ఏలూరు వెళ్ళే ముందు దాకా మా సౌత్ ఎండ్ పార్క్ లో సుమారు 11 ఏళ్లు ఉన్నాను. ఉన్న రెండిళ్ళు కూడా కాలనీ మెయిన్ రోడ్ లోనే ఉన్నాయి. సాయంకాలం, అప్పుడప్పుడు, ఈవెనింగ్ వాక్ పేరుతో కాలనీ అంతా తిరిగేవాడిని. మా ‘స్నేహ సమాఖ్య’ కార్యదర్శి గా ఉన్న రెండేళ్ళ కాలంలో కాలనీ లోని అన్ని వీధుల్లోనూ కొన్ని గడపలు తొక్కేవాడిని. కాలనీలో శునక మహారాజులు చాలానే తమ తమ రాజ్యాలను ఏలుకునేవి, చాలా మట్టుకు శాంతియుతంగానే. ఒక్క చిత్తకార్తి వేళల్లోనే గుంపులుగా గగ్గోలు పెట్టేవి. ఆ సమయాలల్లోనే అటూ ఇటూ వెళ్ళే జనాలను చూసి కొంత తీవ్ర స్థాయిలోనే భౌ భౌ నాదార్చన చేసినా, భయం కొలిపేటట్టు, మరీ దగ్గరగా వచ్చి భీకర స్వరంతో కాల భైరవ రాగాలాలాపించలేదు. అప్పుడప్పుడు రాత్రి పదిగంటలకు కామినేని హాస్పిటల్ నుంచి మా కాలనీ దాకా (ఒకటిన్నర కిమీ) నడిచి వచ్చినప్పుడు కానీ, నా శరీరంలో షుగర్ లెవెల్స్ (మా ఆవిడ లెఖ్ఖ ప్రకారం) అదుపు తప్పినప్పుడు, నా ధర్మపత్ని అధర్మంగా, నన్ను బలవంతాన నిద్ర లేపి ఐదున్నర గంటలకి మార్నింగ్ వాక్ కి వీధిలోకి తోసినప్పుడు కూడా కాలనీసింహాలు, తమ సంస్కృతి, సంప్రదాయాలను, ఆనవాయితీలను మన్నించి, బద్ధకంగా మంద స్వరంలో, మొహమాటానికి భౌ భౌ లని మధ్యమావతి లోనే ఆలాపించేవి. నేనున్నూ నిద్రమత్తులో, వాటి రాగాలను ఆస్వాదించ కుండానే, నీరసంగా నా నడక బాధ్యత నేరవేర్చేవాడిని. అప్పుడప్పుడు కొన్ని జాగిలశ్రేష్ఠులు తమ తమ సామ్రాజ్య పరిధులు దాకా, వెనుకగా కొద్ది దూరములో తోడుగా నడుస్తూ వచ్చి సాగనంపెడివి కూడా. అంతకు మించి అసౌకర్యమేమి కలిగించకుండానే, మా కాలనీ శ్వానములు ధర్మ బద్ధంగానే, శాంతి మంత్రమును జపిస్తూ, తమ విధులను నిర్వర్తించేవి.
కొద్ది రోజుల క్రితం, ఉదయం సుమారు
ఐదు గంటల సమయంలో కాలనీలో మా వీధి ప్రవేశం చేసి, మా అద్దెగృహ గేటు వద్ద కారు
దిగాం. కాలనీ ప్రవేశం చేసినప్పుడే కొన్ని కుక్కుటములు మా కారు ననుసరించి భౌ భౌ నాదములతో స్వాగతములు
పలికాయి. మా వీధి మొగ దాకా వచ్చాయి. మా వీధి మొగలోనున్న శునకము ఒకటి నిద్రలేచి మోర ఎత్తి తెలియని రాగంలో ఆలాపన
మొదలు పెట్టింది. కొద్ది క్షణములలో మరి కొన్ని వీధిలోని కుక్కలు భీకరంగా గర్జిస్తూ ఆఫ్రికన్ డ్రమ్ముల నాదాలను
పోలిన రాగాలతో స్వరార్చన మొదలు పెట్టాయి. నేను, ఇది
కుక్కల సహజ గుణం అని
సరిపెట్టుకున్నాను. మా అబ్బాయి
కారు దిగి, పక్కనే ఉన్న జామ చెట్టు కొమ్మ విరిచి, ఆ కుక్కలను అదిలించే ప్రయత్నం చేయబోయాడు. నేను
వారించాను. “కుక్కలను ఎదిరిస్తే అవి ఇంకా రెచ్చిపోయి కరుస్తాయి. కాబట్టి వాటిని
కొట్టకండి, తిట్టకండి” అని ఒక కుక్కల మనో
శాస్త్రవేత్త సెలవిచ్చారు అని మా వాడికి వివరించాను.
వాడు నా పక్కకి వచ్చి నుంచున్నాడు. ఇంతలో
నా గృహలక్షి, మా అమ్మాయి కారు దిగి, మా అబ్బాయి
పక్కన నుంచున్నారు. నేను గేటు లోపల వేసిన తాళం తీసే ప్రయత్నంలో ఉన్నాను. ఇంతలో
ఇంకో రెండు జాగిలములు వాటికి జత చేరాయి.
క్షణ క్షణానికి వాటి రాగాలాపాన శృతి హెచ్చుతోంది. దురదృష్టవశాత్తూ తాళం రావటం
లేదు. తాళం గుత్తిలో ఐదారు తాళం చెవులు ఉన్నాయి. వరుస క్రమంలో నేను ప్రయత్నిస్తూనే
ఉన్నాను. ఇంతలో ఆ జాగిలములు దగ్గరగా వచ్చాయి. కాలిని వాసన చూసే ప్రయత్నం
చేస్తున్నాయేమో ననిపించింది. కండలను రుచి చూసే సమయం ఆసన్నమవుతోందేమో నన్న అనుమానం
వచ్చింది. “తలుపు తీయడానికి ఇంత సేపా?”
అంటూ నా ధర్మపత్ని నా ముందుకు వచ్చి తాళం గుత్తి తీసుకునే ప్రయత్నం చేసింది. నేను
ఆవిడ ఉద్దేశ్యం గ్రహించి, ఆవిడని నా
వెనక్కు తోసి నా ప్రయత్నం కొనసాగించాను.
ఇంతలో రెండిళ్ళవతల ఇంటి లోంచి ఒక దేవదూత బయటకు వచ్చారు. వచ్చి ఆ శునకములను
గో, గో, గో అన్నారు. అవి వెనక్కి గోయాయి. ఇంతలో తాళం ఊడిపడింది. గేటు తీసి లోపలికి
దుమికాము. వెంటనే గేటు వేసేసాము. ఆ
శునకములు వీధిలో మా గేటు ఎదుట ధర్నాకి ఉపక్రమించాయి. మధ్య మధ్యలో తమ భాషలో
నినాదాలు చేసేయేమో నని నా అనుమానం.
మేము గృహాప్రవేశము చేసి, పాలు పొంగించు కార్యక్రమం దిగ్విజయంగా పూర్తిచేసి,
కాఫీ తాగి బయటకు వచ్చాను. కుక్క మహారాజు, మహారాణి, సేనాపతి, ఇంకో మూడు, నాలుగు కుక్కలు మా ఇంటి గేటును పరివేష్టించి
ధర్నా కార్యక్రమం కొనసాగిస్తున్నాయి. ఇంకో
గంట తరువాత మా సామాను మోసుకుంటూ ఏలూరు నుంచి వచ్చిన లారీ మా ఇంటిముందు ఆగింది.
లారీ రాకతో శునకసేన తమ గాత్ర కచేరీ మళ్ళీ
మొదలు పెట్టాయి. అరివీర భయంకరుడైన లారీ డ్రైవరు ఒక కర్ర తీసుకొని, సంస్కృత
భాషలో మంత్రములను జపిస్తూ వాటిని దూరంగా తరిమాడు. సామాన్లు దింపుకొని వాటిని
సర్దుకునే పనిలో మేము నిమగ్నమయాం.
సుమారు ఒక గంట తరువాత టిఫిన్ తీసుకురావడానికి నేను బైటకు వచ్చాను. గేటు ముందు
రెండు కుక్కలను కాపలా పెట్టి మిగతా శునకములు ఎక్కడికో వెళ్ళాయి. నన్ను చూడగానే అవి
మళ్ళీ గొంతు సవరించుకున్నాయి. నేను ఒక చేతి కర్ర తీసుకొని గేటు తీసాను. అవి శృతి
పెంచాయి. నేను సందిగ్ధంలో పడ్డాను. పురోగమించుటయా, తిరోగమించుటయా? ధైర్యం చేసి మా
లారీ డ్రైవరుని తలుచుకొని, సంస్కృత భాషా ప్రహారం చేస్తూ కఱ్ఱతో వాటిని అదిలించాను.
ఇంతలో మరికొన్ని కుక్కలు శర వేగంతో వచ్చి వాటికి జత కలిసాయి. నేను గేటు లోపలికి
తిరోగమించాను. ధైర్యంగా గేటు లోపలి నుంచి కుక్కల నుద్దేశించి, వెళ్ళిపొండి, గెట్
అవుట్, జావో అని మూడు భాషలలోనూ అరుస్తూ కర్రతో గేటు మీద ఘట్టిగా చప్పుడు
చేసాను. అవి తమ నాదస్వర స్థాయి పెంచాయి
తప్ప వెనక్కి తగ్గలేదు. ఏం చెయ్యాలో తోచక నేను కర్తవ్యా మూఢుడనై, చింతా గ్రస్థుడనై, విచారించుచుండగా ఒక కుక్కల ప్రేమికుడు అటు వెళుతూ నా దీనావస్థను చూసాడు.
చూసి నాకు మార్గోపదేశం చేసాడు.
మాష్టారూ, కుక్కుటములను
ప్రేమించడం నేర్చుకోవాలండి. వాటిని
ప్రేమిస్తే అవి తోకాడించుకుంటూ వెళ్ళిపోతాయి. అదిలిస్తే అరుస్తాయి. సాధారణంగా
శునకములు శాంతి ప్రేమికులు. వాటి జోలికి వెళ్ళకపోతే అవి
మీ జోలికి రావు అని హితోపదేశం చేసాడు.
అయ్యా, నేను వాటికన్నా
శాంతి ప్రేమికుడిని. అవే నన్ను అల్లరి పెడుతున్నాయి. బయటకు రాకుండా ధర్నా
చేస్తున్నాయి గేటు బయట, అని ఆక్రోశించాను.
మీ శబ్ద ప్రకంపనలు,
విద్యుత్తరంగాలు వాటికి నచ్చలేదు. మీరు ఆ కర్ర పాడేసి, చేతులు దించి, నవ్వుతూ
గేటు తీసి వాటి మధ్యనుంచి నడిచి వచ్చెయ్యండి. అవి ఏమీ చెయ్యవు. మొరిగే
కుక్కలు కరవవు గదా, అని సలహా ఇచ్చాడు.
నిజమే ననుకోండి, కానీ
ప్రతీ నియమానికి, సూత్రానికి కొన్ని
సవరణలుంటాయి కదా, ఆ సవరణలు పాటించే కుక్క అందులో ఉందేమో నని అనుమానం అన్నాను నేను.
ఆయన వాటి మధ్యనుంచి
నడుచుకొని గేటు దగ్గరకి వచ్చాడు. గేటు తీసాడు. “చూసారా అవి నన్ను ఏమీ
చెయ్యలేదు” అంటూ నా చేయి పట్టుకొని వాటి
మధ్యనుంచి తీసుకెళ్ళాడు. అవి మొరుగుతూనే ఉన్నాయి కానీ కరిచే ప్రయత్నం చేయలేదు. ఈ
కుక్కలు నియమ బద్ధమైనవే ననిపించింది నాకు. కానీ అనుమానం పూర్తిగా తీరలేదు.
అయ్యా, తిరిగి వచ్చినప్పుడు ఏమీ చెయ్యవు కదా అని
అడిగాను. ఆయన భళ్ళున నవ్వాడు. ఫెళ్ళున అట్టహాసం చేసాడు.
ఫరవాలేదు. మీరు
ధైర్యంగా నవ్వుతూ, శాంతియుతంగా, కాళ్ళూ చేతులు అసహజంగా కదిలించకుండా, “పర్పరీకములు నాకు మిత్రులు” అనుకుంటూ మృగారాతుల మధ్య నుండి నడిచిపొండి అని చెప్పాడు.
నేను కొంచెం కంగారు
పడ్డాను. అవేమిటండి అని అడిగాను.
శునకము అనగా ‘అలిపకము, అస్థిభిక్షము, కంకశాయము, కపిసము, కుకురము, కుక్కుటము, కుక్కురము, కుర్కురము, కృతజ్ఞము, కౌలేయకము, గృహమృగము, గ్రామమృగము, గ్రామసింహము, జకుటము, జాగిలము, జిహ్వాపము, పర్పరీకము, ప్రఖరము, భషణము, భషము, భసకము, మండలము, మృగదంశకము, మృగారాతి, రతకిలము, రతనారీచము, రతవ్రణము, విలోమము, వృకదంశము, వృకరాతి, వృకారి, శయాళువు, శునకము, శ్వానము, సారమేయము, సాలావృకము, సూచకము’ అని
నిఘంటువు అర్ధం చెపుతుంది. ఇన్ని పేర్లు
ఉండగా కుక్కా అంటూ నీచంగా సంభోదించరాదు, అని బోధించాడు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్
రెస్పెక్ట్ అని కూడా ఉద్భోదించాడు. “మీరు పిలిచే విధానం బట్టి, ప్రవర్తించే పధ్ధతి
బట్టి అవి గ్రహిస్తాయి, మీరు
మిత్రువులో, శత్రువులో లేక తటస్థులో” అని
కూడా వివరించాడు. కాబట్టి వాటిని ప్రేమించడం మొదలు పెట్టండి అని ప్రబోధించాడు.
నేను, అదే నా తక్షణ కర్తవ్యం అనుకున్నాను.
నేను వాటిని ప్రేమించడం మొదలు పెట్టాను. వాటిని, జానీ
అంటున్నాను, రాకీ అంటున్నాను, ప్రఖరమా అంటున్నాను, సారమేయమా అంటున్నాను, వాటిని చూసి నవ్వుతున్నాను. అయినా అవి నన్ను
ప్రేమించడం లేదు. వచ్చి పదిహేను రోజులయింది. స్వర స్థాయి తగ్గు ముఖం పట్టింది కానీ
ఇప్పటికీ అవి నన్ను చూసి మొరుగుతున్నాయి.
చిత్రంగా, మా ఇంట్లో వాళ్ళందరూ
కూడా అలవాటు అయిపోయారు వాటికి. వారిని చూసి మొరగడం మానేశాయి.
ఇప్పుడు నేను కుక్కలను, క్షమించండి, రతకిలములను ప్రేమించడం
ఎలా అన్న పుస్తకాలు చదువుతున్నాను. త్వరలో వాటి ప్రేమకు పాత్రుడనవాలని ప్రయత్నం
చేస్తున్నాను.
ఇంతకీ, చెప్పొచ్చేదేమిటంటే తిరిగి హైదరాబాదు చేరుకున్నాం
క్షేమంగానే. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఈ వాతావరణానికి అలవాటు పడుతున్నాం. అతి కష్టం మీద గాస్ కనెక్షన్ తీసుకున్నాను. అడ్రెస్ ప్రూఫ్ వస్తే కానీ మిగతా కొన్ని పనులు కావు. BSNL లాండ్ లైన్ తీసుకున్నాను. దాని బిల్ కోసం ఎదురు చూస్తున్నాను, అడ్రెస్ ప్రూఫ్ గా ఉపయోగించడానికి. అన్నట్టు నా టెలిఫోన్ నంబర్ 040 24124494.
మా వీధిలో కుక్కలున్నాయి జాగ్రత్త.
అదీ సంగతి.........దహా.