నమస్కారమండి లహరి గారూ. నా
పేరు పశుపతి. 
నమస్కారమండీ. నేనూ
మిమ్మల్ని గుర్తు పట్టాను కానీ చిన్న సంశయం తో పలకరించలేదు.
ఫరవాలేదు లెండి. నేను మీ
చిత్రం చాలా మాట్లే చూసాను కనుక వెంటనే గుర్తు పట్టాను. 
చాలా మాట్లు అంటే ఎన్ని
మాట్లు చూసారు?  చిత్రం అంటే ఫొటోనా?
నవ్వుతూనే అడిగింది లహరి.  
అవునండి. ఓ పది పన్నెండు
మాట్లు చూసాను మీ చిత్రం. మా నాన్నగారు పంపించినప్పుడు మొదటి మాటు, మా అక్కయ్యకు
చూపించి నప్పుడు రెండో మాటు, మా బావగారికి చూపించి నప్పుడు మూడో మాటు. నా చిత్రం
పక్కన మీది పెట్టి రెండు సరిపోయాయా అని కూడా చూసాను లెండి. 
మాచింగ్ అయ్యాయా?
ఆ ఆయ్యాయండి. మా
నాన్నగారికి మన జాతకాలు కూడ సరిపోయాయి. 
జాతకాలు మా నాన్నగారూ చూపించారండి.
పెళ్లి చూపులకి డేట్ ఫిక్స్ చేస్తామన్నారు. ఆ లోపుల మీతో ఒక మాటు మాట్లాడదామని  మిమల్ని ఇలా రమ్మన్నానండి. అంది లహరి.
లోపలి వెళ్ళి కూర్చుని
మాట్లాడుకుందాం రండి. అన్నాడు పశుపతి. 
రెస్టారెంట్ లో ఒక మూల
సీట్స్ చూసుకొని కూర్చున్నారు ఇద్దరూ.
మీరు ఫోటోలో చాలా సీరియస్
గా ఉన్నారు. ఇప్పుడు ఇలా సరదాగానే ఉన్నారు. 
నాకు ఫోటో ఫోబియా ఉందండి.
ఎవరైనా ఫోటో తీస్తుంటే నేను బిగుసుకుపోతాను. నవ్వలేను. విశ్వప్రయత్నం చేసి
నవ్వాననుకుంటాను కానీ అదేమిటో దివాలా తీసిన వాడి మొహంలా వచ్చేస్తుందండి. 
మీకు తెలియకుండా ఎవరినైనా
తియ్యమనకపోయారా ?
భలేవారే. ఈ విషయంలో నాకు
అతీంద్రియ శక్తి ఉందనుకుంటానండి. అంతెందుకు నడుస్తున్నప్పుడు ఒక ఏభై మీటర్ల దూరం
లో  ఫోటో స్టూడియో ఉంటే ఇక్కడ నుంచే నేను
బిగుసుకు పోతానండి. ఎవరి చేతిలోనైనా కెమేరా చూసినా నా పరిస్థితి డిటో అండి.
వెంటనే  వారికి దూరంగా వెళ్ళి పోతానండి.  నన్ను ఫోటో తీసిన  కెమేరా కానీ, కెమేరా ఉన్న సెల్ ఫోన్ కానీ మళ్ళీ  పనికి రాదండి. 
అదేమిటండి.  అల్లా ఎల్లా అవుతుంది. మీరు నన్ను ఆట
పట్టిస్తున్నారు 
నిజమండి. ఆ తరువాత
ఆ కెమేరా తో ఏం తీసినా కట్టెలాగ బిగుసుకు పోయినట్టే పడతారు మనుషులు.
ఒక్కోమాటు  వీడి తల వాడికి వాడిది మరొకడికి
వెళ్ళి పోతుందండి. కెమేరా లోనే ఏదో తేడా వస్తుందండి.  నమ్మండి. 
లహరి నవ్వింది.
మనోహరంగా నవ్వింది అనిపించింది పశుపతికి. అదే చెప్పాడు.
మీరు నవ్వితే ఇంకా
బాగుంటారండి లహరి గారూ. 
లహరి సిగ్గుపడింది.
ఇంతలో సర్వారావు వచ్చాడు. 
హిహిహి . ఏం
కావాలండీ. కాఫీ సరిపోతుందాండి? కాఫీ తరువాత  ఐస్ క్రీం ఏమైనా తీసుకుంటారా? 
అదేమిటోయ్
సర్వేశ్వర శర్మా అల్లా అడిగావు? పశుపతి అడిగాడు. 
ఈ వరుసలో ఉన్న మూడు
టేబుల్స్ ప్రేమికుల టేబుల్స్అండి. మద్యాహ్నం రెండు నుంచి నాలుగు దాకా కూర్చుని
కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోతారండి. వాళ్ళు వచ్చిన పావు గంటకి వస్తామండి ఆర్డర్
కోసం . వాళ్ళు  ఆర్డరిచ్చిన అరగంట కి మేము
కాఫీ తెస్తామండి. తెచ్చిన అరగంటకి వాళ్ళు తాగుతారండి. ఇంకో పావుగంట తరువాత మేము
బిల్లు, సోంపు పళ్ళెం తెస్తామండి. ఓ పావుగంట సోంపు నమిలి బిల్లు చెల్లించి  వెళ్ళిపోతారండి. 
మధ్యలో ఐస్ క్రీం
ఎందుకు అడిగింది లహరి. 
అదాండీ. వాళ్ళు
త్వరగా తాగేస్తే  ఫిల్ ఇన్ ది
బ్లాంక్ లాగ ఐస్ క్రీం మేమే తెస్తామండి. బిల్లు వాళ్ళే కట్టాలండి.
లహరి గారూ నాకు
ఆకలేస్తోంది. మధ్యాహ్నం భోజనం చేయలేదు నేను. మీరేమైనా తింటారా? 
నేను భోజనం చేసే
వచ్చానండి. మీరు భోజనం చేసేలోపు నేను కాఫీ తాగి ఐస్ క్రీం తింటాను. నవ్వుతూ అంది
లహరి. 
లహరి గారా ఇంకా
గారూ లోనే ఉన్నారా  అంటు ఆశ్చర్యపడ్డాడు
సర్వాశ్రీ. ఇంకా మొగ్గ తొడగని ప్రేమా అని ప్రశ్నార్ధకం వదిలాడు.  
 
పశుపతి లహరి, లహరి పశుపతి,  hmm 
పేర్లకి శృతి లయలు  కలిసినట్టు
లేవండి. అబ్బాయిగారు పేరు మార్చుకుంటే బాగుంటుందేమో అని ఓ సలహా కూడా కక్కేసాడు సర్వానంద్.
లహరి నవ్వుతోంది
పగలబడి నవ్వుతోంది. మైమరచి చూస్తున్నాడు పశుపతి లహరిని. పదిహేను సెకన్లలో తేరుకుని
ఐ యాం సారీ అంది పశుపతి తో. పశుపతి చిరునవ్వు తో లహరి చెయ్యి మృదువుగా నొక్కాడు. 
ఇదిగో సర్వార్కర్
నువ్వు నాకు ఒక ప్లేటు ఇడ్లీ ఆ తరువాత  మసాలా దోస,  అమ్మగారికి ఓ కాఫీ పట్టుకురా. అమ్మగారికి ఐస్
క్రీం తెచ్చినప్పుడు నాకు కాఫీ తీసుకురా. త్వరగా నాకు అంత టైం లేదు. 
ఎస్ సర్ అంటూ
సర్వారాం వెళ్లాడు. 
మీ పేరు సర్వానంద్
కి కూడా తెలుసునా? చూసారా మీ భాష నాకు కూడా వచ్చేస్తోంది. సర్వానంద్ అని. 
వాడు నా సహాధ్యాయి
చిన్నప్పుడు. పదో క్లాసు దాకా కలిసి చదువుకున్నాం. అర్జంట్ పనులుండడం వల్ల వాడు
అక్కడ ఆగిపోయాడు. పనీ పాడు లేక నేను యం. టెక్  చేసాను. 
ఏం, ఆర్ధిక
పరిస్థితుల వల్ల అతను ఉద్యోగంలో చేరాడా? 
వాళ్ళ నాన్న
గారు  శాస్త్రి కేటరర్స్  అనే పరిశ్రమ స్థాపించారు. రెండేళ్లయినా అది వారి
ఇంట్లోనే ఉండిపోయింది. అప్పుడు ఆయన వాళ్ళ వీధిలోనే ఉండే, పనీ పాడు లేని సంఖ్యా, నామ
శాస్త్ర,  జ్యోతిషవేత్తని సంప్రదించారు. వారు మూడు గుణకారాలు, ఆరు ప్లస్సులు చేసి
శాస్త్రి అండ్ కేటర్రర్స్ అని పేరు మార్చమన్నారు. ఆయన పేరు  మార్చిన రెండేళ్లలో వీధిన బడ్డారు. వీడు మా
వూళ్ళో  హోటల్ లో వైటర్గా చేరాడు. దిన దిన
ప్రవర్ధమానుడగుచూ అప్పుడెప్పుడో  ఇలా ఇక్కడ
దర్శనమిచ్చాడు. 
మీరేమి అనుకోక పొతే
 ఇలాంటి 
పేరు నేను మొదటిమాటు వినడం. చాలా పాత పేరు. పేరు మార్చుకోవాలని మీకు
ఎప్పుడూ అనిపించలేదా? పెళ్లి చూపులకు ముందు మిమ్మల్ని చూడాలనుకున్న కారణాలలో ఇది
ఒకటి.  పాత పేరు లాగ మీ భావాలు
కూడా అల్లాగే ఉంటాయేమో నని తెలుసుకుందామని,  కలుద్దాం అన్నాను,   అంది
లహరి నిర్మొహమాటంగా. 
పశుపతి లేచి
నుంచున్నాడు. తూర్పు ఎటువైపో మీకు తెలుసా అని అడిగాడు లహరిని. 
తూర్పా ఎందుకు? అని
ఆశ్చర్యంతో  అడిగింది. నాకూ సరిగ్గా
తెలియదు. 
ఇంతలో సర్వేశ్వరుడు
మంచి నీళ్ళు పట్టుకు వచ్చాడు. 
నాయనా సర్వా తూర్పు
ఎటు?  నీకు తెలుసునా? 
తూర్పు ఎటో తెలియదు
కానీ దక్షిణ తెలుసునండి. 
పోనీ అదైనా చెప్పు.
సూర్యుడి ముందు నులుచుంటే కుడి వైపు దక్షిణం అని ఎవరో చెప్పారు. 
ఆ దక్షిణం నాకూ తెలియదండి.
మీ పర్సులో ఉండేది,  మీరు బిల్లు
చెల్లించిన తరువాత నా చేతిలో పెట్టే దక్షిణ, 
ఆంగ్లమున టిప్ అనబడేది   మాత్రమే
నాకు  తెలుసు. 
మళ్ళీ నవ్వింది
లహరి. పశుపతి ఆమె కేసే చూసాడు. 
'చూపులు కలిసిన
శుభవేళా నేనెందుకు ఇక్కడ’ అంటూ సర్వోత్తమరావు వెళ్ళిపోయాడు. 
లహరి కొద్దిగా
సిగ్గుపడింది. 
సిగ్గు పడితే
మీరింకా బాగుంటారండి అంటూ పశుపతి ఆశ్చర్యపడిపోయాడు. 
తూర్పు ఎందుకో
చెప్పలేదు అంటూ మాట మార్చింది లహరి. 
తూర్పు తిరిగి దండం
పెడదామని అంటూ కూర్చున్నాడు పశుపతి. 
దండమా? ఎందుకు? అని
ఏక పద ప్రశ్నలు రెండు వేసింది లహరి.
పేరు
మార్చుకోమంటేనూ. ఈ పేరు వెనక్కాల హైదరాబాద్ లో 
4 ఫ్లాటులు, ఒక అరడజను ప్లాటులు, మా వూళ్ళో  నాల్గెకరాల కొబ్బరి తోట, ఇంకో సంఖ్య ఎక్కువ  ఎకరాల మాగాణి, ఇంకో నాల్గైదు ప్లాటులు,    ఐదు
వందల గజాల్లో ఎనిమిది గదుల ఇల్లు, ఇంటి చుట్టూ పూల మొక్కలు, సరిగ్గా తెలియదు కానీ
ఓ పాతిక లక్షల డిపాజిట్స్ ఉన్నాయండి.  పేరు
మారిస్తే ఇవన్నీ నాకు హుష్ కాకి అయిపోతాయండి. 
పేరు మారిస్తేనా?
అంటూ ఆశ్చర్య పడిపోయింది లహరి. 
మా నాన్న గారి పేరు
వినాయక శాస్త్రి. వారి తండ్రి గారి పేరు పశుపతి ఇవే పేర్లు మా ఇంటిలో ఆరు  తరాలుగా వస్తున్నాయి. ఆరు తరాలుగా మా ఉంట్లో
ఒకడే కొడుకు. ఆరుతరాల వెనక వినాయక శాస్త్రి గారికి చాలాకాలం సంతానం కలుగకపోతే,
పశుపతిని ఆరాధించారుట. వారి కృపా కటాక్షాల వల్ల పుట్టిన ఒకే ఒక మగ సంతానానికి
పశుపతి అని పేరు పెట్టారుట. వారు పుట్టిన వేళా విశేషం వల్ల ఆ వినాయక శాస్త్రి
గారికి కలిసివచ్చిందిట. ఇలా పేర్లు పెట్టడం వల్లే ఇప్పటికి ఇంత ఆస్తి సమకూరిందని
మా నాన్నగారి ధృడ విశ్వాసం. అందుచేత పేరు మార్చడం కుదరదు. అంతే కాదు నాకు కలిగే
మొదటి మగ సంతానానికి వినాయక శాస్త్రి అనే పేరు పెట్టాలి. లేకపోతే మా వంశ గౌరవం,
ప్రతిష్ట మంట కలిసిపోతాయని మా పితాశ్రీ శాసనం లిఖించారు. సుమారు నాల్గైదు కోట్ల
ఆస్థిని,  పేరు కోసం వదులుకునే ఉద్దేశ్యం
నాకు లేదని మా సర్వేశ్వరుడి సాక్షిగా మనవి చేసుకుంటున్నాను, అన్నాడు పశుపతి ఇడ్లీ  ప్లేటు తనముందు,  కాఫీ కప్పు లహరి ముందు పెడుతున్నసర్వా రాయుడిని
చూసి. 
మధ్యలో నా
పేరెందుకు కానీ, పేరు కోసం ఆవిడ మట్టుకు ఇంత ఆస్థిని వదులుకోమని చెప్పరు. కదండీ లహరి
గారూ అంటూ వెళ్ళిపోయాడు, సర్వా పుంగవుడు.  
అన్నట్టు, మీకు
వంటా, వార్పూ లలో ప్రవేశం ఉందా అని అడిగాడు పశుపతి, ఇడ్లీ ముక్క నోట్లో
పెట్టుకుంటూ.  
సమాధానం
చెప్పటానికి లహరి సంశయించింది. లేదండి నాకు వంట చేయడం రాదు.
ఫరవాలేదు లెండి. మా
అక్కయ్య కూడా పెళ్ళికి ముందే నేర్చుకుంది వంట చేయటం అని నవ్వాడు పశుపతి. 
నాకు బాగా
వచ్చండి వంట చేయటం. గత రెండేళ్లగా ఉద్యోగం చేసుకుంటూ రాత్రికి వంట
చేసుకుంటున్నానండి. పగలు ఆపీసు కేంటిన్ లో తింటానండి అని కూడా చెప్పాడు. 
వంట చెయ్యడం మీ
హాబీ అన్నమాట అంది లహరి.
కాదండి. హోటల్
భోజనం చెయ్యలేక వండుకుంటున్నానండి. 
రెండు మూడు
నిముషాలు ఈయన ఇడ్లీ తినడం లోనూ ఆవిడ కాఫీ తాగడం లోనూ ఏకాగ్రత చూపించారు. 
నాకు క్రికెట్ అంటే
ఇష్టం. మాచిలన్ని టివిలో చూస్తాను. నేను టేబుల్ టెన్నిస్ ఆడతానండి. మీరేమైనా
ఆడతారా అని అడిగింది లహరి.
ఆ, బాగానే ఆడతానండి
అబద్ధాలు. జవాబు చెప్పాడు పశుపతి. లహరి నవ్వింది. 
ఎటువంటి అబద్ధాలు?  ఉదాహరణకి చెప్పండి అని అడిగింది.
ఇందాకా చెప్పాను
కదండీ, నాలుగు కోట్ల ఆస్థి అని. కాదండి, 
అందులో మా అక్కయ్యకి సగ భాగం ఉందండి. నవ్వుతూనే చెప్పాడు పశుపతి. 
ఇంత ఆస్థి ఉండి
కూడా, మాలాంటి సామాన్య కుటుంబీకుల సంబంధం చూస్తున్నారేమిటి? అడిగింది లహరి. 
నవ్వేసాడు పశుపతి.
పెళ్ళిళ్ళ పేరయ్య,  ముందు కొన్ని ఉన్నవాళ్ళ
సంబంధాలే తెచ్చాడండి. ఆ ఇళ్లలో వ్యక్తుల ప్రవర్తన, మాటతీరు మా నాన్నగారికి, నాకు
కూడా  నచ్చలేదండి. ఆడంబరాలు, షో ఎక్కువ
అనిపించిందండి. ఇంకా చూస్తూనే ఉన్నామండి. నెల రోజుల క్రితం, మీ బాబయ్య గారు మీ
వివరాలు పేరయ్య గారికి ఇచ్చారు కదండీ. అక్కడే ఉన్న మా నాన్నగారు మీ ఫోటో చూసి,
తరువాత  మీ కుటుంబం గురించి వాకబు
చేసి,   పేరయ్య గారిని మీ ఇంటికి పంపారు. అదండి సంగతి. ఏమీ
దాచకుండా చెప్పాడు పశుపతి. 
మీ గురించి కూడా మా
బాబయ్య వాకబు చేసారండి చెప్పింది లహరి. 
ఇంకేం ఇద్దరూ
ప్రొసీడ్ అయిపోండి. పబ్లిక్ గార్డెన్స్, సినిమాహాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నాయి
అన్నాడు సర్వయ్య దోశ  పశుపతి ముందు పెడుతూ.
సర్వాసేన్ నువ్వు
ఎక్కువ మాట్లాడుతున్నావోయ్ అన్నాడు పశుపతి. మాట్లాడకుండా వెళ్ళిపోయాడు సర్వా
పండిట్. 
ఇతను మిమ్మల్ని
ఇష్టపడుతున్నాడు. మీరు తాత్సారం చేస్తే ఎవరో ఇంకో అదృష్టవంతురాలు ఎగరేసుకు పోతుంది
ఇతనిని,  అని సలహా ఇచ్చాడు లహరికి,  దోశ తిని చెయ్యి కడుగుకుందుకు పశుపతి
వెళ్ళినప్పుడు,  కాఫీ,  ఐస్ క్రీం తెచ్చిన సర్వాసింగ్. 
వీళ్ళ ఇంట్లో ఆచార
వ్యవహారాలు, పూజా పునస్కారాలు  ఎక్కువ అని తెలిసింది.  కట్నం వద్దన్నా,   కలిగిన
వాళ్ళు,    నేను సర్దుకు పోగలనా అనే అనుమానం అంది
లహరి.  
మరేం ఫరవాలేదండి.
ఈయన తల్లి తండ్రులు మంచివారండి. వారి వ్యవహారాలు ఇతరులకి ఇబ్బంది కలిగించవండి.
భేషజాలు అసలు లేవండి. వాళ్ళ అల్లుడు గారు అరపేంట్ల ఆధునికుడే నండి. హాయిగా
కలిసిపోయారండి. ఈయనకి కూడా భక్తి ఉంది కానీ పూజలు గట్రా ఎక్కువుగా అలవాటు
కాలేదండి  చెప్పాడు సర్వాయరప్ప.    
ఇంతలో పశుపతి వచ్చి
కాఫీ సేవనం మొదలుపెట్టాడు. లహరి ఐస్ క్రీం చప్పరించ సాగింది. 
కౌంటర్ దగ్గర
ఏదో  కలకలం మొదలయింది. ఒకామె కుక్కని
తీసుకు వచ్చింది. “కుక్కలని అనుమతించము” అని చెప్పాడు కౌంటర్ లో కూర్చున్న
కేషియర్. “ఇది కుక్క కాదు. జర్మన్ షెప్పర్డ్ 
డాగ్” అంది ఆమె. “కాలభైరవుడు దిగి వచ్చినా అనుమతించేది లేదు. మీ కారులో
ఉంచి రండి” అన్నాడు కేషియర్.  “మా కిట్టూకి
ఐస్ క్రీం అంటే ఇష్టం. అందుకే తీసుకు వచ్చాను” 
 అంది ఆమె. “సారీ మేడం,  నేనేం
చెయ్యలేను. ఇక్కడ డాగ్స్ కి కూడ అనుమతి లేదు” అన్నాడు  కేషియర్. 
 
ఇంతలో కిట్టూ గారు  ముక్కు ఎగ
పీల్చారు. ఒక్క ఉదుటున జంప్ చేసారు. అప్రయత్నంగా ఆమె గొలుసు వదిలేసింది. వేగంగా
కిట్టూ గారు రెండు మూడు టేబుల్స్ దాటి లహరి ముందున్న ఐస్ క్రీం మీదకు లంఘించారు.
భయంతో లహరి రెండు గెంతులు గెంతి, అప్పటికే నుంచుని కుక్కని ఆదలించే ప్రయత్నం
చేస్తున్న పశుపతి మీద పడి ఘట్టిగా పట్టుకుంది. అప్రయత్నంగా పశుపతి చేతులు లహరి
చుట్టూ పడ్డాయి.  తేరుకొని,  కిట్టూని
పట్టుకుని యజమానురాలు బయటకు తీసుకెళ్ళింది, లహరికి మరీ మరీ సారీ చెపుతూ. భయంతో
బిర్ర బిగుసుకు పోయిన లహరి ఇంకో అరనిముషం పశుపతిని పట్టుకుని అలాగే ఉంది. 
ఆ తరువాత
అతన్ని వదిలి “సారీ అండి నాకు కుక్కలంటే బాగా భయం” అంది. 
“నాకూ కుక్కలంటే
భయమేనండి. ఈ వేళే,  మీరు పక్కనుంటే ధైర్యం
వచ్చింది” అని నవ్వాడు పశుపతి. 
బిల్ పే చేసి
సర్వాబ్రహ్మకి దక్షిణ ఇవ్వకుండానే బయటకు వచ్చారు. 
ఈ మీటింగ్ మీకు  అసంపూర్తిగానే మిగిలింది అనుకుంటాను. మీ
నెక్స్ట్ కాల్ కోసం ఎదురు చూస్తాను అన్నాడు పశుపతి. 
మీటింగ్ సంతృప్తి గానే
ముగిసింది  నాకు. మీరు OK అంటే  మా నాన్నగారు  మీ నాన్నగారిని కలవడానికి ఈ వారంలో వస్తారు.
అంది సిగ్గు పడుతూ లహరి.  
17 కామెంట్లు:
కిట్టూ పెళ్ళి చేయిచిందా? సస్పెన్స్ లో వదిలేశారు మం.హా.
అద్భుతః..
బాగానే ఆడతానండీ.. అబద్ధాలూ.. కెవ్వ్వ్వ్వ్వ్
తరువాతి పార్ట్ ఉందని అనుకుంటున్నా.. తొందరగా రాసెయ్యండి ;)
సూపర్ గురూజీ :)
peru meedha boledu flat lu ,aasthulu maarchanu :))aavida matram marchamantara yemiti :))bhale vrasaru
బాగుంది బాగుంది గురువు గారు :)
భలే రాశారండి!
సర్వారావుకు తగిలించిన తోకలు భలేగున్నాయి :)
ఎప్పటిలానే సున్నితమైన హాస్యంతో నడిపించారు గురూజీ
నమస్కారమండి,
మీ హాస్యకథ చాలా బాగుందండి.
- కార్తి
బాగుంది గురూజీ ! ఆ సర్వర్ పేరు మారిపోవడం బాగుంది చాలా బాగుంది :)
ముళ్ళపూడి వారి ఒక కధ లో నరసయ్య గా మొదలై కాసేపటికి నిరాశయ్య గా మారతాడు
సర్వ అనే పేరుకీ, ఆ పేరు అష్టాదశావతారాలెత్తడానికీ ఏవన్నా సంబంధం ఉన్నదా?? :)
God one, sir.
పీ జీ వుడ్ హౌస్ ని ఔపోశన పట్టి నట్టు ఉన్నారు !!
జిలేబి
దక్షిణలివ్వకుండా పోవడమేంటీ..ఆయ్ !
ఇంతకీ కథ సుఖాంతమా? పెళ్ళి అయినట్టేనా , లేక విలన్లొస్తారా మధ్యలో?
కష్టేఫలే గారికి,
ధన్యవాదాలు. అంతే కదండీ......దహా.
రాజ్ కుమార్ గారికి,
ఇప్పటికి ఈ పార్ట్ అయిపోయిందండి. దీని తరువాత పార్ట్ భార్యోత్సాహం పేరుతో ఈమాట లో వచ్చింది కదండీ.
http://www.eemaata.com/em/issues/201307/2108.html
తరువాత పార్ట్ లు వీలుని బట్టి వస్తాయి.........దహా.
ధన్యవాదాలు.
నాగార్జున గారికి,
ధన్యవాదాలు.
శశికళ గారికి,
ధన్యవాదాలు. కొందరి మనస్థత్వాలు చాలా విపరీతంగా ఉంటున్నాయండి. ఇప్పుడప్పుడే కారు కొనే ఉద్దేశ్యం లేదు అన్న కుర్రాడిని కాదన్న అమ్మాయి గురించి విన్నాను......దహా.
హర్ష వీక్షణం గారికి,
ధన్యవాదాలు.
నాగరాజ్ గారికి,
తోకలు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
మురళి గారికి,
ధన్యవాదాలు.
కార్తి గారికి,
ధన్యవాదాలు.
వంశీకృష్ణ గారికి,
ముళ్ళపూడి వారు ఒక పాత్రని రకరకాల పేర్లతో పిలిపించారు కొన్ని కధలలో. ఇది అనుకరణ కిందే వస్తుంది. ధన్యవాదాలు.
నారాయణ స్వామి గారికి,
సర్వర్ కి తోకలు తగిలించి హాస్యం సృష్టిద్దామని ప్రయత్నించాను. విఫల ప్రయత్నమే అంటారా?....దహా.
ధన్యవాదాలు.
జిలేబి గారికి,
వుడ్ హౌస్ ని చదివి కొన్ని దశాబ్దాలు అయింది. మీకు వారు కనిపించారంటే ధన్యుడినే.
ధన్యవాదాలు.
ఎన్నెల గారికి,
పాపం పశుపతికి దక్షిణ తీసుకోవడమే కానీ ఇచ్చే అలవాటు లేదండి.....దహా.
పెళ్ళైన తరువాత ఇంకా వేరే విలన్లు ఎందుకండీ మొగుడికి...........దహా.
ధన్యవాదాలు.
చాలా బాగుందండి.. పశుపతి,లహరి ల పెళ్లిచూపులు
Unknown గారికి. .......... ధన్యవాదాలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి