ఆ మధ్యన ఎక్కడో చదివాడు ప్రద్యుమ్నుడు. “ఉత్తరం వ్రాయడం ఒక చక్కటి ఆత్మీయ అనుభూతి” అని ఒక ప్రముఖ వ్యక్తి అన్నారుట, ఏదో సందర్భంలో.
కాబట్టి ఆ చక్కటి చిక్కటి ఆత్మీయ అనుభూతిని తను కూడా పొందాలని ప్రద్యుమ్నుడు కృతనిశ్చయుడు, దృఢనిశ్చయుడు అయిపోయాడు. ఉత్తరం వ్రాయడం ఒక కళ అని కూడా విని ఉన్నాడు ప్రద్యుమ్నుడు. కాబట్టి ఆ కళను కూడా అభ్యాసం చెయ్యాలని నిర్ణయించు కున్నాడు.
ప్రద్యుమ్నుడు ఎప్పుడూ ఉత్తరాలు వ్రాయలేదా అంటే వ్రాశాడు, విశాఖపట్టణంలో చదువుకు జేరినప్పటి నుంచి, ఉత్తరాలు వ్రాసేవాడు, నాన్నగారికి. అవన్నీ బెదిరింపు ఉత్తరాలు అని వాళ్ళ నాన్నగారు వ్యాఖ్యానించేవారు.
“నాన్నగారూ నాన్నగారూ అర్జంటుగా వెంటనే 75 రూపాయిలు పంపించండి. లేకపోతే ఆకలి దప్పులతో అలమటించాల్సి వస్తుంది. మీరంతా క్షేమమని తలుస్తాను. మీరు వెంటనే డబ్బు పంపిస్తే నేను కూడా క్షేమంగానే ఉంటాను.” అని.
మొదటి రెండు మూడు ఉత్తరాలకి పాపం ఆయన బెదిరిపోయి అప్పో సప్పో చేసి వెంటనే డబ్బు పంపించేవారు. ఉత్తరాలలో అంకె మారేది కానీ మిగిలినదంతా డిటో గానే ఉండేది. నాలుగు ఉత్తరాల తరువాత ఆయన ఆలోచించారు. అక్కడ చదువుతున్న ఒకరిద్దరు కుర్రాళ్ళ తల్లి తండ్రులను అడిగారు. వాళ్ళు ఈయనకు ధైర్యం చెప్పారు. “రెండు నెలలు మీరు పంపించక పోయినా క్షేమంగానే ఉంటాడు మీ అబ్బాయి” అని వాళ్ళపిల్లలతో వాళ్ళ అనుభవాలు సోదాహరణం గా వివరించి చెప్పారు.
అప్పట్నించి ఆయనకు వీలైనప్పుడే పంపించేవారు కానీ ప్రద్యుమ్నుడి ఆకలి దప్పుల ఘోష పట్టించుకోవడం మానేశారు. ప్రద్యుమ్నుడు వాళ్ళ నాన్నగారి కన్నా రెండాకులు ఎక్కువే చదివాడు. వాళ్ళ అన్నగారికి, అక్క గారికి ఆకలి ఘోష వినిపించాడు. వాళ్ళు రెండు మాట్లు పంపి ఆ తరువాత తండ్రిగారి జ్ఞానబోధ ఆకళింపు చేసుకొని ప్రద్యుమ్నుడి ఆకలి గోల పట్టించుకోవడం మానేశారు. పాపం ప్రద్యుమ్నుడి తండ్రి గారు ప్రతీ నెలా 10 – 15 తారీఖుల్లో డబ్బు పంపించేవారు, అడిగినంత కాకపోయినా.
ఆ తరువాత చదువయ్యి ఉద్యోగంలో జేరిన రెండు నెలలకి ఉత్తరం వ్రాయాల్సి వచ్చింది పాపం ప్రద్యుమ్నుడికి. లీవ్ లెటర్. మార్నింగ్ షో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాల్సి వచ్చి. బాసు గారికి లీవ్ లెటర్ ఇంగ్లీష్ లో వ్రాసాడు. అనుకోకుండా అకస్మాత్తుగా కడుపు నొప్పి ఎలా వచ్చిందో, అర్జంటుగా సివిల్ హాస్పిటల్ కి వెళ్ళకపోతే ఆ నొప్పి పైకి పాకి గుండెలోకి వెళ్ళే, లేక కిందకు జారి మరొక దుర్యోగం పట్టే, అవకాశాలు గురించి విపులంగా చర్చించి, ఒక రోజు శలవు ప్రసాదించవలసిందిగా అభ్యర్ధించాడు. ఆ లీవ్ లెటర్ చదివి, షాక్ అయి ఆయన వెంటనే లీవ్ ఇచ్చేసారు. ఓ సలహా కూడా ఇచ్చారు. శలవుకు కారణాలు అంత విపులంగా చర్చించాల్సిన అవసరం లేదనిన్నీ, మాములుగా శలవు ఇమ్మని వ్రాస్తే ఇచ్చేస్తానని హామీ కూడా ఇచ్చారు ఆయన.
బందుమిత్రులకి ఉత్తరాలు వ్రాసే అలవాటు అబ్బలేదు ప్రద్యుమ్నుడికి. ఉత్తరాలు వ్రాయాలంటే విసుగు, చిరాకు ప్రద్యుమ్నుడికి. ఎవరైనా బంధు మిత్రులు ఉత్తరం వ్రాసినా బాస్ గారి సూచన ప్రకారం క్లుప్తంగా “ మీ ఉత్తరం అందింది. సంగతులు తెలిసినవి. ఇంతే సంగతులు. చిత్తగించవలెను” అని జవాబు వ్రాసేవాడు. మళ్ళీ వాళ్లెవరు ఉత్తరాలు వ్రాసేవారు కాదు. తండ్రి గారికి కూడా ఉత్తరాలు వ్రాసేవాడు కాదు. ప్రతినెలా పంపే మనియార్దర్ లోనే “నేను క్షేమం. మీరు కూడా క్షేమమని తలుస్తాను” అని ముక్తసరిగానే ముగించేసేవాడు.
మాములుగానైనా ఉత్తరం వ్రాసే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యలేదు ప్రద్యుమ్నుడు. కళగా ఉత్తరం వ్రాసే అవసరం కూడా కలుగలేదు ప్రద్యుమ్నుడుకి. కలం స్నేహాలు కానీ, ప్రేమలో పడడం కానీ ప్రద్యుమ్నుడు చెయ్యలేదు.
ఉద్యోగంలో జేరాడు కాబట్టి పెళ్లి కూడా చేసేశారు పెద్దవాళ్ళు. అస్సాం లో ఉద్యోగం కాబట్టి, దూరాభారం కాబట్టి, పెళ్ళైన తరువాత తనతోనే సతీమణి ప్రభావతిని అస్సాం లోని జోర్హాట్ కి తీసుకెళ్ళిపోయాడు ప్రద్యుమ్నుడు. అందుచేత భార్యామణికి ప్రేమలేఖలు వ్రాసే అవసరం కానీ అవకాశం గానీ కలుగలేదు ప్రద్యుమ్నుడికి. ఆ దూరాభారం వల్లే భీమవరం కానీ విజయవాడ కానీ వచ్చినప్పుడు కలిసే వచ్చేవారు, కలిసే వెళ్ళేవారు.
రెండు మాట్లు ప్రభావతి పురిటికి ఇంటికి వెళ్ళినప్పుడు ఉత్తరాలు వ్రాసే అవకాశం చిక్కినా ప్రద్యుమ్నుడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
“నిన్న వంకాయ ఆవ పెట్టి కూర చెయ్యబోయాను కానీ కూర మాడిపోయింది. ఉప్పు కూడా ఎక్కువయింది అనుకుంటాను....... మొన్న చౌదరి గారి భార్యకి నలతగా ఉందని తెలిసి వెళ్లి చూచి వచ్చాను. ఇప్పుడు బాగానే ఉంది.” అంటూ ప్రద్యుమ్నుడు వ్రాసేవాడు.
“వంకాయ ఆవ పెట్టిన కూర మాడిపోవడమేమిటి?” అంటూ వంకాయ ఆవ పెట్టి కూర చేసే విధానం వివరించి వ్రాసేది ప్రభావతి జవాబు వ్రాస్తూ. పైగా చివర్లో “చౌదరి గారి భార్యకి నలతగా ఉంటే మీరు చూసి రావడమేమిటి, జాగ్రత్తగా ఉండండి తేడా వస్తే కాళ్ళు విరగ కొడతాడు ఆయన” అంటూ హెచ్చరించి ముగించేది.
ఈ విధంగా ప్రద్యుమ్నుడు దోసకాయ పచ్చడి చేయడం నేర్చుకునే లోపులే బారసాలకి వెళ్లి ప్రభావతిని తీసుకు వచ్చేసేవాడు జోర్హాట్‍కి.
దురదృష్టవశాత్తు ప్రద్యుమ్నుడికి ఉత్తరాలు వ్రాసే నేర్పు ఇంత కన్నా ఎదగలేదు ఇప్పటికి కూడా.
ఉత్తరాలను వ్రాసే కళ గురించి గూగుల్లో చూశాడు కానీ చదివినది ఏది బుర్ర కెక్కలేదు. అయినా కళాత్మకమైన ఉత్తరాలు వ్రాసి చక్కటి ఆత్మీయ అనుభూతిని పొందాలన్న కోరిక ఇంకా బలపడింది ప్రద్యుమ్నుడిలో.
మొదట ఉత్తర రచయిత నైతే తరువాత కళాత్మక రచయిత నవ్వ వచ్చని ధైర్యం తెచ్చుకున్నాడు. ఉత్తరాలు స్థానిక పత్రికా సంపాదకులకు వ్రాస్తే బాగుంటుందని ప్రభావతి సలహా ఇచ్చింది. సంతోషంగా అంగీకరించాడు ప్రద్యుమ్నుడు.
మొదటగా కాలనీలో ఉన్న శివాలయంలో అర్చన చేయించి, తన ఉత్తరాలు సంపాదకులకు నచ్చాలని ఆ పరమేశ్వరుడిని మొక్కుకున్నాడు. ఆ సంపాదకులు, తన ఉత్తరాలు పబ్లిష్ చేస్తే పాలాభిషేకం చేయిస్తానని కూడా నివేదించుకున్నాడు ఆ భోలా శంకరుడికి.
రెండు వార్తాపత్రికలు చదివి, కష్టపడి ఒక ఉత్తరం “దేశసమస్యలపై మీరు వ్రాస్తున్న సంపాదకీయాలు ముదావహముగా, ఆసక్తి దాయకంగా నున్నవి. స్థానిక సమస్యలపై కూడా ముఖ్యంగా మా కాలనీలో కుక్కల సమస్యపై కూడా మీరు సంపాదకీయంలో ఉటంకించ వలసిందిగా ప్రార్ధిస్తున్నాను”. అని వ్రాశాడు. ఇది ఇంగ్లీషులోకి అనువాదం చేసి, రెండు కాపీలు చేసి, తెలుగు ఉత్తరం కూడా రెండు కాపీలు చేసి నలుగురు సంపాదకులకు పంపించేశాడు ఉత్సాహంగా.
పదిరోజులైనా ఏ సంపాదకుడు వాటిని ప్రచురించలేదు. దిగులు చెందక మళ్ళీ ప్రద్యుమ్నుడు వాటికి కొద్ది కొద్దిగా మార్పులు చేసి పంపించాడు. ఇంకో పది రోజులైనా సంపాదకులు కనికరించలేదు. పట్టు వదలని విక్రమార్కుడి లా ఈ మాటు ఇంకో ఉత్తరం పూర్తిగా స్థానిక పత్రిక ‘ఎల్. బి. నగర్ వార్తా స్రవంతి’ కి వ్రాసి తనే పట్టుకెళ్లి పత్రిక కార్యాలయంలో ఇచ్చి వచ్చాడు. వారు కూడా అది ప్రచురించలేదు.
పాపం ప్రద్యుమ్నుడు కొంచెం నిరుత్సాహ పడ్డాడు. పత్రికలకి వ్రాసే విధానం గూర్చి కొంచెం శోధించాడు కానీ తనకు ఉన్న రాజకీయ పరిజ్ఞానం, స్థానిక సమస్యలపై అవగాహనా లేమి బహుశా అడ్డంకులేమో నని సరిపెట్టుకున్నాడు. పాఠకుల ఉత్తరాల శీర్షికకు వ్రాయకూడదు అని తీర్మానించుకున్నాడు.
పదిమందిని చంపితే కానీ వైద్యుడు కాలేడు అన్న విషయం గుర్తుకు తెచ్చింది ప్రభావతి. పదిమందిని కష్టపెట్టయినా ఉత్తర రచయిత నవ్వాలని మరో మారు కృత నిశ్చయుడయ్యాడు ప్రద్యుమ్నుడు. బంధు మిత్రులకు ఉత్తరాలు వ్రాయడమే మంచిదని, వ్రాయగా వ్రాయగా ఉత్తర కళ అబ్బునని, ఎన్ని కష్ట నిష్టురాలైనా భరించి ఉత్తరాలు వ్రాసే కళను పెంపొందించుకోవాలని ధృఢ నిశ్చయుడయ్యాడు ప్రద్యుమ్నుడు.
పది మందికి వ్రాసి పదిమంది బంధు మిత్రులతో విరోధం అంత క్షేమకరం కాదేమో నని అనుమానం వెళ్ళబుచ్చింది ప్రభావతి. ప్రద్యుమ్నుడు నిరశన వ్యక్తం చేసాడు. ప్రభావతితో ఈ విషయంపై చర్చించ కూడదని మరో తీర్మానం చేసుకున్నాడు. పదిమందికి వ్రాసి వారి దీనాలాపాలు వినడం కన్నా, ఒకరినే పది ఉత్తరాలతో కుళ్లపొడిచి వారి హాహాకారాలు వినడమే శ్రవణానంద కరంగా ఉంటుందనే దుర్బుద్ధి పొడ చూపింది ప్రద్యుమ్నుడిలో. పైగా ప్రభావతి దగ్గరి బంధువుల్లో ఒకరికి వ్రాయాలనే శాడిస్టిక్ కోరిక బలపడింది ప్రద్యుమ్నుడిలో. అలా చేస్తే కళాభ్యాసం కుంటుపడుతుందేమో నని సందేహం కలిగింది. కళాభ్యాసం కోసం శాడిస్టిక్ కోరికను అణుచుకున్నాడు.
ఎవరికి వ్రాద్దామా అని ఆలోచించాడు. ఆలోచించగా ఆలోచించగా ఆంజనేయ శాస్త్రి గారు గుర్తుకు వచ్చారు. ఆంజనేయ శాస్త్రి గారితో ప్రద్యుమ్నుడికి పెద్దగా పరిచయం లేదు. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళుతుండగా బస్ లో పరిచయం అయ్యారు. ప్రద్యుమ్నుడి పక్క సీటు.
యల్. బి. నగర్ లో బస్ ఎక్కి, కండక్టర్ గారితో ముఖాముఖి తరువాత సీటు వెతుక్కుని వచ్చి సీటులో కూలబడ్డాడు ప్రద్యుమ్నుడు.
పక్కనే అప్పటికే సుఖాసీనుడైన ఆయన లేచి నుంచుని చెయ్యి ముందుకు జాపి “I am Anjaneya Sastri” అన్నాడు.
ప్రద్యుమ్నుడు కూర్చునే చెయ్యి జాపి “మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది” అని అన్నాడు.
ఆయన నుంచునే చెయ్యి వదలకుండా ఇంకో మారు “I am Anjaneya Sastri” అని అన్నాడు.
ఇక తప్పదనుకొని ప్రద్యుమ్నుడు లేచి “నన్ను ప్రద్యుమ్నుడు అంటారు” అన్నాడు.
ఆయన చెయ్యి వదిలి తన సీట్లో కూర్చున్నాడు. ప్రద్యుమ్నుడు కూడా సీట్లో కూర్చుని తల నాలుగు వైపులా తిప్పి ప్రయాణికులను పరిశీలించి “ ఏలూరు బస్సులు ఇంత డ్రై గా ఎందుకు ఉంటాయో” అనుకుని నిట్టూర్చాడు.
“ఏమిటి చూస్తున్నారు. ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారా? “ అని ప్రశ్నించారు శాస్త్రి గారు.
“అబ్బే లేదండి, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూశాను” అని జవాబు ఇచ్చాడు ప్రద్యుమ్నుడు.
ఇంకో అరగంటలో ప్రద్యుమ్నుడు ఆంజనేయ శాస్త్రి గారి బయోడాటా అంతా విన్నాడు. వారు విజయవాడ లో ఉంటారుట. పని మీద హైదరాబాదు వచ్చారుట. ఆయనకు సమాజ సేవ అంటే చాలా ఇష్టముట. ప్రస్తుతం ఆయన విజయవాడలో ఆత్మహత్యల నివారణ కౌన్సిలింగ్ కమిటీలో సభ్యుడుట. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకునే వారికి కౌన్సిలింగ్ చేసి వారిని ఆ ప్రయత్నం చేయకుండా ఆపుతారట. స్త్రీ జనోద్ధరణ కూడా వారి సమాజ సేవలో భాగమట. ఇంకా చాలానే చెప్పారు. ప్రద్యుమ్నుడు నాలుగు మాట్లు ఆవలించాడు. ధైర్యం చేసి మధ్యలో ఆయన ఉపన్యాసం ఆపి “మీకు నిద్ర రావటం లేదా” అని అడిగాడు. ఆయన వాక్ప్రవాహం కొనసాగింది. మరింత ధైర్యం చేసి “పొద్దున్నుంచి అనేక పనులవల్ల అలసి పోయాను. నిద్ర ముంచుకు వస్తోంది” అని కూడా మొరపెట్టుకున్నాడు. అయినా శాస్త్రి గారు కనికరించ లేదు. ఇంకో పదినిముషాలు పైనే తన ఉపన్యాస ఝరిలో ప్రద్యుమ్నుడిని ముంచేసారు శాస్తిగారు. “ఇప్పుడు తమ గురించి చెప్పండి” అని పృచ్చించారు శాస్త్రిగారు.
తప్పదనుకొని ప్రద్యుమ్నుడు “ నేను భీమవరంలోనూ, వాల్తేరు లోనూ విద్యాబ్యాసం చేశాను. జోర్హాట్, అస్సాం లో సైంటిస్ట్ గా పనిచేసాను. ప్రస్తుతం పనీ పాడు లేని రిటైర్డ్ వ్యక్తిని.” అని క్లుప్తంగా ముగించి బేగ్ లోంచి తువ్వాలు తీసి ముసుగు పెట్టుకొని నిద్రకు ఉపక్రమించాడు. ఆంజనేయ శాస్త్రిగారు “అప్పుడే నిద్రా” అని ఆశ్చర్యపోయారు.
ఉన్నట్టుండి ఎవరో కుదిపితే మెలుకవ వచ్చింది ప్రద్యుమ్నుడికి. ఎదురుగుండా శాస్త్రిగారు.
“మా ఊరు విజయవాడ వచ్చేసింది. నాలుగున్నర అయింది. ఇక్కడ అరగంట బస్ ఆగుతుంది. మెలుకువగా ఉండండి. ఇంకో గంటలో ఏలూరు వచ్చేస్తుంది. ఇది నా ఎడ్రస్. మీరు విజయవాడ వస్తే నాకు తెలియజేయండి. నేను వచ్చి కలుస్తాను. మీ ఎడ్రస్ ఇవ్వండి.” అన్నారు శాస్త్రిగారు.
ఇంకా బద్ధకం వదలని ప్రద్యుమ్నుడు తన సెల్ నంబర్ చెప్పాడు. నిద్ర మత్తులోనో, కావాలనో ఒక నంబర్ తప్పు చెప్పాడు. శాస్త్రిగారు తన సెల్ లో ఎక్కించుకున్నారు.
ఏలూరు నుంచి తిరిగి రాగానే ప్రభావతి శాస్త్రిగారి ఎడ్రస్, ఎడ్రస్ బుక్కు లో ఎక్కించేసింది . ఇది జరిగి నాలుగు ఏళ్లు అయింది.
ఎడ్రస్ బుక్కు తీసి ఆంజనేయ శాస్త్రి గారి చిరునామా వెతికి తీసాడు ప్రద్యుమ్నుడు. ఉత్తరం వ్రాయడానికి ఉపక్రమించాడు. నాలుగు లైన్లు వ్రాసి, రెండు తీసేసి రెండు మార్చి వ్రాస్తూ నాలుగు రోజులకి ఒక ఉత్తరం వ్రాయగలిగాడు.
బ్రహ్మశ్రీ వేదమూర్తులైన శ్రీఆంజనేయ శాస్త్రి గారికి తమ మిత్రుడు ప్రద్యుమ్నుడు నిత్యం త్రికాలముల యందు అనేక నమస్కారములు చేస్తూ వ్రాయు లేఖార్ధములు. ( ఈ వాక్యం తన తండ్రిగారు తమ మామ గారికి వ్రాసే ఉత్తరంలో వ్రాసేవారు. అది గుర్తుకు వచ్చి కాపీ కొట్టేశాడు. ఆంజనేయ శాస్త్రి గారు తనకన్నా చిన్నవాడు అయినా, చిన్న పామునైనా పెద్ద కర్ర తోనే కొట్టాలనే సూత్రం గుర్తుకు వచ్చి నమస్కారం తో సహా యధాతధంగా ఉంచేశాడు).
నాలుగు సంవత్సరాల క్రితం హైదరాబాదు నుంచి ఏలూరు వెళ్ళే బస్సులో తమ పరిచయ భాగ్యం కలిగింది. మీకు గుర్తు ఉందని ఆశిస్తున్నాను. అప్పటి నుంచి మీకు ఉత్తరం వ్రాసి మీతో పరిచయం పెంపొందించుకోవాలనే ఉబలాటపడ్డాను. కానీ దైవానుగ్రహం కుదరక ఇప్పటిదాకా వ్రాయలేకపోయాను. ఇందుకు మీరు నన్ను క్షమించాలి. ఇప్పుడు ఈ ఉత్తరం వ్రాసే అవకాశం అనడం కన్నా అవసరం కలిగింది అని నిర్మొహమాటంగా ఒప్పుకుంటున్నాను.
గత కొన్ని వారాలుగా జీవితం మీద చిరాకు పుడుతోంది. ఆర్ధికంగా గానీ ఆరోగ్యపరంగా గానీ బాగానే ఉంది. ఇబ్బందులు ఏమీ లేవు. అయినా ఏదో నిరాసక్తత, నిరుత్సాహం ఆవరిస్తున్నాయి. జీవించి ఏమి చెయ్యాలో అర్ధం కావటం లేదు. నా అవసరం కూడా ఇంట్లో ఎవరికీ లేదు. నేను లేకపోయినా ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదనే నా విశ్వాసం. మా ఆవిడకు సమృద్ధిగానే, అవసరాలకి మించే ఫామిలీ పెన్షన్ వస్తుంది. మా ఆఫీసు నుంచి మెడికల్ ఫసిలిటీస్ కూడా యధాతధంగానే ఉంటాయి. నేను లేకపోతే పని తగ్గి ఆవిడ ఇంకొంచెం ఆనందంగానే ఉంటుందని నా అనుమానం. ఆలోచిస్తుంటే వ్యర్ధ జీవితం గడుపుతున్నానేమో ననే నమ్మకం బలపడుతోంది. జీవితం మీదే విరక్తి పుడుతోంది. శాంతి లోపిస్తోంది. ఆ మధ్యన సన్యసించి దేశాలు తిరిగితే శాంతి లభిస్తుందేమో ననికూడా అనుకున్నాను. కానీ వంకాయ కూర మీద, బొబ్బట్లు, తొక్కుడు లడ్డూల మీదా వ్యామోహం చంపుకోలేక ఆ ఉద్దేశ్యం నుంచి విరమించుకున్నాను. ఈ వ్యామోహం కూడా జీవితం మీద ఒక విధంగా విరక్తి కలిగిస్తోంది. షేక్స్పియర్ గారి హేమ్లెట్ లాగానే “టు బి ఆర్ నాట్ టు బి” అనే ద్వైదీ భావన ( ఈ పదాలు ఎక్కడో చదివాడు ప్రద్యుమ్నుడు. అర్ధం తెలియకపోయినా బాగున్నాయి, బరువుగా ఉంటాయి అని ఇక్కడ వాడేశాడు) కలుగుతోంది. ఆశా నిరాశా నిస్పృహ ల మధ్య ఆలోచనలు తీవ్రతరమవుతుంటే మీరు గుర్తుకు వచ్చారు. ఈ జీవితం మీద విరక్తి, బొబ్బట్లు, తొక్కుడు లడ్డూల మీద అనురక్తి లకు సంబంధించిన ద్వందభావాల నుంచి విముక్తి కలిగే మార్గం మీరేదైనా ఉపదేశిస్తారేమో నని ఈ ఉత్తరం ఇప్పుడు మీకు వ్రాస్తున్నాను. మీ గత అనుభావాల దృష్ట్యా మీరు తగు మార్గ నిర్దేశనం చేస్తారని ఆశిస్తునాను.
ఇట్లు,
భవదీయుడు,
ప్రద్యుమ్నుడు
వెనక్కాల నుంచి ఉత్తరం చదివిన ప్రభావతి, “ఫరవాలేదు బాగానే వ్రాసారు. క్లుప్తంగా విషయం వివరించారు. మీరు ఉత్తరాలు వ్రాయగలరు” అని సర్టిఫికెట్ ఇచ్చింది.
“విషయ వివరణ బాగానే కుదిరిందేమో కానీ కళాత్మకంగా కనిపించటం లేదు. సరే మొదటి ప్రయత్నం కదా చూద్దాం” అన్నాడు ప్రద్యుమ్నుడు. ఉత్తర కళ అబ్బుతుందేమో నని సంతోష పడ్డాడు కూడాను.
ఉత్తరం కవరులో పెట్టి పోస్ట్ చేసేసాడు. పాపం ఆంజనేయ శాస్త్రి అనుకుంది ప్రభావతి. వారం రోజుల్లో తప్పితే పదిరోజుల్లో నైనా జవాబు వస్తుందని అనుకున్నాడు ప్రద్యుమ్నుడు.
నాలుగు రోజుల తరువాత పొద్దున్నే టెలిఫోన్ వచ్చింది.
టెలిఫోన్ ఎత్తి “ ప్రద్యుమ్నుడు ఇక్కడ” అన్నాడు మాములుగానే.
“నమస్కారం, నా పేరు విజయ దుర్గ, విజయవాడ నుంచి శ్రీ ఆంజనేయ శాస్త్రి గారు నిన్న రాత్రి నాకు టెలిఫోన్ చేశారు. మీరు సంకట పరిస్థితుల్లో ఉన్నారని, వెంటనే వెళ్లి కౌన్సిలింగ్ చెయ్యమని చెప్పారు. నేను ఇప్పుడు మీ కాలనీ లో మీ రోడ్డులోకే వచ్చేశాను. మీరు బయటకు వస్తే మీ ఇల్లు గుర్తుపడతాను.” అని అన్నారు.
ప్రద్యుమ్నుడు కొంచెం కంగారు పడ్డాడు. ఇదేమిటి ఈ పర్యవసానం ఊహించలేదే అనుకున్నాడు. కానీ గుమ్మం ముందుకు వచ్చింది ఆవిడ కాబట్టి తప్పదనుకొని వీధిలోకి వెళ్లాడు. తమ ఇంటి పక్కనే కారు ఆపి ఎవరో స్త్రీ నుంచుని ఉన్నారు. ప్రద్యుమ్నుడిని చూసి ముందుకు వచ్చి విజయ దుర్గ అంటూ చెయ్యి జాపింది.
“ప్రద్యుమ్నుడు” అంటూ చెయ్యి కలిపాడు. చెయ్యి వదిలి ఆవిడను పరీక్షగా చూశాడు. సుమారు ఐదు అడుగుల ఆరు అంగుళాల కన్నా పొడుగు ఉంటుందేమో నని అంచనా వేసాడు. పొడుగుకు తగ్గ లావు అని కూడా అనుకున్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాలేమో అని కూడా అనుమానపడ్డాడు.
“వెల్కం, వెల్కం, రండి, రండి” అంటూ ఇంట్లోకి ఆహ్వానించాడు.
సుఖాసీన అయిన తరువాత దుర్గ గారు చెప్పారు,
“నేను శాస్త్రి గారు కలిసి వైజాగ్ లో లా చదివాం. ఆయన 96లో పూర్తిచేశారు. నాకు అప్పుడే పెళ్లి గట్రా అయ్యాయి అందుచేత నేను 98 లోనే పూర్తి చెయ్యగలిగాను.”
“గట్రా అంటే ఏమిటండీ? “ అని అడగబోయాడు ప్రద్యుమ్నుడు కానీ ఆగిపోయాడు. దుర్గ గారు కొనసాగించారు,
“నేను ఇక్కడ ఓ కంపనీకి లీగల్ అడ్వైజర్ గా ఉన్నాను. కోర్టులో ప్రాక్టీసు కూడా చేస్తున్నాను. శాస్త్రి గారు అక్కడ కోర్టులో ప్రాక్టీసు చేస్తున్నారు. చాలా ఘట్టి వారండి. కేసు తీసుకుంటే సుప్రీం కోర్టు దాక తీసుకెళ్ళి కానీ వదలరండి. హై కోర్టు పని మీద ఇక్కడకు తరుచుగా వస్తూనే ఉంటారు. ఆయనే నన్ను ఈ సమాజ సేవకి ప్రోత్సహించారండి. మీరు వారికి బాగా తెలుసునట కదండీ. మిమ్మల్ని, మీ సమస్యని జాగ్రత్తగా స్టడీ చెయ్యమన్నారండి. తగు సూచనలు చేసి మీలో ధైర్యం నింపమన్నారండి. వారు ఇంకో పది రోజుల్లో వస్తారండి. అప్పుడు మేము కలసి చర్చించి నిర్ణయిస్తామండి.” ఊపిరి తీసుకోడానికి ఆగింది ఆవిడ.
ప్రభావతి ఒక గ్లాసుడు మంచినీళ్ళు తీసుకు వచ్చింది. ఆవిడ రెండు గుక్కలు తాగి తిరిగి మొదలు పెట్టింది,
“శాస్త్రి గారు, మీరు ఆయనకు వ్రాసిన ఉత్తరం నాకు ఫాక్స్ (fax) చేసారండి. ముందుగా మీకు మా టెర్మ్స్ అండ్ కండిషన్స్ తెలియజేయాల్సిన బాధ్యత ఉంది నాకు. మాకు ఏదైనా అభ్యర్ధన వస్తే మేము ముందుగా వారి ఇంటికి వెళతాము. వారితోనూ, వారి ఇంట్లో వారితోనూ మాట్లాడి వస్తాము. అవసరమైతే ఇంకో విజిట్ కూడా చేయాల్సివస్తుంది. ఈ విజిట్ ఒక్కటికి Rs3000/ పుచ్చుకుంటాం. ఆ తరువాత విజిట్ కి Rs2000/ తీసుకుంటాము. మీరు మా ఆఫీసుకి వస్తే Rs.1500/ తీసుకుంటాము. మొదటి సమావేశం వారి వారి ఇంట్లోనే జరుగుతుంది ఎందుకంటే ఈ సమస్యలో ఇంట్లోని వారి పాత్ర ఏమైనా ఉందేమో తెలుసుకోవడానికి.”
ప్రద్యుమ్నుడు వెంటనే అడ్డుపడ్డాడు.
“సమాజ సేవ ఉచితంగానే చేస్తారనుకున్నాను. చచ్చే ఆలోచనకే ఇంత ఖర్చు పెట్టాల్సి ఉంటుందని తెలియదు”
“ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని, పేదవారికి ఉచితంగానే చేస్తామండి” వివరించింది విజయ దుర్గ.
“అబ్బే ఆత్మహత్య ఆలోచన విరమించుకున్నానండి. మీ అవసరం ఇప్పుడు లేదు” చెప్పాడు ప్రద్యుమ్నుడు.
“ ముందు ముందు మళ్ళీ ఎప్పుడైనా కలగ వచ్చు కదండీ. ఆ ఆలోచన కూడా రాకుండా సలహా ఇస్తామండి” దొరికిన కేసు వదల దలుచుకోలేదు విజయ దుర్గ.
“అబ్బే అవసరం లేదు. ఆ ఆలోచన ఇక మీదట రాదండి. హామీ ఇస్తాను” విన్నవించుకున్నాడు ప్రద్యుమ్నుడు.
“మీ అభ్యర్ధన మేరకే ఇప్పుడు వచ్చాను నేను. ఈ విజిట్ కి ఫీజు చెల్లించాలి మీరు” చివరి అస్త్రం ప్రయోగించింది విజయ దుర్గ.
ప్రద్యుమ్నుడు ఏదో అనే లోపునే ప్రభావతి కలగ జేసుకుంది,
“దుర్గమ్మ గారూ, శాస్త్రి గారికి వ్రాసిన ఉత్తరానికి పరిహారంగా ఆ మూడు వేలు ఇచ్చేస్తాం. మీరు వెళ్ళండి”
డబ్బు తీసుకొని వెళుతూ ప్రభావతికి ఒక సలహా ఇచ్చింది దుర్గమ్మ,
“మీకు ఎప్పుడైనా విడాకులు తీసుకోవాలనిపిస్తే , నన్ను పిలవండి. ఇది నా కార్డు. “
దుర్గమ్మ వెళ్ళిన వెంటనే దేముడి ముందు నిలుచుని ప్రమాణం చేసాడు ప్రద్యుమ్నుడు,
“ఇక ముందు అత్యవసర మైతే తప్ప ఎవరికీ ఉత్తరం వ్రాయను” అని.