చదువు ‘కునే’ కాలం అయినా చదువు ‘కొనే’ కాలం అయినా అది ప్రతీ మనిషి జీవితం లో
ఒక క్లిష్టమైన కాలం. మా కాలం లో ఒక 2 – 3 శాతం కొనే వాళ్ళున్నా మిగతా వాళ్ళంతా
కునే వాళ్ళే. కొనే వాళ్ళు కూడా మరీ
విచ్చలవిడిగా కొనే వాళ్ళు కాదు. రహస్యం గా పకడ్బందిగా అనుమానం రాకుండా కొనుక్కునే
వారు.
చదువు అనేది ఒక జబ్బు, అది పిల్లల తల్లి
తండ్రులకి వస్తుంది అని మా మిత్రుడొకడు నిర్వచనం చేసాడు. ఈ జబ్బు కూడా విచిత్రమైనది. పిల్లలు కనిపిస్తే
ఎక్కువయేది. "అల్లా అడ్డగాడిద లా తిరగక పొతే చదువుకో కూడదా" అని కేకలేసేవారు,
కనిపిస్తే . అవసరమైతే తప్ప వారి ముఖ్యం గా తండ్రి కంట పడకుండా తిరిగేవారు.
పిల్లలు వజ్రాలు, వాళ్ళని సాన బెట్టితే
ప్రకాశించేస్తారు. వూళ్ళో కరంటు లేకపోయినా
సమస్య ఉండదు అన్న అభిప్రాయం వాళ్ళది. ఈ సాన
పెట్టడానికి బడిలో
ఉపాధ్యాయులు అవిశ్రాంతంగా కృషి చేసేవారు.
సాన పెట్టడం లో వారు సాధారణం గా సామ, దండోపాయాలనే ఉపయోగించేవారు. వారికి దాన, బేధ
ఉపాయాలు ఆట్టే తెలియవు. సాన పెట్టడానికి గురువులు తమ తమ ఆయుధాలను పరమ పవిత్రం గా
పూజించేవారు. ఒకరు తమ చేతులనే నమ్ముకుంటే, కొందరు బెత్తాలను, మరి కొందరు డస్టర్ ను
ఉపయోగించే వారు. వాటి ప్రయోగాలను వివిధ రీతులలో చేసేవారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క
పధ్ధతి. వారి ఆయుధ ప్రయోగాలనుంచి తప్పించుకోవడం ఒక యుద్ధ కళ. అనుభవ రాహిత్యం వల్ల
పిల్లలు ఓడిపోయేవారు. జయం ఎప్పుడూ మాస్టారు గారిదే అయ్యేది.
ఇంటిలో తల్లితండ్రులు యధావిధి తోడ్పాటు అందించే వారు. కానీ తల్లి తండ్రులు నాలుగు ఉపాయాలూ వాడేవారు.
చదువు కోక పొతే ఎందుకూ పనికి రావు, మంచి ఉద్యోగం చెయ్యాలంటే బాగా చదువు కోవాలి,
పరీక్షల్లో మంచి మార్కులు వస్తే ఐస్ క్రీం కానీ మరొకటి కానీ ఇస్తాం,
చంద్రం గాడికి 70 మార్కులు వచ్చేయి, వెధవా సిగ్గులేదా నీకు 42 వచ్చా యేమిటి,
చచ్చు వెధవా చదువంటే ఇంత అశ్రద్ద ఎందుకురా, సరిగ్గా చదువుతావా లేదా అంటూ కఱ్ఱ పుచ్చుకోవడం.
తల్లి తండ్రులు చిన్నప్పటి నుంచి ఎందుకు ఆర్జన చేయమంటారో నాకు ఎప్పటికీ అర్ధం
కాదు. నాలుగున్నర, ఐదు ఏళ్లు రాగానే బడిలో వేసేస్తారు విద్యార్జన చేయమని. పడుతూ
లేస్తూ, తన్నుతూ పునాదులు గట్టి పరుచుకుంటూ ఏదో విధం గా చదువు పూర్తి చేసిన తరువాత
ఉద్యోగం చేసి ధనార్జన చేయమంటారు. ఉద్యోగం చేస్తుండగానో, కొండొకొచో ముందుగానో కూడా ప్రేమార్జన చేసుకోమని పెళ్లి చేసేస్తారు. ఆ
తరువాత సంతానార్జన చేయమంటారు. మధ్యలో సిగ్గు,
శరము ఆర్జించ మంటారు. పెళ్ళైన తరువాత ముఖ్యం గా మగవారు, అవి వదిలేస్తారు ట. సిగ్గు శరము లేకుండా పెళ్ళాం
కొంగు పట్టుకు తిరుగుతాడు అని అంటారు. మంచివాడు, బుద్ధిమంతుడు అనే పేరు ఆర్జన
చేయడం, చివరగా “హే భగవాన్ నేను బతికి
ఎవరికి లాభం” అంటూ భక్తార్జన. ఇలా జీవితమంతా ఏదో ఒకటి ఆర్జిస్తూనే గడచి పోతుంది. వీటన్నిటికి మూలం విద్యార్జన.
ఇతి ఉపోద్ఘాతః సమాప్తః.
(ఉపోద్ఘాతమే ఇంత ఘాతకం గా ఉంటే అని చదవడం ఆపకండి.)
నాలుగ్గున్నర ఏళ్లు పూర్తిగా నిండకుండానే, ఓ పలకా బలపం చేతిలో పెట్టి బడిలో పాడేశారు
నన్ను. అసలు నవంబర్ నెలలో పుట్టడమే ఒక పెద్ద పూర్వ జన్మ పాపం. ఇంట్లో అల్లరి తప్పించుకోటానికి , ఒక ఐదారు
నెలలు వయసు పెంచి ఐదు ఏళ్లు అని నొక్కి వక్కాణించి బోర్డ్ స్కూల్
అనబడే ఎలిమెంటరి బడిలో జేర్చేసారు. చేర్చిన తరువాత ఒక రెండేళ్ళు నా చదువు గురించి
పెద్దగా ఎవరూ పట్టించు కోలేదు. ఏదో నెలకి రెండు మూడు పలకలు, ఒక బలపం పాకెట్టు తప్ప
మా నాన్న గారిని ఎక్కువగా కష్ట పెట్టలేదు నేను. మూడో క్లాసు కి వచ్చేటప్పటికి మా
మాష్టారుకి నాకు అభిప్రాయ బేధాలు మొదలయ్యాయి.
స్రుష్టి అని నేను
వ్రాస్తే సృష్టి అని వ్రాయాలనే వారు. ఆరు మూళ్ళు
పదహారు అని నేనంటే కాదు పద్దెనిమిది అని దెబ్బలాడి దెబ్బలేసేవారు. మెల్లిగా
ఈ అభిప్రాయ బేధాలు తీవ్రమై నేను మా మాష్టారు తో మాట్లాడడం మానేసాను. ఆయన ఏమి
ప్రశ్న వేసినా మౌనంగా ఉండడం అలవాటు చేసుకున్నాను, బుఱ్ఱ గోక్కుంటూనో, ముక్కు బరుక్కుంటూనో. దీని ఫలితం గా ఎక్కువ
కాలం స్కూల్లో నేను బెంచి మీద నుంచునో, లేక బయట ఎండలో నుంచునో కాలం గడపడం ఎక్కువ
అయింది. మా మాష్టారుకి సమస్యలు సామరస్యం
గా పరిష్కరించుకునే ఉద్దేశ్యం లేకపోవడం వల్ల మా నాన్నగారికి విషయం
విశదీకరించి న్యాయం చేయమన్నారు. మా నాన్నగారు నా వాదన వినకుండానే, సంస్కృతం లో తిడుతూ నా శరీరం తో చెడుగుడు
ఆడుకున్నారు. ఇక్కడో విషయం మనవి చేసుకోవాలి. సాధారణంగా మా అమ్మగారికి, నాన్నగారికి అభిప్రాయ బేధాలు ఎక్కువగానే ఉండేవి. ఈ బేధాలు ఒక్కోటప్పుడు
తీవ్రం గానే ఉండేవి. కోపం ఎక్కువయితే మా నాన్న గారు అగ్ని బాణం వేసేవారు. మా
అమ్మగారు ఫైర్ ఇంజన్ బాణం వేసేవారు. ఆయన నాగ బాణం వేస్తే అమ్మగారు షేక్ చిన మౌలానా
బాణం వేసేవారు. ఆయన పర్వతాస్త్రం వేస్తే ఈమె ఎలాకాస్త్రం వేసేవారు. ఎక్కువగా మా
అమ్మగారు మా నాన్నగారు వేసే బాణాలు ఉపసంహరించే వారు అన్న మాట. ఇంకో విషయం కూడా
మీకు అర్ధం అయిఉండాలి. మా నాన్నగారివి
పాతకాలపు అలవాట్లు, మా అమ్మగారు కొంచెం ఆధునిక పోకడలు అలవాటు చేసుకున్నారన్న
మాట. కానీ, నా చదువు విషయం లో ఆమె మా
నాన్నగారితో ఏకీభవించేవారు. “వెయ్యండి
వెధవని ఇంకో రెండు, చదువుకోక గాడిదలను కాస్తాడటా” అంటూ ఇంకా ఉత్సాహ పరిచేవారు. మా నాన్నగారు
ద్విగుణీకృతోత్సాహం తో మా మాష్టారుకి నా శరీరం మీద సకల హక్కులు ప్రదానం చేసేసారు. మొత్తం
మీద మా మాష్టార్లు నా వీపు, తొడ,
ఉద్యద్దినకరుడు లాగ ప్రకాశింప చేసి నాలుగో క్లాసు కూడా అయిందనిపించేసారు.
నా పీడ వదిలించు కోవడానికి నాలుగు లో నాకు బోల్డు మార్కులు వేసి, “ఐదో క్లాసు
చదవఖ్ఖర్లేదు, తీసుకెళ్ళి 1st. ఫారం లో చేర్పించేయండి” అని సలహా ఇచ్చి ఊపిరి పీల్చుకున్నారు. మా నాన్నగారు హైస్కూల్ లో ఉపాధ్యాయుడు గారు
కాబట్టి నాకు ప్రవేశం దొరికి పోయింది హైస్కూల్ లో.
హైస్కూల్ చదువు నా జీవితం లో నాకు ఎన్నో
పాఠాలు నేర్పింది. ఇన్ని పాఠాలు నేను నేర్చుకోవడానికి కారణం మా నాన్నగారు ఆ స్కూల్
లోనే ఉపాధ్యాయుడు కావడమే. తల్లితండ్రులు పని చేస్తున్న స్కూల్ లో చదవడం కన్నా
కష్టమైనది మరొకటి లేదని నా దృఢ నమ్మకం. చేరిన రెండు మూడు నెలల్లోనే నాకు పండిత పుత్రః
అనే బిరుదు ఇచ్చేసారు మాష్టార్లు. మాష్టార్ల పుత్రులు
అందరికీ ఆదర్శంగా ఉండాలని అనుకునేవారు. మనం క్లాసులో అల్లరి చేయడానికి కుదరదు. చేస్తే కబురు వెళ్ళిపోయేది.
మా నాన్నగారు వహ్వ తాజ్ అనిపించేసేవారు. క్లాసు
బయట అల్లరి చేసినా గురువులకు తెలిస్తే, మా
నాన్నగారు ఉస్తాద్ అల్లా రాఖా అయిపోయి నన్ను పండిట్ జస్రాజ్ ని
చేసేసేవారు. ఆయన వాయించేస్తుంటే మనం
రాగాలాపన చేసేవాళ్ళం అన్నమాట.
మనం మొదటి వరస లోనే కూచోవాలి. మాష్టార్లు అడిగిన వాటిలో కనీసం 60 – 70 శాతం
ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. లేకపోతే కబురు వెళ్ళిపోయేది. నేను నాలోని ఘంటసాల ని మేల్కొల్పాల్సి వచ్చేది. ఎంత తెలుగు
మాష్టారు గారి అబ్బాయి అయినా, మూడవ ఫారం
చదువుతుంటే మట్టుకు, ‘శరజ్జ్యోత్స్న’ అని
వ్రాయడం కుదురుతుందా అని
ప్రశ్నిస్తున్నాను. (ఇంతకీ ఇప్పుడైనా సరిగ్గా వ్రాసానా ?) అక్బర్ బాదుషా గారి కొడుకు పేరు నాకు తెలియకపోతే చరిత్ర మారిపోతుందా
? కిరణ జన్య సంయోగ క్రియలో ఏ వాయువు విడుదల అవుతుందో నేనూ చెప్పలేకపోతే చెట్లు
బతకవా? రోజంతా ఏడిస్తే కానీ రెండు జీళ్ళు
కొనుక్కోడానికి ‘కానీ’ సంపాయించ లేని నాకు వడ్డీ లెఖ్ఖలు తెలియక పొతే దేశానికి వచ్చే
నష్టం ఏమిటట? అకేషన్ లో రెండు యస్ లు
పెడితే దాని అర్ధం మారిపోతుందా? ఎన్నో
జవాబు లేని ప్రశ్నలు నా బుఱ్ఱ లో సుడులు తిరిగేవి. మా మాష్టర్లు మట్టుకు
నెత్తి మీద మొట్టికాయలు వేస్తూనే ఉండేవారు. ఇంట్లో నాన్నగారు కోప్పడేవారు నేను తప్పుచేస్తే. అదే స్కూల్ లో తప్పుచేస్తే క్రుద్ధులు
అయిపోయేవారు. అర్ధం అడగకండి. వారు క్రుద్ధులు
కాకుండా చూసుకునే గురుతర బాధ్యత నాకు ఉండేది. ఇటువంటి కారణాల వల్ల నేను స్కూల్లో బుద్ధిమంతుడు
గా ఉండవలసిన అగత్యం ఏర్పడింది. గురువులకు కోపం తెచ్చే పనులు ఏమి చేసేవాడిని కాను.
బెమ్మాండం గా కాకపోయినా మంచి మార్కులే వచ్చేటట్టు చదివే వాడిని. క్లాసులో మొదటి
ముగ్గురు లోనే ఉండేవాడిని.
ఇక్కడ, నేను మూడవ ఫారం చదువుతుండగా జరిగిన విషయం ఒకటి చెప్పాలి. ఆ
ఏడు మా స్కూల్లో ఒక కొత్త అమ్మాయి చేరింది. పేరు మంగ తాయారు. అప్పటిదాకా మా
క్లాసులో ఆరుగురు అమ్మాయిలు ఉండేవారు.
వీళ్ళలో నలుగురు చిన్నప్పటి నుంచి మా తోటి దెబ్బలాడి సిగపట్లు పట్టిన తింగరి బుచ్చిలు.
ఇంకో ఇద్దరు పుర ప్రముఖుల పిల్లలు. వాళ్ళ జోలికి వెళ్ళితే వీపు మీద రాండోళ్ళు
మోగుతాయనే భయం ఉండేది. మంగ తాయారు రాకతో మాకు ఒక హీరోయిన్ దొరికినట్టు ఫీల్
అయ్యాం. ఆ అమ్మాయి కొంచెం నాజుకుగా డ్రెస్
వేసుకునేది. అంటే మీరు మరోలా అనుకోవద్దు. ఆ అమ్మాయి అప్పుడప్పుడు పరికిణీలు
వేసుకున్నా ఎక్కువగా ఫ్రాక్స్ వేసుకోనేది. మిగతా మలయాళాలు పరికిణీలు ఎక్కువ, తక్కువగా గౌన్లు వేసుకునేవారు. గౌను అంటే పొడుగులో ఫ్రాక్ కి ఎక్కువ పరికిణీకి తక్కువా అన్నమాట. వాళ్ళు
వేసుకునే గౌను ఒక ఆరేడు నెలలు అయే టప్పటికి వెలిసి పోయిన ఫ్రాక్ అయేది. కానీ
అప్పటికే వారి చుట్టుకొలతలు మారడం వల్ల అది వదిలేసి మళ్ళి ఇంకో గౌను కుట్టించుకునే వారు, వదులుగా, మోకాళ్ళ కిందకి
ఒక జానెడు ఉండేటట్టు. అదృష్టవశాత్తు, తాయారు ఇల్లు మేం స్కూల్ కు వెళ్ళే దారిలోనే ఉండేది. రోజూ ఆ
అమ్మాయి వెనకే వెళ్ళేవాళ్ళం. నేను పాట పాడేవాడిని “ఓ చందమామ రెండు జడల భామ ఏమన్నదో
తెలుపుమా” అంటూ. మా బండోడు టింగ్ టింగ్ అంటూ గిటారు, బుజ్జిగాడు డం డం డడం అంటూ
తబలా, టుయ్ టుయ్ టుయ్ అంటూ శేఖర్ గాడు వీణ, చంద్రం గాడు తూ తూ తూ అంటూ తూతూపాకా
వాయించేవాళ్ళు. ఒక రోజున తాయారు రెండు జడలలోను రెండు గులాబీలు పెట్టుకుని
వచ్చింది. మాములుగానే మేము కొంచెం దూరం లో నిలయ విద్వాంసుల సంగీత సమ్మేళనం తో వెంట
నడుస్తున్నాం. ఉన్నట్టుండి ఒక గులాబీ జారి కింద పడింది. నేను నడకలాంటి పరుగుతో
వెళ్లి అది తీసుకున్నాను. పాపం, తాయారు గులాబీ నేను
ఇస్తాననుకుంది. నేను ఇవ్వలేదు. ఆ గులాబి పంచుకోవడం లో ప్రాణ మిత్రుల మధ్య అభిప్రాయ
బేధాలు వచ్చేసాయి. చివరికి రేకలు పీకి అందరం పంచుకున్నాం. నాకు రెండు రేకలు వచ్చాయి. అప్పుడే నేను విజ్ఞాన
శాస్త్రం లో ఒక గొప్ప విషయం
కనుక్కున్నాను. లెఖ్ఖల పుస్తకం లో పెట్టిన గులాబి రేకలు ఎక్కువ కాలం ఎండకుండా
ఉంటాయి. మిగతా పుస్తకాలలో పెడితే త్వరగా ఎండిపోతాయి. ఈ ఆవిష్కరణ ప్రాముఖ్యత అప్పుడు మాకు తెలియ లేదు
కానీ చిన్న సైజు నోబుల్ బహుమతి వచ్చి ఉండేదేమో.
స్కూల్లో డిబేట్ లలో పాల్గొనేవాడిని.
అక్కడ వితండ వాదనలు చేసేవాడిని. కత్తి గొప్పదా కలం గొప్పదా ? అనే చర్చలో నేను
కత్తి గొప్పదనే వాడిని. కలం గురించి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా కత్తి పోటు
తగిలితే కానీ దాని గొప్పతనం తెలియదు అని వాదించే వాడిని. స్త్రీ కి స్వాతంత్ర్యం
కావాలా వద్దా అనే విషయం లో అసలు మా వీధిలో స్వాతంత్ర్యం ఉన్న పురుషుడిని
చూపించమన్నాను. మా వీధిలో మా స్కూల్
మాష్టార్లు ఐదుగురు ఉండేవారు. మా మాష్టార్లు నవ్వి ఊరుకున్నారు కానీ వీపు మీద
విమానాలు నడపలేదు.
నాలుగవ ఫారం కి వచ్చేటప్పటికి చాలా మంది అమ్మాయిలు ఎవరూ మాతో మాట్లాడేవారు
కాదు. మా ముందు నడిచే వారు కాదు. గుంపుగా ఏ మాష్టారు పక్కనో వెళ్ళేవారు. పుస్తకాలు
కావాల్సి వచ్చినా మాష్టారు మధ్యవర్తిగా ఉండేవారు. మా దగ్గర తీసుకొని వాళ్లకు
ఇచ్చేవారు. మా తింగరి బుచ్చిలు కూడా “అత్తయ్య గారూ, ప్రద్యుమ్నుడి పుస్తకం కావాలి”
అని పట్టుకెళ్ళేవారు, నేను ఇంట్లో లేనప్పుడు.
ఉన్నట్టుండి మేము అంటరాని వారి గా ఎందుకయ్యామో కొంత కాలం అయిన తరువాత కానీ
తెలియలేదు. మమ్మల్ని కూడా రాజనాల లాగే
గుర్తించారా అని విస్మయ పడ్డాం.
ఐదు, ఆరు ఫారం లకు వచ్చేటప్పటికి మా
మాష్టార్లు కూడా మాకు గౌరవం ఇవ్వడం మొదలు పెట్టారు. మిమ్మల్ని కొడితే మా చేతులే
నొప్పి పెడతాయిరా అనేవారు నవ్వుతూ. కధకళి చేయించేవారు కాదు. ఎప్పుడైనా తప్పకపోతే, వచన
కవిత్వం మాత్రమే ఉపయోగించేవారు. కష్టపడి
స్కూల్ చదువులు గట్టేక్కించేసాము.
కాలేజి కొచ్చిం తరువాత కొన్ని రూల్స్ మారుతాయి. మనం కుఱ్ఱ చేష్టలు మానేసి పెద్ద
మనిషి తరహా అలవరుచుకోవాలి. జేబులో
బఠానీలు, బల్లి గుడ్లు ఉండరాదు. జీళ్ళు నోట్లో సాగ దీయకూడదు. నలుగురూ
చూస్తుండగా ఐస్ ఫ్రూట్ చీకరాదు, పిడత కింద
పప్పు తినరాదు. సినిమాకి వెళితే కుర్చీ లోనే కూర్చోవాలి. చిప్స్ మాత్రమే తినాలి.
సోడాలు తాగవచ్చును కానీ గోల్డ్ స్పాట్
గౌరవ ప్రదం. అన్నట్టు అసలు విషయం, నిక్కర్ల నుంచి ఫేంట్లకి ఎదుగుతాం. కాలికి
చెప్పులు వస్తాయి.
మనం మనం గా ఉండే అవకాశాలు తగ్గిపోతాయి. బరువు బాధ్యతలు అర్ధం అవుతూ ఉంటాయి.
మధ్య తరగతి బతుకుల లోని సున్నితమైన అంశాలు ముఖ్యంగా ఆర్ధికమైనవి గ్రహింపుకు వస్తుంటాయి. తండ్రి ఒక రూపాయి మనకి
ఇస్తే మనం ఎంత సంతోషిస్తామో, ఇవ్వలేక పోతే అంతకు రెండు రెట్లు ఆయన బాధపడుతారని
అర్ధం చేసుకుంటాం. కోరికలు, అవసరాలు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నాలు
చేస్తుంటాం. బాల్యం లో ఉన్న స్వేచ్చ, అమాయకత్వం, నలుగురి తో
కలిసి పోయే స్వభావం తగ్గుతుంది. ఒక
స్పాంటేనియటి కోల్పోతాం. అల్లరి మీద కన్నా
చదువు మీద శ్రద్ధ పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తాం.
మా ఊరి కాలేజి లో ఒక ఏడాది ప్రీ యూనివర్సిటి
కోర్స్, ఆ తరువాత ఆంధ్రా యూనివర్సిటి లో నాలుగేళ్ల బి.యస్సి.(ఆనర్స్), ఇంకో ఏడాది యం.యస్సి. చేసి దేశం మీద పడ్డాం
పొట్ట చేత్తో పట్టుకొని. ఈ ఆరేళ్ళ కాలేజి చదువులోనూ అల్లరి చేసాం. యుద్ధాలు చేసాం.
స్నేహితులతో కలసి ఆనందించాము. కానీ
ఆలోచించకుండా ఏది చెయ్యలేదు, స్నేహం కూడా.
కాలేజి రోజులు మధురం గానే ఉన్నాయి.
అక్కడ మా అంతట మేమే ఎదిగాం ఎక్కువగా. మాకేమి తెలియని రోజుల్లో స్కూల్లో మమ్మల్ని
తీర్చి దిద్దారు మా మాష్టర్లు. మమ్మల్ని తిట్టినా, కొట్టినా మేము నాలుగు ముక్కలు
నేర్చుకోవాలనే తపనే కనిపించేది వారిలో. మంచి, చెడు చెప్పేవారు.
అన్నట్టు, చదువు అయిన తరువాత మొదటి
ఉద్యోగం లో చేరడానికి వెళ్లేముందు, నా చేత
అక్షరాలు దిద్దించిన ఎలిమెంటరీ స్కూల్ మాష్టారుకి పాదాభి వందనం చేయించి మరీ పంపారు మా
నాన్నగారు.
56 కామెంట్లు:
అహహహ అప్పుడు అర్ధం కాలేదు కానీండి అప్పుడు రాండోళ్ళు మోగాయి కనకే ఈవేళ ఇలా ఉన్నాం. మంచి వర్షపు రోజు రాండోళ్ళు గుర్తు చేసేరు.తర్వాత మనం చేసినదేంటో :)
nenu kuda maa school lo telugu master abbaini..
okasari ala flash back loki theeskellipoyaru..
హ హ సూపర్ పోస్టండి . ప్రతీ లైన్ మళ్ళీ మళ్ళీ చదివా ! మీ పోస్తులన్నిటి లో ఇది the best !
" అంటే మీరు మరోలా అనుకోవద్దు......" తెలిసింది మాస్టారూ..... ఇంక అనుకోడానికి ఏం మిగిలిందీ....
bhagundandi, mee chaduvu katha,
rendu, moodu bhagalu cheyalsindi,
chinna serial la , inka bhagundedi.
>>లెఖ్ఖల పుస్తకం లో పెట్టిన గులాబి రేకలు ఎక్కువ కాలం ఎండకుండా ఉంటాయి. మిగతా పుస్తకాలలో పెడితే త్వరగా ఎండిపోతాయి. ఈ ఆవిష్కరణ ప్రాముఖ్యత అప్పుడు మాకు తెలియ లేదు కానీ చిన్న సైజు నోబుల్ బహుమతి వచ్చి ఉండేదేమో
సూపర్ గురువు గారు :)
మనం మనం గా ఉండే అవకాశాలు తగ్గిపోతాయి. బరువు బాధ్యతలు అర్ధం అవుతూ ఉంటాయి. మధ్య తరగతి బతుకుల లోని సున్నితమైన అంశాలు ముఖ్యంగా ఆర్ధికమైనవి గ్రహింపుకు వస్తుంటాయి. తండ్రి ఒక రూపాయి మనకి ఇస్తే మనం ఎంత సంతోషిస్తామో, ఇవ్వలేక పోతే అంతకు రెండు రెట్లు ఆయన బాధపడుతారని అర్ధం చేసుకుంటాం. కోరికలు, అవసరాలు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాం. బాల్యం లో ఉన్న స్వేచ్చ, అమాయకత్వం, నలుగురి తో కలిసి పోయే స్వభావం తగ్గుతుంది. ఒక స్పాంటేనియటి కోల్పోతాం. అల్లరి మీద కన్నా చదువు మీద శ్రద్ధ పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తాం.
Epic!
చదువు అయిన తరువాత మొదటి ఉద్యోగం లో చేరడానికి వెళ్లేముందు, నా చేత అక్షరాలు దిద్దించిన ఎలిమెంటరీ స్కూల్ మాష్టారుకి పాదాభి వందనం చేయించి మరీ పంపారు మా నాన్నగారు. excellent.fantastic finishing.
చాలా బాగుంది సార్!
దాదాపు నాదీ మీ పరిస్థితే! మా అమ్మ కాదు కానీ, మా పిన్ని మా స్కూల్లో తెలుగు టీచరు! పదో తరగతి వరకూ మనకి విముక్తే లేదు. ఎప్పుడైనా పరీక్షలో మార్కులు తక్కువొచ్చి ఇంట్లో చెప్పకుండా మేనేజ్ చెయ్యగలమన్న ఆశే లేకుండా సాగిపోయాయి అన్నేళ్ళూ!
శారద
విద్య విలువ ఆనాటి కన్నా తరువాతే బాగా తేలుస్తుంది.మానాన్నగారు కూడా ఉపాధ్యాయులు మీరు పడ్డ బాధలే నేను పడ్డా.పొస్ట్ చాలా బాగుంది
నేను కామెంట్ పెట్టేలోపు ఇంకో నేస్తం కామెంటేసారు :)
బాగుంది మాస్టారు..ఎప్పటిలాగే:)
చాలా బావుందండి..
>>గురువులు తమ తమ ఆయుధాలను పరమ పవిత్రం గా పూజించేవారు. ఒకరు తమ చేతులనే నమ్ముకుంటే, కొందరు బెత్తాలను, మరి కొందరు డస్టర్ ను ఉపయోగించే వారు
మా మాస్టారు ఒకాయన స్వయంగా దళసరి చెక్కతో చేయించిన ఒక స్కేలు లాంటి ఆయుధాన్ని వాడేవారండి..
>>తల్లితండ్రులు పని చేస్తున్న స్కూల్ లో చదవడం కన్నా కష్టమైనది మరొకటి లేదని నా దృఢ నమ్మకం
ఈ కష్టం మనకన్నా బాగా చదివేవాళ్ళు ఉన్నప్పుడు మరింత పెరుగుతుంది అని నా స్వానుభవం :)
>>మమ్మల్ని తీర్చి దిద్దారు మా మాష్టర్లు. మమ్మల్ని తిట్టినా, కొట్టినా మేము నాలుగు ముక్కలు నేర్చుకోవాలనే తపనే కనిపించేది వారిలో
ఈ రోజుల్లో లాగా పిల్లల్ని కొట్టిన మాస్టారులను, మీడియాకు ఎక్కించి, కేసులు పెట్టె సంస్కృతి లేదండి నేను చదువుకున్నప్పుడు కూడాను.
ఎప్పుడయినా గట్టిగా దెబ్బతగిలి ఇంట్లో చెబితే, ఇంకో రెండు తగిలించండి అనే వాళ్ళే తప్ప మాస్టార్లను ప్రశ్నించేవాళ్ళుకారు.
సమాజంలో గురువులకున్న గౌరవం మరే ఉద్యోగికి ఉండేది కాదు.
>>అక్షరాలు దిద్దించిన ఎలిమెంటరీ స్కూల్ మాష్టారుకి పాదాభి వందనం చేయించి మరీ పంపారు మా నాన్నగారు.
తస్మైశ్రీ గురవే నమః
ప్రతి వాక్యం మళ్ళీ మళ్ళీ చదివాను. ఆనాటి రోజులను మీ శైలిలో అద్భుతంగా చెప్పారు.
Very good autobiography. Enjoyed reading it. I always wonder why do drawing masters are the drill / NCC/ NSS masters also? If you had trouble with them, there is no escape till the time you leave school unlike other teachers. Other profession that has multitalented are the barbers that are musicians for marriages. ;)
చాల ఎంజాయ్ చేసాను మీ జీవిత చరిత్రలో మీ చదువు అనే అంకము చదివి :)నిజమే కదా చదువుకునే రోజులే బాగున్నాయి కొనే రోజులకన్నా
మళ్ళీ స్కూల్ రోజులన్నింటినీ కళ్ళముందుకు ఎంతో అందంగా తెచ్చారు. అభినందనలు..
Enta baagaa raasaarandi....chaalaa saarlu chadivaanu. Chadivi , chadivi navvukunnannu. "tingara buchchi " anatam maatram baaledu sumi!!! Nice post....
good, you are leaving good massage to the new students how to behave with the MASTERS.
good ,you are leaving good massage to the new students that how they should give respect to their MASTERS.
good story,good massage,It is the good lesson to the new students.
కష్టేఫలే గారికి,
ఆ తరువాత ఏమిచేసాం అంటే, ఉద్యోగంలో చేరిన వెంటనే అన్నగారిని బతిమాలి, ప్రాధేయపడి, బెదిరించి పెళ్ళికి ఒప్పించాం. వారు చేసుకున్న తరువాత నేను కూడా సాగరం లో దూకేసాను. ఇదిగో ఇప్పుడు ఇలా కూచుని, పెళ్ళికి ముందు రోజులు తలుచుకొని తలుచుకొని దుఃఖిస్తున్నాను...........దహా.
‘’’నేస్తం... గారికి,
బ్లాగుల్లో మాష్టార్ల అబ్బాయిలు/ అమ్మాయిలు చాలా మందే ఉన్నాం. ఓ సంఘం పెట్టుకుందామా ? కష్టాలు చెప్పుకోడానికి. ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.
శ్రావ్య గారికి,
ధన్యవాదాలు. మీరిచ్చిన కాంప్లిమెంట్ కి ఇంకా గాలిలోనే తేలుతున్నాను. ........దహా.
హరేఫాలా గారికి,
అనండి మాష్టారు అనండి. మీకు దొరికిన తరువాత ఏమి చెయ్యగలను. గోడ కుర్చీ వేయమంటారా ?
ధన్యవాదాలు.
the tree గారికి,
ధన్యవాదాలు మీ సలహాకి. ఇకపై ఐదారు వందల పదాల కన్నా ఎక్కువ వ్రాయను ఒక టపాలో. మూడు భాగాలుగా వ్రాస్తే చదవడానికి ఈజీ, పైగా బ్లాగ్ ట్రాఫిక్ మూడు రెట్లు పెరుగుతుంది.
హరేకృష్ణ గారికి,
హహాహ్హ, మీ బ్లాగులో ఒకమాటు తీసుకున్నాను. ఇది రెండో నోబెల్ నాకు.
సరదాగానే మొదలు పెట్టానండి. అనుకోకుండా కొన్ని చోట్ల కాస్త గంభీరంగా వచ్చింది. పూర్తి అయిన తరువాత మళ్ళీ మార్చబుద్ధి కాలేదు. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
రాజేంద్ర కుమార్ గారికి,
తొలి గురువు గారిని ఎప్పటికీ మరిచిపోలేము. ధన్యవాదాలు.
రహ్మానుద్దిన్ షేక్ గారికి,
దహా. ధన్యవాదాలు.
sbmurali గారికి,
ధన్యవాదాలు. మాకైతే నాలుగు అక్షంతలు రెండు దెబ్బలు పడిన తరువాతే మార్కులు తెలిసేవి.,,,, దహా.
రమేష్ బాబు గారికి,
ధన్యవాదాలు. మాష్టర్ల పిల్లలందరిది ఒకటే కధ.
నేస్తం గారికి,
ధన్యవాదాలు. మీ కామెంటు ఆలస్యమైనా అమృతమే ....... దహా.
శ్రీ గారికి,
ధన్యవాదాలు. నిజమేనండి, ఈ కాలం విద్యా విధానం సంతృప్తికరం గా లేదు. గురువు లలో కూడా మార్పు వచ్చింది. అంత శ్రద్ధ లేదు.
పరికిణీ, గౌను, ఫ్రాక్ ల మధ్యన గల తేడాల గూర్చి సవివరంగా రాశారు. ధన్యవాదాలు... దహా!
ఈ టపా మీ శైలికి కొంచెం భిన్నంగా.. గంభీరంగా ఉంది. ఐనా చాలా బాగుంది.
నాకెందుకో ఒక టెస్టు మ్యాచ్ ఆడటానికి సరిపోయంత విషయాన్ని.. ట్వెంటీ ట్వెంటీ మ్యాచ్ కి కుదించినట్లుగా అనిపించింది. ఇది విమర్శ కాదు. నా observation మాత్రమే. గ్రహించగలరు.
మీ బ్లాగు రెండు మూడు సార్లు చదివిన తరవాతే కామెంట్ రాస్తుంటాను. కాబట్టి నా కామెంట్ లేటుగా వస్తుంటుంది. అదీ విషయం!
ప్రతీ లైనూ మళ్ళీ చదివా. చాలా బాగుంది. నేను చిన్నప్పుడే పేచీ పెట్టి మరీ మా వాళ్ళు లేని స్కూల్లో చేరాను. అయినా సరే ప్రతీదీ ఇంటికెళ్ళిపోయేది. ప్రతీ మాష్టారూ మా ఇంట్లో ఎవరో ఒకరి స్టూడెంటో, వాళ్ళ గోళ్ళు విడిచిన చుట్టాలో లేదా వాళ్ళ స్నేహితులో మొత్తానికి నాకు ప్రశాంతత లేకుండా పోయింది. దీని కన్నా మనవాళ్ళ దగ్గరే ఉత్తమం అని మళ్ళీ వాళ్ళు ఉన్న స్కూలికే వచ్చేసాను:( ఆఖరి వాక్యాలు చాలా కదిలించాయి. అక్షర సత్యాలు.
జ్యోతిర్మయి గారికి,
ధన్యవాదాలు. మళ్ళీ ధన్యవాదాలు.
చాతకం గారికి,
ధన్యవాదాలు. మా కాలం లో డ్రిల్ మాష్టారు వేరు, క్రాఫ్ట్స్ అండ్ డ్రాయింగ్ మాష్టారు వేరుగానే ఉండేవారు. ఇది పూర్తిగా ఆటో బయాగ్రఫి కాదండి. కొంచెం కొంచెం సత్యం, కొంచెం కొంచెం డబ్బా, కొంచెం కొంచెం కల్పితం. సరదాగానే వ్రాస్తున్నవి. వీలైతే ఈ పాత కధలు కూడా చూడండి.
http://bulususubrahmanyam.blogspot.in/2011/03/blog-post.html
http://bulususubrahmanyam.blogspot.in/2012/02/blog-post.html
చిన్ని గారికి,
ధన్యవాదాలు. చదువుకునే రోజులు ఎప్పుడూ బాగానే ఉంటాయండి.
శ్రీ లలిత గారికి,
ధన్యవాదాలు. మాష్టార్ల కన్ను గప్పి అల్లరి చేయడం చాలా బాగుండేది.
జలతారు వెన్నెల గారికి,
ధన్యవాదాలు. కొంతమంది అమ్మాయిలని తింగర బుచ్చి అనేవాళ్ళం. అప్పుడప్పుడు వెనక్కాల నుంచి మొట్టేసేవారండి ఆ కాలంలో కూడా........ దహా.
రామకృష్ణ ప్రసాద్ గారికి,
తల్లిదండ్రుల అతిగారాబం వల్లే బహుశా కొంతమంది పిల్లలు విలువలు పట్టించుకోవటం లేదేమో. ఉపాధ్యాయులు కూడా మారారు. పాత కాలం తో పోలిస్తే ఉపాధ్యాయులలో ఆ డెడికేషన్ తగ్గిందేమో. ఉపాధ్యాయుని బట్టి గూడా గౌరవం ఉంటుందేమో. చెప్పడం కష్టం. పూర్తిగా విద్యార్దులనే తప్పు పట్టలేమేమో. తల్లితండ్రులు ఆలోచించాలి, విలువలు నేర్పాలి. ధన్యవాదాలు.
అనానిమస్ గారికి,
ధన్యవాదాలు.
చాలా చాలా చక్కగా రాశారు. మా ఇంట్లో ఎవరు టిచర్ గా పని చేయలేదు కనుక ఇటువంటి కష్ట్టాలు ఉంటాయని తెలియదు. నాకు లెక్కలు ఒక్కటే ఇష్ట్టమైన సబ్జేక్ట్, తక్కువగా శ్రమతో ఎక్కువ మార్కులు వచ్చే సబ్జేక్ట్ అదొక్కటె అని ఆరోజులలో నా అభిప్రాయం.
SriRam
రమణ గారికి,
ఆకాలం లో మోకాలు దాకా ఉంటే ఇంగ్లిష్ స్టైల్ లో ఫ్రాక్ అని జానెడు పైగా కిందకి ఉంటే తెలుగు స్టైల్ లో గౌను అనేవాళ్ళం. అంతకు మించి తేడా నాకు తెలియదు.........దహా.
కొంచెం గంభీరంగా, అనుకోకుండా వచ్చేసిందండి. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
తిరిగి చూసుకుంటే, టపా నిడివి ఎక్కువైంది అని అనిపించింది. కొంత అనవసరమైనది కూడా చేరింది అని కూడా అనిపించింది. ముందు ముందు తగు జాగ్రత్తలు తీసుకుంటాను. ధన్యవాదాలు.
రసజ్ఞ గారికి,
రోలు వెళ్లి మద్దెల తో మొర పెట్టుకున్నట్టుంది, మీ కధ. నేను యూనివర్సిటీ కెళ్ళినప్పుడు, ఆహా, నాకు కూడా స్వాతంత్ర్యం వచ్చేసింది అనుకున్నాను. కాని, పెనం మీద నుంచి పొయ్యి లోకే వెళ్లానని తెలిసింది. ఫార్మసీ dept., తెలుగు dept., లో ఇద్దరు ప్రొఫెసర్స్ మేనమామలు, ఒకరి భార్య ఫిజిక్స్ dept., లో ప్రొఫెసర్, ఒక కజిన్ Ph.D చేస్తున్నాడు. ఇంకోడు ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అటుపై నా కధ మీరు ఉహించుకోండి...........దహా.
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.
శ్రీరాం గారికి,
లెఖ్ఖలు నాకు ఎప్పుడూ కష్టమైన సబ్జెక్ట్ అనే అనిపించేదండి. ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.
నేను మా నాన్నగారు పని చేసే బడిలో చదవక పోయినా... మా బడిలోని టీచర్లలో సగం మంది నాన్నగారికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో శిష్యులే. పరీక్షల్లో మార్కులు తగ్గితే చాలు, ఓదార్పు యాత్రలే.
చాలా బాగుంది. మీరు లాస్ట్ లో చెప్పిన ఆ నలుగు ముక్కలు the best. తండ్రి ఒక రూపాయి మనకి ఇస్తే మనం ఎంత సంతోషిస్తమో , ఇవ్వకపోతే దానికి రెండు రెట్లు అయన బాధపడతారని అర్ధం చేసుకుంటాం.
ఇప్పటకి నాకు ఇలాంటివి ఎన్నో గుర్తున్నాయి.తీపి గుర్తులో, చేదు గుర్తులో తెలియదు. కాని ఆ రోజులు మల్లి వస్తాయమో అని హడలి పోతుంటాను అప్పుడప్పుడు.
చాలా బాగున్నాయి మీ అనుభవాలు...
మాతో పంచుకున్న మీ అనుభూతులు బాగున్నాయి సుబ్రహ్మణ్యం గారూ!
@శ్రీ
మీరు నన్ను గారు తో సంభోదించవలసిన అవసరం లేదు. వయసులో ఎంతో చిన్న వాడిని. ఒకప్రశ్న ఇంతకి తింగర బుచ్చి అంటే అర్థం ఎమీటి? ఈ మాటను చిరంజీవి శ్రీదేవి ని పట్టుకొని నువ్వు తింగర బుచ్చి వనుకొన్నా మదపిచ్చి కూడా ఉంది నీకు అని జ.వీ.అతిలోక సుందరి సినేమా లో అంటాడు. అప్పుడు విన్నాను మొదటిసారిగా! ఇది ఏ జిల్లా మాండలీకమో మీకు తెలిస్తే రాయండి.
SriRam
మీ బాల్యం, చదువు విషయాలు చాలా బాగున్నాయి. ఆద్యంతం ఆసక్తి,హాస్య భరితంగా..ఉన్నాయి కాని మీ కష్టాలు బాధాకరమే! .
లెఖ్ఖల పుస్తకం లో పెట్టిన గులాబి రేకలు ఎక్కువ కాలం ఎండకుండా ఉంటాయి. మిగతా పుస్తకాలలో పెడితే త్వరగా ఎండిపోతాయి
దీన్ని బట్టీ చూస్తే మీ లెక్కల భాషా పరిజ్ఞానం మీద కాస్త అనుమానంగానే ఉంది.....
టపా చాలా చాలా బాగుంది... :-)
పురాణపండ ఫణి గారికి,
మాష్టార్ల సంతాన సంఘం ఒకటి అర్జంటు గా పెట్టేయాలనుకుంటాను. అందరి కధలు/వ్యధలు ఒకేలా ఉన్నాయి......దహా.
ధన్యవాదాలు.
అనానిమస్ గారికి,
కష్టాలు ఎప్పుడూ ఉంటాయండి. సినిమాకి వెళ్ళడానికి రెండు రూపాయలు లేవని బాధ పడిన రోజులకి, ముచ్చటగా , ముద్దుగా భార్యామణి అడిగితే చీరల కొట్టుకు వెళ్ళలేక విచారించిన రోజులకి పెద్దగా తేడా కనిపించదు నాకు..........దహా.
ధన్యవాదాలు.
శ్రీ గారికి,
ధన్యవాదాలు.
శ్రీరాం గారికి,
తింగర బుచ్చి అంటే, వంకర టింకరగా, అసంబద్ధంగా ప్రవర్తించే వాళ్ళు, మాట్లాడేవాళ్ళు అనే అర్ధం తో ఎక్కువగా వాడుతారు, నాకు తెలిసి నంత మట్టుకు. తింగరి, తింగరి బుచ్చి, గోదావరి జిల్లాలలో విరివిగానే వాడుతారు. ఎక్కడిది అంటే నాకు తెలియదు. ధన్యవాదాలు.
వనజ వనమాలి గారికి,
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
మాధవి గారికి,
గూడార్ధం కని పెట్టేసారా. లెఖ్ఖల పుస్తకాలు తెరిచేది తక్కువ. ధన్యవాదాలు.
A Different Bulusu... చాలా కాలం తర్వాత మీ బ్లాగు చూసా.. అఫ్కోర్స్ ఈ మధ్య ఏ బ్లాగూ చూడలేదు అనుకోండి.. నవ్వడానికి ప్రిపేర్ అయిపోయి కూర్చున్నా... మామూలుగా ఉండే హాస్య రసం ఉంది. కాని ఏదో మనస్సుకు తగులుతోంది.. చాలా తమాషాగా నడిపించారు.. చూసి, చదివి, స్పందించి ఎంతో మంది వ్రాసాక మళ్లీ ఈ పిచ్చాడేంటి వ్రాసేది అనుకోకండి.. మీ రచనల పట్ల పిచ్చి తప్ప మరోటి కాదు... మీ ఈ రచనలో హాస్య శృంగారాలు సున్నితంగా అందంగా కనపడుతున్నాయి. ఎలిమెంటరీ అండ్ హైస్కూల్ చదువులా చెప్తూనే... జీవితాన్ని చదివిన తీరు, అది చెప్పినతీరు... శ్లాఘనీయం.. ఎక్కువ వ్రాయను.. అశక్తుణ్ణి.. కంగ్రాట్స్.
Bhedhabhiprayalu vachevi....hilight sir,3*6=16 kadu 3*6=18...bhale vundandi
హనుమంతరావు గారికి,
ధన్యవాదాలు. సాధారణంగా ఏ టపా అయినా రెండు మూడు మాట్లు తిరిగి వ్రాస్తాను. కానీ ఇది మార్చబుద్ధికాలేదు. కొన్ని కొన్ని విషయాలలో కొంత గంభీరత ఉండాలేమో....దహా.
అనానిమస్ గారికి,
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.
thandri oka rupai isthe entha santhoshapadathamo, ivvakapothe aayana anthaku rendinthalu bhadapadatharu ani grahistham.. na vishayamlo idi chaala sarlu observe chesanandi.. nenu chaduvukunna rojulu gurthuchesaru.. chaala thanks!!
ammaa naannala baaNa prayogaalu suuparu sir, chaduvuthunnantha sepuu "lavakusha"cinemaa choosaa..
manalo manamaata , manga taayaaru sangathi prabhavathi gaariki mundu yeppudainaa cheppaaraa..leka maatho paatu aavida ippude chadivaaraa...
oka vela rendodi correct ayithey yee paaTiki intlO baaNaala velluva -marO "lavakusha" !!!!(abbey, meeru cheppakkarle maastaaru, maa laanti medhaavulu oohinchukogalaru)
ఇదేమిటి గురువు గారూ, మీరేదో మీకథ రాస్తున్నారనుకుంటే చివరికంటా చదివే సరికి ఇది మీ కథ కాదు, నా కథ అని తేలింది. దాంతో మా ఆవిడకి ( ఇప్పుడు ఆవిళ్ళని ఆవిడ అంటే ఒప్పుకోవడం లేదనుకోండి, అది వేరే సంగతి. ) చూపిస్తే "ఇదేం మీకథలా లేదు. నా కథలా ఉంది. అంది. నీ మొహం అది మగ కథ. నీ కథలా ఉండటం ఏమిటీ అని నేను తర్కించాను. అప్పుడు తను లింగ భేదాలనేవి మనుషులకే గానీ ఇలా కథలకీ కాకర కాయలకీ ఉండవు. ఒకవేళ ఉంటే మీ గురువుగారు గౌను వేసుకున్న అమ్మాయిల వెంట ఎందుకు పడ్డట్టు ?" అని ప్రశ్నించింది అక్కడితో ఊరుకోకుండా" ఆయన ముందున్న గౌనమ్మాయిల్లో మా పెద్దక్క కూడా ఉంది కాబట్టీ ఇది నా కథ మాత్రమే కాదు, మా అక్క కథ కూడా" అంది. అంతలోనే అక్కడికి వచ్చిన వాళ్ళక్క," ఇది మీ ఇద్దరి కథా కాదు, మీ గురువుగారి కథ అసలు కాదు. ఇది గోపాళం మేస్టారి కథ." అంది. ఇంతకీ ఎవరా గోపాళం మేస్టారు ? ఏమా కథ ? అని నేనూ మా ఆవిడా ఏకగ్రీవంగా ఆశ్చర్యపోతూ కుతూహలించాం. ఆవిడ, " గోపాళం మేస్టారంటే తెలీదా ? మీ గురువుగారికి గురువుగారైన గురువుగారే గోపాళం మేస్టారు. ఒకవేళ ఆయనగనక వాళ్ళ గురువుగారి పేరు గోపాళం మేస్టారు కాదంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు.వెంటనే మీగురువుగారిని వాళ్ళ గురువుగారి పేరుని మార్చుకొమ్మని చెప్పండి. " అంది. అదీ కథ. ఈ కథలోని గోపాళం మేస్టారు, మా గురువుగారండీ.
ఆయన్ని గుర్తు చేసినందుకు మీకు నా కృతజ్ఞతలు గురువుగారూ..,
ఇదేమిటి గురువు గారూ, మీరేదో మీకథ రాస్తున్నారనుకుంటే చివరికంటా చదివే సరికి ఇది మీ కథ కాదు, నా కథ అని తేలింది. దాంతో మా ఆవిడకి ( ఇప్పుడు ఆవిళ్ళని ఆవిడ అంటే ఒప్పుకోవడం లేదనుకోండి, అది వేరే సంగతి. ) చూపిస్తే "ఇదేం మీకథలా లేదు. నా కథలా ఉంది. అంది. నీ మొహం అది మగ కథ. నీ కథలా ఉండటం ఏమిటీ అని నేను తర్కించాను. అప్పుడు తను లింగ భేదాలనేవి మనుషులకే గానీ ఇలా కథలకీ కాకర కాయలకీ ఉండవు. ఒకవేళ ఉంటే మీ గురువుగారు గౌను వేసుకున్న అమ్మాయిల వెంట ఎందుకు పడ్డట్టు ?" అని ప్రశ్నించింది అక్కడితో ఊరుకోకుండా" ఆయన ముందున్న గౌనమ్మాయిల్లో మా పెద్దక్క కూడా ఉంది కాబట్టీ ఇది నా కథ మాత్రమే కాదు, మా అక్క కథ కూడా" అంది. అంతలోనే అక్కడికి వచ్చిన వాళ్ళక్క," ఇది మీ ఇద్దరి కథా కాదు, మీ గురువుగారి కథ అసలు కాదు. ఇది గోపాళం మేస్టారి కథ." అంది. ఇంతకీ ఎవరా గోపాళం మేస్టారు ? ఏమా కథ ? అని నేనూ మా ఆవిడా ఏకగ్రీవంగా ఆశ్చర్యపోతూ కుతూహలించాం. ఆవిడ, " గోపాళం మేస్టారంటే తెలీదా ? మీ గురువుగారికి గురువుగారైన గురువుగారే గోపాళం మేస్టారు. ఒకవేళ ఆయనగనక వాళ్ళ గురువుగారి పేరు గోపాళం మేస్టారు కాదంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు.వెంటనే మీగురువుగారిని వాళ్ళ గురువుగారి పేరుని మార్చుకొమ్మని చెప్పండి. " అంది. అదీ కథ. ఈ కథలోని గోపాళం మేస్టారు, మా గురువుగారండీ.
ఆయన్ని గుర్తు చేసినందుకు మీకు నా కృతజ్ఞతలు గురువుగారూ..,
వర్మ గారికి,
ధన్యవాదాలు. మధ్య తరగతి వాళ్ళ బాల్యాలు కొంచెం తేడాతో ఒకేలా ఉంటాయను కుంటాను.
ఎన్నెల గారికి,
బహుకాల దర్శనం. ధన్యవాదాలు.
మంగ తాయారు అంటే ఏ మంగ తాయారు గురించి. చాల మంగమ్మలే ఉన్నారు. మా ఇంట్లో బాణ ప్రయోగాలు ఎక్కువే. నేను ఉప సంహారం చేస్తూ ఉంటాను. ......దహా.
జొన్నవిత్తుల గారికి,
మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు. అందరి కధలు ఒకేలాగా మొదలవుతాయి. క్లైమాక్స్ సీనే మారుతుంది. కొందరికి వార్నింగ్ లు, కొందరికి పాదరక్షా సన్మానం, మరికొందరికి చికిత్సా కేంద్రం లో అత్యవసర విభాగం లో రాచ మర్యాదలు......దహా.
మీ ఈ పోస్టు చాలా ఆలస్యంగా చూసేను.మంచి శిల్పి చేతిలో రాయి ఒక శిల్పమైనట్లు మామూలు టాపిక్కుని అద్భుతంగా మలిచేరు. మీ బ్లాగు పేరు నవ్వితే నవ్వండి కి ఒక Tag line- "నవ్వలేక చావండి" అని add చేసుకున్నా.
పంతుల గోపాల కృష్ణారావు గారికి,
మీ వ్యాఖ్య మళ్ళి మళ్ళి చదువుకుంటున్నాను. ధన్యవాదాలు.
బులుసు సుబ్రహ్మణ్యంగారికి,
మీ పోస్ట్ చాలా బాగుంది. "పూర్వ జన్మ పాపం,సంసృతంలో తిట్టడం, నాగబాణానికి షేక్ చిన మౌలానా బాణం వెయ్యడం, ఉద్యద్దినకరుడిలాగ ప్రకాశింపజేయడం, రాజనాల లాగ గుర్తించడం..." లాంటి చాలా మాటలని శ్లేష తో ప్రయోగించి చమత్కారమైన మూడ్ క్రీయేట్ చేశారు. కానీ, హైస్కూల్ చదువు పూర్తయి కాలేజీకి ఎంటరవడం దగ్గరనుంచి సీరియెస్నెస్ వచ్చేసింది. మంచి పోస్ట్ రాసినందుకు థాంక్స్!
కిషోర్ వర్మ గారికి,
మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.
ది ట్రీ గారికి,
ధన్యవాదాలు. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు.
మీ బ్లాగు చూడటం ఈరోజే. అదీ మీరు మాకు చెప్పిన దీపావళి శుభాకాంక్షలు చూసి....
ఈ పోస్ట్ ఎంతో ఆసక్తి గా ఉంది, వెనక్కి తిరిగి బాల్యం చూసి వచ్చినట్టుంది.
అభినందనలు!
మీకూ దీపావళి శుభాకాంక్షలు!
చిన్నిఆశ గారికి,
మా బ్లాగుకి స్వాగతం. మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.
chala rojuala taruvata ...chala navvanu...
Chala bagundi mee post
నాగరాజు గారికి,
ధన్యవాదాలు.
మీరు ఇంకో పది పేజీలు రాసేసినా చదివేసేవాడిని .. అంత నచ్చింది .. ఇంకా రాస్తే బావుండేది ...
మా గురువు గారు శ్రీ గరికిపాటి నరసింహరావు గారు class ఎంత సేపు చెప్పినా విసుగు వచ్చేది కాదు
ఒక్కోసారి syllabus అవ్వలేదని 2,3 గంటలు ఏకధాటిగా సంస్కృతం class తీసుకున్నా అప్పుడే అయిపోయిందా అనిపించేది .. మీ కథ చదివిన తర్వాత కూదా same feeling
చాలా బాగున్నాయి సర్, మీ జ్ఞాపకాలు...
మమ్మల్ని కూడా మా జ్ఞాపకాల్లోకి తీసికెళ్లిపోయారు మీకు తెలీకుండానే...😊😊😊
Thank you Sir...
చాలా బాగున్నాయి సర్, మీ జ్ఞాపకాలు...
మమ్మల్ని కూడా మా జ్ఞాపకాల్లోకి తీసికెళ్లిపోయారు మీకు తెలీకుండానే...😊😊😊
Thank you Sir...
కామెంట్‌ను పోస్ట్ చేయండి