మా నాన్న గార్కి ఉన్నట్టుండి ఒక అనుమానం వచ్చింది. అక్కడెక్కడో నేను అస్సాంలోని జోర్హాట్ లో సుఖపడిపోతున్నానేమోనని. జీవితం అంటే సుఖాలే కాదు కష్టాలు కూడా ఉంటాయి, కాదు ఉండాలి అని తీర్మానించుకొన్నవారై నాకు ఒక ఉత్తరం వ్రాసారు.
“నాయనా పుత్రరత్నమా నీకు సంబంధాలు చూస్తున్నాను. వీలు చూసికొని వచ్చి పెళ్ళి చేసుకొని సంసార సాగరంలో దూకు” అని. నేను వెంటనే యమర్జంటుగా తిరుగు టపాలో జవాబు వ్రాసాను.
“నా ప్రియ జనకా, నా క్షేమం కోరు మీరు ఇటువంటి పని చేయ తగునా మీకిది తగదు తగదు. ఏదో నాలుగిళ్ళలో వారాలు చెప్పుకొని హాయిగా బతుకు తున్నాను. నన్నిటుల ఒక గూటి పక్షిని చేయ తగదు.” అని.
“ నేను పడుతున్నాను, మీ అన్నగారు పడుతున్నారు కష్టాలు. నువ్వు తప్పించు కుంటానంటే కుదరదు కాక కుదరదు.” అని మళ్ళీ వారు ఉత్తరంలో గంభీరంగా ఉద్ఘాటించారు.
అయినా ఈ తల్లిదండ్రులకు, ఇల్లా పిల్లలని ముఖ్యంగా మగపిల్లలని సంసార కూపంలో పడవేసి వాళ్ళు మునగలేక, తేలలేక ’హే కృష్ణా, ముకుందా, మురారీ’ అని పాడుతుంటే విని ఆనందించాలనే బలీయమైన కోరిక ఎందుకు కలుగుతుందో నాకు అర్ధం కాదు. ఆడ పిల్లల తల్లిదండ్రుల మనస్తత్వం అర్ధం చేసుకోవచ్చు. ఎంత త్వరగా ఈ అణుబాంబును ఎవరింట్లో నైనా పడవేసి బాధ్యత తప్పించుకోవాలనే కోరిక, వాళ్ళకి ఉండడంలో తప్పు లేదు. మగ పిల్లల తల్లిదండ్రులు, సంసార సాగరాన కష్టాలు అనంతమని, మునిగేవాడు మగాడే అని తెలిసి కూడా ముక్కు పచ్చలారని పసి బాబును పెళ్లి అనే బంధంలో ఎందుకు ఇరికిస్తారో? విధి బలీయమని చెప్పి, నన్ను విధి వంచితుడను చేసి యావజ్జీవ శిక్ష కు నన్ను ఒప్పించారు మా వాళ్ళు అందరూ కలసి.
నేను సైంటిస్టు ని అవడంవల్ల ప్రతిదీ ప్రణాళికా బద్ధంగా చేయాలని అనుకుంటాను. ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న తరువాత వాట్ నెక్స్ట్ అని ఆలోచించాను. పెళ్ళిచూపులు అనే ఒక మహత్తర పరీక్షా కార్యక్రమం ఉంటుందని గ్రహించాను. ఈ విషయమై చర్చించుటకై నా మిత్ర మండలి సమావేశం ఏర్పాటు చేశాను. మిత్రమండలిలో నేను కాక, ఉన్ని కృష్ణన్ నారాయణ మీనన్ (ఉకృనామీ) మరియు పరమ శివన్ నీల కంఠన్ (పశినీకం) వరుసగా విజయవాడ, హైదరాబాదు లలో పెరిగిన మలయాళీ, తమిళ సోదరులు, సభ్యులు.
అసలు ఈ పెళ్లి అనగా ఏమి అని పృచ్చించాడు ఉకృనామీ. నేను ఉగ్ర నరసింహ మూర్తి నై పోయాను. వాట్ ఈజ్ దిస్? జిస్ దేశ్ మే గంగా బెహతీ హై లో పుట్టి, పవిత్ర గోదావరి, కృష్ణా ల జలం `పీ’ తూ , ఇల్లాంటి ప్రశ్న వేయడానికి నీ బుద్ధి కేమి రోగమొచ్చింది అని కోప్పడ్డాను. పెళ్లి అనగా వివాహం అనగా నూరేళ్ళ పంట. మూడు ముళ్ళ బంధం అనగా రెండు మనసులు, రెండు తనువులు, రెండు కుటుంబాలు, రెండు వంశాలు, ఇంకా ఇంకా బోలెడు రెండులు ఒకటయ్యే వ్యవస్థ . సహజీవనం సౌభాగ్యం ఏక జీవనం దౌర్భాగ్యం అని పురాణాలు ఘోషిస్తున్నాయి. మేరా భారత్ మహాన్ లో ఈ వివాహ వ్యవస్థకు సమున్నత స్థానం కలదు. ఈ యొక్క వివాహ వ్యవస్థను అమెరికా అను దేశం లోనూ, జర్మని దేశం లోనూ మరియు అయిస్లాండ్ దేశస్థులున్నూ చాలా ఇష్టపడెదరు. వారందరూ జంటగా మన దేశమునకు విచ్చేసి ఈ విధానమును కూలంకషము గా నభ్యసించి వివాహ భోజనమ్ము లారగించి స్వదేశముల కేగి విడాకులు తీసుకొనిరని ఎరుగవా అని క్రోధముగా నుపన్యసించితిని.
పశినీకం నన్ను శాంతపరచి, ఉకృనామీ ని సమాధానపరచి, మా తక్షణ కర్తవ్యమును ప్రభోదించుము అని అడుగుకొనెను. నేనప్పుడు శాంత స్వరూపుడనై ఈ కింది విధముగా వచియించితిని. మిత్రులారా వివాహము అను బృహత్కార్యములో పెళ్లి చూపులు అనగా మారేజి లుక్సు అనునది ప్రధమ సోపానం. పెళ్ళిచూపులు అనగా పరస్పర ప్రశ్నోత్తర కార్యక్రమము. వాట్ టు పూచ్? అండ్ హౌ టు ఆన్సర్? అను విషయమై మీ సలహాలను అర్ధించుచున్నవాడను, అని విశదీకరించితిని.
నా మిత్రులిరువురు దీర్ఘముగా నిశ్వసించి, ఇది గంభీర సమస్య యగుటచే, దీర్ఘము గా నాలోచించ వలయును కాబట్టి, హిందూస్థాన్ ఇయర్ బుక్, హూ ఈజ్ హూ అండ్ జెనరల్ నాలెడ్జి గ్రంధములు చదివి మూడురోజుల తరువాత మరలా సమావేశమై చర్చించెదము అని నుడివిరి.
తదుపరి సమావేశం లో ఉకృనామీ “నేనొక 10 ప్రశ్నలను తయారు చేసితిని” అని చెప్పగానే “నేనొక 10 జవాబులను తయారు చేసితిని” అని పశినీకం తెలియపర్చెను. అమెరికా అధ్యక్షుని పేరేమి? భారత ఆర్ధిక మంత్రి పేరు చెప్పగలవా? భారత రాజధానికి నేపాలు రాజధానికి మధ్య దూరమెంత? గుడ్డులోని పచ్చసొన లోని పోషక పదార్ధములను వివరింపుము? ఇల్లాంటి ప్రశ్నలు ఉకృనామీ చదవగానే వాటికి జవాబులు పశినీకం చెప్పేడు.
నాకు అరికాలి మంట నెత్తికి ఎక్కింది. అన్నీ ఇటువంటి ప్రశ్నలు కాదు. వారి వారి అభిరుచులు, రుచులు, భావములు తెలుసుకొను ప్రశ్నలు కావలెను. అయినా ప్రశ్నలు లా కాకుండా అభిప్రాయములు పంచుకొను విధముగా నుండవలెను, అని వివరించితిని.
పరస్పర అవగాహనా కార్యక్రమం, గ్రూప్ డిస్కషను ఇత్యాదులలో అనుభవా రాహిత్యము వల్ల నీకు అవసరమగు ప్రశ్నావళి తయారుచేయుటకు మేము అశక్తులము అని శోకతప్త హృదయులై భోరు మని వారు విలపించిరి.
నేనునూ విచార గ్రస్తుడనై, చింతాక్రాంతుడనై ఈ పెళ్లి చూపులు అను నదిని దాటి వివాహము అను సాగరము చేరుట ఎట్లు అని చింతించుచూ రావు గారి గృహంబునకు నరిగితిని. నా వెనకాలే మిత్రులిరువురు అరుగుదెంచిరి.
నే నరుగునప్పటికే అచట రావు గారు, భావన అక్కయ్య, శాస్త్రి అంకులు, కామేశ్వరి ఆంటీ, Dr. రఘుపతి, మిసెస్ సుధా రఘుపతి కూర్చొని అడ్డాట ఆడుకుంటున్నారు.
భావనా అక్కయ్య కోపంగా అంటున్నారు ”రావు మహాశయా తురఫు జాకీ బయట ఉండగా మణేలా ఎవరైనా వేస్తారా? నాయనా ప్రద్యుమ్నా మీ ఆంధ్రా యూనివర్సిటీ లో అడ్డాట ఆడడం రాని వాళ్ళకు M.Sc, Ph.D లు కూడా ఇచ్చేస్తారా. మీ యూనివర్సిటీ లో మరీ ఇంత స్టాండర్డ్స్ దిగజారిపోయాయా" అని ప్రశ్నించారు.
నేను సమాధానం చెప్పేలోపలే, “అడ్డాట దాకా ఎందుకు అక్కయ్య గారూ, పెళ్ళిచూపుల్లో ఏమి చెయ్యాలో, అడగాలో కూడా తెలియని అమాయక జీవులు వారు” అని వ్రాక్కుచ్చాడు ఉకృనామీ.
ఎవరికి పెళ్ళిచూపులు, ఏమా కధ అని అడిగారు శాస్త్రి గారు . ఆయన వయసులో పెద్దవారు కాబట్టి మా అందరికీ గురుతుల్యులు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన సలహాలు మాకు శిరోధార్యం అన్నమాట.
ఉకృనామీ గాడు సంగతి సందర్భాలు వివరించాడు. అప్పుడు నేను అవనత మస్తకుడనై, వినమ్రుడనై, ముకుళిత హస్తుడనై వారిని, వారి వారి పెళ్ళిచూపుల అనుభవములను సోదాహరణముగా వర్ణింపుమని అర్ధించితిని. మగవారు దీర్ఘముగా నిశ్వసించిరి మరియూ ఆడించేవారు చిరునవ్వులు ఒలక బోసిరి.
శ్రీ శాస్త్రి గారు లేచి కనులు తుడుచుకొని, ముక్కు చీదుకొని ఇటుల ఉపన్యసించిరి. “నాయనా ప్రద్యుమ్నా, నాదొక విషాద గాధ. నాకు పెళ్లి చూపుల అనుభవం లేదు నాయనా లేదు. ఒకరోజు మా తాతగారు వీధి అరుగు మీద కూర్చొని విద్యార్ధులచే వేదాభ్యాసము చేయించు చుండగా, వీధిలో నడుచుచూ వెళుతున్న ఓ ఘనాపాటి గారు ఆగి వేద పఠనం లో గొంతు కలిపారుట. పాఠం అయిన తరువాత మా తాతగారు, ఆ ఘనాపాటి గారూ కుశల ప్రశ్నలు వేసుకొని, ఒకరి వివరములు మరొకరు తెలుసుకొని , వారికి పెళ్లీడు కొచ్చిన మనవరాలు ఉందని, వీరికి వయసుకొచ్చిన మనవడు ఉన్నాడని తెలుసుకొని కడుంగడు ముదావహులై శుభం అనుకొన్నారట. అంతే మా పెళ్లి 1935 లో జరిగిపోయింది.” అని కూర్చున్నారు.
అప్పుడు శ్రీ రావు గారు లేచి విషణ్ణ వదనముతో, దు:ఖముచే గద్గదికమైన గొంతు సవరించుకొని “మిత్రమా ఇప్పటికి సుమారుగా 32 ఏళ్ల క్రితము మా మేనమామ గారింట నొక ఆడ శిశువు జన్మించెను. జన్మించిన రోజునే మా మేనమామ గారు, చేతిలో చెయ్యేసి చెప్పు అక్కా, నా కూతురే నీ కోడలని, అని పాడితే, మా అమ్మగారు ఉత్సాహభరితులై , మాట ఇచ్చితిరా, మాట తప్పనురా అని పాడేరు ట. అంతే. మా మామ కూతురికి యుక్త వయసు రాగానే, అంటే ఆమె SSLCని పెఢెల్ ఫేడెల్ మని హ్యాట్రిక్కు తన్నులు తన్నిన తర్వాత, నాకు పెళ్లి చేసేశారు. ఇదిగో ఇల్లా అయింది నా బతుకు” అని విచారించి కూర్చున్నారు.
చివరగా Dr. రఘుపతి గారు నుంచోని గంభీర వదనుడై, మాట్లాడ బోవుతుండగా, మిసెస్ సుధా రఘుపతి లేచెను. అప్పుడు Dr. రఘుపతి కూర్చున్నాడు. మిసెస్ సుధా రఘుపతి చిరునవ్వు నవ్వి “You see when Dr. రఘుపతి Delhi లో Ph.D చేస్తుండగా, one day నన్ను చూశాడు. Next day కూడా మళ్ళీ same place లో మళ్ళీ చూశాడు. Then, he fell in love నా తోటి. Then after ఒక year మేము marriage చేసుకున్నాము.” అని మళ్ళీ ఘట్టిగా నవ్వి కూర్చొనెను. అందరూ జాలిగా Dr. రఘుపతి కేసి చూశారు. ఆయన మెల్లగా “రెండో మాటు చూసి ఉండకుండా ఉండాల్సింది” అని విచారించెను.
ఔరా నాకు సలహాలు ఇచ్చువారే లేరా అని విచారించితిని. కానీ విధి విధానము తప్పింప నెవరి తరము. తానొకటి తలచిన దైవము వేరొండు తలచును గదా.
ఇది జరిగిన సరిగ్గా పదిహేను రోజులకు నాకు మా అన్న గారి దగ్గరి నించి నాలుగు వైపులా పసుపు పూయబడి మధ్యలో కుంకుమ రాగ రంజితమైన ఒక ఉత్తరం వచ్చింది. ఈ ఉత్తరం లో మావదిన గారు మృదు మధుర స్వనంతో వ్రాక్కుచ్చారు.
“ నాయనా ప్రద్యుమ్నా నీ వివాహం నిశ్చయించబడింది. వధువు, కృష్ణా తీర విజయవాడ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ సోమయాజులు గారి జ్యేష్ట పుత్రిక చి. ల. సౌ. ప్రభావతి. అమ్మాయి ఇంటర్ లో ఇంగ్లీష్ లో జారి పడిందిట. అందుకని తుచ్చ మ్లేచ్ఛ భాష నేల నేర్పించ వలెనని తండ్రి గారు కినుక వహించి తెలుగు విద్వాన్, మరియూ ఉ. భా. ప్ర. (ఉభయ భాషా ప్రవీణ) పరీక్షలు పాసు చేయించారట. పెళ్లి చూపులలో మీ నాన్నగారు ఆమెతో తెలుగు లోనూ, సంస్కృతం లోనూ నాలుగు పద్యాలు, రెండు శ్లోకాలు పాడించి ముగ్దులై పోయారు. మీ అమ్మగారు నీకు అత్యంత ప్రీతిపాత్రమైన పనసకాయ ఆవ పెట్టిన కూర చేయు విధానము గురించి విశదముగా చర్చించి కడుంగడు ముదాహవులయినారు. మేము ఇంకేమన్నా అడుగుదామని ప్రయత్నించినను, వారు వీటో చేసేశారు. అయిననూ పనసకాయ ఆవ పెట్టిచేయు కూర విధి విధానములు తెలియని నామాట వారేల వినుదురు. అమ్మాయి చూచుటకు బాగానే ఉంది. ఈ వివాహము జరుగుట నిశ్చయము, తధ్యము మరియూ శిరోధార్యమని మీ జనకులు నొక్కి వక్కాణించారు. కాబట్టి బుద్ధిగా వచ్చి పెళ్లి చేసుకొని వెళ్లమని నీకు వ్రాయవలిసిందిగా మీ తండ్రిగారు మీ అగ్రజుని ఆదేశించగా, వారి ఆజ్ఞా నుసారము నేను నీకు తెలియ పరచు చుంటిని. మిగతా వివరములతో మీ నాన్నగారు త్వరలోనే నీకు జాబు వ్రాసెదరు. మంగళం మహత్.”
మా వదినగారు శలవిచ్చినట్టు ఇంకొక 10 రోజుల తర్వాత మానాన్నగారు ఉత్తరం రాశారు. "జూన్ 28, 1970 తారీఖున వివాహ మహోత్సవం నిర్ణయింపబడినది. కాబట్టి నువ్వు వచ్చి ఆ మూడు ముళ్ళూ వేసి కృతార్ధుడవు కమ్ము. కనీసం ఓ నాలుగు రోజుల ముందు అఘోరిస్తే కార్యక్రమములు అన్నీ సక్రమంగా జరుపుకొంటాము. అమ్మాయి ఫోటో పంపుతున్నాను. చూసి ఆనందించు" అని సారాంశము.
అమ్మాయి ఫోటో లో బాగానే ఉంది. పెళ్ళిచూపులు లేకుండా అంటే అమ్మాయిని నేను చూడకుండా నాపెళ్ళి నిశ్చయం అవటం బాధిస్తున్నా, మా నాన్న గారు కొంచెం అగ్నిహోత్రావధాన్లు టైపు కాబట్టి, నేనేమన్నా చెల్లదు కాబట్టి , గత్యంతరం లేక ఒప్పుకున్నాను. ఒప్పుకోక పోతే జరిగేది కూడా నాకు తెలుసు.
ఆ అమ్మాయి చేత ఏ కమండలానికో తాళి కట్టించేసి, జోర్హాట్ తీసుకొచ్చి ఆ కమండలాన్ని నామెడలో వేసి , ఆ అమ్మాయిని నానెత్తి మీద కూర్చోపెట్టి భీమవరం వెళ్లిపోతారు. కాదనే ధైర్యం నేను చేయలేను కాబట్టి ఓ వారం రోజుల ముందుగా నేను భీమవరం చేరిపోయాను, అవునండీ పెళ్లి చేసుకోవటానికే .
(ఇది మొదటి మాటు 11/01/2011 న ప్రచురించ బడింది.)