సిరి రా మోకాలు అడ్డుట

భూమి గుండ్రం గా ఉందిట -- మీకు తెలుసా?   ఈ విషయం నాకు మొన్ననే తెలిసింది. ఓ శుభ ముహూర్తాన్న బ్లాగు మూసి, తాళం వేసి, తూర్పు తిరిగి దండం పెట్టి, నడక మొదలుపెట్టాను శూన్యం లోకి. చిత్రంగా సుమారు మూడు నెలల తరువాత  మళ్ళీ  బ్లాగు దగ్గరకు వచ్చాను. భూమియే కాదు, బ్లాగు కూడా గుండ్రం గానే ఉంది అని అవగతమైనది. బ్లాగు తెరిచి లోపలికి వెళ్ళి చూస్తే మూడు  ఆసక్తి (నాకే)  గల విషయాలు తెలిసాయి. 

౧. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు. బ్లాగు మూసిన డిసెంబర్ నెలలో పాఠకులు    మూడువేల నాలుగు వందల మంది బ్లాగుకి వచ్చారు. ఇది ఆల్ టైం రికార్డ్ . 

 ౨. జనవరిలో  పాఠకుల  సంఖ్య  50,000 దాటి ప్రస్తుతం ఇంకో రెండు వేల నాలుగు వందలు పైగా  పెరిగారు. రెండున్నర ఏళ్ల పైగా వ్రాస్తుంటే మొన్ననే ఏభై వేలు దాటారంటే నా బ్లాగు పరిస్థితికి నాకే జాలి వేసింది. కానీ మూసివేసిన తరువాత కూడా నెలకి 750 – 1000  దాకా వస్తున్నారని ఆనందము కలిగింది.

౩. మూసివేసిన తరువాత కూడా ఇంకో అర డజను ఫాలోయర్స్ పెరిగినందుకు ముదావహుడను కూడా అయ్యాను.

ఈ ఏడుపు ఏడవడానికి బ్లాగు తెరవాలా అని మీరు కోప్పడకండి. ఇంకో ముఖ్య విషయం మీతో పంచుకోవాలని ఈ వేళ బ్లాగు తాళాలు తీసాను.  

బ్లాగు మూసివేసిన వారం రోజులకు ఆఫ్రికా ఖండం లో ఒక చిన్న దేశంలోని పర్యాటక శాఖ ఉన్నతాధికారి (అని ఆయనే చెప్పుకున్నారు)  నుంచి టెలిఫోన్ వచ్చింది. మీకు కొద్ది రోజుల క్రితం ఒక మెయిల్ పంపాం. మీ వద్దనుండి జవాబు రాలేదు అందుకే టెలిఫోన్ చేసాను అని చెప్పాడు ఆయన. సారీ నాకు మెయిల్ రాలేదు అన్నాను. బహుశా స్పాం లోకి వెళ్ళి ఉంటుంది, చూసి జవాబు ఇవ్వండి అన్నారు.  నేను వెతికాను. మెయిల్ కనిపించింది. పర్యాటక అభివృద్ధి కోసం వారు ఒక కొత్త స్కీము  మొదలు పెట్టారుట.  ఈ స్కీములో డెవలపింగ్ దేశాలనుంచి ప్రతీ సంవత్సరం ఒక ఐదుగురు వ్యక్తులను ఎన్నిక చేసి వారికి రెండు  లక్షల డాలర్స్ బహుమతి ఇస్తారుట.  ఆ వ్యక్తి తనతో ఇంకో నలుగురిని  తీసుకుని  వాళ్ళ దేశం వెళ్ళాలిట. ఖర్చులన్నీ వారే భరిస్తారుట.  పది రోజులు వారి దేశం లో విఐపి  లాగా చూస్తారట. దేశం అంతా తిప్పి చూపిస్తారట. తిరిగి వచ్చేటప్పుడు  ఒక్కొక్కరికి  రెండు వేల డాలర్స్ విలువ చేసే బహుమతులు ఇస్తారుట,  వాళ్ళ దేశం లో తయారు చేసే హస్త కళలు, ఇతర మెమెంటోలు.  వాళ్ళ దేశం గురించి ఒక రెండు పేరాలు కూడా వ్రాసారు.  ఈ ఇరవై మంది వాళ్ళ దేశపర్యాటకానికి వారి వారి  దేశాలలో  తగు ప్రచారం కల్పిస్తారనే ఆశ వ్యక్తం చేసారు.

చూడగానే ఆసక్తి కలిగింది. కానీ ఇలాంటివి చాలానే మెయిల్ లు వస్తుంటాయి. స్పాం లోకి వెళ్ళిపోతుంటాయి. వాటిని ఎప్పుడూ పట్టించుకో లేదు. ఇది కూడా అలాగే అనుకుని ఊరుకున్నాను.  ఒక వారం రోజుల తరువాత మళ్ళీ టెలిఫోన్ చేసాడు ఆయన.  నేను ఇలాంటివి నమ్మను అని ఖరాఖండిగా చెప్పేసాను.  ఏంచేస్తే మీరు నమ్ముతారు అని అడిగాడు. ఆలోచించకుండా  “మీ గురించి, మీ సంస్థ గురించే కాదు మీ దేశం గురించి కూడా నాకు తెలియదు. మీ గురించి ఎంక్వైరి చేయాలంటే నాకో రెండు వేల డాలర్లు ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టే ఉద్దేశ్యం నాకు లేదు.” అని చెప్పాను. నేను మళ్ళీ  మాట్లాడుతాను అని చెప్పేడు.  

ఇంకో వారం  రోజుల తరువాత  మళ్ళీ  టెలిఫోన్  చేసాడు. మీకు రెండు వేల డాలర్స్ ఇవ్వడానికి మా సంస్థ అంగీకరించింది. మీ బేంక్ వివరాలు చెపితే మేము పంపిస్తాము  అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది.  భయం వేసింది, వీళ్ళ ఉచ్చులో పడుతున్నానా అని.  ఓ వెఱ్ఱి నవ్వు నవ్వి,  సారీ నా బాంక్ వివరాలు ఎవరికీ ఇవ్వను. అయినా నా మీద అంత ఇంట్రెస్ట్  ఎందుకు మీకు, ఇంకోరెవరినైనా తీసుకోవచ్చు కదా అని కూడా అన్నాను. మీరు బేంక్ గురించి  ఇలా అంటారని అనుమానించాను కానీ ప్రయత్నం చేసాను,  అని నవ్వాడు. మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి మాకు నాలుగు  నెలల పైన పట్టింది.  కంప్యూటర్ ద్వారా  రాండం గా ఐదు దేశాలని ఎన్నుకున్నాం. ఆ దేశంలో ప్రదేశాలను కూడా రాండం గానే ఎన్నుకున్నాం. ఆ చోట్ల లో చిన్న పట్టణాలను టార్గెట్ చేసి ఆరు అంకెల టెలిఫోన్ నంబర్లను రాండం గా జెనేరేట్ చేసాం. పెద్ద పట్టణాలలో విదేశయానాలు చేసేవారు ఎక్కువుగా ఉంటారని అనుకున్నాం. వారి కి ఇలాంటి చిన్న దేశాల మీద ఆసక్తి ఉండకపోవచ్చు. వారి వల్ల మాకు ఎక్కువ ప్రచారం జరగక పోవచ్చు.  ఆ తరువాత STD  కోడ్ కూడా రాండం గానే తీసాం. మీ నంబర్ వచ్చింది. మీ పేరు, నంబర్ ద్వారా మా ఎక్స్పర్ట్స్ మీ వివరాలు  సేకరించారు. మీ దేశం తో మాకు దౌత్య సంబంధాలు ఉన్నాయి.  డిల్లీ లో మీ  ఆఫీసు నించి, ఇతరత్రా   మీ గురించి వివరాలు  సేకరించాము,  అని సుదీర్ఘం గా ఉపన్యాసం ఇచ్చాడు. ఇది అంతా చేయడానికి మాకు నాలుగు నెలలు పట్టింది. ఇప్పుడు మళ్ళీ   మొదలు పెట్టాలంటే ఇంకో అంత టైం పడుతుంది కదా అని కూడా చెప్పాడు. మీ బేంకు పేరు చెప్పండి. మేమేదో మార్గం ఆలోచిస్తాం అన్నాడు. అది చెప్పడానికి అభ్యంతరం లేదు అని బేంక్, బ్రాంచ్ చెప్పాను.

ఇంత వివరంగా మన గురించి వివరాలు సేకరించారంటే కొంత నిజం ఉండే ఉంటుంది. ఇప్పుడు నాకు కొంత నమ్మకం కలిగింది,  అనుమానాలు పూర్తిగా తీరకపోయినా.    లెఖ్ఖలు వేయడం మొదలు పెట్టాను. ఒక కోటి రూపాయలు దాకా వచ్చే అవకాశం కనిపిస్తోంది. టాక్స్ ఓ ముఫై లక్షలు పోయినా డెబ్భై  లక్షలు  మిగులుతాయేమో.   నిజం చెప్పద్దూ ఆశ పెరగడం  మొదలయింది. ఒక పది రోజుల  తరువాత మా బేంక్ మేనేజర్ ఫోన్ చేసాడు. వెళ్లాను. వారు అడిగిన ఋజువులు అన్నీ చూపించాను. నా పాన్ కార్డ్, నా పెన్షన్ మెమో, ఆ అధికారి పేరు, టెలిఫోన్ నంబర్, ఆయన నాకు టెలిఫోన్ చేసిన తేదీలు లాంటివి అడిగి నిర్దారించుకున్నాడు. రెండు రోజుల్లో మీ అకౌంట్ లో 2000 డాలర్స్ ఆ రోజు మారకం ధరతో జమ చేయబడతాయి.  రేపు మీరు ఒక హామీ పత్రం ఒక స్యూరిటి సంతకం తో ఇవ్వాల్సి ఉంటుంది,  మీరు సరి అయిన ఖర్చు వివరాలు ఇవ్వకపోతే, డబ్బు తిరిగి ఇస్తానని. సరే నని వచ్చాను.

ఆ వేళ డాలర్స్ గురించి అడిగాను తప్ప ఎలా నిర్దారించుకోవాలో తెలియలేదు. వాళ్ళు డబ్బు పంపిన తరువాత కూడా ఇంకా అనుమానం ఎందుకు అని మనసు తొందర పెట్టింది. ఏమో ఎర వేసారేమో అనే అనుమానం కూడా వచ్చింది.  డబ్బు నా అకౌంట్ లో జమ అయిన మర్నాడు ఆయన మళ్ళీ  టెలిఫోన్ చేసాడు. ఇప్పుడు మా మీద నమ్మకం కుదిరిందా అని అడిగాడు.  పదిహేను ఇరవై రోజులలో మీ నిర్ధారణ చేసుకుని అంగీకారం తెలుపుతారని ఆశిస్తున్నాను అన్నాడు. మా దేశం తో దౌత్య సంబంధాలు ఉన్నాయంటున్నారు కదా, మా ప్రభుత్వం ద్వారా ఇది పంపించవచ్చు కదా అని అడిగాను. ఈ స్కీము ఈ సంవత్సరమే మొదలు పెడుతున్నాము. మా ప్రెసిడెంట్ దీన్ని ఆఫీషియల్ గా జూన్  చివరి వారం లో ప్రారంభిస్తారు.  అప్పుడు వారు  మీ పేర్లు వెల్లడిస్తారు. అప్పటిదాకా రహస్యం గానే ఉంచమని మనవి.  అంతదాకా మేము మా పని అనదికారికం గా చేసుకోవాలి. మీకు బహుమతి డబ్బు  కూడా ఆ తరువాతే పంపిస్తాం,  మీ ప్రభుత్వ అనుమతి తో మా రాయబార కార్యాలయం ద్వారా. మా దేశం లో మీ బృందం పర్యటన అక్టోబర్ చివరి  వారం నుంచి నవంబర్ మొదటి వారం దాకా ఉంటుంది. నవంబర్ నాలుగవ తారీఖున మా ప్రెసిడెంట్ మిమ్మలనందరిని కలుస్తారు. అని చెప్పాడు.

కిం కర్తవ్యం అనుకున్నాను. నాకు నమ్మకం కుదిరినా, వాళ్ళు డబ్బు పంపారు కాబట్టి  ఏదో విధంగా నిర్ధారణ కార్యక్రమం మొదలు పెట్టాలి. మా మిత్రుడి కుమారుడు సౌత్ ఆఫ్రికా లో ఉన్నాడు. వాడికి  టెలిఫోన్ చేసాను. విషయం వివరంగా చెప్పి ఏమైనా చేయగలవా అని అడిగాను. ప్రయత్నిస్తాను అని చెప్పాడు. ఎందుకైనా మంచిదని బ్లాగ్మిత్రులు శ్రీ పప్పు శ్రీనివాస రావు గారిని సంప్రదించాను. వారు కూడా వారి  మిత్రులతో మాట్లాడి చేయగలిగినదంతా చేస్తానని హామీ ఇచ్చారు.  ఒక పదిరోజులు తరువాత శ్రీ పప్పు శ్రీనివాస రావు గారు, ఇందులో అనుమానించాల్సింది ఏమీ లేదని చెప్పారు. వారి మిత్రులు ఈ విషయం చెప్పారని తెలిపారు. ఇంకో పది రోజుల  తరువాత మా మిత్రుని కుమారుడు అదే విషయం చెప్పాడు. వాళ్ళ ఆఫీసు తో లావా దేవీలు ఉన్న ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ద్వారా కనుక్కున్నాడట. ఆ అధికారిని, అతని వివరాలనీ కూడా పంపించాడు.  అంతేకాదు మిగతా నలుగురి విజేతల  పేర్లు కూడా  పంపించాడు.  విజేతలు అనవచ్చా. నేను కూడా ఒకడిని.

 నాల్గైదు రోజుల తరువాత  ఆయన  ఫోన్  చేస్తే అంగీకారం తెలిపాను. ఆయన  సంతోషించాడు.  ఒక పదిహేను  రోజుల తరువాత వారి నుంచి కొన్ని పత్రాలు వచ్చాయి.  వాటిని న్యాయపరం గా,  పరిశీలించి  పూర్తి చేసి పంపించాను.

అదీ సంగతి. ఈ శుభ వార్త  మీ తోటి పంచుకోవాలని బ్లాగుకి తాళం తెరిచాను.


అడిగిన వెంటనే స్పందించి వారి మిత్రుల ద్వారా నా అనుమానం నివృత్తి చేసినందుకు శ్రీ పప్పు శ్రీనివాస రావు గారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 



గమనిక: - ఈ టపా మొదటి మాటు ఏప్రిల్ ఒకటవ తారీఖు 2013 న పబ్లిష్ చేయబడినది.