పదవీ విరమణ చేసిన తరువాత, చేసేది ఏమీ లేక దూరదర్శినిని నమ్ముకున్నాను. ఉదయం పది గంటలకు మొదలుపెట్టి రాత్రి పది గంటల దాకా నిరవధికంగా , నిరాటంకంగా, నిస్సంశయంగా, నిస్సిగ్గుగా చూడడం మొదలుపెట్టాను. మధ్యలో భోజన, ఉపాహార కార్యక్రమాలు కూడా టీవి చూస్తూనే దీక్షగా, ఏకాగ్ర దృష్టితో (పక్కింటి ఆవిడ ఇటూ అటూ తిరుగుతున్నా కన్నెత్తకుండా అన్నమాట) చూసాను. “ఈ టీవి దీక్ష ఏమిటో కానీ యాష్ ట్రే రోజుకి రెండు మాట్లు ఖాళీ చేయాల్సి వస్తోంది” అని మా ఇంటి దీపం పక్కింటి దీపానికి ఫిర్యాదు చేసినా లెఖ్ఖ చేయలేదు. ఈ టీవి వీక్షణ మహా యజ్ఞంలో నేను ఎక్కువుగా చూసినవి భక్తి చానళ్ళు , ధర్మసందేహాలు, ప్రవచనాలు. ఇందులో భాషా, మత పరమైన బేధాలు లేకుండా అన్నిటిని సమదృష్టితోనే చూసాను.
ఇవన్నీ ఇలా ప్రగాఢం గా చూస్తుంటే
నాకో ధర్మ సందేహం వచ్చింది. ప్రగాఢం అన్నది సరిగ్గానే పలికానా?
సరిగ్గా వ్రాయగలిగానా? ఘాఢం అని వ్రాయాలా? డ కి పొట్టలో కత్తి గుచ్చాలా? కూడదా? ‘ప్ర’ లో కింద ఉన్న అర్ధ వృత్తాన్ని ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడ
దాకా తీసుకెళ్ళాలి? సందేహనివృత్తి కోసం మా పక్కింటి ఆయన దగ్గరకు వెళ్లాను. నా
సందేహం ఆయనకు వివరంగా వివరించాను. ఆయన అందరు ప్రవచనం మాష్టార్లు లాగానే చిరునవ్వు
నవ్వేరు. మంచి ప్రశ్న అని ఆనందపడ్డారు. కుర్చీలో ముందుకూ వెనకకూ ఊగేరు. చాలా మంచి
ప్రశ్న అని నన్ను ప్రశంసించారు.
ఏదైనా పదం పలికేటప్పుడు మన మానసిక అవస్థ (mood)
చాలా ముఖ్యం. మానసికస్థితిని బట్టి ఆ పదాన్ని పలకాలి. సౌమ్యంగా అనాల్సి వస్తే
‘సరిగమ’ లాగా, మామూలుగా అనాల్సివస్తే ‘సరి రిరి గగ మమ’ లాగా అనాలి, కోపంగా కఠినంగా
పలకాల్సివస్తే ‘సస్సా రిర్రీ గగ్గా మమ్మా’
అంటూ పైస్థాయి లో పలకాలి” అంటూ ప్ర ప్రా
ప్రా ప్రా అంటూ ఎత్తుకున్నాడు .
ఇంతలో మా ఆవిడ ఏమండీ అంటూ పిలిచింది. వెంటనే
నేను లేచి “తమ దర్శనం మళ్ళీ చేసుకుంటానండి” అని పరిగెట్టుకుంటూ వచ్చేసాను.
“అయినా అడగక అడగక సందేహాలు సంగీతం మాష్టారినే అడగాలా” అంటూ మా
ఆవిడ చివాట్లు పెట్టింది.
“తెలుగు సందేహానికి కూడా
సంగీతం ముడిపెడతాడని ఊహించలేదు” అని
సంజాయిషీ ఇచ్చుకున్నాను.
“అయినా మీరు
ఆ భక్తి చానెళ్ళు , ప్రవచనాలు చూడడం ఎందుకు ? చూసి సందేహాలు తెచ్చుకొని
ప్రాణాలమీదకు తెచ్చుకోవడం ఎందుకు?” అని
కోప్పడింది.
పిచ్చిదానా, ధర్మము అనగా అతి పవిత్రమైనది.
దానిని అధ్యయనం చేసి, శోధించి
ధర్మసూక్ష్మాన్ని గ్రహించాలి. ధర్మము అనునది వ్యక్తిని బట్టి, అతని కార్యధర్మమును బట్టి
కూడా మారుతుంది. అందుకనే బాగా తత్వవిచారణ చేసి సూక్ష్మమైన ధర్మాన్ని తెలుసుకోవడం
జ్ఞానవంతుల లక్షణం అని విశదీకరించాను.
మీమొహం, అతి జ్ఞానం కూడా అనర్ధదాయకమే, అయినా
వ్యక్తిపరంగా ధర్మం మారదు అని అంది.
ప్రియ పత్నీరత్నమా, భార్యాశిరోమణీ, పతివ్రతాతిలకమా ఎప్పుడైనా ‘రామాంజనేయ యుద్ధం’ నాటకం చూసావా?
అందులో ఆ యొక్క అంజనా పుత్రుడు ఏమన్నాడు, గుర్తుందా?
“శ్రీరామచంద్రా శరణన్నవారిని రక్షించుట వీరధర్మము కాదా. దైవ స్వరూపులైన మీరు
నన్ను యయాతిని విడువమనుట ధర్మమా?” అని అడిగాడు కదా. అప్పుడు ఆ ఇక్ష్వాకుకుల దీపం,
ధర్మమూర్తి ఏమన్నాడు?
“ధర్మము ధర్మమటంచు వితండ వితర్కము లాడనేలా టింగు
టింగూ టింగు నేనెరుంగని ధర్మంబు కలదే
డింగు డింగూ డింగు నిన్ను దుష్కర్మల
పాలుజేతునే టింగు టింగూ టింగు విడువుము
యయాతి” అంటూ పద్యం పాడుతూ ఆ ‘తీ’ ని రెండు
కిమీ సాగదీయలేదూ. అనగా హనుమంతుడి ధర్మమూ, శ్రీరాముని ధర్మమూ వేరు కదా. భాగవతోత్తముడు
హనుమ తనదే ధర్మం అనగా ఇటు మర్యాదా పురుషోత్తముడు తనదే ధర్మం అన్నాడు కదా. అల్లాగే
గయోపాఖ్యానంలో కూడా శ్రీకృష్ణుడు, అర్జునుడు
వారి వారి ధర్మాలను నెరవేర్చటానికి బోలెడు పద్యాలు పాడి మరీ ఉద్యుక్తులయ్యారు గదా.
అన్ని పద్యాలు పాడడం నాటక ధర్మం. అప్పుడప్పుడు వినేవాళ్ళ ఖర్మం కూడానూ. కాబట్టి
మదీయమనోహారిణీ, ధర్మమునకు రెండు పార్శ్వములు కలవు అని
ఉద్ఘాటించితిని.
మీ మొహం అంది మా ఆవిడ
పుసుక్కున, అలవాటుగా.
“అక్కడే నాకు మండుతుంది.
ధర్మాన్ని అర్ధం చేసుకోవటం ఎంత కష్టం. ఆ మధ్యన గుర్తు ఉందా ఏదో ఛానల్లో శ్రోతల ధర్మసందేహాలకు ఒక పండితుడు జవాబు
లిచ్చారు కదా. ఒక శ్రోత “స్వామీ వసిష్టుడు బ్రహ్మర్షి, జ్ఞాన సంపన్నుడు,
వేదశాస్త్రాలు ఔపాసన పట్టిన వాడు, అంతటి
మహాత్ముడు పెట్టిన పట్టాభిషేక ముహూర్తం అల్లా అయిందేమిటండి?” అని అడిగారు కదా.
అప్పుడు ఆ మహా పండితుడు ఏమన్నారు ?
“శ్రోతా, వసిష్టుడు భూత, భవిష్యత్ , వర్తమానాలు తెలిసిన జ్యోతిషవేత్త.
అందుకే ఆయన రావణ సంహారానికి ముహూర్తం పెట్టాడు, పట్టాభిషేకానికి కాదు నాయనా” అన్నారు.
“ఈ ధర్మ సూక్ష్మం
మనకి ఆ రోజే
తెలిసింది కదా. అప్పటిదాకా అది పట్టాభిషేక ముహూర్తం అని భ్రమపడ్డాము కదా. అందుకనే
మనం అన్ని శ్రద్ధగా విని మన సందేహాలు నివృత్తి చేసుకుంటే మనలో జ్ఞానజ్యోతి వెలిగి
చరితార్దులమవుతాము” అని నొక్కి వక్కాణించితిని.
నలభై ఏళ్ళగా మిమ్మల్ని
బాగు చెయ్యలేకపోయాను. బుద్ధిలేక మళ్ళీమళ్ళీ ప్రయత్నిస్తుంటాను అని చెంపలు వేసుకొని
వెళ్ళిపోయింది.
నేను మరింత శ్రద్ధగా భక్తి చానళ్ళకి, ప్రవచనాలకి
అంకితమైపోయాను. చూడగా చూడగా, వినగా వినగా, బట్టలు విప్పుకొని నృత్యం చేస్తున్న ఒక గొప్ప సత్యం
నా కళ్ళకి కనిపించింది. మనమెన్ని పాపాలు
చేసినా, తోటివారిని దయతో, కరుణతో, జాలితో చూస్తే భగవంతుడు మనల్ని రక్షిస్తాడన్న
ధర్మ సూక్ష్మం నాకు అర్ధం అయింది. ఎందుకైనా మంచిదని, ఇంకా సులభమైన మార్గాలు ఏమైనా
ఉన్నాయేమో నని పరమత ప్రవచనాలు కూడా మళ్ళీ
విన్నాను. ఎక్కువుగా ఏమీ అర్ధం కాకపోయినా, తోటి వారిని దయతో జూడుడీ, ప్రభువు మిమ్ము
కాపాడును అన్న విషయం అవగతమైంది.
అందరూ ఇదే
చెపుతున్నప్పుడు, ఈ పద్ధతే అనుసరించి నేను
దేవుడి రక్షణలోకి వెళ్ళిపోదామని ఘోరంగానూ
, క్రూరంగానూ నిర్ణయించుకున్నాను. తోటివారెవరు
అనే ప్రశ్న వచ్చింది. మా ఇంటిలో నాకు తోటివారు మా ఆవిడ ప్రభావతి మాత్రమే. వేరెవరూ
లేరు. సరే ఇంటిలోనే మొదలు పెడదామని నిశ్చయించుకున్నాను.
ఒక శుభముహుర్తాన్న మా
ఆవిడ వంట చేసుకుంటుంటే నేను వెళ్ళి మా ఆవిడకేసి కరుణతో చూసాను. మా ఆవిడ విసుగ్గా చూసింది ఏమిటి కావాలం టూ. అప్పుడు నేను
మాట్లాడకుండా ఆవిడని దయతో చూసాను. అప్పుడు మా ఆవిడ చిరాగ్గా నన్ను చూసి “ఇప్పుడు
కాఫీ ఇవ్వను” అని ఖండితంగా చెప్పేసింది. నేను చిరునవ్వుతో ఆమెను జాలితో చూసాను.
ఆవిడ కోపంగా నాకేసి చూసి అప్పడాల కర్ర వెతకడం మొదలుపెట్టింది. నేను శీఘ్రంగా
పలాయనం చిత్తగించాను.
నేను తీరుబడిగా కూచుని
తీవ్రంగా చింతించాను. మా ఆవిడ నలభై సంవత్సరాల సహజీవనం తర్వాత కూడా, నా చూపులను
అర్ధం చేసుకోలేదేమా యని నిశితంగా పరిశీలించాను. నా ముఖ కళవళికలలో కరుణ, జాలి, దయ
ఉట్టిపడలేదేమో? యనే అనుమానం పొడజూపింది. తుమ్మల్లో పొద్దుగూకినట్టుంది నీ మొహం
అనేవారు మా అక్కలు. ఈ వయసులో కూడా అలాగే
ఉందా? ఏమి చేయాలి? అని మళ్ళీ విచారించాను. ముఖంలో ఈ బావాలను ప్రకటించడం ఎలా అని
పరిశోధించాను. అప్పుడు గుర్తుకు వచ్చారు రంగమార్తాండ రంగారావు గారు.
ఆయన మా పక్క వీధిలో
ఉంటారు. ఆయన నాటకాలు వేస్తారు. పౌరాణిక, చారిత్రక, సాంఘిక, ఏమైనా సరే వేసేస్తారు.
దర్శకత్వం కూడా వహిస్తారు. ఆయన దగ్గర రెండు మూడు రోజులు శిష్యరికం చేసి ముఖంలో,
చూపుల్లో జాలి, కరుణ, దయ ఎలా చూపించాలో నేర్చుకుందామని నిర్ణయించుకున్నాను.
ఒకరోజున ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. యధాశక్తి ఆయన
రంగస్థల విజయాలను పొగిడాను. సమస్య వివరించాను. ఆయన చిరునవ్వు నవ్వేరు.
“మీలాంటివాళ్ళు వాళ్ళు ఉండబట్టే నాటకరంగం ఇంకా
బతికి బట్టకడుతోంది. నాటక రంగంలో రసపోషణ చెయ్యగల అతికొద్దిమంది నటులలో నేనొకడిని
అని గుర్తించినందుకు మిమ్ము అభినందిస్తున్నాను” అని సంబరపడ్డారు. “అసలు క్రోధం,
రౌద్రం, భీభత్సం, శాంతం మొదలైనవి చాలా తేలికగా పలికించవచ్చు. కానీ జాలి, కరుణ, దయ,
ఎక్కువగా కళ్ళలోనే చూపించాలి. మిగతా రసాలలో కళ్ళు ఒక భాగం అయితే వీటిలో అతిముఖ్యం
కళ్ళు” అని బోధించారు.
“ఏది నా ఎదురుగా ఒకమారు ప్రయత్నించండి” అని ప్రోత్సహించారు.
నేను లేచి, చేతులు కట్టుకొని ఆయన మీదకు మూడు
చూపులు విసిరాను. ఆయన మళ్ళీ నవ్వేడు.
“ప్రద్యుమ్నుడు గారూ, ఒక విషయం గుర్తు
పెట్టుకోండి. ప్రతీ రసానికి ఒక ఒడుపు, పడి ఉంటుంది. కళ్ళ లోంచి కరుణ ప్రసరించాలి,
వెన్నెల ప్రసరించినట్టు. దయ కురిపించాలి, చిరుజల్లులుగా
కురిపించాలి, జడివాన లాగ కాదు, అది అప్పుడు శోకమైపోతుంది. జాలి ప్రవహించాలి, నదీ ప్రవాహంలా,
అవసరమైనప్పుడు ముంచేసేటట్టుగా. ఇప్పుడు నేను ఓ పద్యం పాడి మూడు రసాలు చూపిస్తాను.
నేర్చుకోండి” అని ఉత్సాహపరిచాడు. నేను
శ్రద్ధగా ఆయన కళ్ళకేసి తదేకంగా నా చూపులు లగ్నం చేసాను.
‘ఆలము సేయబోనని’ అంటూ ఎత్తుకున్నాడు. ‘ఆలము సేయబోనని యదార్ధమే పలికితి సుమ్మీ’ ఇది దయ. పాపం,
చెప్పినా వినలేదు అని దయతో చూస్తాడు.
‘అట్టి గోపాలుని నన్ను కోరితివి’ ఇది కరుణ, వెన్నతిన్న కృష్ణుడిని యశోద
చూస్తుంది, అలాగన్నమాట. ‘భండన
భండితుల్, అగ్ని తేజులు, ఉద్దాల
ధనుర్ధరుల్, బహుశత ప్రమధుల్
యదుసింహులందరిన్ పాలుగ గైకొనె నృపాలుడు,
నీవో బాలుడ వైతివకటా’ ఇదంతా జాలేనన్న మాట. మెల్లిగా మొదలై ప్రవాహం గా జాలి పారాలి.
బాలుడవైతివి అకటా, ఇక్కడ జాలికి పరాకాష్ట, పొంగి ప్రవహించాలి. అని ప్రబోధించారు.
చాలా మంది ఇది పైస్థాయిలో పాడుతారు. అది తప్పు. మెల్లగా, మృదువుగా, జాలి తో పాడాలి అని
కూడా వ్యాఖ్యానించారు.
నాకైతే అంతా ఒకటిగానే ఉంది. ఆ మాట ఆయనతో
చెప్పడానికి మొహమాట పడ్డాను అనడం కన్నా భయపడ్డాను అన్నదే నిజం. ఈ లోపల మళ్ళీ ఆయన
మరోమాటు పద్యం పాడుతూ గదిలో ఈ మూలనుంచి ఆ మూలకి నడిచాడు మెల్లగా. ఎందుకలా అని
అడిగాను. “సుయోధనుడిని సాగనంపి అర్జునుడి దగ్గరకు వచ్చేటప్పుడు పాడుతాడు ఈ పద్యం
కృష్ణుడు. అర్జునుడి దగ్గరకు వచ్చేటప్పటికి పద్యం అయిపోవాలి. సందర్భాని కనుగుణంగా
ఉంటే రసం పొంగుతుంది. అప్పుడే అది ప్రేక్షక హృదయాలలో నాటుకుపోతుంది.”
నాకు నీరసం వచ్చింది. “ఈ
పద్యం ప్రాక్టీసు చేసి రేపు కనిపించండి.” ఇంకో పద్యం చెబుతాను, అన్నాడు ఆయన. దొరికిందే
సందు అనుకుంటూ నేను బయట పడ్డాను.
నేను మళ్ళీ ఆలోచించాను.
చింతన్ బైఠక్ చేసాను. ఎన్ని సలహాలు
తీసుకున్నా స్వయంకృషి తప్పదు అని తెలుసుకున్నాను.
‘బాలురకు ధర్మ సూక్ష్మమే పగిది తెలియు’ అన్న కాంతారావుని, ‘ చిట్టిపాపలు
చిట్టిపాపలు కడసారి చెప్పుచుంటి’ అన్న రామారావుని, ‘సందేహింపకు మమ్మా రఘురాము
ప్రేమను సీతమ్మా’ అన్న నాగయ్యని గుర్తుకు తెచ్చుకున్నాను.
రోజుకొక గంట చొప్పున మూడురోజులు సాధన చేసాను. కార్యాచరణలోకి దిగితే తప్ప అనుభవం రాదు, లోతు తెలియదు అని తీర్మానించుకొని అనువైన సమయం,
సందర్భం కోసం ఎదురు చూడడం మొదలు పెట్టాను.
రెండు రోజుల తరువాత మా ఇంటి పక్కనున్న గుడిమెట్ల మీద నుంచున్నప్పుడు నా మెదడు లో మెరుపు మెరిసింది. అనేక కోర్కెలతో, బాధలతో కొంత మంది వస్తారు
కదా, అలాంటివారిని ఒకరిని పట్టుకుని మన
జాలి, కరుణ, దయ దృక్కులలో
ముంచేద్దామని అనుకున్నాను.
మెట్ల మీద నించి కలయ చూసాను. కింద కొందరు
భిక్షగాళ్ళు కూర్చుని అడుక్కుంటున్నారు. వారిలో
ఒక కుర్రాడు పన్నెండు పదమూడు
ఏళ్లవాడు, ‘గుడ్డివాడిని బాబయ్యా ధర్మం చెయ్యండి బాబయ్యా’
అని దీనంగా అడుక్కుంటున్నాడు. వీడే నా
ప్రయత్నానికి సరైన వాడు అని హృదయవీణ మోగింది. వెంటనే రంగం లోకి దిగిపోయాను.
గుడి పైమెట్టు మీద నుండే వాడిపై నా కరుణా కటాక్ష
వీక్షణలు ప్రసరింపచేసాను. తదేకంగా ఒక నిముషం చూసేటప్పటికి, వాడు నాకేసి అనుమానంగా చూస్తున్నాడేమో యనే సందేహం కలిగింది. గుడ్డివాడు నన్నెట్లా గమనిస్తాడు అని
సమాధానపడి ఇంకో నిముషం అల్లాగే చూసాను. ఆ తరువాత వాడి దగ్గరకు వెళ్ళి వాడిపై దయా
చూపుల జల్లులు కురిపించాను. వాడు నాకేసి అదోలా చూసాడు. నేను ఇంకో నిముషం పాటు
ఏకాగ్రతతో దయ కురిపించాను. ఆ పైన జాలి ప్రవహింప చేసే ఉద్దేశ్యంతో, ఆ ప్రవాహంలో పక్కవాళ్ళు కొట్టుకు
పోకుండా ఉండేందుకు, కొద్దిగా ముందుకు
వంగి కళ్ళలో జాలిని పొంగించడం మొదలు
పెట్టేను. అప్పుడు వాడు అమ్మా అని పిలుస్తూ కర్రతో వాడి ముందున్న పళ్ళెం పై నాల్గైదు
మాట్లు చప్పుడు చేసాడు. వెంటనే కొద్ది
దూరంలో కూచున్న వాడి అమ్మ ‘ఏమైందిరా కొడకా ‘ అంటూ వాడి వైపు వస్తుంటే, కార్య భంగం
అయిందని పక్కకు నాలుగు అడుగులు వేసాను వడి వడి గా.
“అమ్మో ఆడెవడో, నేను నిజంగా
గుడ్డివాడనే అనుకొని నా పళ్ళెం లో డబ్బులు కొట్టేద్దామనుకున్నాడు. నిన్ను పిలవగానే
వెళ్ళిపోయాడు” అన్న మాటలు వినిపించాయి.
“ముష్టివాళ్ళ దగ్గర కూడా డబ్బు కాజేసే దొంగ
నాయాళ్ళు ఉంటారు, జాగ్రత్త నాయనా” అన్న వాడి అమ్మ మాటలు కర్ణ కఠోరంగా నా
వీనులను తాకాయి.
నా మొహంలో నెత్తురు చుక్క కనిపించలేదని నేను
వేరే చెప్పఖ్ఖర్లేదు కదా.