ఆంధ్రజ్యోతి సంపాదకులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు.. కానీ వారికిది భావ్యమా?


నిన్న  జనవరి ఒకటవ తారీఖున సాయంకాలం 3-4 గంటల మధ్యన బ్లాగ్మిత్రురాలు ఒకరు ఒక మెయిల్ పంపించారు.

బులుసు గారూ మీ కధ ‘నాకు ప్రేమించి పెళ్లి చేసుకొనే యోగ్యత లేదా’  ఆంధ్ర జ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధం లో వచ్చింది,  చూసారా అని. వెంటనే చూశాను.

కడుంగడు నానందించితిని.
మీదు మిక్కిలి సంతోషించితిని.
అమందానంద కందళిత హృదయారవిందుడ నైతిని.   
హర్షాతిరేకమున గంతులు వైచితిని
మనం వ్రాసే కాలక్షేపం కధలు పత్రికలకెక్కే స్థాయికి ఉన్నాయేమో నని మనంబు సంభ్రమానందాశ్చర్య డోలలూగినది.
ఆనందమాయే అలి నీలవేణీ అని కూడా పాడుకున్నాను మా ఆవిడకు చెప్పి.
హర్ తర్ఫ్ బజ్ నే లగీ శేఖడో షెహనాయియా అని హిందీలో  కూడా పాడుకున్నాను.

ఏలూరు రోడ్లన్నీ తిరిగి ఆంధ్రజ్యోతి దినపత్రిక కొనుక్కొచ్చాను.  కనిపించిన వాళ్ళ చేత బలవంతం గా చదివించాను. వాళ్ళు నవ్వకపోయినా నేనే నవ్వి, వాళ్ళని మొహమాట పెట్టి నవ్వించాను.

మా యావిడ కూడా చిరునవ్వుతో అందరికితో బాటు నాకు కూడా పంచదార కలిపిన కాఫీ ఇచ్చింది.

శుభం భూయాత్ అని అనుకున్నాను.  

అన్నట్టు మరిచి పోయాను.  మొదట చెప్పవలసింది ఇక్కడ చెపుతున్నాను.

ఆగస్టు 2011 లో నా బ్లాగులో పబ్లిష్ చేసుకున్న నా కధ  ‘నాకు ప్రేమించి పెళ్లి చేసుకొనే యోగ్యత లేదా’  ఆంధ్ర జ్యోతి దినపత్రిక జనవరి 1, ఆదివారం అనుబంధం లో ప్రచురించినందుకు ఆంధ్రజ్యోతి సంపాదకులకు మనఃస్ఫూర్తిగా కృతజ్ఞత లు, ధన్యవాదాలు తెలియ జేసుకుంటున్నాను.  వారికిదే నా నమస్సుమాంజలులు.

కానీ ఇంత ఆనందం లోనూ ఎక్కడో మనసులో ఒక మూల కలుక్కుమంది.

నా కధ  పత్రిక లో వచ్చిందని ఎవరో చెప్పేదాకా నాకు తెలియలేదు.
అయినా సరే  ముగాంబో ఖుష్ బహుత్ ఖుష్ అవడం  కొంచెం తేడాగా  అనిపించింది.

ఔరా మనని మాట వరసకు కూడా అడగకుండా వారి పత్రికలో మన కధ వేసుకోవడం సబబా? వారికిది భావ్యమా? అనే సందేహం వచ్చింది.

అడిగితే కాదనము కదా. డెందమానందమందగా తిరుగు టపాలో అంగీకారం తెలియ చేసుండెడి వారము కదా !  

అడుగలేదు ఫో. ఓయీ నీ కధ మా పత్రిక లో వేసుకుంటున్నామని తెలియ చేయవచ్చును కదా. ఆనందమనుభవించుము. నూతన సంవత్సరమున పండగ చేసుకొనుము అని తెలియపర్చుటకు కూడా అనర్హులమా?

ఆలోచించిన కొలది మనంబున నానందము సన్నగిల్లి,  క్రోధము ఆవహింప జొచ్చెను. ఇది ఏమి? పనీ , పాడు లేని వాడ ననుకును చుంటిని  కానీ ఇంత పనికి మాలిన వాడినా యన్న యనుమానం కలిగెను.

కాపీ రైటు, సింగినాధం జీలకర్ర  అని ఉపన్యాసం ఇవ్వను. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాటి నమలు పరిచేటందుకు  సమయం, ధనం మన వద్ద లేవు.  

కానీ బహుళ జనాదరణ పొందిన ఒక పత్రిక,  రచయిత అనుమతి తీసుకోవాలనే కనీస మర్యాద పాటించ లేదేమో నని అనుమానం. అంతే మరేమీ లేదు.

పత్రికా స్వేచ్ఛ లో ఇది కూడా ఒక భాగమేమో. ఏమో.

నేనేం చెప్పగలను. బాధ్యతలే తప్ప హక్కులు లేని ఒక అనామకుడిని.