విడాకులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
విడాకులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఔను, వాళ్ళిద్దరూ విడిపోయారు.

రెండు కూరలు, సాంబారు పట్టుకొచ్చేయండి. అన్నం పడేస్తాను.


ఈ వారంలో అప్పుడే మూడో మాటు కూరలు కొనుక్కోవడం.

తప్పేమి కాదు. 42 ఏళ్ళగా వంట  చేస్తున్నాను. ఇంకా ఎంతకాలం?
 

శంకరం ఇంట్లోంచి పచ్చి బొప్పాయ కాయ పట్టుకొచ్చాను. ఆవ పెట్టిన కూర తిని చాలా కాలమైంది కదా. 

దాని తొక్కు తీయాలి. చిన్న ముక్కలు చేయాలి. మిక్సీలో వెయ్యాలి. ముద్ద కాకుండా జాగ్రత్తగా పొట్టు లాగా వచ్చేటట్టు చూడాలి. అప్పుడు కూర చెయ్యాలి. ఇంత తతంగం ఉంది. నా వల్ల కాదు.

 తతంగం అంతా నేను చేస్తానులే. నువ్వు కూర చెయ్యి. 

మీ వల్ల అయ్యే పని కాదు. పనిమనిషికి ఇచ్చేస్తాను ఆ కాయ. 


భూషణం గారు కారు మాట్లాడుతారట. పేరుపాలెం బీచ్ కి వెళ్ళి వస్తారుట, సరదాగా ఓ రెండు మూడు గంటలు గడపటానికి. మనల్ని కూడా రమ్మంటున్నారు.

పేరుపాలెం బీచ్ కని కారులో ఆ రోడ్ల మీద  మూడు గంటలు వెళ్లడం, మూడు గంటలు రావడం, అక్కడో గంటో రెండు గంటలో కూచోవటం. ఒళ్ళు హూనం చేసుకోవటం నా వల్ల కాదు.
. 
అదేమిటే,  బీచి , సముద్రం, అలల హోరు, చంద్రుడు, వెన్నెల, తళతళా మెరిసే నీరు, నీళ్ళలో నుంచుంటే కాళ్ళ కింద కదిలే ఇసుక అంటూ కవిత్వం ఒలకబోసేదానివి కదా.

ఎప్పుడు, ఎప్పుడో నా చిన్నప్పుడు. 

అదేమిటి, 15  ఏళ్ల క్రితం వైజాగ్ లో ఉన్నప్పుడు కూడా చిన్నపిల్లలా గెంతులేసే దానివి కదా.

15 ఏళ్లక్రితం నేను చిన్నపిల్ల లాగానే ఉండేదానిని. గత రెండు మూడు ఏళ్ల లోనే బాగా పెద్ద దాన్ని అయిపోయాను. 

ఏమో ఎందుకో, రెండేళ్ల లోనే అంత పెద్ద దానివి ఎలా అయ్యావో? నాకేం తేడా కనిపించటం లేదు. జుట్టు ఇంకొంచెం నెరిసింది. అంతే. 

ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి?  మీ కెలా అర్ధం అవుతుంది.

చెప్పు, అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. 

ఏం చెప్పాలి. Psychological tiredness, మానసిక అలసట అంటే  అర్ధం  అవుతుందా? మొగుడు, పిల్లలు, ఇప్పుడు మనవ(లు , రాళ్ళు), వీళ్ళకి ఇష్టమైన తిళ్ళు, పనులు చేయడం, నా కంటూ ఉన్న ఇష్టాలన్ని పక్కన పెట్టేయడము. ఇదేగా 42 ఏళ్ళగా,  రోజు రోజూ చేసిందే చేసి, విసుగు వచ్చేసింది. నేనేమిటి అని చూస్తే నా జీవితంలో నేను కనిపించటం లేదు. మీరంతానే కనిపిస్తున్నారు. 

అదేమిటి,  త్యాగాలు నువ్వేనా,  నేనూ చేసాను. 

చేసారు, కాదనటం లేదు. కానీ మీరు చేసినవి ఎన్ని?  మీరో ఐదు చేస్తే,  నేనో పది  చేసాను. మీకు బయట ప్రపంచం ఉంది. ఆఫీసు, చుట్టూ ఓ పది మంది, ఇంకో జీవితం ఉంది. ఒక రిలాక్సేషన్ ఉంది. నాకేముంది. వంటిల్లు, బెడ్ రూం తప్ప.

అన్యాయంగా మాట్లాడుతున్నావే. మరీ అంత కష్టపెట్టానా? 

కష్టంగా కాదు బాధ్యత గానే చేసాను. బాధ్యత ల్లోనే సంతోషం వెతుక్కున్నాను.  పెళ్లి చేసుకున్నప్పుడు ఇన్ని బాధ్యతలు మోయాల్సి  వస్తుందని  తెలియదు.

ఇంకొకరిని,  ఎవరినైనా చేసుకో పోయావా? కొంచెం వ్యంగంగానే పలికింది నా గొంతు.

ఎవరిని చేసుకున్నా, వంట తప్పదు, పిల్లల్ని కనడం, పెంచడం తప్పదు. వీటికి తోడు కొన్ని ఆర్ధిక బాధ్యతలు తప్పవు. ఎవరైతే నేమిటి?  అసలు పెళ్లి చేసుకొని అంత  దూరం అస్సాం  రావడం  నాకు ఇష్టం లేదు. మా నాన్నతో చెపితే “నీమొహం, నీకేం తెలుసు. కుర్రాడు బుద్ధిమంతుడు. సెంట్రల్ గవర్నమెంట్ , ఇరవై ఐదు ఏళ్లకి క్లాస్ వన్ గెజెటేడ్, నాల్గు అంకెల జీతం, ఇంతకన్నా మంచి సంబంధం  ఎక్కడ దొరుకుతుంది.”  అని పెళ్లి చేసి పంపించేసాడు.

నీకు నేనేమి లోటు చెయ్యలేదే. జీతం తీసుకొచ్చి నీ చేతిలోనే పోసాను. నా సిగరెట్లకి కూడా నిన్నే అడుక్కున్నాను. నా ఖర్చులకి, ఇంటికి వచ్చిన జీతం లో పదిహేను  శాతం మించ కూడదని రూలు కూడా పెట్టావు. ఆ తరువాత పదికి తగ్గించావు. నేను కాదనలేదే.

గెజెటేడ్ అని మా నాన్న మీకిచ్చి పెళ్లి  చేస్తే, పెళ్ళైన రెండేళ్ళకి రేడియో,  నాల్గేళ్ళకి గేస్, ఏడేళ్ళకి మిక్సి,  పదేళ్ళకి స్కూటర్ వచ్చాయి. అది మీ సంపాదన.

ఇంతకీ ఏమిటంటావు నువ్వు అని అడిగాను.

నాకు ఈ జంఝాటనల నుంచి విముక్తి కావాలి.

నేనేం చెయ్యాలి. 

విడాకులు ఇయ్యాలి.

వాట్?

యస్. హాస్యానికి కాదు, సీరియస్ గానే అంటున్నాను. ఎంత కాలం ఈ గానుగెద్దు లాగా జీవించడం. నా ఇష్టా ఇష్టాల ప్రకారం శేష జీవితం గడపాలని అనుకుంటున్నాను. 

నీ మొహం. 

కాదు, మీ మొహమే.

అది అసలు బాగుండదు.

నాకు నచ్చే చేసుకున్నాను.

మరి ఇప్పుడు ఈ గోలేమిటి? 


టెలిఫోన్ మోగింది. మా అమ్మాయి. సరే ఓ అరగంట హరికధలు చెప్పుకుంటారు కదా అని నేను బయటకు వెళ్ళి పోయాను. ఓ ఇరవై రోజులు గడిచాయి.  మధ్యలో ఒకటి రెండు మాట్లు మళ్ళి ఈ టాపిక్ ఎత్తింది కానీ నేను చర్చ సాగనియ్యలేదు. 


కాలింగ్ బెల్ మోగింది. బద్ధకం గా లేచాను. పది నిముషాలు తక్కువ ఆరు అయింది. తెల్లారకుండా ఎవరు వచ్చారు చెప్మా అనుకుంటూ తలుపు తెరిచాను. ఎదురుగా మా అబ్బాయి, కోడలు, పిల్లలు. 

అదేమిట్రా అకస్మాత్తుగా ఊడి పడ్డావు? కబురైనా లేదు.

అమ్మ అర్జంటుగా రమ్మంది. అందుకని వచ్చాము. నీకు తెలియక పోవడమేమిటి?
అని ఎదురు ప్రశ్న వేసాడు. ఇంతలో మా ఆవిడ లేచి వచ్చింది. 

వచ్చారా? రండి. మొహం కడుక్కోండి. కాఫీ పెడతాను. అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది.

పుత్రరత్నం వంటింట్లో చేరాడు. మాటలు వినిపిస్తున్నాయి.

రాజీ,  రాత్రి 11-30 బస్సు కి బయల్దేరుతానంది. ఎనిమిది అవుతుందేమో వచ్చేటప్పటికి.


నాకు కొంచెం అర్ధమవుతోంది. ఈ వేళ తాడో పేడో తేల్చేస్తుందా?  పిల్లలు వస్తున్నారు అన్న విషయం కూడా నా దగ్గర దాచింది,  అంటే వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారా?  నేను ఎవరికీ కాకుండా పోతానా?  నేను ఒంటరి నయిపోయానా?  ఏమిటి చెయ్యాలి నేను?  ఇంట్లోంచి బయటకు పోయి రెండు మూడు రోజుల తరువాత వస్తే ?

అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకండి. విందాం. పిల్లలు ఏమంటారో. ఏంచేసినా అందరి సమ్మతి తోనే చేద్దాం. కాఫీ ఇస్తూ అంది ప్రభావతి.

తన మనసు నాకు అర్ధం కాక పోయినా నా ఆలోచనలన్నీ పసి గట్టేస్తుంది. ఇది నాకు వరం. కానీ దానికి శాపమా? 

ఈ వేళే ఏమీ తేలకపోవచ్చు లెండి. కానీ ఇది మొదటి స్టెప్ .

ఇంకో మాటు ఆలోచించవా? 

మాట్లాడకుండా వెళ్ళిపోయింది. 
 

ఏమిటి ఇది? 42 ఏళ్ల సంసారం తరువాత విడిపోదామంటుంది. గత రెండు మూడు  ఏళ్ళగా అసహనం   పెరిగింది దీనికి. ఈ కాలం లో నాకు కొత్త అలవాట్లు ఏమీ అలవడలేదు. సిగరెట్లు కూడా తగ్గించాను. ఎప్పుడో తప్ప మందు ముట్టుకోవడం లేదు. ఈ రెండు మూడు ఏళ్లలో నాలో ఏమీ మార్పు  రాలేదు. మరి ఎందుకు?


మద్యాహ్నం భోజనం అయిన తరువాత డైనింగ్ టేబుల్ కాన్ఫెరెన్స్ మొదలయింది.

ఇంతకీ ఎందుకు విడాకులు తీసుకోవాలను కుంటున్నావు  అని అడిగాడు మా అబ్బాయి .

మానసిక అలసట అని చెప్పాను కదరా.
 
అంత,  మానసిక అలసట కి కారణాలు ఏమిటో? ప్రశ్నించాడు మా అబ్బాయి. 

కారణాలు అని అడిగితే, నువ్వు, నీ చెల్లెలు, మీ నాన్న అందరూ నూ.  మీ నాన్నకి, మీకు,  నాకు అభిరుచుల్లో, అలవాట్లలో, సరదాలలో చాలా తేడాలున్నాయి.

ఏమిటో అవి, మా అబ్బాయి అడిగాడు. 

మొదట్లో నాకు తెలుగు పుస్తకాలు చదవడం అలవాటు ఉండేది. కొంచెం లో కొంచెం భావుకత ఉండేది.  ఈయనకి అలాంటివి ఏమీ పట్టవు. ఖాళీ దొరికితే పోయి క్లబ్బులో కూర్చుని బ్రిడ్జ్ ఆడడమే తెలుసు. పెళ్ళానికి ఓ మూర మల్లెపూలు తీసుకెళ్ళాలని ఈయనకి తెలియదు.

జోర్హాట్ లో మల్లెపూలు ఎక్కడా  అమ్మరు. పెరట్లో కనకాంబరాలు పూసేవి గదా . నేను మెల్లిగా అన్నాను.

అదే మీ  తత్వం. పూలు  కావాల్సి వస్తే కోసుకుంటుంది. పంచదార కొనుక్కు వస్తుంది. 

డబ్బులు నీ దగ్గరే ఉండేవి కదా అమ్మా. సిగరెట్లకి కూడా నాన్న నిన్నే అడిగేవాడు కదే. మా అమ్మాయి. 

అవే తెలివితేటలు మీ నాన్నవి. ఇంటి పని, వంట పని, బజారు పని అన్నీ నావే.  పెత్తనం నాదిగా కనిపించేది. ఆయన చడి  చప్పుడు కాకుండా చేసేసేవాడు. “వాడు డబ్బు కావాలన్నాడే, ఎంతో కొంత పంపించు. వాళ్ళు చందాలు అంటూ వచ్చారు. ఇంట్లో అడగమన్నాను. ఎంతో కొంత ఇయ్యి”. అనవసర ఖర్చులు చేసేవారు. ఇరవై తారీఖున, “డబ్బులు అయిపోయాయి,  వచ్చేటప్పుడు బాంక్ నుంచి తీసుకు రండి”,   అంటే,  అప్పుడే అయిపోయాయా,   అంటూ ఇంత పొడుగ్గా దీర్ఘం తీసేవారు. 

అదేమిటమ్మా ఇంట్లో రాజ్యం నీదే కదా. మా అమ్మాయి అంది. 

రాజ్యమా,  సింగినాదమా? పెళ్ళైన కొత్తలో బాధ్యతలు. ఇంటికి డబ్బు పంపించాలి. చెల్లెలి పెళ్లి. అవి అయ్యేటప్పటికి  మీ  అవసరాలు పెరిగాయి. మధ్యలో ఏదో ఒక ఇబ్బంది. సర్దుకు వచ్చేటప్పటికి తల  ప్రాణం తోకకి వచ్చేది.   
  
మరి ఇంతకాలం సంసారం సజావుగానే  చేసారు కదే. మీ ఇద్దరి మధ్యా ఇంత విబేధాలు ఉన్నాయని మేము కలలో కూడా అనుకోలేదు.

విబేధాలు అంటూ ఏమీ లేవు. ఇప్పటికి మా ఇద్దరికీ ఒకరు అంటే ఇంకొకరికి ప్రేమ, అభిమానం అన్నీ ఉన్నాయి. 

మరి ఏమిటి సమస్య.
   
ఎడ్జస్ట్ మెంటాలిటీ అంటారు కదా. అదే అలవాటు అయింది.  మొదట్లో ఎంత అవస్థ పడ్డానో మీకేం తెలుసు.  వాళ్ళ రుచులు వేరు. నావి వేరు. మా ఇంట్లో ప్రతి దాంట్లో బెల్లం వేసే వారం. ఇక్కడ ప్రతిదీ ఆవ పెట్టడం అలవాటు చేసు కున్నాను.   ఈయన అన్నీ తేలికగా తీసుకునేవాడు.  పెళ్ళైన కొత్తలోఈయన ఆఫీసు కెళితే  ఇంటిలో ఒక్కర్తినే. పనిమనిషి ని  పెట్టుకోకుండా ఇంటి పని అంతా నేనే చేసుకునే దానిని. అదే అలవాటు అయిపొయింది. ఇంక విసుగొచ్చి ఇప్పుడు గత రెండేళ్లగా పని మనిషిని పెట్టుకున్నాను. 

సరేనమ్మా, అది అంతా అయిపొయింది. నువ్వన్నట్టే ఎడ్జస్ట్ అయిపోయారు. ఇద్దరు పిల్లలు. పెళ్ళిళ్ళు చేసారు. మనవలని, మనవరాళ్ళని ఎత్తుకున్నారు. రామా క్రిష్ణా అనుకునే 64 ఏళ్ల వయసులో  నీకు  ఇది ఏమిటి? 

నిజమే  అడ్జస్ట్ అయ్యాం. ఇద్దరం కూడా, నేను ఎక్కువగా  ఆయన కొంచెం  తక్కువగా.    అది ఇంకా సాగుతోంది. ఇలా ఎంతకాలం. నాకు నేనుగా, నా అభిరుచులు, సరదాలకి అనుగుణంగా బతకడానికి అదృష్టం లేదా? 42 ఏళ్ళగా విశ్రాంతి లేకుండా పని చేసి అలసిపోయాను. నాకు విశ్రాంతి కావాలి. 

మా ఇంటికి వచ్చి ఉండండి. హాయిగా విశ్రాంతి గా ఉండే ఏర్పాటు చేస్తాను, మా అబ్బాయి, అమ్మాయి.

కుదరదు.  నేను మీ ఇంటికి వచ్చినా మీరు మాఇంటికి వచ్చినా నాకు పని తప్పదు. మీకు, మీ  పిల్లలకి, ఇష్టమైనవి నా చేత్తో చేసి పెట్టాలనే కోరిక నుంచి తప్పించుకోలేను. ఇక్కడ  మేమిద్దరికి చేసుకునేది కాస్త,   అరడజను మందికి చెయ్యాలి మీ ఇళ్లలో ఎక్కడికి వచ్చినా. నాకు పని ఎక్కువవుతుంది  కానీ విశ్రాంతి దొరకదు. 
 
పోనీ వంట మనిషిని పెట్టుకో ఇక్కడే.

కుదరదు రా. ఇక్కడే ఉంటే కొన్ని కొన్ని జంఝాటనల నుంచి బయట పడలేను. పొద్దున్నే లేచింది మొదలు, ఈ వేళ ఏం వండాలి, పని మనిషి వస్తుందా రాదా, రాత్రి ఈయన రెండు మాట్లు లేచాడు, నాల్గు మాట్లు దగ్గాడు. జలుబేనా, డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాలా? రేపు వాళ్ళు వస్తారు, ఏం పెట్టాలి, ఇత్యాదులు ఆలోచించకుండా ఉండలేను. తాపత్రయ పడకుండా కూచోలేను.  అందుకనే వీటికి దూరంగా  నేనో ఓల్డ్ ఏజ్ హోం లో చేరుతాను. ఇది నా నిర్ణయం. మారదు.  ఆర్నెల్లకో సారి మిమ్మల్ని పిల్లల్ని చూడడానికి వస్తాను. 

మరి నాన్న సంగతి.

ఆయనా మీ దగ్గరికి రాడు. ఆయనని  మరెక్కడో ఇంకో ఓల్డ్ ఏజ్ హోం లో చేర్చండి. మా హోం కి దూరంగా.

నాన్నా నువ్వేమంటావు.

అనడానికి ఇంకేముంది. మీ అమ్మ మాట నేను ఎప్పుడు కాదన్నాను. అలాగే కానివ్వండి. విడాకులు  వద్దు. విడిగా ఉంటాం. రెండు మూడేళ్ళ తరువాత మళ్ళీ ఆలోచిద్దాం. అప్పటికి మీ అమ్మ మారుతుందని ఆశిద్దాం. 

ఇంకో రెండు రోజులు దీర్ఘ చర్చల తరువాత ప్రభావతి, ప్రద్యుమ్నులు విడి విడిగా బతకటానికి ఒప్పందం కుదిరిపోయింది. 

ఒక నెల రోజుల తరువాత  ప్రభావతి హైదరాబాద్ లో, ప్రద్యుమ్నుడు  వైజాగ్ లోనూ ఓల్డ్ ఏజ్ హోం లలో చేరిపోయారు. 


విడిగా ఎంతకాలం ఉంటారు, మళ్ళీ  కలుస్తారా, విడాకులు తీసేసుకుంటారా. ఏమో,  వేచి చూడాలి.  కాలమే సమాధానం చెప్పాలి.