నా జీవిత చరిత్ర ...... నా చదువు

చదువు ‘కునే’ కాలం అయినా చదువు ‘కొనే’ కాలం అయినా అది ప్రతీ మనిషి జీవితం లో ఒక క్లిష్టమైన కాలం. మా కాలం లో ఒక 2 – 3 శాతం కొనే వాళ్ళున్నా మిగతా వాళ్ళంతా కునే వాళ్ళే.  కొనే వాళ్ళు కూడా మరీ విచ్చలవిడిగా కొనే వాళ్ళు కాదు. రహస్యం గా పకడ్బందిగా అనుమానం రాకుండా కొనుక్కునే వారు.

చదువు అనేది ఒక జబ్బు, అది పిల్లల తల్లి  తండ్రులకి వస్తుంది అని మా మిత్రుడొకడు నిర్వచనం చేసాడు.  ఈ జబ్బు కూడా విచిత్రమైనది. పిల్లలు కనిపిస్తే ఎక్కువయేది. "అల్లా అడ్డగాడిద లా తిరగక పొతే చదువుకో కూడదా" అని కేకలేసేవారు, కనిపిస్తే . అవసరమైతే తప్ప వారి ముఖ్యం గా తండ్రి  కంట పడకుండా తిరిగేవారు.  పిల్లలు వజ్రాలు, వాళ్ళని సాన బెట్టితే ప్రకాశించేస్తారు. వూళ్ళో  కరంటు లేకపోయినా సమస్య ఉండదు అన్న అభిప్రాయం వాళ్ళది. ఈ సాన  పెట్టడానికి  బడిలో ఉపాధ్యాయులు  అవిశ్రాంతంగా కృషి చేసేవారు. సాన పెట్టడం లో వారు సాధారణం గా సామ, దండోపాయాలనే ఉపయోగించేవారు. వారికి దాన, బేధ ఉపాయాలు ఆట్టే తెలియవు. సాన పెట్టడానికి గురువులు తమ తమ ఆయుధాలను పరమ పవిత్రం గా పూజించేవారు. ఒకరు తమ చేతులనే నమ్ముకుంటే, కొందరు బెత్తాలను, మరి కొందరు డస్టర్ ను ఉపయోగించే వారు. వాటి ప్రయోగాలను వివిధ రీతులలో చేసేవారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క పధ్ధతి. వారి ఆయుధ ప్రయోగాలనుంచి తప్పించుకోవడం ఒక యుద్ధ కళ. అనుభవ రాహిత్యం వల్ల పిల్లలు ఓడిపోయేవారు. జయం ఎప్పుడూ మాస్టారు గారిదే అయ్యేది.      

ఇంటిలో తల్లితండ్రులు యధావిధి తోడ్పాటు అందించే వారు. కానీ తల్లి  తండ్రులు నాలుగు ఉపాయాలూ  వాడేవారు.

చదువు కోక పొతే ఎందుకూ పనికి రావు, మంచి ఉద్యోగం చెయ్యాలంటే బాగా చదువు కోవాలి, 
పరీక్షల్లో మంచి మార్కులు వస్తే ఐస్ క్రీం కానీ మరొకటి కానీ ఇస్తాం,
చంద్రం గాడికి 70 మార్కులు వచ్చేయి, వెధవా సిగ్గులేదా నీకు 42 వచ్చా యేమిటి,
చచ్చు వెధవా చదువంటే ఇంత అశ్రద్ద ఎందుకురా, సరిగ్గా చదువుతావా లేదా అంటూ కఱ్ఱ పుచ్చుకోవడం.


తల్లి తండ్రులు చిన్నప్పటి నుంచి ఎందుకు ఆర్జన చేయమంటారో నాకు ఎప్పటికీ అర్ధం కాదు. నాలుగున్నర, ఐదు ఏళ్లు రాగానే బడిలో వేసేస్తారు విద్యార్జన చేయమని. పడుతూ లేస్తూ, తన్నుతూ పునాదులు గట్టి పరుచుకుంటూ ఏదో విధం గా చదువు పూర్తి చేసిన తరువాత ఉద్యోగం చేసి ధనార్జన చేయమంటారు. ఉద్యోగం చేస్తుండగానో,  కొండొకొచో  ముందుగానో  కూడా  ప్రేమార్జన చేసుకోమని పెళ్లి చేసేస్తారు. ఆ తరువాత సంతానార్జన చేయమంటారు. మధ్యలో సిగ్గు,  శరము ఆర్జించ మంటారు. పెళ్ళైన తరువాత ముఖ్యం గా మగవారు,  అవి వదిలేస్తారు ట. సిగ్గు శరము లేకుండా పెళ్ళాం కొంగు పట్టుకు తిరుగుతాడు అని అంటారు. మంచివాడు, బుద్ధిమంతుడు అనే పేరు ఆర్జన చేయడం,  చివరగా “హే భగవాన్ నేను బతికి ఎవరికి లాభం” అంటూ భక్తార్జన. ఇలా జీవితమంతా ఏదో ఒకటి ఆర్జిస్తూనే గడచి పోతుంది.   వీటన్నిటికి మూలం విద్యార్జన.

ఇతి ఉపోద్ఘాతః సమాప్తః.
(ఉపోద్ఘాతమే ఇంత ఘాతకం గా ఉంటే అని చదవడం ఆపకండి.) 

నాలుగ్గున్నర ఏళ్లు పూర్తిగా నిండకుండానే,  ఓ పలకా బలపం చేతిలో పెట్టి బడిలో పాడేశారు నన్ను. అసలు నవంబర్  నెలలో  పుట్టడమే ఒక పెద్ద పూర్వ జన్మ పాపం.  ఇంట్లో అల్లరి తప్పించుకోటానికి , ఒక ఐదారు నెలలు వయసు పెంచి ఐదు ఏళ్లు అని నొక్కి వక్కాణించి  బోర్డ్ స్కూల్  అనబడే ఎలిమెంటరి బడిలో జేర్చేసారు.  చేర్చిన తరువాత ఒక రెండేళ్ళు నా చదువు గురించి పెద్దగా ఎవరూ పట్టించు కోలేదు. ఏదో నెలకి రెండు మూడు పలకలు, ఒక బలపం పాకెట్టు తప్ప మా నాన్న గారిని ఎక్కువగా కష్ట పెట్టలేదు నేను. మూడో క్లాసు కి వచ్చేటప్పటికి మా మాష్టారుకి నాకు అభిప్రాయ బేధాలు మొదలయ్యాయి.  స్రుష్టి  అని నేను వ్రాస్తే సృష్టి అని వ్రాయాలనే వారు. ఆరు మూళ్ళు  పదహారు అని నేనంటే కాదు పద్దెనిమిది అని దెబ్బలాడి దెబ్బలేసేవారు. మెల్లిగా ఈ అభిప్రాయ బేధాలు తీవ్రమై నేను మా మాష్టారు తో మాట్లాడడం మానేసాను. ఆయన ఏమి ప్రశ్న వేసినా మౌనంగా ఉండడం అలవాటు చేసుకున్నాను, బుఱ్ఱ గోక్కుంటూనో, ముక్కు బరుక్కుంటూనో. దీని ఫలితం గా ఎక్కువ కాలం స్కూల్లో నేను బెంచి మీద నుంచునో,  లేక బయట ఎండలో నుంచునో కాలం గడపడం ఎక్కువ అయింది.  మా మాష్టారుకి సమస్యలు సామరస్యం గా పరిష్కరించుకునే ఉద్దేశ్యం లేకపోవడం వల్ల మా నాన్నగారికి విషయం విశదీకరించి  న్యాయం చేయమన్నారు.  మా నాన్నగారు నా వాదన వినకుండానే,  సంస్కృతం లో తిడుతూ నా శరీరం తో చెడుగుడు ఆడుకున్నారు. ఇక్కడో విషయం మనవి చేసుకోవాలి. సాధారణంగా మా అమ్మగారికి,  నాన్నగారికి అభిప్రాయ బేధాలు ఎక్కువగానే ఉండేవి. ఈ బేధాలు ఒక్కోటప్పుడు తీవ్రం గానే ఉండేవి. కోపం ఎక్కువయితే మా నాన్న గారు అగ్ని బాణం వేసేవారు. మా అమ్మగారు ఫైర్ ఇంజన్ బాణం వేసేవారు. ఆయన నాగ బాణం వేస్తే అమ్మగారు షేక్ చిన మౌలానా బాణం వేసేవారు. ఆయన పర్వతాస్త్రం వేస్తే ఈమె ఎలాకాస్త్రం వేసేవారు. ఎక్కువగా మా అమ్మగారు మా నాన్నగారు వేసే బాణాలు ఉపసంహరించే వారు అన్న మాట. ఇంకో విషయం కూడా మీకు అర్ధం అయిఉండాలి. మా నాన్నగారివి  పాతకాలపు అలవాట్లు, మా అమ్మగారు కొంచెం ఆధునిక పోకడలు అలవాటు చేసుకున్నారన్న మాట.   కానీ, నా చదువు విషయం లో ఆమె మా నాన్నగారితో  ఏకీభవించేవారు. “వెయ్యండి వెధవని ఇంకో రెండు, చదువుకోక గాడిదలను కాస్తాడటా”  అంటూ ఇంకా ఉత్సాహ పరిచేవారు. మా నాన్నగారు ద్విగుణీకృతోత్సాహం  తో మా మాష్టారుకి  నా శరీరం మీద సకల హక్కులు ప్రదానం చేసేసారు. మొత్తం మీద మా మాష్టార్లు నా వీపు, తొడ,  ఉద్యద్దినకరుడు లాగ ప్రకాశింప చేసి నాలుగో క్లాసు కూడా అయిందనిపించేసారు. నా పీడ వదిలించు కోవడానికి నాలుగు లో నాకు బోల్డు మార్కులు వేసి, “ఐదో క్లాసు చదవఖ్ఖర్లేదు, తీసుకెళ్ళి 1st. ఫారం లో చేర్పించేయండి”  అని సలహా ఇచ్చి ఊపిరి పీల్చుకున్నారు.   మా నాన్నగారు హైస్కూల్ లో ఉపాధ్యాయుడు గారు కాబట్టి నాకు ప్రవేశం దొరికి పోయింది హైస్కూల్ లో.  

హైస్కూల్ చదువు నా జీవితం లో నాకు ఎన్నో  పాఠాలు నేర్పింది. ఇన్ని పాఠాలు నేను  నేర్చుకోవడానికి కారణం మా నాన్నగారు ఆ స్కూల్ లోనే ఉపాధ్యాయుడు కావడమే. తల్లితండ్రులు పని చేస్తున్న స్కూల్ లో చదవడం కన్నా కష్టమైనది మరొకటి లేదని నా  దృఢ నమ్మకం.  చేరిన రెండు మూడు నెలల్లోనే నాకు పండిత పుత్రః అనే బిరుదు ఇచ్చేసారు మాష్టార్లు.  మాష్టార్ల  పుత్రులు  అందరికీ ఆదర్శంగా ఉండాలని అనుకునేవారు. మనం క్లాసులో  అల్లరి  చేయడానికి కుదరదు. చేస్తే కబురు వెళ్ళిపోయేది. మా నాన్నగారు వహ్వ తాజ్ అనిపించేసేవారు. క్లాసు బయట అల్లరి చేసినా గురువులకు తెలిస్తే,  మా నాన్నగారు  ఉస్తాద్ అల్లా రాఖా   అయిపోయి నన్ను పండిట్ జస్రాజ్ ని చేసేసేవారు.  ఆయన వాయించేస్తుంటే మనం రాగాలాపన చేసేవాళ్ళం అన్నమాట.  

మనం మొదటి వరస లోనే కూచోవాలి. మాష్టార్లు అడిగిన వాటిలో కనీసం 60 – 70 శాతం ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. లేకపోతే  కబురు వెళ్ళిపోయేది. నేను నాలోని  ఘంటసాల ని మేల్కొల్పాల్సి వచ్చేది. ఎంత తెలుగు మాష్టారు గారి అబ్బాయి అయినా,  మూడవ ఫారం చదువుతుంటే మట్టుకు,   ‘శరజ్జ్యోత్స్న’ అని  వ్రాయడం కుదురుతుందా అని ప్రశ్నిస్తున్నాను. (ఇంతకీ ఇప్పుడైనా సరిగ్గా వ్రాసానా ?) అక్బర్ బాదుషా  గారి కొడుకు పేరు నాకు తెలియకపోతే చరిత్ర మారిపోతుందా ? కిరణ జన్య సంయోగ క్రియలో ఏ వాయువు విడుదల అవుతుందో నేనూ చెప్పలేకపోతే చెట్లు బతకవా?   రోజంతా ఏడిస్తే కానీ రెండు జీళ్ళు కొనుక్కోడానికి  ‘కానీ’  సంపాయించ లేని నాకు వడ్డీ లెఖ్ఖలు తెలియక పొతే దేశానికి వచ్చే నష్టం ఏమిటట?  అకేషన్ లో రెండు యస్ లు పెడితే దాని అర్ధం మారిపోతుందా?   ఎన్నో జవాబు లేని ప్రశ్నలు నా బుఱ్ఱ లో సుడులు తిరిగేవి. మా మాష్టర్లు మట్టుకు నెత్తి మీద మొట్టికాయలు వేస్తూనే ఉండేవారు.  ఇంట్లో నాన్నగారు కోప్పడేవారు నేను  తప్పుచేస్తే. అదే స్కూల్ లో తప్పుచేస్తే క్రుద్ధులు అయిపోయేవారు.  అర్ధం అడగకండి. వారు క్రుద్ధులు కాకుండా చూసుకునే గురుతర బాధ్యత నాకు ఉండేది.  ఇటువంటి కారణాల వల్ల నేను స్కూల్లో బుద్ధిమంతుడు గా ఉండవలసిన అగత్యం ఏర్పడింది. గురువులకు కోపం తెచ్చే పనులు ఏమి చేసేవాడిని కాను. బెమ్మాండం గా కాకపోయినా మంచి మార్కులే వచ్చేటట్టు చదివే వాడిని. క్లాసులో మొదటి ముగ్గురు లోనే ఉండేవాడిని.
  
ఇక్కడ,  నేను మూడవ  ఫారం చదువుతుండగా జరిగిన విషయం ఒకటి చెప్పాలి. ఆ ఏడు మా స్కూల్లో ఒక కొత్త అమ్మాయి చేరింది. పేరు మంగ తాయారు. అప్పటిదాకా మా క్లాసులో ఆరుగురు అమ్మాయిలు ఉండేవారు.  వీళ్ళలో  నలుగురు    చిన్నప్పటి నుంచి మా తోటి  దెబ్బలాడి సిగపట్లు పట్టిన తింగరి బుచ్చిలు. ఇంకో ఇద్దరు పుర ప్రముఖుల పిల్లలు. వాళ్ళ జోలికి వెళ్ళితే వీపు మీద రాండోళ్ళు మోగుతాయనే  భయం ఉండేది.  మంగ తాయారు రాకతో మాకు ఒక హీరోయిన్ దొరికినట్టు ఫీల్ అయ్యాం. ఆ అమ్మాయి  కొంచెం నాజుకుగా డ్రెస్ వేసుకునేది. అంటే మీరు మరోలా అనుకోవద్దు. ఆ అమ్మాయి అప్పుడప్పుడు పరికిణీలు వేసుకున్నా ఎక్కువగా   ఫ్రాక్స్ వేసుకోనేది.  మిగతా మలయాళాలు పరికిణీలు ఎక్కువ, తక్కువగా  గౌన్లు వేసుకునేవారు.  గౌను  అంటే పొడుగులో ఫ్రాక్ కి ఎక్కువ పరికిణీకి తక్కువా అన్నమాట. వాళ్ళు వేసుకునే గౌను ఒక ఆరేడు నెలలు అయే టప్పటికి వెలిసి పోయిన ఫ్రాక్ అయేది. కానీ అప్పటికే వారి చుట్టుకొలతలు మారడం వల్ల అది వదిలేసి మళ్ళి ఇంకో గౌను  కుట్టించుకునే వారు, వదులుగా, మోకాళ్ళ కిందకి ఒక జానెడు ఉండేటట్టు. అదృష్టవశాత్తు,  తాయారు ఇల్లు మేం స్కూల్ కు వెళ్ళే దారిలోనే ఉండేది. రోజూ ఆ అమ్మాయి వెనకే వెళ్ళేవాళ్ళం. నేను పాట పాడేవాడిని “ఓ చందమామ రెండు జడల భామ ఏమన్నదో తెలుపుమా” అంటూ. మా బండోడు టింగ్ టింగ్ అంటూ గిటారు, బుజ్జిగాడు డం డం డడం అంటూ తబలా, టుయ్ టుయ్ టుయ్ అంటూ శేఖర్ గాడు వీణ, చంద్రం గాడు తూ తూ తూ అంటూ తూతూపాకా వాయించేవాళ్ళు. ఒక రోజున తాయారు రెండు జడలలోను రెండు గులాబీలు పెట్టుకుని వచ్చింది. మాములుగానే మేము కొంచెం దూరం లో నిలయ విద్వాంసుల సంగీత సమ్మేళనం తో వెంట నడుస్తున్నాం. ఉన్నట్టుండి ఒక గులాబీ జారి కింద పడింది. నేను నడకలాంటి పరుగుతో వెళ్లి అది తీసుకున్నాను. పాపం,  తాయారు గులాబీ నేను ఇస్తాననుకుంది. నేను ఇవ్వలేదు. ఆ గులాబి పంచుకోవడం లో ప్రాణ మిత్రుల మధ్య అభిప్రాయ బేధాలు వచ్చేసాయి. చివరికి రేకలు పీకి అందరం పంచుకున్నాం.  నాకు రెండు రేకలు వచ్చాయి. అప్పుడే నేను విజ్ఞాన శాస్త్రం లో ఒక  గొప్ప విషయం కనుక్కున్నాను. లెఖ్ఖల పుస్తకం లో పెట్టిన గులాబి రేకలు ఎక్కువ కాలం ఎండకుండా ఉంటాయి. మిగతా పుస్తకాలలో పెడితే త్వరగా ఎండిపోతాయి.  ఈ ఆవిష్కరణ ప్రాముఖ్యత అప్పుడు మాకు తెలియ లేదు కానీ చిన్న సైజు నోబుల్ బహుమతి వచ్చి ఉండేదేమో.    

 స్కూల్లో డిబేట్ లలో పాల్గొనేవాడిని. అక్కడ వితండ వాదనలు చేసేవాడిని. కత్తి గొప్పదా కలం గొప్పదా ? అనే చర్చలో నేను కత్తి గొప్పదనే వాడిని. కలం గురించి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా కత్తి పోటు తగిలితే కానీ దాని గొప్పతనం తెలియదు అని వాదించే వాడిని. స్త్రీ కి స్వాతంత్ర్యం కావాలా వద్దా అనే విషయం లో అసలు మా వీధిలో స్వాతంత్ర్యం ఉన్న పురుషుడిని చూపించమన్నాను.  మా వీధిలో మా స్కూల్ మాష్టార్లు ఐదుగురు ఉండేవారు. మా మాష్టార్లు నవ్వి ఊరుకున్నారు కానీ వీపు మీద విమానాలు నడపలేదు.

నాలుగవ ఫారం కి వచ్చేటప్పటికి చాలా మంది అమ్మాయిలు ఎవరూ మాతో మాట్లాడేవారు కాదు. మా ముందు నడిచే వారు కాదు. గుంపుగా ఏ మాష్టారు పక్కనో వెళ్ళేవారు. పుస్తకాలు కావాల్సి వచ్చినా మాష్టారు మధ్యవర్తిగా ఉండేవారు. మా దగ్గర తీసుకొని వాళ్లకు ఇచ్చేవారు. మా తింగరి బుచ్చిలు కూడా “అత్తయ్య గారూ, ప్రద్యుమ్నుడి పుస్తకం కావాలి” అని పట్టుకెళ్ళేవారు, నేను ఇంట్లో లేనప్పుడు.  ఉన్నట్టుండి మేము అంటరాని వారి గా ఎందుకయ్యామో కొంత కాలం అయిన తరువాత కానీ తెలియలేదు. మమ్మల్ని కూడా   రాజనాల లాగే గుర్తించారా అని విస్మయ పడ్డాం. 

ఐదు, ఆరు  ఫారం లకు వచ్చేటప్పటికి మా మాష్టార్లు కూడా మాకు గౌరవం ఇవ్వడం మొదలు పెట్టారు. మిమ్మల్ని కొడితే మా చేతులే నొప్పి పెడతాయిరా అనేవారు నవ్వుతూ. కధకళి చేయించేవారు కాదు.  ఎప్పుడైనా తప్పకపోతే,   వచన కవిత్వం మాత్రమే ఉపయోగించేవారు.  కష్టపడి స్కూల్ చదువులు గట్టేక్కించేసాము.

కాలేజి కొచ్చిం తరువాత కొన్ని రూల్స్ మారుతాయి. మనం కుఱ్ఱ చేష్టలు మానేసి పెద్ద మనిషి తరహా అలవరుచుకోవాలి.  జేబులో బఠానీలు, బల్లి గుడ్లు ఉండరాదు. జీళ్ళు నోట్లో సాగ దీయకూడదు. నలుగురూ చూస్తుండగా  ఐస్ ఫ్రూట్ చీకరాదు, పిడత కింద పప్పు తినరాదు. సినిమాకి వెళితే కుర్చీ లోనే కూర్చోవాలి. చిప్స్ మాత్రమే తినాలి. సోడాలు  తాగవచ్చును కానీ గోల్డ్ స్పాట్ గౌరవ ప్రదం. అన్నట్టు అసలు విషయం, నిక్కర్ల నుంచి ఫేంట్లకి ఎదుగుతాం. కాలికి చెప్పులు వస్తాయి.   

మనం మనం గా ఉండే అవకాశాలు తగ్గిపోతాయి. బరువు బాధ్యతలు అర్ధం అవుతూ ఉంటాయి. మధ్య తరగతి బతుకుల లోని సున్నితమైన అంశాలు ముఖ్యంగా ఆర్ధికమైనవి  గ్రహింపుకు వస్తుంటాయి. తండ్రి ఒక రూపాయి మనకి ఇస్తే మనం ఎంత సంతోషిస్తామో, ఇవ్వలేక పోతే అంతకు రెండు రెట్లు ఆయన బాధపడుతారని అర్ధం చేసుకుంటాం. కోరికలు, అవసరాలు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాం.      బాల్యం లో ఉన్న స్వేచ్చ, అమాయకత్వం, నలుగురి తో కలిసి పోయే స్వభావం తగ్గుతుంది.  ఒక స్పాంటేనియటి కోల్పోతాం.  అల్లరి మీద కన్నా చదువు మీద శ్రద్ధ పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తాం.

మా ఊరి  కాలేజి లో ఒక ఏడాది ప్రీ యూనివర్సిటి కోర్స్, ఆ తరువాత ఆంధ్రా యూనివర్సిటి లో  నాలుగేళ్ల బి.యస్సి.(ఆనర్స్),  ఇంకో ఏడాది యం.యస్సి. చేసి దేశం మీద పడ్డాం పొట్ట చేత్తో పట్టుకొని. ఈ ఆరేళ్ళ కాలేజి చదువులోనూ అల్లరి చేసాం. యుద్ధాలు చేసాం. స్నేహితులతో కలసి ఆనందించాము.  కానీ ఆలోచించకుండా ఏది చెయ్యలేదు, స్నేహం కూడా.    

కాలేజి  రోజులు మధురం గానే ఉన్నాయి. అక్కడ మా  అంతట మేమే ఎదిగాం ఎక్కువగా.  మాకేమి తెలియని రోజుల్లో స్కూల్లో మమ్మల్ని తీర్చి దిద్దారు మా మాష్టర్లు. మమ్మల్ని తిట్టినా, కొట్టినా మేము నాలుగు ముక్కలు నేర్చుకోవాలనే తపనే కనిపించేది వారిలో. మంచి, చెడు చెప్పేవారు.   

అన్నట్టు, చదువు అయిన తరువాత  మొదటి ఉద్యోగం లో చేరడానికి వెళ్లేముందు,  నా చేత అక్షరాలు దిద్దించిన ఎలిమెంటరీ స్కూల్  మాష్టారుకి పాదాభి వందనం చేయించి మరీ పంపారు మా నాన్నగారు.