మా ఆవిడ ముచ్చట్లు

కొంతమందికి ఊత పదాలుంటాయి. కాని మాఆవిడకి ఊతవాక్యాలే ఉన్నాయి. నో పదమ్సు, ఓన్లీ వాక్యమ్స్ అన్నమాట. 

మాపెళ్ళైన మరుసటి రోజు మనుగుడుపులు, మిగతా కార్యక్రమం నిమిత్తం మాఆవిడ, ఆమె బంధువులు నలుగురైదురుగురు మాఇంటికి విచ్చేసారు, రాత్రి సుమారు పది గంటలకి. భోజనాలు చేసి వెంటనే పడకలు వేసేసారు. మాఆవిడతో మాట్లాడదామని ప్రయత్నించాను కాని కుదరలేదు. నాజాతకం అల్లాంటిది లెండి. నో పెళ్ళిచూపులు. మారేజి లుక్స్ పెళ్ళిలో తెరతీసిన తర్వాతే నన్నమాట. పెళ్ళికి ముందు మాఆవిడ నాఫొటో చూసింది కాని నాకు ఆభాగ్యం కూడా కలుగలేదు. 

 

పెళ్ళికి సరిగ్గా పన్నెండు రోజుల ముందు మా పితాశ్రీ గారు నాకు ఓ టెలిగ్రాము పంపారు. మారేజి ఫిక్స్డ్, స్టార్ట్ ఇమ్మీడియట్లీ. అని. ఆటెలిగ్రాము పట్టుకొని మాబాసుగారి దగ్గరకెళ్ళి చూపించాను. శలవా కుదరదు అన్నాడు. ఇప్పటికే నువ్వు రెండు మాట్లు పెళ్ళి అని శలవు పెట్టావు అని కోప్పడ్డాడు. ఒక్కమాటే సారూ, మాఅన్నయ్య పెళ్ళికి అదీ రెండేళ్ళ క్రితం అని అన్నాను. సరే ఓ వారం తీసుకో అన్నాడు. ఆయనతోటి బేరమాడి ఎల్లాగైతేనేం, 15రోజులకి ఒప్పించాను. జోర్హాట్ నించి రావడానికి, పోవడానికి ఓవారం తీసేస్తే మిగిలేది ఓవారం అన్నమాట. .ఆవిషయం మానాన్నగార్కి కూడా తెలియపర్చాను. అందువల్ల కార్యక్రమాలన్నీ వెంటవెంటనే ఏర్పాటు చేసేరన్నమాట. 

 

సరే అసలు కధలోకి వస్తే, తెల్లవారి నేను డాబామీద నించి కిందకి వచ్చేటప్పటికి, ఇల్లంతా హడావడిగా ఉంది. ఇంట్లోవాళ్ళంతా నన్నుజాలిగా చూసారు. మాబావ “పాపం పసివాడు” అని నవ్వాడు. నాకు అర్ధంకాలేదు. సిగరెట్టు కాల్చుకోడానికి వీధిలోకి వచ్చాను. అప్పుడు చూసాను ఓచెంబు, రెండుగ్లాసులు, ఓచాప పెట్టుకొని మాఆవిడ వీధి అరుగు మీద కూర్చుంది. పక్కనే కొంచెం దూరంగా కుర్చీలో వారిఅక్కగారు ఆసీనులయ్యారు. 

అప్పుడు అర్దం అయింది నాకు. ఔరా అనుకున్నాను, కోపం వచ్చింది, దుఃఖం వచ్చింది. ఏంచెయ్యాలో తోచలేదు. అప్పుడు మాఅవిడతో అన్నాను. కొంచెం జాగ్రత్త పడవచ్చు గదా అని. వారి అక్కగారు కిసుక్కున నవ్వేరు. మాఆవిడ అక్కకేసి చూసింది, ఆకాశంకేసి చూసింది, మాఇంటి ఎదురుగా ఉన్న చెరువు కేసి చూసి, నాకేసి చూసి అంది “ మీ మొహం, మీకేం తెలుసండి” అని. ఇవి మాఆవిడ నాతో మాట్లాడిన మొదటి మాటలు, ప్రేమ సంభాషణ, తొలి పలుకులు, లవ్ నతింగ్స్, మొహబ్బతికి బాతేం. మొదటిసారి పతిదేవుడితో సతీపతివ్రత మాట్లాడిన వాక్యం విన్నప్పుడే అనుకున్నాను మదీయ కొంప కొల్లేరు అవుతుందని. 

మళ్ళీ రెండునెలల దాకా ముహూర్తాలు లేవురా, మళ్ళీ రావల్సిందే అని మానాన్నగారు నిర్ణయం చెప్పేసారు. మాబావ “పాపం వీడి పునస్సంధాన ముహూర్తం లస్కుటపా అయింది” అని జాలిపడ్డాడు.


మళ్ళీ మాబాసుగారిని బతిమాలి, ప్రాధేయపడి ఆర్నెల్లతర్వాత 15రోజులు శలవు తీసుకొని, వచ్చి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని, హనీమూన్ రైల్లోనే కానిచ్చేసి, కాపురానికి జోర్హాట్ తీసుకొచ్చేసాను. 

 

మర్నాడు మాఆవిడ వంట మొదలు పెట్టింది. పొద్దున్నే ఉప్మా చేయడానికి ఉపక్రమించింది. నేను ఆఫీసు కి వెళ్ళడానికి రెడీ అయ్యి కూర్చున్నాను ఉప్మాకోసం. మాఆవిడ వంటింట్లోంచి వచ్చి కరివేపాకు తీసుకురాలేదా అంది. నువ్వు రాసిన లిస్టులో సామాన్లన్నీ తీసుకొచ్చాను. నువ్వుకరివేపాకు రాసిఉండవు నేను తీసుకు రాలేదు అన్నాను. పెళ్ళానికి మల్లెపూవులు తీసుకురావాలని, కూరల్లోకి కరివేపాకు తీసుకురావాలని కూడా చెప్పాలటండి అంది. నాకూ గుర్తు లేదు అంటూ నేను రాజీకి వచ్చేసాను. మాఆవిడ నాకేసి చూసింది, బెడ్ రూములో వాళ్ళ గ్రూపుఫొటొకేసి చూసింది, (జొర్హాట్ వచ్చిన రోజునే బెడ్ రూములో మేకుకొట్టి వాళ్ళ ఫొటొ ఒకటి తగిల్చేసింది.) వంటింట్లో గూట్లో కూర్చున్న రమాసహిత వెంకటేశ్వరస్వామిని చూసింది, ఆకాశంలోకి చూసింది. చూసి “ఇల్లాంటి వారిని కట్టపెట్టే వేమిరా దేవుడా” అని విచారంగా అంది. ఇది నాకు అనుభవంలోకి వచ్చిన రెండో ఊతవాక్యం. గమనించారో లేదో మీరు, మాఆవిడ దేవుడిని కూడా ఏకవచనంలో సంభోదించిది, పైగా రా అనికూడా అంది, నన్నుమటుకు ‘వారి’ అనే అంది. పతివ్రతా లక్షణాలు లేకపోలేదు అనుకొని సంతోషించాను (ఇంతటి అల్ప సంతోషివి కాబట్టే అది నిన్ను అల్లా ఆడించేస్తోందిరా అని మావాళ్ళు అంటారు). సరే కరివేపాకు రహిత ఉప్మానే సేవించి నేను ఆఫీసు కెళ్ళి పోయాను. 

 

ఆఫీసు కెళ్ళాక ఒక సందేహం వచ్చింది. ఊతవాక్యాలు అనేటప్పుడు మాఆవిడ దిక్కులు, వాళ్ళకేసి, వీళ్ళకేసి ఎందుకు చూస్తుందీ అని. ధైర్యంచేసి మాఆవిడను అడిగేసాను. సినీమాలు చూడరా అంది. నాగేశ్వరరావు ఏంచేస్తాడు? గుమ్మడికేసి చూస్తాడు, సావిత్రికేసి చూస్తాడు, కిటికీలోంచి శూన్యంలోకి చూస్తాడు. ఆతర్వాత వాళ్ళు కూడా ఈయనకేసి చూస్తారు. అప్పుడు కాని బరువైన డైలాగు వదలడన్నమాట అంది. ఐ సీ అనుకున్నాను. నేను నాగేశ్వరావు వీరాభిమానిని అని కూడా చెప్పింది. నాగేశ్వరరావుకి ప్రేమలేఖ కూడా వ్రాసిందిట. ఆయన కాకపోతే ఎవడైతే ఏంటి అని నన్ను పెళ్ళి చేసుకునేందుకి ఒప్పుకుందిట.

ఓరోజున నేను ఆఫీసు నించి వచ్చేటప్పటికి చాలా సీరియస్ గా ఉంది మాఆవిడ. మద్యాహ్నం వాళ్ళ అమ్మ గారింటి నించి ఉత్తరం వచ్చింది. ఏంటి సంగతులు అని అడిగాను. “చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత మహాదేవా” అంది. మాపెళ్ళి సంబందం కుదిరేముందు, ఇంకోఆయన ఈవిడని చూడ్డానికి వచ్చాడుట. హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడట, ఐదారు వందలు తెచ్చుకుంటున్నాడట. నిశ్చయం చేసుకుందా మనుకుంటున్న సమయంలో మా సంబంధం తెలియడం జరిగిందిట. అప్పటికే నేను నాలుగు అంకెల జీతం తీసుకుంటున్నానని నన్ను పెళ్ళి చేసుకుందిట. ఇప్పుడు ఆ శేఖరంగారు సివిల్స్ కి సెలక్టు అయ్యాడట. రేపో మాపో IAS ట్రైనింగు కు వెడుతున్నాడట. ఏంచేస్తాం “చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత మహాదేవా” నాఖర్మ ఇలాగయింది అని అంది.

ఈ ఊతవాక్యాలు రోజుకి కనీసం ఒకటి రెండు మాట్లైనా అనకపోతే ఆవిడకు తోచదు. ఇవికాక ఇంకా కొన్ని ఉన్నాయి. కాని వీటంతటి తరుచుగా ఉపయోగించదు. భరించువాడు భర్త అంటారు. కాబట్టి ఆవిడ ఏమన్నా భరించక తప్పుతుందా. 

 

 

గమనిక :- మొదటి మాటు ఈ టపా ఈ బ్లాగులో 24/08/2010 లో ప్రచురితమైనది. ప్రభావతి, ప్రద్యుమ్నుల కధలు వ్రాయడానికి ఈ టపా నాంది. స్ఫూర్తి అన్నా ఫరవాలేదు అనుకుంటాను. 

 

ఆకాలంలో మా కాలనీని నానా రాష్ట్ర సమతి అని పిలుచుకునే వాళ్ళం. సుమారు పది పన్నెండు రాష్రాల వాళ్ళు ఉండేవారు. అక్కడ RRL మొదలు పెట్టి నేను జేరేటప్పటికి రెండు మూడు ఏళ్లు మాత్రమే అయింది. మొత్తం ఉద్యోగులు వంద మంది కంటే తక్కువే అనుకుంటాను. కాలనీ లో ఒక నలభై కుటుంబాలు, పదిమంది ఒంటరి పక్షులు ఉండేవారు. వీరిలో అత్యధికులు మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన వారే. వాతావరణం చాలా స్నేహ పూర్వకం గా ఉండేది. అంతా చాలా కలసి కట్టుగా, అరమరికలు లేకుండా ఉండేవాళ్ళం.  రాజకీయాలు అసలు ఆఫీసు గేటు దాటి కాలనీ లోకి వచ్చేవి కావు.ఆఫీసులో కూడా రాజకీయాలు  చాలా  తక్కువ. 

 

ముఖ్యంగా రహస్యాలు చాలా తక్కువ. ఎవరింట్లో ఏం జరిగినా కాలనీ అంతా తెలిసిపోయేది. అప్పుడు కాలనీ లో జరిగిన సంఘటనల ఆధారంగా ప్రభావతి ప్రద్యుమ్నుల కధలు వ్రాయడం జరిగింది. సరదాగా ఉండే వాటినే వ్రాశాను. అందులో కూడా హాస్యం కోసం కొంత (ఎక్కువుగానే) కల్పన జోడించాను.