మా ఆవిడకు విడాకులు ఇచ్చేస్తాను

ఉపోద్ఘాతం: ఈ టపా తిరిగి వెయ్యడానికి ఒక కారణం ఉంది. కిందటి నెలలో రెండు దినాలు వచ్చాయి. ఒకటి జూన్ 14 న ఈ బ్లాగు పుట్టిన రోజు. మరిచే పోయాను. రెండవది జూన్ 28న మా ఏభై వ  వివాహవార్షిక దినం. ఇది గుర్తు ఉంది. కానీ కరోనా కారణంగా హడావడి ఏమి చేయలేదు. కానీ సంగతి తెలిసిన ఒక మిత్రుడు అడిగాడు. 

"ఈ ఏభై ఏళ్లలో విడాకులు తీసుకోవాలని అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? వివరింపుము" అని. వాడు సరదాగానే అడిగాడు. అంతే  సరదాగా నేను ఈ టపా లింక్ వాడికి పంపాను. 

మీరు కూడా చదివెయ్యండి. 

                      మా ఆవిడకు విడాకులు ఇచ్చేస్తాను 
  

ఇది ఉన్నట్టుండి తీసుకొన్న నిర్ణయం కాదు. అనేక విధాలుగా, అనేక కోణాలలో ఆలోచించి, చర్చించి, ఇంకో మార్గం ఏది తోచక తీసుకో బోతున్న నూతన సంవత్సర తీర్మానం. అయినా తీర్మానం చేసుకొనే ముందు బ్లాగు మితృలు, బ్లాగు బంధువులు, బ్లాగాప్తులు అయిన మీ అందరికీ తెలియపర్చి, మీ సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలని పించింది.

జనవరి ఒకటవ తేదీన మీరందరూ ఈ బ్లాగు నించి ఆ బ్లాగు లోకి పరిగెడుతూ , నూతన శుభాకాంక్షలు  అని నొక్కుతూ మధ్య మధ్యలో మీ బ్లాగులోకి వెళ్ళి, ఇంకా కాంక్షించని వారెవరా అని లెక్క చూసుకుంటూ చాలా బిజీ గా తిరుగుతుంటారని  తెలుసు కాబట్టి, నాలుగు  రోజులు ముందుగా నా ఈ జీవన్మరణ సమస్య మీ ముందుకు తెచ్చాను. మీరు జాగ్రత్తగా ఆలోచించి, అవసరమైతే మీ పక్కవారి బుఱ్ఱ కూడా తినేసి నాకు తగు సూచనలు చేసి, నాకు మార్గదర్శకులు  కండు అని ఎలుగెత్తి   నివేదించుకుంటున్నాను. మీరైతే బోల్డన్ని బ్లాగులు చదివేసి   బోల్డంత  జ్ఞానము  సంపాదించిన,  జ్ఞానము నిండుకున్న మెదడు కలవారని (అచ్చు తప్పయిన క్షమించవలెను) మీకు సవినయంగా,  వినమ్రము గా విన్నవించు కుంటున్నానన్నమాట.

ఈ నా సమస్య ఈ నాటిది కాదు. అనేక  సంవత్సరముల నుండి నన్ను మానసిక క్షోభ కు గురిచేస్తున్న బృహత్తర సమస్య. జూన్ 29, 1970 నుంచి నామనస్సులో మెదలుచున్న ఆలోచన. జూన్ 28, 1970 న ప్రద్యుమ్నుడు అనబడే నాకు చి. ల. సౌ. ప్రభావతి అనబడు కన్యాకామణి తో వివాహ మహోత్సవం జరిగింది. 

అసలు పెళ్లి రోజున,   పెళ్లి పీటల మీద ఏం జరిగిందో మీరు ఊహించగలరా.   పెళ్లి పీటల మీద నేను కూర్చుని బ్రహ్మ గారు చెప్పినవి  అన్నీ బుద్ధిగా చేసేస్తున్నాను . కొంత సేపైన తరువాత కాబోయే మా ఆవిడని  ఓ బుట్టలో కూర్చోపెట్టి తీసుకు వచ్చి నా ఎదురుగా కూర్చోపెట్టారు. మధ్యలో ఒక తెర. అప్పుడు ఆసీనులైన సదాసదులలో  గుసగుసలు మొదలయ్యాయి. మెల్లగా మొదలైన గుస గుస లు కొద్ది సేపటికి బ్రహ్మగారి మంత్రాల స్థాయి దాటి పోయాయి. ఇంతలో కాబోయే  మా ఆవిడ ని  తీసుకొచ్చి పీటల మీద  నాపక్కన కూర్చో పెట్టారు. ఇప్పుడు గుసగుసలు రూపాంతరం చెంది రణగొణ ధ్వనులుగా మారాయి.  నేను కొంచెం ఉత్సుకత తో ఓ గుసగుస ల మాష్టారుని పిలిచి ఈ రణగొణ ధ్వనుల కారణమేమి అని అడిగితిని. ఆయన నాచెవిలో అరుస్తూ రహస్యం గా చెప్పాడు. “పెళ్లి కొడుకు కన్నా పెళ్లి కూతురు అంగుళం  పైగా   పొడుగు అని చెప్పు కుంటున్నారు”  చెప్పిన వాడు  ఊరుకోకుండా నా నెత్తి  మీద వాడి వేలు పెట్టి నా కాబోయే ఆవిడ తలతో సరిచూసి  కొలిచి అంగుళన్నర అని ప్రకాశముగా గుసగుస లాడి వెళ్లిపోయాడు. నాకు మండింది. 

నా కాబోయే  ఆవిడ కేసి చూసాను. ఆవిడ బాసిం పట్టు వేసుకొని, నిటారుగా కూర్చొని స్నేహితులతో గుసగుస లాడేస్తోంది.  అప్పుడు నేను ఆవిడతో చెప్పాను. "కొంచెం తలకాయ వంచుకొని, బుద్ధిగా పెళ్లి కూతురు లాగా సిగ్గుపడుతూ కూర్చో"  అని. "అల్లా నాకు చేత కాదు. నాకు ఇల్లానే బాగుంటుంది" అని అనేసిందండి. పైగా మాయాబజారు లో సావిత్రి లాగా హాహాహా అని  నవ్వింది కూడా.  

నాకు మళ్ళీ కాలింది. కాలదా అని అడుగు తున్నాను. ఇంకా తాళి కట్టకుండానే ఇంత మాట అనేసింది. కట్టింతరువాత ఇంకెన్ని  అంటుందో, ఇంకెంత అవమానకర మాటలు వినాల్సి వస్తుందో నని అనుమానం వచ్చేసింది నాకు. అనుమానం కాస్తా  పెను భూతమై విడాకులు ఇచ్చేద్దా మను కున్నాను. పెళ్లి కాకుండా విడాకులు ఇవ్వడం బాగుండదు,  చట్టం కూడా ఒప్పుకోదు కాబట్టి పెళ్లి చేసుకొని వెంటనే విడాకులు ఇచ్చేద్దామను కొని  పెళ్లి చేసేసు కొన్నాను. విడాకులు తీసుకోవటానికి ఇది మొదటి కారణం.   

సరే పెళ్లి అయిపోయింది. భార్యామణి ని తీసుకెళ్ళి నేను ఉద్యోగం చేస్తున్న ఊరిలో  కాపురం  పెట్టేశాను. మా ఆవిడ పెళ్ళైన కొత్తలో కొంచెం నాజూకుగా పొడుగ్గా కనిపించేది. నేను పుష్టిగా గుండ్రం గా (అంటే లావు కాదండోయ్ )  కొంచెం పొట్టిగా కనబడే  వాడిని. పొట్టి అంటే మరీ పొట్టి కాదండోయ్. 5 అడుగుల మీద ఇంకో మూడున్నర, నాలుగు అంగుళాలు ఉంటాను. ఏదో పొట్టి వెధవకి పొడుగు అమ్మాయిని కట్టబెడితే పిల్లలు పొడుగ్గా పుడతారు అనే భ్రమతో  మా వాళ్ళు ఇల్లా మా ఇద్దరికీ పెళ్లి చేసేసా రన్న మాట. 

తను పొడుగు అయితేనేం కొంచెం వంగి నడవ వచ్చు కదా, ఊహూ నిటారుగా గెడకఱ్ఱ  లాగా నుంచొని మరీ నడిచేది. కాపురం పెట్టిన  కొత్తలో మేమిద్దరం కలసి నడుస్తుంటే, చూసేవాళ్ళు  కొద్దిగా చిరునవ్వు నవ్వేవాళ్లు.  ఏదో మమ్మల్ని పలకరిస్తున్నారని  అనుకొనే వాడిని. కానీ  తెలియని వాళ్ళు కూడా నవ్వుతుంటే నాకు అనుమానం వచ్చేసింది. నవ్విన వాళ్ల పళ్లే బయట పడతాయని సరి పెట్టుకొని, మా నడక కార్యక్రమం కానిచ్చే వాడిని. కొద్ది కాలం గడిచే టప్పటికి గుసగుసలు మొదలయ్యాయి మా కాలనీ లో . మేము నడుస్తున్నప్పుడు, చిరు హాసాలు కాస్తా నవ్వులు గా మారిపోయాయి.  నాకు అర్ధం కాలేదు. అప్పుడు ఓ గుసగుస మితృడిని అడిగాను. " What is this gusa  gusa" అని. “ మీరు ఇద్దరూ కలిసి నడుస్తుంటే number 10 లాగా ఉన్నారు"  అని అను కుంటు న్నారు అందరూ అని అట్టహాసం చేసి వెళ్ళి పోయాడు . నాకు మళ్ళీ మండింది. ఏం చేయలేక, అప్పటినించి నేను ఆవిడ వెనక్కాల, ఆవిడ అడుగు జాడల్లో కనీసం పది అడుగుల దూరం లో నడవడం మొదలు పెట్టేను.  ఇది రెండవ కారణం.

అసలు పెళ్ళాం అంటే ఎల్లా ఉండాలి. వినయ విధేయతలు మూర్తీభవించాలా వద్దా ? పతివ్రతగా, పతి ఇష్టమే తన ఇష్టం గా మసలుకోవాలా వద్దా ? పతియే ప్రత్యక్ష దైవం అనుకోవాలా వద్దా ? అని అడుగుతున్నాను మిమ్మల్ని.  పెళ్ళైన కొత్తలో ఇంకా ఆర్నెల్లు కూడా కాకుండా,  కొంపలంటుకు  పోయినట్టు  మా ఆవిడ పుట్టిన రోజు వచ్చేసింది. సరే new పెళ్ళాం, new పుట్టిన రోజు, new కాపురం అని నేను new గా ఆలోచించి , మా ఆవిడ కి తెలియకుండా surprise చేద్దామని, బజారు వెళ్ళి 475 రూపాయలు పెట్టి ఒక చీర కొనుక్కువచ్చాను. ఆ కాలం లో నా జీతం నెలకి 1186రూపాయల 64పైసలు. 475 అంటే 1/3 జీతం కన్నా ఎక్కువ.  
తెగించి,  ధైర్యం చేసి నేనొక చీర కొని పుట్టిన రోజు ఉదయమే,  Happy birth day to you  అని పాడి బోల్డు నవ్వులు నవ్వుతూ, నేనే హారతి ఇచ్చి చీర ప్రెజెంట్ చేస్తే, చూసి "ఇదేం చీరండి, ఈ అంచేమిటి, అసలు ఆ రంగేమిటి, నాకు నప్పుతుందనే కొన్నారా? మీరు ఒక్కరే ఎందుకు వెళ్లారు? నన్నెందుకు తీసుకెళ్ల లేదు? చీర కూడా కొనడం చేతకాని వాళ్ళా  మీరు" అంటూ కడిగేసింది. 
మీరే చెప్పండి ఇదేమైనా బాగుందా? Love  love గా నేనో చీర పట్టుకొస్తే,  new  మొగుడు అని కూడా చూడకుండా, what is this రంగు అని అంటుందా. పైగా  “యే క్యా హై “ అని హిందీలో కూడా అడిగిందండి. అప్పటికప్పుడు నన్ను మళ్ళీ బజారు తీసికెళ్ళి , ఆ చీర మార్చేసి ఇంకో వంద రూపాయలు వేసి , చీర తీసుకొని, పుట్టిన రోజు ఛీరంటే ఇల్లా ఉండాలి అని నాకో క్లాసు పీకిందండి.  What do i do now?   అప్పుడు ఖచ్చితం గా విడాకులు తీసేసు కోవాలని డిసైడు అయిపోయాను.  ఇది మూడో కారణం.

ఇల్లా చెపుతూ పోతే బోలెడు కారణాలు ఉన్నాయి. రోజు రోజు కు ఒక కారణం లిస్టు లోకి ఎక్కుతోంది. నేను మంచి వాడను, బుద్ధిమంతుడను, నోట్లో వేలు పెట్టినా కొరకలేని వాడను  కాబట్టి, సహనం వహించి ఈ సంసార సాగరాన్ని ఈదుకుంటూ  వస్తున్నాను  ఇన్నాళ్లుగా. పెళ్ళైన దగ్గరనించి ఇప్పటి దాకా  నేను స్వతంత్రించి ఏమి చేయలేక పోయాను. చివరాఖరికి నేను వేసుకొనే లాగూ చొక్కా, జేబురుమాలు దగ్గరినించి అన్నీ ఆవిడ ఇష్ట ప్రకారమే కొంటుంది. "మా ఆయనికి ఏమి తెలియదండి అన్నీ నేనే చూసుకోవాలి" అని అందరికీ చెపుతుందండి. చూసి చూసి, విసిగి వేసారి ఆవేశంతో  భర్త అంటే ఎవరు  అని నేనో పద్యం కూడా రాసేసాను.


శాంతభూషణుడే కానీ అలుగుటయే ఎరుంగని అమాయక జీవి వాడూ   
ఔనౌను అనుటయే కానీ కాదు  లేదు అని అనలేని  పిరికి జీవి వాడూ
ఆఫీసులో ఉగ్ర నరసింహుడే యైనా గృహంగణమున సాధు జీవి వాడూ
మీసాలు పెంచిన రౌడీయైనా నిజసతికి దాసోహమనెడి అల్పజీవి వాడూ

ఆ ఆ ఆ  ఆ అహహ్హ ఆహాహా  ఆ ఆ హా హాహ హా ఆ ఆ ఆ


అని రాగం కూడా తీసి పాడుకొనే వాడిని. ఇల్లాగే పడుతూ లేస్తూ సర్దుకుపోతూ 40 ఏళ్ళగా ఈ సంసార రధాన్ని లాక్కువచ్చాను.  

మొన్న మా బావమరిది వచ్చాడు హైదరాబాదు లో ఎవరిదో పెళ్ళికి. అక్కా తమ్ముళ్ళు ఇద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళ బంధువుల ఇళ్ళలో ఏవో గొడవల గురించి మాట్లాడుతూ మా ఆవిడ అంది. “ఏదోరా మీ బావ కొంచెం పొట్టి అయినా, మా సంసారం సాఫీ గా, సరదాగానే సాగిపోయింది ఇప్పటిదాకా” . 

అంటే 40 ఏళ్ల తర్వాత కూడా  నేను పొట్టి  అన్న విషయం ఇంకా నొక్కి మరీ వక్కాణించాలా? నేను 5 అడుగుల 4 అంగుళాలు ఉంటే ఆవిడ 5 అడుగుల ఐదున్నర అంగుళాలు. ఈ  మాత్రం దానికే  ఆవిడ పొడుగు నేను పొట్టి అని చాటింపు వేయాలా అని ప్రశ్నిస్తున్నాను. ఆవిడ పెద్ద పొడుగా అని నేను కొచ్చెనింగు అన్న మాట. ఇహ నే తాళ జాల, విడాకులే శరణ్యం అని మరొక్కమారు కఠిన నిర్ణయం తీసేసుకొన్నాను.  కొత్త సంవత్సరం లో మంచి లాయరు ని వెతికి  విడాకుల కార్యాచరణ మొదలు పెట్టేస్తాను.


నా వ్యధా భరిత కధ మీరు కూడా విన్నారు  కాబట్టి మీ సలహాలు సూచనలు కూడా నాకు పంపండి.  విడాకులు ఇచ్చవలెనా?
ఇచ్చకూడదా? 


గమనిక :- ఈ టపా మొదట ఈ బ్లాగులో 28/12/2010 న ప్రచురించబడింది.