భగ్న ప్రేమికుడు


తను భగ్నప్రేమికుడనే  విషయం శ్రీనివాసుడుకి   చిన్నప్పుడే తెలిసింది.    

నాల్గైదు ఏళ్ల వయసులో పక్కింట్లో సీగానాపెసునాంబ ఉండేది. దాని నోరు, పళ్ళు ఎప్పుడూ విశ్రాంతిగా ఉండేవి కావు.   ఎప్పుడూ  ఏదో ఒకటి మర ఆడిస్తూనే  ఉండేది. బాల శ్రీనివాసుడికి  కూడా జిహ్వ చాపల్యం ఎక్కువే. సీగానా పెసూనాంబని     ప్రేమించడం మొదలు పెట్టాడు. “నువ్వు ఎంచక్కా ఉన్నావు” అన్నాడు. “నీ బుగ్గలు బూరెల్లా ఉన్నాయి”  అన్నాడు.  “నీ రంగు పనస తొనలా ఉంది” అన్నాడు. పెసూనాంబ నాలుగు ఆకులు  ఎక్కువే చదివింది.   “నువ్వు ఎంత ప్రేమించినా సున్నుండలో చిన్న ముక్క కూడా ఇవ్వను”  అంది.  అది  శ్రీనివాసుడి  మొదటి భగ్నప్రేమ.

కొంచెం వయసు వచ్చిన తరువాత అంటే ఏడో క్లాసులో ఉండగా  క్లాసు మేటు కుసుమని ప్రేమించడం మొదలు పెట్టాడు శ్రీనివాసుడు . వాళ్ళ నాన్నగారికి స్కూలు  దగ్గరలోనే  చిన్న హోటల్ ఉండేది. రెండు మూడు మాట్లు తన గర్ల్ ఫ్రెండ్స్ ని, ఒకరిద్దరు బాయ్ ఫ్రెండ్స్ ని కూడా వాళ్ళ హోటలుకి తీసుకెళ్ళింది.   ఆర్నెల్ల పాటు ఎంత గాఢముగా, ఘోరంగా ప్రేమించినా శ్రీనివాసుడిని మాత్రము  ఎప్పుడూ వాళ్ళ హోటలుకి తీసుకెళ్ళలేదు. విసుగెత్తి   ప్రేమని భగ్నించేసాడు శ్రీనివాసుడు.  

కాలేజిలో చదివేటప్పుడు పుర ప్రముఖుడి కుమార్తె  లీలావతిని ప్రేమించాడు. వాళ్ళ నాన్నకి ఒక సినిమా హాలు, రెండు బట్టల కొట్లు, ఒక నగల దుకాణం ఉన్నాయి.  ఆమె వెనకాల నడవడం మొదలు పెట్టాడు. ఏడు కాదు ఏడు వేల అడుగులు వేసాడు ఆమె వెనకాల. ఆమె తిరిగి చూడలేదు. ముందు నడుస్తూ వెనక్కి తిరిగి చూడడం  మొదలు పెట్టాడు. ఆమె రూటు మార్చేసింది. అయినా ప్రయత్నం మానలేదు శ్రీనివాసుడు. కాలేజిలో ఆమె చుట్టూ తిరగడం మొదలు పెట్టాడు. నాల్గైదు రోజులు ఆమె చుట్టూ తిరగగానే నిర్మోహ మాటంగా, కర్కశంగా  చెప్పేసింది. “ఇంకో మాటు నాకు వంద అడుగుల  లోపుల కనిపిస్తే మా నాన్నకి చెబుతాను” అని.  ప్రేమ మొగ్గ తొడగకుండానే పెద్దలకి తెలుస్తే,  వీపు కాయలు కాస్తుందని శ్రీనివాసుడు ప్రేమను అణుచుకున్నాడు.

యూనివర్సిటీలో చదివేటప్పుడు, ఆపైన ఉద్యోగం చేసేటప్పుడు డజన్ల కొద్ది అమ్మాయిలను ఇష్ట పడ్డాడు.  అందరినీ సమదృష్టితోనే  ప్రేమించాడు. ఎడ తెగకుండా, విరామం లేకుండా,   అప్పుడప్పుడు ఏక కాలంలో నలుగురిని కూడా ప్రేమించేశాడు.  ఎందుకైనా మంచిదని, వాళ్లకి కూడా నాన్నలు, అన్నయ్యలు కూడా ఉంటారు కదా అని,  తన  ప్రేమ ఆ అమ్మాయిలకు కూడా తెలియకుండానే  ప్రేమించేశాడు.  అజ్ఞాత ప్రేమ సార్వభౌముడు అని కూడా అనేవారు మిత్రులు శ్రీనివాసుడిని. 

అష్ట కష్టాలు పడి శ్రీనివాసుడి  నాన్నగారు శ్రీనివాసుడి  పెళ్లి చేశారు పద్మావతితో.  పెళ్లైంది కదా తీరుబడిగా భార్యని తెగ ప్రేమించేద్దామని  తీర్మానించు కున్నాడు.  “నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను” అని చెప్పాడు కాపురానికి వచ్చిన పద్మావతితో.    “పెళ్లి అయిం తరువాత ఇంకా ప్రేమ ఎందుకు?”  అని కొచ్చెను మార్కు పెట్టింది  ఆవిడ. “ప్రేమ అమరం. అజరామరం, డివైన్” అంటూ ఆవేశంగా చెప్పాడు.   “ ఏభై వేలు కట్నం తీసుకున్నప్పుడు ఈ ప్రేమ గుర్తుకు రాలేదా” అని ఘట్టిగానే అడిగింది పద్మావతి.  “అయినా ఓ చంద్రహారం చేయించారా? కంచి పట్టు చీర కొన్నారా? కాశ్మీరు తీసుకెళ్ళారా? ఏం చేశారని మిమ్మల్ని ప్రేమించాలి?”  అని ప్రశ్నల శరపరంపర సంధించింది.  నిరుత్తరుడయ్యాడు  శ్రీనివాసుడు.  ఇందులో తన జీవిత కాలంలో ఏమీ  చేయలేడు  కాబట్టి ఉదాత్త ప్రేమ, ప్రేమాతి ప్రేమ భార్యతో కూడా సాధ్యం కాదని తేలిపోయింది శ్రీనివాసుడికి.

ఏదో సాధారణ భార్యా భర్తల ప్రేమతోనే జీవితం ఇప్పటిదాకా సాగిపోయింది. అయినా అప్పుడప్పుడు సినిమాలలోగానో, నవలల్లోగానో  ప్రేమించుకోవాలని ప్రయత్నం చేశాడు శ్రీనివాసుడు. కానీ,    పద్మావతి కంట్లో నలుసు పడితే శ్రీనివాసుడి  కంట్లో కన్నీరు కారలేదు.  ఒక మాటు తీవ్ర ప్రయత్నం కూడా చేశాడు. ఆవిడ కంట్లో కారం కొట్టాడు. ఆవిడ కన్నీరు మున్నీరుగా నానా శాపనార్ధాలు పెడుతూ విలపించింది. కానీ శ్రీనివాసుడి  కంట్లో కన్నీరు రాలేదు.  శ్రీనివాసుడి  కాలు విరిగితే పద్మావతి  కుంటలేదు.  పద్మావతి చేసిన కూర తింటే  శ్రీనివాసుడి  కంట్లో కన్నీరు ఉబికింది కానీ నోట్లో లాలా జలం స్రవించలేదు.  శ్రీనివాసుడికి జబ్బు చేస్తే  ఆవిడ గుండెలు బాదుకోలేదు.  పరామర్శించడానికి వచ్చే వాళ్లకి భోజనాలు, కాఫీ టిఫిన్లు తయారు చేసి పెట్టి,  తీరుబడి చేసుకునే లోపుగా  రెండో రోజునే  శ్రీనివాసుడు  హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చేశాడు. అందుకని పద్మావతి  శోక తప్త విచార ముఖబింబాన్ని దర్శించే భాగ్యం కూడా శ్రీనివాసుడికి కలగలేదు.  

ఈ విధంగా  తమ భార్యా భర్తల   ప్రేమ  కనీసం కధలలో లాగా పై స్థాయిలో లేదు అని కూడా అర్ధం అయింది శ్రీనివాసుడికి.

ఇలా భగ్న ప్రేమలతో ముఫై  ఏళ్లు నిండిపోయాయి శ్రీనివాసుడికి .  “సఫల ప్రేమ నాకు ఎండ మావియేనా?”  అని విలపిస్తున్నాడు శ్రీనివాసుడు.

అంతే,  అంతే కొన్ని జీవితాలు అంతే.  

(అబ్బే,  ఏం లేదు. క్లుప్తంగా కధలు వ్రాయడం ప్రాక్టీసు చేస్తున్నాను.....దహా.) 

పా – ప్రా. సూ. -3, వంకాయ పప్పు చారు కూర భళా.

పాక శాస్త్రము – ప్రాధమిక సూత్రాలు – 2   ఇక్కడ చెప్పుకున్నాము.

  ఇంట్లో వాళ్ళు మన వంటల మీద అభిప్రాయం వెలిబుచ్చకుండా చేయాలంటే వారి రుచి గ్రంధుల మీద దాడి చెయ్యాలని చదువుకున్నాం.  కానీ ఎలా. తినగ తినగ వేము తీయనుండు. అనగా  చేదు గ్రంధుల మీద దాడి జరిగింది. ఎక్కువ గా తింటే మొహం మొత్తుతుంది అని కూడా అంటాం ఇందుకే. వంటలో పాళ్ళు కుదరకపోయినా ఇంతే జరుగుతుంది. ఏదైనా క్రమ క్రమంగా అలవాటు చెయ్యాలి.

అసలు రుచులు ఎన్ని అంటే షడ్రుచులు అంటారు. చెరుకు పానకం తీపి వేరు హల్వా తీపి వేరు.  మధ్యలో మధురం అని కూడా అంటారు. కొరివి కారం వేరు ఆవకాయ కారం వేరు.  గొడ్డు కారం నషాలానికి అంటుతుంది. అర్ధాత్ ఒకే రుచిలో ఇన్ని తేడాలున్నాయి. "రుచులు దోసంబంచు పోనాడితిన్ తల్లీ"  అన్నాడట కవి సార్వభౌముడు. ఆ ప్రకారం మన ఇంట్లో వాళ్ళచేత అనిపించాలి.  ఇక్కడ రెండు కధలు  చెప్పుకోవాలి.

కొత్తగా కాపురానికి వచ్చిన సుబ్బలక్ష్మి పక్కింటి పిన్నిగారితో   “మా ఆయనకి వంకాయ కూర చాలా ఇష్టమని మా అత్తగారు చెప్పారు కదా అని,  సోమవారం వంకాయ కూర వండాను. అద్భుతంగా ఉందని అన్నారు మా వారు. మంగళవారం వండాను, చాలా బాగుంది అన్నారు. బుధవారం వండాను,  బాగుంది అన్నారు. లక్ష్మివారం వండాను,  మాట్లాడలేదు. ఈ వేళ శుక్రవారం వండితే,  వంకాయ కూర అంటే నాకు అసహ్యం అంటారు,  ఏమిటండీ చోద్యం కాకపొతే”  అని వాపోయిందిట.

కొత్తగా కాపురానికి వచ్చిన కనకాంగి పక్కింటి పిన్నిగారిని అడిగిందిట,  వంకాయ కూర చెయ్యడం ఎలా అని. ఆవిడ చెప్పింది. ఈవిడ వ్రాసుకుంది. చివరగా,  ఉప్పూ,  కారం తగినంత అంటే ఎంతండి అని ఈవిడ అడిగింది. "అదే తెలుస్తే,  మీ బాబయ్యగారు సన్యాసుల్లో ఎందుకు కలిసేవారు"  అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుందిట ఆవిడ.

రుచి గ్రంధులను  ఈ విధంగా కూడా దెబ్బతీయవచ్చు. ఈ పద్ధతిలో  సమయం పడుతుంది. సులువైన పద్ధతులు అవలంబించాలి.  ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క మార్గం అవలంబిస్తుంది.

ఏ పధ్ధతి అయినా రుచి గ్రంధుల మీద దాడే ముఖ్యం.   ఇది ఒక్కరోజులో అయ్యేపని కాదు.  వాళ్ళ రుచి గ్రంధులను నిర్దాక్షణ్యంగా, నిరంకుశంగా, క్రూరంగా నెమ్మది నెమ్మదిగా హత్య చేయాలి.  ఈ హత్యా కార్యక్రమం ఒక వ్రతం లాగ, నియమ నిష్టలతో, శ్రద్ధగా   చెయ్యాలి. సాధ్యమైనంత వరకు ఆదివారం, పండగ, శలవు రోజుల్లో  అందరూ ఇంట్లో ఉండే రోజుల్లో  చేస్తే మంచిది. కొత్తగా పెళ్లి అయి కొత్త కాపురం పెట్టిన రోజుల్లో అయితే మరీ మంచిది. అప్పుడు ఏ రోజైనా ఒకటే.

ఈ వ్రతం శాస్త్రోక్తంగా చేయాలి.  ముందు రోజు సంకల్పం చెప్పుకోవాలి. “భలానా కూర రేపు చేయ బోతున్నాను. నేను భగవంతుని చేతిలో కీలుబొమ్మని. ఆయన ఆడించినట్టు ఆడడమే నా ధర్మం. ఈ కూర నా ద్వారా చేయించటానికి ఆయన సంకల్పించాడు. ఆయన ఆజ్ఞానుసారం మాత్రమే నేను చేస్తున్నాను. జరిగే కష్ట నిష్టురాలకు ఆయనదే బాధ్యత. నేను నిమిత్తరాలుని మాత్రమే”. 
    
సంకల్పం  చెప్పుకున్న తరువాత ఇష్టదేవతా ప్రార్ధన చేసుకోవాలి. “ఓ నా ప్రియ దైవమా,  మా ఇంట్లోవారి రుచిగ్రంధుల  సామర్ద్యాన్ని తగ్గించటానికి ఈ సాహసం చేస్తున్నాను. వారికి ఇంకేమి ఆపద రాకుండా చూచే బాధ్యత నీదే”. 

ఆ తరువాత ధన్వంతరిని, అశ్వని దేవతలని పూజించండి, మీ ఇంటివారి ఆరోగ్యానికి ఢోకా లేకుండా.   

మీ ఇంటివారి క్షేమం కోరి,  లయ కారకుడైన శివుడిని సేవించండి, యమధర్మ రాజు కి ఒక మెమో పంపమని,  యమదూత లెవరూ మీ ఇంటి దరిదాపులకు రాకుండా. 

మీ ధర్మం మీరు నెరవేర్చారు. మీ జాగ్రత్తలు మీరు తీసుకున్నారు కాబట్టి  మీరు నిర్భయంగా, నిస్సందేహంగా, నిరంకుశంగా, నిరాపేక్షగా, నిర్దయగా మీ వ్రతాన్ని మర్నాడు  మొదలు పెట్టవచ్చు. 

మీరు మీ వ్యక్తి గతంగా ఇంకొక జాగ్రత్త తీసుకోవాలి. రేపటి నుంచి  రెండు రోజులు అభోజనం ఉండాల్సి వచ్చినా, నీరసం రాకుండా ఉండేటట్టు తగినన్ని పిండి పదార్ధాలు, మాంసకృత్తులు, ప్రోటీన్లు, ఖనిజాలు, లవణాలు, విటమిన్లు మొదలైనవి కల మృష్టాన్నం తగు మోతాదుకు మించినది ముందు రాత్రి సుష్టుగా భోజనం చెయ్యండి.

మొదటి భాగం పూర్తైంది. వ్రతంలో రెండవ భాగం వంట చెయ్యడం. వంకాయ పప్పు చారు కూర భళా చేయాలనుకున్నాము కదా.  పేరు మీఇష్టం.  చివరన భళా అని ఉంటే సరిపోతుంది. ఏ కూరగాయ ఉపయోగిస్తే ఆ కూర వంకాయ బదులు పెట్టండి. పప్పు ముందు,  వంకాయ తరువాత ఉన్నా ఫరవాలేదు. పేరులో పెన్నిధి ఉండదు. 

వంకాయ రకరకాలుగా వండుతారు. కారం పెట్టి, అల్లం కొత్తిమీర పచ్చిమిర్చి పెట్టి, వేపుడు, పెరుగు పచ్చడి,  బండ పచ్చడి, పులుసు పచ్చడి, బజ్జీలు  ఇత్యాదులు చాలానే ఉన్నాయి. అదికాక వాంగీబాత్ అని కూడా చేస్తారు. ఏదో ఒక రకం అందరూ ఇష్టంగానే తింటారు. ఒకవేళ,  మా ఇంట్లో వంకాయ తినరు అంటే మరో కూర,  బెండకాయ, అరటికాయ, బంగాళాదుంప కాయ, టమాటో కాయ, కేరట్ కాయ ఏదైనా సరే, ఆకు కూర లైనా  ఫరవాలేదు. చేసే విధానం ముఖ్యం. ఈ విధానం ఆల్ ఇన్ వన్ టైపు. 

అన్నట్టు దుంప కాయలైతే మరీ మంచిది. శరీరంలో చక్కెర పండించడానికి శ్రేష్టం కూడాను. చక్కెర పండడం మొదలైతే జిహ్వ చాపల్యం బాగా తగ్గుతుంది కూడా. ఇవే కాక కొలెస్ట్రాల్ పెంచేవి, మిగతా రోగాలు తెప్పించేవి కూడా వాడవచ్చు. కాంబినేషన్ కూరలు కూడా వాడ వచ్చును.   

వ్యాధులు మొదట్లోనే కనిపెట్టేసి మందులు వాడాలి, ప్రాణాంతకం కాకూడదు. వ్యాధులు మొదలైతే తిండిలో నియమాలు వచ్చేస్తాయి. ఉప్పు నిషిద్ధం, కారం కూడదు, తీపి అసలు పనికి రాదు అంటూ బోల్డు కట్టుబాట్లు పాటిస్తారు. కాగల కార్యం గంధర్వులే తీర్చారన్న మాట.  గ్రంధుల మీద దాడి మనం మానెయ్యవచ్చు కూడాను.

నేను వంకాయను ఎందుకు ఎన్నుకున్నానంటే వంకాయతో వెయ్యి రకాల వంటలు చేయవచ్చుట. వంకాయల్లో అనేక రకాలు ఉన్నాయి,  పొడుగువి, సన్నవి, లావువి, తెల్లవి,నల్లనివి, అంటూ అనేక రకాలు.  ‘వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భార్యామణి’  అంటూ ఏదో పద్యం కూడా ఉంది. ఇందులో బోలెడు పోషక పదార్ధాలు కూడా ఉంటాయంటారు. ఎక్కువుగా తింటే దురద, ఎలర్జీ కూడా కలిగిస్తుందని కొంతమంది అంటారు. ఈ కారణాల వల్ల వంకాయే భేషైన వంటకం అని అనుకున్నాను. 

వంకాయ పప్పుచారు కూర భళా ఎందుకు అంటే దానికీ కారణం ఉంది. మాములుగా ఇంట్లో ఒక  పప్పు,  ఒక కూర, పచ్చడి, రసమో  పులుసో చేసుకుంటాము. ఇన్ని రకాలు ఉంటే కానీ తినే వాళ్లకి సంతృప్తి కలుగదు. ఇన్ని పదార్ధాలు చేయడం అంటే గృహిణికి ఎంత కష్టం. అందుకని అన్నీ కలగలపి ఒకే వంటకం చేయడం సులువు గదా. బహుళార్ధ సాధక వంట అన్నమాట. ఇది కూరగా, పచ్చడిగా, పులుసుగా , పప్పుగా ఇలా అన్ని రకాలుగానూ చెప్పవచ్చు. అన్ని  రుచులు ఎంతోకొంత ఉంటాయి.  

కావలిసిన పదార్ధాలు :  వంకాయలు, (ఏవైనా ఫరవాలేదు, సన్నవైతే శ్రేష్టం),  కందిపప్పు,(పెసరపప్పు, సెనగ పప్పు అయినా ఫరవాలేదు),   ఉల్లిపాయలు, కొత్తిమీర, కొబ్బరి కోరు, బఠానీలు,  అల్లం  వెల్లుల్లి పేస్టు, నూనె, పచ్చిమిర్చి,   పసుపు, కారం పొడి, ఉప్పు, బెల్లం, చింత పండు,   మసాలా పౌడరు.  లేనివి వదిలేయ వచ్చు. పాళ్ళు ఉజ్జాయింపుగా మీ ఇంట్లోవాళ్ళ రుచిని  కొద్దిగా చెడగొట్టేటట్టు.

తయారు చేయు విధానం : స్టవ్ వెలిగించి వంకాయలను కాల్చండి. తొక్కు తీసి గుజ్జుగా చేసుకోండి. రెండు  వంకాయలను తరిగి ముక్కలుగా కూడా చేసుకోండి. స్టవ్ మీద మూకుడు పెట్టండి. నూనె వేసి కాచండి. ఉల్లిపాయ ముక్కలు వేసి వేపండి. వంకాయ ముక్కలు వేయండి. నానేసిన బఠానీలు వేయండి. పచ్చి మిర్చి ముక్కలు కూడా వేయండి. పప్పు వేయండి. (ఇది ముందు అది వెనక్కాల వేసినా నష్టం లేదు.) కొద్దిగా ఉడకనీయండి. ఇంత చింత పండు రసం పొయ్యండి. ఉడక నివ్వండి. (ఎంతసేపు అన్నది మీ ఓపిక,  తీరుబడిని  బట్టి.) ఇప్పుడు మిగతా వన్ని పోసేయండి. మరగనీయండి. అవసరమైతే నీళ్ళు పొయ్యండి. మరిగించండి. నీళ్ళు పొయ్యండి.   ఇంకా మరిగించండి. చివరగా పోపు పెట్టి దింపేయండి.

ఇన్ని వేసిన తరువాత ఏదో ఒక  ఘుమ ఘుమ వాసన వస్తుంది. రాకపోతే వడ్డించేటప్పుడు మీరే “ఘుమ ఘుమ” అంటూ వడ్డించండి.   

రెండు ముద్దలు తినగానే ఉప్పు తక్కువయిందేమో అనుకుంటాడు. ఇంకో రెండు ముద్దల తరువాత  పులుపు ఎక్కువ అంటాడు.  అబ్బే కారమే తక్కువయింది అనుకుంటాడు. తీపి ఎక్కువ అయిందా అని సందేహపడతాడు. చివరగా చిరు చేదు వల్లే రుచిలో భ్రమ కలుగుతోందేమో నని అనుమానపడతాడు. తానొకడైనా  తలకొక రూపై అన్న చందాన ఒకే కూర బహురుచులను తెస్తుంది. ఏ రుచి గ్రంధీ నిర్ధారణగా సంకేతం ఇవ్వలేక పోయింది అన్నమాట. అంటే మీరు కృత కృత్యుల య్యారన్న మాట. ప్రధమ విజయం. 

వారానికి మూడు మాట్లు రకరకాల కూరలతో  ఇలా వండిపెట్టండి. రుచి గ్రంధులు కన్ఫ్యూజ్ అయిపోతాయి.  బండబారిపోతాయి. పని చెయ్యడం మానేస్తాయి. అంతిమ విజయం కూడా మీదే.

మీరు ఎటువంటి వంటల ప్రయోగాలు చేసినా గురుడు నోరు మెదపడు. హాయిగా వంటల రిసెర్చ్ చేసుకుంటూ పేపర్స్ పబ్లిష్ చేసుకుంటూ పేరు ప్రఖ్యాతులు గడించెయ్యవచ్చు. 

పాక శాస్త్రం సమాప్తం.

ఇది కూడా ఒక ప్రేమ కధే - 2


రెండు నెలలు గడిచిపోయాయి. ఈ రెండు నెలల్లోనూ మూడు మాట్లు గుళ్ళోనే కలిసారు. ఐదారు మాట్లు కా.....  ఫోన్ చేసాడు కా..కి. నెలకి వంద రూపాయలు టాక్ టైం వేయించినా, చెల్లి, తల్లి కూడా అప్పుడప్పుడు ఉపయోగిస్తున్నందున అంతకంటే ఎక్కువ మాట్లు చేయలేకపోయాడు కా..... కా..కి సెల్ లేదు. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే సెల్ అందుబాటులో ఉంటుంది. ఆయన రోజుకి 12 గంటలు ఆటో తిప్పుతుంటాడు. 11గంటలు నుంచి మద్యాహ్నం  3గంటలు దాకా ఇంట్లోనే ఉంటాడు ఆయన. కా..... సందేశాలు ఆ టైంలోనే ఇస్తుంటాడు.

రెండు నెలల తరువాత ఇంకో శుభవార్త చెప్పాడు కా..... ఇంకో ఐదుగురు పిల్లలు చేరారండి. ఐదారు క్లాసులు వాళ్ళు. ఇంకో వెయ్యి రూపాయలు వస్తాయి అని సంతోషపడ్డాడు కా.....
ఐదారు క్లాసుల వాళ్లకి ఇంకో వంద ఎక్కువ తీసుకోవచ్చు కదండీ అంది కా..
అబ్బే, రెండు వందలు ఇవ్వడమే ఎక్కువ అండి వాళ్లకి. ఇల్లు గడవడానికి  సేల్స్ వుమెన్గా  చేసే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. పిల్లల్ని బాగా చదివించాలని ఆశ. మంచి స్కూల్స్ లో చదివించే స్తోమత లేదు. పిల్లలు ఇద్దరికీ కలిపి నాల్గు వందలు ఇవ్వడమే వాళ్లకి కష్టం అని నిట్టూర్చాడు కా..... మొదట్లో ఎంతో కొంత సంపాదించాలనే మొదలు పెట్టానండి కానీ ఇప్పుడు తల్లి తండ్రుల తపన చూస్తుంటే పిల్లలకి బాగా నేర్పాలనే పట్టుదల వస్తోంది. ఈ మధ్యన వాళ్లకి చెప్పడానికి నేనో రెండు గంటలు కష్టపడుతున్నానండి ప్రిపరేషన్ కి.
మంచి పని చేస్తున్నారండీ అని అభినందించింది కా..

ఇంకో నాల్గైదు నెలలు గడిచాయి. ఇద్దరూ అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నారు. ఒక చెరుకు రసం బదులు రెండు తాగుతున్నారు. అప్పుడప్పుడు తెగించి కా..... పది రూపాయల ఐస్ క్రీం కూడా కొంటున్నాడు ఇద్దరికీ. వాళ్ళు చెప్పుకునే కబుర్లు  మాత్రం  మారలేదు. ఇంటి కష్టాలు. నిట్టూర్పులు.  కా..కి  ఏ ఉద్యోగమూ దొరకక నిరుత్సాహం ఎక్కువవుతోంది.  చుట్టు  పక్కల ఏ షాపులోనయినా చేరడానికి తల్లి ఒప్పుకోదు. దూరం వెళ్ళడానికి తండ్రి ఒప్పుకోడు. కా..... ధైర్యం చెపుతాడు. కా..కి దిగులు ఎక్కువవుతోంది ఏ విధంగానూ తండ్రికి సాయం చేయలేకపోతున్నందుకు.

ఐదు నెలల తరువాత కా..... ఒక మాటు కలిసినప్పుడు నిరుత్సాహపడ్డాడు. ఒక ఐదుగురు ఏడెనిమిది క్లాసు పిల్లలు ట్యూషన్ చెప్పమన్నారండి. నాలుగు  వందలు ఇస్తామన్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదో విధంగా అవస్థ పడి చెప్పేయగలనేమో కానీ లెఖ్ఖలు చెప్పలేనేమో నని అనుమానం. వాళ్లకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో. అసలు ఒప్పుకోవాలో లేదో తెలియటం లేదండీ, అని వాపోయాడు.
నాది బి.ఎస్.సి. MPC అండి అంది  కా..
మీ నాన్నగారు ఒప్పుకుంటారా ఐదు కిమీ పంపడానికి. అందులోనూ ఓ వెయ్యి రూపాయలకి అన్నాడు కా.....
అడుగుతానండి. మీ ఇంటికయితే పంపుతారేమో అని ఆశాభావం వ్యక్తం చేసింది కా..  ప్రస్తుతం వెయ్యి, ఆపైన ఇంకా పెరగ వచ్చునేమో కదండీ, అని కూడా అంది.
నా సంగతి మీ నాన్నగారికి తెలుసా,  అడిగాడు కా.....
టెలిఫోన్ చేస్తారు కదండీ మీరు. మా నాన్న గారికి మీ గురించి చెప్పాను. అందరిలాగా కాకుండా ఏదో విధంగా తండ్రికి సాయపడుతారు మీరు అని మా నాన్న మెచ్చుకున్నాడు కూడా.
కా..... నవ్వాడు. కా.. డిటో చేసింది.

రెండు రోజుల తరువాత పరంధామయ్యగారు (కా.. తండ్రి) కా..... ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు.
మా అమ్మాయి చెప్పిందండి. ట్యూషన్ సంగతి. పట్టుబడుతోంది. నాకూ ఒప్పుకోక తప్పలేదు. అందుకనే మేము ఇక్కడే ఓ ఇల్లు అద్దెకు తీసుకుంటాము. ఎక్కడైనా అద్దె ఇల్లే కదా.   అప్పటిదాకా సాయంకాలం ట్యూషన్ అయిన తరువాత నేను వచ్చి తీసుకెళ్ళతాను.  ఆలస్యం అయినా మీ ఇల్లే కనుక భయం లేదు అని చెప్పాడు.
కా..... తల్లి కూడా  సంతోషంగా ఒప్పుకుంది. ఖాళీ టైం లో మా అమ్మాయికి  ఇంటర్ పాఠాలు చెప్పవచ్చు. ఫ్రీ గా నేనండోయ్ అని కూడా అంది. 

ఒక పది రోజుల తరువాత  కా.. కుటుంబం పక్క వీధిలో అద్దెకు దిగింది. రెండు ఇళ్లలో ఐదుగురు ఏడెనిమిది క్లాసు  పిల్లలకి పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు ఇద్దరూ కలిసి. ఒకరి ఇంట్లో కా.. MPC  చెపుతుంటే ఇంకో ఇంట్లో కా..... మిగతా సబ్జెక్ట్స్ చెప్పేవాడు.
తల్లి సలహా మీద మొదటి నెల పదిహేను వందలు ఇచ్చాడు కా..... కా..కి. ఇల్లు మారారు కదండీ ఖర్చు అయి ఉంటుంది కదా అందుకని అని సంజాయిషి ఇచ్చాడు కా.....
మీకు పార్టీ ఇస్తానండి, నాలుగు  బజ్జీలు, రెండు చెరుకు రసాలు అని  కా.. నవ్వింది. ఇంత కాలానికి ఒక పదిహేను వందలు సంపాదించానని చాలా సంతోషంగా ఉంది అని కూడా చెప్పింది.
మళ్ళీ నెల వెయ్యేనండి అని చెప్పాడు కా..... నవ్వుతూనే.  

ఇంకో ఐదారు నెలలు గడిచాయి. ఇంకో ఏడెనిమిది మంది  పదోక్లాసు దాకా పిల్లలు చేరారు.  కింద తరగతి పిల్లలు కూడా ఇంకో ఐదుగురు చేరారు.  చిన్న క్లాసుల పిల్లలకి కూడా కా.. చెప్పడం మొదలు పెట్టింది. ఎవరికి వీలైతే వాళ్ళు చెపుతున్నారు.  9,10 క్లాసులకి ఐదు వందలు, ఆరు – ఎనిమిదికీ మూడు  వందలు, ఇంకా చిన్న క్లాసులకి రెండు వందలు తీసుకోవడం మొదలు పెట్టారు. వచ్చే దాంట్లో ఖర్చులు పోను  సగం  కా..... తీసుకుని, మిగిలిన సగం సుమారు   మూడువేల ఎనిమిది వందలు కా.. కి ఇస్తున్నాడు.

ఇద్దరూ కష్టపడుతున్నారు. రోజూ కనీసం రెండు గంటలు ప్రిపరేషన్ కి కేటాయించుకున్నారు. అప్పుడప్పుడు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి పాఠాలు ప్రింట్ అవుట్లు తెచ్చుకుంటున్నారు. ముఖ్యమైన పాఠాలు పిల్లలకి ప్రింట్ అవుట్ కాపీలు ఇస్తున్నారు.  పిల్లలకి నేర్పాలనే తమ ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరూ కలిసి అప్పుడప్పుడు ఆ గుడికి వెళుతున్నారు. అరటి పళ్ళో, కొబ్బరికాయో సమర్పించుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళ మాటల్లో పాఠాలు ఎక్కువుగా వస్తున్నాయి. పిల్లల ప్రోగ్రెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలో చర్చించుకుంటున్నారు. ఆశ్చర్యంగా పిల్లల బాగోగులు వీళ్ళ దృష్టిలో ఎక్కువయ్యాయి. ఈ విషయం పిల్లల తల్లి తండ్రులు గుర్తించారు. సంతోషించారు. పక్క ఐదారు వీధుల్లో వీరి గురించి తెలిసింది. ఇంకో రెండేళ్ళకి వీళ్ళ పిల్లలు ఏభైకి చేరారు.  ఆరు  కన్నా చిన్నలకి రెండు వందల ఏభై తీసుకుంటున్నారు, ఏడు  ఎనిమిది లకి  మూడు  వందల ఏభై, తొమ్మిది పదిలకి ఐదు వందలు పుచ్చుకుంటున్నారు.   సుమారు పదహారు వేలు సమానంగా పంచుకుంటున్నారు.  

రెండు ఇళ్లలోనూ శాంతి సామరస్యాలు విరయడం మొదలైంది. సంపాదన చాలనప్పుడు ఇంట్లో కీచులాటలు కూడా ఎక్కువగానే ఉంటాయి కదా. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి,  అన్న విషయాలలో కా..కి, కా.....కి వాళ్ళ ఇళ్లలో చర్చల్లో ప్రాధాన్యత వచ్చింది. దాంతో బాధ్యతలు పెరిగాయని ఇద్దరూ అనుకోవడం జరిగింది. ఇంకా  సంపాదించడానికి మార్గాలు వెతకటం ఎక్కువయింది.    

కా....., కా.. ల స్నేహం మూడున్నర ఏళ్ళకి పైగా వర్ధిల్లుతోంది. కా..... కెమిస్ట్రీ చెప్పడంలో కూడా నైపుణ్యం పెంచుకున్నాడు. లెఖ్ఖలు, ఫిజిక్స్ కా.. చెపుతోంది. కా.. చిన్న క్లాసులకి ఇంగ్లిష్ కూడా చెప్పేస్తోంది. బాధ్యతలు సమానంగానే పంచుకుంటున్నారు. కానీ ఆశ్చర్యంగా వీరి మధ్య మరేమి రాలేదు. ఇద్దరూ కలిసి ఒక్కమాటు కూడా సినిమాకి వెళ్ళలేదు. గుడికి తప్ప మరొక చోటికి వెళ్ళలేదు. ఇప్పుడు సాయినాధ కాలనీలోని శివాలయం మీద గురి కుదిరింది రెండిళ్ళ లోనూ. అందరూ కలిసి వెళ్లడం మొదలయింది. అక్కడ పూజారి గారితో కూడా పరిచయం పెరిగింది.

కా..తల్లి మనసులో కోరిక కలిగింది. భర్తతో ఆలోచించింది. కానీ ఆయన సందేహ పడ్డాడు. స్నేహం అవసరం కొద్ది పెరిగింది  కానీ ఆటో వాడి కూతురుని కోడలుగా ఒప్పుకుంటారా? అనే భయంతో ముందుకు వెళ్ళడానికి సాహసించలేదు. కా..... తల్లి మనసు  కూడా, చనువుగా ఇంట్లో తిరిగే  కా.. ని చూసి ముచ్చట పడడం మొదలు పెట్టింది. కానీ ఆడపిల్ల తల్లి తండ్రులు చొరవ తీసుకోకుండా ఉంటే, తన మనస్సు చెప్పడం సబబు కాదేమో నని ఊరుకుంది.

శివాలయం పూజారి గారు పెళ్ళిళ్ళ పేరయ్య కూడా. ఒక రోజు ఏదో సందర్భంలో కా.. తల్లిని అడిగారు,
 “అమ్మాయికి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా?” అని.
“ఇంకా లేదండి. మొదలు పెట్టాలి” అని జవాబు ఇచ్చింది.
అప్రయత్నంగా, అనాలోచితంగా అక్కడే ఉన్నా కా..... తల్లి అనేసింది,
“సంబంధాలు చూడాలా? మా వాడు పనికి రాడా” అని.
కా.. తల్లి ఆనందంతో తబ్బిబ్బైంది. మరుక్షణం కా..... తల్లి చేతులు పట్టుకొని కళ్ళ కద్దుకుంది.
పూజారి గారు “శుభం” అన్నారు.

విషయం తెలిసి కా..... కా.. దీర్ఘంగా చర్చించుకున్నారు. తమ చర్చల సారాశం తల్లి తండ్రుల ముందు ఉంచారు.
కా.. సంపాదనలో సగం తండ్రికి ఇస్తుంది. కా.. తండ్రి రాత్రి ఎనిమిది తరువాత ఆటో తోలరాదు. మిగాతా సగంలో మూడు వంతులు కా..... చెల్లెలు, చదువుకి,  పెళ్ళికొరకు బేంకులో వేయాలి.
కా..... సంపాదనలో సగం ఎప్పటిలాగానే తండ్రికి ఇవ్వాలి. మిగతా సగంలో మూడు వంతులు ఇదివరకు  లాగానే కాంట్రాక్టరు అప్పు వాయిదాలు కట్టాలి. ఇంకో ఏడాది తరువాత,  అప్పు తీరిన తరువాత కామాక్షితో చర్చించి తమ భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవాలి. కొంత  కా..... చెల్లెలి పెళ్ళికి ఉపయోగించాలి.
చెల్లెలి పెళ్లి అయేవరకు ఇంట్లో పసిపాపలు రాకుండా చూసుకోవాలి.
కా..... తల్లి తండ్రులు అంగీకరించారు. కా.. తల్లి తండ్రులను ఒప్పించారు.

ఒక శుభదినాన ఉదయం, దేవుని సాక్షిగా,  పూజారి గారి ఆధ్వర్యంలో గుళ్ళో కా..... కా..  దండలు మార్చుకున్నారు. రిజిష్టారు ఆఫీసు కెళ్ళి సంతకాలు పెట్టారు. సాయంకాలం,  దగ్గర బందుమిత్రులకి ఒక ఇరవైఐదు మందికి విందు ఇచ్చారు. మొత్తం ఖర్చు రూ. 6400 రెండు కుటుంబాలు సమానంగా పంచుకున్నాయి.

(ఆ తరువాత ఏమైంది అంటారా? శుభం కార్డు పడ్డ తరువాత సంగతి మనకు ఎందుకు? అయినా బాధ్యతల నుంచి తప్పుకోని  పిల్లలకి కష్టాలు కొన సాగుతాయేమో కదా.)                                     

ఈ రోజు బ్లాగులో నా 239 వ దినం, వచ్చి నాల్గు అక్షంతలు వేసి వెళ్ళండి.

గమనిక : - మొదట ఈ టపా ఫిబ్రవరి 7, 2011 న పబ్లిష్ చేశాను. కానీ ఆ మధ్యన నా పొరపాటు వల్ల ఈ టపా డిలీట్ అయింది. టపాతో పాటు కామెంట్లు కూడా పోయాయి....