ఈ సమస్య మీద నేను అంటే ప్రభావతి అని పిలవబడే ప్రద్యుమ్నుడి భార్య నన్నమాట, తిరిగి పరిశోధన (research) చేశాను. మా మహిళా సభలో కూలంకషంగా చర్చించాను. ఈ సమస్య కి అనేక కోణాలున్నాయి. మొగుడు భార్యామణి అంటే మురిసిపోవడం కాదు. భార్యామణి అంటే అర్ధం తెలుసుకోవాలి . భార్యలలో మణి అంటే ఏమిటీ? ఎంతమంది భార్యలు? అని నిలదీయాలి. మిగతా భార్యలు ఎక్కడ? అని ప్రశ్నించాలి. భర్త, యమునా తీరమున సంధ్యా సమయమున అని పాడుకొనే సందర్భాలు కనిపెట్టాలి. ఆ సంధ్య ఎవరో తెలుసుకొనే ప్రయత్నం చెయ్యాలి. వారికి తూర్పున ఉషోదయాలు, పడమర సంధ్యా రాగాలు లేకుండా జాగ్రత్త పడాలి. భార్య పతివ్రతగా ఉండాలనుకొనే ప్రతీ భర్తా సతీవ్రతం పాటించాల్సిందే. ‘ఒకే బాణమూ, ఒకటే మాటా, ఒకే భామకే రాముని ప్రేమా’ అన్నట్టు ఉండాల్సిందే. అల్లా అని “ఫో బాల నువ్విక పుట్టింటికి పొమ్ము బాలా” అనగానే ”ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు” అని పాడుకుంటూ వెళ్లిపోవడం కాదు. “ఐ నో గో, యు గెట్ ఔట్” అనగలగాలి. అంత ధైర్యం మనకి ఉందని వారికి అర్ధం అయితే చాలు వాడికి వేరే మార్గం లేక మన్ని ప్రేమించడం మొదలు పెట్టుతాడు. ఒకమాట కొంచెం రహస్యం గా చెపుతాను. పాపం మొగుడు, పెళ్ళైన కొత్తలో మనని తెగ ప్రేమించేస్తాడు. వాడి అవసరం అటువంటిది. ఆ టైము లోనే మనం పట్టు బిగించెయ్యాలి. పెళ్ళాం = బెల్లం , అమ్మా నాన్నా = అల్లం అని నూరి పోసేయాలి. అప్పుడే వారు మన వలలో పడుతారు. మనకి సిద్ధాంతాలు అన్నీ తెలిసినా, కొన్ని మొండి ఘటాల దగ్గర మన పప్పులు ఉడకక పోవచ్చు. కొండొకచో మన మొగుడితో ముచ్చట పడి పోయి వారి వలలో మనమే పడిపోవచ్చు. ఇవన్నీ occupational hazards. పెళ్ళాం అంటే లైఫ్ లాంగ్ ఉద్యోగం అనుకోవాలి. అప్పుడే మన హక్కుల కోసం పోరాటం చేయవచ్చు. అంతే తప్ప నా బాధ్యత, నాధర్మం అని సతీ అనుసూయ లాగా ఫీల్ అయితే మీ ఖర్మ, మిమ్మలని ఎవరూ బాగు చెయ్యలేరు. ఎప్పుడూ బాధ్యతల గురించి అంటీ ముట్టనట్టుండాలి కానీ హక్కుల కోసము అవిశ్రాంత పోరాటాలు సలపాలి.
సరే పెళ్లి అయింది. మనకి ధర్మ సూత్రాలు తెలియక కొంతకాలం సంసారం చేసేసాము. వాట్ నెక్స్ట్. అని ఆలోచించండి. ఇప్పటికైనా మేలుకొని జూలు విదల్చండి. 5-10 ఏళ్ళు సంసారం చేసిం తర్వాత మీకు జ్ఞానోదయము అయితే మొగుడు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. హాహాహ్హా నా మొగుడి గురించి నాకు తెలియదా ? వాట్ నాన్సెన్స్ అని ఇదైపోకండి. 10 ఏళ్ళు సంసారం చేసినా 25 ఏళ్ళు చేసినా మొగుడు గాడు ఓపట్టాన అర్ధం కాడు. అందుకనే వాడిని మొగుడు అంటారు. అర్ధం అయ్యేడని మనం భ్రమ పడతాము అని తెలుసుకోండి. నేను చెప్పింది మీరు నమ్మక పోతే, ఓ పని చేయండి. మీ ఇంటి చుట్టుపక్కల పె.గీ.గీ.దా.వా, అని పేరుబడ్డ ఒకడిని మీ ఇంటికి భోజనానికి పిలవండి. ఛండాలంగా సాంబారు పెట్టి వాడికి వడ్డించండి. వాడు లొట్టలు వేసుకుంటూ మిమ్మల్ని చూస్తూ గిన్నెడు సాంబారు తాగేస్తాడు. పెళ్ళాం గీచిన గీటు దాటని వాడు. అంటే అల్లా ఉంటాడా అని ఆశ్చర్య పడకండి. మొగుడు పైకి కనిపించేది ఒకడు, అవకాశం వస్తే మరొకడు. చాలామంది మొగుళ్లు అవకాశం లేక, దొరకక, మిమ్మల్ని హింసించే మార్గం తట్టక, మంచి భర్తలుగా మిగిలిపోతారు అని మీరు గ్రహించాలి.
ఈ విషయం పైన నేను చాలా లోతుగా, సమగ్రంగా అధ్యయనం చేశాను. అనేక మొగుళ్ళ మనస్థత్వాలు శోధించాను. అనేక మనస్థత్వ శాస్త్రవేత్తలతో చర్చించాను. చర్చించి, శోధించి ఆపైన మధించి, వాటిని క్రోడీకరించి పంచరత్నాలు లాంటి ఐదు ప్రశ్నలు తయారు చేశాను. సమయానుకూలంగా వాటిని మీ వారికి సంధించి జవాబులు రాబట్టండి.
1. ఉప్మా లో పచ్చి మిరపకాయలు బదులు ఎండు మిరప కాయలు వేయవచ్చా?
అ. సారీ డియర్ నిన్న పచ్చి మిర్చి మరిచిపోయాను.
ఆ. నువ్వు ఏం వేసినా బాగానే ఉంటుంది.
ఇ. ఫరవాలేదు ఏదైనా వేయవచ్చు.
ఈ. ఏదో ఒకటి అఘోరించు.
ఉ. పచ్చిమిర్చి అయిపోతే చెప్పి ఏడవాలి.
2. మా చెల్లెలికి పెళ్ళిలో బహుమతిగా ఫ్రిజ్ ఇద్దామా, మైక్రో ఓవెన్ ఇద్దామా ?
అ. అబ్బే అవేం బాగుంటాయి, ఓ LCD TV కొని ఇద్దాం.
ఆ. రెండూ ఇచ్చేస్తే నష్టం ఏమిటి.
ఇ. మనకి మీ నాన్న ఏం ఇచ్చాడో అంతకన్నా ఎక్కువ ఇవ్వక్కర్లేదు.
ఈ. ఒక అరడజను చెంచాలు ఇస్తే చాలదా
ఉ. అసలు పెళ్ళికి వెళ్లాలంటావా
3. పక్కింటావిడ 4 తులాల నెక్లసు కొనుక్కుంది, మరి నాకేంటి కొంటారు?
అ. 4 తులాలు అంటే 40 వేల మిల్లీ గ్రాములు, అంతా బరువు నీ మెడ
మోయలేదేమో సన్నుతాంగీ అంటాడా.
ఆ. Moon light కన్ననూ నీదు మోము bright ట, దూది పింజ కన్ననూ
నాదు పర్సు light ట అంటాడా.
ఇ. మీ తమ్ముడు ఓ లక్ష అప్పు ఇస్తాడేమో కనుక్కో అంటాడా
ఈ. ఇప్పుడు నీకు నగలు అవసరమా అంటాడా
ఉ. ఓ వడ్డాణం కొనుక్కో ఉన్న రెండు ఎకరాలు కూడా అమ్మేస్తాను అంటాడా
4. మీ పెళ్లి రోజున మీ ఆయన ఏంచేస్తాడు?
అ. ఉదయాన్నే లేవగానే “నీ కళ్ళల్లో నా కళ్ళు చూసుకోనా,
నీ ముక్కుతో నాముక్కు రాసుకోనా” అని పాడుతూ
NTR లాగా బుగ్గ కందిపోయేటట్టు చిటిక వేస్తాడా
ఆ. ఏడుస్తూ శలవు పెట్టి, నవ్వుతూ మిమ్మల్ని ఊరంతా తిప్పి
హోటల్ లో డిన్నర్ పెట్టిస్తాడా
ఇ. మీకో మంచి చీర కొనిపెట్టి, తను మాసిన లాగు, చిరిగిన చొక్కా
వేసుకొని ఆఫీసు కి వెళ్లిపోతాడా
ఈ. అసలు ఏం గుర్తు లేనట్టు ఆఫీసు కి వెళ్లిపోతాడా
ఉ. విషాదంగా భారంగా నిట్టూరుస్తూ, ఓ మందు బాటిలు ఓపెన్ చేసి
“కొయి లౌటాదె మేరే బీతే హువే దిన్” అని పాడుకుంటాడా
5. 31 రోజులు, పైవాడి బూతులు, కిందవాడి తిట్లూ భరిస్తూ కష్టపడి
1వ తారీఖుకి సంపాదించిన జీతం డబ్బులు
అ. మొత్తం మీచేతిలో పోసి అప్పుడప్పుడు పానిపూరి తింటానికి
ఓ పదిరూపాయలకి మిమ్మల్ని ప్రాధేయపడతాడా
ఆ. మొత్తం మీ చేతిలో పోసి పాకెట్ మని గా మీరిచ్చింది తీసుకుంటాడా
ఇ. ఇంటి ఖర్చులకి ఇంత అని ఇచ్చి మిగతాది తన దగ్గరే ఉంచుకుంటాడా
ఈ. మీకు పూలు కొనుక్కోడానికి 100 రూపాయలు ఇచ్చి మిగతాదంతా
తనే ఉంచుకుంటాడా
ఉ. మీకు ఏమి ఇవ్వకపోగా, ఇంటి ఖర్చులకి కూడా మీ నాన్న నడిగి
పట్టుకు రమ్మంటాడా
జవాబులు వచ్చింతర్వాత మార్కులు కింది విధంగా వేసుకోండి
అ కి 16 నించి 20 మార్కులు, ఆ కి 12నించి 16 మార్కులు, ఇ కి 8నించి 12 మార్కులు, ఈ కి 4 నించి 8 మార్కులు, ఉ కి 0 నించి 4 మార్కులు.
75+ వచ్చిన వాడిని అసలు నమ్మకండి. తేనె పూసిన కత్తిలాంటి వాడు . వాడు అందరితోనూ నవ్వుతూనే, మంచిగానే ఉంటాడు. అతి మంచి మంచిది కాదు . మిమ్మల్ని తెగ ప్రేమించేస్తాడు. అవకాశాలు సృష్టించుకుంటాడు నవ్వుతూనే ఎదురింట్లో ఏ ఛండిక తోనో లేక ఏ మార్తాండి తోనో కాపురం పెట్టేయగలడు. వాళ్ళిద్దరూ కలసి మీ జీవితం నవ్వుల పాలు చేసెయ్యగలరు. ఇటు వంటి వాడితో బహు జాగ్రత్త గా ఉండాలి. తాజమహల్ కట్టించేస్తాను నీ కోసం అంటాడు. కట్టించాలంటే ముందు నువ్వు పైకెళ్ళాలి గదా అనేస్తాడు కూడానూ.
60+ వచ్చిన వాళ్ళ తో కూడా కొంచెం జాగ్రత్త తప్పదు. అవకాశం లేక మంచిగా ఉండడానికి ప్రయత్నించే వాళ్లు వీళ్ళు . రోజూ రెండు తిట్లూ, నాలుగు మొట్టి కాయలు వేస్తుంటే తిన్నగానే మనకి నచ్చినట్టు ఉంటారు. కంట్రోల్ అన్నది ముఖ్యం వీళ్ళతోటి. వీడు కూడా చాలా బాగానే ప్రేమించే బాపతు.
45+ వీళ్ళు ఉత్తమ భర్తలు అనుకోవచ్చు. ప్రతిదీ ఆలోచించి ఒక మోతాదు లోనే చేస్తారు. ప్రేమించడం కూడా అంతే. కానీ వీళ్ళను కొంచెం పొగిడితే బాగానే ప్రేమించేస్తారు. వీళ్లతో మనకి ఏ భయం ఉండదు. ఇబ్బంది అసలే ఉండదు.
30+ మిమ్మల్ని ఉద్ధరించడానికి పెళ్లి చేసుకున్నట్టు ఫోజు కొట్టుతారు. కానీ కొంచెం భయస్తులు. అప్పడాల కర్ర కే భయపడుతారు. కాబట్టి దాని ఉపయోగం తప్పదు. ఉపయోగించి నంత కాలం మన చెప్పుచేతలలో ఉంటారు. గతి లేక, భయంతో చచ్చినట్టు ప్రేమిస్తారు. ఎంతగా ఉపయోగిస్తే అంతగా ప్రేమిస్తారు.
30 కన్నా తక్కువ అయితే ఒక మంచి లాయరు ని వెతుక్కోండి. వెంటనే విడాకులు తీసుకోండి.
మంగళం
31 కామెంట్లు:
మీ ప్రశనలూ, కిందిచ్చిన సమాధానాలు బాగున్నాయి కానీ వాటన్నిటికన్నా మీ విశ్లేషణ అదుర్స్.
“కొయి లౌటాదె మేరే బీతే హువే దిన్” :)
శ్రీమాన్ బులుసు సుబ్రహ్మణ్య విరచిత సంసార సాగర మధనామృత వాక్కులు వినరండీ.. విని తరించండి... అనాలనుందండీ... అంతకంటే ఏమీ చెప్పలేను... :)
అయ్యా సుబ్రహ్మణ్యంగారూ! ఏమిటిది పార్టీ మార్చేసారా?
ప్రద్యుమ్నుడిగారి ద్వారా ఆ పరీక్షలో నెగ్గడానికి యేమైనా
టిప్స్ ఇవ్వండి బాబు...ఈ వయస్సులో తేడావస్తే ఎక్కడికి పోగలము?...
ఇది మా ఆవిడ చదవకుండా జాగ్రత్తపడాలి,,,,,,,,,,,,
నవ్వితే నవ్వండి కాదు..
"నవ్వండి..తప్పదు " అని పెట్టాలి మీ బ్లాగ్ పేరు..:)
పోస్ట్ ఇరగ... :)
హహ్హహ్హా. బాగు బాగు. కానీ ఇక్కడ క్రెడిట్ ఎవరికి, సుబ్రహ్మణ్యం గారికా,
>>నేను అంటే ప్రభావతి అని పిలవబడే ప్రద్యుమ్నుడి భార్య నన్నమాట,
లేదా పైన ప్రభావతి గారికా అని నేను తెగ థింకింగ్ ఇక్కడ..
వేణూరాం.. భలే పేరు పెట్టావు..:)
మీరిలా పార్టీమార్చేయడం ఏమైనా బాగుందా అని ప్రశ్నిస్తున్నాను అధ్యక్షా... మొత్తానికి చాలానే రీసెర్చ్ చేశారుగా... ప్రశ్నలు సమాధానాలు సూపరు అనుకుంటుంటే విశ్లేషణ అంతకన్నా సూపరు అనిపించేశారు :-) ఈ టపాను మాత్రం భార్యామణులకు ప్రేయసీరత్నాలకు కనిపించకుండా ఉండేలా మాయచేసే టెక్నిక్ ఏమైనా తెలిస్తే బాగుండు.
మాస్టారూ,
ఏమిటో వారఫలాలు బాగున్నట్లు లేవే ?
హ హ హ భార్యామణి అంటే భార్యలలో మణా..హిహిహి.
చాలావరకు స్వానుభవంతో రాసినట్టున్నారూ! విశ్లేషణ అదిరింది.
అయినా...అబ్బే మీ ప్రభావతి ఇంకా పాతకాలపు ప్రశ్నలే అడుగుతున్నారు. కొత్తకాలంపు ప్రశ్నలు, జవాబులు నేనిస్తా, నాదగ్గర పాఠానికి పంపించండి. :D
emiti navvedi, maa yaavida ee post choosindante nenu edavaka thappadu.
ఇండియన్ మినర్వా గార్కి,
ధన్యవాదాలు మీవ్యాఖ్యలకి. బీతేహువే దిన్ అంటున్నారు, మార్కులు ఎన్ని వచ్చాయి?
రవిచంద్ర గార్కి,
ధన్యవాదాలు. అనాలనుకున్నవి అనలేకపోతున్నారంటే ధనుర్బాణాలు వదిలిన అర్జునుడు లాగ ఉన్నారని అనుకోవాలా.అయితే గీతోపదేశం చెయ్యాలి మీకు . థాంక్యూ.
హనుమంత రావు గార్కి,
అయ్యా ధన్యవాదాలు. పార్టీ మారుదామన్నా మారనిస్తారా. అయినా ఇప్పుడు మనకి టిప్స్ అవసరమా. థాంక్యూ.
బుడుగు గార్కి,
ధన్యవాదాలు. అన్నట్టు ఇందాకా ఎవరో సీగానా పెసూనాంబ గారు ఈ టపా కాపీ తీసుకెళ్లారండి. థాంక్యూ.
వేణూరాం గార్కి,
ధన్యవాదాలు. పేరుదేముంది సారు మార్చేద్దాం. మీలాంటి వారి అభిమానం ముఖ్యం. థాంక్యూ.
మనసుపలికే గార్కి,
థాంక్యూ. మీరు అంతగా థింక వద్దు. ప్రభావతమ్మ గారికే ధన్యవాదాలు చెప్పేద్దాము.
వేణూ శ్రీకాంత్ గార్కి,
ధన్యవాదాలు. నేను పార్టీ మారలేదని బల్ల గుద్ది మరీ ఉధ్ఘాటిస్తున్నాను. ఇవన్నీ ప్రభుత్వ రహస్యాలు. తెలియాల్సిన వాళ్ళకి తప్ప మిగతా అందరికీ తెలిసిపోతాయి. థాంక్యూ.
హరేఫాలా గార్కి,
ధన్యవాదాలు. తిధి,వార,నక్షత్రాలు అన్నీ బాగున్నా అదేమిటో జాతకం బాగుండటంలేదండీ. థాంక్యూ.
ఆ.సౌమ్య గార్కి,
ధన్యవాదాలు. స్వానుభవమున చాటు సందేశమిదే అని పాడి వినిపించినా మీకు ఇంకా అనుమానమా. భార్యామణి అనే పదం నిఘంటువు లో లేదని ఇందాకే కోప్పడి వెళ్ళాడు మాఇంటి పక్కాయన. మీరు హిహిహి అంటే అనుమానం వస్తోంది. ఏమిటో రాసేసాను తెలియక.
అమ్మాయిలు 22వ శతాబ్దంలో అడుగుపెట్టేశారు కానీ అబ్బాయిలు ఇంకా 20వ శతాబ్దంలోనే ఉన్నారు. (అని నా అపోహ ) వాళ్ళకి ఇవే ప్రశ్నలు సరిపోతాయట. థాంక్యూ.
మిర్చి బజ్జి గార్కి,
ధన్య వాదాలు. ఏమి చేస్తాం సారూ ఎంతవారలైనా కాంతా బాధితులే. థాంక్యూ.
హ హ హ అవునండీ భార్యామణి అన్నది నిఘంటువులో లేదు, అందుకే నవ్వాను మీ నిర్వచనం చూసి. అమ్మాయీమణి, కన్యామణి, భార్యామణి అని వాడతారు. అందులో సంధో, సమాసమో, అలంకరమో ఏముందో నాకూ తెలీలేదు. ఎవరైనా పెద్దలొచ్చి చెబితే నేర్చుకోవాలి మరి. :)
సుబ్రహ్మణ్యం గారూ
చాలా రోజులుగా ఎదురుచూస్తున్నా మీ కొత్త టపా గురించి.....ఇన్ని రోజులకి సరిపడా నవ్వించేశారు. బ్లాగులో అందరూ పెళ్ళైనవారే ఉన్నట్టున్నారు. మాలాంటి వారి సంగతేంటంట?? ఇప్పుడు మేము ఎన్ని మార్కులు వచ్చేలా ఉండాలో సలహా ఇద్దురూ
ఆ. సౌమ్య గార్కి,
భార్యామణి అనే పదం గురించి తెలుసుకోవటానికి, పండితుల కోసము వెతికేనండి. ఈ విషయం లో మట్టుకు వ్యాఖ్యానించము, అని బుర్ర మీద తిరుపతి కొండని, యాదగిరి గుట్టని గోక్కున్నారు ఒకరిద్దరు. అదన్నమాట సంగతి. అందువల్ల మీ సందేహ నివృత్తి చేయలేకపోతున్నాను. ధన్యవాదాలు.
సునీల్ గార్కి,
మరదే, సుఖాన ఉన్న ప్రాణాన్ని కష్టాలలోకి నెట్టడమంటే. జీవితమే సఫలము అని పాడుకోక, ఇంతేనులే బ్రతుకింతేనులే అని ఆలాపిస్తా నంటారేమిటి స్వామీ. మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.
బుర్ర మీద తిరుపతి కొండని, యాదగిరి గుట్టని గోక్కున్నారు.....హహహ...హ్మ్ చూద్దాం ఇంకెవరైనా పెద్దలు మీ టపా చదివి మనకి ధర్మోపదేశం చేస్తారేమో!
"భార్యామణి" లేకేం - "వంకాయవంటి కూరయు పంకజముఖి సీతవంటి భార్యామణియున్" అన్నారు కదా. రాముడికైతే "మణి వంటి భార్య", కృష్ణుడికైతే "భార్యలలో మణి". :-)
తా.క.: నాకు నెత్తిమీద తిరుపతి కొండో యాదగిరి గుట్టో ఉన్నంత పెద్దవాణ్ణి కాదని గమనించ ప్రార్థన. :-)
భైరవభట్ల కామేశ్వరరావు గార్కి,
మీరిచ్చిన వివరణకి ధన్యవాదాలు.ఇది నేను చదువుతున్నప్పుడు మా ఆవిడ నావెనక్కాలే ఉండి చదివింది. "ఇప్పుడు నేను రామ మణినా లేక కృష్ణ మణి నా " అని అనుమానం వెలిబుచ్చి నా సమాధానం వినకుండానే నన్ను మరింత పెద్దవాడిని చేసి వెళ్ళి పోయింది. అయ్యా అది సంగతి. థాంక్యూ.
ఆ. సౌమ్య గార్కి,
అదన్నమాట నేను కూడా రైట్ అనే అనుకుంటాను. థాంక్యూ.
అయ్యో, నా సీతయ్య టపా వ్రాసే ముందు మీ టపా చదివి ఉండాల్సింది. నేను ప్రభావతి దగ్గర శిష్యరికం చేసేసి సీతయ్యకి 'టిట్ ఫర్ టాట్' పెట్టేసేదాన్ని.....హా హతవిధీ....
ఎన్నెల గార్కి,
మా బ్లాగ్ కి స్వాగతం. మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు. మా బ్లాగంతా తిరిగితే ప్రభావతి చెప్పిన కిటుకులు బోల్డు నేర్చుకోవచ్చు.మీ సీతయ్య గారి కి కూడా థాంక్స్.
హ్మ్ బావున్నాయి వివరణలు. కామెశ్వరరావుగారికి మరొక్కసారి నమోనమః
కాంట్రవర్శికి మరికాస్త ఆజ్యం పోస్తున్నాను. కామేశ్వర్రావుగారు సందర్భోచితంగా కాస్త అక్షరాల గారడి చేశారు.
అసలు పద్యం .. పంకజ ముఖి సీతవంటి భామామణియున్ ...
అమ్మా సౌమ్యా, పెద్దవారు ఏదో (నిఘంటువులో ఉన్నదో లేనిదో) రాశారే అనుకో? మరీ ఇలాగ (అదేదో సంకలిని నిర్వాహకుల్లాగా) "డిఫైన్ దిస్!" అని బెత్తం పట్టుకుని తయారైపోవాలా?
కొత్తపాళీ గార్కి,
మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.
ఆ. సౌమ్య గారు బహు భాషా ప్రవీణురాలు. ఆ నారదుడు పుల్లలే వేసేవాడుట. మీరు ఓ కేజీ నెయ్యి పట్టుకొచ్చినట్టున్నారు. మూసిన అధ్యాయాన్ని మళ్ళీ తెరిపించడానికి మీరు కంకణం కట్టుకొన్నారు. హతవిధి నేనేమి సేయవలె?
(అదేదో సంకలిని నిర్వాహకుల్లాగా) "డిఫైన్ దిస్!".....హహహ్హ
కొత్తపాళీ గారూ, బెత్తం పట్టుకోవడమేమిటండీ రామ రామ....ఏదో తెలీక అడిగాను. పెద్దలు, పూజ్యులు వివరణలిస్తారేమో అని. :D అందునా మన సుబ్బరమణియంగారికి తెలుగు అంటే మహా ప్రీతి...ఆ దృష్టితో వారిని అప్పుడప్పుడూ ఇలా అడగడం నాకు సరదా.
కామేశ్వరరావుగారేమో మాటల జిమ్ముక్కులు చేసారు. మీరిలా నా మీద అభాండాలు వేస్తున్నారే తప్ప అసలు అర్థం ఎవరూ చెప్పట్లేదుగా! :)
సుభ్రమణయం గారూ,
"ఆ. సౌమ్య గారు బహు భాషా ప్రవీణురాలు".....హ్మ్ చూస్తున్నా చూస్తున్నా, మీ ఎగతాళి నాకర్థమవుతూనే ఉంది. నా పోస్ట్ తీసి నాకే కొడతారా, చెప్తానుండండి! :D
హా..హా....హాయిగా నవ్వుకున్నాను:)
బాగుందండి మీ పోస్ట్!
Cinimaa ni simple gaa chepparu kadaa :)
@కొత్తపాళీ , భైరవభట్ల గార్లు, గతమ్ లో నే భార్యామణి అంటే చి.రాఘవ గారు భామామణే అన్నారు . భామామణే అని - ఈ చాటువు రాసినవారు కాదు కదా - సాక్షాత్తూ సీతమ్మ వారే వచ్చినచెప్పినా నమ్మను.
ఆ.సౌమ్య గార్కి,
బెత్తం మీరు పట్టుకుంటే మధ్యలో రావడానికి ఎవరు సాహసిస్తారు.:)
ధన్యవాదాలు. బహు భాష ప్రవీణులు అని నిజంగా నిజంగానే అన్నాను.
పద్మార్పిత గార్కి,
మౌళి గార్కి,
ధన్యవాదాలు మీ వ్యాఖలకి.
ఊకదంపుడు గార్కి,
ధన్యవాదాలు. అయితే మీ ఓటు భార్యామణి కేనని అనుకోవచ్చా. :)
సుబ్రహ్మణ్యంగారూ, అవునండి నా వోటు భార్యామణికే -
ఐనా మీరు ఇలా పార్టీ ఫిరాయిస్తే ఎలానండీ ..
ఇప్పటికే చాలాకాలమ్గా - తలుపు తట్టగానే - నోరు తెరువు - గాలి బయటకు ఊదు - ఇత్యాది పరీక్షలుండగా - మీరు కొత్త సలహాలుకూడ చెబితే ఎలా చెప్పండి..
ఊకదంపుడు గార్కి,
రెండు బెనారస్ పాను లు బిగించేస్తే ఆ సమస్య తీరిపోతుంది సారూ. కానీ బ్రీత్ అనలైజర్స్ కొనకుండా జాగ్రత్తపడాలి.
ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి