మా ఆవిడ ముచ్చట్లు

కొంతమందికి ఊత పదాలుంటాయి. కాని మాఆవిడకి ఊతవాక్యాలే ఉన్నాయి. నో పదమ్సు, ఓన్లీ వాక్యమ్స్ అన్నమాట. మాపెళ్ళైన మరుసటి రోజు మనుగుడుపులు, మిగతా కార్యక్రమం నిమిత్తం మాఆవిడ, ఆమె బంధువులు నలుగురైదురుగురు మాఇంటికి విచ్చేసారు, రాత్రి సుమారు పది గంటలకి. భోజనాలు చేసి వెంటనే పడకలు వేసేసారు. మాఆవిడతో మాట్లాడదామని ప్రయత్నించాను కాని కుదరలేదు. నాజాతకం అల్లాంటిది లెండి. నో పెళ్ళిచూపులు. మారేజి లుక్స్ పెళ్ళిలో తెరతీసిన తర్వాతే నన్నమాట. పెళ్ళికి ముందు మాఆవిడ నాఫొటో చూసింది కాని నాకు ఆభాగ్యం కూడా కలుగలేదు. పెళ్ళికి సరిగ్గా పన్నెండు రోజుల ముందు మా పితాశ్రీ గారు నాకు ఓ టెలిగ్రాము పంపారు. మారేజి ఫిక్స్డ్, స్టార్ట్ ఇమ్మీడియట్లీ. అని. ఆటెలిగ్రాము పట్టుకొని మాబాసుగారి దగ్గరకెళ్ళి చూపించాను. శలవా కుదరదు అన్నాడు. ఇప్పటికే నువ్వు రెండు మాట్లు పెళ్ళి అని శలవు పెట్టావు అని కోప్పడ్డాడు. ఒక్కమాటే సారూ, మాఅన్నయ్య పెళ్ళికి అదీ రెండేళ్ళ క్రితం అని అన్నాను. సరే ఓ వారం తీసుకో అన్నాడు. ఆయనతోటి బేరమాడి ఎల్లాగైతేనేం, 15రోజులకి ఒప్పించాను. జోర్హాట్ నించి రావడానికి, పోవడానికి ఓవారం తీసేస్తే మిగిలేది ఓవారం అన్నమాట. .ఆవిషయం మానాన్నగార్కి కూడా తెలియపర్చాను. అందువల్ల కార్యక్రమాలన్నీ వెంటవెంటనే ఏర్పాటు చేసేరన్నమాట. సరే అసలు కధలోకి వస్తే, తెల్లవారి నేను డాబామీద నించి కిందకి వచ్చేటప్పటికి, ఇల్లంతా హడావడిగా ఉంది. ఇంట్లోవాళ్ళంతా నన్నుజాలిగా చూసారు. మాబావ “పాపం పసివాడు” అని నవ్వాడు. నాకు అర్ధంకాలేదు. సిగరెట్టు కాల్చుకోడానికి వీధిలోకి వచ్చాను. అప్పుడు చూసాను ఓచెంబు, రెండుగ్లాసులు, ఓచాప పెట్టుకొని మాఆవిడ వీధి అరుగు మీద కూర్చుంది. పక్కనే కొంచెం దూరంగా కుర్చీలో వారిఅక్కగారు ఆసీనులయ్యారు. అప్పుడు అర్దం అయింది నాకు. ఔరా అనుకున్నాను, కోపం వచ్చింది, దుఃఖం వచ్చింది. ఏంచెయ్యాలో తోచలేదు. అప్పుడు మాఅవిడతో అన్నాను. కొంచెం జాగ్రత్త పడవచ్చు గదా అని. వారి అక్కగారు కిసుక్కున నవ్వేరు. మాఆవిడ అక్కకేసి చూసింది, ఆకాశంకేసి చూసింది, మాఇంటిఎదురుగా ఉన్న చెరువుకేసి చూసి, నాకేసి చూసి అంది “ మీ మొహం, మీకేం తెలుసండి” అని. ఇవి మాఆవిడ నాతో మాట్లాడిన మొదటి మాటలు, ప్రేమ సంభాషణ, తొలి పలుకులు, లవ్ నతింగ్స్, మొహబ్బతికి బాతేం. మొదటిసారి పతిదేవుడితో సతీపతివ్రత మాట్లాడిన వాక్యం విన్నప్పుడే అనుకున్నాను మదీయ కొంప కొల్లేరు అవుతుందని. మళ్ళీ రెండునెలల దాకా ముహూర్తాలు లేవురా, మళ్ళీ రావల్సిందే అని మానాన్నగారు నిర్ణయం చెప్పేసారు. మాబావ “పాపం వీడి పునస్సంధాన ముహూర్తం లస్కుటపా అయింది” అని జాలిపడ్డాడు.

మళ్ళీ మాబాసుగారిని బతిమాలి, ప్రాధేయపడి ఆర్నెల్లతర్వాత 15రోజులు శలవు తీసుకొని, వచ్చి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని, హనీమూన్ రైల్లోనే కానిచ్చేసి, కాపురానికి జోర్హాట్ తీసుకొచ్చేసాను. మర్నాడు మాఆవిడ వంట మొదలు పెట్టింది. పొద్దున్నే ఉప్మా చేయడానికి ఉపక్రమించింది. నేను ఆఫీసు కి వెళ్ళడానికి రెడీ అయ్యి కూర్చున్నాను ఉప్మాకోసం. మాఆవిడ వంటింట్లోంచి వచ్చి కరివేపాకు తీసుకురాలేదా అంది. నువ్వు రాసిన లిస్టులో సామాన్లన్నీ తీసుకొచ్చాను. నువ్వుకరివేపాకు రాసిఉండవు నేను తీసుకు రాలేదు అన్నాను. పెళ్ళానికి మల్లెపూవులు తీసుకురావాలని, కూరల్లోకి కరివేపాకు తీసుకురావాలని కూడా చెప్పాలటండి అంది. నాకూ గుర్తు లేదు అంటూ నేను రాజీకి వచ్చేసాను. మాఆవిడ నాకేసి చూసింది, బెడ్ రూములో వాళ్ళ గ్రూపుఫొటొకేసి చూసింది, (జొర్హాట్ వచ్చిన రోజునే బెడ్ రూములో మేకుకొట్టి వాళ్ళ ఫొటొ ఒకటి తగిల్చేసింది.) వంటింట్లో గూట్లో కూర్చున్న రమాసహిత వెంకటేశ్వరస్వామిని చూసింది, ఆకాశంలోకి చూసింది. చూసి “ఇల్లాంటి వారిని కట్టపెట్టే వేమిరా దేవుడా” అని విచారంగా అంది. ఇది నాకు అనుభవంలోకి వచ్చిన రెండో ఊతవాక్యం. గమనించారో లేదో మీరు, మాఆవిడ దేవుడిని కూడా ఏకవచనంలో సంభోదించిది, పైగా రా అనికూడా అంది, నన్నుమటుకు ‘వారి’ అనే అంది. పతివ్రతా లక్షణాలు లేకపోలేదు అనుకొని సంతోషించాను (ఇంతటి అల్ప సంతోషివి కాబట్టే అది నిన్ను అల్లా ఆడించేస్తోందిరా అని మావాళ్ళు అంటారు). సరే కరివేపాకు రహిత ఉప్మానే సేవించి నేను ఆఫీసు కెళ్ళి పోయాను. ఆఫీసు కెళ్ళాక ఒక సందేహం వచ్చింది. ఊతవాక్యాలు అనేటప్పుడు మాఆవిడ దిక్కులు, వాళ్ళకేసి, వీళ్ళకేసి ఎందుకు చూస్తుందీ అని. ధైర్యంచేసి మాఆవిడను అడిగేసాను. సినీమాలు చూడరా అంది. నాగేశ్వరరావు ఏంచేస్తాడు? గుమ్మడికేసి చూస్తాడు, సావిత్రికేసి చూస్తాడు, కిటికీలోంచి శూన్యంలోకి చూస్తాడు. ఆతర్వాత వాళ్ళు కూడా ఈయనకేసి చూస్తారు. అప్పుడుకాని బరువైన డైలాగు వదలడన్నమాట అంది. ఐ సీ అనుకున్నాను. నేను నాగేశ్వరావు వీరాభిమానిని అనికూడా చెప్పింది. నాగేశ్వరరావుకి ప్రేమలేఖ కూడా వ్రాసిందిట. ఆయన కాకపోతే ఎవడైతే ఏంటి అని నన్ను పెళ్ళి చేసుకునేందుకి ఒప్పుకుందిట.

ఓరోజున నేను ఆఫీసు నించి వచ్చేటప్పటికి చాలా సీరియస్ గా ఉంది మాఆవిడ. మద్యాహ్నం వాళ్ళ అమ్మ గారింటి నించి ఉత్తరం వచ్చింది. ఏంటి సంగతులు అని అడిగాను. “చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత మహాదేవా” అంది. మాపెళ్ళి సంబందం కుదిరేముందు, ఇంకోఆయన ఈవిడని చూడ్డానికి వచ్చాడుట. హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడట, ఐదారు వందలు తెచ్చుకుంటున్నాడట. నిశ్చయం చేసుకుందా మనుకుంటున్న సమయంలో మాసంబంధం తెలియడం జరిగిందిట. అప్పటికే నేను నాలుగు అంకెల జీతం తీసుకుంటున్నానని నన్ను పెళ్ళి చేసుకుందిట. ఇప్పుడు ఆ శేఖరంగారు సివిల్స్ కి సెలక్టు అయ్యాడట. రేపో మాపో IAS ట్రైనింగు కు వెడుతున్నాడట. ఏంచేస్తాం “చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత మహాదేవా” నాఖర్మ ఇలాగయింది అని అంది.

ఈ ఊతవాక్యాలు రోజుకి కనీసం ఒకటి రెండు మాట్లైనా అనకపోతే ఆవిడకు తోచదు. ఇవికాక ఇంకా కొన్ని ఉన్నాయి. కాని వీటంతటి తరుచుగా ఉపయోగించదు. భరించువాడు భర్త అంటారు. కాబట్టి ఆవిడ ఏమన్నా భరించక తప్పుతుందా.


జ్ఞానసముపార్జన

ఈ మధ్యన తెగ జ్ఞానం సంపాదించేస్తున్నానేమోనని అనుమానం డౌటు కలిగింది. ఎడా పెడా, కుడీ ఎడమా, రెండు చేతుల తోటీ జ్ఞానం అర్జించేస్తున్నానని నమ్మకం కూడా కలిగిపోతోంది. గత మూడేళ్ళుగా రిటైరయ్యి ఇంట్లో కూర్చున్నప్పటినించీ నేను ఇల్లా జ్ఞాని నయిపోతున్నానన్నమాట. పాపం మాబాసుగారు అనేవాడు “బొత్తిగా జ్ఞానం లేదోమిటోయి నీకు” అని. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే అయన కూడా సంతోషిస్తాడను కుంటాను. రిటైరయినప్పటి నించీ పేపరు క్షుణ్ణంగా కంఠతా పట్టేయడం, టీ.వి చూడడం బాగా అలవాటు అయిపోయింది. ముఖ్ఖ్యంగా టీ.వి ద్వారా చాలా విషయాలలో చాలా జ్ఞానం గడించేసాను. మీకు అనుమానంగా ఉందా? మీరు కూర్చుని ఎవరితోటో మాట్లాడు తున్నప్పుడు, కడుపులో కలుక్కుమంటే అది ఏరోగానికి సంకేతం? మీకు తెలుసా? నాకు తెలుసు. వంకాయని ముచిక నించి నాలుగు భాగాలుగా కోసి, అందులో బంగాళాదుంప కూర దట్టించి, బెండకాయతో బిగించి చేసే కూర నేమని పిలుస్తారో మీకు తెలుసా? నాకు తెలుసు. మొన్న సల్మానుఖానుడు ఎవరికి టెలిఫోను చేసాడో కూడా నాకు తెలుసు. ఒబామాగారూ, ఆయనెవరూ, పేరు మర్చిపోయాను, బ్రిటిష్ ప్రదాని, వాళ్ళిద్దరూ ఏంమాట్లాడుకున్నారో కూడా నాకు తెలిసిపోయింది. చూసారా మతిమరపు కూడా జ్ఞాని లక్షణం అంటారు. అది కూడా నాకు వచ్చేసింది. ఇంతేనా అంటారా? మొన్న ఆయనెవరో పంచె కట్టుకొని, కండువా వేసుకొని, విభూతి రాసేసుకొని, కుంకం బొట్టుపెట్టేసుకొని, ముందుకూ వెనకకూ ఊగుతూ చెప్పింది విని ఎన్నోరకాల కృష్ణులున్నారని కనిపెట్టేసాను. భారత కృష్ణుడు, భాగవత కృష్ణుడు, గోలోక కృష్ణుడు, విష్ణు కృష్ణుడు, పరవాసుదేవుడు అని. ఇదంతా జ్ఞాన సముపార్జన కాక మరేమిటండీ. వంటల శాస్త్రం, రోగశాస్త్రం, సిన్మాశాస్త్రం, రాజకీయ శాస్త్రాలే కాక ఆధ్యాత్మిక శాస్త్రంలో కూడా పట్టు దొరికి పోతోందన్న మాట.

ఇంత జ్ఞానం ఇల్లా సంపాయించేస్తుంటే బ్రహ్మజ్ఞానిని అయిపోతున్నానేమోనని అనుమానం వచ్చేస్తోంది. మొన్నోకల కూడా వచ్చింది. బాసింపట్టు వేసుకొని, కళ్ళు తెరిచి నేను తపస్సు చేసుకుంటున్నాను. రెండు కళ్ళకి ఎదురుగా రెండు టీ.వీ లు, చెరోపక్కా రెండు చెవులకి ఇంకో రెండు టీ.వీ లు (చెవులకి టీవీ లు ఎందుకు? రేడియో చాలదా అని ప్రశ్నలు వేయకండి. నా కల, నా ఇష్టం) ఏకాగ్రతతో వింటున్నాను, కంటున్నాను (తప్పుడర్ధాలు తీయకండి) నాచుట్టూ బుల్లి టీవీలు, చిన్నటీవీలు, పెద్దటీవీలు గుట్టలు గుట్టలు గా పేరుకుపోతున్నాయి. మధ్యలో మొబైల్స్ కూడా దూరిపోతున్నాయి. శిరస్సు పై దాకా గుట్టలు పేరుకు పోయాయి. ఎంత కలైనా, కనీస జాగ్రత్త తప్పదని, గుట్టల మధ్య నించి ముక్కు బయటకు పెట్టి, ఈ ఛానలాయనమః, ఆఛానలాయనమః అంటూ ఇంకా ఘట్టిగా తపస్యించేసాను. సీను కట్ చేస్తే అచట ఇంద్రుడి కి మంట పుట్టు కొచ్చింది. బహుశా ఆయన కూడా నా ‘మౌన నిరశన వ్రతం’ చదివేడేమో, డైరక్టుగా ఘృతాచి ని పంపించేసాడు. ఆవిడ రావడం తోటే, నా చుట్టూ ఉన్న గుట్టలు ఎగిరిపోవడం మొదలుపెట్టాయి. నాకు ఖంగారు పుట్టింది. ఒక మంచి LCD, Plasma TV పట్టుకుందామని ప్రయత్నిస్తున్నాను. అవి దొరకడం లేదు. ఈలోపు ఘృతాచి పాట పాడేసి, డాన్సాడేసి వెళ్ళిపోయింది. మెలకువ వచ్చేసింది. టీవీ దేవుడు ప్రత్యక్ష మయ్యేదాకా తపస్సూ సాగలేదు, టీవీ లూ దొరకలేదు, వచ్చిన ఘృతాచి కాస్తా మాట్లాడ కుండానే వెళ్ళిపోయింది. కలలో కూడా నాజాతకం ఇంతేనా అని దుఃఖించాను. (మొన్నామధ్యన ఎవరో ఘృతాచి ఎడ్రస్సు కావాలన్నారు, బహుశా నాకు తెలియకుండా నాకలలోకి ఆయన వచ్చి ఘృతాచిని లేవతీసుకు పొయేరేమో అని నా అనుమానం)

ఈ కల కూడా వచ్చింది కాబట్టి జ్ఞాని నయిపోతున్నానన్న నా నమ్మకం ఇంకా పెరిగింది. కానీ ఎప్పటి లాగానే మాఆవిడ నా ఆశలమీద నీళ్ళు చల్లేసింది. నాలుగు రోజులక్రితం ఓమిత్రుడి దగ్గరకు వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చాను. ఆకలి దంచేస్తోంది. డైనింగు టేబులు దగ్గర కూర్చున్నాను. శ్రీమతిగారు టేబులు మీద ఒక పీట పెట్టింది. ఆ పీట మీద పళ్ళెం, పళ్ళెం చుట్టూ ఆనపకాయ ముక్కలు, గుమ్మడి కాయ ముక్కలూ ఉన్నాయి. పళ్ళెం అంచులనించి మధ్యదాకా, టమాటా, ఉల్లిపాయల చక్రాలు, కేరట్టు,దోసకాయ ముక్కలు, పచ్చి,ఎండు మిరపకాయలు, మధ్యదాకా విస్తరించి ఉన్నాయి. మధ్యలో ఓ కాబేజి ఆకు ఉంది. దానికింద ఎత్తుగా ఉంది. పైన వేయించిన జీడిపప్పు, కిస్మిస్సు, బాదాము పప్పులు ఉన్నాయి. జీడిపప్పు తీసుకొని నోట్లో వేసుకుందామని ప్రయత్నించాను. గరిటతో నాచేతి మీద ఒఖ్ఖటుచ్చుకుంది. ఇది వాసన చూసి ఏంకూరో చెపితే, ’వంకాయ బెంగుళూరు మిర్చి మసాలా ఢాం చేసి పెడ్తానంది. ఢాం కాదు దం అన్నాను నేను. మొన్ననే చూసాం ఓఛానలులో. తెల్లబట్టలు వేసుకొని, పొడుగాటి తెల్లటోపీ పెట్టుకొని, తెల్లగ్లవుజ్స్ తొడుక్కొని ఇంగ్లీషులో మాట్లాడుతూ, తెలుగులో నవ్వుతూ, ఒకాయన, బెంగుళూరు మిర్చి వంకాయ మసాలా దం, చేయడం ఎల్లాగో నేర్పించేసాడు. అది తిన్న ఆ యాంకరమ్మ కళ్ళు చక్రాల్లా తిప్పుతూ, అయ్య బాబోయ్ హింత బాగుందేమిటీ అంటూ కింద పడబోయింది. సందు దొరికింది గదాని, తెల్లబట్టలాయన పట్టేసుకున్నాడు. అది చేసిపెట్టమని అడిగాను మాఆవిడను. ఇప్పుడు ఇది అది కాదని తేలిపోయింది. కానీ ఏమిటో తెలియడం లేదు. ఆకలి దంచేస్తోంది కాబట్టి ఓటమి ఒప్పేసుకొన్నాను. కాబేజీ ఆకు తీస్తే దానికింద అరటికాయ ఉప్మాకూర ఉంది. దీనికింత బిల్డప్పా అని ఆశ్చర్యపోయాను. ఏంవండాం, ఎంత రుచిగా వండాం అన్నది కాదు ప్రశ్న, ఎంత అందంగా అలంకరించాం అన్నది జవాబు అని శెలవిచ్చింది.

ఇప్పుడు మీరే చెప్పండి, నాకు జ్ఞానం అబ్బిందా? లేదా? తెలిసి జవాబు చెప్పక పోయారో నేను చెప్పను కాని, భేతాళ కధలు గుర్తు చేసుకోమని మనవి.

తెలుగదేల అనే అంటాం

“తెలుగదేల యన్న” అంటూ మొదలు పెట్టి “దేశ భాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయల వారు ఓ పద్యం రాశారని విన్నాం. అంటే ఆకాలంలో కూడా తెలుగు అదేలా అనే వారున్నారని మనం అర్ధంచేసుకోవాలని మా బండోడు వక్కాణించాడు. తెలుగుమీద ఇప్పుడు బోలెడు అభిమానం ఉన్నా, చిన్నప్పుడు తెలుగంటే నాకు చాలా భయం ఉండేది. మా మాష్టార్లు, ఒకరిద్దరు తప్పితే, మాకు టిఫిన్లు బాగా పెట్టేవారు. పెసరట్టు, మినపరోస్ట్ వీపుమీద, కొంచెం లైట్ గాపడితే పెసరట్టు, అరచేతి ముద్రలు కూడా ముద్రిస్తే మినపరోస్ట్ అని అర్ధం. తొడమీద గిల్లితే పకోడి అనీ, మెలిపెట్టి గిల్లితే పునుకులు అనీ, బుగ్గమీద పొంగిస్తే బూరెలు అనీ, అరచేయి వెనక్కి తిప్పి ముణుకులు వాయగొడ్తే కజ్జికాయలు, మైసూర్ పాక్ అనీ అనేవాళ్ళం. ఈభయం కాస్తా 4&5 తరగతుల్లో కోపంగా మారింది. అప్పటిదాకా, అల, వల లాంటి చిన్నపదాలు Dictation లోచెప్పేవారు. 4&5 తరగతుల్లో రెండు, మూడు అంతస్తుల అక్షరాలు చెప్పేవారు, విష్వక్సేనుడు, అదృష్టము లాంటివి. తరగతి పెరుగుతున్న కొద్దీ అంతస్తులు పెరిగేవి. రె౦డవఫారంకి వచ్చేటప్పటికి, అశ్వత్థవృక్షము, శాస్త్రనిర్దిష్టము, మత్సాకృతి ఇత్యాదులు. చెప్పటమేకాదు, పలకమనేవారు. మూతి అష్టవంకరలు తిప్పి,కాళ్ళు చేతులు కొట్టుకుంటూ పలకడానికి ప్రయత్నించే వాళ్ళం. కాని ఎక్కడో దొరికి పోయేవాళ్ళం. మాతెలుగు మాష్టారికి ఓ విజ్ఞాపన పత్రం ఇచ్చుకున్నాము. ఇలా రెండు మూడు అంతస్తుల అక్షరాలు ఒకటి రెండు కన్నా ఎక్కువ ఉన్న పదాలు డిక్టేషనులో ఇవ్వకూడదు అని, తప్పుచేస్తే పకోడీలు తప్ప మినపరోస్ట్లు, కజ్జికాయలు పెట్టరాదు అనిన్నూ విన్నవించుకున్నాము. ఏకళనున్నాడోకానీ మొదటిదానికి ఒప్పుకున్నారు కానీ రెండవదానికి ఘట్టిగా నో అనేసారు. గుడ్డిలో మెల్ల అని సంతోషించాము. కానీ మాతెలుగు మాష్టారు అంత రాజకీయం చేస్తారనుకో లేదు. రెండు మూడు అక్షరాలవే ఇచ్చారు., అర్ఘ్యము, స్మృతి, దంష్ట్రము, ఇత్యాదులు. పెనం మీదనించి పొయ్యలో పడ్డట్టయింది మాపని. రెండు మూడు అక్షరాలవే వ్రాయలేక పొతున్నారా వెధవ ల్లారా అంటూ అందరికీ మినపరోస్ట్ తినిపించేసారు. నామట్టుకునాకు ఒక ఘోరమైన పదము సుమారు అరడజను రోస్ట్ లు ఇప్పించింది. చ్ఛేద్యము అన్న పదం పాఠంలో రెండు మాట్లు వచ్చింది. రెండుమాట్లు దాని ముందర అక్షరాలు వేరు. ఒకటి సరళమైనది, రెండోది రెండంతస్తుల అక్షరం. ఆయన పలకమంటాడు. మనకి కుదిరి చావదు. సరళ అక్షరయుక్త చ్ఛేద్యమునకే రెండు మినపరోస్ట్లు దొరికాయి. చ కి ఎ కారం, ఆపైన దీర్ఘం, కి౦ద చ తోటి వత్తడం, పైగా కింద చ గుండెలో గునపం ది౦చడం, ఇవన్నీ ఏకకాలంలో ఉచ్చరించడం మాటలా. రెండో ఫారం చదువుతున్న చిన్న బుర్రకి, అందులో మట్టి తప్ప సరుకు లేని అమాయకపు బుర్రకి, కుదురుతుందా అని నేను ప్రశ్నిస్తున్నాను. కష్టపడి బిగపెట్టి చ్ఛే అన్న వెంటనే ద్యము అనేటప్పటికి అప్రయత్నంగానే ద కి కూడా గునపం దిగిపోయేది. ద్య కి గునపం దిగడం, మాష్టారు మినపరోస్ట్ తినిపించెయ్యడం ఏక కాలంలో జరిగి పోయేవి. .అంతవేగంగా ఆయన ఎల్లా రియాక్టు అయ్యేవాడో నాకు అర్ధం అయ్యేది కాదు.

ఈ మాష్టారే్ పిల్లల్లో ఒరిజినాలిటీ పెంచాలని అత్యుత్సాహ పడిపోయేవాడు. ఒక చిన్నకధ చెప్పి దాన్ని వ్రాయమనేవాడు. మేమంతా సరళపదాల తోటే వ్రాసేవాళ్ళం. కాని తెలుగు సారు కి దొరకకుండా తెలుగులో వ్రాయడం మావల్లకాదని తేలిపోయింది. 'ఒకడు మరొకడిని నీకు ఏమి జబ్బు?’ అని అడిగాడు అని వ్రాస్తే కూడా టిఫిను దొరికేది. `నీకేమి జబ్బు’ అని వ్రాయాలిట. విడి పదాలను కలపడానికి సవాలక్ష మార్గాలు అన్వేషించారు మన కవులు, వ్యాకరణవేత్తలు. వీటన్నిటికి సంధులు, సమాసం అని చాలా పేర్లే పెట్టారు. ముందు తరాలలో చిన్న చిన్న బుర్రలతో, చిన్న చిన్న కుర్రాళ్ళు నేర్చుకోవాలి కదా అని ఆలోచించకు౦డా వాళ్ళు అన్నేసి సూత్రాలు కనిపెట్టేసారు. ఒకదాని కంటే మరొకటి కఠినమైనది. సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి అంటూ ప్రతీదానికి అరపేజి కంఠతా పట్టాల్సి వచ్చేది. కంఠతా పట్టింది, వ్రాసేయడం, అప్ప చెప్పడం కొంచం కష్టం అయినా సాధించేవాళ్ళం. అది అన్వయించడానికి తాతలు దిగివచ్చేవారు. ఒక పదం ఇచ్చి విడగొట్టండనే వారు. రెండు పదాలు ఇచ్చి కలిపేయండనే వారు. ఈ విడగొట్టడ మేమిటో ఆ కలిపేయడ మేమిటో ఒక పట్టాన బో్ధపడేది కాదు. ఎల్లా విడగొడితే్ ఏంతంటా వస్తుందో. ఎన్ని కష్టాలు. అక్కడికి మా మాష్టారు తో మొఱ పెట్టుకున్నాం. సార్, ఇది మంచి పద్దతి కాదు. అలా కలిసిపోయిన వాటిని విడగొట్టడం పాపం అని. ఆయన ఓచిరునవ్వు నవ్వి, పోనీ లెండిరా ఆపాపం మనకెందుకు, ఈ రెంటినీ కలిపి పుణ్యం కూడబెట్టుకోండి అని అన్నారు. రెంటినీ కలపి పలకడం కన్నా, ఒకదాన్ని విడగొట్టడమే మాశరీరాలకు మంచిదనిపి౦చేలా చేసారు. ఈ సంధుల తొటే కొట్టుకు ఛస్తుంటే సమాసాలు వచ్చి పడ్డాయి. కర్మదారయ అన్నారు, తత్పురుష అన్నారు, ఒక దానికీ లింకు దొరికేది కాదు. చేతన్, చేన్, తోడన్, తోన్, అంటూ అవస్థ పడేవాళ్ళం. తోడన్ నే తోడలేక ఛస్తుంటే తోకలాగ తోన్ ఏమిటిరా అని ఏడ్చేవాడు మాబండోడు. ఈసమాసాల్లో కూడా చాలా గ్రేడు లున్నాయి. విశేషణ కర్మదారయ, ప్రధమా, ద్వితీయ అ౦టూ తత్పురష కి బోలెడు ఉ౦డేవి. ఒకటే కష్టంగా ఉ౦టే, మళ్ళీ అ౦దులో ఇన్ని రకాలా అని దుఃఖించేవాళ్ళం. `విగతభర్తృక` అన్న పదం నాకు బాగా తినిపించింది. దీని అర్దం ఇప్పటికీ నాకు సరిగ్గా తెలియదు. పోయిన భర్త కలది అనే అర్ధం వస్తు౦దను కుంటాను. ఆయన ఎవరో పోవడం ఏమిటో, పోయినాయన ఈవిడకు కలగడం ఏమిటో?. అసలు ఇలాంటి పదాలు కనిపెట్ట వచ్చా అని కోప్పడ్డాను. అప్పుడు మానవ హక్కుల కమిషన్ లేదు కాని, ఉంటే తప్పకు౦డా ఫిర్యాదు చేసేవాడిని. ఇలాంటి పదాలతో పిల్లలను హింస పెట్టడం నేరం అని కమిషన్ ను ఒప్పించడం పెద్ద కష్టం కాదు అనుకుంటాను. ఇంతకీ ‘విగతభర్తృక’ అన్నది ఏసమాసమో మీకు తెలుసా? ‘విగత’ ఉంది కదా అని విశేషణ కర్మదారయ అన్నాను. ఒక పెసరట్టు దొరికింది. ఏమైతే అవుతుంది అని ఏదో తత్పురుష అన్నాను . మినపరోస్ట్ తినిపించేసారు. పట్టు వదలని విక్రమార్కుడి లాగ మరేదో అన్నాను కజ్జికాయలు తినిపించేసారు. ‘స,శ,ష, ర,ఱ,ట,ఠ లు ప్రాణాలు తీసేసాయి. ఏది, ఎక్కడ, ఎల్లా, ఎప్పుడు, ఎ౦దుకు వాడాలో ఇప్పటికి నాకు సరిగ్గా తెలియదు.

సంధులు, సమాసాలు, విభక్తులు, భక్తులతోటి కుస్తీ పడుతుంటే, తీరుబడిగా, చిద్విలాసంగా నవ్వుతూ గురువులు, లఘువులు మా మీదకు దూకేసాయి. తోడుగా గణాలను తెచ్చుకున్నాయి. యగణం, మగణం, భగణం అ౦టూ హోరెత్తించేశాయి. మేము బిత్తరపోయి చూస్తుంటే ఉత్పలమాలలు, చంపకమాలలు, వాటికి కాపలాగా శార్దూలాలు, మత్తేభాలు పైనపడ్డాయి వికటాట్టహాసాలతో. ఇంకా మేమేమైనా మిగిలి ఉంటే మీద పొయ్యడానికి సీసంలను తోడుతెచ్చుకున్నాయి. ఒకళ్ళా, ఇద్దరా కవులు కొల్లేటి చాంతాడంత లిస్టు. ఒక్కొక్కడు కనీసం ఓఅరడజను వ్రాసిపడేసాడు. ఎవరు, ఎందుకు, ఏంవ్రాసాడో ఎలా గుర్తుపెట్టుకోవడం? నానా అవస్తలు పడేవాళ్ళం. గురువులను, లఘువులను గుర్తి౦చడం ఓ యజ్నం లాగ ఉండేది. లఘువులు కొంచెం తేలిక అనిపించినా, గురువులు కష్టం అయ్యేది. అన్నిచోట్లా గురువులు అంతేరా, ఓపట్టాన అర్ధంకారు అని విశదీకరించాడు మాబండోడు. ముందు అక్షరాన్ని బట్టి లఘువు కాస్తా గురువు అయిపోయేవాడు. ఈనాటి విద్యార్ధి రేపటి ఉపాద్యాయుడు అని బోదించేవారు మామాష్టారు. కొంతమంది లఘువులు ఎప్పటికి మారరు మన బండోడి లాగ అని చమత్కరించే వారు కూడాను.

పద్యాలు, ప్రతిపదార్ధాలతో దుంపతెగిపోయేది. కొన్నిపద్యాలు ఫరవాలేదు, కొన్ని తెలిసిన పదాలు దొరికేవి. కొన్నిపద్యాలలో ఒట్టు, ఒక్కటంటే ఒక్కటి కూడా తెలిసిన పదం ఉండేది కాదు. ఏదైనా ఒక పదం విడగొట్టితే అందులోంచి తెలిసినదేదైనా ఊడిపడేది. ’అట జని గాంచె భూమిసురుడు’ అంతదాకా ఈజీ అనిపించినా, ఆపైన  `అంబర చుంబి శిరఝరీ’ దుడుంగ్, ఫుడుంగ్, అంటూ పద్యం అయి పోయేదాకా ఒక్కమాట అర్ధం అయిచావదు. ‘ధాటీ ఘోట ఘరట్ట ఘట్టన మిళద్గ్రాషిష్ఠ’ నాబొంద, నాపిండాకూడు ఏమైనా అర్ధం అవుతుందా. అవి పలికేటప్పటికే ఆయాసం వచ్చేసేది. వీటి తోటే గుంజీలు తీస్తుంటే నానార్ధాలు అనేవారు. ఒకే పదానికి రెండు చోట్ల రెండర్ధాలు, కొండకచో ఇంకాఎక్కువ. మామాష్టార్లు మట్టుకు పద్యపాఠాలు చెప్పేటప్పుడు పరవశించి పోయేవారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిమాన కవి. ఆకవి పాఠం వచ్చిందంటే కొండొకచో కృష్ణుడి పాత్రలో లీనమైపోయిన యన్. టి. వోడు లాగ అయిపోయేవారు ఒక్కోపదానికి అర్ధం, వాటిలోని భావ చమత్కృతి విడమర్చి మరీ చేప్పేవారు.. 5,6 ఫారంలకు వచ్చేటప్పటికి వ్యాకరణం అంటే వ్యతిరేకత పూర్తిగా పోకున్నా తెలుగు లోని తేనెతీయందనాలు, మందార మకరంద మాధుర్యాలు అర్ధం అవటం మొదలు పెట్టేయి.

యస్.యస్.ఎల్.సి తోటి తెలుగు పాఠాలు అయిపోయాయి. కాలేజి కెళ్ళి ఊపిరి పీల్చుకున్నాం. లాటిన్, గ్రీకు భాషలు చాలా కష్టమైన భాషలు అంటారు. చిన్నప్పుడు తెలుగు అన్నిటికన్నా కష్టం అనిపించేది. అందుకే అనేవాళ్ళం తెలుగదేలా అని.

ఈ రోజు బ్లాగులో నా 239 వ దినం, వచ్చి నాల్గు అక్షంతలు వేసి వెళ్ళండి.

గమనిక : - మొదట ఈ టపా ఫిబ్రవరి 7, 2011 న పబ్లిష్ చేశాను. కానీ ఆ మధ్యన నా పొరపాటు వల్ల ఈ టపా డిలీట్ అయింది. టపాతో పాటు కామెంట్లు కూడా పోయాయి....