ఒకచేతిలో సూటు కేసు, భుజానికి ఒక బాగు  తగిలించుకొని,  ఇంకో  చేతిలో తెలుగు పత్రికల తోటి హౌరా లో మద్రాస్ మెయిల్ ఎక్కాను.  బెర్తు వెతుక్కొని  సీటులో కూర్చున్నాను. ఎదురుగుండా ఒక తెలుగు కుటుంబం,  పక్కన తమిళ తంబులు ఇద్దరు. తెలుగాయన, భార్య , ఒక అమ్మాయి 10-11 ఏళ్ళు ఉంటాయి. ఆయనకి సుమారు 45 ఏళ్ళు  ఉంటాయి. పక్క బెర్తు లో కూడా ఇద్దరు తెలుగు వాళ్ళు,  భార్యా,   భర్త అనుకుంటాను. చాలా సీరియస్సు గా ఇంటి విషయాలు మాట్లాడుకుంటున్నారు.   ఒక పదినిముషాలు  గడిచాయి. రైలు బయల్దేరింది. ఎదురబెర్తు ఆయన మొదలుపెట్టాడు   
     
నాయనా నీ పేరు ఏమిటి
జంబులింగం అంటారండి
ఆయన ఒకింత ఆశ్చర్య పడ్డాడు. 
అదేమిటి చార్ట్ లో ప్రద్యుమ్నుడు   అని ఉంది.  
ఆయన దగ్గర టికెట్ కొనుక్కున్నానండి.  200 ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది. 
200 అని మళ్ళీ ఆశ్చర్య పడ్డాడు ఆయన. నేనో చిరునవ్వు నవ్వాను. 
తప్పదు కదండీ ఆర్జంటు గా వచ్చి  వెళ్లాల్సిన అవసరం పడింది. 
మళ్ళీ ఇంకో 5 నిముషాలు నిశ్శబ్దం మా మధ్య. తమిళ తంబిలు లొడ లొడ మని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మన కధ కి అప్రస్తుతం కాబట్టి వదిలేద్దాం వాళ్ళని. 
200 ట భార్యకి చెప్పి మళ్ళీ ఆశ్చర్య పడ్డాడు ఆయన. ఆవిడ  ఏమి మాట్లాడలేదు. 
పెళ్లయిందా బాబూ ఈ మాటు ఆవిడ అడిగింది. 
అయిందండి. ఇద్దరు పిల్లలు కూడా. 
చిన్న పిల్లలు అనుకుంటాను. అంది ఆవిడ 
చిన్న అంటే అమ్మాయికి 15 ఏళ్ళు అబ్బాయికి 12 ఏళ్ళు
15 ఏళ్ళా ఈ మాటు ఇద్దరు కలిసి ఆశ్చర్య పడ్డారు. 
నీ వయసు ఎంత బాబూ ఆయన అడిగాడు. 
32 అండి జుట్టుకు రంగు వేస్తాను కాబట్టి చిన్నగా కనిపిస్తానండి
జుట్టుకు రంగు వేస్తావా?    డబుల్   ఆశ్చర్యపడ్డాడు  ఆయన
16 వ  ఏట పెళ్లి అయితే  25 ఏళ్ళకి జుట్టు తెల్లబడిపోతుంది కదండీ  అని నవ్వాను.
16 వ ఏట పెళ్ళా ? మీ ఆవిడ వయసు ఎంత బాబు,   ఈ మాటు  ఆవిడ ఆశ్చర్య పడి అడిగింది  
34 అండి నా  కన్నా రెండేళ్ళు పెద్ద. 
ఈ మాటు ఇద్దరూ  తేరుకోవటానికి  ఒక పదినిముషాలు పట్టింది. 
అబ్బాయి జోక్ చేస్తున్నాడు అంది ఆవిడ నీరసం గా నవ్వటానికి ప్రయత్నిస్తూ.  
జోక్ చెయ్యాల్సిన అవసరం నాకేమిటి, మీరెవరో  నేనెవరో,  మీ తోటి జోక్ ఎందుకు చేస్తాను,  చాలా సీరియస్ గా అన్నాను. 
అంటే రెండేళ్ళు పెద్ద అంటున్నావు, 15 ఏళ్ల కూతురు అంటున్నావు,   కొద్దిగా ఆశ్చర్యం గా ఉంది బాబూ అంతే,  నమ్మక పోవడం కాదు,    అని నొచ్చుకున్నట్టుగా అంది ఆవిడ. 
మాది ప్రేమ వివాహం అండి. 
16 ఏళ్ళకి ప్రేమ వివాహమా ? ఏం చదువుకున్నావు బాబూ నువ్వు,  ఆయన అడిగాడు.    
నేను పెద్దగా చదువుకోలేదండి.  4th. ఫామ్ తప్పగానే మా నాన్న నన్ను వాళ్ళ కొట్లో పనికి కుదిర్చాడండి. వాళ్ళ ఇంట్లో కింద కొట్టు,  పైన వాళ్ళు ఉండేవారండి. ఆ విధం గా ఒక రెండేళ్ళు గడిచేటప్పటికి మా ప్రేమ సంగతి తెలిసి పోయిందండి వాళ్ళ ఇంట్లో. నన్ను పనిలోంచి తీసేశారండి. కొట్టించారండి. ఆ అమ్మాయి ఇంట్లోంచి వచ్చేసిందండి.    
నీకు 14 ఏళ్లకే ఫ్రేమించడం తెలిసిపోయిందన్నమాట.
14 ఏళ్ల కి కాదండి. నేను వాళ్ళ కొట్లో చేరిన ఒక 7,8 నెలలకి మొదలయ్యింది ఇష్టం,  ఆ తరువాత ప్రేమ,  అలా జరిగిపోయిందండి. 1965 లో పెళ్లి చేసుకున్నామండి.  
ఆ అమ్మాయి ఇంట్లోంచి వచ్చేస్తే వాళ్ళు ఊరుకున్నారా,  ఆవిడ అనుమానం గా అడిగింది.   
ఎందుకు ఊరుకుంటారండి.  నానా గొడవ చేశారండి.  మమ్మలని చంపైనా వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లిపోదామని ప్లాను చేశారండి. కానీ అమ్మాయి కడుపుతో ఉందని తెలిసి ఆగిపోయారండి. పరువు పోతుందని భయపడ్డారనుకుంటానండి,  కడుపుతో  ఉందని నలుగురికి తెలిస్తే .      
కడుపు తోటా  అంటూ ఈ మాటు మళ్ళీ ఇద్దరూ ఆశ్చర్యపడి కింద పడి పోయారు. ఇంతలో  వింటున్న పక్క బెర్తుల తెలుగువాళ్లు కూడా  ఇటు వైపు చర్చకు వచ్చేశారు . 
ఏమిటో అల్లా జరిగిపోయిందండి  మాకు తెలియకుండానే,   అమాయకత్వం ధ్వనించింది నా గొంతులో.
ఇంతకీ అమ్మాయి ఏం చదివిందో,  కొంచెం వెటకారం గా పక్క బెర్తు తెలుగావిడ. 
SSLC   తప్పిందండి. తప్పడం,  ఆ కాలం లో ఆవిడకు అలవాటు అనుకుంటానండి . రెండు మాట్లు SSLC తప్పిందండి. ఒక మాటు హింది ప్రాధమిక కూడా తప్పిందండి. పెళ్లి కాకుండానే నెల కూడా  తప్పిందండి. 
మళ్ళీ కొన్ని నిముషాలు నిశ్శబ్దం. ఏం మాట్లాడాలో ఎవరికి తెలియ లేదు అనుకుంటాను. నేను కొంచెం ఎక్కువ మాట్లాడేనేమోనని నాకే అనుమానం వచ్చింది.  
ఇంతకీ ఏం చేస్తుంటావు నాయనా,  నువ్వు,  పక్క బెర్తు ఆయన. 
మా కొక,   ప్లాస్టిక్ సామాను,  రబ్బర్ వస్తువులు, ఆటవస్తువులు, ఫాన్సీ వస్తువులు   మొదలైన  హోలు సేలు అండ్ రిటైలు  షాపు ఉందండి. బాగానే నడుస్తోందండి. ఇక్కడ అంటే కలకత్తా లోనూ,  బొంబాయిలోనూ  కొని అమ్ముతామండి మా ఊళ్ళో. ప్రతి నెలా ఇక్కడికి,  బొంబాయికి వెళ్ళి   వస్తూ ఉంటానండి.  నెలకి ఒక 30 – 40   వేలు మిగులుతాయండి ఖర్చులు పోను. ఏదో సాగిపోతోందండి సంసారం . 
ఇంతకీ మీ అత్తగారింట్లో  ఒప్పుకున్నారా ఇప్పుడైనా,   పక్క బెర్తు ఆవిడ. నువ్వు కాస్తా మీరు కి వచ్చింది ఆవిడ. 30-40 వేల ఆదాయం మహిమ అనుకుంటాను. 
నాల్గు  ఏళ్ల తరువాత మా మామగారు వచ్చారండి మా ఇంటికి మా అబ్బాయి పుట్టినప్పుడు. మా అత్తగారు మా అమ్మాయి పుట్టినప్పుడే వచ్చారు. 
తల్లి ప్రాణం కదా అంది ఎదురు బెర్తు ఆవిడ. 
అవునండి ఆవిడ పేరే పెట్టామండి మా అమ్మాయికి కామేశ్వరి అని. 
అబ్బాయికి అని అడిగింది  గడుసుగా పక్క బెర్తు ఆవిడ. 
అబ్బాయికి మా మామగారి పేరు పెట్టామండి నారాయణ మూర్తి అని.
మీ అమ్మగారి పేరు  కానీ నాన్న గారి పేరు కానీ  పెట్టలేదన్నమాట మీ పిల్లలకి, అడిగాడు   పక్క  బెర్తు ఆయన. ఆయనకి నామీద కోపమెందుకో అర్ధం కాలేదు నాకు. 
మా అత్తగారు చెబితే వాళ్ళ నాన్న గారు  అంటే  మా ఆవిడ తాతగారు,   సహాయం చేశారండి మాకు మొదటినించి. కాపురం పెట్టడానికి,  ఆ పైన వ్యాపారం పెట్టడానికి. రెండు మూడేళ్ళ తరువాత  మా మామగారు కూడా వాళ్ళ మామ గారి ద్వారా సహాయం చేశారండి  వ్యాపారం పెరగడానికి .   అందుకని వాళ్ళ పేర్లు పెట్టడం నా ధర్మం అనుకున్నానండి.  మా షాపు పేరు కూడా జంబులింగం అండ్ ఫాదర్ ఇన్ లా అనే పెట్టానండి. 
ఈ మాటు పక్క బెర్తుల తెలుగువాళ్లు కూడా కింద పడిపోయారు. వాళ్ళు లేవడానికి కొంచెం టైమ్ పట్టింది. 
ఫలానా అండ్ సన్స్ విన్నాం , ఫలానా అండ్ బ్రదర్స్  విన్నాం కానీ ఫాదర్ ఇన్ లా అని  షాపు పేరు  ఎప్పుడూ వినలేదు నాయనా అని ఆక్రోశించాడు పక్కబెర్తు ఆయన. 
కొత్త వరవడి సృష్టించాడు మంచిదే కదా. విశ్వాసం చూపించాడు  మామ గార్కి  అని సమాధాన పరచింది పక్క బెర్తు ఆవిడ మొగుడిని.  తల్లి తండ్రుల మీద కూడా ఇంత విశ్వాసం ఉందో లేదో తెలుసుకోవాలనుకున్నాడు ఆయన.    
మరి మీ అమ్మా నాన్న మీతోటే ఉంటారా,  అడిగేశాడు తెగించి  పక్క బెర్తు ఆయన.  
లేదండీ వాళ్ళు మా అన్నయ్య వాళ్ల తోటి ఉంటారు. అప్పుడప్పుడు నేనూ కొంత సహాయం చేస్తానండి . అంతే అంతకు మించి ఏమీలేదండీ. ఇప్పుడు నేను వీళ్లమీదే ఆధార పడ్డాను కదండీ. వీళ్ళు చెప్పినట్టే వినాలి కదండీ.  
పోనీ నాయనా నిజం ఒప్పుకున్నావు. అయినా అమ్మా నాన్నలని ఎవరు చూస్తున్నారు ఈ రోజులలో,  పక్క బెర్తుకి నామీద కోపం పెరుగుతోంది ఎందుకో.     
ఇంక పడుకుందామా తెల్లారి మాట్లాడుకోవచ్చు అంటూ ఎదురు బెర్తు ఆయన,  కుటుంబం నిద్రకు ఉపక్రమించారు .   నేనూ కొంచెం సేపు పత్రికలు చూసి నిద్ర పోయాను. 
తెల్లారి నేను లేచేటప్పటికి వేడి వేడి గా రాజకీయాల మీద చర్చ జరుగుతోంది.  నా సంగతి అందరూ మర్చిపోయినట్టు కనిపించారు. కానీ వారి చూపుల్లో నేనంటే అయిష్టత కనిపించింది. నా తోటి మళ్ళీ ఎవరూ కల్పించుకొని మాట్లాడలేదు. నేను పలకరిస్తే అవసరమైనంత వరకే సమాధానం చెప్పారు. పక్క బెర్తు వాళ్ళు రాజమండ్రి లో దిగిపోయారు,   నేను విజయవాడ లో దిగిపోయాను . వీళ్లలో మళ్ళీ ఎవరిని కలుసు కుంటానని నేను అనుకోలేదు. వాళ్ళు ఎప్పుడూ మళ్ళీ తారస పడలేదు.   నేను ఆ  సంగతి మర్చిపోయాను. 
నా మాట :  కొద్ది రోజుల క్రితం   కావ్య గారి బ్లాగు  'నా పరిధి దాటి' లో   ఆవిడ వ్రాసిన టపా 
వయసు - జీతం    అక్కడ  కామెంట్లు   చదివాను .  రైల్లో పక్కవాళ్ళ ప్రశ్నలు కొన్ని మనకి చిరాకు,  కొండోకచో ఇబ్బంది కలిగిస్తుంటాయి. మనమే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగే  కధ అల్లితే  ఎల్లా ఉంటుందా అనిపించింది .   సో కావ్య గార్కి  థాంక్స్. కావ్య గారి కధకి ఇది నా కామెంటు అన్నమాట. 
అప్పుడప్పుడు రైలు ప్రయాణాలలో కధలల్లడం కూడా  సరదా గానే ఉంటుందేమో .  కొంచెం అసహజంగాను, నమ్మలేనిది  గాను ఉంటే  పక్క వాళ్ళ రియాక్షన్స్ కొట్ట వచ్చినట్టు కనబడవచ్చు.  ఈ  కధ లో  వాళ్ళ స్పందన  ఆశ్చర్యం కలిగించిందా?  ఎదురు బెర్తు వాళ్ళు ముందర నమ్మినట్టు లేదు కానీ ఆతరువాత నమ్మారో,  నమ్మినట్టు నటించారో  కానీ జంబులింగం వ్యవహారం వారికి నచ్చలేదు అని అర్ధం అయింది. కానీ ముక్కు మొహం తెలియని అతని మీద  కోపం వచ్చిందని  అనుకోలేము .   సగటు మనిషి బహుశా అంతే నేమో.  పక్క బెర్తు ఆయనికి  జంబులింగం  మీద కోపం,  కోపమే కాదు కొంచెం అసహ్యం అని కూడా అనిపించవచ్చు .  బహుశా తప్పు చేసినా బాగు పడ్డాడేమో అన్న అసహనం వల్ల కావచ్చు. 
ఇంతకీ ఎల్లా ఉంది నమ్మ శక్యం గా ఉందా?  లేకపోతే నీ జిమ్మడా , దొంగకోళ్ళ మొహం గాడా అంటారా ?  
గమనిక :- ఈ టపా మొదటి సారిగా ఈ బ్లాగులో 10/05/2011 న ప్రచురించబడింది.
గమనిక :- ఈ టపా మొదటి సారిగా ఈ బ్లాగులో 10/05/2011 న ప్రచురించబడింది.