నేను ఎందుకు వ్రాస్తున్నాను ... మూడు

సూత మహర్షి చుట్టూ పరికించెను. మేఘాలలో సమాంతరంగా దూరంగా తమిళ రాష్టంలో  శ్రీవినాయగన్, శ్రీవ్యాసన్ కూర్చునున్నారు. ఈయన చెపుతున్నాడు, ఆయన వ్రాస్తున్నాడు. ఈశాన్య దిక్కుగా బొంగ రాష్ట్రంలో మేఘాల పైన బహు దూరంలో బొసిస్ట బ్రొమ్మరిసి యోగ బాసిస్టం చదుబుకుంటూ ఏగుచుండెను. ఇంకా  పైన స్వర్గానికి దగ్గరగా సప్త ఋషులు వేదపఠనం చేసుకుంటూ అనంతంలోకి వెళ్ళిపోతున్నారు.
దగ్గరగా ఉన్న వ్యాసమహర్షి దగ్గరికి  వెళ్ళి చింతన్ బైఠక్  చేద్దామని నిశ్చయించినవాడై, సూతమహర్షి, శౌనక మహా మునిని పిలిచాడు.
సూతమహర్షి   నాయనా శౌనకా, నేనొక దేవ రహస్యాన్ని తెలుసు కొనుటకై వ్యాస మహర్షి దగ్గరకు  వెళ్ళుతున్నాను. నువ్వు ఇక్కడ ఉన్న ఆది మహా మునులను, మునులను, సాధ్వీ మణులను, సాధ్వీ లలామలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. ఆ చివరాఖరున పది మంది యమ కింకరి లను కాపలా పెట్టితిని. వారలను కూడా చూచు చుండుము.
శౌనకుడు:  అల్లాగే గురూ గారూ, మొదట వారిని వదలి, చివరాఖరి వారిని బహు జాగ్రత్తగా పరికించెదను. ఇవ్విధంబుగా యమ కింకరి లను కాపలా పెట్టుట బహు రమ్యముగా నున్నది. పొదుపుగా దుస్తులు ధరించిన భూలోక  సినీమా నటీ మణుల వలె సుందరము గా నగుపించు చున్నారు. ఈ జాగ్రత్త ఏలనో?
సూతమహర్షి:   క్రిందటి మారు నేను సత్య లోకమున కేగినప్పుడు, ఆ చివర పంక్తుల లోని చాలా మంది,  మహా మునులు  కాలేని,  పురాణ  కధలు విన నిచ్చగించని, ముని సత్తములు, భూలోకము నకు పారి పోయారు.   అచట స్వామీజీలు, బాబాలు, అమ్మలు, అమ్మాజీలు గా అవతరించారు.  వారికేం తెలియక పోయినా, కధలు చెప్పుతూ, జనులను మభ్య పెట్టుచూ, మేడలూ మిద్దెలూ కట్టించు కొనుచూ, ఖరీదైన వాహనములలో తిరుగుచూ స్వర్గలోక భాగ్యాలను భవించుచున్నారు. కలియుగ ప్రభావమున మనుజులు ఆలోచించ జాలక, మోసగింప బడుతున్నారు.
శౌనకుడు:  అవును మహర్షి పుంగమోత్తమా, రెండు శ్లోకాలు, మూడు పద్యాలు, నాలుగు పాటలూ నేర్చుకొన్న వారందరూ  ఆంధ్ర దేశమున బాబాలు, అమ్మాజీలు గానూ మారుచున్నారని నారద మహర్షి చెప్పినారు.
 సూతమహర్షి:  శౌనకా,  పుంగవా చాలును, దానిని మొత్తనవసరం లేదు.
శౌనకుడు:  అటులనే పుంగవా క్షమించుడు మహర్షి పుంగవా

సూతమహర్షి,  అక్కడ ఉన్న సాధ్వీ  లలామలు,  మునులు కిందకు,  భూలోకమునకు  పారిపోకుండా, శౌనకునకు  తగు  జాగ్రత్తలు సూచించిన వాడై,  దక్షిణాభి ముఖంగా  ప్రయాణానికి  ఉద్యుక్తుడయ్యాడు. ఇక్కడ  అంతర్ధానమై  అక్కడ ప్రత్యక్షమగు సౌకర్యము కలవాడైననూ, సరదాగా మేఘముల లోని ఐసు మీద  స్కేటింగు చేయుచూ, మేఘమునకూ,  మేఘమునకూ కల మధ్య దూరమును అతి  చతురతతో దూకుచూ, ఆనందించుచూ,  సాగి  పోవు చుండగా, పక్కనే  ప్రత్యక్ష మయ్యాడు నారద మహర్షి.
ప్రణామ,  ప్రతి వందన కార్య క్రమాలు జయ ప్రదంగా ముగించిన తర్వాత,

నారద:  నాయనా, సూతా ఎచటికేగుచుంటివి?
సూతుడు:  మహర్షీ,  సర్వాంతర్యామికి ఆంతరంగిక  భక్తులు. తమకు తెలియని విషయము కలదా?
నారద:  విధి విలాసం బహు విచిత్రమైనది సూతా
సూతుడు:  అది ఏమి నారద మహర్షీ?
నారద:  సర్వాంతర్యామి తిరుపతి లో బందీ అయినాడు. అలిమేలు మంగకు కూడా దర్శనం దుర్లభమై పోయినది.  నా లాంటి వారికి  శ్రీవారి దర్శన భాగ్యం కలి యుగాంతమున నేమో.
సూతుడు:  స్వామీ మీరు నారాయణ అని పిలిచిన వారు పలుకుదురని కదా ప్రతీతి.
నారద:  శ్రీవెంకటేశ్వర స్వామి ఒక విధమైన నిద్ర మత్తు లో ఉంటున్నారు సూతా.  రాత్రి  12.30 గం//  నిద్రపుచ్చి నట్లే పుచ్చి,   1.30 గం// లకు సుప్రభాతం పాడుతున్నారు. వారికి విశ్రాంతి, నిద్ర రెండు నూ లేవు. వారి వంటిమీద, వారి ఖజానాలోనూ యున్న ఆభరణములు మాయమైననూ వారికి తెలియ లేదు. బ్రహ్మ, శివ,  దేవేంద్రాది  దేవతలు  పెద్ద పెద్ద  గొంతుకలతో  స్తోత్రము  చేసిననూ వారికి  వినిపించుట లేదు. నేనెంత, నాగొంతు కెంత, నా తుంబుర నాదమెంత?.
సూతుడు:  మరి దీనికి ఉపాయమేదైనా ఆలోచించ లేదా బ్రహ్మా బృహస్పతాది జ్ఞానులు.
నారద:  అదియును అయినది. ఉపాయము బెడిసి కొట్టినది. మరొక అపాయము సంభవించినది
సూతుడు:  అది ఏమి, ఏమాకధా?
నారదన్:  నాయనా సూతన్ నన్ను సతాయించకుము. శ్రీవ్యాసన్ ను అడుగుము.
సూతన్:  అటులనే స్వామిన్, తమిళనాట ప్రవేశించితి మన్నమాట.

అంత దూరమున నారదన్, సూతన్ లను చూచిన  శ్రీఏకదంతన్  అత్యవసర పని మీద వెళ్ళుతున్నానని  వ్యాసన్ తో చెఫ్ఫి మేఘాలలో అంతర్ధాన మయ్యాడు. వ్యాసన్ గారు నారదన్, సూతన్ లను ఆహ్వానించెను.

సూతన్:  మహర్షి వ్యాసన్, మీరు,  విఘ్నేశ్వరన్ ఇచట మేఘాలలో మకాం పెట్టుటకు కారణం బెట్టిది?  మీ కధా కాలక్షేపం సత్య లోకమున గదా జరుగ వలసినది.
వ్యాసన్:  అవును నాయనా, కానీ సత్యలోకమున జలము నిండు కొనుట వలన ఇచట ఉంటిమి.
సూతన్:  మహర్షీ వివరముగా సొల్లుడీ
వ్యాసన్:  వినాయక చవితి జయ ప్రదంగా ముగిసిందని భక్తులందరూ సంతసించితిరి. కానీ, కలుష భూయిష్టమైన లడ్డూలు, కుడుములూ ఆరగించిన పార్వతీనందనన్ కు అజీర్తి చేసినది. సత్య లోకమున నీటి కరవు వలననూ, ఇచట మేఘాలలో నీరు సమృద్ధిగా నుండుట వలననూ, మాటి మాటికి నీటి అవసరం తీరు నందాక , వారు ఇచట వసించుటకు నిశ్చయించారు.
సూతన్:  సత్య లోకమున నీరు లేకుండుట నాశ్చర్యముగ నున్నది.
నారదన్:   సూతా కొన్ని దేవ రహస్యము లుండును. అవి పురాణాలలో చెప్ప బడవు. సమయం, సందర్భం కలసి వచ్చినందున నే నీ కెరుక పరిచెద గాక. సావధానుడవై ఆలకించుము. పూర్వ బ్రహ్మల కాలములో మునులు, రాక్షసులు, పని లేని వారు, ఘోర తపం బాచరించెడి వారు. వారి తపాగ్ని సత్య లోకమున వ్యాపించి నీరు నావిరి చేసెను. నీరు లేక పోవుట వలన నవబ్రహ్మ విష్ణువు నాభి కమలమున జన్మించ వలసి వచ్చెను కదా.
సూతన్:  అది ఎట్లు స్వామిన్.?
నారదన్: సూతా నీవొక సందేహాల పుట్టవి. కమలము పుట్టుటకు నీరు కావలెను గదా. సత్యలోకమున నీరు ఇల్లె.  కైలాసమున మంచు గడ్డలలో కమల ముద్భవించదు కదా. అందువలన విష్ణు లోకమున జన్మించవలసి వచ్చెను.
సూతన్:  వైకుంఠము పాల  సముద్రమున నున్నది కదా. అచట నీరెట్టుల వచ్చెను?
నారదన్:  ఆహా సూతన్, తెలివైన ప్రశ్న వేసితివి.
సూతన్:   అవును, స్వామిన్, నేనెపుడునూ అంతే.
 నారదన్: పాల సముద్రం  శ్రీమన్మహాలక్ష్మికి  వారి తండ్రి గారు అరణము గా నిచ్చితిరి. ఒకానొక సమయము న శ్రీహరి కి శ్రీలక్ష్మి కి కలహము సంభవించెను. అపుడు శ్రీసతి తాను పాలు తాగి, పాలలోని నీరు శ్రీపతి చే తాగించెను. ఆ విధంగా శ్రీనాధుడి ఉదరమున మంచినీటి సరస్సు వెలసెను. కమలము జనియించెను. కమలం పుట్టగానే చటుక్కున నవబ్రహ్మ అందులోకూర్చుండి పోయెను  
సూతన్:   ఆహా, బ్రహ్మ నాభి కమలమున పుట్టుటకు ఇంత వృత్తాంతము గలదా. సరే మరి సత్య లోకమున నీటి కొఱత తీరుటెట్లు?
నారదన్:  నేనుంటిని గదా త్రిలోక సంచారిని. కైలాసం నించి వారాని కొక మారు రెండు టన్నుల ఐసు తెచ్చి పడవేయుచున్నవాడ. దానితో వారు సరిపెట్టు కుందురు.

ఇంతలో శ్రీగణేశన్ అత్యవసర పని ని పూర్తి చేసుకొని వచ్చెను.
శ్రీవినాయగన్: అందరూ కుశలమేనా, ఎచట నుండి రాక ఇటకున్ సూతా ఆఆఆఆ, సుఖులే శిష్యగణముల్, సాధ్వీలలామలున్ , ఆఆఅఆఆఆఅఆఆ
సూతన్:  స్వామీ మీరు రాగ మాపినచో ప్రత్యుత్తర మిచ్చెదను.
శ్రీవినాయగన్:  అది సరే, ఇచటకు నారద సహితులై  మీ రాక లోని అంతరార్ధ మేమి?
సూతన్:  తమకు తెలియని బ్రహ్మ రహస్యము లుండునా లంబోదరన్.
లంబోదరన్:   అంతయూ గ్రహించితిని. భూలోకమున ఆ ఎనానిమస్ యోగాభ్యాసం, త్రిలోకముల నలజడి ఇదియే గదా.
సూతన్:  అవును స్వామిన్, ఈ ఉపద్రవము నాపుటెట్లు?.
వ్యాసన్: అసలు ఈ కధ  ఏమి మలుపులు తిరగనున్నది. నేను మరల నొక పురాణము రాయ వలసిన అగత్యము దాపురించుచున్నదా?
నారదన్:  లేదు వ్యాసన్ నీవు రాయ నఖ్ఖర లేదు. వాడే రాయుచున్నాడు.
గజాననన్:  వాడు బ్లాగులో బరుకుచుండును. వాడు యోగాభ్యాసమొనర్చిన, వాని శరీరమున జ్యోతి ప్రజ్వలించును. ఆ  జ్యోతి  ప్రభావమున  సూక్ష్మ రూపుడై   త్రిలోక సంచారము   చేయగలడు.  త్రిలోకములలో పనీ పాడు లేని వారందరికి బ్లాగోపనిషత్తు నుపదేశించును. ముఖ్యముగా సూతమహర్షి యాశ్రమము న జొచ్చి, వినుటయే గాని మరి యొక పని లేని,    సూతుని కధలు వినుటకు నిచ్చగించని వారికి కూడ బ్లాగోపనిషత్తు నుపదేశించును. సాధ్వీమణులు కాలేని సాధ్వీ లలామలు, మహామునులు కాలేని మునులు వీని ప్రభావమునకు లోనై , వీడు ఉచితముగా నిచ్చు లప్పుటప్పు లను పట్టుకొని భూలోకమున బ్లాగులలో జొరబడుదురు. భూలోకమల్ల కల్లోల మగును.
వ్యాసన్:  అది ఎట్లు స్వామిన్?
గజకర్ణన్:  శ్రీ శ్రీ అని యొక మహాకవి యుండెడివాడు. ఆయన కవిత్వము రాయు వారల కొక ఉపదేశము  చేసెను,
తలుపు గొళ్ళెం
హారతి పళ్ళెం
గుఱ్ఱపు కళ్ళెం
కాదేది కవిత కనర్హం

దీనిని ఆదర్శంగా తీసుకొని బ్లాగులలో వ్రాయు కొందరు,
అరటి తొక్కా   కందముక్కా
కాలీఫ్లవరూ   కాకరకాయా
పాలవాడూ   నీళ్ళవాడూ
కూరలోడూ   కరెంటోడూ
ముద్దపప్పూ  ఆవకాయ
ఉప్మాకూరా    ఉప్పేలేని కూరా
మాడిన వేపుడు   ఉడకని అన్నం
మింగే మొగుడు   తినని పెళ్ళాం
అంటూ
ఏది చూస్తే   అదే రాస్తూ
ఏది తోస్తే    అదే రాస్తూ
అదే రాస్తూ  అదే రాస్తూ
బ్లాగు పాఠకుల
బుఱ్ఱే తింటూ  బుఱ్ఱే తింటూ
రాసేస్తున్నార్  బరికేస్తున్నార్
ఏమిటిదంటే
ఎందుకంటే  ఎందుకంటూ
రాసేసాడు   రాసేసాడూ
వీడో   మహా  పురాణం

ఈవిధంగా విజృంభించి రాసేస్తున్న భూలోక బ్లాగర్ల కి త్రిలోక వాసులు కూడా తోడైతే బ్లాగు పాఠకుల పని
శ్రీమద్రమారమణ గోవిందో హరి:   

ఇతి బ్లాగోపనిషత్తే  నేనెందుకు వ్రాస్తున్నాను  మహా పురాణ:  సమాప్త:

బృహస్పతి ఏమి ఉపాయం చేసాడు?
వీసా వెంకటేశ్వర స్వామి చిలుకూరు లో వెలియడానికి గల కారణాలు ఏమిటి?
విదేశీ కాన్సలేటు వాళ్ళు V V రికమండేషను ఎందుకు ఒప్పుకుంటారు?   T V S ను ఎందుకు ఒప్పుకోరు?
ఇంతకీ ఎనానిమస్ యోగా చేసాడా?
ఇల్లాంటి ప్రశ్న లన్నీ వచ్చేస్తున్నాయా మీకు?
వేద శాస్త్రములు చదివిన వారికే తెలియని బ్రహ్మ రహస్యం ఎనానిమస్ కి ఎలా తెలుస్తుంది? 

పి.యస్.: బ్లాగు లో పరిచయమైన మా చిన్నమ్మాయికి కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు. నేను ఎందుకు వ్రాస్తున్నానుమూడు భాగాలు  ఓపిక గా చదివి అవసరమైన చోట మార్పులు చేసి నందుకు.