రామాయణంలో పిడకల వేట – 2

రామాయణంలో పిడకల వేట మొదటి భాగం

ఇక్కడ 

చదవండి  


“నీ కొడుకు నిన్ను గుర్తు పట్టాడా?”  మళ్ళీ అడిగాడు ప్రద్యుమ్నుడు.

“లేదు. ఎక్కడో చూశానని అనిపించిందేమో కానీ గుర్తు పట్టినట్టు లేదు.”

“అంటే ఇది ఒక వైపు పూర్వ జన్మ స్మృతి,  అంతేనా?”

“ప్రస్థుతానికి అలాగే అనిపిస్తోంది. ప్రయత్నించాలి వాడికి పూర్వ జన్మ స్మృతి కలిగేటట్టు”

“మీ పూర్వ జన్మ కధ చెబితే వాడికి గుర్తు వస్తుందేమో. నీ కాలజ్ఞానంతో తెలుసుకున్న పూర్వ జన్మ కధలు చెప్పి చూడు. మొదటి జన్మ అనుబంధం తో మొదలు పెట్టు”  సరదాగానే అన్నాడు ప్రద్యుమ్నుడు.

“మొట్ట మొదటి తల్లీ కొడుకుల అనుబంధం రామాయణ కాలం లో కలిగింది.” సీరియస్ గానే చెప్పింది ప్రభావతి.

“రామాయణ కాలంలోనా” మహదాశ్చర్యాన్ని ప్రకటించాడు ప్రద్యుమ్నుడు.

“అవును, అప్పుడు నేను, నా పతి శ్రీ శ్రీ శ్రీ  శంఖుతీర్ధులు వారు, మా అబ్బాయి  పంచవటిలో ఉండేవారం”

“పంచవటిలోనా” సంభ్రమాశ్చర్య చకితుడయ్యాడు మళ్ళీ ప్రద్యుమ్నుడు.

“అప్పటి మా వారు శ్రీ శ్రీ శ్రీ శంఖు తీర్ధులు వారు చిన్న ముని.”

“మూడు శ్రీ ల శంఖు తీర్ధుల వారు చిన్న మునా?” ప్రద్యుమ్నుడు సందేహ సందోహుడయ్యాడు.

“అవును, త్రికరణ శుద్ధిగా గౌరవిస్తున్నానని తెలియడం  కోసం మూడు శ్రీలు పెట్టేదాన్ని”

“నా కెప్పుడూ ఒక్క శ్రీ కూడా పెట్టలేదు,  పైగా పద్దూ గాడు అనికూడా అంటావు” విచారం వ్యక్తం చేశాడు ప్రద్యుమ్నుడు.

“త్రేతాయుగ పతివ్రతా ధర్మం అటువంటిది.” తేల్చేసింది ప్రభావతి.

“చిన్న ముని అన్నావు. పొట్టిగా ఉండేవాడా” సంశయం వెలిబుచ్చాడు. దీర్ఘంగా నిట్టూర్చింది ప్రభావతి.

“మీకు చాలా చెప్పాలి.  రౌతు చెప్పినట్టు గుర్రం నడుస్తుంది. లెఫ్ట్ టర్న్ అంటే లెఫ్టుకి టరనుతుంది  పీఛేముడ్ అంటే పీఛే మూడుతుంది.  మనస్సును కోరికలు అలా నియంత్రిస్తాయి. కోరికలని చంపుకుంటే సన్యాసి అవుతాడు. సన్నాసి  యోగి అవుతాడు. యోగి తపస్సు చేస్తే తాపసి అవుతాడు. ఎక్కువుగా తపిస్తే   ముని అవుతాడు. ముని ఘోరంగా తపస్యిస్తే  ఋషి అవుతాడు.  ఇంకా ఘోరంగా, క్రూరంగా తపస్సు చేస్తే మహర్షి  అవుతాడు. మహర్షి బ్రహ్మ జ్ఞానం సంపాదిస్తే బ్రహ్మర్షి అవుతాడు. మహర్షులు కొద్దిమందే ఉంటారు. బ్రహ్మర్షులు చాలా చాలా కొద్ది మందే ఉంటారు.”

“ఋషులు  మహర్షులు మధ్య తేడా తెలుసు కోవటం ఎలా?” చర్చలోకి వచ్చాడు ప్రద్యుమ్నుడు.  

“ఋషులు  తపస్సు చేస్తుంటే అప్సరసలు వచ్చి నృత్యం చేస్తే   వారు మహర్షులు అయినట్టు లెఖ్ఖ” ఓపికగా సమాధానమిచ్చింది ప్రభావతి. “అయినా ఇప్పుడు ఆ చర్చ ఎందుకు శ్రీ శ్రీ శ్రీ శంఖు తీర్ధుల వారి గురించి కదా మీరు అడిగింది.”

“అవునవును. వారి గురించే చెప్పు.” బుద్ధిగా బాసిం పట్టు వేసుకొని కూర్చున్నాడు ప్రద్యుమ్నుడు.

“అప్పుడు మా ఆశ్రమం పంచవటిలో ఉండేది. మా వారు తపస్సు చేసుకునేవారు. నేను పతివ్రతా ధర్మం నిర్వర్తించేదానిని. మా అబ్బాయి వీలైతే వ్యవసాయం చేసి, లేనిచో ఆకులు, అలములు, పండ్లు అడవిలోంచి తెచ్చేవాడు. అప్పుడప్పుడు జనపధములలోకి వెళ్ళి భిక్ష తెచ్చేవాడు. అలా  కాలం జరుగుతుండగా ఒక రోజు మా ఆశ్రమానికి కొద్ది   దూరంలో ఆ దశరధాత్మజుడు, జానకి మనో వల్లభుడు, కోదండ రాముడు, కౌసల్యా తనయుడు, లక్ష్మణాగ్రజుడు, శ్రీరామ చంద్రుడు పర్ణ కుటీరం కట్టుకున్నారు. సీతా లక్ష్మణులు, వన్య దేవతలు  సేవిస్తూ ఉండగా కొలువు తీరారు.”

“ఏమిటి? శ్రీరాముడే?” ఆశ్చర్యాంభుధిలో మునిగిపోయాడు ప్రద్యుమ్నుడు.

“అవును, ఆ ముని జన వందుడే, రావణాంతకుడే, సుగ్రీవ మిత్రుడే, ఇన కుల సూర్యుడే, మర్యాదా పురుషోత్తముడే” కొంచెం ఆయాసం తీర్చుకోటానికి ఆగింది ప్రభావతి.

“మీ ఇంటికి కొద్ది దూరంలోనా? అయినా రాముడిని అన్ని పేర్లతో పిలవాలా?” ద్విగుణీకృత ఆశ్చర్యంతో ప్రశ్నించాడు ప్రద్యుమ్నుడు.

“అవును. రామ సంకీర్తనం మోక్ష దాయకం. ఆయన  కుటీరం కట్టుకునే ముందు మా వారి అనుమతికోసం లక్ష్మణుడిని పంపారు తెలుసా? అందుకనే వారిని మర్యాదా పురుషోత్తముడు అంటారు.”

“మీ వారి అనుమతి తీసుకున్నందుకు మర్యాదా పురుషోత్తముడు అయ్యాడా ఆయన?” ప్రద్యుమ్నుడి ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది.

ప్రభావతి పట్టించుకోలేదు. కధ కొనసాగించింది.

“శ్రీరామ చంద్ర మహా ప్రభువు దర్శనం చేసుకోవాలని అనుకున్నాం మేము. నేను కేజీడు నేరేడు పళ్ళు భక్తితో కొరికి అట్టే పెట్టుకున్నాను”

“నేరేడు పళ్ళా?”  ఈ మాటు  అంతానికే   అంతం లేని ఆశ్చర్యంతో  పృచ్చించాడు ప్రద్యుమ్నుడు.

“రేగిపళ్ళకే భక్త శబరి అయితే నేరేడు పళ్ళకి మహాభక్త శాలిని అనిపించుకుందామని”

“నీ పేరు శాలిని యా”  అడిగాడు. హాస్యానికి అంటోందో లేక సీరియస్సుగానే అంటోందో తెలియలేదు ప్రద్యుమ్నుడికి. 

“అవును, నేను శాలిని నామధేయురాలిని, మా పుత్రశ్రీ పేరు మరుద్వంతుడు” సీరియస్సుగానే కొనసాగించింది ప్రభావతి. “ఒక రోజు మా కుమార మణి అడవిలో దుంపలు తవ్వుతుండగా అటువైపు వచ్చిన శ్రీరామప్రభువు కనిపించారుట. నడుస్తున్న శ్రీరాముడి కాలిలో ముల్లు గుచ్చుకుందిట. మా అబ్బాయి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆయన కాలిలో ముల్లు తీసేసాడట. ముల్లు తీసి మా వాడు ఆయన పాదాలు ఒత్తేడట. శ్రీరామ చంద్రుల వారు ఆశీర్వదించి,   ధన్యవాదాలు తెలిపి వెళ్ళి పోయారుట. మా వాడు ఆ పరవశంతో ఆ చేతులు అలానే పట్టుకొని ఇంటికి వచ్చాడు. మా వారు తపస్సుకి వెళ్లారు. ఇంట్లో నేనే ఉన్నాను. మా అబ్బాయి, “జననీ ఇవి పురుషోత్తముడు శ్రీరాముని పాదాలు ఒత్తిన చేతులు” అంటూ ఆ చేతులతో నా పాదాలు స్పృశించాడు. 
 నా శరీరంలో పరవశం ప్రవాహమై ప్రవహించింది. మనస్సు ఉద్విగ్న భరితమైంది. శరీరం   తేలికై , ఇంకా  తేలికై , మరింత తేలికై, ఆ ఆనంద భరిత క్షణాలను తట్టుకోలేక,   తనువు చాలించింది.” ఉపిరి తీసుకోడానికి ప్రభావతి, వాక్ప్రవాహం  ఆపింది. 

ఆశ్చర్యం పడడానికి అధోలోకాలలో కూడా లోతు లేక, మెదడు మొద్దుబారి  పాపం ప్రద్యుమ్నుడే నోట మాట రాక తనే కింద పడిపోయాడు కుర్చీలోంచి.

ఆ విధంగా మా మొదటి  అనుబంధం తెగిపోయింది” ప్రభావతి వ్రాక్కుచ్చింది.  


“ఆ తరువాత అనుబంధం ఎప్పటిదో?”  ప్రశ్నించాడు ప్రద్యుమ్నుడు.

“కాలజ్ఞానంలో తరువాత గుర్తుకు వచ్చింది కుశలవుల తరువాత ౧౨ వ తరంలో కోసలధేశం లో జన్మ.”  

“ధేశం ఏమిటి? దేశం అనాలి కదా?”  

“అప్పటి జనం నిష్ఠాగరిష్టులు, ఉద్యద్దినకరులు,  ధైర్య శౌర్య పరాక్రములు, తాళ ప్రమాణులు,  మాట మీద నిలబడే వాళ్ళు అవటం వల్ల ప్రతిదీ నొక్కి వక్కాణించే వారు.”  అని సంజాయషి ఇచ్చింది ప్రభావతి.

అర్ధం కాకపోయినా తలాడించాడు ఎప్పటి లాగానే ప్రద్యుమ్నుడు.  

“కుశలవులు అన్నావేమిటి? లవకుశ అంటారు కదా? ఆ పేరుతోనే సినిమా కూడా వచ్చింది కదా”    అజ్ఞానం మళ్ళీ వెళ్ళకక్కాడు ప్రద్యుమ్నుడు.

“పతిదేవా ప్రద్యుమ్నా,  కుశుడు పెద్దవాడు లవుడు చిన్నవాడు. నాగయ్య, నాగేశ్వరరావు కూడా కుశలవులు అనే నామకరణం చేసారు, ఇద్దరికీనీ.”

“మళ్ళీ మధ్యలో వాళ్లెవరు రామాయణం లో.”

“అదీ తెలియదా పతీ పరమేశ్వరా, లవకుశ, రామరాజ్యం సినిమాల్లో వాల్మీకులు.”

“మరి లవకుశ అని ఎందుకు అంటారు?”                

“ఆంగ్లేయులు కుశలవుల కధ విన్నారు. అందులో ఒకడికి కుశుడు, అతని పరాక్రమం   బాగా నచ్చింది. ఐ లవ్ కుశ అన్నాడు. అప్పటినుంచి లవకుశ అని అనడం మొదలు పెట్టారు.”

“ఇద్దరూ సమాన పరాక్రమం కలవారే కదా?” ప్రద్యుమ్నుడి సందేహం తీరటంలేదు.  

“లవుడిని శత్రుఘ్నుడు ఓడించాడు. కుశుడు అంజలీ దేవీ దగ్గర శపధం చేశాడు “... అనుజన్మునిన్  విడిపించి  తెచ్చెద...”  అని  గుర్తు లేదా?”

“ఉంది,  ఉంది  అంజలీ దేవీ కూడా “... పతి పదాంబుజ  తత్పరత తప్ప అన్యమెరుగని  ఇల్లాలి నగుదునేని....”  నీకు జయం కలుగుతుంది అని ఆశీర్వదిస్తుంది కదా?”

“శత్రుఘ్నుడిని ఓడించి  లవుడిని విడిపించి తెచ్చాడు కదా కుశుడు. అందుకనే ఐ లవ్ కుశ అన్నాడు ఆంగ్లేయుడు.”  

“ఐ సీ” అన్నాడు  ఇంకేమనాలో తెలియక. 

“ఇంతకీ వారికి ౧౨ తరాల తరువాత నువ్వు ఎవరు?”  అడిగాడు ప్రద్యుమ్నుడు. 

“అప్పుడు నేనొక సామాన్య వర్తకుడి ఇంట పుట్టాను. మరొక సామాన్య వర్తకుడి పుత్రుడిని పెళ్లి చేసుకుని సామాన్య జీవనం గడిపాను. బహు సంతానం కలిగారు. అందులో పెద్దవాడు నారాయణ శ్రేష్ఠి,  ఈ పూర్వ జన్మ వాసన వాడు. వాడు పెరిగి పెద్దై తండ్రి వ్యాపారం కొంత  అభివృద్ధి చేశాడు. కానీ సామాన్య వ్యాపారిగానే ఉన్నాడు.  తల్లి తండ్రులన్నచో వాడికి బహు ప్రేమ, అభిమానం, ఆదరణ,  మీదుమిక్కిలి  గౌరవము ఉండేవి. సోదరీ సోదరులను కూడా అప్యాయంగా చూసేవాడు. వాడికీ పిల్లలు పుట్టారు. ఆ జన్మలో నేను పోయేటప్పటికి వాడు సామాన్య వ్యాపారిగానే ఉండిపోయాడు.”

“అదేమిటి పాపం,  సామాన్య జీవితమే గడిపావా ఆ జన్మలో.”

“అవును సామాన్య జీవితం గడపడానికి మేమేమి సిగ్గుపడలేదు. ఆనందంగానే జీవితం వెళ్ళదీశాము. ఈ జన్మలో మట్టుకు ఏముంది? సామాన్య జీవితమే గదా. స్విట్జర్లాండ్ తీసుకెళ్లారా?   అమెరికా చూపించారా?  కాశ్మీరు కాకపోయే  కనీసం ఊటీ తీసుకెళ్లారా? పుట్టాను,  పెరిగాను,  మిమ్మల్ని పెళ్ళాడాను.  ఏముంది? సాధారణ జీవితం కాక. ఎన్ని నోములు నోస్తే ఏమిటి? ఎన్ని పూజలు చేస్తే ఏమిటి? మొగుడి జాతకం అలా ఉంటే పెళ్ళాం బతుకింకెలా ఉంటుంది.”  

ఉరుమురిమి మంగలం మీద పడే సూచనలు కనిపించాయి ప్రద్యుమ్నుడికి.  మాట మార్చే వృధా ప్రయత్నం చేశాడు. ప్రభావతి కొనసాగించింది.

“అసలు మీ జాతకం సరియైనదే ఇచ్చారా మాకు పెళ్ళికి ముందు? ఆ జాతకం ప్రకారం అంగ రంగ వైభవంగా ఉండాలి నా జీవితం. ఇలా ఉందంటే మీరు తప్పుడు జాతకం ఇచ్చి ఉండాలి”  నిర్ధారణకి వచ్చేసింది ప్రభావతి.

ఏం చెప్పాలో తెలియలేదు ప్రద్యుమ్నుడికి. 


అదృష్టవశాత్తు తలుపు చప్పుడైంది. లేచి తలుపు తీశాడు. ఎవరో అపరిచిత వ్యక్తి ఒక పాకెట్టు పట్టుకుని నుంచున్నాడు.

“ప్రభావతి గారిల్లు ఇదేనా” అని అడిగాడు.

“అవును,  లోపలి రండి”  అని ఆహ్వానించాడు ప్రద్యుమ్నుడు.

“నేను వెంకటేశ్వరా సారీస్, కొత్తపేట నుండి వచ్చానండి”  అంటూనే ప్రభావతిని చూశాడు.

“అమ్మగారూ,  మీరు ఎంచుకున్న రెండు చీరలు. మా సేఠ్ ఇచ్చి రమ్మన్నాడు”  అని చీరల పాకెట్టు ఆవిడ చేతిలో పెట్టి,  బిల్లు ప్రద్యుమ్నుడి  చేతిలో పెట్టాడు.

బిల్లు చూశాడు. పద్దెనిమిది వందల అరవై.

ప్రద్యుమ్నుడి  గుండె రెండు లబ్ డబ్ లు మిస్ అయ్యింది. ఏమీ అనలేక, అంటే మళ్ళీ జాతకాలు, ఊటీ,  అమెరికా అంటుందేమో నని భయపడి బిల్లు చెల్లించేశాడు, ప్రద్యుమ్నుడు.

ప్రద్యుమ్నుడు  టిప్ ఇవ్వనందువల్ల నేమో తలుపు ధబేల్ మని వేసి వెళ్ళిపోయాడు వాడు.

“నలభై తక్కువ పంతొమ్మిది వందలకి ఇంత పూర్వజన్మ వృత్తాంతమా”  అని ఆక్రోశించాడు ప్రద్యుమ్నుడు.

“మీరే కాదు మేమూ కధలల్లగలం”  అని ముక్తాయించింది ప్రభావతి.                              

రామాయణంలో పిడకల వేట


కాలింగ్ బెల్ మోగింది. బద్ధకంగా ప్రద్యుమ్నుడు లేచి తలుపు తీశాడు. కూనిరాగం తీస్తూ ప్రభావతి ఇంట్లోకి వచ్చింది. ప్రద్యుమ్నుడు సంభ్రమాశ్చర్యాలకి గురి యయ్యాడు. ఉదయం పదిన్నరకి పక్క ఇంటి పడతులతో కలసి బజారుకి వెళ్ళిన ప్రభావతి సాయంకాలం ఐదు గంటలకి ఇంటికి కూనిరాగం తీస్తూ రావడం, అదీ  భుజాన ఒక సంచితో, సంచి నిండా కూరగాయలతో కూడా,  ఏదో వింతగానే కనిపించింది పాపం ప్రద్యుమ్నుడికి. వెళ్ళింది బస్సులో, దిల్సుఖ్నగర్ బట్టల షాపింగ్ కి, పక్కవాళ్ళకి సలహాదారుగా. ఆరుగంటలకి పైగా షాపింగ్ చేసి వస్తూ రైతు బజార్ నుంచి కూరగాయలు కూడా పట్టుకు రావడం మరింత ఆశ్చర్యం కలిగించింది. మొయ్యడానికి పక్కన మొగుడు లేకుండా కూరగాయలు కొని తీసుకు రావడం  బహుశా ప్రభావతి ఈ 44  ఏళ్లలో నాల్గైదు మాటుల కన్నా ఎక్కువ మాట్లు చెయ్యలేదు. అసలు షాపింగ్ అంటేనే ప్రభావతికి చిరాకు. పిల్లలకి  బట్టలు కొనడం  కూడా ఒక అరగంటలోనే ముగించేసేది. బిల్లు కట్టడానికి   ప్రద్యుమ్నుడికి ఒక్కోమాటు  అరగంట పట్టేది. ఆ టైంలో పక్కన ఉన్న హోటల్లో  కూర్చుని కాఫీ తాగేది,  అలసి పోయాను, తలనొప్పి అంటూ. అటువంటి మహాలక్ష్మి అన్ని గంటల తరువాత కూడా  ఇంత హుషారుగా ఉండడం మహా వింతగా తోచింది ప్రద్యుమ్నుడికి.

ప్రద్యుమ్నుడి సందేహం పెరిగి వటవృక్షం అవుతోంది కానీ అడిగి సందేహ నివృత్తి చేసుకోదలుచుకో లేదు ప్రద్యుమ్నుడు. ఎందుకంటే క్షణ క్షణముల్ జవరాండ్ర చిత్తముల్ అన్న సూత్రము  అనేక మార్లు అనుభవంలోకి వచ్చింది కాబట్టి, అదీ గాక ప్రభావతి ఏ విషయమూ కొన్ని నిముషాలకన్నా ఎక్కువ సేపు దాచుకోలేదు. ఎక్కడ ఏం జరిగినా మొగుడికి చెప్పి నాలుగు అక్షంతలు వేస్తే గానీ ఆవిడకు కడుపుబ్బరం తీరదు. ఎక్కడ ఏం జరిగినా ప్రద్యుమ్నుడికే ఎందుకు అక్షంతలు వేస్తుంది ప్రభావతి అంటే, సతీ వ్రతుడైన ప్రద్యుమ్నుడు జవాబు చెప్పలేడు, కానీ అది అతని దిన చర్యలో భాగమైపోయింది. 

రెండు వీధుల అవతల ఒక వనితా లలామ ఉంది. ఆవిడ ప్రదర్సన యాత్రలు చేస్తుంది కాలనీలో తరుచుగా. ముని శ్రేష్ఠుడైన ఆమె పతిదేవుడు  నెలకోసారి అయినా  ఆమె కోసం ఏదో ఒకటి కొనాల్సి వచ్చేది. కొనేది ఆవిడేనని,  అయినా కొన్న కీర్తి ఆయనకే దక్కిస్తోందని పురస్త్రీల అభిప్రాయం. చీరో రవికో, నగో నట్రో, రాయో రప్పో, తాడో పేడో ఏదైనా సరే కొన్న తరువాత ఆవిడ ప్రదర్సన యాత్ర చేసేది. కాలనీలో వీధులన్నీ తిరిగి కనిపించిన వారికి రోడ్డు మీద, కనిపించని వారి ఇంట్లో దూరి మరీ ప్రదర్శించేది. ప్రదర్శిస్తూ వ్యాఖ్యానం కూడా చేస్తుంది. ఆ చీర వాళ్ళాయన కంటిలో ఎలా పడ్డదో? ఆ చీరలో ఆవిడను ఉహించుకొని ఎంత తన్మయత్వం చెందాడో? షో కేసులో పెట్టిన చీర అమ్మనని కొట్టువాడు ఎలా భీష్మించాడో? వినియోగదారుల సంఘంలో ఫిర్యాదు చేస్తానని ఎలా ఈయన బెదిరించాడో? మొదలైనవన్నీ కళ్ళకు కట్టినట్టు వర్ణించేది. చివరగా “మా ఆయనకి బేరమాడడం ఇష్టం ఉండదండీ. వాడు ఎంత చెపితే అంతా ఇచ్చేసి వస్తారు” అంటూ ముగించేది.  ఇటువంటి యాత్ర తరువాత ప్రద్యుమ్నుడికి ఆనవాయితిగా అక్షంతలు పడేవి.

ప్రభావతి: “మీరు ఎప్పుడైనా ఓ నగో నట్రో కనీసం రోజూ వాడే చీర అయినా తెచ్చారా?”
ప్రద్యుమ్నుడు: ..............
“అసలు నాకు ఏ రంగు నప్పుతుందో మీకు తెలుసా?”
..................
“నాకు ఏ రంగులు  నచ్చుతాయో తెలుసునా?”
.........................
“నాకు ఏ రంగు చీరలు ఎక్కువ ఉన్నాయో తెలుసా?”
.....................
“అసలు మీకేం తెలుసు? ఏం గుర్తు ఉంటాయి?”
..................
“మన పెళ్లి ఏ వారం జరిగిందో గుర్తు ఉందా?”
“జూన్ 28న”
“తేది కాదు వారం.  ఆది వారమా,  సోమ వారమా, మరో  వారమా?”
...................
“నా ఖర్మ ఇంతే.  ఏం చేస్తాను? ముద్దు, ముచ్చట, మురిపాలు నా జాతకంలో లేవు అని ఎప్పుడో సరిపెట్టుకున్నాను.”
“మరి రోజూ ఈ అడ్డగోలు ప్రశ్నలు ఎందుకు?” అని మనసులోనే అనుకొని భారంగా నిట్టురుస్తాడు  ప్రద్యుమ్నుడు.

ఇంతేనా అనకండి. పాపం ప్రద్యుమ్నుడి దురదృష్టవశాత్తూ వీరి ఇంటి పక్క వీరాధివీరుడు, అతిరధ శ్రేష్టుడు అయిన నారాయణ మూర్తి ఉన్నాడు. ఆయన కుబేరుడు కాదు కానీ గొప్ప బేరుడు. బేరమాడడంలో ఈయనను మించిన వాడు ఈ భూ ప్రపంచంలో ఎక్కడా లేడు అని మా కాలనీలో ప్రఖ్యాతి చెందినవాడు. వీధిలో చింతకాయలు అమ్మేవాడైనా, బజారులో ప్రఖ్యాత నగల సంస్థ వాడైనా వీరి బేరాగ్నికి సమిధలే.  ఈయన బేర ప్రతాపానికి జడిసి వాళ్ళావిడ ఆయనతోటి ఎప్పుడూ మార్కెట్ కి వెళ్ళదు. ఈయన బేర పాటవానికి బెదిరి అమ్మేవాళ్ళు ఒక రూపాయి తగ్గిస్తారో? లేక ఈయన  అబద్ధం చెబుతాడో తెలియదు కానీ రైతు బజారులో కానీ కాలనీ సంతలలో కానీ ప్రద్యుమ్నుడు తెచ్చిన కూరగాయల  రేట్లకన్నా ఆయన కొనే రేట్లు తక్కువుగా ఉంటాయి. బేరప్రావీణ్యము ఈయన కూడా ప్రదర్శిస్తాడు. ఈయన ప్రదర్శన సాధారణంగా తెల్లవారు జామున నాలుగున్నర గంటలకి ఉంటుంది, మంచి నీళ్ళు పట్టుకునే సమయంలో. ప్రభావతి,  పక్కింటి  పంకజాక్షి, నారాయణమూర్తి భార్య లీలావతి  కుళాయి దగ్గర నీళ్ళు బిందెల్లో  నింపుతుంటే  పాపం మగవాళ్ళు అవి ఇంటిలోకి జేరవేస్తారు. 

నీళ్ళు మోస్తూ నారాయణ మూర్తి “నిన్న సాయినాధ కాలనీ సంతలో బెండకాయలు కొన్నాను. మహా లేతగా ఉన్నాయి. ముట్టుకుంటే చాలు చిటుక్కున విరుగుతున్నాయి. పచ్చి కాయలే నాలుగు తినేశాను. అరకేజి పదిహేను” అని జనాంతికంగా అంటాడు. పక్కింటి పంకజాక్షి వెంటనే అందుకుంటుంది. “మా ఆయనా తెచ్చాడు బెండకాయలు. కత్తికి కూడా లొంగటం లేదు. పైగా పావుకేజీ తొమ్మిదిట.” పంకజాక్షి మొగుడు ఇంట్లోకి వెళ్లినవాడు ఇంకో ఐదు నిముషాలకి గానీ బయటకు రాడు.

ప్రభావతి బయట నలుగురిలో ప్రకాశంగా ఏమి అనదు. నీళ్ళ కార్యక్రమం అయిన తరువాత ఇంటిలో కూర్చుని కాఫీ తాగుతుంటే మొదలు పెడుతుంది.
“అసలు బెండకాయలు ఎల్లా ఏరాలో మీకు తెలుసునా?”
....................
“పోనీ వంకాయలు, మొన్న మీరు తెచ్చిన వంకాయలు బయట పాడేశాను. పుచ్చులు, ముదురు కాయలూనూ.”
...................
“అసలు మీ అమ్మా, నాన్నా మీకేమి నేర్పలేదా? నాకు వంట వచ్చునో రాదో అని పెళ్లి చూపుల్లో నన్నడిగారు మీ వాళ్ళు. మా నాన్న అడిగి ఉండాల్సింది  మీ  వాళ్ళని మీ అబ్బాయికి  కూరలేనా కొనడం వచ్చా? అని.”
................
“కాయని  బట్టి రుచి ఉంటుంది. అబ్బే ఈ వేళ కూర కుదరలేదోయ్ ప్రభా అనడమే తప్ప ఆయన లాగా లేత కాయలు ఎప్పుడైనా తెచ్చారా అంత చవకగా?”
................
“అయినా,  ఏరినా, బేరమాడినా పరువు పోతుందని మీ అభిప్రాయమా? లేక చేతకాకా?”
...............
“ఇప్పుడనుకొని లాభం ఏమిటి? పెళ్ళికి ముందు  కుర్రాడు బుద్ధిమంతుడా కాదా అని కనుక్కున్నారు కానీ పనిమంతుడా కాదా అని వాకబు చెయ్యలేదు మా నాన్న. లోక జ్ఞానం ఉందో లేదో పరీక్ష చేయలేదు.  నా ఖర్మ ఇలా కాలిపోయింది”   అని ముక్కు చీదుకుంటుంది ప్రభావతి.
ప్రద్యుమ్నుడు ఎప్పటిలాగానే మౌన యోగా అభ్యాసం చేస్తూ ఉంటాడు.

ఈ విధంగా చేసిన పనికి, చేయని పనికి కూడా అక్షంతలు వేయడం ప్రభావతికి, వేయించుకోవడం ప్రద్యుమ్నుడికి అలవాటు. అందువల్లే అనవసర విషయాలు మాట్లాడి అక్షంతలు వేయించుకోవడం ప్రద్యుమ్నుడికి ఇష్టం ఉండదు. అందుకే  ఈ వేళ  ప్రభావతి హుషారుగా ఉండడానికి కారణాలు తెలుసుకోవాలని ఉన్నా అడగ లేదు ప్రద్యుమ్నుడు.

కొంతసేపు తరువాత  తనో కప్పు కాఫీ తెచ్చుకొని, మొగుడికి కూడా ఓ కప్పిచ్చి ఎదురుగా కూర్చుని మొదలు పెట్టింది.
“ఈ వేళ ఏమైందో తెలుసునా?”
...............
“బట్టల కొట్టులో అడుగు పెట్టానో లేదో,  ఏదో అపురూపమైన పరిమళం సోకింది. ఎక్కడినుంచా అని కలియ చూశాను. కేష్ కౌంటరు దగ్గర నుంచి వస్తోందని కనిపెట్టాను. అటువైపు అడుగులు వేశాను. అక్కడ కౌంటర్ వెనక్కాల ఒక 21 ఏళ్ల కుర్రాడు కూర్చున్నాడు. అదే క్షణంలో ఆ కుర్రాడు తల ఎత్తి నాకేసి చూశాడు. ఆ క్షణంలో నా హృదయంలో  వేయి వాత్సల్య వీణలు కల్యాణి రాగాలాపాన చేశాయి. ఆ క్షణంలోనే ఆ కుర్రాడి మొహంలో ఉద్వేగం, ప్రేమ, అభిమానం, ఆప్యాయత కొట్టొచ్చినట్టు కనిపించాయి. అతని మనస్సులో కూడా వేయి సితారాలు భక్తి, గౌరవ  రాగాలాలపించి నట్టనిపించింది. వాసన అతని దగ్గరనుంచే నని అర్ధం అయింది.”
“అది  ఏ పెర్ఫ్యూం  వాసనో  తెలిసిందా”  తెగించి అడిగేశాడు ప్రద్యుమ్నుడు.
“పూర్వజన్మ వాసన”  అంది ఉత్సాహంగా ప్రభావతి.         
ప్రద్యుమ్నుడు అవాక్కయాడు. ఎండలో తిరిగి వస్తే వడదెబ్బతో బాటు  సంధి ప్రేలాపన కూడా ఉంటుందా అనే అనుమానం వచ్చింది. వడ దెబ్బ తగిలిన సూచనలు ఏమి కనిపించడం లేదు. అయినా వచ్చి గంట అయింది.  మరి ఈ అసంబద్ధ ప్రేలాపన ఏమిటి? అని ఒకింత భయం వేసింది. డాక్టర్ని పిలుద్దామా అనుకుంటుండగా ప్రభావతి వార్తా ప్రసారణ కొనసాగించబోయింది.
మళ్ళీ  ఇంకో మాటు తెగించి అడిగాడు ప్రద్యుమ్నుడు,
“పూర్వ జన్మ వాసన అంత ఘాటుగా తగిలిందా ఇద్దరికీ?”
“ఏం అంత వెటకారంగా ఉందా? మగ ధీర నమ్ముతారు, మూగమనసులు ఒప్పుకుంటారు, అదేమిటి ఆ సినిమా పాత సిన్మా, ఆ గుర్తొచ్చింది,   మధుమతి పాటలు పాడుకుంటారు, నేనూ మొత్తుకున్నా వినకుండా. విశ్వనాధగారి పూర్వజన్మ భక్తిగా చదువుకుంటారు. నా పూర్వ జన్మ వృత్తాంతం మీరు నమ్మరా,  పైగా జోకులా?’’  అని కోప్పడింది.
“లేదు, లేదు, చెప్పు, చెప్పు”
“పూర్వ జన్మలో వాడు నా కొడుకు”
“కొడుకా? ఓ,  అందుకా వాత్సల్య వీణలు, భక్తి సితారాలు మోగాయి”
“మళ్ళీ   వెటకారమా?”
“లేదు, ఇంతకీ ఏ జన్మలో”
“జన్మ జన్మల బంధం. ఇరవై ఆరున్నర  జన్మల  బంధం”
“అర జన్మా????”
“అవును, ఒక జన్మలో నాలుగున్నర నెలలకి అబార్షన్ అయింది”
“అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు?” 
“వీణలు మోగిన క్షణంలో కాలజ్ఞానం వచ్చింది.”
“నేనెవరో తెలిసిందా ఆ జ్ఞానంలో?”  అజ్ఞానంతో కూడిన ఉత్సుకతతో ప్రశ్నించాడు ప్రద్యుమ్నుడు.
“ఆరు జన్మల్లో తెలుసు. మీరు విలను. రెండు జన్మల్లో నన్ను రాక్షసంగా ఎత్తుకు పోయి వివాహం చేసుకున్నారు.”
“మిగతా మూడు   జన్మల్లో?” తెలివి తక్కువుగా మళ్ళీ అడిగాడు ప్రద్యుమ్నుడు.
“నా పతి మహరాజ్ మిమ్మల్ని చావగొట్టి నన్ను పెళ్లి చేసుకున్నాడు”
“మహారాజా?”
“అవును అప్పుడు నేను ఉత్తర భారత దేశంలో పుట్టాను. అక్కడ పతి మహారాజ్ అంటారు. ఇక్కడలా  పతి దేవుడు అనరు”   
“కనీసం ఈ జన్మలోనైనా నన్ను హీరోని చేశావు నీ జన్మజన్మల కధల్లో. థాంక్స్.” ఇంకో మాటు తన తెలివి తక్కువ తనం నిరూపించుకున్నాడు ప్రద్యుమ్నుడు.
“మీ మొహం. ఈ జన్మలో ANR ని చేసుకోవాల్సింది. విలన్ పాల బడ్డాను.” నిర్మోహ మాటంగా జవాబు ఇచ్చింది ప్రభావతి.
“ఇంతకీ నీ కొడుకు నిన్ను గుర్తు పట్టాడా? ఈ జన్మలో ?” మాట మార్చాడు ప్రద్యుమ్నుడు. 

(ఇంకా ఉంది.)