జ్ఞానసముపార్జన

ఈ మధ్యన తెగ జ్ఞానం సంపాదించేస్తున్నానేమోనని అనుమానం డౌటు కలిగింది. ఎడా పెడా, కుడీ ఎడమా, రెండు చేతుల తోటీ జ్ఞానం అర్జించేస్తున్నానని నమ్మకం కూడా కలిగిపోతోంది. గత మూడేళ్ళుగా రిటైరయ్యి ఇంట్లో కూర్చున్నప్పటినించీ నేను ఇల్లా జ్ఞాని నయిపోతున్నానన్నమాట. పాపం మాబాసుగారు అనేవాడు “బొత్తిగా జ్ఞానం లేదోమిటోయి నీకు” అని. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే అయన కూడా సంతోషిస్తాడను కుంటాను. రిటైరయినప్పటి నించీ పేపరు క్షుణ్ణంగా కంఠతా పట్టేయడం, టీ.వి చూడడం బాగా అలవాటు అయిపోయింది. ముఖ్ఖ్యంగా టీ.వి ద్వారా చాలా విషయాలలో చాలా జ్ఞానం గడించేసాను. మీకు అనుమానంగా ఉందా? మీరు కూర్చుని ఎవరితోటో మాట్లాడు తున్నప్పుడు, కడుపులో కలుక్కుమంటే అది ఏరోగానికి సంకేతం? మీకు తెలుసా? నాకు తెలుసు. వంకాయని ముచిక నించి నాలుగు భాగాలుగా కోసి, అందులో బంగాళాదుంప కూర దట్టించి, బెండకాయతో బిగించి చేసే కూర నేమని పిలుస్తారో మీకు తెలుసా? నాకు తెలుసు. మొన్న సల్మానుఖానుడు ఎవరికి టెలిఫోను చేసాడో కూడా నాకు తెలుసు. ఒబామాగారూ, ఆయనెవరూ, పేరు మర్చిపోయాను, బ్రిటిష్ ప్రదాని, వాళ్ళిద్దరూ ఏంమాట్లాడుకున్నారో కూడా నాకు తెలిసిపోయింది. చూసారా మతిమరపు కూడా జ్ఞాని లక్షణం అంటారు. అది కూడా నాకు వచ్చేసింది. ఇంతేనా అంటారా? మొన్న ఆయనెవరో పంచె కట్టుకొని, కండువా వేసుకొని, విభూతి రాసేసుకొని, కుంకం బొట్టుపెట్టేసుకొని, ముందుకూ వెనకకూ ఊగుతూ చెప్పింది విని ఎన్నోరకాల కృష్ణులున్నారని కనిపెట్టేసాను. భారత కృష్ణుడు, భాగవత కృష్ణుడు, గోలోక కృష్ణుడు, విష్ణు కృష్ణుడు, పరవాసుదేవుడు అని. ఇదంతా జ్ఞాన సముపార్జన కాక మరేమిటండీ. వంటల శాస్త్రం, రోగశాస్త్రం, సిన్మాశాస్త్రం, రాజకీయ శాస్త్రాలే కాక ఆధ్యాత్మిక శాస్త్రంలో కూడా పట్టు దొరికి పోతోందన్న మాట.

ఇంత జ్ఞానం ఇల్లా సంపాయించేస్తుంటే బ్రహ్మజ్ఞానిని అయిపోతున్నానేమోనని అనుమానం వచ్చేస్తోంది. మొన్నోకల కూడా వచ్చింది. బాసింపట్టు వేసుకొని, కళ్ళు తెరిచి నేను తపస్సు చేసుకుంటున్నాను. రెండు కళ్ళకి ఎదురుగా రెండు టీ.వీ లు, చెరోపక్కా రెండు చెవులకి ఇంకో రెండు టీ.వీ లు (చెవులకి టీవీ లు ఎందుకు? రేడియో చాలదా అని ప్రశ్నలు వేయకండి. నా కల, నా ఇష్టం) ఏకాగ్రతతో వింటున్నాను, కంటున్నాను (తప్పుడర్ధాలు తీయకండి) నాచుట్టూ బుల్లి టీవీలు, చిన్నటీవీలు, పెద్దటీవీలు గుట్టలు గుట్టలు గా పేరుకుపోతున్నాయి. మధ్యలో మొబైల్స్ కూడా దూరిపోతున్నాయి. శిరస్సు పై దాకా గుట్టలు పేరుకు పోయాయి. ఎంత కలైనా, కనీస జాగ్రత్త తప్పదని, గుట్టల మధ్య నించి ముక్కు బయటకు పెట్టి, ఈ ఛానలాయనమః, ఆఛానలాయనమః అంటూ ఇంకా ఘట్టిగా తపస్యించేసాను. సీను కట్ చేస్తే అచట ఇంద్రుడి కి మంట పుట్టు కొచ్చింది. బహుశా ఆయన కూడా నా ‘మౌన నిరశన వ్రతం’ చదివేడేమో, డైరక్టుగా ఘృతాచి ని పంపించేసాడు. ఆవిడ రావడం తోటే, నా చుట్టూ ఉన్న గుట్టలు ఎగిరిపోవడం మొదలుపెట్టాయి. నాకు ఖంగారు పుట్టింది. ఒక మంచి LCD, Plasma TV పట్టుకుందామని ప్రయత్నిస్తున్నాను. అవి దొరకడం లేదు. ఈలోపు ఘృతాచి పాట పాడేసి, డాన్సాడేసి వెళ్ళిపోయింది. మెలకువ వచ్చేసింది. టీవీ దేవుడు ప్రత్యక్ష మయ్యేదాకా తపస్సూ సాగలేదు, టీవీ లూ దొరకలేదు, వచ్చిన ఘృతాచి కాస్తా మాట్లాడ కుండానే వెళ్ళిపోయింది. కలలో కూడా నాజాతకం ఇంతేనా అని దుఃఖించాను. (మొన్నామధ్యన ఎవరో ఘృతాచి ఎడ్రస్సు కావాలన్నారు, బహుశా నాకు తెలియకుండా నాకలలోకి ఆయన వచ్చి ఘృతాచిని లేవతీసుకు పొయేరేమో అని నా అనుమానం)

ఈ కల కూడా వచ్చింది కాబట్టి జ్ఞాని నయిపోతున్నానన్న నా నమ్మకం ఇంకా పెరిగింది. కానీ ఎప్పటి లాగానే మాఆవిడ నా ఆశలమీద నీళ్ళు చల్లేసింది. నాలుగు రోజులక్రితం ఓమిత్రుడి దగ్గరకు వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చాను. ఆకలి దంచేస్తోంది. డైనింగు టేబులు దగ్గర కూర్చున్నాను. శ్రీమతిగారు టేబులు మీద ఒక పీట పెట్టింది. ఆ పీట మీద పళ్ళెం, పళ్ళెం చుట్టూ ఆనపకాయ ముక్కలు, గుమ్మడి కాయ ముక్కలూ ఉన్నాయి. పళ్ళెం అంచులనించి మధ్యదాకా, టమాటా, ఉల్లిపాయల చక్రాలు, కేరట్టు,దోసకాయ ముక్కలు, పచ్చి,ఎండు మిరపకాయలు, మధ్యదాకా విస్తరించి ఉన్నాయి. మధ్యలో ఓ కాబేజి ఆకు ఉంది. దానికింద ఎత్తుగా ఉంది. పైన వేయించిన జీడిపప్పు, కిస్మిస్సు, బాదాము పప్పులు ఉన్నాయి. జీడిపప్పు తీసుకొని నోట్లో వేసుకుందామని ప్రయత్నించాను. గరిటతో నాచేతి మీద ఒఖ్ఖటుచ్చుకుంది. ఇది వాసన చూసి ఏంకూరో చెపితే, ’వంకాయ బెంగుళూరు మిర్చి మసాలా ఢాం చేసి పెడ్తానంది. ఢాం కాదు దం అన్నాను నేను. మొన్ననే చూసాం ఓఛానలులో. తెల్లబట్టలు వేసుకొని, పొడుగాటి తెల్లటోపీ పెట్టుకొని, తెల్లగ్లవుజ్స్ తొడుక్కొని ఇంగ్లీషులో మాట్లాడుతూ, తెలుగులో నవ్వుతూ, ఒకాయన, బెంగుళూరు మిర్చి వంకాయ మసాలా దం, చేయడం ఎల్లాగో నేర్పించేసాడు. అది తిన్న ఆ యాంకరమ్మ కళ్ళు చక్రాల్లా తిప్పుతూ, అయ్య బాబోయ్ హింత బాగుందేమిటీ అంటూ కింద పడబోయింది. సందు దొరికింది గదాని, తెల్లబట్టలాయన పట్టేసుకున్నాడు. అది చేసిపెట్టమని అడిగాను మాఆవిడను. ఇప్పుడు ఇది అది కాదని తేలిపోయింది. కానీ ఏమిటో తెలియడం లేదు. ఆకలి దంచేస్తోంది కాబట్టి ఓటమి ఒప్పేసుకొన్నాను. కాబేజీ ఆకు తీస్తే దానికింద అరటికాయ ఉప్మాకూర ఉంది. దీనికింత బిల్డప్పా అని ఆశ్చర్యపోయాను. ఏంవండాం, ఎంత రుచిగా వండాం అన్నది కాదు ప్రశ్న, ఎంత అందంగా అలంకరించాం అన్నది జవాబు అని శెలవిచ్చింది.

ఇప్పుడు మీరే చెప్పండి, నాకు జ్ఞానం అబ్బిందా? లేదా? తెలిసి జవాబు చెప్పక పోయారో నేను చెప్పను కాని, భేతాళ కధలు గుర్తు చేసుకోమని మనవి.

13 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

భేతాల కధలు వరకూ ఐతే పర్వాలేదు, ఇంకా నయం ప్ర.నా కధలు గుర్తు చేసుకోమనలేదు..

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మీరు చెప్పిన తర్వాత చదివాను. అంతా మిధ్య మనమంతా నిమిత్తమాత్రులం. నేను మళ్ళీ నొక్కి మరీ వక్కాణిస్తున్నాను, భేతాళకధలే.

హనుమంత రావు చెప్పారు...

మీ మాటలు చదువుతూవుంటే నాకూ అనుమానంగానే వుంది సుబ్రహ్మణ్యంగారూ మీకు జ్ఞానం పెరిగి పోయిందేమోనని. ఆ అనుమానంతో మీ ప్రొఫైల్ చూసా....వెనక్కి పడిపోయి లేచి కొంచెం తమాయించుకుని మళ్ళీ చూసా...వార్నాయనోయ్ వేద వేదాంగ వేద్యులు. మీ పరిచయం మా భాగ్యం. మా కష్టాలు మీకూ ఆనందం కలిగించేయన్నమాట. మీరు సూచించినట్టు రకరకాల వుద్యోగాలు సంతృప్తికరంగా చేసి ఈ కంప్యూటర్ బారి పడ్డాము. చిన్న చుక్క మరస్తే మీ భావం యిదా యిదా అంటూ తొంభై ప్రశ్నల సంధింపు. చేసిన వుద్యోగాలలో యిలా లేదు బాబూ.అన్పిస్తోంది కదూ....మీదపడుతున్న వయస్సు...మనమడి దగ్గర బయట పడిపోతామేమోనని భయం. అడక్కండి. సరే శ్లేష్మంలో పడ్డ ఈగలా...నదిలో పడ్డ ఈత రానివాడిలా కొట్టుకుంటున్నాము. గట్టెక్కక పోతామా...ఇవ్వాళ కాపోతే రేపు... మీ చమత్కార రచనా విధానం చాలా బాగుంది. నాకూ అలాగే యిష్టం. అలా నా కష్టాలు అవీ మీలాంటి వారికి అనిపిస్తే ... ఓహ్....శలవు....దినవహి

ఆ.సౌమ్య చెప్పారు...

నేనొప్పుకోను, మీకేం జ్ఞానం రాలేదు....అరటికాయ ఉప్మా కూరని పోల్చుకోలేకపోయారుగా...మీరింకా ఎదగాలి సుమండీ

"వంకాయ బెంగుళూరు మిర్చి మసాలా ఢాం" ...మాత్రం సూపరు

ఆ.సౌమ్య చెప్పారు...

మీరు జ్ఞానం సంపాదించిన (అని అనుకుంటున్న) తరువాత మార్చిన మీ ప్రొఫైల్ చూసి నవ్వలేక చచ్చాననుకోండి....మీరు చాలా బాగా రాస్తున్నారు....రాస్తూ ఉండండి

ఆ.సౌమ్య చెప్పారు...

ఇది మీరా?

http://satocean.geol.sc.edu/bulusu.html

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

హనుమంతరావు గారూ,

థాంక్స్, మీకామెంట్స్ కి ధన్యవాదాలు.మనకన్నా మన పిల్లలు, వారికన్నా మన మనవలు, మనవరాళ్ళు తెలివైన వారు. మనపేరు తర్వాత సినిమా కేప్షన్ లాగ వీడు మనవడికి భయపడతాడు అని వ్రాసుకోవాలేమో.

ఆ.సౌమ్య గారూ,

మీ వాఖ్యలకు ధన్యవాదాలు.జ్ఞానం సంపాయించాలని తెగ కృషి చేసేస్తున్నాను.అది మనకు కుదరదని తెలిసిపోయిన తర్వాత అటూ ఇటూ చూసి నా ప్రొఫైల్ మార్చేసాను. Self awarded degree అన్నమాట. Thanks again for your comments.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

సౌమ్యగారూ,

వారు వీరు కాదు. వీరు వీరే వారు వేరే.నేను వారికన్నా చాలా పురాతనమైన వాడిని.నా వయసు ఇంకా అరవై ఆరే. థాంక్యూ.

..nagarjuna.. చెప్పారు...

>>దానికింద అరటికాయ ఉప్మాకూర ఉంది. దీనికింత బిల్డప్పా
>>LCD TV, Plasma TV

సూపర్ మాష్టారు... :D :))

అజ్ఞాత చెప్పారు...

chaala baagundi sir...maa aavidani kotta kura try cheyyamanali...

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

నాగార్జున గార్కి,
మీ వాఖ్యలకి థాంక్స్. ఏంచేస్తాం సార్ అందమే ఆనందం కూరకైనా సరే.

Anonymous గార్కి,
నా రచన మీకు నచ్చినందుకు చాలా థాంక్స్. కూర ఎవరైనా రుచిచూసిన తర్వాత మీరు సాహసించండి.

కొత్త పాళీ చెప్పారు...

"మొన్నామధ్యన ఎవరో ఘృతాచి ఎడ్రస్సు కావాలన్నారు, బహుశా నాకు తెలియకుండా నాకలలోకి ఆయన వచ్చి ఘృతాచిని లేవతీసుకు పొయేరేమో"
ఇది చాలా పాజిబుల్లు.
అసలు ఘృతాచికూడా ఏదన్నా టీవీలోనే వచ్చిందేమో, అదేమి ఛానలో కనుక్కుని మా శేటిలైట్ కనెక్షుని పీకేయించి ఆ ఘృతాచి ఛానలుకే చందాదారు నవుదామనుకున్నా. నా "కలలు" కల్లలు చేశారు. ఇప్పుడు నన్ను ఓదార్చడానికి అరిటికాయ ఉప్మాకూర కావాలి!!

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కొత్తపాళీ గార్కి,
ధన్యవాదాలు. అరటికాయ ఉప్మాకూరయితే అభ్యంతరం లేదు. కానీ ఘృతాచి దగ్గర ఆల్రెడీ నా అప్లికేషను అండర్ కన్సిడరేషన్. మీరు దయచేసి పోటీ రాకండి.
థాంక్యూ.