రేషను అది వాడే చేయిస్తానన్నాడు.  అంతా కలిపి 11650 మాత్రమే. రేపు ఒంటి గంట కి అంతా రెడీ చేసి పెడతానన్నాడు.  మనం వెళ్ళి తెచ్చుకోవడమే. వెరీ సింపుల్ అని ప్రకటించింది. నేను ఇంక చేయునదేమి లేక, లేని ఉత్సాహం తెచ్చుకొని సరే కానిమ్ము అని అనుమతి ఇచ్చితిని.

మర్నాడు ఉదయం నించి మా ఇంట్లో సన్నాహాలు మొదలయ్యాయి. 7 గం// కి  పూజారి గారు వచ్చారు. నా నక్షత్రం మాఆవిడ నక్షత్రం కలిపి గుణించారు. తారా బలం అన్నారు. బొటన వేలితో మిగిలిన అన్ని వేళ్ళ ముణుకులు లెఖ్ఖపెట్టేరు. పంచాగం తిరగేసారు. మధ్యాహ్నం 1.౦6 గం// కి బండి తీసుకోండి. దివ్యంగా ఉంది ముహుర్తం అన్నారు. మా ఆవిడకి సందేహం వచ్చింది.

గురువు గారూ ముహూర్తం అంటే  డీలర్ దగ్గరి నించి బండి తీసుకోవడమా లేక బండి నడపడమా.

బండి తీసుకోవడం. కావాలంటే తరవాత పూజ చేసి బండి కింద నిమ్మకాయలు పెట్టి తొక్కించి నడపడం మొదలు పెట్టవచ్చు.

మరి టౌను నించి 8 కి.మీ ఉంది కదా మన కాలనీ. నడిపే తీసుకురావాలి కదా మరి ఎల్లా?

అమ్మా అక్కడే పూజ చేయించి తీసుకు రావచ్చు గదా మా అబ్బాయి ఉవాచ.

అల్లా చేయించి తీసుకు రావచ్చా పూజారి గారూ

భేషుగ్గా తీసుకు రావచ్చు.

సరే మీరు 11.30 గం// కి వచ్చేయండి. పూజా సామాగ్రి మీరే తీసుకు వచ్చేయండి. అని వారికి ఓ వంద రూపాయలు ఇచ్చి పంపించింది.

శాస్త్రి గార్కి, డీలరుకి, సదానంద్ కి టెలిఫోను చేసి ప్రోగ్రాము చెప్పేసింది.  సరిగ్గా 11.30 గం// కి మా ఇంటినించి  శాస్త్రి గారు, వారి భార్య, నేను, మా ఆవిడ, మాపిల్లలు ఇద్దరు, సదానంద్, పూజారి గారు బయల్దేరాం శాస్త్రి గారి కారులో. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు రోడ్డు కిరువైపులా నుంచొని జయ జయ విజయీ భవ అని ఆశీర్వదించారు. 11.45 గం// కల్లా డీలరు గారి కార్యాలయం కి చేరిపోయాం. అక్కడ ఫార్మాలిటీసు అన్నీ పూర్తి అయ్యిం తరువాత 12.35 కల్లా పూజ మొదలు పెట్టేసారు పూజారి గారు. ఒంటిగంటా ఐదు నిముషాలకి పూజ అయిపోయింది. ఓ నిముషం తరువాత డీలరు గారు నాకు స్కూటరు తాళంచెవులు ఇచ్చారు. అఫీషియల్ గా ఈ బండి ఇక మీదే మీదే మీదే అని ముమ్మారు ఉద్ఘాటించారు. సభాసదు లందరూ చప్పట్లు కొట్టారు. ఉత్సాహం వచ్చిన నేను కూడా, అప్పు ఇచ్చిన శాస్త్రి గార్కి, బండి ఇచ్చిన డీలరు గార్కి, నెత్తి నెక్కి ఈ బండి కొనిపించిన మా ఆవిడ గార్కి, పూజ చేసిన పూజారి గార్కి, ఇప్పుడు కొత్తబండి నడపబోయే సదానంద్ కి, ఆశీర్వదించడానికి పనులన్నీ మానుకొని వచ్చిన శ్రీమతి శాస్త్రి గార్కి అందరికి యధాశక్తి ధన్యవాదాలు, కృతజ్ఞతలు అంటూ వోట్ ఆఫ్ థాంక్స్ చెప్పేసాను.

పూజారి గారు ముందుకు వచ్చి ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టుట అను కార్యక్రమం ఉన్నది. కొట్టు వారు అందరూ వచ్చి కొట్టేయండి అన్నారు. వచ్చిన వాళ్ళందరం యధాశక్తి బలం ఉపయోగించి కొట్టేసాం పూజారి తో సహా. అప్పుడు డీలరు గారు కూడా వచ్చి కొబ్బరి కాయ కొట్టి  సుఖ డ్రైవింగ్ ప్రాప్తిరస్తూ అని మార్వాడీ భాషలో దీవించాడు. చివరగా నిమ్మకాయలు తొక్కించు కార్యక్రమం కోసం సదానందు ముందుకు వచ్చాడు. అప్పుడు డీలరు గారు న న న అని నహీ నహీ నహీ అని కూడా అన్నాడు. మా అందరి కేసి చూసాడు అప్పుడు కహా హై. సార్ నడిపితే బాగుంటుంది కదా అన్నాడు. నాకు తొక్కడం రాదు అన్నాను. మా ఆవిడ నాకేసి గుర్రుగా చూసింది. తొక్కడం ఏంటి ఇంకా సైకిలు భాషేనా.  డ్రైవింగ్ అనాలి అని కోప్పడింది. అల్లాగే అన్నాను.

ఏం పరవాలేదు గాడీ ఇస్టార్టు చేసి బండి న్యూట్రల్లో పెట్టి నిమ్మకాయల మీద నించి తోసేస్తే సారు డ్రైవు చేసినట్టే అని డీలర్ విశదీకరించాడు. నేను పట్టుకుంటాను బండి పడకుండా అని హామీ ఇచ్చాడు. వాల్ రైటు వాల్ రైటు అన్నారు అంతా. నాకు తప్ప లేదు. నేను రెండు కాళ్ళు రెండు  వైపులకి  వేసి సీటు మీద కూర్చున్నాను. రెండు చేతుల తోటి హాండిల్ పట్టుకున్నాను. సదానంద్ స్టార్ట్ చేసి న్యూట్రల్లో పెట్టాడు. పూజారి గారు రెండు నిమ్మ కాయలు ముందు చక్రం కింద రెండు వెనక చక్రం కింద పెట్టి ఇంకో రెండు నాల్గైదు గజాల దూరం లో పెట్టాడు. కింద వాటిని పచ్చడి చేసి ముందు వాటి రసం చక్రం తో పిండించాలన్న మాట.

డీలరు గారికి ఇంకా ఉత్సాహం వచ్చింది. అమ్మగారూ  మీరు కూడా కూచోండి అన్నాడు.

మా ఆవిడ వెంటనే వెనక సీటు ఎక్కేసింది.

రెడీ వన్, టూ, త్రీ తొయ్యండి అన్నాడు డీలరు

ప్రభా నువ్వు మీ ఆయన భుజం మీద చెయ్యి వెయ్యి, శాస్త్రి గారి భార్య సలహా

పూజారి గారికి కూడా సరదా పుట్టేసింది. రెండో చెయ్యి నడుం మీద వేసేయమ్మా అన్నాడు.

బండి తొయ్యబడింది. అదే సమయంలో మా ఆవిడ ఒక చెయ్యి నా భుజం మీద, రెండో చెయ్యి నా నడుం మీద వేసింది. నా నడుం మీద చెయ్యపడగానే నాకు చక్కిలిగింతలు పుట్టుకొఛ్ఛాయి. ఖళ్ళుఖళ్ళూ మని నేను నవ్వేసాను. హాండిల్ మీద చేతులు పట్టు తప్పాయి. స్కూటర్ గజ గజా వణికింది. అపాయం శంకించి మా ఆవిడ ముందుకు దూకేసింది. ఆపోజిట్ డైరెక్షన్ లో స్కూటరు ఒరిగింది. వెనక సీటూ ముందు సీటూ పట్టుకొని బండి ని బాలన్స్ చేస్తున్న డీలరు మీద మా ఆవిడ పడడం ఆయన వెనక్కి పడడం, స్కూటర్ ఇటు వైపు పడడం, నా కాలు ఒకటి గాలిలో మిగతా శరీరమంతా స్కూటర్ కిందా, నా తల నిమ్మకాయల మీద, డీలరు గారు రోడ్ మీద, వారు ప్రేమగా పెంచుకొన్న వారి బొజ్జ మీద మా ఆవిడ అన్నీ క్షణ కాలంలో జరిగిపోయాయి. మా ఆవిడ, మా స్కూటరు క్షేమం. పాపం డీలరు గారిని లేపడానికి నలుగురు అవసరమయ్యారు. అంతదాకా నా శరీరం  స్కూటర్ కింద, నాకాలు గాలిలో నే ఉన్నాయి. సీతారామ కల్యాణం సినీమా లో శివ ధనుస్సు కింద పడ్డ యన్.టి వోడు  అవమాన భారంతో కుంగి పోతుండగా తీరుబడి గా నడుచు కొని వచ్చిన హరనాధ్ లాగ, వచ్చిన సదానంద్ స్కూటర్ ఎత్తి నన్ను స్కూటరు భారం నించి విముక్తుణ్ణి చేసాడు.

నా వాహన యోగం ఎల్లా ఉన్నా, నా వాహనానికి వాహన యోగం పట్టింది. నర వాహనం. నిమ్మ కాయ తొక్కించడంతో సహా.