నే నెందుకు వ్రాస్తున్నాను....రెండు


ఆత్మ ప్రభోధానుసారం, యోగా  నేర్చుకుందామని అనుకున్నవాడనై,  మా కాలనీలో యోగా నేర్పువారి కోసమై గాలించితిని.  మా కాలనీలో ముగ్గురు యోగా గురువులు  ఉన్నారని తెలిసింది.  ఇద్దరు మగ గురువులు, ఒక ఆడ గురువు. సహజ ప్రకృతి దోష ప్రభావమున, పరస్పర  అయస్కాంతాధారిత విజ్ఞాన సూత్రాదేశముల వలనను, మొదటగా రెండవ వారి దగ్గర నేర్చుకొనవలనను ఉత్సుకత కలిగినది. ఓ శుభ సాయం సమయమున, పక్షులు గూటికి చేరు వేళ, ఆవులు అంబా అనుచు ఇంటికి వచ్చు వేళ, పిల్లలు ట్యూషనుకు వెళ్ళు వేళ, ఆకాశమున సూర్యుడు గ్రుంకు వేళ, ఆటో వాళ్ళు మీటరు మీద పది రూపాయలు అడుగు వేళ, గృహంబునకు అరుగు దెంచు శ్రీపతులకు, శ్రీమతులు ఆలూబొండాలు, బజ్జీలు వేయు వేళ,  ధ్వనులను ఆస్వాదించుచూ, టాటా చెపుతూ, అరుణారుణాకాశమును వీక్షించుచూ, కలహములను పరికించుచూ, సువాసనలను ఆఘ్రాణించుచూ  ఆడగురువు గారి గృహాంగణమున అడుగు పెట్టినవాడనైతిని. నా రాకను మాగురువుగారి పుత్రశ్రీ ఇంటిలో సమాచారము ఇచ్చినవాడయ్యెను. ఒక పది నిముషములు అతి భారముగా గడిచిన పిమ్మట, ఓ మధ్య వయస్కుడు, సుమారుగా నలభై ఏళ్ళ వయసు గలవాడు నా ఎదుట ప్రత్యక్షమైనాడు.
I am Sailajaa naath, What can I do for you ?

నా కాలి క్రింద భూమి కంపించెను. ఆకాశమున ఫెళ ఫెళా రావము లతో ఉరుములు, మెరుపులు గర్జించెను, మెరిసెను. సముద్రమున అలలు ఆకాశమున కెగసెను. పర్వతములు బద్దలయ్యెను. ఈ ఉరుములు, మెరుపులు, ఘీంకారములు, హుంకారముల మధ్య, నేనింకను తేరుకొనక ముందే, రాత్మ గాడు బయటకు వచ్చేసాడు. హహ్హహా, హహహ్హా అని వికటాట్టహాసము చేసెను.
రాత్మ:  ఇందాకటినించి చూస్తున్నాను. కవిత్వం చెప్పేస్తున్నావు.  గ్రంధికంలో మాట్లాడేసుకుంటున్నావు.
ఆత్మ:  గ్రంధికం కాదు గంధకం అనాలి సారీ అచ్చుతప్పు గ్రాంధికం అనాలి.
రాత్మ: ఛస్,  ఉండెహె, నోర్మూసుకో. ఏంటి  తెగ ఇదయిపోయావు గదా. ముసలోడికి ఆడ గురువు కావల్సివచ్చిందా. పరస్పర అయిస్కాంత ఆకర్షణా. ఇప్పుడు వికర్షణ అయిందిగా. చచ్చినట్టు ఈ గురువు దగ్గరే నేర్చుకో. ఏరా ఆత్మ గాడిదా ఏమంటావు?
ఆత్మ: I second your proposal.  హి హి హీ.
నాలోని ఆత్మా రాత్మ కలసి ఏకమాట మీద నిలబడిన అతి బహు కొద్ది క్షణాలలో ఇది ఒకటి.
Sailajaa naath: So how do we go about it?

మీకు తెలుగు వచ్చునా
Aa naaku telugu vachchunu
తెలుగు ఇంగ్లీషు లిపి లో కాదు. తెలుగు లిపి లో.
 వచ్చును.
ఎట్లా నేర్చుకోవాలో మీరే చెప్పాలి.
మీరు కూర్చోలేరు,  మీరు కాలు మడవ లేరు.  మీరు పద్మాశనం వేయలేరు,
అవును  అవును  అవును. అన్నింటికి మరొక్కమారు అవును.
మధ్యలో ఆత్మ: పద్మాసనం లో శ కాదు గురువుగారూ.
రాత్మ : ఆడేదో చెబుతున్నాడు ఈడేదో ఇనుకుంటున్నాడు. మధ్యలో నీ పిడకల వేటేంటంట.
మళ్ళీ నేను: మరేం చేద్దాం, కూర్చోకుండా  నేర్చుకొనే యోగాసనాలు ఏమైనా ఉన్నాయా శైలజా నాధ్ గారూ. నేను శైలజ ఘట్టిగాను నాధ్ మెల్లిగాను అంటాను. అశ్వధ్ధామో హతహ కుంజరహా అన్నట్టు.  మీకేమైనా అభ్యంతరమా.
నో నో In fact my wife calls me Sailaja. You may call me Sailaja.
తెలుగు  తెలుగులో మాట్లాడుము, వినుము మరియూ కనుము.
నేను తెలుగువాడినే. బహుశా మీరు నన్ను బెంగాలీ ననుకుంటున్నారు కదా. మా అన్నయ్యల పేర్లు లక్ష్మీపతి,  శ్రీనాధ్, గౌరీపతి  అందుకని నాపేరు శైలజానాధ్ అని పెట్టేరు.
ఏమనాలో తెలియక  I see అన్నాను.
చూసారా నాతోటి మాట్లాడుతుంటేనే మీకు ఇంగ్లీష్ వచ్చేస్తోంది. అసలు నాతోటి మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్. మీకు యోగా తో పాటు ఇంగ్లీష్ కూడా నేర్పేస్తాను. హహహా.
రాత్మ: చచ్చాడు గురుడు. ఈడి M.Sc., Ph.D,  గంగలో కొట్టుకు పోయాయి.
ఆత్మ: హి హి హీ.
శైలజ:  యోగా అనగా యోగానే, మరొకటి కాదు. ఇది అన్ని వ్యాయామముల వలే కాదు. యోగా నేర్చుకొన్నవారు యోగులు, యోగ్యులు అని పిలువబడుదురు. యోగా నేర్చుకొనని వారు అయోగ్యులు. మీరు యోగా నేర్చుకొన్నచో మీ లోని జ్యోతి ప్రజ్వలించును. మీ చుట్టూ యోగ వలయములు సృష్టించ బడును. ఈ వలయముల పటిష్టత మీ అభ్యాసము పై ఆధారపడి ఉండును. పటిష్టమైన వలయము కలవారి శరీరము లోనికి జలుబు, జ్వరము, చక్కెర, బి.పి., గుండె ఎటాక్, కేన్సరు, ఎయిడ్స్, మూత్రపిండముల, మొదలగు, అనేకానేక వ్యాధులేవి దరి చేరవు. అని ఆయాస పడెను.
రాత్మ: గురువా ఇది నీకు కాదు. ఆల్రెడీ నీకు రెండుమాట్లు గుండె ఎట్టాక్కు వచ్చియుండెను. నీ బి.పి ఎప్పుడూ మేఘములలో విహరించు చుండును. నీవు నిద్రపోవునప్పుడు నీశరీరమునకు చీమలు పట్టును.
నేను: ఛుప్, నోరుమూయుము. ఇది మిమ్ములను కాదు. నాలోని రాత్మ నుద్దేశ్యించి. మీరు నుడువుడు..
 శైలజ:  మీరేం కంగారు పడవద్దు. నుంచొని చేసే ఆసనాలతో మొదలుపెట్టి ఒక నెలలోపుల మిమ్మలని కూర్చోపెట్టేస్తాను.
రాత్మ: ఆ ఆ ఇంకో నెలలో నిన్ను పడుకో పెట్టేస్తాడు. అప్పుడు నీ వెనకాల మేము రామనామ్ సత్య్ హై అని పాడుతూ నడుస్తాం.
ఆత్మ: హి హి హీ.
మళ్ళీ శైలజ: యోగా నేర్చుకోలేదు సరే కనీసం యోగా, యోగాముద్రలు అంటే మీ కేమైనా తెలుసునా?
నేను:  ఉండండి. ఆలోచిస్తాను. అవును గుర్తుకొచ్చింది. నా జీవితంలో కొన్నిమాట్లు యోగాముద్రలో ఉండిపోవడం తటస్థించింది.
కొంచెం వివరంగా చెప్పండి.
అది 1980 వ సంవత్సరము. నేను సోఫాలో కూర్చుని సిగరెట్టు కాలుస్తూ, పేపరు చదువుతున్నాను. అప్పటికి  పెళ్ళై దశాబ్దం గడిచినది. మాకు ఎనిమిదేళ్ళ అబ్బాయి.  ఆవేళ వాడు ఎక్కాలు బట్టీ వేస్తున్నాడు. నాల్గు మూళ్ళు పధ్నాలుగు, ఐదు తొమ్మిదులు పధ్నాలుగు, ఇరవై పన్నెండులు కూడా పధ్నాలుగే అంటూ ఆయాస పడుతున్నాడు. అసలు సంగతేమిటంటే, వాళ్ళ స్నేహితులందరూ కలసి క్రికెట్ బాట్ కొన నిశ్చయించారు. మనిషి కి పధ్నాలుగు రూపాయలు గా లెఖ్ఖవేసారు. చూద్దాం లేరా అన్నాను. నేను యస్ అనే దాకా వాడు ఆ ఎక్కం అల్లాగే చదువుతాడు. వీడు నన్ను  ఎక్కాల తో చంపేస్తాడన్నమాట. సరే యస్ అన్నాను. వాడు ఆడుకుందుకు వెళ్ళిపోయాడు. అప్పుడు మా ఆవిడ రంగప్రవేశం చేసింది.  పొగలు కక్కుతున్న కాఫీ పట్టుకొచ్చి టేబులు మీద పెట్టింది. నేను కాఫీ అందుకోబోతే,  వేడి, వేడి, నోరు కాలుతుంది అని బెదిరించింది. తను సోఫాకు అడుగు దూరంలో నుంచుంది.
ఏమండీ మొన్న ఒక చీర చూసాను. కొనుక్కుందామను కుంటున్నాను.  చవకే ఆరు వందల రూపాయలు  మాత్రమే అంది. 
మీరు గమనించారో లేదో, మా ఆవిడ ఒక వార్త చెప్పింది, కొనుక్కుంటున్నాను అని. ఇందులో నా నిర్ణయం ఏమీలేదని అర్ధం అయిం తర్వాత, నీరసంగా సరే అల్లాగే కొనుక్కో అన్నాను. 
మా ఆవిడ ఎంత మంచివాడవురా నాభరత రత్నమా, ఆ ఆ ఆ, మా అత్త కన్న నా మగడా ఊ ఊ ఊ అని పాడుతూ సంభ్రమాశ్చర్యానంద పారవశ్యంలో కాపీ నాచేతికి ఇవ్వబోయి చేయి జారి నావొళ్ళో కాఫీ కప్పు జారవిడిచింది. అప్పటికే ఒక వేడి చల్లారినా, రెండో వేడి కూడా వేడిగానే యుండుట వలన కాలు కాలి, లేవబోయి, ఒళ్ళోంచి జారిపడబోతున్న ఎనిమిది రూపాయల కప్పు ను పట్టు కొనే  హడావడిలో ముందుకు వంగగా, నడుము కలుక్కుమనగా,   నాకు తెలియని ఒక ముద్రలో కొన్ని క్షణాలు ఉండిపోయాను.
శైలజ: ఇంటరెస్టింగు. దీన్ని ఆనంద విషాద యోగ ముద్ర అందురు. ఆనందంలో మొదలై విషాదంలో ముగుస్తుంది. ఆనందం ఆవిడకు విషాదం మీకు. 
నేను:  అర్ధం అయింది. అప్పుడప్పుడు మనకు తెలియ కుండా నే యోగా, ఎరోబిక్స్ కూడా చేసేస్తామన్నమాట.
రేపటినించి క్లాసులు క్షమించాలి తరగతులు మొదలు పెట్టేస్తాను. ఆరున్నర ఏడు మధ్యన ఉదయాన్నే వచ్చేయండి.
అల్లాగే, అల్లాగల్లాగే. పది లోపుల తప్పకుండా వచ్చేస్తాను లెండి. ఉదయమే

సరిగ్గా నేను  అల్లాగే అన్న క్షణంలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. ఎక్కడో పైన, పైపైన త్రిభుజాకారం లో ఉన్న బ్రహ్మ, విష్ణు, శివ లోకాల మధ్య భాగంలో, కిందకు  4215 పక్కన రెండు పేజీల సున్నాల కి.మీ. దూరంలో ఉన్న మేఘాలలో విశ్రాంతిగా కూర్చుని, శౌనకాది మహామునులకు, సతీ అనుసూయాది సాధ్వీమణులకు పురాణ కధలు చెపుతున్న సూతమహర్షి గుండె గుభేలుమంది.  అదేక్షణంలో బ్రహ్మలోకంలో నిద్రలోఉన్న బ్రహ్మగారి పక్కన కూర్చుని వీణ వాయిస్తూ సంగీతసాధన చేస్తూ, స సా రి రీ గ గ్గా గగ్గాగాఆ ఆ ఆ అని ఆలాపిస్తున్నశ్రీమతి సరస్వతీ బ్రహ్మగారి గ గ్గ లు అటూ ఇటూ అయిపోయాయి. వారి ఎడమ కన్ను అదేపనిగా అదరజొచ్చెను. ఆ క్షణం లోనే కైలాసపర్వతం పై తపస్సు చేసుకుంటున్నపార్వతీ పతి గారి మెడలో నిద్దరోతున్న నాగరాజు ఉలిక్కిపడి, జారిపడి షార్ట్ సర్కూట్ అయి నోట్లోంచి నిప్పులు వెదజల్లాడు. నంది గారు వెంటనే సమయస్ఫూర్తి తో నాలుగు తాజా ఐస్ గడ్డలు తెచ్చి మంటలు ఆర్పేడు. అదే క్షణంలో పాలసముద్రంలో ఉవ్వెత్తున అలలు లేచాయి. విశ్రమిస్తున్న లక్ష్మీనారాయణులకు విశ్రామభంగం కలగకుండా అతి లాఘవంగా అలల మధ్య ఆదిశేషుడు సర్ఫింగ్ చేసాడు. 

సూతమహర్షి గుభేలుమన్న గుండెమీద మెల్లిగా ఒత్తుకుంటూ కూడా, త్రిలోకాలలో జరిగిన అనర్ధాలు వీక్షించాడు బహు దూర దృష్టితో. 

అసలు ఏంజరుగుతోంది. సూతమహర్షి గుండె ఎందుకు గుభేలు మంది? త్రిలోకాలలోని అనర్ధాలకి ప్రద్యుమ్నుడి  యోగాభ్యాసానికి మధ్య సంబంధం ఏమిటి? తెలుసుకోవాలంటే తరువాయి సంచిక చూడండి.
మంగళం మహత్,
ఇతి శ్రీ బ్లాగోపనిషత్తాయ  నే నెందుకు వ్రాస్తున్నాను మహా పురాణే ద్వితీయాధ్యాయ: సమాప్త: