నేను నా బ్లాగు పేరు మార్చడం లేదు.
బ్లాగును ఆత్మ నిర్భర్ గా అంటే స్వయం సమృద్ధంగా తయారు చేసుకొమ్మని ఆ తిరు వేంకటాద్రీశుడి ఆజ్ఞ. అది ఎట్లనిన,
అసలు బ్లాగులో ఏమిటుండాలి? అతి ముఖ్యం టపాలు, కనీసం ఒక టపా అయినా ఉండాలి.
టపా ఎప్పుడైనా, ఏ సమయంలో నైనా, రోజుకొకటి గానీ, నెలకొకటి
గానీ, మధ్యలో ఎన్ని మాట్లైనా కూడా వేసుకోవచ్చు. నేను
బ్లాగులో కొచ్చిన కొత్తలో సమయం గురించి చర్చలు జరిగాయి. ఎందుకంటే అప్పట్లో టపా
వేసిన తరువాత సంకలినులలో అది తక్కువ సమయం మాత్రమే ఉండేది. కూడలిలో నాల్గైదు గంటలు, మాలికలో ఇంకో రెండు మూడు గంటలు, హారం లోనూ, జల్లెడలోనూ ఇంకొంచెం ఎక్కువ సమయం ఉండేవి. జనం ఎక్కువుగా చూసే, చదివే సమయం ఏమిటీ?
ఇండియాలో వాళ్ళు ఆఫీసు టైమ్స్ లో చదువుతారు అని ఒక అపప్రధ ఉండేది. అమెరికా
వాళ్ళు మనకు రాత్రి సమయాలలో చదువుతారు. కొన్ని దేశాలలో మనకి ఇంకా తెల్లవారక ముందే
చదివేసి వెళ్లిపోతారు. ఆ కాలంలో ఇండియా, అమెరికా పాఠకులే ఎక్కువ. కాబట్టి టైము అనేది ముఖ్యం అనుకునేవాళ్లూ
ఉండేవారు. నా మట్టుకు నేను వివిధ సమయాలలో
పబ్లిష్ చేసి చూశాను. అర్ధరాత్రి లేచి. టపా వేసి చప్పట్లు కొట్టుకున్న సందర్భాలు
ఉన్నాయి. ఇవి ముఖ్యంగా కొత్తగా వ్రాయడం మొదలు పెట్టిన బ్లాగర్స్ పాట్లు. కొంతకాలమైన తర్వాత అంతా భ్రాంతి అనే
అనుకునే వాళ్ళు. చదివే వారి సంఖ్య రెండో
ముఖ్యమైంది అన్న మాట.
మూడో ముఖ్యమైనది టపాకి వచ్చే కామెంట్లు. మనం వ్రాసింది, టపా వేసేసిన తర్వాత
చదువుకుంటే అప్పుడప్పుడు మనకే చిరాకు వేస్తుంది. ఎందుకు వేశామా అని విచారించ వచ్చు
కూడా. అటువంటప్పుడు ఎవరైనా కామెంటు పెట్టారనుకోండి,
బ్రహ్మానంద భరితులమవుతాం. మనం వ్రాసింది బాగుందేమో ననే భ్రమ కలిగించేవి కామెంట్లు.
ఈ కామెంట్లు సంపాదించడమెలా? వీటి మీద చాలా సలహాలు వచ్చేవి.
కొంతమంది ఈ సబ్జెక్ట్ పై టపాలు వేసేరు కూడా. ముఖ్యమైన సలహా గోకుడు కార్యక్రమం.
పక్కవారి బ్లాగులో మనం మూడు నాలుగు కామెంట్లు పెడితే ఆయన/ ఆమె మన బ్లాగులో కామెంటు
పెడతారు. ఇది సాధారణంగా జరుగుతుంది. ఈ విధంగా మనం కామెంట్ల దాతలను పోగు చేసుకోవచ్చు. ఇటువంటి
కామెంట్ల దాతలు, మనం గోకడం మానేస్తే వాళ్ళు కూడా మానేస్తారు.
ఇంకో పద్ధతి, ప్రచారం. మన బ్లాగు చిరునామా అందరి బ్లాగుల్లో కామెంట్ల ద్వారా పెట్టి, "నా బ్లాగును సందర్శించి సలహాలు ఇవ్వండి" అని అడగడం. ఎవరైనా దయదలిచి వచ్చి
ఒక కామెంటు దానం చేసి వెళతారు. ధైర్యస్థులు ఇతర బ్లాగర్స్ మెయిల్ అడ్రెస్ సంపాదించి “ మీ ప్రతిభ
అసామాన్యం, అనన్యం, మీకు మల్లె
వ్రాయాలని నా ప్రయత్నం” అని వ్రాస్తే
కరగని వాడుంటాడా?
ఇలా అనేక పద్ధతులు. ఈ క్రమంలో ఒకరిద్దరు వీరాభిమానులను సంపాదించుకుంటే పంట
పండినట్టే. వారు కామెంట్ల పరంపర
కొనసాగిస్తారు. ఇంకోటి మీరే నాలుగు పేర్లతో పది కామెంట్లు పెట్టుకోవడం. ఇంకా కొన్ని పద్ధతులు ఉన్నాయి. మరెప్పుడైనా
చెప్పుకుందాం.
ఇవి కాక ఎప్పుడైనా మీరు వ్రాసింది
నచ్చి ఏ ప్రముఖ బ్లాగరైనా కామెంటు పెడితే,
వారిని చూసి ఇంకొంతమంది వచ్చి చదవవచ్చు, కామెంట్లు
పెట్టవచ్చు. అంటే మనం వ్రాసింది నలుగురికి
నచ్చితే కామెంట్లు వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. నాలాంటి తృతీయ శ్రేణి రచయితలకు అటు పాఠకులూ
ఉండరు, ఇటు కామెంట్లూ రావు. అటువంటప్పుడు చివరి ప్రయత్నంగా
బ్లాగును ఆకర్షణీయంగా తీర్చి దిద్దాలి. కనీసం బ్లాగు రూపురేఖలను చూడడానికి
కొంతమందైనా వస్తారేమో నని ఆశ. సరే నాకు ఇది కూడా చేతకాదు. కాబట్టి ఈ అవకాశం నేను
కోల్పోయాను. అందుచేత వేరే మార్గం లేక
“పెను చీకటాయే లోకం చెలరేగే నాలో శోకం, ఇంతేరా ఈ
జీవితం ఎంత తిప్పినా తిరగని రంగుల రాట్నం, చీకటిలో కారుచీకటిలో
పడవ ప్రయాణం” అంటూ విషాద గీతాలు పాడుకునేవాడిని. ఆ పాటలు విని విని నాకే చిరాకు
వేసి పాడడం మానేశాను.
తరువాత తరువాత కొంచెం గ్నానము
వచ్చింది. “ఎందుకోసం ఈ వ్రాయడం ఎవరికోసం ఎవరికోసం” అనుకొని బ్లాగుకేసి
రావడం మానేశాను. సుమారు రెండు మూడేళ్లు గడిచిన తరువాత దురద మళ్ళీ
మొదలయ్యింది. మళ్ళీ బ్లాగులకేసి రావడం మొదలు పెట్టాను. కానీ ఎంత
ప్రయత్నించినా కొత్తవి వ్రాయడం కుదరలేదు.
ఏదో ఆలోచిస్తుంటే బాల్యం గుర్తుకు వచ్చింది. మా పక్కింట్లో ఒక
జామ చెట్టు ఉండేది. ఆ ఇంటాయన దానికి ఎరువు వేసేవాడు కాదు. కనీసం నీళ్ళు కూడా పోసేవాడు
కాదు. పాపం ఆ చెట్టు అసలు చదువుకోలేదు.
అందుచేత ఏడాది పొడుగునా కాయలు కాసేది. మేం చెట్టు ఎక్కి కాయలు కోసేవాళ్లం. చేతికి
అందక పోతే కర్రతో కొట్టేవాళ్లం. రాళ్ళు కూడా విసిరి కాయను పడగొట్టే ప్రయత్నాలు
చాలానే చేశాం.
మళ్ళీ నాలో గ్నాన బల్బు
వెలిగింది. అన్ని దెబ్బలు తిన్నా పాపం ఆ వెర్రి చెట్టు కాయలు కాయడం మానెయ్యలేదు.
మళ్ళీ మళ్ళీ జామకాయలే కాసేది. ఇన్ని దెబ్బలు కొడుతున్నారు కదా అని ఎప్పుడూ నిమ్మకాయలు కానీ వేపకాయలు కానీ కాయలేదు.
జామ చెట్టుకు ఉన్న గ్నానము నాకు ఎందుకు లేదు? అందులోనూ అంతో ఇంతో
చదువుకున్నాను గదా. గజనీ మహ్మద్ అనేక దండయాత్రలు చేశాడు అని తెలుసును గదా. విక్రమార్కుడు అసలు విసుగు చెందలేదు కదా.
మనమేమైనా తక్కువ తిన్నామా? మెట్రిక్ మీద మనం కూడా
దండయాత్రలు చేశాం గదా. సెప్టెంబరు, మార్చి అని విసుగు చెందలేదు కదా. పరీక్షలు ఎప్పుడు పెట్టినా మనం ఎవర్రెడి కదా. కొత్త పాఠాలు నేర్చుకోకున్నా కిందటేడు వ్రాసినవే
మళ్ళీ వ్రాసి పాస్ కాలేదా? ఇదీ
అంతే. కొత్తవి వ్రాయలేకపోతే పాతటపాలే వేద్దాం. కాలం
మారుతోంది. మనం ఇదివరలో వ్రాసినవి నచ్చే
పాఠకులు ఇప్పుడు వచ్చారేమో? మళ్ళీ ప్రయత్నిద్దాం. తప్పితే నష్టం ఏముంది మళ్ళీ సప్లిమెంటరీ
పరీక్షలు వస్తాయి కదా. జై భజరంగ్ భళి అని
మొదలు పెట్టాను.
పాత టపాల పునఃప్రచురణ మొదలు పెట్టాను.
అప్పట్లో ఎంతో కొంత మంది పాఠకులు వచ్చిన, ఇన్నో అన్నో కామెంట్లు వచ్చిన టపాలతో మొదలు పెట్టాను. మనిషి
అందులోనూ రచయితను అనుకునేవాడు భ్రమల్లోనే బతుకుతాడు అని మళ్ళీ ఇంకోమారు
నిరూపించుకున్నాను. భ్రమలు భగ్నమైనా, సెప్టెంబర్
ఆచారస్తుడిని కాబట్టి ఇంకొంతకాలం
ప్రయత్నించాను. “your face, We don’t care” అని ఈమాటు ఇంగ్లీష్ లో కోప్పడ్డారు పాఠకులు. విక్రమార్కుడి వంశస్థుడిని కాబట్టి విసుగు
చెందకుండా ఇంకొన్ని వేశాను.
ఇంతలోనే కరోనా అన్నారు. లాక్ డౌన్ అన్నారు. ఇంట్లోనే
కూర్చుని బఠానీలు తినమన్నారు.
చేసిన పాపం చెబితే పోతుందని అంటారు. ఇంట్లోనే ఉంటారు
కదా, చేసేది ఏమి లేక మన టపాలు చదువుతారేమో నని ఉబలాటపడ్డాను.
“ అబ్బే, అమ్మా పిల్లలం దెబ్బలాడుకుంటాం, భార్యాభర్తలం యుద్ధాలు చేసుకుంటాం, అవసరమైతే మనోవైజ్ఞానిక
నిపుణుల దగ్గరికి వెళతాము కానీ నీ బ్లాగు కేసి రాం రాం” అన్నారు.
మళ్ళీ విషాదయోగం పట్టింది నాకు. తెలుగు సినిమా
విషాద గీతాలు అచ్చిరాలేదని పద్యాలు
పాడుకోవడం మొదలు పెట్టాను,
“నల్లని వాడు రక్తనయనమ్ముల వాడు గద
నూని మహా మహిషమ్ముపై ప్రవర్తిల్లెడు వాడు
నా
బ్లాగు ప్రాణ ధనమ్ము గొని తెచ్చె కనిపింపడుగా భిల్ల పురంధృలార దయచేసి
తెల్పరే”
రాగయుక్తంగా పాడుకోవడం సాగించాను.
ఆ
సమయంలోనే ఆత్మ నిర్భర భారత్ అన్నారు. స్వయం సమృద్ధ భారత్ అన్నారు. ఆ నినాదాలు
పెరిగాయి.
ఎంత చేతకాని వాడికైనా ఆ తిరు వేంకటాద్రీశుడు
అవకాశాలు కల్పిస్తూనే ఉంటాడు. ఒక రాత్రి నిద్రలో కలగంటి కలగంటి,
కనకరత్న కవాట కాంతులిరుగడ గంటి, ఘనమైన దీప సంఘములు గంటి
అనుపమ మణి మయమ్మగు కిరీటము గంటి, కనకాంబరము
గంటి, గ్రక్కన మేలుకొంటి
మేలుకొనగానే నా మెదడులో ఈమాటు
ఏకంగా గ్నాన సూర్యుడు భగ్గుమని
వెలిగాడు.
ఆత్మ నిర్భర బ్లాగు అని ముమ్మారు నా
మెదడులో ప్రతిధ్వనించింది.
అంతే మరేం ఆలోచించకుండా ఆత్మ నిర్భర బ్లాగు మాత్రమే నా
కష్టాలు తీర్చగలదు అని నిశ్చయించుకున్నాను.
“మన టపాలు మనమే వ్రాస్తాం గదా. మన
పాఠకులను మనమే తయారు చేసుకోవాలి. మన కామెంట్లు మనమే పెట్టుకోవాలి. మన లైకులు మనమే
కొట్టుకోవాలి” అని ఘట్టిగా సంకల్పం చెప్పుకున్నాను. కార్యోన్ముఖుడిని అయ్యాను.
నాలుగు మెయిల్ ఐడి లను సృష్టించాను.
సింహాద్రి అప్పన్న, శ్రీశైలం మల్లన్న, బెజవాడ కనకదుర్గ, తిరుపతి వెంకన్న అని. ఇంకో పది
కూడా వేస్తాను.
బంధు మిత్రగణా లందరికి మెయిల్స్ పంపాను.
“కంప్యూటర్లో మీ పనులు
చేసుకునేటప్పుడు, నా బ్లాగు ఓ మూల కిటికీ లో పెట్టి, మీ పనులు చేసుకోండి. బ్లాగు చదవాల్సిన అవసరం లేదు. ఈ పని మీరు చేయకపోతే
మీ ఇంట్లో శుభకార్యాలకు నేను వచ్చి ఒక్క బిస్కెట్టు పాకెట్టు మాత్రమే ఇస్తాను. మరే
గిఫ్ట్స్ ఇవ్వను. బహు పరాఖ్” అని బెదిరించాను.
సుమారు రెండు వందల మెయిల్స్ పంపాను.
కనీసం సగం మంది ఐనా మాట వింటారు అని ఆశ. మామూలుగా వచ్చే నలభై ఏభై మంది పాఠకులు
ఎలాగూ ఉంటారు. బ్లాగు కళ కళ లాడిపోతుంది అని సంబరపడి పోతున్నాను.
తరువాతి టపాల నుంచి ఇదే మంత్రం. ఇది కూడా ఫలించక పొతే ఇంతే సంగతులు అని చెప్పేస్తాను.
జై తిరు వేంకటాద్రీశా జై జై తిరు వేంకటాద్రీశా, నీదే భారం.